మనసున్న నటి సూర్యాకాంతం

సూర్యాకాంతం మంచి మనసు గురించి ఆ రోజుల్లో చాలా గొప్పగా చెప్పేవారు. సినిమాల్లో తాను పోషించిన గయ్యాళి అత్త పాత్రల వల్ల ఆమెను సినిమాల్లో చూసిన అప్పటి స్త్రీ లోకమంతా నానాతిట్లూ తిట్టి ఆడిపోసుకునేవారట. కానీ నిజానికి సూర్యాకాంతం గారి మనసు వెన్నపూసనీ, ఎవరికి ఏ మాత్రం కష్టమొచ్చినా అది తనకే వచ్చినంతగా బాధపడేవారనీ, వారికి తనవంతు సాయం ఏ మాత్రం చేయగలిగినా తప్పకుండా చేయటానికి ప్రయత్నించేవారనీ ఎవరికీ తెలియదు. అంతే కాకుండా ఆమె షూటింగ్ లో పాల్గొంటున్నప్పుడు తన సహనటీనటులందరికీ తన ఇంటివద్ద తాను స్వయంగా వండిన పిండివంటలను, భోజనాన్ని స్వయంగా వడ్డించి తినిపించేవారనీ ఎంతమందికి తెలుసు. తుఫాను బాధితుల సహాయార్థం కీర్తిశేషులు యన్ టి ఆర్ తో కలసి సూర్యాకాంతం గారు కూడా జోలెపట్టి చందాలు వసూలు చేసిన సందర్భాలు అనేకమున్నాయి. వెండి తెర మీద గయ్యాళి పాత్రల్లో నటించినా, నిజ జీవితంలో మాత్రం సూర్యాకాంతమ్మ ఆ సూర్యుని కాంతమ్మే....!

అడిగి మరీ పాట పెట్టించుకున్న అక్కినేని

మన సినిమాల్లో శృంగార, ప్రేమ పాటలకు పెట్టిన పేరు నటసామ్రాట్ డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు. 86 యేళ్ళ ఈ లేటు వయసులో ఆయనకు నటనమీద ఉన్న శ్రద్ధ ఎలాంటిదో తెలిపే సంఘటన ఇది. ఆయన్ని తమ "శ్రీ రామరాజ్యం"చిత్రంలో వాల్మీకి వేషం వేయమని అడిగినప్పుడు అక్కినేని వారు "నేనా పాత్రలో నటించటం సమంజసంగా ఉంటుందా...?" అని ముళ్ళపూడి వెంకట రమణ గారిని ప్రశ్నించారట. దానికాయన "మీరే ఆ పాత్రలో నటించాలి.ఇంకెవరు నటించినా ఆ పాత్రకు న్యాయం జరగదు" అని అన్నారట. ఆ తర్వాత ఆ పాత్రకు ఒక పాట కూడా ఉంటే బాగుంటుందనీ, అందుకని ఒక పాటను పెట్టవలసిందిగా ఆయన దర్శకులు బాపుగారిని కోరారట. అప్పుడు పుట్టిందే "ఎవడున్నాడీ లోకంలో" అనే పాట. "శ్రీరామరాజ్యం" అనే ఈ రోజుల్లో పౌరాణికి చిత్రం తీయటం సాహసం. అదీ నాటికీ నేటికీ ఏనాటికీ ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ హిట్ , పౌరాణికి కళాఖండం "లవకుశ" వంటి చిత్రాన్ని రీమేక్ చేయాలనుకోవటం నిజంగా దుస్సాహసమనే చెప్పాలి. కానీ ఆ చిత్రాన్ని ప్రేక్షకజనరంజకంగా తీసినందుకు బాపు గారిని, ఆ చిత్రాన్ని నిర్మించిన నిర్మాత యలమంచిలి సాయిబాబు గారినీ తెలుగువన్ ప్రత్యేకంగా అభినందిస్తోంది.

