ఏపీ తలరాత ఇంతే!

14వ ఆర్థిక సంఘం ప్రత్యేక కేటగిరీ హోదా రాష్ట్రాలు, సాధారణ కేటగిరీ రాష్ట్రాల మధ్య వివక్ష చూలేదు కనుకే అందుకే ప్రత్యేక కేటగిరీ హోదా స్థానంలో ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీని కేటాయించినట్టు కేంద్ర స్పష్టం చేయడం ఏపీకి ఏవిధంగా నైనా షాకింగ్ న్యూస్ కాదు.. గత కొన్నేళ్లుగా కేంద్ర చెబుతునన మాట ఇదే. మరో సారి  ఇదే విషయాన్ని రాజ్య సభలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యుడు  విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ తెలిపారు. కేంద్ర ఆదాయాన్ని రాష్ట్రాలతో పంచుకోవాలన్న ఫైనాన్స్ కమిషన్ సీఫారుసుల మేరకు 2015-20 మధ్య కాలంలో రాష్ట్రాల వాటా 32 శాతం నుంచి 42 శాతానికి పెరిగిందని మంత్రి సెలవిచ్చారు.  15 వ ఆర్థిక సంఘం 2020-26 కాలానికి ఎటువంటి ముఖ్యమైన మార్పులు చేయలేదని, జమ్మూకాశ్మీర్ కొత్త రాష్ట్రంగా ఆవిర్భవించడంతో కోటా స్వల్పంగా 42 శాతం నుంచి 41 శాతానికి తగ్గించిన విషయాన్ని మంత్రి  వివరించారు. ఉమ్మడి రాష్ట్రంగా ఏపీ ఉన్నప్పుడు.. ఏపీ లోని పారిశ్రామికవేత్తలు భారీగా హైదరాబాద్ లో పెట్టుబడులు పెట్టి, అనేక మంది జీవనోపాధిని కల్పించారు.  పెద్ద పరిశ్రమలతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చారు. 2014లో ఏపీ రెండుగా చీలిపన్నప్పుడు అభివృద్ధి చెందిన హైదరాబాద్  తెలంగాణలో ఉండిపోగా.. కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ అనాధలా మిగిలిపోయిందనే వాదన ఇప్పుడు కూడా వివనస్తూనే ఉంది.    విభజన సమయంలో హైదరాబాద్ ను ఆంధ్రప్రదేశ్ కోల్పోయినట్లుగా బిహార్, ఉత్తరప్రదేశ్, మధ్య ప్రదేశ్ లు విభజనల ద్వారా    తమ రాజధానులను కోల్పోలేదు. అయితే కేంద్రం మాత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన లోపభూయిష్టంగా జరిగిందని ఒక వైపు చెబుతూనే, ఆ లోపభూయిష్ట విభజన కారణంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ ను ఆదుకోవడానికి ఏ విధంగానూ ముందుకు రావడం లేదు. ఈ విషయంలోనే గత తెలుగుదేశం ప్రభుత్వం కేంద్రంలో విభేదించి ఎన్డీయే నుంచి బయటకు వచ్చింది. మెజారిటీ ఇవ్వండి ప్రత్యేక హోదా సాధించుకువస్తామంటూ వాగ్దానం చేసి అధికారంలోకి వచ్చిన వైసీపీ రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రంపై ఒత్తిడి తీసుకురావడం అటుంచి.. కేంద్రం తానా అంటే తందానా అంటోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రత్యేక హోదా విషయంలో కేంద్ర మంత్రి మరోసారి రాష్ట్ర సభలో కుదరదని స్పష్టం చేశారు. ఇక ఏపీ గతి ఇంతే అని ఆయన చెప్పకనే చెప్పేశారు. 

హైదరాబాద్ పై ఉగ్రపంజా?దసరా సందర్భంగా విధ్వంసానికి కుట్ర

దసరా పర్వదినాన హైదరాబాద్ లో పేలుళ్లకు కుట్ర పన్నిన కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) చార్జిషీట్ దాఖలు చేసింది. పేలుళ్ల ద్వారా మారణహోమం సృష్టించేందుకు లష్కరే తొయిబాకు చెందిన ముగ్గురు  ఉగ్రవాదులు కుట్ర పన్నారని అందులో పేర్కొంది.   భారీ పేలుడు పదార్ధాలతో పేలుళ్లకు ముష్కరులు పథకం రూపొందించారని ఎన్ఐఏ చార్జ్ షీట్ లో పేర్కొంది.  దేశంలో అత్యంత రద్దీగా ఉండే నగరమైన హైదరాబాద్ లో  పేలుళ్లకు కుట్ర కేసులో పట్టుబడిన ఉగ్రవాదులలో నగరానికి చెందిన మహ్మద్ అబ్దుల్ వాజిద్, సమీయుద్దీన్, హసన్ ఫరూక్ లు ఉన్నారు. వీరి నుంచి నగదు, హ్యండ్ గ్రెనేడ్ లను స్వాధీనం చేసుకున్నారు. వీరిలో ఇద్దరు పాకిస్థాన్ కు చెందిన ఎల్ ఇటీ ఉగ్రవాది ఫర్హతుల్లా ఘోరీ, అతని సహచరులు సిద్ధిక్ బిన్ ఉస్మాన్, అబ్దుల్ మజీద్ తో పాటు ఇతర లష్కరే తొయిబా ఉగ్రవాదులతో టచ్ లో ఉన్నారని ఎన్ఐఏ ఛార్జ్ షీట్ లో పేర్కొంది. రద్దీగా ఉండే ప్రాంతాలను ముష్కరులు టార్గెట్ చేసి పేళుళ్లక పాల్పడాలన్నది వీరి పథకంగా పేర్కొంది.  

అమృత్ పాల్ సింగ్ సరిహద్దు దాటేశాడా?

ఖలిస్తాన్ వేర్పాటువాద నేత అమృత్ పాల్ సింగ్ ను పట్టుకోవడంలో పోలీసులు ఘోరంగా విఫలమయ్యారు.   రోజుకో వేషంతో పంజాబ్ పోలీసులకు చుక్కలు చూపిస్తున్న అమృత్ పాల్ సింగ్ పూటకో వేషం మార్చి దేశంలోనే దర్జాగా తిరుగుతున్నాడన్న వార్తలు ఒకవైపు  దేశం విడిచి ఎప్పుడో పారిపోయాడన్న సమాచారం మరోవైపు జనాలను అయోమయానికి గురి చేస్తోంది. తాజాగా ఖలిస్థాన్ నేత అమృత్ పాల్ సింగ్ ఢిల్లీలోని ఓ మార్కెట్ లో సంచరిస్తున్నట్లుగా ఓ సీసీటీవీ ఫుటేజ్ బయటకు వచ్చింది. దాంతో అమృత్ పాల్ సింగ్ తన సహచరుడు పాపల్ ప్రీత్ సింగ్ తో కలిసి తలపాగా లేకుండా మాస్కు, నల్ల  కళ్ల అద్దాలు ధరించి దర్జాగా తిరుగుతున్నట్టుగా ఉంది. అయితే దానిని పోలీసులు ధృవీకరించలేదు. యథాప్రకారంగా అమృత్ పాల్ సింగ్ ను త్వరలో పట్టుకుంటాం అన్న అరిగిపోయిన రికార్డునే వినిపించారు.   అదలా ఉంటే.. అమృత్ పాల్ సింగ్ ను తప్పకుండా పట్టుకుంటామని పంజాబ్, హర్యానా హైకోర్టుకు పంజాబ్ ప్రభుత్వం మంగళవారం( మార్చి 28) తెలిపింది.   అయితే అమృత్ పాల్ సింగ్ పోలీసుల కస్టడీలోనే  ఉన్నాడని, ఆచూకీ చెప్పాలంటూ ఇమాన్ సింగ్ ఖారా అనే న్యాయవాది హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు.  ఇదిలా ఉంటే అమృత్ పాల్ సింగ్ దేశం విడిచి ఎప్పుడో పారిపోయాడనే వాదన కూడా గట్టిగా  వినిపిస్తోంది.  ప్రస్తుతం అతడు నేపాల్ లో ఉన్నాడంటున్నారు.   మరోవైపు పలు దేశాల్లో ఖలిస్థాన్ సానుభూతిపరులు భారత్ ఎంబసీల మీద దాడులకు దిగుతున్నారు. అమెరికా, యూకే, ఫిలిప్పీన్స్ లో ఖలిస్థాన్ మద్దతుదారులు  తన నిరసనలతో  ప్రపంచ దృష్టిని ఆకర్షించేందుకు తెగ ప్రయత్నాలు చేస్తున్నారు. 70,80వ దశకం తరువాత అణగారిపోయిందనుకున్న ఖలిస్తాన్ ఉద్యమం  మళ్లీ ఇన్నాళ్ల తరువాత మళ్లీ తెరపైకి రావడం నిస్సందేహంగా భారత్ కు ఇబ్బందికరమే.  దీనిని ఆదిలోనే నిరోధించకుంటే.. మరో బ్లూస్టార్ ఆపరేషన్ వంటిది అనివార్యమౌతుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

