ఫ్యూచర్ ప్రైమ్ మినిస్టర్.. కాబోయే శ్రీమతి ఎవరో?

తెలుగు సినిమా హీరోలలో ‘ద మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఎవరంటే, ఎవరికైనా వెంటనే గుర్తుకొచ్చే పేరు ... బాహుబలి ప్రభాస్.. అలాగే, రాజకీయాల్లో  ‘దమోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్   అనగానే గుర్తు కొచ్చేది  కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ.  నిజమే, ప్రధాని మోడీ (పెళ్ళైన బ్రహ్మచారి), యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, ఒరిస్సా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్, ఇలా రాజకీయ ప్రముఖులలో పెళ్లి కాని ప్రసాదులు  ఇంకా కొందరున్నారు. అయినా కూడా  ‘ఎలిజిబుల్ బ్యాచిలర్’ఎవరంటే మాత్రం రాహుల్ గాంధీ పేరే ముందుగా వినిపిస్తుంది.   మిగిలిన వారందరికీ పెళ్లీడు దాటిపోయిందని కావచ్చును సోషల్ మీడియాలో రాహుల్ పెళ్లి వార్తలు వైరల్ అయినంతగా ఇతర పెళ్ళి కాని రాజకీయ ప్రముఖుల పెళ్లి వార్తలు వైరల్ అయినా దాఖలాలు లేవు. అలాగని రాహుల్ గాంధీ బాలా కుమారుడా అంటే కాదు. ఆయన ఈ మధ్యనే హాఫ్ సెంచరీ మార్క్ క్రాస్ చేశారు. ఫిఫ్టీ ప్లస్ క్లబ్ లో చేరిపోయారు.  అంతేకాదు, భారత్ జోడో యాత్రలో మేకప్ లేకపోవడం వల్లనో ఏమో, నెరిసిన గడ్డం, ముడతలు పడిన ముఖంతో రాహుల్ గాంధిలో వార్ధక్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోందని సోషల్ మీడియాలో ఆయన కొత్త రూపం  గురించిన పరస్పర విరుద్ధ వ్యాఖ్యలు, వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. ఆయన అభిమానులు పెరిగిన గడ్డంతో రాహుల్ గాంధీ రావీద్రనాథ్ టాగోర్ లా ఉన్నారని మెచ్చుకుంటే, గిట్ట్టని వాళ్ళు  సద్దాం హుస్సేన్ లా ఉన్నారని కడుపు మంట తీర్చుకున్నారు.  సరే అదెలా ఉన్నా, ఎవరు ఏమన్నా, రాహుల్ గాంధీ అంటే అమ్మాయిల్లో ఇంకా  క్రేజుంది, రాహుల్ పేరుతో వైబ్రేషన్స్ ఫీలయ్యే అమ్మాయిలున్నారు. భారత్ జోడో యాత్రలో ఆయనతో కలిసి నడిచేందుకు, ఆయనతో సేల్ఫీలు దిగేందుకు  అమ్మాయిలు, సెలబ్రిటీలు కూడా పోటీ పడ్డారు. అందుకే ఆయన ఇంకా, ఎలిజిబుల్ బ్యాచిలర్స్ జాబితాలో ఫస్ట్ ప్లేస్ లో ఉన్నారు. అలాగే, రాహుల్ గాంధీ కూడా మన ప్రభాస్ లానే పెళ్లి చేసుకోను .. ఆజన్మ బ్రహ్మచారిగా ఉండి పోతాను, అని ఆఫీషియల్ ప్రకటన ఏదీ చేయలేదు. సోలో లైఫే సో.. బెటరు  అని పాడ లేదు. అందుకే, రాహుల్ పెళ్లి  గురించి అప్పుడప్పుడు... హాట్ హాట్ వదంతులు షికారు చేస్తూనే ఉన్నాయి. అయితే, ఇంతవరకు రాహుల్ గాంధీ ఎప్పడూ పెళ్లి  వదంతుల మీద స్పందించలేదు. అలాగే విదేశాల్లో పబ్బుల్లో, క్లబ్బుల్లో అమ్మాయిలతో ఉన్న ఫోటోలు, వీడియోలు వైరల్ అయినా ఆయన అంతగా పట్టించుకోలేదు. ప్రత్యర్ధి పార్టీలు శీల పరీక్ష పెట్టినా, ఆయన్ని డిఫెండ్ చేసే బాధ్యత కాంగ్రెస్ వాచాస్పతులు ( అధికార ప్రతినిధులు) ఇతర నాయకులు తీసుకున్నారే కానీ, రాహుల్ జీ ఎప్పడు కూడా తనను తాను డిఫెండ్ చేసుకునే ప్రయత్నం చేయలేదు. కానీ తాజాగా, సరదాగానే అయినా, మీడియా అడిగిన పెళ్లి ప్రశ్నకు రాహుల్ సరదాగా సమాధానమిచ్చారు.  తనకు  కాబోయే భార్య గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనకు కాబోయే భార్యకు తన  నానమ్మ ఇందిరమ్మకున్న లక్షణాలు, తల్లి సోనియా గాంధీలోని  సుగుణాలు... ఉండాలని మనసులోని మాటను బయట పెట్టారు. అలాగే, తనకు కాబోయే భార్య ఆ ఇద్దరిలోని మంచి లక్షణాలను కలబోసిన బొమ్మలా ఉంటే మరీ మంచిదని అన్నారు. ఇదంతా సరదగా సాగిన సంభాషనే  అయినా, రాహుల్ గాంధీని ఇష్టపడే అమ్మాయిల్లో ఆ లక్షణాలు ఉన్నవారు ఎవరైనా ఉంటే ...అదృష్టాన్ని పరీక్షించుకోవచ్చునేమో ... ఫ్యూచర్ ప్రైమ్ మినిస్టర్ కాబోయే శ్రీమతి  .. ఎవరో  ఆ అదృష్టవతురాలు..  ( ఇది కేవలం సరదా కోసం మాత్రమే ..ఎవరూ సీరియస్’ గా తీసుకోవద్దని మనవి)

మహిళల టి20 వరల్డ్ కప్ టీమ్ ఇండియా కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్

మహిళల టి20 వరల్డ్ కప్ 2023కు టీమ్ ఇండియా జట్టును బీసీసీఐ ప్రకటించింది. జట్టు స్కిప్పర్ గా హర్మన్ ప్రీత్ కౌర్, వైస్ కెప్టెన్ గా స్మృతి మందానలను ఎంపిక చేసింది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో మహిళల టి20 వరల్డ్ కప్ జరగనున్న సంగతి విదితమే.  ఈ టోర్నీ కోసం   వుమెన్స్ సెలెక్షన్ కమిటీ 15 మంది  ప్లేయర్స్ తో టీం ఎంపిక చేసింది. ఈ జట్టులో శిఖా పాండేకు చోటు లభించింది.  దక్షిణాఫ్రికా వేదికగా    ఫిబ్రవరి 10వ తేదీ నుంచి టోర్నీ ప్రారంభం అవుతుంది.   గ్రూప్ 2లో పాకిస్థాన్, ఇంగ్లాండ్, వెస్ట్ ఇండీస్, ఐర్లండ్, భారత్ ఉన్నాయి. భారత్ తొలి మ్యాచ్ దాయాది   పాకిస్థాన్ జట్టుతో కేప్ టౌన్ లో వల్డ్ కప్ ఫస్ట్ మ్యాచ్ జరగనుంది.  ఫిబ్రవరి 26న ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. 

రౌండప్ 2022 ఢిల్లీలో వాయు కాలుష్యం

నవంబర్  కొత్త సంవత్సరం వచ్చేస్తోంది. పాత సంవత్సరానికి వీడ్కోలు పలికే సమయం వచ్చేసింది. 2022 మోస్ట్ హ్యాపెనింగ్ ఇయర్ గా చెప్పుకోవచ్చు.  కొద్ది  రోజుల్లో 2022 వెళ్ళిపోతుంది. 2023 సంవత్సరం వచ్చేస్తుంది. క్యాలెండరు మారి పోతుంది. స్వాగత తోరణాలు, వీడ్కోలు వేడుకలు షరా మాములే ... కాలచక్రం కదులుతూనే ఉంటుంది... కానీ, వెళ్ళిపోతున్న 2022 సంవత్సరం, ఏమి సాధించింది, ఏమి మిగిల్చింది, ఏది పట్టుకు పోయింది, ఏమి బోధించింది, ఒక సారి వెనక్కి తిరిగి చూసుకుంటే .. సంవత్సర కాలంలో చెరగని ముద్ర వేసిన చేదు తీపి జ్ఞాపకాలను ఒక సారి సింహవలోకనం చేసుకుంటే.. నవంబర్ 2...  దేశ రాజధాని ఢిల్లీలో, ఢిల్లీ డెవలప్మెంట్ అథారిటీ (డిడిఎ) కల్కాజీ ప్రాంతంలో ఆర్థికంగా వెనకబడిన వర్గాల ప్రజల కోసం నిర్మించిన 3,024 ఫ్లాట్స్’ను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించారు.   నవంబర్ 3.. గుజరాత్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్’ను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ప్రధాన ఎన్నికల కమిషనర్‌ రాజీవ్‌ కుమార్‌ మీడియా  మీడియాకు వివరించారు. ప్రధానమంత్రి నరెంద్ర మోడీ స్వరాష్ట్రం గుజరాత్’లో రెండు విడతలలో డిసెంబర్ 1, 5 వ తేదీలలో పోలింగ్ జరుగుతుంది. డిసెంబర్ 8న ఓటల్ లెక్కింపు చేపడతారు.  నవంబర్ 4.. ఢిల్లీ కాలుష్య స్థాయి పెరుగుతున్న నేపధ్యంలో.,, వాహానాల నియంత్రణకు సరి .. బేసి విధానాన్ని మరో మారు అమలు  చేయాలని భావిస్తున్నామని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ తెలిపారు. అలాగే, ఢిల్లీ ప్రభుత్వం 50 శాతం ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోం’ సిఫార్స్ చేసింది .   నవంబర్ 8...  గుజరాత్ శాసన సభకు వరసగా11 మార్లు ఎన్నికైన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు,గిరిజన ఎమ్మెల్యే  మొహన్’సిన్హ బీజేపీలో చేరారు.  నవంబర్ 9... గుజరాత్ మాజే ముఖ్యమంత్రి విజయ్ రుపానీ, ఉప ముఖ్యమంత్రి నితిన్ పటేల్’ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్యదం లేదని ప్రకటించారు. విజయ్ రూపనీ 2016 ఆగష్టు 7 నుంచి 2021 సెప్టెంబర్ 13 వరకు గుజరాత్ ముఖ్యంత్రిగా ఉన్నారు .. నవంబర్ 12..  హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది.మొత్తం 68 అసెంబ్లీ స్థానాలకు ఒకే విడతలో పోలింగ్ జరిగింది. నవంబర్ 19...  అరుణాచల్ ప్రదేశ్’లో ప్రప్రధమ గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్’ను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించారు. దేశానికీ స్వాతంత్రం వచ్చిన 1947 నుంచి 2014 వరకు ఈశాన్య భారతంలో కేవలం 9 విమానాశ్రయాల నిర్మాణం జరిగితే, తమ ప్రభుత్వం ఏడేళ్ళలో ఏడు విమానాశ్రయాలను నిర్మించింది ప్రధాని పేర్కొన్నారు. నవంబర్ 21...  యావజ్జీవ కారాగార శిక్ష అనుభవిస్తున్న రాజీవ్ గాంధీ హంతకులను విడుదల చేస్తూ ఇచ్చిన తీర్పుపై సుప్రీం కోర్టులో రివ్యూ పిటీషన్ దాఖలు చేయాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది కాగా, కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే రివ్యూ పిటీషన్ దాఖలు  చేసిందని, ప్రభుత్వం తెలిపింది.