తప్పు చేసిన గానగంధర్వుడు బాలు

గానగంధర్వుడు, పద్మశ్రీ, డాక్టర్ శ్రీపతి పండితారాథ్యుల బాలసుబ్రహ్మణ్యం మీద గతంలో ఒక మచ్చ ఉండేది. ఆయన సినీ నేపథ్య గాయకుడిగా తన జీవితం ప్రారంభించిన తొలి రోజుల్లో ప్రముఖ హిందీ సినీ నేపథ్య గాయకుడు కిశోర్ కుమార్ గారిని బాగా అనుకరించేవారని. ప్రస్తుతం బాలసుబ్రహ్మణ్యం గారు అంగీకరించినా అంగీకరించకపోయినా ఇది నూటికి నూరు శాతం యదార్థం. ఆయన ఆయన సినీ పరిశ్రమకొచ్చిన కొత్తలో కిశోర్ కుమార్ పాటల్లోని అరుపులనూ, కొన్ని కూతలనూ మక్కీకి మక్కీ కొన్ని తెలుగు పాటల్లో అనుకరించారు. అలాగే ఆయన తను పాడే పాటల్లో యన్.టి.రామారావుగారికి పాడినప్పుడు ఆయన గాత్రాన్ని, అక్కినేని వారికి పాడినప్పుడు ఆయన గాత్రాన్నీ, రాజబాబు గారికి ఆయన గాత్రాన్నీ, అల్లు రామలింగయ్యగారికి పాడినప్పుడు ఆయన గాత్రాన్ని...ఇలా ఏ నటుడికి పాడితే ఆయన గాత్రాన్ని అనుకరించే ప్రయత్నం చేసినట్టు ప్రత్యక్షంగా దాఖలాలున్నాయి...కానీ ప్రస్తుతం ఆయన "పాడుతా తీయగా" అనే కార్యక్రమంలో "దయచేసి ఎవరినీ అనుకరించకండి... మీ సొంత గొంతుతోటే పాడండి" అని పిల్లలకు పాఠాలు చెపుతున్నారు. అంటే నేను చేసిన తప్పుని మీరు చెయ్యకండర్రా అని చెపుతున్నట్టుంది కదూ...!

జ్యోతిలక్ష్మి ఎలా సినీరంగ ప్రవేశం చేసింది...?

రౌడీలకు రౌడీలు చిత్రంలోని "తీస్కో కొకకోలా ఏస్కో రమ్ముసారా" అనే పాట, ప్రేమనగర్ చిత్రంలోని "లే...లే...లేలేలే నారాజా" అనే పాట మీకు గుర్తుంటే శృంగార నాట్యతార జ్యోతిలక్ష్మి గుర్తుండే ఉంటుంది. ఆమె పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదివారు.యమ్.ఎ. ఇంగ్లీష్ చదివాక ఎయిర్ హోస్టెస్ గా పనిచేస్తూ సినిమాల మీద ఆసక్తితో సినీ పరిశ్రమకు వద్దామనుకుంటే, ఒక దర్శకుడు "నీ తొడలు సన్నగా ఉన్నాయి నువ్వు కనీసం వ్యాంప్ గా కూడా పనికి రావు" పొమ్మన్నాడట. దాంతో పంతం పట్టి బస్కీలు ( గుంజీలు) తీసి మరీ తన తొడల సౌందర్యాన్ని పెంచి మళ్ళీ మూణ్ణెల్లకి అదే దర్శకుడి సినిమాలో ఒక శృంగార గీతంలో నర్తించారు జ్యోతిలక్ష్మి. ఆ దర్శకుడే జానపద బ్రహ్మ విఠలాచార్య. జ్యోతిలక్ష్మి తన 60 యేళ్ళ వయసులో కూడా రజనీ కాంత్ హీరోగా నటించిన "ముత్తు" చిత్రంలో ఒక పాటలో నర్తించి శభాష్ అనిపించుకున్నారు జ్యోతిలక్ష్మి. దటీజ్ జ్యోతిలక్ష్మి.

