Beetroot Bobbatlu
బీట్రూట్ బొబ్బట్లు (అక్షయ తృతీయ స్పెషల్)
అక్షయ తృతీయ రోజు దేముడికి ఏదో ఒక ప్రసాదం చేసి పెడతాం కదా. దేముడికి నైవేద్యం పెట్టి అది పది మందికి పంచిపెడితే మనసుకి తృప్తిగా ఉంటుంది. ఆరోగ్యం ఆనందం రెండూ కలిసి వచ్చే బీట్రూట్ బొబ్బట్లు ఎలా తయారుచెయ్యాలో చూద్దాం.
కావాల్సిన పదార్థాలు:
బీట్రూట్ తురుము - 2 కప్పులు
పచ్చి కొబ్బరి తురుము - 1 కప్పు
పంచదార - 2 కప్పులు
నెయ్యి - 1/2 కప్పు
యాలకుల పొడి - 1 చెంచా
జీడిపప్పు, బాదం పప్పు, కిస్మిస్ - 1/2 కప్పు
మైదా పిండి - 4 కప్పులు
తయారి విధానం:
ముందుగా మైదాపిండిలో కొంచెం నూనె వేసి తగినన్ని నీళ్ళు కూడా పోసి పూరి పిండిలా కలిపి పక్కన పెట్టుకోవాలి. అరగంట సేపు నానితే మంచిది. ఈ లోపు స్టవ్ వెలిగించి కడాయి పెట్టి 2 చెంచాలు నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ వేయించి ఉంచుకోవాలి. అదే కడాయిలో బీట్రూట్ వేసి కాస్త పచ్చి వాసన పోయాకా కొబ్బరి తురుము పంచదార వేసి స్టవ్ సిమ్ లో పెట్టి దగ్గరపడే దాకా వేయించుకోవాలి. అందులో మరో చెంచాడు నెయ్యి, యాలకుల పొడి వేసుకోవాలి. పాకంలా వచ్చి మిశ్రమం దగ్గర పడ్డాకా ఒక ప్లేట్ లోకి తీసి చల్లరనివ్వాలి. ఆ మిశ్రమాన్ని ఉండలుగా చేసుకుని పక్కన ఉంచాలి. ఒక పోలిథిన్ షీట్ మీద నానిన మైదాపిండి ముద్ద తీసుకుని చేత్తో చిన్న పూరిలా వత్తి మధ్యలో బీట్రూట్ మిశ్రమాన్ని పెట్టి అంచులన్నీ మూసి దాని మీద నెయ్యి రాస్తూ బొబ్బట్లు లాగా వత్తుకోవాలి. స్టవ్ మీద పాన్ పెట్టి నెయ్యి వేసి రెండు వైపులా దోరగా కల్చుకుంటే రుచికరమైన, ఆరోగ్యకరమైన బీట్రూట్ బొబ్బట్లు తయారయినట్టే.
..కళ్యాణి