హైదరాబాద్ మెట్రో-2కు కేంద్రం మోకాలడ్డు

హైదరాబాద్ మెట్రో రైలు రెండో దశ ఆశలపై కేంద్రం నీళ్లు చల్లింది. రెండో దశ మెట్రో రైలు ప్రస్తుత తరుణంలో సాధ్యం కాదంటూ కేంద్ర ప్రభుత్వం చేతులెత్తేసింది.  దీనిపై మంత్రి కేటీఆర్   కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరీకి రాసిన లేఖలో  అనేక సార్లు కేంద్ర ప్రభుత్వ పట్టణ అభివృద్ధి శాఖకు మెట్రో రైలు రెండో దశకు అవసరమైన అన్ని రకాల సమాచారాన్ని అందించడంతో పాటు ప్రాజెక్ట్ సవివర నివేదిక సైతం పంపించామని పేర్కొన్నారు. మరోసారి కూడా సమగ్ర సమాచారాన్ని, పూర్తి వివరాలు, పత్రాలు, నివేదికలను కేంద్రానికి  పంపుతున్నట్లు  చెబుతూ,   అత్యంత రద్దీ కలిగిన నగరమైన హైదరాబాద్ కు మెట్రో రైలు ప్రాజెక్ట్ రెండో దశ కష్టమని కేంద్రంచెప్పడం సబబు కాదన్నారు. కేంద్రం పక్షపాత ధోరణితో మెట్రో రైలు ప్రాజెక్టులు ఇస్తోందని ఆ లేఖలో ఆరోపించారు. గాంధీనగర్, కొచ్చి, బెంగళూరు, చెన్నై వంటి నగరాలతో పాటు చాలా తక్కువ జనాభా ఉన్న లక్నో, ఆగ్రా,  వారణాసి, కాన్పూర్, ప్రయాగ్ రాజ్, మీరట్ వంటి   చిన్న పట్టణాలకు కూడా మెట్రో ప్రాజెక్టులను కేటాయించి వాటికి అన్ని అర్హతలూ ఉన్నాయని చెబుతూ,   హైదరాబాద్ కు మెట్రో రైలు విస్తరణ అర్హత లేదనడం దుర్మార్గమని కేటీఆర్ ఆ లేఖలో విమర్శించారు. హైదరాబాద్ లో ప్రయాణికుల సంఖ్య చాలా తక్కువ అని కేంద్రం చెప్పడం అర్థరహితమని విమర్శించారు.  తెలంగాణ నేడు శరవేగంతో అభివృద్ధి చెందుతున్న రాష్ట్రం. తెలంగాణకు అన్ని అర్హతలు, అనుకూలతలు ఉన్నా వివిధ రంగాలలోని ప్రాజెక్టులు, కేటాయింపుల విషయంలో కేంద్ర ప్రభుత్వం చూపుతున్న వివక్షను అనేక సార్లు కేంద్ర ప్రభుత్వ దృష్టికి సీఎం కేసీఆర్, తాను తీసుకెళ్లినట్టు మంత్రి కేటీఆర్ ఆ లేఖలో వివరించారు. సంబంధిత కేంద్ర మంత్రికి వ్యక్తిగతంగా కలిసి హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టు రెండో దశ ప్రాధాన్యాన్ని వివరించేందుకు అనేక సార్లు ప్రయత్నించినా ఆయన కార్యాలయం నుంచి ఎలాంటి స్పందన రాలేదన్నారు. ఇప్పటికైనా హైదరాబాద్ నగర మెట్రో రైలు ప్రాజెక్టుకు కేంద్ర ఆమోదముద్ర వేస్తుందని ఆశి స్తున్నట్లు కేటీఆర్ పేర్కొన్నారు.    

డిఫ్యాక్టో సీఎం సజ్జలకు కౌంట్ డౌన్ మొదలయ్యిందా?

సజ్జల రామకృష్ణా రెడ్డి స్వతాహాగా రాజకీయ నాయకుడు కాదు.ఆయన ఒక జర్నలిస్ట్. జర్నలిస్ట్ గా జీవితం ప్రారంభించిన ఆయన వ్యాపార వేత్తగా ఎదిగారు. ఆ పైన వ్యాపార భాగస్వామ్యాన్ని రాజకీయాలతో ముడివేసి రాజకీయ నాయకుడయ్యారు. అయితే  సజ్జల  జర్నలిస్ట్ జీవితాన్ని పక్కన పెడితే వ్యాపార, రాజకీయ ప్రయాణంలో ఆయన ప్రయాణమంతా  వైఎస్ కుటుంబంతో కలిసే సాగింది. ఇక రాజకీయ ప్రయాణం అయితే పూర్తిగా  జగన్ మోహన్ రెడ్డి తోనే   సాగి, సజ్జలయ ముఖ్యమంత్రికి ముఖ్య సలహాదారు స్థాయికి ఎదిగారు.   అంతవరకు అన్ని వ్యవహరాలలో నెంబర్ 2 గా ఉన్న విజయసాయిని   పక్కకు నెట్టి మరీ సజ్జల ఆ స్థానాన్ని దక్కించుకున్నారు.  . నిజానికి ఆయన పేరుకే ముఖ్యమంత్రి సలహాదారు కానీ, వాస్తవంలో ఆయన ఇంటర్నల్ స్టేటస్ ఇంకా చాలాచాలా ఎక్కువని, అంటారు. అలాగే, సర్వ శాఖల మంత్రిగా ప్రసిద్ది చెందిన సజ్జల  పార్టీ, ప్రభుత్వ రాజకీయాలపైనే కాకుండా  తాడేపల్లి ప్యాలెస్ రాజకీయాలపై కూడా పట్టు సాధించారనీ అందుకే, ఆయన ముఖ్యమంత్రి కార్యాలయంలో అత్యంత ‘ముఖ్య’ నేతగా చక్రం తిప్పుతుండడమే కాకుండా ఒక విధంగా డిఫ్యాక్టో ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నారని  ఆయన అంటే గిట్టని పార్టీ నేతలు అంటారు. అందుకే ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులు, పార్టీ కీలక నేతలతో సహా చాలా మంది నాయకులు ఆయన పట్ల చాలా గుర్రుగా ఉన్నారని చెబుతున్నారు.  అదలా ఉంటే ఇప్పుడు, ఎమ్మెల్సీ ఎన్నికల పరాభవం నేపథ్యంలో అధికార వైసీపీలో చోటు చేసుకుంటున్న పరిణామాల వెనక సజ్జల హస్తం ఉందనే  అభియోగం బలంగా వినిపిస్తోంది. ఒక విధంగా సజ్జల ముఖ్యమంత్రి కళ్ళకు గంతలు కట్టి, వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారని పార్టీ నేతలే అంతర్గత సంభాషణల్లో చెబుతున్నారు. వైసీపీ ప్రస్తుతం ఎదుర్కుంటున సంక్షోభానికి సజ్జలే కారణం అనే అభిప్రాయం పార్టీ వర్గాల్లోనే కాకుండా, తాడేపల్లి ప్యాలెస్ వర్గాల్లో   కూడా వినవస్తునట్లు చెబుతున్నారు.   ముఖ్యంగా ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ వోటింగ్ చేశారనే ఆరోపణపై సస్పెన్షన్ కు గురైన నలుగురు ఎమ్మెల్యేలు, సజ్జలనే దోషిగా నిలబెడుతున్నారు.  సీనియర్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి అన్నారం నారాయణ రెడ్డి అయితే తాము టీడీపీకి అమ్ముడు పోయామని సజ్జల చేసిన ఆరోపణపై సీరియస్ గా రియాక్ట్ అయ్యారు. సజ్జల ఎవరు? అయన చరిత్ర ఏమిటి? అని ప్రశ్నించారు. అంతే కాదు, సజ్జలను వదిలే ప్రసక్తిలేదని, సస్పెన్షన్  గురైన ఇతర ఎమ్మెల్యేలతో చర్చించి, సజ్జలపై పరవు నష్టం దావా వేస్తామని  అన్నారు. అలాగే, ఆయన సజ్జల టార్గెట్’ గా తీవ్ర ఆరోపణలు చేశారు.  అలాగే  సస్పెన్షన్ వేటుకు గురైన మహిళా ఎమ్మెల్యే శ్రీదేవి సజ్జల తనను హత్య చేయిస్తారన్న అనుమానం వ్యక్తం చేశారు. సజ్జల వల్ల ప్రాణహాని ఉందన్న భయంతోనే హైదరాబాద్ లో తల దాచుకుంటున్నానన్నారు.   నిజానికి, చాల కాలంగా సజ్జల వ్యవహారశైలిపై ముఖ్యమంత్రి జగన్ రెడ్డికి ఫిర్యాదులు అందుతూనే ఉన్నాయనీ, అయితే ఎందుకనో ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ఆ ఫిర్యాదులను అంతగా పట్టించుకోలేదని అంటారు.  ముఖ్యంగా జగన్ రెడ్డి కుటుంబ సభ్యులు రాజకీయంగా ఎదగకుండా చేయడంలో సజ్జల కీలక పాత్ర పోషించారనే అనుమానాలు వ్యక్త మవుతున్నాయి.  అదలా ఉంటే ఇంతకాలం సరైన  సమయం కోసం ఎదురు చూస్తున్న సజ్జల బాధితులంతా ఏకమయ్యేందుకు, తెర వెనక ప్రయత్నాలు మొదలయ్యాయని విశ్వసనీయంగా తెలుస్తోంది. ఈ ప్రయత్నాల వెనక, జగన్ రెడ్డి కుటుంబ సభ్యులతో పాటుగా, వైఎస్ రాజశేఖర రెడ్డి ఆత్మ మిత్రులు, వైఎస్ కు సన్నిహితంగా మెలిగిన మాజీ ఎంపీలు, మాజీ మంత్రులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది.  అదలా ఉంటే  జగన్ రెడ్డి కూడా కొంచెం ఆలస్యంగానే అయినా సజ్జల రాజకీయ ఎత్తులను పసిగట్టినట్లు తెలుస్తోంది. అందుకే, సజ్జల చెక్ పెట్టే ఆలోచన చేస్తున్నారని, ఆదిశగా పావులు కదులుతున్నాయని అంటున్నారు.