విమానంలో ముష్టిఘాతాలు, పిడిగుద్దులతో రణం.. కారణమేమిటంటే?

చదవేస్తే ఉన్న మతి పోయిందంటారు. చదువు వల్ల సంస్కారం పెరిగితేనే ఆ చదువుకు సార్థకత. ఊర్లలో బస్సులో సీట్ల కోసం పామరులు కోట్లాటలకు దిగడం సహజం. అలాగే  రైళ్లలో అన్ రిజర్వుడు కంపార్ట్ మెంట్లలో చోటు కోసం చొక్కాలు పట్టుకుని కొట్టుకునే వారినీ చూశాం. కానీ విద్యావంతులైన యువకులు విమానంలో సీటు కోట్లాటకు దిగి కొట్టుకున్న సంఘటన  మాత్రం ఎవరూ చూసి ఉండరు.  అయినా విమనాంలో సీటు కోసం కొట్టుకోవడమేమిటి చోద్యం కాకపోతే అనుకుంటాం.  కానీ అలాంటి చోద్యం జరిగింది. ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో ముంబై నుంచి థాయ్ ల్యాండ్ వెళ్లేందుకు విమానం రన్ వేపై సిద్ధంగా ఉంది. ఇహనో ఇప్పుడో టేకాఫ్ తీసుకుంటుంది. సరిగ్గా ఆ సమయంలో విమానంలో గొడవ జరిగింది. అది చినికి చినికి గాలివానగా మారింది. ఇంతకీ ఆ గొడవ సీటు విషయంలో జరిగింది. ఔను నిజమే సీటు కోసం టేకాఫ్ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్న విమానంలో ముగ్గురు యువకులు గొడవ పడ్డారు. జుట్టూ జుట్టూ పట్టుకు కొట్టుకున్నారు. ఒకరిపై ఒకరు ముష్టిఘాతాలు విసురుకున్నారు. విమాన సిబ్బంది సర్ది చెప్పడానికి చేసిన ప్రయత్నాలేవీ ఫలించ లేదు. గొడవ అంతకంతకూ తీవ్రమౌతుంటే సిబ్బంది కూడా చేసేదేమీ లేక పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు రంగ ప్రవేశం చేసిన తరువాత గొడవ సద్దుమణిగింది. వీరి గొడవ కారణంగా దాదాపు గంటన్నర ఆలస్యంగా విమానం టేకాఫ్ అయ్యింది. 

చిన్నారుల పాలిట విషం.. ఇండియన్ మేడ్ కాఫ్ సిరప్!

భారత్ లో తయారైన సిరప్ తాగి ఉజ్బెజిస్థాన్ లో 18 మంది చిన్నారులు మరణించారు.  ఇండియాలో తయారైన డాక్ 1 మ్యాక్స్ సిరప్ ను ఎలాంటి ప్రిస్కిప్షన్ లేకుండా ఎక్కువ మోతాదులో ఇవ్వడం వల్లే చిన్నారుల మరణాలు సంభవించాయి. కాగా సిరప్‌లో కలుషిత ఇథిలీన్ గ్లైకాల్‌ ఉన్నట్టు లేబరేటరీ పరీక్షల్లో వెల్లడైంది.   తమ దేశంలో  18 మంది చిన్నారుల ఉసురు తీసిన పాపం  ఇండియాదే అంటూ భారత్ పై మండిపడింది. ఈ మేరకు ఓ ఉజ్బెకిస్థాన్ ప్రభుత్వం ఓ ప్రకటన విడుదల చేసింది.   దగ్గు మందులో ఇథిలిన్ గ్లైకాల్ ఉన్నట్టు ల్యాబ్ టెస్టుల్లో తేలింది. దీంతో డాక్ 1 మ్యాక్స్  ట్యాబ్లెట్లు, సిరప్ ను  అన్ని మందుల షాపుల నుంచి విత్ డ్రా చేశారు. 2022లో ఇలా భారత్ లో తయారైన దగ్గు మందు సేవించి చిన్నారులు మరణించటం ఇదే మొదటి సారి కాదు. రెండోసారి. ఇంతకు ముందు గాంబియాలో 70 మంది చిన్నారులు మేడ్ ఇన్ ఇండియా కాఫ్ సిరప్ కారణంగా మరణించారు. దీనికి కారణమైన హర్యానా లోని మైడెన్ ఫార్మాను కేంద్రం సీజ్ చేసింది కూడా.  ఇలా ఉండగా   ఉజ్బెకిస్థాన్‌లో దగ్గు మందు తాగి  చిన్నారులు మృతి చెందడంపై తదుపరి పరిశోధనలకు సహకరించేందుకు డబ్ల్యుహెచ్ ఓ చర్యలకు ఉపక్రమించింది. ఉజ్బెకిస్థాన్‌లోని ఆరోగ్య అధికారులతో సంప్రదింపులు జరుపుతోంది. దర్యాప్తునకు అవసరమైన సహకారాన్ని అందిస్తామని హామీ ఇచ్చింది. అంతకుముందు, అక్టోబర్‌లో భారత్‌లో తయారు చేసిన దగ్గు మందు తాగి ఆఫ్రికా దేశమైన గాంబియాలో 60 మందికి పైగా పిల్లలు మరణించారు. దీని తరువాత, ఈ విషయంపై దర్యాప్తు చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటు చేసింది, అయితే ఇప్పటి వరకు భారతీయ కంపెనీ యొక్క దగ్గు మందు నుండి పిల్లలు మరణించినట్లు అధికారిక ధృవీకరణ లేదని తెలిపింది. ఈ ఆరోపణలు అనవసరంగా భారత ఔషధ కంపెనీల ప్రతిష్టను దిగజార్చుతున్నాయని కేంద్రం చెబుతోంది.  అలాగే.. భారతీయ నిర్మిత దగ్గు మందు తాగి చిన్నారులు మృతి చెందడంపై, మైడెన్ ఫార్మాస్యూటికల్స్ దగ్గు సిరప్‌ల నమూనాలు నాణ్యత లేనివిగా గుర్తించినట్లు ప్రభుత్వం పార్లమెంటుకు తెలియజేసింది. కేంద్ర డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (సీడీఎస్సీవో), రాష్ట్ర డ్రగ్ కంట్రోలర్‌తో కలిసి సోనెపట్‌లోని మైడెన్ ఫార్మాస్యూటికల్స్‌పై సంయుక్త విచారణ జరిపిందని రసాయనాలు,  ఎరువుల సహాయ మంత్రి భగవంత్ ఖుబా డిసెంబర్ 13న రాజ్యసభకు లిఖితపూర్వక సమాధానమిచ్చారు.  ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) అక్టోబర్ ప్రారంభంలో దీనికి సంబంధించిన నివేదికను విడుదల చేసింది. దగ్గు మందు లో డైథలిన్ గ్లైకాల్ , ఇథిలిన్ గ్లైకాల్ మానవులకు విషం లాంటిదని అందులో పేర్కొంది.  ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక  తర్వాత మైడెన్ ఫార్మాస్యూటికల్ ఉత్పత్తులను గాంబియా నిషేధించింది. అంతే కాకుండా  మందులను మార్కెట్ నుండి తొలగించాలని  ప్రపంచ ఆరోగ్య సంస్థ  అన్ని దేశాలను హెచ్చరించింది.   

రాహుల్’ సారధ్యంలో జాతీయ కూటమి ?

జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ భవిష్యత్ పై ఆ పార్టీ నేతలలో విశ్వాసం సన్నగిల్లితే సన్నగిల్లిందేమో, కానీ,  తమిళనాడు ముఖ్యమంత్రి, డిఎంకే అదినేత ఎంకే స్టాలిన్ లో మాత్రం, హస్తం పార్టీ పై విశ్వాసం రోజురోజుకు పెరిపోతోంది. రాహుల్ గాంధీ నాయకత్వంపై స్టాలిన్ విశ్వాసం భారత్ జోడో యాత్ర కంటే వేగంగా పరుగులు తీస్తోంది. ద్విగుణీకృతం అవుతోంది. 2024 ఎన్నికల్లో బీజేపీని సమర్ధవంతంగా ఎదుర్కునే సత్తా, సామర్ధ్యం ఒక్క కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ఉందని స్టాలిన్ కుండ బద్దలు కొట్టారు. కాంగ్రెస్ సారథ్యంలో కలిసి  పోరాడదాం...రండని.. విపక్ష పార్టీలకు పిలుపు నిచ్చారు.  నిజానికి  తమిళనాడులో కాంగ్రెస్ పార్టీకి పెద్దగా పట్టు లేదు. డిఎంకే అండలేకుండా కాంగ్రెస్ పార్టీ అడుగు తీసి అడుగు వేయలేదు. నిజానికి 1969లో తమిళనాడు రాష్ట్రం ఏర్పడిన తర్వాత  ఇంత వరకు కాంగ్రెస్ పార్టీ ఒక్కసారి కూడా అధికారంలోకి రాలేదు. మద్రాస్ రాష్ట్రం చిట్ట చివరి ముఖ్యమంత్రి భక్తవత్సలం (1962- 1967) .. కాంగ్రెస్ పార్టీ చిట్టచివరి ముఖ్యమంత్రి కూడా ఆయనే.. 1969లో మద్రాస్ రాష్ట్రం, తమిళనాడుగా అవతరించిన తర్వాత, తమిళనాడులో వంతుల వారీగా ద్రవిడ పార్టీల (డిఎంకే, అన్నా డిఎంకే) పాలనే సాగుతోంది. నిజానికి, బీజేపీ  కాంగ్రెస్ ముక్త భారత్ నినాదం ఇవ్వడానికి దశాబ్దాల ముందే, తమిళనాడులో హిందీ వ్యతిరేక ద్రవిడ వాదం జోరులో  కాంగ్రెస్ చప్పబడి పోయింది. నిజానికి కాంగ్రెస్ మాత్రమే కాదు, గడచిన ఆరుపదుల పైబడిన కాలంలో బీజేపీ, వామపక్షాలు సహా జాతీయ పార్టీలు ఏవీ, తమిళనాడులో నిలబడలేక పోయాయి. ద్రవిడ పార్టీలు అందించిన అక్సిజిన్ తో ఉనికిని కాపాడుకుంటున్నాయి. ఈ పరిస్థితిలో నిజానికి డిఎంకే అవసరం కాంగ్రెస్  పార్టీకి ఉన్నంతగా, కాంగ్రెస్ పార్టీ అవసరం డిఎంకేకు లేదు. అయినా  స్టాలిన్  కాంగ్రెస్ వెంట పడుతున్నారు. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రను మెచ్చుకోవడమే కాదు, రాహుల్ గాంధీని ఆకాశానికి ఎత్తేస్తున్నారు.  కాంగ్రెస్ వ్యవస్థాపక దినోత్సవాల సందర్భంగా ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్టాలిన్ మాట్లాడుతూ  జాతీయ స్థాయిలో కాంగ్రెస్ ప్రాధాన్యాన్ని కోల్పోయిందనడాన్ని తాను నమ్మబోనని చెప్పారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీతో తలపడేందుకు కాంగ్రెస్ పార్టీతో కూడిన జాతీయ కూటమి అవసరమని చెప్పారు. కాంగ్రెస్ తిరిగి గాడిలో పడుతోందని, భారత దేశానికి ఇప్పుడు అదే అవసరమని చెప్పారు. ఆ పార్టీ పునరుజ్జీవం బాటలో ఉందన్నారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని సోదరునిగా అభివర్ణిస్తూ, బీజేపీ అనుసరించే సంకుచిత రాజకీయాలకు మేలైన విరుగుడు మందు వంటివారు సోదరుడు రాహుల్ గాంధీ అని స్టాలిన్ అన్నారు.  దేశంలోని రాజ్యాంగ వ్యవస్థలు సురక్షితంగా, స్వతంత్రంగా పని చేసే విధంగా చూడటం కోసం జాతీయ కూటమి ఏర్పాటవడం చాలా ముఖ్యమని చెప్పారు .రాహుల్ గాంధీ బీజేపీతో కేవలం ఎన్నికల కోసం మాత్రమే కాకుండా సైద్ధాంతిక ప్రాతిపదికపై కూడా పోరాడుతున్నారన్నారు.  భారత్ జోడో యాత్ర భారీ సంచలనం సృష్టించిందన్నారు. అయితే స్టాలిన్ కాంగ్రెస్ పార్టీని, రాహుల్ గాంధీ నాయకత్వాన్ని ఇంతలా మేచ్చుకోవడానికి కారణం ఏమిటి? నిజానికి రాహుల్ గాంధీ పొలిటికల్ ట్రాక్ రికార్డు చూస్తే, ఆయన సాధించిన గొప్ప విజయాలు మచ్చుకైనా కనిపించవు.  రాహుల్ గాంధీ 2004లో తొలిసారి అమేథీ నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత మరో రెండు మార్లు (2009, 2014)  అదే నియోజక వర్గం నుంచి ఎన్నికయ్యారు. కానీ, 2019 ఎన్నికల్లో అమేథీలో ఓడిపోయారు.ఆ ఎన్నికల్లో అమేథీతో పాటుగా కేరళలోని  వాయనాడ్  నియోజక వర్గం నుంచి కూడా పోటీచేశారు. సొంత నియోజక వర్గంలో ఒడి పోయినా, వాయనాడ్  ఓటర్లు ఆయన్ని అక్కున చేర్చుకుని పార్లమెంట్  కు పంపించారు. అదే సమయంలో పార్టీ అధ్యక్షుడిగా పార్టీని గెలిపించలేక, ఓటమికి నైతిక బాధ్యత వహించి పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు..ఆ తర్వాత ఏమి జరిగింది అనేది చరిత్ర.  అయితే స్టాలిన్ రాహుల్ పై ప్రశంసల వర్షం కురిపించడానికి ఆ చరిత్ర కాదు కారణం.. జయలలిత మరణం తర్వాత తమిళనాడు రాజకీయాల్లో అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా   అన్నా డిఎంకేలోని అంతర్గత కలహాలను అడ్డుపెట్టుకుని బీజేపీ తమిళనాడులో పాగావేసే ప్రయత్నాలను ముమ్మరం చేసింది. మాజీ ఐపీఎస్ అధికారి అన్నామలై బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత  బీజేపీ కొంత వేగంగా అడుగులు వేస్తోంది.ముఖ్యంగా బీజేపీ ప్రవచించే హిందూ జాతీయ వాదానికి ఆదరణ పెరుగుతోంది. స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాల్లోనూ ఆ ప్రభావం కనిపిస్తోంది. బీజేపీ, ఆర్ఎస్ఎస్ భావజాల వ్యాప్తి కొంత వేగంగా జరుగుతోంది .. అందుకే  రాష్ట్రంలో బీజేపీ ఎదుగుదలను అడ్డుకునేందుకు, స్టాలిన్ కు కాంగ్రెస్ అవసరం ఏర్పడింది.  ముఖ్యంగా రాహుల్ గాంధీ  భారత్ జోడో యాత్ర లో బీజేపీ, ఆర్ఎస్ఎస్, హిందుత్వ జాతీయ వాద భావజాలానికి వ్యతిరేకంగా రాహుల్ గాంధీ ఎత్తిన జెండా, అజెండా స్టాలిన్ కు రాజకీయ అవసరంగా మారాయి. అందుకే స్టాలిన్ కాంగ్రెస్ కు జై కొట్టారు.  కాంగ్రెస్ /రాహుల్ సారథ్యంలో జాతీయ కూటమి ఏర్పాటుకు విపక్ష పార్టీలు ఒకటవ్వాలని పిలుపిచ్చారు.

రాహుల్ యాత్రలో కొత్త రాగాలు

కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు సాగిస్తున్న భారత్ జోడో యాత్ర ఇంచుమించుగా ముగింపు దశకు చేరుకుంది. డిసెంబర్ 24న ఢిల్లీ చేరిన యాత్ర.. 9 రోజుల క్రిస్మస్, న్యూ ఇయర్ బ్రేక్  తర్వాత జనవరి 3న మళ్ళీ మొదలవుతుంది. కొత్త సంవత్సరంలో ఢిల్లీ, పంజాబ్ ల గుండా కశ్మీర్ లో ప్రవేశిస్తుంది. సెప్టెంబర్ 7 తమిళనాడులోని కన్యాకుమారిలో మొదలైన భారత్ జోడో యాత్ర 2023 జనవరి 20న శ్రీనగర్‌లో ముగుస్తుంది. ఇప్పటి వరకు 3 వేల కిలోమీటర్లు నడిచిన రాహుల్ మరో 548 కిలోమీటర్లు యాత్ర కొనసాగించనున్నారు. చివరకు కశ్మీర్ లోని శ్రీనగర్ లో ముగుస్తుంది. ప్రారంభం నుంచి ఇంతవరకు రాహుల్ జోడో యాత్ర, పదికి పైగా రాష్ట్రాల గుండా సాగింది. అయితే, ఇతవరకు యాత్రకు ఎక్కడా ఎలాంటి అంతరాయం కలగలేదు. ఎలాంటి అవాంచనీయ సంఘటనలు చోటు చేసుకోలేదు. శాంతి భద్రతల సమస్య తలెత్తలేదు. అలాగే, రాజకీయ విమర్శలు, ప్రతి విమర్శలు తప్ప యాత్ర ఎక్కడా పెద్దగా వివాదస్పదం కాలేదు. ఉద్రిక్తతలు  చోటు చేసుకోలేదు. శాంతి భద్రతల సమస్య తలెత్త లేదు.   కానీ, ఢిల్లీలో ఎంటర్ అయిన తర్వాత, యాత్రలో వేడి పెరుగుతోంది. భారత్ జోడో యాత్ర ఢిల్లీలో అడుగుపెట్టిన సమయంలో జనాలను అదుపు చేయడంలో పోలీసుల వైఫల్యంపై కాంగ్రెస్ పార్టీ ఆందోళన వ్యక్తం చేసింది. భద్రతా వైఫల్యం పై కేంద్ర హోం మంత్రి అమిత్‌షాకు లేఖ రాసింది. రాహుల్ గాంధీకి, భారత్ యాత్రలో పాల్గొంటున్న వారికి, నేతలకు భద్రత కల్పించేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని కోరింది. ఢిల్లీ పోలీసులు నేరుగా హోం మంత్రిత్వ శాఖ పరిధిలోకి వస్తారు, అందుకే కాంగ్రెస్ పార్టీ నేరుగా కేంద్ర హోం మంత్రికి లేఖ రాసింది.  బదర్‌పూర్ సరిహద్దు నుంచి డిసెంబర్ 24న రాహుల్ గాంధీ వెంట వేలాది మంది మద్దతుదారులు పాదయాత్రలో పాల్గొన్నారు. ఎర్రకోట వైపు పాదయాత్ర సాగుతుండగా పలువురు రాహుల్ గాంధీతో సెల్ఫీలు దిగేందుకు ప్రయత్నించడం, ఆయనకు అతి దగ్గరగా రావడంతో కలకలం రేగింది. తొక్కిసలాట తరహా పరిస్థితి తలెత్తింది. దీనిపై కాంగ్రెస్ నేత కేసీ వేణుగోపాల్ కేంద్ర హోం మంత్రికి లేఖ రాశారు. భారత్ జోడో యాత్రలో తీవ్రమైన భద్రతా లోపాలు తలెత్తిన విషయాన్ని మీ దృష్టికి తీసుకువస్తున్నాను. 24వ తేదీన పాదయాత్ర ఢిల్లీలోకి అడుగుపెట్టిన సమయంలో అనేక సందర్భాల్లో భద్రతా లోపాలు చోటుచేసుకున్నాయి. జడ్ ప్లస్ కేటగిరి సెక్యూరిటీ ఉన్న రాహుల్‌కు అతి దగ్గరగా జనం గుమిగూడుతున్నప్పుడు వారిని అదుపు చేయడంలో ఢిల్లీ పోలీసులు పూర్తిగా విఫలమయ్యారు. కేవలం మౌన ప్రేక్షకులుగా చూస్తుండిపోయారు. యాత్రలో పాల్గొనకుండా పలువురు ప్రముఖులను వేధించారు. యాత్రలో పాల్గొన్న అనేక మందిని ఇంటెలిజెన్స్ బ్యూరో ఇంటరాగేట్ చేసింది. హర్యానా స్టేట్ ఇంటెలిజెన్స్‌కు చెందిన గుర్తుతెలియని దుండగులు భారత్ జోడీ యాత్రలో అక్రమంగా ప్రవేశించారని డిసెంబర్ 23న సోహ్నా సిటీ పోలీస్ స్టేషన్‌లో మేము ఫిర్యాదు చేయడంతో ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేశారు  అని ఆ లేఖలో అమిత్‌షాకు వేణుగోపాల్ తెలియజేశారు.  కాంగ్రెస్ నేతల త్యాగాలను సైతం వేణుగోపాల్ ఆ లేఖలో గుర్తు చేశారు. దేశ ఐక్యత, సమగ్రత కోసం కాంగ్రెస్ పార్టీ నుంచి ఇద్దరు ప్రధాన మంత్రులు ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ తమ ప్రాణాలను అర్పించారని, 2013 మే 25న జీరమ్ ఘాటిలో నక్సల్స్ దాడిలో ఛత్తీస్‌గఢ్ నాయకత్వం మొత్తం అశువులు బాసిందని అన్నారు.  జనవరి 3 నుంచి అత్యంత సున్నితమైన పంజాబ్ , జమ్మూకశ్మీర్‌లో జోడో యాత్ర సాగాల్సి ఉంది.దీన్ని దృష్టిలో ఉంచుకుని జడ్ ప్లస్ క్యాటగిరీ భద్రతలో ఉన్న రాహుల్, భారత్ జోడో యాత్రలో పాల్గొంటున్న కార్తకర్తలు, ప్రజలు, నేతలకు తగిన భద్రత కల్పించాలి  అని అమిత్‌షాను ఆ లేఖలో వేణుగోపాల్ కోరారు. అలాగే, యాత్ర ఢిల్లీలో ప్రవేశించిన సమయంలోనే చైనా తదితర దేశాల్లో కరోనా ప్రకంపనలు ఉదృతమయ్యాయి. ఈ నేపధ్యంలో కేంద్ర ఆరోగ్య శాఖ, రాహుల గాంధీ సాగిస్తున్న భారత్ జోడో యాత్ర, తాత్కాలికంగా యాత్రకు బ్రేక్ ఇవ్వాలని లేదంటే కొవిడ్ ప్రోటోకాల్ (మాస్క్ ధరించడం, భౌతిక దూరం పాటించడం వంటి జాగ్రత్తలు) పాటించాలని కోరింది. అయితే, కేంద్ర ప్రభుత్వం రాసిన లేఖ కొంత రాజకీయ దుమారం రేపింది. రాహుల్ భారత్ జోడో యాత్ర బీజేపీ గుండెల్లో రైళ్ళు పరిగెత్తిస్తోందని, మల్లికార్జున ఖర్గే మొదలు దిగ్విజయ్ సింగ్ వరకు కాంగ్రెస్ నాయకులు ఒకరి తర్వాత ఒకరు, కవ్వింపు ప్రకటనలు చేశారు. అందుకు ప్రతిగా కేంద్ర మంత్రులు అనురాగ్ ఠాకూర్, స్మృతీ ఇరానీ తమదైన స్టైల్లో సమాధానమిచ్చారు. అదొకటి అలా ఉంటే, ఈ రోజు ఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాల‌యంలో జరిగిన కాంగ్రెస్‌ 138వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలలో పాల్గొన్న రాహుల్ గాంధీ, మీడియా మధ్య, ‘చాయ్ పె చర్చ’   స్టైల్లో ‘టీ’ ..షర్టు పే’ ఆసక్తికర చర్చ జరిగింది. నిజానికి, యాత్రలో  రాహుల్  విడవకుండా వేసుకుంటున్న టీ’ షర్టు పై  హాట్ అండ్ కూల్ చర్చ జరిగింది. కాగా  బుధవారం(డిసెంబర్ 28)  పార్టీ ఆవిర్భావ దినోత్సవనికీ రాహుల్ గాంధీ అదే వైట్ టీ ష‌ర్ట్ లో హాజరయ్యారు. దీంతో కొందరు విలేకరులు అదే విషయాన్ని ఆయన వద్ద ప్రస్తావించారు. దీనిపై స్పందించిన రాహుల్... ప్రస్తుతం టీ షర్టు  హ‌వా న‌డుస్తోంది.. ఎప్పటి వ‌ర‌కు ఆ హ‌వా ఉంటుందో, అప్పటి వ‌ర‌కు కొన‌సాగిస్తానని అన్నారు.  టీష‌ర్ట్ హీ చ‌ల్ ర‌హి హై ఔర్ జ‌బ్ త‌క్ చ‌ల్ ర‌హి హై చ‌లాయింగే" అని నవ్వుతూ రాహుల్ హిందీలో సమాధానం ఇచ్చారు. అయితే, ఇంతవరకు సాగిన యాత్ర ఒకెత్తు అయితే,  పంజాబ్, కశ్మీర్’లలో సాగే యాత్ర ఒకెత్తు అన్నారు.