పాపం అభిమానులు

మన సినీ హీరోలను అభిమానించే వారికి కొదువలేదు...కొందరైతే తమ అభిమాన హీరో కోసం బుర్రలు పగల కొట్టారు...అలాగే తమ బుర్రలు పగల కొట్టించుకున్నారు కూడా. ఇంతా చేస్తే వారి అభిమాన హీరో వీరికి ఏం చేస్తాడని బేరీజు వేస్తే కనిపించేది శూన్యమే. అభిమానుల వెర్రి అభిమానం గురించి "నేనింతే" సినిమాలో దర్శకుడు పూరీ జగన్నాథ్ తన తమ్ముడు సాయిరాం శంకర్ నటించిన పాత్ర ద్వారా సవివరంగా చర్చించాడు. తమ అభిమాన హీరోల సినిమా రికార్డుల గురించి పడేపాట్లు, తమ వాదనే సరి అయ్యిందని బలంగా, అంతే అమాయకత్వంతో కట్టుబడే అభిమానులకు ఇక్కడ ఒక విషయం చెప్పాలి. కొత్తొక వింత పాతొక రోత అన్నారు పెద్దలు. అలాగే కొత్త నీరు వచ్చినప్పుడు పాత నీరు కొట్టుకుపోతుంది...అది కాలధర్మం. ఈ రోజున ఈ అభిమానులు "పోకిరి" రికార్డులు సృష్టించిందనీ, దాన్ని "మగధీర" క్రాస్ చేసిందనీ, మళ్ళీ దాన్ని "దూకుడు" అధిగమించిందనీ గొడవలు పడుతూంటే వీళ్ళ అమాయకత్వానికి జాలేస్తుంది. నిజానికి "లవకుశ" చిత్రం విడుదలయినప్పుడు నేల 5 పైసలు, బెంచీ 10 పైసలు, కుర్చీ 15 పైసలు, బాల్కనీ 25 పైసలు. టిక్కెట్ల రేట్లు అలా ఉన్నప్పుడే ఆ రోజుల్లో ఆ చిత్రం కోటి రూపాయలు వసూలు చేసింది...! ప్రస్తుతం టిక్కెట్టు రేట్లు ఎలా ఉన్నాయో అందరికీ తెలిసిందే...! మా సినిమా రికార్డులు క్రియేట్ చేసిందంటే మా సినిమా రికార్డులు క్రియేట్ చేసిందని చెప్పుకునే వాళ్ళకి ఏం చెప్పాలి. వారి అమాయకత్వానికి జాలిపడటం తప్ప ఏం చేయగలం చెప్పండి...?

ఆత్రేయకు ఇష్టమైన పాట ఏది...?

ఆచార్య ఆత్రేయ అసలు పేరు కిళాంబి నరసింహాచార్యులు. ఆచార్య ఆత్రేయ అనేది ఆయన కలం పేరు. తెలుగు సినీ పరిశ్రమలో మనసు మీద ఆచార్య ఆత్రేయ వ్రాసినన్ని పాటలు మరే సినీ కవీ వ్రాయలేదంటే అతిశయోక్తి కాదు. అసలు ఆయన్ని "మనసు కవి", "మన సుకవి" అని అందరూ పిలుస్తుండేవారు. అలాంటి ఆత్రేయ గారికి ఆయన వ్రాసిన పాటల్లో బాగా ఇష్టమైన పాట ఏమిటని విలేఖరులడగ్గా...! దానికాయన "నాకు "మురళీకృష్ణ" సినిమాలోని "ఎక్కడ ఉన్నా ఏమైనా మనమెవరికి వారై వేరైనా...నీ సుఖమే నే కోరుతున్నా నినువీడి అందుకే వెళుతున్నా" అనే పాట చాలా ఇష్టం. ఎందుకంటే నిజమైన ప్రేమలో స్వార్థం ఉండదు. నిజమైన ప్రేమ త్యాగాన్ని కోరుతుంది...ఈ పాటలో నాలోని ప్రేమికుడి మనసు మీకు వినపడుతుంది" అని సమాధానం చెప్పారు. ఈ "మురళీకృష్ణ" సినిమాలో నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు గారు, సీనియర్ నటీమణి జమున జంటగా నటించారు...!

ఘంటసాలకు ఇష్టమైన పాట ఏది...?

తెలుగు ప్రేక్షకులు మరచిపోలేని సుమధుర గాత్రం ఘంటసాల వేంకటేశ్వరరావు గారు. ఆయన తెలుగు సినీ పరిశ్రమకు చేసిన సేవలు అపారం...అనితరసాధ్యం...! ఆయన గాయకుడే కాకుండా సంగీత దర్శకుడు కూడా...! ఆయన సంగీత దర్శకత్వం వహించిన "లవకుశ" చిత్రం తెలుగు వారికి దక్కిన అపురూమైన కానుక. ఆయన తెలుగు సినిమాల్లో కొని వేల పాటలు పాడారు...అలాంటి ఘంటసాల మాస్టారికి ఇష్టమైన పాట ఏది అని అడిగితే "నాకు బాగా ఇష్టమైన పాట "నిర్దోషి" చిత్రంలోని "మల్లియలార మాలికలార మౌనముగా ఉన్నారా...! మాకథనే విన్నారా...!" అని సమాధానం చెప్పారట...! నిజానికి ఆ పాట వింటూంటే ఆ పాటలో ఘంటసాల గారి గాత్రం ఆ పాటలో ఏదో తెలియని మాధుర్యాన్ని నింపుకుని ఎప్పుడు విన్నా కొత్తగానే ఉంటుంది...!