రాహుల్ అనర్హతపై స్పీకర్ పునరాలోచన?

కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ పార్లమెంట్ సభ్యత్వం రద్దు పై దేశ వ్యాప్తంగా చర్చ జరుగతున్న నేపధ్యంలో వెలుగులోకి వచ్చిన, లక్షద్వీప్‌ ఎన్సీపీ ఎంపీ మహ్మద్‌ ఫైజల్‌  అనర్హత వేటు  వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎన్‌సీపీ నేత మహమ్మద్‌ ఫైజల్‌ పై గతంలో వేసిన అనర్హత వేటును లోక్‌సభ సచివాలయం ఎత్తివేసింది. ఆయనపై  అనర్హతను ఉపసంహరించుకుంటున్నట్లు, ఆయన సభ్యత్వాన్ని పునరుద్ధరిస్తున్నట్లు లోక్‌సభ సెకట్రేరియట్  బుధవారం(మార్చి 29) నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఫైజల్‌ అనర్హత వ్యవహారంపై సుప్రీంకోర్టు లో విచారణ జరుగుతుండగానే.. ఈ నోటిఫికేషన్‌ రావడం గమనార్హం.  ఫైజల్‌ లోక్‌సభ సభ్యత్వం విషయంలో.. లోక్‌సభ సెక్రటేరియెట్‌ వెనక్కి తగ్గింది. సుప్రీం కోర్టులో  బుధవారం(మార్చి 29) వాదనలు జరగడానికి కొన్ని గంటల ముందే బిగ్‌ ట్విస్ట్‌ చోటు చేసుకుంది. ఫైజల్‌పై అనర్హత వేటు ఎత్తేస్తున్నట్లు లక్షద్వీప్‌ లోక్‌సభ సభ్యత్వాన్ని పునరుద్ధరిస్తున్నట్లు లోక్‌సభ సెక్రటేరియెట్‌ జనరల్‌  ఓ నోటిఫికేషన్‌ను రిలీజ్‌ చేసింది.  2016, జనవరి 5వ తేదీన ఫైజల్‌పై అండ్రోథ్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఓ హత్యాయత్నం కేసు నమోదైంది. ఆ కేసు కొనసాగుతుండగానే.. 2019లో ఆయన లోక్‌సభ ఎంపీగా నెగ్గారు. అయితే.. ఈ ఏడాది జనవరి 11వ తేదీన ఫైజల్‌తో పాటు మరో ముగ్గురికి పదేళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది కోర్టు. దీంతో జనవరి 13వ తేదీన లోక్‌సభ సచివాలయం ఫైజల్ సభ్యత్వాన్ని రద్దు చేస్తూ.. అనర్హత వేటు వేసింది. దీంతో ఆయన కోర్టుకు ఆశ్రయించగా.. నిర్దోషిగా తేలుస్తూ... కేరళ కోర్టు  సభ్యత్వాన్ని పునరుద్ధరించాలని ఆదేశించింది. కానీ, లోక్‌సభ సెక్రటేరియట్‌ అనర్హత వేటు విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దీంతో ఆయన సుప్రీం కోర్టును ఆశ్రయించారు. దీంతో బుధవారం ( మార్చి 29) ఫైజల్‌ పిటిషన్ పై సుప్రీంకోర్టు విచారణ జరగనున్న నేపథ్యంలో ఆయనపై అనర్హత వేటును ఎత్తివేసింది లోక్ సభ. ఇదిలా ఉంటే.. తాజాగా రాహుల్‌ గాంధీపై అనర్హత వేటు పడడంతో.. ఫైజల్‌ కేసులో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకున్నాయో, అవి రాహుల్‌ కేసులోనూ వర్తించే అవకాశాలున్నాయన్న చర్చ నడుస్తోంది. కాగా..  కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ లోక్‌సభ సభ్యత్వ అనర్హతపై దేశవ్యాప్తంగా దుమారం చెలరేగుతున్న సమయంలో ఈ పరిణామం చోటుచేసుకోవడం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. రాహుల్‌ గాంధీ కేసులో ఇది ప్రభావం చూపించనుందని భావిస్తున్నారు. అయితే, రాహుల్ గాంధీ అనర్హత విషయంలో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో విమర్శలు వినిపించడంతో పాటుగా, ఈ విషయంలో లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మానం పెట్టే యోచనలో విపక్షాలు ఉన్నట్టు వార్తలు వస్తున్న నేపధ్యంలో లోక్ సభ సెక్రటేరియట్ పునరాలోచనలో పడిందని అంటున్నారు. రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేయడాన్ని విపక్షాలన్నీ తప్పుపడున్న విష్యం తెలిసిందే. రెండు రోజుల క్రితం కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసంలో జరిగిన విపక్షాల సమావేశంలో రాహుల్ విషయంలో స్వీకర్ తొందరపడ్డారనే అభిప్రాయం  వ్యక్తమైందని చెబుతున్నారు.  2019 పరువు నష్టం కేసులో సూరత్ కోర్టు రాహుల్ గాంధీకి రెండేళ్లు జైలు శిక్ష విధించింది. ఆ వెంటనే పార్లమెంట్ సెక్రటేరియట్ ఆయనపై అనర్హత వేటు వేసింది. దీంతో ఓం బిర్లాపై విపక్షాలన్నీ అవిశ్వాస తీర్మానం పెట్టే యోచనలో ఉన్నట్లు వార్త లొచ్చాయి. ఖర్గే నివాసంలో జరిగిన ప్రతిపక్ష పార్టీల సమావేశానికి కొనసాగింపుగా   మంగళ వారం (మార్చి 28) జరిగిన కాంగ్రెస్ పార్టీ ఎంపీల సమావేశంలో స్పీకర్ పై  అవిశ్వాస తీర్మానం ప్రతిపాదన చేశారు. ఇదే అంశంపై ఇతర పార్టీల నేతలతో కాంగ్రెస్  చర్చించి ఏప్రిల్ 3న అవిశ్వాస తీర్మానాన్ని  ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపధ్యంలో లక్షదీప్ ఎన్సీపీ ఎంపీ మహమ్మద్‌ ఫైజల్‌ పై గతంలో వేసిన అనర్హత వేటును లోక్‌సభ సచివాలయం ఎత్తివేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.

