దగ్గుపాటి ఇంటి ముట్టడికి జూ.ఎన్టీఆర్ ఫ్యాన్స్ యత్నం.. అనంతలో ఉద్రిక్తత

  అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ నివాసాన్ని ముట్టడించేందుకు జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ సిద్ధమయ్యారు. ఈ విషయం తెలుసుకున్న అనంతపురం జిల్లా పోలీసులు అప్రమత్తమయ్యారు. ఎమ్మెల్యే దుగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ నివాసాన్ని జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ముట్టడించనున్నారనే ముందస్తు సమాచారంతో అనంతపురం పోలీసులు అప్రమత్తమయ్యారు.  ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ నివాసంతోపాటు పరిసర ప్రాంతాల్లో భారీ పోలీసులు మోహరించారు. ఆ క్రమంలో ఆ ప్రాంతాల్లో బందోబస్తు ఏర్పాటు చేసి.. ఎమ్మెల్యే నివాసానికి వచ్చే మార్గాల్లో బ్యారికేడ్లను ఉంచారు. మరోవైపు అనంతపురంలోకి ప్రవేశించే జాతీయ రహదారిపై వచ్చే వాహనాలను పోలీసులు తనిఖీ చేస్తున్నారు. ఇంకోవైపు గుత్తి సమీపంలోని జాతీయ రహదారిపైకి జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ భారీగా చేరుకున్నారు. ముందస్తు సమాచారంలో.. వారిని పోలీసులు అడ్డుకున్నారు. జూనియర్ ఎన్టీఆర్‌కు వెంటనే ఎమ్మెల్యే వెంకటేశ్వర ప్రసాద్ బహిరంగ క్షమాపణలు చెప్పాలంటూ వారు డిమాండ్ చేస్తూ.. ఆందోళనకు దిగారు. అలా చేయకుంటే ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ నివాసంతోపాటు టీడీపీ కార్యాలయాన్ని ముట్టడిస్తామని ఈ సందర్భంగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ హెచ్చరించింది. బహిరంగ క్షమాపణలు చెప్పకుంటే.. ఎమ్మెల్యేను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలంటూ టీడీపీ అధిష్టానాన్ని ఎన్టీఆర్ ఫ్యాన్స్ డిమాండ్ చేసింది. ఈ నేపథ్యంలో అనంతపురంలో స్థానికంగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దాంతో ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటన చోటు చేసుకోకుండా జిల్లా పోలీస్ యాంత్రాంగం చర్యలు చేపట్టింది.  జూనియర్ ఎన్టీఆర్‌పై ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ తీవ్ర వ్యాఖ్యలు చేశారంటూ ఒక ఆడియో మీడియా, సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో ఎమ్మెల్యేపై జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ నిప్పులు చెరుగుతున్నారు. జూనియర్ ఎన్టీఆర్‌కు వెంటనే క్షమాపణలు చెప్పాలంటూ వారు డిమాండ్ చేస్తున్నారు.  అయితే తాజాగా చంద్రబాబు సారథ్యంలో కేబినెట్ సమావేశం జరిగింది.  ఈ సమావేశంలో పలువురు మంత్రులు, కొందరు ఎమ్మెల్యేల వ్యవహారం పట్ల సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. వారి వైఖరి కారణంగా విమర్శలు, ఆరోపణలు వెల్లువెత్తడంతో.. వెంటనే నివేదిక ఇవ్వాలని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిని సీఎం చంద్రబాబు ఆదేశించినట్లు తెలుస్తోంది. అదే విధంగా విమర్శలకు తావివ్వకుండా నడుచుకోవాలంటూ పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులకు సీఎం చంద్రబాబు కీలక సూచన చేసినట్లు సమాచారం.