కందుకూరులో మాటలకందని విషాదం

కందుకూరులో  తెలుగుదేశం నిర్వహించిన ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో విషాదం చోటు చేసుకుంది. తెలుగుదేశం అధినేత హాజరైన ఈ కార్యక్రమానికి జనం అనూహ్యంగా పోటెత్తారు. నెల్లూరు జిల్లా కందుకూరులో తెలుగుదేశం ఇంత వరకూ కేవలం రెండు సార్లు మాత్రమే విజయం సాధించింది. కందుకూరులో చంద్రబాబు రోడ్ షో ప్రపంగం ప్రారంభించారు. ఆ ప్రాంత మంతా జై చంద్రబాబు, జై తెలుగుదేశం నినాదాలతో మార్మోగింది. చంద్రబాబు ఉద్వేగపూరితంగా ప్రసంగిస్తున్నారు. తన ప్రసంగం మధ్యలో ఆయన అక్కడ కాల్వ ఉంది జాగ్రత్త అని హచ్చరించారు కూడా.. అంతలోనే అనూహ్య దుర్ఘటన జరిగింది. బైకులపై కూర్చుని చంద్రబాబు ప్రసంగం వింటున్న వారు వాహనాలతో సహా కాలువలో పడిపోయారు. ఈ దుర్ఘటనలో ఎనిమిది మంది మరణించారు. మరో పది మంది వరకూ గాయపడ్డారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.  చంద్రబాబు ఆసుపత్రికి వెళ్లి వారందరినీ పరామర్శించారు.   నేనున్నా భయపడవద్దని ధైర్యం చెప్పారు. మీ కుటుంబాలకు పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. మెరుగైన చికిత్స అందించాలని డాక్టర్లను కోరారు. అనంతరం మృతుల కుటుంబాలకు, ఒక్కొక్కరికి పదిలక్షల నష్టపరిహారం ప్రకటించారు.మృతుల పిల్లలను ఎన్టీఆర్ ట్రస్టు ద్వారా చదివిస్తామని హామీ ఇచ్చారు. వారిని దగ్గరుండి చూసుకోవాలని పార్టీ నేతలను ఆదేశించారు. మాజీ ఎమ్మెల్యే దివి శివరాం, ఇంటూరి రాజేష్, ఇంటూరి రాజేష్ బాధితులకు దగ్గరుండి సహాయ కార్యక్రమాలు పర్యవేక్షిస్తున్నారు. కాగా తర్వాత జరగాల్సిన కావలి సభను రద్దు చేసుకున్నారు.   కందుకూరు దుర్ఘటనలో మరణించిన కార్యకర్తల అంత్యక్రియలకు పార్టీ ఇన్‍చార్జ్ లు, ఎమ్మెల్యేలు వెళ్లాలని టీడీపీ అధినేత చంద్రబాబు ఆదేశించారు. ఒక్కో ఇన్‍చార్జ్ ఒక్కొక్క కార్యకర్త మృతదేహం వెంట వెళ్లి.. అంత్యక్రియలు పూర్తయ్యేవరకు కుటుంబసభ్యులతో ఉండాలని ఆదేశించారు మరణించిన కార్యకర్త కుటుంబానికి ఆర్థిక సాయం అందించడంతో పాటు కుటుంబసభ్యులకు మనోధైర్యం కల్పించాలని చంద్రబాబు చెప్పారు. కందుకూరులో జరిగిన విషాదంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్, ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, పొలిట్‌బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి, గోరంట్ల బుచ్చయ్యచౌదరి, బీద రవిచంద్ర, ధూళిపాళ్ల నరేంద్ర, నక్కా ఆనంద్‌బాబు తదితరులు దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. అలాగే తెలుగుదేశం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కాసాని జ్ఞానేశ్వర్ కందుకూరు దుర్ఘటన పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.   ఈ దుర్ఘటనలో మృతి చెందిన తెలుగుదేశం కార్యకర్తలు, అభిమానులకు ఆయన సంతాపం ప్రకటించారు. మృతుల ఆత్మ కు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ వారి కుటుంబీకులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.  

చంద్రబాబు సభలో తొక్కిసలాట.. ఏడుగురు మృతి

కందుకూరు చంద్రబాబు సభలో ఘోర విషాదం చోటు చేసుకుంది. నెల్లూరు జిల్లా కందుకూరులో బుధవారం (డిసెంబర్ 28) చంద్రబాబు సభకు కార్యకర్తలు భారీగా తరలి వచ్చారు. ఈ సందర్భంగా తొక్కిసలాట జరిగింది. కందుకూరు సభా స్థలి పక్కనే పక్కనే కాలువ ఉండటంతో కొందరు కార్యకర్తలుఅందులో పడిపోయారు. సంఘటన గురించి తెలియగానే చంద్రబాబు ప్రసంగం ఆపివేసి హుటాహుటిన ఆసుపత్రికి చేరుకున్నారు. క్షతగాత్రులను పరామర్శించారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ ఘటనలో ఏడుగురు మృతి చెందగా, మరి కొందరు తీవ్రంగా గాయపడ్డారు.  . చనిపోయిన కార్యకర్తల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. మృతుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మృతుల కుటుంబాలకు తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందనీ, మృతుల పిల్లల చదువు బాధ్యత తెలుగుదేశం తీసుకుంటుందనీ చెప్పారు. తొక్కసలాటలో కార్యకర్తల మరణం బాధాకరమని ఆయన వ్యాఖ్యానించారు.

శ్రీలంకతో టి20 సిరీస్ కు టీమ్ ఇండియా కెప్టెన్ ఎవరంటే?