తెలంగాణ మంత్రులకు నిరుద్యోగుల సెగ

ఇది ఒకరిదో ఇద్దరిదో   సమస్య కాదు, దాదాపు 30 లక్షల మంది నిరుద్యోగ విద్యార్ధులకు సంబందించిన సమస్య. ముప్పై లక్షల కుటుంబాల సమస్య. అయినా  టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ, పరీక్షల రద్దు  విషయంలో తెలంగాణ ప్రభుత్వం స్పందించవలసిన తీరున స్పందించలేదని విద్యార్ధులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆవేదన చెందుతున్నారు. ఏబీవీపీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు టీఎస్పీఎస్సీ ప్రశ్న పత్రాల లీకేజీని నిరసిస్తూ రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులు నిరసనలకు దిగారు. పలుచోట్ల మంత్రుల క్యాంప్ కార్యాలయాలను ముట్టడించారు. సిద్దిపేటలో మంత్రి హరీష్ రావు, సూర్యాపేటలో మంత్రి  జగదీశ్ రెడ్డి క్యాంపు  కార్యాలయాలతో మాటు పాటు  కరీంనగర్లో మంత్రి గంగుల ఇంటినీ ముట్టడించారు.  ఈ సందర్భంగా ప్రతిపక్ష పార్టీల నాయకులు తమపై చేసిన విమర్శలకు రూ.100 కోట్ల పరువు నష్టం దావా వేస్తానంటున్నమంత్రి కేటీఆర్  వీధిన పడిన తమ జీవితాలకు ఏమి సమాధానం చెపుతారని  నిరుద్యోగ యువకులు, విద్యార్ధులు ప్రశ్నిస్తున్నారు. ముఖ్యమంత్రి మొదలు మంత్రులు ఎవరూ పేపర్ లీకేజీపై ఎందుకు స్పందించరని నిలదీస్తున్నారు. ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో అనుమనితురాలిగా ఆరోపణలు ఎదుర్కుంటున్న ముఖ్యమంత్రి కుమార్తె,  బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఈడీ విచారణకు సందర్భంగా కట్టకట్టుకుని ఢిల్లీ వెళ్ళిన ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు విద్యార్ధుల వద్దకు ఎందుకు వెళ్లరని ప్రశ్నిస్తున్నారు.   అదలా ఉంటే సిద్దిపేటలోని మంత్రి హరీశ్ రావు క్యాంపు ఆఫీసును ఏబీవీపీ ముట్టడించింది. ఏబీవీపీ ఉమ్మడి మెదక్ జిల్లా విభాగ్ కన్వీనర్ శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ మంత్రి హరీశ్ రావు ఇంతవరకు లీకేజీ ఘటనపై స్పందించకపోవడం సిగ్గు చేటన్నారు. విద్యార్థి నాయకులను అక్రమంగా అరెస్టులు చేయిస్తున్న మంత్రులు..ఎందుకు టీఎస్పీఎస్ చైర్మన్ జనార్దన్ రెడ్డి, కార్యదర్శి అనితా రామచంద్రన్ ను విచారించట్లేదని మండిపడ్డారు.  టీఎస్పీఎస్సీ లీకేజీపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. మరోవంక సూర్యాపేట జిల్లా కేంద్రంలోని మంత్రి జగదీశ్ రెడ్డి క్యాంపు కార్యాలయాన్ని ఏబీవీవీ నాయకులు ముట్టడించేందకు యత్నించగా పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేసి పోలీసు స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా విద్యార్థి సంఘ నాయకులు మాట్లాడుతూ గ్రూప్స్ పేపర్ లీకేజీలపై  సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలన్నారు.  దాదాపు 30 లక్షల మంది విద్యార్థుల జీవితాలు రోడ్లపాలు చేసి వారి జీవితాలను అంధకారం లోకి నెట్టారన్నారు. బాధ్యులపై చర్యలు తీసుకోకపోతే ప్రగతి భవన్  ముట్టడించడానికి వెనకాడబోమని హెచ్చరించారు. ఏబీవీపీ ఆధ్వర్యంలో కరీంనగర్ లోని మంత్రి గంగుల కమలాకర్ ఇంటిని విద్యార్థులు ముట్టడించారు. లీకేజీ కి రాష్ట్ర ప్రభుత్వం నైతిక బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. టీఎస్పీఎస్సీ చైర్మన్ ను వెంటనే తొలగించి హైకోర్టు జడ్జితో లేదా సీబీఐతో విచారణ చేయించాలని డిమాండ్ చేశారు. సిట్ దర్యాప్తుపై తెలంగాణ యువతకు ఎలాంటి నమ్మకం లేదన్నారు. నిజానికి  గతంలో నయీం కేసు, డ్రగ్స్ కేసు లకు సంబందించి,  అలాగే భూ కుంభకోణాలకు సంబంధించి ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందాలు  కొండను తవ్వి  ఎలకను కూడా పట్టని నేపథ్యంలో 30 లక్షల మంది జీవితాలతో ముడిపడిన కేసును సిట్ పరిష్కరిస్తుందని తాము నమ్మడం లేదని విద్యార్థులు తేల్చి చెబుతున్నారు. 

తెలుగుదేశం కోసం నందమూరి ఫ్యామిలీ

తెలుగుదేశం పార్టీకి బాసటగా నిలిచేందుకు నందమూరి ఫ్యామిలీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నది. నందమూరి కుటుంబం నుంచి నుంచి నందమూరి రామకృష్ణ, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, నందమూరి హరికృష్ణ కుమార్తె సుహాసినితోపాటు నందమూరి చైతన్య కృష్ణ.. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కోసం ప్రచార రంగంలోకి దిగే అవకాశాలు ఉన్నాయని పొలిటికల్ సర్కిల్స్ లో బాగా ట్రెండ్ అవుతోంది. అయితే నందమూరి ఫ్యామిలీ ఇలా ఎంట్రీ ఇవ్వడం ద్వారా పార్టీకి అదనపు బలం చేకూర్చినట్లు అవుతోందనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది.  మరోవైపు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అయితేనేమీ... ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో అయితేనేమీ తెలుగుదేశం  అభ్యర్థులు ఘన విజయం సాధించారు. అలాగే ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా అధికార పార్టీ అభ్యర్థులకు టీడీపీ అభ్యర్థుల నుంచి గట్టి పోటీ ఎదురై... చావు తప్పి కన్ను లొట్టపోయిన చందంగా వైసీపీ విజయం సాధించగలిగామని వైసీపీలోనే చర్చ జోరుగా సాగుతోంది.   ఈ మొత్తం ఎపిసోడ్‌లో జగన్ ప్రభుత్వంపై గ్రాడ్యుయేట్లలోనే కాదు.. వైసీపీలోని  ఎమ్మెల్యేల్లో సైతం తీవ్ర వ్యతిరేకత ఉందని క్లియర్ కట్‌గా స్పష్టమైందనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది.   మరో వైపు  జగన్ ప్రభుత్వ వ్యవహార శైలిపై ఓ వైపు టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి, బాదుడే బాదుడు తదితర కార్యక్రమాల ద్వారా ప్రజల్లోకి బలంగా వెళ్తుండగా.. మరోవైపు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్.. యువగళం పేరుతో పాదయాత్ర చేస్తూ.. నిత్యం ప్రజల మధ్యే ఉంటూ.. ముఖ్యమంత్రి వైయస్ జగన్  తీరును జనం మధ్యే ఎండగడుతోన్నారు.  అదీకాక.. ఎన్నికలకు ఇంకా దాదాపు ఏడాది ఉంది. ఈ నేపథ్యంలో ఇలాంటి సమయంలోనే నందమూరి ఫ్యామిలీ  రంగంలోకి దిగి.. జగన్ గద్దెనెక్కిన తర్వాత రాష్ట్రంలో చోటు చేసుకొన్న వరుస పరిణామాలను.. ప్రజల మధ్యకు వెళ్లి వివరించడం.. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే.. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధి పనులు.. తీసుకు వచ్చిన సంక్షేమ పథకాలు.. అలాగే వైయస్ జగన్ గద్దెనెక్కిన తర్వాత జరిగిన అభివృద్ధి పనులను బేరీజు వేసి  వివరించగలిగితే.. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం ప్రభంజనం ఖాయమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అలాగే నందమూరి కుటుంబ సభ్యులు కూడా.. ఎన్నికల ప్రచారంలో పాల్గొనడమే కాకుండా.. రాష్ట్రంలోని ఓ బలమైన నియోజకవర్గాన్ని ఎంపిక చేసుకొని.. ఇంకా వివరంగా చెప్పాలంటే.. గుడివాడ, గన్నవరం లాంటి నియోజకవర్గాల్లో అభ్యర్థులుగా నిలబడితే.. వచ్చే ఎన్నికల్లో వైసీపీకి కాదు తెలుగుదేశం పార్టీకి వైనాట్ 175 అనుకునే పరిస్థితి వస్తుందని పరిశీలకులు చెబుతున్నారు.  మరోవైపు వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో ఏదో ఒక అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానని నందమూరి తారకరత్న స్వయంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఆయన లక్ష్యాన్ని ముందుకు తీసుకు వెళ్లే క్రమంలో నందమూరి ఫ్యామిలీ రంగంలోకి దిగాల్సిన అవశ్యకత మాత్రం  ఉందనే ఓ అభిప్రాయం పోలిటికల్ సర్కిల్‌లో వ్యక్తమవుతోంది.

పార్లమెంటులో తెలుగుదేశం ఆవిర్భావ వేడుకకు నడ్డా

పార్లమెంటు ఆవరణలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరిగాయి.  పార్లమెంటులో ఎన్టీ ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసిన  టిడిపి ఎంపీలు గల్లా జయదేవ్, కేశినేని నాని, కనకమేడల కేక్ కట్ చేసి పార్టీ ఆవిర్భావ  వేడుకలు నిర్వహించారు. అనూహ్యంగా ఈ కార్యక్రమానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీనడ్డా హాజరయ్యారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆయన తెలుగుదేశం ఎంపీలకు అభినందనలు తెలియజేశారు.  వాజ్ పేయి హయాంలో టిడిపి,  బిజెపి అనుబంధాన్ని తెలుగుదేశం ఎంపీలు నడ్డాకు వివరించారు.  బీజేపీ, తెలుగుదేశం   స్నేహ సంబంధాల గురించి తనకు తెలుసునని నడ్డా ఈ సందర్భంగా అన్నారు. ఇటీవల అండమాన్ మేయర్ ఎన్నికల్లో టిడిపి బిజెపి పొత్తుపై నడ్డా ప్రస్తావించారు.  

