బీఆర్ఎస్ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డికి ఇక చుక్కలే..!
posted on Dec 28, 2022 @ 2:56PM
బీఆర్ఎస్ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డికి తెలంగాణ హైకోర్టులో మరో సారి చుక్కెదురైంది. ఎమ్మెల్యేలకు ఎర (ఫార్మ్ హౌస్) కేసులో ఈడీ దర్యాప్తుపై స్టే కు తెలంగాణ హైకోర్టు నిరాకరించింది. ఈ కేసులో ఈడీ దర్యాప్తును నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులుఇవ్వాలన్న రోహిత్ రెడ్డి అభ్యర్థనను హైకోర్టు తోసిపుచ్చింది. ఈ నెల 30న హాజరు కావాలన్న ఈడీ సమన్లలో జోక్యం చేసుకోవడానికి నిరాకరించింది.
పార్టీ మారాలని తనకు వందకోట్లు ఆఫర్ ఆఫర్ మాత్రమే చేశారు కాని డబ్బు ఇవ్వలేదన్న రోహిత్‌రెడ్డి వాదనలు వినిపించారు. దీంతో కౌంటర్ దాఖలు చేయాలని ఈడీని ఆదేశించిన కోర్టు తదుపరి విచారణ జనవరి 5కు వాయిదావేసింది. దీంతో రోహిత్ రెడ్డి మరోసారి ఈ నెల 30న ఈడీ విచారణకు హాజరు కాక తప్పదు. అలాగే హైకోర్టు ఈ కేసులో సిట్ దర్యాప్తును రద్దు చేస్తూ సీబీఐకి అప్పగిస్తూ ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఇప్పుడు రోహిత్ రెడ్డి అటు సీబీఐ, ఇటు ఈడీ విచారణను ఎదుర్కోవలసిన పరిస్థితి ఏర్పడింది.
అసలు ఫామ్ హౌస్ కేసులో మొదటి నుంచీ బీఆర్ఎస్ వ్యూహాలు పారడం లేదనే చెప్పాలి. చివరకు మీకు కేంద్ర దర్యాప్తు సంస్థలు ఉంటే.. మాకు రాష్ట్ర దర్యాప్తు సంస్థలు లేవా? అంటూ కేసీఆర్ కేంద్రానికి విసిరిన సవాల్ బూమరాంగ్ అయ్యిందనే చెప్పాలి. సీట్ దర్యాప్తును హైకోర్టు రద్దు చేసి సీబీఐకి దర్యాప్తు బాధ్యతలు అప్పగించడంతో.. రాష్ట్రంలో సీబీఐకి జనరల్ కన్సెంట్ లేకపోయినా, హై కోర్టు తీర్పుతో ఇప్పుడు సిబిఐ రాష్ట్రంలో ఎంటర్ అవుతోంది.
దీంతో ఫామ్ హౌస్ కేసు విషయంలో అనుకున్నదొకటి.. అయినది ఒకటి అన్నట్లుగా తయారైంది ఇప్పుడు బీఆర్ఎస్ పరిస్థితి. కేసీఆర్ అత్యుత్సాహం.. పార్టీ చేతిలోని ఆయుధాన్ని ప్రత్యర్థికి అప్పగించిందని బీఆర్ఎస్ వర్గాలే భావిస్తున్నాయి. ఎమ్మెల్యేల కొనుగోలు బేరసారాల కేసు విషయంలో కేసీఆర్ బీజేపీ ఆయువుపట్టు మీద దెబ్బకొట్టానని సంబరపడినంత సేపు పట్ట లేదు.. ఆ కేసు తిరిగి తిరిగి తమ పార్టీ ఎమ్మెల్యేల మెడకే చుట్టుకుంటోందని తెలియడానికి. ఎమ్మెల్యేల కొనుగోలు బేరసారాల కేసును సీబీఐకి ఇవ్వాలని హైకోర్టు నిర్ణయించడంతో బీఆర్ఎస్ గొంతులో పచ్చి వెలక్కాయ పడినట్లైంది.
ఫామ్ హౌస్ కేసులో సొమ్ములు కనిపించకపోయినా వ్యూహాత్మకంగా ఈడీ రంగప్రవేశం చేయడం, ఆ వెను వెంటనే హైకోర్టు తీర్పుతో సీబీఐ రంగంలోకి దిగుతుండటంతో ఈ కేసు త్వరలోనే ఒక లాజికల్ కంక్లూషన్ కు వస్తుందని న్యాయనిపుణులు అంటున్నారు. సీబీఐ, ఈడీల రంగ ప్రవేశంలో ఇక ఫామ్ హౌస్ కేసులో నిందితులుగా ఉన్న రామచంద్ర భారతి అలియాస్ సతీశ్ శర్మ, సింహ యాజులు, హైదరాబాద్‌కు చెందిన నందకుమార్‌లే కాక, ఫిర్యాదు చేసి నలుగురు ఎమ్మెల్యేలూ కూడా దర్యాప్తు సంస్థల విచారణను ఎదుర్కొనక తప్పని పరిస్థితి. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఫామ్ హౌస్ ట్రాప్ కేసులో కీలకంగా వ్యవహరించిన వ్యక్తి రోహిత్ రెడ్డి కంగారు పడుతున్నారు.
ఈడీ, సీబీఐలకు ఈ కేసు దర్యాప్తు చేసే అధికారమే లేదంటున్నారు. హైకోర్టు ఫామ్ హౌస్ ట్రాప్ కేసును సీబీఐకి అప్పగిస్తూ తీర్పు వెలువరించిన తరువాత మీడియా సమావేశం ఏర్పాటు చేసి మరీ రోహిత్ రెడ్డి తన స్పందన తెలిపారు. కేసును సీబీఐకి ఎలా అప్పగిస్తారన్నారు. ఇదంతా బీజేపీ కుట్ర అని నిందలేశారు. కోర్టు తీర్పు మేరకే కేసును సీబీఐ దర్యాప్తు చేయనుందన్న సంగతి విస్మరించి మరీ బీజేపీపై నిందలేశారు. అంతకు ముందు ఇదే కేసుకు సంబంధించి తనను ఈడీ విచారించిన తరువాత కూడా ఆయన ఇవే ఆరోపణలు చేశారు. ఇప్పుడు ఈడీ దర్యాప్తుపై స్టేకు హైకోర్టు నిరాకరించడంతో రోహిత్ రెడ్డి ఆరోపణలలో పస లేదని తేలిపోయింది.