వచ్చే నెలలో టి20, వన్డే సిరీస్ ల కోసం శ్రీలంక భారత్ లో పర్యటించనుంది. బంగ్లాదేశ్ లో టీమ్ ఇండియా పర్యటన పూర్తయిన వెంటనే శ్రీలంక దేశంలో పర్యటిస్తోంది. జనవరి మూడు నుంచి నుంచి టి20 సిరీస్, అదే నెల 10 నుంచి వన్డే సీరిస్ ప్రారంభమౌతాయి. అయితే ఇప్పటి వరకూ ఈ రెండు సిరీస్ ల కోసం టీమ్ ఇండియా ఇంకా జట్లను ప్రకటించలేదు. సమస్య ఏమిటంటే బంగ్లా పర్యటనలో గాయపడిన స్కిప్పర్ రోహిత్ శర్మ గాయం నుంచి ఇంకా కోలుకున్నాడా లేదా అన్న విషయం స్పష్టం కాలేదు. ఇక వైస్ కెప్టెన్  కేఎల్ రాహుల్ లంకతో స్వదేశంలో జరిగే వన్డే, టి20 సిరీస్ లకు అందుబాటులో ఉండడం లేదని ఇప్పటికే ప్రకటించారు. అతియా శెట్టితో వివాహం కారణంగా రాహుల్ ఈ సిరీస్ లకు దూరం అవుతున్నాడు. ఈ నేపథ్యంలో భారత్ కెప్టెన్ ఎవరు అన్న విషయంలో క్రికెట్ అభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది. అయితే టీమ్ ఇండియా మ్యాచ్ లను ప్రసారం చేసే స్టార్ స్పోర్ట్స్ తాజాగా విడుదల చేసిన ప్రోమో కారణంగా టీమ్ ఇండియా కొత్త కెప్టెన్ ఎవరన్నది అందరికీ తెలిసిపోయింది.   న్యూ ఇయర్ లో లంకతో పోరాడేందుకు హార్థిక్ పాండ్యా సిద్ధం అంటూ స్టార్ స్పోర్ట్స్ చేసిన ట్వీట్ తో క్రికెట్ అభిమానులంతా లంకతో సిరీస్ కు కెప్టెన్ హార్థిక్ పాండ్యాయే అని ఫిక్స్ అయిపోయారు. ఇప్పటికే బీసీసీఐ చర్చల్లో హార్దిక్ పాండ్యా పేరు కూడా పరిశీలనలోకి వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో సెలక్టర్లు ప్రకటించడానికి ముందే స్టార్ స్పోర్ట్స్ తదుపరి కెప్టెన్ ఎవరో వెల్లడించేసిందని అభిమానులు జోక్ చేస్తున్నారు.  

భారత్ లో ఒలింపిక్స్ ఎప్పుడంటే?

ఒలింపిక్స్ కు భారత్ ఆతిధ్యం ఎప్పుడు ఇస్తుంది అన్నది ఇంత కాలం సమాధానం తెలియని ప్రశ్న. గతంలో ఎప్పుడో తెలుగుదేశం అధినేత ఒలింపిక్స్ కు ఆతిథ్యమిచ్చే సత్తా భారత్ కు ఉందని ప్రకటించారు.    ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తాను సీఎంగా ఉన్న సమయంలో జాతీయ క్రీడలను అత్యంత విజయవంతంగా నిర్వహించి ప్రపంచాన్ని అబ్బుర పరిచారు.  ఆ సందర్భంలోనే ఆయన ఏపీ లో ఒలింపిక్స్ నిర్వహణ గురించి ప్రస్తావించారు. అయితే ఆ తరువాత మళ్లీ ఎప్పుడూ ఇండియాలో ఒలింపిక్స్ నిర్వహణ అన్న ప్రస్తావన రాలేదు. అయితే తాజాగా కేంద్ర క్రీడా మంత్రి భారత్ లో ఒలింపిక్స్ నిర్వహిస్తామని ప్రకటించారు. ఒలింపిక్స్ నిర్వహణకు కావలసిన మౌలిక సదుపాయాలన్నీ గుజరాత్ లో ఉన్నాయన్నారు. దేశంలో పలు ప్రతిష్టాత్మకమైన అంతర్జాతీయ   ఈవెంట్స్ ను హోస్ట్ చేయటాన్ని సవాల్ గా తీసుకున్న  మోడీ సర్కార్ 2036లో జరగబోయే ఒలింపిక్స్ కు బిడ్ వేస్తుందని ప్రకటించారు.   గతంలోనే ఏషియన్ గేమ్స్, కామన్ వెల్త్ గేమ్స్ నిర్వహించిన భారత్, త్వరలో జీ-20 భేటీకి ఆతిథ్యం ఇచ్చేందుకు రెడీ అవుతున్న సంగతి విదితమే. ఈ నేపథ్యంలోనే ఒలింపిక్స్ నిర్వహించేందుకు సిద్దమని చాటింది. అయితే 2032 వరకూ ఒలింపిక్స్ నిర్వహించేందుకు స్లాట్స్ అన్నీ బుక్ అయిపోయిన నేపథ్యంలో 2036 లో జరిగే ఒలింపిక్స్ కు వేదికగా భారత్ ను చేసేందుకు భారత్ ఇప్పటి నుంచే ప్రయత్నాలు మొదలు పెట్టింది. 

బీఆర్ఎస్ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డికి ఇక చుక్కలే..!

బీఆర్ఎస్ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డికి తెలంగాణ హైకోర్టులో మరో సారి చుక్కెదురైంది. ఎమ్మెల్యేలకు ఎర (ఫార్మ్ హౌస్) కేసులో  ఈడీ దర్యాప్తుపై స్టే కు తెలంగాణ హైకోర్టు నిరాకరించింది. ఈ కేసులో ఈడీ దర్యాప్తును నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులుఇవ్వాలన్న రోహిత్ రెడ్డి అభ్యర్థనను హైకోర్టు తోసిపుచ్చింది.  ఈ నెల 30న హాజరు కావాలన్న ఈడీ సమన్లలో జోక్యం చేసుకోవడానికి నిరాకరించింది. పార్టీ మారాలని తనకు వందకోట్లు ఆఫర్  ఆఫర్ మాత్రమే చేశారు కాని డబ్బు ఇవ్వలేదన్న రోహిత్‌రెడ్డి వాదనలు వినిపించారు.  దీంతో కౌంటర్ దాఖలు చేయాలని ఈడీని ఆదేశించిన కోర్టు తదుపరి విచారణ జనవరి 5కు వాయిదావేసింది. దీంతో రోహిత్ రెడ్డి మరోసారి ఈ నెల 30న ఈడీ విచారణకు హాజరు కాక తప్పదు. అలాగే హైకోర్టు ఈ కేసులో సిట్ దర్యాప్తును రద్దు చేస్తూ సీబీఐకి అప్పగిస్తూ ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఇప్పుడు రోహిత్ రెడ్డి  అటు సీబీఐ, ఇటు ఈడీ విచారణను ఎదుర్కోవలసిన పరిస్థితి ఏర్పడింది.   అసలు ఫామ్ హౌస్ కేసులో మొదటి నుంచీ బీఆర్ఎస్ వ్యూహాలు  పారడం లేదనే చెప్పాలి. చివరకు మీకు కేంద్ర దర్యాప్తు సంస్థలు ఉంటే.. మాకు రాష్ట్ర దర్యాప్తు సంస్థలు లేవా? అంటూ కేసీఆర్ కేంద్రానికి విసిరిన సవాల్ బూమరాంగ్ అయ్యిందనే చెప్పాలి. సీట్ దర్యాప్తును హైకోర్టు రద్దు చేసి సీబీఐకి దర్యాప్తు బాధ్యతలు అప్పగించడంతో.. రాష్ట్రంలో సీబీఐకి జనరల్  కన్సెంట్ లేకపోయినా,  హై కోర్టు తీర్పుతో ఇప్పుడు సిబిఐ రాష్ట్రంలో ఎంటర్ అవుతోంది. దీంతో ఫామ్ హౌస్ కేసు విషయంలో అనుకున్నదొకటి.. అయినది ఒకటి అన్నట్లుగా తయారైంది ఇప్పుడు బీఆర్ఎస్ పరిస్థితి.  కేసీఆర్ అత్యుత్సాహం.. పార్టీ చేతిలోని ఆయుధాన్ని ప్రత్యర్థికి అప్పగించిందని బీఆర్ఎస్ వర్గాలే భావిస్తున్నాయి.  ఎమ్మెల్యేల కొనుగోలు బేరసారాల కేసు విషయంలో కేసీఆర్ బీజేపీ ఆయువుపట్టు మీద దెబ్బకొట్టానని సంబరపడినంత సేపు పట్ట లేదు.. ఆ కేసు తిరిగి తిరిగి తమ పార్టీ ఎమ్మెల్యేల మెడకే చుట్టుకుంటోందని తెలియడానికి. ఎమ్మెల్యేల కొనుగోలు బేరసారాల కేసును సీబీఐకి ఇవ్వాలని హైకోర్టు నిర్ణయించడంతో బీఆర్ఎస్ గొంతులో పచ్చి వెలక్కాయ పడినట్లైంది.  ఫామ్ హౌస్ కేసులో సొమ్ములు కనిపించకపోయినా  వ్యూహాత్మకంగా ఈడీ రంగప్రవేశం  చేయడం, ఆ వెను వెంటనే హైకోర్టు తీర్పుతో సీబీఐ రంగంలోకి దిగుతుండటంతో  ఈ కేసు త్వరలోనే ఒక లాజికల్ కంక్లూషన్ కు వస్తుందని న్యాయనిపుణులు అంటున్నారు. సీబీఐ, ఈడీల రంగ ప్రవేశంలో ఇక ఫామ్ హౌస్ కేసులో నిందితులుగా ఉన్న రామచంద్ర భారతి అలియాస్‌ సతీశ్‌ శర్మ,   సింహ యాజులు, హైదరాబాద్‌కు చెందిన నందకుమార్‌లే కాక, ఫిర్యాదు చేసి నలుగురు ఎమ్మెల్యేలూ కూడా దర్యాప్తు సంస్థల విచారణను ఎదుర్కొనక తప్పని పరిస్థితి.  ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఫామ్ హౌస్ ట్రాప్ కేసులో కీలకంగా వ్యవహరించిన వ్యక్తి రోహిత్ రెడ్డి కంగారు పడుతున్నారు. ఈడీ, సీబీఐలకు ఈ కేసు దర్యాప్తు చేసే అధికారమే లేదంటున్నారు. హైకోర్టు ఫామ్ హౌస్ ట్రాప్ కేసును సీబీఐకి అప్పగిస్తూ తీర్పు వెలువరించిన తరువాత మీడియా సమావేశం ఏర్పాటు చేసి మరీ రోహిత్ రెడ్డి తన స్పందన తెలిపారు. కేసును సీబీఐకి ఎలా అప్పగిస్తారన్నారు. ఇదంతా బీజేపీ కుట్ర అని నిందలేశారు. కోర్టు తీర్పు మేరకే కేసును సీబీఐ దర్యాప్తు చేయనుందన్న సంగతి విస్మరించి మరీ బీజేపీపై నిందలేశారు. అంతకు ముందు ఇదే కేసుకు సంబంధించి తనను ఈడీ విచారించిన తరువాత కూడా ఆయన ఇవే ఆరోపణలు చేశారు. ఇప్పుడు ఈడీ దర్యాప్తుపై స్టేకు హైకోర్టు నిరాకరించడంతో రోహిత్ రెడ్డి ఆరోపణలలో పస లేదని తేలిపోయింది. 