కొత్త సిట్ చేతికి వివేకా కేసు. ఏప్రిల్ 30లోగా తేల్చాలన్న సుప్రీమ్

వైఎస్ వివేకా హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది.  ఇప్పటి వరకు కేసు  దర్యాప్తు చేస్తున్న బృందాన్ని సీబీఐ మార్చేసింది.  కొత్త బృందాన్ని నియమించింది.  కొత్త బృందం   వేకానందరెడ్డి హత్య కేసును ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్న సీబీఐ అధికారి రాంసింగ్‌ను సుప్రీం కోర్టు తొలగించింది. దర్యాప్తు కోసం కొత్త టీమ్‌ను నియమించి ఏప్రిల్ 30 లోగా కేసు దర్యాప్తును ముగించాలని సుప్రీం కోర్టు గడువు విధించింది. ప్రత్యేక అధికారులుగా సీబీఐ డీఐజీ చౌరాసియా నేతృత్వంలో  ఎస్పీ వికాస్ సింగ్, ఏఎస్పీ ముఖేష్ కుమార్, సీఐ  నవీన్ పునియా, ఎస్సై అంకిత్ యాదవ్ ను నియమించింది. వివేక హత్య కేసు దర్యాప్తు పూర్తి చేయడానికి సీబీఐకి సుప్రీం కోర్టు నెల రోజులు గడువు ఇచ్చింది. ఏప్రిల్‌ 30 లోపు దర్యాప్తు పూర్తి చేయాలని ఆదేశించింది. వివేక హత్య కేసులో ఐదో నిందితుడిగా ఉన్న శంకర్ రెడ్డి భార్య తులసమ్మ వేసిన పిటిషన్‌ను విచారించిన ధర్మాసనం... ఈ మేరకు కీలక ఆదేశాలు ఇచ్చింది.   రెండు రోజుల క్రితం ఈ కేసులోనే సీబీఐపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.  సీల్డ్ కవర్‌లో సమర్పించిన వివరాలను పరిశీలించి కేసు పురోగతిపై అసంతృప్తి వ్యక్తం చేసిన సంగతి విదితమే. 

మే 10 కర్నాటక అసెంబ్లీ ఎన్నికలు.. 13న ఫలితాల విడుదల

కర్నాటక అసెంబ్లీ  ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. మే 10న  కర్నాటక అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ జరుగుతుంది. అదే నెల 13న ఓట్ల లెక్కించి ఫలితాలు విడుదల చేస్తారు.   కేంద్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి  రాజీవ్ కుమార్ ఢిల్లీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఈ షెడ్యూల్ ను విడుదల చేశారు.  కర్నాటకలో ఈ సారి ఒకే విడతలో ఎన్నికలు నిర్వహించనున్నారు.  ఇక కర్నాటక అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే నెల  13న ఎన్నికల విడుదల కానుంది. అనంతరం నామినేషన్ల స్వీకరణ, పరిశీలన, ఉపసంహరణ ఉంటుంది.  కర్నాటకలో మొత్తం 5.21 కోట్ల మంది ఓటర్లుకు కుమార్ తెలిపారు.  58,282 పోలింగ్ స్టేషన్లు ఏర్పాట్లు చేస్తున్నట్లు సీఈసీ  వెల్లడించారు. వీటిలో మహిళలకు ప్రత్యేకంగా  1320 పోలింగ్ స్టేషన్లు  కేటాయించామన్నారు.   దేశ ఎన్నికల చరిత్రలో తొలి సారిగా కర్నాటక అసెంబ్లీ ఎన్నికలలో 80 ఏళ్ల వయసు దాటిన వారికి, దివ్యాంగులకు  ఇంటి నుంచే ఓటు వేసే అవకాశం కల్పిస్తున్నట్లు సీఈసీ తెలిపారు.   

విపక్షాల ఐక్యత సాధ్యమేనా?

విషయం ఏదైనా, వివాదం ఏదైనా  దేశంలో ప్రతిపక్ష పార్టీలు అన్నీ ఒకే ఎజెండాతో ముందుకు సాగుతున్నాయి. ఇదే ఆఖరి అవకాశం.. ఇప్పడు కాకపోతే, ఇంకెప్పుడూ కాదు.. సమీప భవిష్యత్ లో బీజేపీని దెబ్బతీయడం అయ్యేపని కాదు అని కృత నిశ్చయానికి వచ్చేశాయి. అందుకే ఎలగైనా 2024 ఎన్నికల్లో  మోదీ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు కలిసి కదులుదామని అన్ని పార్టీల నాయకులు, ఎవరి స్థాయిలో వారు ప్రయత్నిస్తున్నారు.  కొద్ది రోజుల కిందట అంటే  మార్చి 17న  సమాజ్ వాదీ పార్టీ (ఎస్పీ) అధినేత, ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్  పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి,తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీతో  భేటీ అయ్యారు.  రెండు గంటలకు పైగానే ఈ ఇరువురూ సమావేశమయ్యారు. అయితే అఖిలేష్, మమతా బెనర్జీతో ఎందుకు సమావేశమయ్యారు, అంతసేపు ఆ ఇద్దరు ఏం చర్చించారు అన్నది పక్కన పెడితే.. వాస్తవానికి ఆ ఇద్దరే కాదు.. ఏ ఇద్దరు ప్రతిపక్ష నాయకులు ఎప్పుడు, ఎక్కడ కలిసినా ఒకటే విషయం చర్చకు వస్తున్నది.    2024 ఎన్నికల్లో బీజేపీ ని ఓడించడం ఎలా? మోదీని గద్దె దించడం ఎలా? అన్నదే ఆ చర్చ. ఈ నేపథ్యంలోనే ప్రధాన ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ మొదలు ఒకటి రెండు ఎంపీ సీట్లకు పరిమితమైన సిపిఐ, సిపిఎం వంటి  జాతీయ పార్టీల వరకూ,  జాతీయ రాజకీయాల్లో జెండా ఎగరేసేందుకు ఆకాశానికి నిచ్చెనలు వేస్తున్నతృణమూల్, బీఆర్ఎస్ వంటి ప్రాంతీయ,ఉప ప్రాంతీయ పార్టీల వరకూ ఏ రెండు పార్టీలు. ఏ  ఇద్దరు నాయకులు కలిసినా బీజేపీని ఓడించడం ఎలా, మోడీని గద్దె దించడం ఎలా? అనే ఏక సూత్ర ప్రణాళిక పైనే చర్చిస్తున్నారు.  వాస్తవానికి 2019 ఎన్నికలలో బీజేపీ వరసగా రెండవసారి  ముందుకు మించిన సొంత బలం (303) తో అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ ప్రతిపక్ష పార్టీలలో  గుబులు మొదలైంది. 2024 పరిస్థితి ఏమిటి? అనే ప్రశ్న వెంటాడి వేధిస్తోంది. ముచ్చటగా మూడవ సారి బీజేపీ గెలిస్తే  మోడీ మళ్ళీ ప్రధాని అయితే, తమ పరిస్థితి ఏమిటనే భయం మొదలైంది.  అందుకే  అప్పటి నుంచే బీజేపీని ఓడించడం ఎలా? మోడీని గద్దె దించడం ఎలా? అనే రెండు అంశాల చుట్టూనే ప్రతిపక్ష పార్టీల ఆలోచనలు గింగిరాలు తిరుగుతున్నాయి. అందరూ అదే మాట్లాడుతున్నారు. అన్నీ పార్టీలూ అందుకే ప్రణాళికలు రచిస్తున్నాయి. అయితే ఒకరి ఆలోచనకు, ఇంకొకరి ఆలోచనకు, ఒకరి మాటకు ఇంకొకరి మాటకు పొంతన ఉండడంలేదు, పోలిక కుదరడం లేదు. అందుకే  ప్రతిపక్షాల  ఐక్యత   ఇప్పటి వరకూ ఎండమావిలా మిగిలి పోయిందని పరిశీలకులు  అంటున్నారు.  కోల్‌కతాలో మమతా బెనర్జీ, అఖిలేష యాదవ్ కూడా  అదే విషయం చర్చించారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడిన అఖిలేష్ యాదవ్  అదే విషయం స్పష్టం చేశారు.  మీరు ఫ్రంట్ అంటారా, పొత్తంటారా ఘటబంధన్  అంటారా అది మీ ఇష్టం.. కానీ, కాంగ్రెసేతర ప్రతిపక్ష పార్టీల కొత్త కూటమి త్వరలో ఏర్పడబోతోంది  అని ప్రకటించారు. అదే విషయం మమతా దీదీతో చర్చించానని చెప్పారు. అదే సమయంలో కాంగ్రెస్  పార్టీ  ప్రాంతీయ పార్టీల వ్యవహారాల్లో జోక్యం చేసుకోకుండా ఎక్కడుండాలో అక్కడుంటే  మంచిదని హస్తం పార్టీకి ఓ చురక కూడా అంటించారు. అలాగే తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ సుదీప్ భట్టాచార్య, మరో అడుగు ముందుకేసి, కాంగ్రెస్ పార్టీ  ప్రతిపక్ష పార్టీల  పెద్దన్న పాత్ర పోషించాలనుకుంటే కుదరదని  కురువృద్ద కాంగ్రెస్ పార్టీ ఆ భావన నుంచి బయటకు రావాలని, ‘మా తాతలు నేతులు తాగారు’ అంటే కుదరదని కుండబద్దలు కొట్టారు.  ప్రస్తుతం కాంగ్రస్ పార్టీ ఒక పెద్ద ప్రాంతీయ పార్టీ గా మాత్రమే మిగిలిందనే నిజాన్ని మరిచి పోరాదని గుర్తు చేశారు.  తృణమూల్  ఇటు కాంగ్రెస్ అటు బీజేపీ పార్టీలకు సమ దూరం పాటిస్తుందనీ అన్నారు. అయితే అదే సమయంలో ఆయన, తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ, త్వరలో కాంగ్రెస్, బీజేపీయేతర పార్టీల నాయకులను కలుస్తారని అంటున్నారు. ఎందుకు, ఏమిటీ అనే వివరణ లేదు. అందుకే రాజకీయ విశ్లేషకులు, మమతా బెనర్జీ, అఖిలేష్ యాదవ్ కోల్ కతా వేదికగా జరిపిన తాజా చర్చలు  ప్రతిపక్ష పార్టీల అయోమయ స్థితికి, అధ్వాన పరిస్థితికి అద్దం పడుతున్నాయని అంటున్నారు.   2019 నుంచీ బీజేపీ ప్రత్యర్ధి పార్టీల ఐక్యత కోసం జాతీయ,అంతర్జాతీయ స్థాయిలో కూడా ప్రయత్నాలు సాగుతున్నాయి. అయితే ఈ ప్రయత్నాలు ఒకడుగు ముందుకు నాలుగడుగులు వెనక్కి అన్నట్లు సాగుతున్నాయి. 2024 వరకూ కూడా ఇదే పరిస్థితి కొనసాగినా ఆశ్చర్య పోనవసరం లేదని పరిశీలకులు అంటున్నారు.