ఆ చిత్రం నుండి ఘంటసాల పాట తీసేశారు

ఇది తెలుగు ప్రేక్షకులెవ్వరూ ఊహించరు...! అది నిజమని నమ్మలేరు...! ఒకవేళ నిజమైతే తట్టుకోలేరు...! సుమధుర అమర గాయకులు ఘంటసాల వేంకటేశ్వరరావు గారు పాడిన పాటను సినిమాలోంచి తీసేయటమా...? కానీ ఇది నిజం ...నిజంగా నిజం...! "సంతానం" సినిమాలో "నిదురపోరా తమ్ముడా...!" అనే పాటను ప్రముఖ హిందీ సినీ నేపథ్య గాయని భారతరత్నలతామంగేష్కర్ పాడిన సంగతి అందరికీ తెలిసిందే. కానీ అదే పాటను ఘంటసాల మాస్టారు కూడా పాడారు...కానీ ఆయన పాట రికార్డ్స్ లో ఉంటుందే కానీ సినిమాలో వినిపించదు...! మీకు కనుక ఆ చిత్రం యల్.పి. రికార్డ్ దొరికితే మీరు ఘంటసాల మాస్టారు పాడిన ఆ పాటను వినవచ్చు. సినిమాకి అవసరం లేదని తీసేశారో, లేక మరే కారణం చేత ఘంటసాల గారు పాడిన ఈ పాటను తీసేశారో తెలియదు కానీ, ఆ చిత్రం నుండి ఘంటసాల గారి పాటను తీసేయటం జరిగింది.

మన సినిమాల పేర్లు

సహజంగా ఒక సినిమా హిట్టయితే చాలా మంది నిర్మాతలు సెంటిమెంట్ గా అలాంటి పేరే తమ సినిమాకు కూడా ఉండాలని కోరుకుంటారు...అలాంటి పేర్లే తమ చిత్రాలకు పెడుతూంటారు కూడా...! ఉదాహరణకు కాపురం పేరుతో ఎన్ని సినిమాలు వచ్చాయో ఒకసారి చూద్దాం. "కొల్లేటి కాపురం, వింత కాపురం, చెల్లెలి కాపురం, పండంటి కాపురం, పచ్చని కాపురం, కలహాల కాపురం, దొంగ కాపురం, బంగారు కాపురం, కోడలు దిద్దిన కాపురం, పండంటి కాపురానికి 12 సూత్రాలు" వంటి చిత్రాలు వచ్చాయి. ఇక సంసారం పేరుతో "సంసారం, సంసారం-సాగరం, పండంటి సంసారం, నిండు సంసారం,సంసారం ఒక చదరంగం, సంసారం ఓ సంగీతం" వంటి చిత్రాలు వచ్చాయి. మొగుడు పేరుతో "దొంగమొగుడు, మంచి మొగుడు, కొంటె మొగుడు, అల్లరి మొగుడు, చాదస్తపు మొగుడు, కొంటె మొగుడు-పెంకి పెళ్ళాం" వంటి అనేక చిత్రాలు వచ్చాయి. దొంగ పేరుతో "దొంగ, మంచి దొంగ, జేబుదొంగ, దొంగలకు దొంగ, దొంగల్లో దొర, అందరూ దొంగలే, దొరికితే దొంగలు, దొంగ దొంగ, దొంగోడొచ్చాడు' అలా అనేక సినిమాలొచ్చాయి. ఇల్లాలు పేరుతో "ఇల్లాలు, ఇల్లు- ఇల్లాలు, ఇంటికి దీపం ఇల్లాలు, రావుగారిల్లు, ఇల్లాలే దేవత, ఈ తీర్పు ఇల్లాలిది, ఇల్లాలు- ప్రియురాలు, ఇల్లు ఇల్లాలు పిల్లలు, ఇంట్లో ఇల్లాలు, వంటింట్లో ప్రియురాలు"ఇవన్నీ సాంఘీక చిత్రాలైతే పౌరాణిక చిత్రాలు శ్రీకృష్ణ పేరు మీద, శ్రీరామ పేరు మీద అనేకం వచ్చాయి. ఇలా చెప్పుకుంటూ పోతే వీటికి అంతుండదు.