మంత్రుల తిట్ల పురాణం వెనుక ఉన్నదెవరో తెలిసిందిలే..!

 జగన్ తొలి కేబినెట్‌లో మంత్రులు కొడాలి నాని, పేర్ని నాని, అనిల్ కుమార్ యాదవ్, వెల్లంపల్లి శ్రీనివాస్, కురసాల కన్నబాబు ఎక్సెట్రా ఎక్సెట్రాలు.. అలాగే  మలి కేబినెట్‌లోని మంత్రులు ఆర్కే రోజా, జోగి రమేష్, అంబటి రాంబాబు, గుడివాడ అమరన్నాథ్ వగైరా వగైరాలు.. ప్రెస్ మీట్ పెట్టి తిట్ల పురాణం వల్లించడం వెనుక  ఉన్నది ఎవరో   తెలిసిపోయిందని నెటిజన్లు సామాజిక మాధ్యమం సాక్షిగా స్పష్టం చేస్తున్నారు.  వైయస్ జగన్ కేబినెట్‌లో ఆయా శాఖల మంత్రులుగా కంటే..  వీరంతా బూతులతోనే ఫేమస్ అయ్యారని  గుర్తు చేస్తున్నారు. అయితే సదరు మంత్రులు అలా మాట్లాడుతున్నా.... ముఖ్యమంత్రి వైయస్ జగన్ కానీ, ఆయన   సలహాదారులు కానీ.. ఏ రోజు ఇది తప్పు.. ఇలా మాట్లాడడం తప్పు అంటూ వారిని వారించిన దాఖలాలు లేవని  అంటున్నారు.  కానీ తాజా పరిణామాల నేపథ్యంలో వీరి వెనుక ఉన్న శక్తి, వ్యక్తి ఎవరన్నది తమకు అర్థమైందని వారు సోషల్ మీడియా సాక్షిగా చెబుతున్నారు. తాజా   జగన్ ప్రభుత్వం ఇస్తున్న పెన్షన్ 250 రూపాయిలు పెంచిందని.... ఈ పెంపు 2023, జనవరి 1వ తేదీ నుంచి అమల్లోకి వస్తుందని... అయితే ఈ పెన్షన్‌ అందుకొంటున్న వారికి 300 యూనిట్లు దాటి కరెంట్ బిల్లు వచ్చినా.. అలాగే వెయ్యి చదరపు గజాల విస్తిర్ణంలో వారు నివాసముంటున్నా.. అలాంటి వారికి ఇకపై పెన్షన కట్ చేయాలంటూ జగన్ సర్కార్ స్సష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాలపై ప్రతిపక్షాల నుంచే కాదు.. ప్రజల నుంచి కూడా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. పెన్షన్‌ కట్ అంశంపై అటు మీడియాలో ఇటు సోషల్ మీడియాలో ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలోనే  తాజాగా ముఖ్యమంత్రి  జగన్ అధ్యక్షతన జరిగిన ఉన్నతాధికారుల సమావేశంలో   అలా విమర్శించే వారిని  ప్రెస్‌మీట్ మరీ  తిట్టాలంటూ ఉన్నతాధికారులకు సీఎం సూచించడమే కాదు... అలా మాట్లాడితేనే కానీ ఈ విమర్శలకు పుల్ స్టాప్ పడదంటూ  క్లారిటీ సైతం ఇచ్చేశారని నెటిజనులు సోషల్ మీడియా సాక్షిగా వివరిస్తున్నారు.  దీంతో ఉన్నతాధికార గణమంతా.. ఒక్కసారిగా అవాక్కయిందని వారు పేర్కొంటున్నారు.   ఈ తాజా సంఘటనతో నాటి నుంచి నేటి వరకు మంత్రుల తిట్ల  పురాణం వెనుక కర్మ.. కర్త.. క్రియ అంతా సాక్షాత్తూ వైసీపీ అధినేత, సీఎం జగనే ఉన్నారనే విషయం తమకు అర్థమైందని నెటిజన్లు అంటున్నారు.  అయితే జగన్ ముఖ్యమంత్రిగా కొలువు తీరిన తర్వాత.. జగన్ పాలనపై మాజీ సీఎం, టీడీపీ జాతీయ అధ్యక్షుడు  చంద్రబాబు నాయుడు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌లు విమర్శలు గుప్పించేవారు. ఈ నేపథ్యంలో వీరిపై జగన్ అదేశాలతోనే.. నాటి.. నేటి కేబినెట్ మంత్రులంతా బండ బూతులు తిట్టారని, ఇప్పటికి వీరు తీడుతూనే ఉన్నారని అంటున్నరు. అయితే ఇటీవల విశాఖలో అధికార పార్టీ సింహ గర్జన నిర్వహించారు. అదే సమయంలో పవన్ కల్యాణ్.. విశాఖకు వస్తున్నారు. ఈ సందర్బంగా స్థానిక ఎయిర్ పోర్ట్ వద్ద కోలాహలం నెలకొంది. అలాంటి వేళ.. పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా ఎయిర్‌పోర్ట్ సాక్షిగా చేసిన వెకిలి చేష్టల వెనుక సీఎం వైయస్ జగన్ ఉండే ఉంటారని కూడా అభిప్రాయపడుతున్నారు.

గులాబీ పార్టీలో టికెట్ల పంచాయతీ

అధికార బీఆర్ఎస్ లో టికెట్ల పంచాయతీ మొదలైంది. అవును... అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా కొంత సమయం వుంది. పైగా పార్టీ అధ్యక్షడు ముఖ్యమంత్రి కేసేఆర్, సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు అందరికీ టికెట్ ఖాయమని ప్రకటించారు. అయితే  సిట్టింగులు అందరికీ తరిగి టికెట్ ఇస్తారా లేక ఆఖరి క్షణంలో గెలుపు గుర్రాలు  తెర మీదకు వస్తాయా అనే చర్చ  పార్టీలో జరుగుతోంది. అలాగే ఇతర పార్టీల టికెట్ పై గెలిచి బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్న 16 ( కాంగ్రెస్ 12, టీడీపీ 2, ఇండిపెండెంట్  2) ఎమ్మెల్యేల నియోజక వర్గాలలో గత ఎన్నికల్లో ఓడిపోయిన ఒరిజినల్  బీఆర్ఎస్ ( టీఆర్ఎస్)లకు టికెట్లు ఇస్తారా, వలస వాదులకు పెద్దపీట వేస్తారా అనే మరో చర్చ కూడా ఇటు పార్టీలో, అటు మీడియాలో జరుగుతోంది. అలాగే మారిన  రాజకీయ, కుల సమీకరణల కారణంగా మరొ కొన్ని స్థానాల్లో అభ్యర్ధులను మార్చ వలసి ఉంటుందని అంటున్నారు.  సో.. ముఖ్యమంత్రి  పార్టీ అధినేత సిట్టింగ్  ఎమ్మెల్యేలు అందరికీ టికెట్ ఇస్తామని హామీ ఇచ్చినా, సిట్టింగ్  ఎమ్మెల్యేలలోనూ ఎవరికుండే అనుమానాలు వారి కున్నాయి. అందుకే, అలా అనుమానాలున్న ఎమ్మెల్యేలు ఇప్పటి నుంచే సీటు పదిలం చేసుకునే ప్రయత్నాలలో ఉన్నట్లు తెలుస్తోంది.  అసెంబ్లీ టికెట్ల వ్యవహారం అలా, ఉంటే వచ్చే సంవత్సరం అసెంబ్లీ ఎన్నికలకు ముందే శాసనమండలిలో ఏడు సీట్లు ఖాళీ కానున్నాయి. మూడు ఎమ్మెల్యే కోటా సీట్లు, ఒక హైదరాబాద్‌‌ టీచర్స్‌‌ కోటా సీటు కాల పరిమితి మార్చి 29తో ముగియనుంది. టీచర్స్‌‌ ఎమ్మెల్సీ ఓటరు నమోదు సహా ఎన్నికల ప్రక్రియ ఇప్పటికే షురూ అయింది. గవర్నర్‌‌ కోటాలో రెండు, హైదరాబాద్ లోకల్‌‌ బాడీస్‌‌లో ఒక సీటు మే 27న ఖాళీ అవుతాయి. ఖాళీ అయ్యే  ఏడుసీట్లలో ఒక్క టీచర్స్ సీట్ తప్ప మిలిన అన్ని స్థానాల్లో నూటికి నూరు శాతం గెలుపు అవకాశాలు అధికార బీఆర్ఎస్ కే  ఉన్నాయి. టీచర్స్‌ ఎమ్మెల్సీ సీటు ఫలితం మాత్రమే ఉపాధ్యాయులనిర్ణయం పై ఆధారపడి ఉంటుంది.  కాగా  ఎమ్మెల్యే కోటాలో ప్రాతినిధ్యం వహిస్తున్న బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీలు నవీన్‌ కుమార్‌, గంగాధర్‌ గౌడ్‌, ఎలిమినేటి కృష్ణా రెడ్డి, గవర్నర్‌ కోటాలో నామినేట్‌ అయిన రాజేశ్వర్‌ రావు, ఎంఏ ఫారూఖ్‌ హుస్సేన్‌, టీచర్స్‌ కోటాలో ఎన్నికైన కాటేపల్లి జనార్దన్‌ రెడ్డి, హైదరాబాద్‌ స్థానిక సంస్థల (లోకల్ బాడీ) కోటాలో ఎన్నికైన ఎంఐఎం  నేత సయ్యద్‌ అమీనుల్‌ హసన్‌ జాఫ్రీ కాల పరిమితి కొత్త ఏడాదిలో ముగియనుంది. ఖాళీ కానున్న సీట్ల కోసం గులాబీ పార్టీలో పెద్ద ఎత్తున పోటీ నెలకొంది. మునుగోడు బైపోల్‌కు ముందు పార్టీలో చే రిన వారితో పాటు గతంలో కేసీఆర్‌ కేటీఆర్‌ హామీ ఇచ్చిన సుమారు యాభై అరవై మంది వరకు నేతలు ఆశలు పెట్టుకున్నారు. కాల పరిమితి ముగిసే ఎమ్మెల్సీల్లో నవీన్‌ కుమార్‌కు మళ్లీ చాన్స్‌ ఇస్తారని బీఆర్ఎస్ వర్గాల్లో ప్రచారం జరుగుతున్నది. గవర్నర్‌ కోటాలో మైనార్టీ వర్గాలకు చెందిన రాజేశ్వర్‌ రావు, ఫారుఖ్‌ హుస్సేన్‌  ఎమ్మెల్సీ కాల పరిమితి ముగియనుంది. ఆ ఇద్దరికి కూడా రెన్యూవల్‌ అయ్యే అవకాశముందని ప్రచారం నడుస్తున్నది. ఇతర సమీకరణాలను పరిగణనలోకి తీసుకుంటే క్రిస్టియన్‌, ముస్లిం మతాలకు చెందిన ఇతర నేతల పేర్లు పరిశీలించే అవకాశమున్నట్టు సమాచారం. హైదరాబాద్‌ స్థానిక సంస్థల (లోకల్ బాడీ) కోటా స్థానాన్ని ఎంఐఎంకే ఇస్తారని బీఆర్ఎస్ వర్గాలు చెప్తున్నాయి. టీచర్స్‌ ఎమ్మెల్సీ స్థానం నుంచి కాటేపల్లి జనార్దన్‌ రెడ్డిని బీఆర్‌ఎస్‌  బలపరుస్తున్నది. ఇకపోతే ఎమ్మెల్యే కోటాలోని మిగతా రెండు సీట్ల కోసం బీఆర్ఎస్ లో భారీ ఎత్తున పోటీ ఉంది. మునుగోడు ఉప ఎన్నికకు ముందు పార్టీలో చేరిన మండలి మాజీ చైర్మన్‌ స్వామిగౌడ్‌, దాసోజు శ్రవణ్‌ కుమార్‌, మాజీ ఎమ్మెల్యే భిక్షమయ్య గౌడ్‌, మాజీ ఎంపీ రాపోలు ఆనంద భాస్కర్‌, మరో నేత పల్లె రవి కుమార్‌కు మార్చిలో ఖాళీ అయ్యే ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాల్లో అవకాశమిస్తామని కేసీఆర్‌ స్వయంగా హామీ ఇచ్చినట్టు బీఆర్ఎస్ వర్గాలు చెప్తున్నాయి.  2018 అసెంబ్లీ, 2019 పార్లమెంట్‌ ఎన్నికల సందర్భంగా టికెట్‌ ఇవ్వలేకపోయిన సుమారు 30 మంది నేతలకు మండలి లేదా రాజ్యసభలో అవకాశం కల్పిస్తామని కేసీఆర్‌, కేటీఆర్‌ హామీ ఇచ్చారు. 2018 అసెంబ్లీ ఎన్నికల తర్వాత టీఆర్‌ఎస్‌లో చేరిన ఇంకో 15 మంది నేతలకూ ఇలాంటి హామీలే ఇచ్చారు. మాజీ మంత్రులు తుమ్మల నాగేశ్వర్‌ రావు, జూపల్లి కృష్ణారావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి, పలువురు మాజీ ఎమ్మెల్యేలు, ఇతర నేతలు మండలి అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు. అసెంబ్లీకి వచ్చే ఏడాది డిసెంబర్‌లోగా ఎన్నికలు జరగాల్సి ఉంది. 40 నియోజకవర్గాల్లో ఇద్దరు అంతకన్నా ఎక్కువ మంది బీఆర్‌ఎస్‌ టికెట్‌ ఆశిస్తున్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ టికెట్‌ ఇవ్వలేని నేతలను అంతకన్నా ముందే ఖాళీ అయ్యే మండలి స్థానాలతో అడ్జస్ట్‌ చేసే ఆలోచనలో గులాబీ బాస్‌ ఉన్నట్టు తెలుస్తున్నది. ఇలా ఏ ఈక్వేషన్‌ చూసుకున్నా రెండు, మూడు సీట్లకు మించి అవకాశం లేదు. ఉన్న ఈ రెండు, మూడు సీట్లను 50 మంది వరకు నేతలు ఆశిస్తుండటంతో ఎవరిపై కేసీఆర్‌ కరుణ చూపుతారు, ఎవరికి చాన్స్‌ ఇస్తారనేది అంతుచిక్కడం లేదు. ఇక్కడ చాన్స్‌ రాని నేతలు బీజేపీ, టీడీపీ సహా ఇతర పార్టీల్లో చేరితే కారు పార్టీకి ఎన్నికల్లో నష్టం తప్పదని ఆ పార్టీ వర్గాలు అనుమానిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో లీడర్లను కేసీఆర్‌ ఎలా సంతృప్తి పరుస్తారు.. పార్టీని వీడకుండా వారికి ఎలాంటి ఆశ చూపిస్తారనే దానిపైనా పార్టీలో రకరకాల చర్చలు సాగుతున్నాయి.