అయినా.. రాహుల్ మారలేదు !

కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు  రాహుల్ గాంధీ అనర్హత అంశంపై దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఆందోళనలను కొనసాగిస్తోంది. ప్రతిపక్ష పార్టీలు చాలా వరకు రాహుల్ గాంధీ భుజం మీద తుపాకి పెట్టి  ప్రధాని మోడీపై తూటాలు పేలుస్తున్నాయి. ఒక విధంగా చూస్తే, పార్లమెంట్ లో అదానీ మాయాజాలం గురించి రాజకీయ రచ్చ జరుగతున్న సమయంలో ముఖ్యంగా  రాహుల్ గాంధీ  ప్రధాని మోడీ, ఆదానీల సంబంధాలను ప్రశ్నిస్తూ తీవ్ర ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో, రాహుల్ గాంధీని అనర్హునిగా  ప్రకటించడం  బీజేపీ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పడేసింది. మోడీని నిజాయతీకి నిలువెత్తు రూపంగా భావించేవారు కూడా, దాల్ మే కుచ్ కాలా హై..  లేకుంటే పార్లమెంట్ లో రాహుల్ లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానం చెప్పవలసింది పోయి ఆయననే అనర్హునిగా ప్రకటించడం ఏమిటని అడుగుతున్నారు.  అయితే  అదే సమయంలో స్వాతంత్ర సమరయోధుడు వీరా సావర్కర్ ను అవమానపరిచే విధంగా రాహుల్ చేసిన వ్యాఖ్యలు ప్రతిపక్ష శిబిరంలో పెను దుమారమే రేపాయి.  నేను సవార్కర్ ను కాదు.  గాంధీని ..క్షమాపణ చెప్పను  అంటూ చేసిన వివాదాస్పద వ్యాఖ్య కాంగ్రెస్ మిత్ర పక్షాలకే కాదు కాంగ్రెస్ నాయకులకు ముఖ్యంగా మహారాష్ట్ర కాంగ్రెస్ నాయకులకు రుచించడం లేదు. కాంగ్రెస్ మిత్ర పక్షం శివసేన (ఉద్దవ్ థాకరే) రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై ఫైరైంది. అంతేకాదు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఏర్పాటు చేసిన విందు సమావేశానికి ఉద్దవ్ థాకరే హాజరు కాలేదు. మరో వంక ఎన్సీపీ అధినేత శరద్ పవార్ సావర్కర్ విషయంలో ఎక్కువ చేస్తే మనకే ప్రమాదం.సావర్కర్ కు ఆర్ఎస్ఎస్ కు సంబంధం లేదు. రాహుల్ గాంధీ సవార్కర్ విషయంలో సంయమనంతో మాట్లాడి ఉంటే బాగుండేది అని కాంగ్రెస్ పార్టీకి  పరోక్షంగా చురకలు అంటించారు.  ఈ అన్నిటినీ మించి సావర్కార్ మనవడు రంజిత్ సవార్కర్  తనతాత (వీర సావర్కర్) బ్రిటిష్ వారికి ఎప్పుడు క్షమాపణలు చెప్పారో సాక్షాధారాలతో నిరూపించాలని లేదంటే  పరువు నష్టం దవాకు సిద్దం కావాలని హెచ్చరించారు.  దీంతో  ఖర్గే నివాసంలో జరిగిన విపక్ష పార్టీల సమావేశంలోనూ రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై  కాంగ్రేస్సేతర పార్టీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలిసింది. రాహుల్ గాంధీ అపరిపక్వ వ్యాఖ్యలతో  ప్రతిపక్ష పార్టీలు ఐక్యత ప్రశ్నార్ధకం అవుతోందని  కాంగ్రెస్సేతర పార్టీల ముఖ్యనేతలు ఖర్గే , సోనియా గాంధీ దృష్టికి తీసుకువేల్లినట్లు తెలిసింది. 2019 ఎన్నికల సమయంలో రఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు విషయంలో ప్రధాని మోడీ టార్గెట్ గా రాహుల్ గాంధీ  కోర్టు చేయని వ్యాఖ్యలను చేసినట్లుగా పేర్కొంటూ ‘చౌకీదార్ చోర్’ నినాదాన్ని కాయిన్  చేశారు. ఆ ఒక్క  ‘నినాదం చుట్టూనే ప్రచారం సాగించారు. అ ప్రచారమే కాంగ్రెస్ పార్టీతో పాటుగా మిత్ర పక్షాలను దెబ్బతీసిందని, బీహార్ కు చెందిన ముఖ్యనేత ఒకరు ఖర్గే దృష్టి తెచ్చారని తెలిసింది. అలాగే రాహుల్ గాంధీ తమ ధోరణి మార్చుకోని పక్షంలో తమదారి తాము చూసుకోవలసి వస్తుందని హెచ్చరించారని విశ్వసనీయ సమాచారంగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఈ నేపధ్యంలో ఖర్గే విందు సమావేశానికి హాజరైన 17 పార్టీలు సున్నిత విషయాలపై  అర్థరహిత వ్యాఖ్యలు చేయరాదని  ఒక వేళ పొరపాటున నోరు జారితే, వెంటనే బేషరతుగా క్షమాపణ చెప్పాలని నిర్ణయించినట్లు  తెలుస్తోంది. అయితే, రాహుల్ గాంధీని నియంత్రిచడం సోనియా, ఖర్గేలతో అవుతుందా? అనేది ఇప్పడు విపక్షాల  ముందున్న వెయ్యి డాలర్ల  ప్రశ్నగా విశ్లేషకులు పేర్కొంటున్నారు. 

అవినాష్ ’ముందస్తు‘ వెనుకడుగు..!

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి యాంటిసిపేటరీ బెయిలు కోసం తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. ఆ వెంటనే  ఉపసంహరించుకున్నారు.   గతంలో ఇదే కేసులో తనపై కఠిన చర్యలు తీసుకోకుండా సీబీఐకి ఆదేశాలు ఇవ్వాలనిఅవినాష్ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిన సంగతి విదితమే. అయితే  ఆ పిటిషన్ ను పిటిషన్ ను విచారించిన హైకోర్టు .. ఆ విధంగా సీబీఐను ఆదేశించజాలమని స్పష్టం చేసింది.  ఈ నేపథ్యంలోనే ఆయన మంగళవారం (మార్చి 28) ఉదయం తెలంగాణ హైకోర్టులో ముందస్తు బెయిలు కోసం పిటిషన్ దాఖలు చేశారు. దీంతో  వివేకా హత్య కేసులో తన  అరెస్టు అనివార్యమని ఫిక్సైపోయారా? అందుకే తెలంగాణ హైకోర్టులో ముందస్తు బెయిలు కోసం పిటిషన్ దాఖలు చేశారా అన్న చర్చ జోరుగా సాగింది. అంతలోనే సాయంత్రానికి ఆయన తన పిటిషన్ ను ఉపసంహరించుకోవడంతో గంటల వ్యవధిలోనే ఆయన తన నిర్ణయం మార్చుకోవడానికి వెనుక ఏం జరిగిందన్న చర్చ మొదలైంది. ఏపీ ముఖ్యమంత్రి జగన్ హడావుడిగా హస్తిన పర్యటన పెట్టుకోవడానికీ, అవినాష్ ముందస్తు బెయిలు పిటిషన్ ఉపసంహరించుకోవడానికీ ఏమైనా లింకుందా అన్న అనుమానాలు రాజకీయ వర్గాలలో వ్యక్తమౌతున్నాయి.  

తెలుగుదేశం తెలుగువారి ఆత్మగౌరవ నినాదం!

