cabbage bread mirch recipe
క్యాబేజీ బ్రెడ్ బజ్జీలు
కావలసినవి:
క్యాబేజీ - అర కేజీ
పచ్చి బఠాణీలు - ఒక కప్పు
కొబ్బరి - మూడు కప్పులు
అల్లం - చిన్న ముక్క
పచ్చి మిర్చి - పది
బ్రెడ్ - ఒక ప్యాకెట్
శనగపిండి - నాలుగు కప్పులు
బియ్యపుపిండి - ఒక కప్పు
ఉప్పు - తగినంత
పోపు దినుసులు - రెండు స్పూన్లు
చింతపండు - కొద్దిగా
తయారుచేసే విధానం:
ముందుగా క్యాబేజీ తురుముకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత అల్లం, పచ్చిమిర్చి నూరి ఉంచాలి. అలాగే పచ్చి బఠాణీలు కూడా ఉడికించాలి. ఇప్పుడు ఒక బాణలీలో నూనె పోయాలి. నూనె కాగిన తరువాత పోపు దినుసులు వేయించాలి. తర్వాత అందులో క్యాబేజీ వేసి ఉడికించాలి. ఈ మిశ్రమంలో కొబ్బరి వేసి వేగనివ్వాలి. దీనిలో ఉడికించిన పచ్చి బఠాణీలు, ఉప్పు, చింతపండు రసం వేసుకోవాలి. ఇప్పుడు అల్లం, పచ్చిమిర్చి ముద్ద వేసి కలపాలి. క్యాబేజీ కూర రెడీ అయిన తరువాత బ్రెడ్ ముక్కలను నీళ్ళలో ముంచి తీసి రెండు ముక్కల మధ్య క్యాబేజీ కూరను పెట్టి నొక్కి ఉంచాలి. ఇప్పుడు శనగపిండి, బియ్యపుపిండిని బజ్జీల పిండి మాదిరిగా కలపాలి. ఒక బాణలీలో నూనె పోసి కాగిన తరువాత ముందుగా కలిపి పెట్టుకున్న బజ్జీల పిండిలో కూరతో నొక్కిన బ్రెడ్ ముక్కలను ముంచి నూనెలో వేసి వేయించాలి. అంతే ఎంతో రుచికరమైన క్యాబేజీ బ్రెడ్ బజ్జీలు సిద్దం. వీటిని టొమేటో సాస్‌లో నంచుకుని తింటే... అబ్బబ్బ... ఆ టేస్టే వేరు!