దేశంలో నైనిటాల్ కంటే చల్లని ప్రదేశం ఎదో తెలుసా?

దేశంలో అత్యంత చల్లనైన ప్రదేశం ఏది అని అడిగితే ఎవరైనా ఠక్కున నైనిటాల్ అని చెప్పేస్తారు. అయితే ఈ ఏడాది చలి పులి కారణంగా దేశ రాజధాని ఢిల్లీలో ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోయాయి. దీంతో ఇప్పుడు దేశంలో నైనిటాల్ కాదు ఢిల్లీయే అత్యంత చల్లని ప్రదేశం అని చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది. మంగళవారం (డిసెంబర్ 27)హస్తినలో కనిష్ట ఉష్ణోగ్రత 5.6 డిగ్రీలుగా నమోదైంది. బుధవారం ఉదయం ఇది 7 డిగ్రీలుగా ఉంది. శీతల గాలులతో హస్తినలో చలి వణికించేస్తోంది. దట్టమైన పొగమంచు నగరాన్ని దుప్పటిలా కప్పేసింది. దీంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది.  మొత్తంగా ఉత్తర భారతం అంతా చలిగుప్పిట్లో చిక్కుకుంది.  ఢిల్లీ, హర్యానా, పంజాబ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలను పొగమంచు కమ్మేసింది. మరో 48 గంటలపాటు ఇదే పరిస్థితి కొనసాగుతుందని వాతావరణ కేంద్రం పేర్కొంది.

మోడీ తల్లి హీరాబెన్ కు అస్వస్థత.. ఆసుపత్రిలో చేరిక

ప్రధాని మోడీ తల్లి హీరాబెన్ మోడీ ఆసుపత్రిలో చేరారు. వందేళ్ల ఏళ్ల హీరాబెన్ ఆరోగ్యంక్షీణించడంతో ఆమెను హుటాహుటిన అహ్మాదాబాద్ లోని   యుఎన్ మెహతా ఆసుపత్రికి తరలించారు.    ప్రధాని సోదరుడు ప్రహ్లాద్ మోడీ, ఆయన కుటుంబసభ్యులు మైసూరు వద్ద మంగళవారం (డిసెంబర్ 27) జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. ఈ వార్త విని తీవ్ర ఆందోళనకు గురైన హీరాబెన్ మోడీ అస్వస్థతకు గురయ్యారు. ఇటీవలి గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో  మోడీ తన తల్లిని గాంధీనగర్ లోని స్వగృహంలో కలిశారు. జూన్ 18వ తేదీన ఆమె 100వ పుట్టినరోజు జరుపుకున్న సంగతి విదితమే. కాగా అస్వస్థతకు గురైన తన తల్లిని చూసేందుకు మోదీ అహ్మదాబాద్ కు వెళ్లనున్నారు. 

ఈ బాబాయికీ పోటు తప్పదా?

తిరుమల శ్రీవారి సన్నిధి నుంచి వైవీ సుబ్బారెడ్డిని సాగనంపేందుకు వైకుంఠ ఏకదశి సాక్షిగా ముహుర్తం ఖరారు అయినట్లు వైసీపీ శ్రేణుల్లో గట్టిగా వినిపిస్తోంది.  కొత్త సంవత్సరం.. ఆ మరునాడే వైకుంఠ ఏకదశి రావడం.. దీంతో తిరుమల కొండపై భక్తులు పోటెత్తనున్నారు. ఈ నేపథ్యంలో కొండపై భక్తుల హడావుడి తగ్గగానే.. టీటీడీ బోర్డు చైర్మన్ పదవికీ వైవీ సుబ్బారెడ్డి రాజీనామా చేస్తారన్న ప్రచారం జరుగుతోంది.  సుబ్బారెడ్డి స్థానంలో  పల్నాడు జిల్లాకు చెందిన ఓ బీసీ నేతకు టీటీడీ చైర్మన్ పదవిని కట్టబెట్టాలని జగన్ ఒక నిర్ణయానికి వచ్చారనీ,  మఘమాసంలో..ఓ మంచి ముహూర్తంలో ఆయన పేరును ప్రకటిస్తారని వారు చెబుతున్నారు.   వైవీ సుబ్బారెడ్డి టీటీడీ  చైర్మన్ గానే కాక  వైసీపీ ఉత్తరాంధ్ర పార్టీ ఇన్‌చార్జ్‌గా కూడా ఉన్నారు.   వచ్చేది ఎన్నికల సీజన్ కావడంతో ఉత్తరాంధ్రలో పార్టీ బలోపేతానికి పటిష్టమైన చర్యలు తీసుకోవాల్సి ఉందని... దాంతో వైవీ సుబ్బారెడ్డి.. ఉత్తరాంధ్రలో పాగా వేసి..   పార్టీ విజయం కోసం సుబ్బారెడ్డి పూర్తి స్థాయిలో కృషి చేయడం కోసమే ఆయనను టీటీడీ పదవి నుంచి జగన్ తప్పించాలని భావిస్తున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.   ఇంకోవైపు.. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు.. ఇటీవల తెలంగాణలోని ఖమ్మంలో నిర్వహించిన సభ సక్సెస్ అయిందని.. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరంలో నిర్వహించిన ఇదే ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమం సైతం సూపర్ సక్సెస్ అయిందని.. ఈ రెండు చోట్ల చంద్రబాబు సారథ్యంలో జరిగిన సభలకు భారీగా ప్రజలు స్వచ్ఛందంగా తరలి వచ్చారని.. అలాంటి వేళ అధికారంలో ఉన్న వైసీపీ మరింత దూకుడుగా వ్యవహరించాల్సి ఉందని.... అందులో భాగంగానే ముఖ్యమంత్రి  జగన్... బాబాయి వైవీ సుబ్బారెడ్డిని టీటీడీ చైర్మన్ పదవి నుంచి తప్పించి.. ఉత్తరాంధ్ర వ్యవహారాలకే పరిమితం చేస్తారని పార్టీ వర్గాలు అంటున్నాయి.  అదీకాక గతంలో ఉత్తరాంధ్ర ఇన్ ఛార్జ్ బాధ్యతలు విజయసాయిరెడ్డి పర్యవేక్షించేవారు. .. కానీ ఆయనపై ఆరోపణలు వెల్లువెత్తడంతో.. వైవీ సుబ్బారెడ్డికి ఆ బాధ్యతలు కట్టబెట్టిన జగన్ ఇప్పుడు బాబాయ్ వైవీ సుబ్బారెడ్డిని ఉత్తరాంధ్రకే పరిమితం చేయాలని నిర్ణయించుకున్నారు.    అదే సమయంలో టీటీడీ బోర్డ్ చైర్మన్ పదవి బీసీ నాయకుడికి ఇవ్వాలని నిర్ణయించారు. దీని వల్ల బీసీ వర్గాలలో వైసీపీ పట్ల సానుకూలత వ్యక్తం అవ్వడానికి అవకాశాలున్నాయని జగన్ భావిస్తున్నారు.  