తెలుగువారి ఆత్మగౌరవాన్ని నిలబెట్టడమే లక్ష్యంగా నందమూరి తారకరామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించి నేటికి (మార్చి 29) సరిగ్గా 41 ఏళ్లు.   తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ  అధినేత చంద్రబాబునాయుడు  పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులకు శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే తెలుగువారి ఆత్మగౌరవ నినాదంతో పుట్టి, తెలుగు ప్రజల జీవితాల్లో వెలుగులు నింపిన తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలుగు జాతికి శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు. ఎన్టీఆర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ పునరంకితమవ్వాలని పిలుపునిచ్చారు.  అదే విధంగా తెలుగుదేశం పార్టీ కూడా తన అధికారిక ట్విట్లర్ ద్వారా తెలుగు ప్రజలకు శుభాకాంక్షలు తెలిపింది.  ప్రతీ అడుగూ ప్రజల కోసం.. ఈ 41 సంవత్సరాల ప్రస్థానం.. ప్రగతి కోసం మన తెలుగుదేశం.. ఇది తెలుగు వారి ఆత్మగౌరవం.. తెలుగు ప్రజలందరికీ టీడీపీ 41వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కృతజ్ఞతాభివందనాలు అని పేర్కొంది. తెలుగుదేశం జెండా మోసిన ప్రతి కార్యకర్తకు, పార్టీ కోసం ప్రాణ త్యాగాలు చేసిన కార్యకర్తల, నాయకుల కుటుంబాలకు పాదాభివందనాలు.. సమాజమే దేవాలయం.. ప్రజలే దేవుళ్ళు అంటూ ట్వీట్ చేసింది. ఇలా ఉండగా తెలుగుదేశం ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నాంపల్లిలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ సభకు ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా అండమాన్ నుంచి కూడా పార్టీ ప్రతినిథులు హాజరౌతారు. మొత్తం 15 వేల మంది ఈ సభకు హాజరౌతారని చెబుతున్నారు. సభకు వచ్చే ప్రతినిథుల కోసం భారీ ఏర్పాట్లు చేశారు. మరో వైపు మంగళవారం (మార్చి 28)న జరిగిన తెలుగుదేశం పొలిట్ బ్యూరో సమావేశం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఎన్టీఆర్ శత జయంతి సందర్భంగా ఉభయ తెలుగు రాష్ట్రాలలో మొత్తం వంద సభలు నిర్వహించనుంది. బుధవారం (మార్చి 30) నుంచి ఈ సభలను ప్రారంభించి ఎన్టీఆర్ జయంతి అయిన మే 28 నాటిని పూర్తి చేయాలని డిసైడ్ చేసింది.  ఈ సభల నిర్వహణ కోసం ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేసింది.   హైదరాబాద్‌లోని ఎన్టీఆర్‌ భవన్‌లో పార్టీ అధినేత  చంద్రబాబు అధ్యక్షతన మంగళవారం (మార్చి28) పొలిట్‌బ్యూరో సమావేశంలో 17 అంశాలపై చర్చించారు. వీటిలో 13 ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించినవి కాగా , తెలంగాణకు సంబంధించిన అంశాలు నాలుగు ఉన్నాయి.  ఎన్టీఆర్‌ జయంతి సందర్భంగా నిర్వహించే మహానాడుని ఈసారి రాజమహేంద్రవరంలో మే 28,29 తేదీల్లో  నిర్వహించాలని పొలిట్ బ్యూరో నిర్ణయించింది.  అలాగే  ఆర్థిక తారతమ్యం లేకుండా ఆదాయాన్ని అందరికీ పంచే విధంగా ఎన్నికల మ్యానిఫెస్టో రూపకల్పన చేసేందుకు ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేయాలని పొలిట్ బ్యూరో తీర్మానించింది.  ఇక ఇదేం ఖర్మ రాష్ట్రానికి కార్యక్రమాన్ని ఏప్రిల్‌ ఆఖరి వరకూ నిర్వహించాలని నిర్ణయించింది.   ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సంసిద్దంగా ఉండాలని పార్టీ క్యాడర్‌, లీడర్‌లకు దిశానిర్దేశం చేసింది. పార్టీ సభ్యత్వంలో జీవితకాల (లైఫ్‌ టైమ్‌) సభ్యులను చేర్చాలని నిర్ణయం తీసుకుంది.  ఈసమావేశంలో ఏపీ, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కె.అచ్చెన్నాయుడు, కాసాని జ్ఞానేశ్వర్‌ ముదిరాజ్‌, రెండు రాష్ట్రాలకు చెందిన పొలిట్‌బ్యూరో సభ్యులు పాల్గొన్నారు. 

సుప్రీంలో జగన్ సర్కార్ కు బిగ్ షాక్.. హైకోర్టు తీర్పుపై స్టేకు నో

జగన్ సర్కార్ కు సుప్రీం కోర్టులో గట్టి ఎదురు దెబ్బ తగిలింది. విభజన చట్టం ప్రకారం రాష్ట్ర రాజధానిపై చట్టం చేసే అధికారం ప్రస్తుత ఏపీ శాసనసభకు లేదంటూ ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు గత ఏడాది మార్చిలో ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్లపై స్టే ఇచ్చేందుకు సుప్రీం కోర్టు నిరాకరించింది.  విచారణ జులై 11కి వాయిదా పడింది. హై కోర్టు తీర్పు  కారణంగా రాష్ట్ర ప్రభుత్వం రాజధానులపై నిర్ణయం తీసుకోలేకుండా చేతులు కట్టేసినట్లయిందని, స్టే ఇవ్వాలని ప్రభుత్వం తరఫు న్యాయవాదులు చేసిన విజ్ఞప్తిని జస్టిస్‌ కేఎం జోసెఫ్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు  ధర్మాసనం తోసిపుచ్చింది.  అంతకు ముందు ధర్మాసనం ఇతర కేసులపై విచారణ జరుపుతున్న సమయంలో  ఏపీ ప్రభుత్వం తరఫున సీనియర్‌ న్యాయవాది నిరంజన్‌రెడ్డితో కలిసి మరో సీనియర్‌ న్యాయవాది  ధర్మాసనం ముందుకొచ్చి అమరావతి కేసు గురించి ప్రస్తావించారు. తాము ఇతర కేసులను వింటున్నామని జస్టిస్‌ జోసెఫ్‌ గుర్తుచేశారు. ఆ విషయాన్ని దృష్టిలో ఉంచుకొనే తాము అమరావతి కేసుకు తదుపరి విచారణ తేదీని కోరుతున్నామని  విన్నవించారు. దానిపై జస్టిస్‌ జోసెఫ్‌   అసహనం వ్యక్తంచేశారు.  కాగా సుప్రీం కోర్టు  అమరావతి కేసుల విచారణను జూలై 11కి వాయిదా వేయడంతో జగన్ అమరావతి నుంచి విశాఖకు తరలివెళ్లాలన్న ప్రణాళికలకు అడ్డుకట్ట పడినట్లైంది. ఈ కేసు విచారణ తొందరగా పూర్తై తమకు అనుకూలంగా తీర్పు వస్తే వెంటనే అమరావతి నుంచి రాజధానిని విశాఖకు తరలించేయాలని జగన్ సర్కార్ భావిస్తోంది. అందుకే హైకోర్టు తీర్పును సుప్రీంలో సవాల్ చేసింది. సాథ్యమైనంత త్వరగా ఈ కేసు విచారణ పూర్తి చేయాలని, లేదా కనీసం హైకోర్టు తీర్పుపై స్టే ఇవ్వాలని జగన్ సర్కార్ సర్వోన్నత న్యాయస్థానాన్ని కోరింది. హై కోర్టు తీర్పు ఇచ్చిన తరువాత తాపీగా ఆరు నెలల తరువాత గత ఏడాది సెప్టెంబర్ లో సుప్రీం ను ఆశ్రయించింది.  అయితే జగన్ సర్కార్ కోరుకున్న విధంగా సుప్రీం స్టే ఇవ్వడానికి నిరాకరించడమే కాకుండా, తొందరగా విచారించాలంటూ.. ఏపీ సర్కార్ తరఫు న్యాయవాదులు పదే పదే కోరడంపై సుప్రీం ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ కేసులో అనేక  అంశాలు ఉన్నాయి కాబట్టి విచారణకు సమయం పడుతుందని సుప్రీం కోర్టు తేల్చి చెప్పింది. అదే సమయంలో హైకోర్టు తీర్పుపై గతంలో ఇచ్చిన పాక్షిక స్టే వినా ప్రభుత్వం కోరిన విధంగా స్టే ఇవ్వడానికి నిర్ద్వంద్వంగా నిరాకరించింది. హైకోర్టు తీర్పుపై సుప్రీం స్టే ఇస్తే.. వెంటనే మూడు రాజధానుల బిల్లును ప్రవేశపెట్టి చట్టం చేయాలన్న తొందరలో వైసీపీ ఉందని పరిశీలకులు భావిస్తున్నారు. ఆ తరువాత సుప్రీంలో అమరావతికి అనుకూలంగా తీర్పు వచ్చినా ఫరవాలేదన్న భావనలో జగన్ సర్కార్ ఉందని అంటున్నారు. అందుకే సుప్రీం ముందు చూపుతో స్టేకు నిరాకరించిందని అంటున్నారు.  ఇక పోతే అమరావతి రైతుల తరఫున అనేక పిటిషన్లు సుప్రీం కోర్టులో ఉన్నాయి. అలాగే అమరావతి రాజధాని కోరుతూ పిటిషన్ దాఖలు చేసిన వారిలో పలువురు మరణించారు. వారి తరఫున వారి ప్రతినిధులు ప్రతివాదులుగా ఉండేందుకు  సుప్రీం అంగీకరించింది.   

అరెస్టు భయంతో ముందస్తు బెయిలుకు అవినాష్

వివేకా హత్య కేసులో అవినాష్ రెడ్డి అరెస్టు అనివార్యమని ఫిక్సైపోయారా? అందుకే తెలంగాణ హైకోర్టులో ముందస్తు బెయిలు కోసం పిటిషన్ దాఖలు చేశారా అంటే న్యాయ నిపుణులు ఔననే అంటున్నారు. గత విచారణ సందర్భంగానే సీబీఐ తెలంగాణ హైకోర్టుకు అవినాష్ ను అరెస్టు చేయనున్నట్లు చెప్పింది. అయితే ఆ తరువాత కేసు దర్యాప్తు ఎందుకనో మందగించింది. కేసు దర్యాప్తు వేగం మందగించడానికీ జగన్ హస్తిన పర్యటనకూ లింకు పెడుతూ.. సామాజిక మాధ్యమంలో పలు వ్యాఖ్యలు వచ్చాయి. అలాగే సుప్రీం కోర్టు వివేకా హత్య కేసు దర్యాప్తు ఇంకా ఎంత కాలం సాగదీస్తారంటూ సీబీఐపై ఆగ్రహం వ్యక్తం చేయడమే కాకుండా, అవసరం అనుకుంటే మరో దర్యాప్తు అధికారిని నియమించండని పేర్కొంది. దీంతో వివేకా హత్య కేసు మళ్లీ మొదటికి వచ్చిందన్న అనుమానాలు వ్యక్త మయ్యాయి. అయితే మంగళవారం (మార్చి 28) అవినాష్ రెడ్డి తెలంగాణ హైకోర్టులో ముందస్తు బెయిలు కోసం పిటిషన్ దాఖలు చేయడం, అలాగే బుధవారం ఏపీ సీఎం జగన్ ఢిల్లీ పర్యటనకు వెళ్లనుండటంతో వివేకా హత్య కేసులో అవినాష్ రెడ్డి అరెస్టుకు సీబీఐ రంగం సిద్ధం చేసిందన్న అనుమానాలు సర్వత్రా వ్యక్తం అవుతున్నాయి. ఇటు అవినాష్ రెడ్డి ముందస్తు బెయిలు కోసం కోర్టును ఆశ్రయించడం, అటు ముఖ్యమంత్రి జగన్ హస్తినకు వెళ్లనుండటంతో ఒకటి రెండు రోజులలో ఈ కేసులో కీలక పరిణామం చోటు చేసుకునే అవకాశాలున్నయని పరిశీలకులు అంటున్నారు.

పులివెందుల కాల్పుల ఘటన.. ఒకరి మృతి

ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఇలాకా పులివెందులలోనే నడి రోడ్డుపై కాల్పుల జరిపి హత్యలు జరుగుతున్నాయంటేనే రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి ఎంత దివ్యంగా ఉందో అవగత మౌతుంది. పైగా వివేకా హత్య కేసులో సీబీఐ విచారణను ఎదుర్కొన్న భరత్ యాదవే ఈ కాల్పులకు పాల్పడ్డాడంటే అరాచకం ఏ స్థాయిలో రాజ్యమేలుతోందా అర్ధం అవుతుంది.   వైఎస్ వివేకా హత్య కేసులో నిందితుడు సునీల్ యాదవ్‌కు బంధువు, ఆ కేసులో   భరత్ యాదవ్ ను కూడా సీబీఐ విచారించింది. కాగా డబ్బు విషయంలో దిలీప్ అనే వ్యక్తితో గొడవపడిన భరత్ నడిరోడ్డుపై  తుపాకీతో కాల్పులకు తెగబడ్డాడు. ఈ కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన దిలీప్ అనే వ్యక్తి కడప రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించగా, మరో వ్యక్తి బాషా తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్నాడు.  కాగా కాల్పులకు తెగబడ్డ భరత్ ఆ తరువాత పోలీసులకు లొంగిపోయాడు.   ఇలా ఉండగా.. భరత్ కుమార్ యాదవ్  గతంలో సీబీఐ పై  ఆరోపణలు చేశారు. సునీత భర్త రాజశేఖర్ రెడ్డి నుంచి తనకు ప్రాణహానీ పలు సందర్భాలలో పేర్కొన్నాడు. అలాగే వివేకా హత్య కేసులో  అప్రూవర్‌గా మారిన దస్తగిరి   భరత్ యాదవ్ తనను బెదరిస్తున్నాడంటూ పోలీసులకు  ఫిర్యాదు కూడా చేశారు.  ఇప్పుడు జరిపిన కాల్పులకు కూడా కూడా వివేకా హత్య కేసుకు సంబంధించిన   అర్థిక వ్యవహారాలలో  వచ్చిన విభేదాలే అన్న అనుమానాలు వ్యక్తమౌతు్నాయి.  

ఏపీ సర్కార్ కు ఎస్సీలే టార్గెట్.. ఎన్హెచ్చార్సీ ముందుకు దళిత నేత

ఆంధ్రప్రదేశ్ లో దళితులపై దమనకాండ జరుగుతోంది. దళితులను దారుణంగా చంపేస్తున్నారు. రక్షణ కల్పించాలి అంటూ అమరావతి బహుజన ఐకాస అధ్యక్షుడు పోతుల బాలకోటయ్య కేంద్ర మానవ హక్కుల కమిషన్ (హెచ్ఆర్సీ)కి  లేఖ రాశారు.  ఈ లేఖను  ఆయన  ఈమెయిల్  ఎన్హెచ్ఆర్సీకి పంపారు. ఆ  లేఖ వివరాలనుమంగళవారం (మార్చి 28)  మీడియాకు వెల్లడించారు.  45 నెలల వైకాపా పాలనలో తొలి బాధితులు దళితులే.  మాస్క్ అడిగినందుకు డాక్టర్ సుధాకర్ ను, మాస్క్ పెట్టుకోనందుకు చీరాల కిరణ్ కుమార్ ను చంపేశారు.  ఎమ్మెల్సీ అనంతబాబు    డ్రైవర్ సుబ్రహ్మణ్యంను దారుణంగా చంపేసి శవాన్ని ఇంటికి డోర్ డెలివరీ చేశారు. దళితుడిని అత్యంత కిరాతకంగా హత్య చేసి మృతదేహాన్ని ఇంటికి డోర్ డెలివరీ చేసిన ఎమ్మెల్సీ అనంతబాబు బెయిల్ పై విడుదలైన సందర్భంగా  గజమాలలతో సత్కరించారు. భారీ ర్యాలీ నిర్వహించి సంబరాలు జరుపుకున్నారు.   అలాగే కృష్ణాయపాలెంలో ఎస్సీలపై ఎస్సీ అట్రాసిటీ కేసులు పెట్టి దళిత రైతులను 24 రోజులు జైల్లో పెట్టారు.  బేడీలు వేసి బస్సులో తిప్పారు. కడప పశుసంవర్ధక శాఖ డిప్యూటీ డైరెక్టర్ గా పని చేస్తున్న డాక్టర్ అచ్చెన్న ను హత్య చేశారు. ఆయన కుమారుడు చక్రవర్తి అనుమానితుల పేర్లు  ముందుగానే ఇచ్చినా పోలీసులు విచారించలేదు.  తాటికొండ దళిత మహిళా ఎమ్మెల్యే ఉండవల్లి  శ్రీదేవి తన నియోజకవర్గానికి వెళ్లేందుకు భయంగా ఉందని, తనకు ప్రాణభయం ఉందనీ, సాక్షాత్తూ ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి నుంచే ప్రాణభయం ఉందనీ సొంత ఊరు వదిలేసి హైదరాబాద్ లో తలదాచుకుంటున్నారు.   కాకినాడలో గిరీష్ బాబు అనే దళిత యువకుడు కాళ్లలో రాడ్లు ఉన్నాయని చెప్పినా, ఎస్సై కనికరించలేదన్నారు. రాడ్లు చూపమని లాఠీకి రబ్బరు తగిలించి కొట్టారు. ఇసుక ట్రాక్టర్ ను అడ్డుకున్నాడని ఇందుగుమిల్లి వరప్రసాద్ కు శిరోముండనం చేశారు. పులివెందుల నాగమ్మ, నంద్యాల మహాలక్ష్మిలపై అత్యాచారాలు జరిగాయి. పేరేచర్లలో  మహిళపై జరిగిన అత్యాచారం కేసులో  80 మందిని అనుమానితులుగా  పోలీసులు  ఎఫ్ఐఆర్  నమోదు చేశారు. తప్పులను ప్రశ్నిస్తే దాడి చేస్తున్నారు. అన్యాయం పై తిరగబడితే హత్య చేస్తున్నారు. అణచి వేతలపై  గొంతు ఎత్తితే  దౌర్జన్యం చేస్తున్నారు. దళితులపై దాడులు జరగని జిల్లా కానీ, నియోజకవర్గం కానీ,  గ్రామం కానీ ఏపీలో లేదు.  తెలుగు నేల చరిత్రలో గతంలో ఎన్నడూ కనీ వినీ ఎరుగని రీతిలో దళితులపై దమనకాండ జరుగుతోంది. గతంలో ఢిల్లీలో  హెచ్ఆర్సీని స్వయంగా కలిసి లిఖిత పూర్వక ఫిర్యాదు ఇచ్చామన్నారు. హెచ్చార్సీ,  ఏపీ సిఎస్ కు లేఖ పంపి నెలలు గడిచినా ఇప్పటివరకు  తనకు సమాచారం కూడా ఇవ్వలేదు.   ఈ మొత్తం సంఘటనలపై కేంద్రంలోని హెచ్ఆర్సీ ఆధ్వర్యంలో పూర్తి విచారణ జరిపించాలని బాలకోటయ్య లేఖలో డిమాండ్ చేశారు.