యువగళం.. లోకేష్ పాదయాత్ర

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కుప్పం టు ఇచ్చాపురం పాదయాత్రకు ముహూర్తం, పేరు ఫిక్స్ అయిపోయాయి. జనవరి 27న ప్రారంభం కానున్న పాదయాత్రకు యువగళం అని నామకరణం చేశారు.    400 రోజుల పాటు నాలుగు వేల కిలోమీటర్లు సాగే లోకేష్ పాదయాత్రలో  వంద నియోజకవర్గాలు కవర్ చేస్తారు. ఇందుకు అనుగుణంగా రూట్‌ మ్యాప్‌ రెడీ అయ్యింది. లోకేష్ తన పాదయాత్రలో యువత, మహిళలు, రైతులతోపాటు అన్ని వర్గాల ప్రజలతో మమేకమై వారి   సమస్యలు తెలుసుకోవడం పరిష్కార మార్గాలు సూచించడం లక్ష్యంగా పెట్టుకున్నారు. యువగళం పేర లోకేష్  పాదయాత్ర వివరాలను ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం అధ్యక్షుడు  అచ్చెన్నాయుడు. ప్రకటించారు. పాదయాత్ర లోగో ఆవిష్కరించారు. లోకేష్ పాదయాత్ర చేస్తారంటూ గత చాలా కాలంగా  ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే .  నిరుద్యోగం, యువత ఎదుర్కొంటున్న సమస్యలే ప్రధాన అంశాలుగా లోకేష్ యాత్ర సాగనుంది. మహిళలు, రైతుల సమస్యల పట్ల ప్రజల్లో చైతన్యం తెచ్చేలా ప్రణాళిక రూపొందించనున్నారు. యువతను పెద్దఎత్తున భాగస్వామ్యం చేసేలా లోకేష్ పాదయాత్ర ముందుకు సాగుతుందని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. కాగా తన పాదయాత్ర జనవరి 27 నుంచి ప్రారంభమౌతుందని నవంబర్ లోనే లోకేష్ ప్రకటించారు. వచ్చే ఎన్నకలలో తాను పోటీ చేయదలచిన మంగళగిరి నియోజకవర్గంలో మీడియా సమావేశం పెట్టి మరీ గతనవంబర్ లో తన పాదయాత్ర తేదీ ప్రకటించారు. ఈ పాదయాత్ర కారణంగా తాను కొంత కాలం నియోజకవర్గానికి దూరంగా ఉంటాననీ, అందుకే మంగళగిరి బాధ్యతలను కార్యకర్తలకు అప్పగిస్తున్నట్లు చెప్పారు. ఇంత కాలం తండ్రి, తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబునాయుడి నీడలోనే రాజకీయంగా ఎదిగినా ఇప్పుడు.. పూర్తిగా పరిణితి చెందిన నేతగా లోకేష్ ప్రజలతో మమేకం కానున్నారు.  అయితే..అయితే అది అంత సునాయాసంగా మాత్రం జరగలేదు. రాజకీయాలలో తొలి అడుగులు వేసే సమయంలోనే రాజకీయ ప్రత్యర్థులు ఆయన వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డారు. బాడీ షేమింగ్ చేశారు. ఆహారం, ఆహార్యంపై ఎగతాళి చేశారు. పప్పు అన్నారు. అడుగడుగునా విమర్శలు చేశారు. అయితే అన్నిటినీ తట్టుకుని తనదైన వ్యక్తిత్వాన్ని నిలబెట్టుకుని లోకేష్ ఇప్పుడు ప్రత్యర్థులకు సింహస్వప్నంగా ఎదిగారనడంలో సందేహం లేదు.   ఇప్పుడు ఈ పాదయాత్ర యువతలో ఉత్తేజాన్ని నింపడంతో పాటు.. సీనియర్లు కూడా బద్ధకాన్ని వదుల్చుకుని పార్టీ కార్యక్రమాలలో చురుకుగా పాల్గొనేందుకు దోహదపడుతుందని అంటున్నారు. 

మేనమామనూ జగన్ దూరం పెట్టేశారా ..?

ఏపీ సీఎం జగన్ కు ఒక్కరొక్కరుగా కుటుంబ సభ్యులు, ఆత్మీయులూ దూరం అవుతున్నారు. తండ్రి వైఎస్ మరణానంతరం జగన్ కు అన్ని విధాలుగా అండగా ఉండి, ఆయన జైలుకు వెళ్లిన సమయంలో వైసీపీ పార్టీని భుజాలపై మోసి.. జగన్ అధికారంలోకి రావడానికి, ముఖ్యమంత్రి కావడానికి అన్ని విధాలుగా సహకరించిన వారు ఒక్కరొక్కరుగా దూరం అవుతున్నారు. వైఎస్ వివేకా హత్య కేసు విషయంలో విభేదించిన సొంత బాబాయ్ కుమార్తె డాక్టర్ సునీత, ఆ తరువాత   తల్లి విజయమ్మ, సోదరి షర్మిల జగన్ కు దూరం అయ్యారు. ఇప్పుడు తాజాగా జగన్ కు స్వయాన మేనమామ.. అంటే తల్లి విజయమ్మకు సోదరుడు అయిన పోచిమరెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి కూడా జగన్ కు దూరం అయ్యారు. జగన్ కు మేనమామ అయినా రవీంద్రనాథ్ రెడ్డి వైఎస్ రాజశేఖరరెడ్డికి అత్యంత సన్నిహితుడిగా మెలిగారు. అలాగే ఆయన పెరిగింది దాదాపుగా వైఎస్ వద్దే అని చెబుతారు. మొదటి నుంచీ కూడా రవీంద్రనాథ్ రెడ్డి వైఎస్ కుటుంబంతోనే ఉన్నారు. దీంతో ఆయన  తనకంటే వయసులో చిన్నవాడైన జగన్ కు  దాదాపుగా కేర్ టేకర్ గా   వ్యవహరించారని చెబుతారు. ఆ కారణంగానే ఇప్పటి వరకు వైసీపీలో రవీంద్రనాథ్ రెడ్డి కీలకంగా వ్యవహరిస్తూ వచ్చారు. అలాగే ఇప్పటి వరకూ కమలాపురం నియోజకవర్గంలోనే కాకుండా, సీఎం సొంత జిల్లా అయిన కడప జిల్లాలో రవీంద్రనాథ్ రెడ్డి హవా కొనసాగుతూ వచ్చింది.   అయితే ఇప్పుడు ఇదంతా గతం. ఎందుకంటే ఇప్పుడు జగన్ మేనమామకు పార్టీలో ఇసుమంతైనా ప్రాధాన్యత లేకుండా పోయింది. అసలు సీఎం జగన్ తన మేనమామ ముఖం చూసేందుకు కూడా ఇష్టపడటం లేదనీ, ఇరువురి మధ్యా మాటా మంతీ లేదనీ వైసీపీ వర్గాలే చెబుతున్నాయి. జగన్ ముఖ్యమంత్రి కావడానికి తమ శక్తివంచన లేకుండా పాటుపడిన వారంతా ఇప్పుడు ఆయనకు దూరం అవుతున్నారు. సొంత కుటుంబంలోనే విభేదాల కుంపటి రాజుకుంది. జగన్ సోదరి అన్నతో విభేదించి తెలంగాణలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పేర సొంత పార్టీ ఏర్పాటు చేసుకుంటే.. తల్లి విజయమ్మ జగన్ ను కాదని, వైసీపీ గౌరవాధ్యక్షురాలి పదవికి రాజీనామా చేసి, ఆ పార్టీతో తెగతెంపులు చేసుకుని మరీ తన కుమార్తెకు తోడుగా వైఎస్సార్టీపీ వ్యవహారాలలో తలమునకలై ఉన్నారు. జగన్ సంగతి మనకెందుకు అని మీడియా ప్రశ్నలకు ఏపీ సీఎంతో తమకు సంబంధం లేదని చెప్పకనే చెప్పారు. వారిరువురూ జగన్ కు దూరం జరిగినా మేనమామ రవీంద్రనాథ్ రెడ్డి మాత్రం ఇటీవలి కాలం వరకూ జగన్ కే మద్దతుగా నిలిచారు.  మేనమామగా ఉన్న చనువుతో  రవీంద్రనాథ్ రెడ్డి  అవకాశం దొరికిన ప్రతి సందర్బంలోనే సోదరి షర్మిలతో విభేదాలెందుకు అంటూ ఆమెతో సామరస్యం కుదిర్చేందుకు తన వంతు ప్రయత్నాలు చేస్తూ వచ్చారు. అయితే ఇది రుచించని జగన్ ఆయనను దూరం పెట్టారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఎదురు పడినా కనీసం పలకరించకపోవడం, అప్పాయింట్ మెంట్ సైతం నిరాకరిస్తుండటంతో రవీంద్రనాథ్ రెడ్డికి విషయం బోధపడి జగన్ కు దూరం జరిగారని అంటున్నారు. ఇటీవల జగన్ కడప జిల్లా పర్యటనకు రవీంద్రనాథ్ రెడ్డి హాజరయ్యారు. అయినా జగన్ ఆయనను పట్టించు కోలేదనీ, ఎదురుపడిన సమయంలో కూడా ముఖం తిప్పుకుని పక్కకు వెళ్లిపోయారనీ పార్టీ వర్గాలే చెబుతున్నాయి. కడప జిల్లాలో ఇప్పుడు సీఎం జగన్, రవీంధ్రనాథ్ రెడ్డిల మధ్య పెరిగిన దూరంపైనే హాట్ హాట్ చర్చ నడుస్తున్నది. ఎంత సీఎం అయినా కడప జిల్లాలో వైసీపీ పట్టు నిలవాలంటే కనీసం ఎన్నికల నాటికైనా జగన్ కుటుంబ సభ్యులతో సామరస్యం పెంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందంటున్నారు. ఇప్పటికే కుటుంబ సభ్యులను దూరం పెట్టిన జగన్ తీరుపై జిల్లాలో వైఎస్ అభిమానుల్లో అసంతృప్తి వ్యక్తమౌతోందనీ, వైఎస్ వివేకా హత్య, షర్మిల, విజయమ్మలనూ దూరం పెట్టడంతో పాటు ఇప్పుడు మేనమామను సైతం దూరం చేసుకోవడంపై కడప జల్లాలో జగన్ తీరు పట్ల వ్యతిరేకత గూడుకట్టుకుందని పార్టీ వర్గాలే చెబుతున్నాయి.