పార్టీ మారిన ఎమ్మెల్యేలు రాజీనామా చేసి గెలవాలి : కేటీఆర్

  పార్టీ మారిన ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా చేసి, దమ్ముంటే ఉప ఎన్నికల్లో పోటీ చేసి తిరిగి గెలవాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే.తారక రామారావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు. రేవంత్ తన 20 నెలల పాలనలో తెలంగాణ ప్రజలకు చేసిన మంచిని చూపించి, ఉప ఎన్నికలకు వెళ్లాలని డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు తాజా తీర్పుతో పార్టీ మారిన ఎమ్మెల్యేలకు ఓటమి భయం పట్టుకుందని ఆయన వ్యాఖ్యానించారు. శేరిలింగంపల్లి నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు. నాయకులు మోసం చేసినా, కార్యకర్తలు మాత్రం గులాబీ జెండాను గుండెల్లో పెట్టుకున్నారని కేటీఆర్ ప్రశంసించారు. కాంగ్రెస్ నాయకుల బ్లాక్ మెయిల్ దందాల కోసమే హైడ్రా పనిచేస్తుందని ఆరోపించారు. హైడ్రా అరాచకాలతోనే హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ పూర్తిగా కుప్పకూలిందని విమర్శించారు. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో చేసిన అప్పుల కంటే ఎక్కువ అప్పులను కేవలం 20 నెలల కాలంలోనే చేసిన రేవంత్ రెడ్డికి, తాను చేసిన అభివృద్ధిని చెప్పుకునే దమ్ముందా అని కేటీఆర్ నిలదీశారు. అభివృద్ధి-సంక్షేమంపై బీఆర్ఎస్, కాంగ్రెస్ పాలనల పోలిక కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న పదేళ్ల కాలంలో ఒకవైపు అభివృద్ధి, మరోవైపు సంక్షేమంతో రాష్ట్రం అభివృద్ధిలో దూసుకుపోయిందని కేటీఆర్ అన్నారు. 2014లో గ్రేటర్ హైదరాబాద్ లో బీఆర్ఎస్ కు కేవలం ఇద్దరు ఎమ్మెల్యేలు మాత్రమే ఉండేవారని గుర్తు చేశారు. కేసీఆర్ సీఎం అయిన ఆరు నెలల్లోనే తీవ్ర విద్యుత్ సమస్యను పూర్తిగా పరిష్కరించి, ఇళ్లలో, షాపులలో కనిపించే ఇన్వర్టర్లు, జనరేటర్లను కనిపించకుండా చేశారని చెప్పారు.  హైదరాబాద్ ను కులం, మతం, ప్రాంతం పేరు మీద రాజకీయాలు చేయకుండా, అన్నదమ్ములుగా ఏ పంచాయతీ లేకుండా బ్రహ్మాండంగా అభివృద్ధి చేసి చూపించామని అన్నారు. హిందూ ఆడబిడ్డలకు దసరా కానుకలు, ముస్లిం పేదలకు రంజాన్ తోఫాలు, క్రైస్తవులకు క్రిస్మస్ గిఫ్టులు ఇచ్చి పండుగలకు ప్రాధాన్యతనిచ్చినట్టు తెలిపారు. తెలంగాణకు గుండెకాయగా హైదరాబాద్ ను కేసీఆర్ గారు మార్చారని, అందుకే 2023లో ఒక్క ఎమ్మెల్యే సీటు కూడా కాంగ్రెస్ కు రాకుండా, మొత్తం గులాబీ జెండాకే నగర ప్రజలు ఓట్లేశారని అన్నారు. హైడ్రా అరాచకాలతో హైదరాబాద్ వృద్ధి అతలాకుతలం హైడ్రా అరాచకాలతో  హైదరాబాద్ నగర వృద్ధి అతలాకుతలమైందని కేటీఆర్ తీవ్రంగా ఆరోపించారు. దుర్గం చెరువు ఎఫ్టీఎల్ లో సీఎం రేవంత్ రెడ్డి అన్న తిరుపతి రెడ్డి అక్రమంగా కట్టిన ఇంటిని కూల్చే దమ్ము హైడ్రాకు ఉందా అని ప్రశ్నించారు. పేదల ఇళ్లు కూలగొడుతున్న హైడ్రా, పెద్దల జోలికి మాత్రం వెళ్లడం లేదని మండిపడ్డారు. కూకట్ పల్లిలో బుచ్చమ్మ అనే మహిళ హైడ్రా తన ఇల్లు కూల్చి వేస్తుందన్న భయంతో ఆత్మహత్య చేసుకుందని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నేతల బ్లాక్ మెయిల్ దందాల కోసమే హైడ్రా పని చేస్తుందని ఆరోపించారు. పేదవాళ్ల కడుపు కొట్టడం, బిల్డర్లను బెదిరించడం, ఆర్ఆర్ టాక్స్ పేరుతో వసూళ్లు చేస్తున్నారని ప్రధానమంత్రి స్వయంగా చెప్పారని కేటీఆర్ గుర్తు చేశారు. బీఆర్ఎస్ పదేళ్ల పాలన వర్సెస్ కాంగ్రెస్ 20 నెలల పాలన బీఆర్ఎస్ పదేళ్ల కాలంలో ఎన్నడూ రియల్ ఎస్టేట్లో నాయకులు వేలు పెట్టలేదని, కబ్జాలు, గూండాగిరి చేయలేదని కేటీఆర్ స్పష్టం చేశారు. కానీ 20 నెలల్లోనే హైడ్రా పేరుతో కాంగ్రెస్ నాయకులు అరాచకం సృష్టించారని దుయ్యబట్టారు. కోర్టు ఆర్డర్ ఉన్నా కూడా పట్టించుకోకుండా పేదల ఇళ్లు కూల్చివేశారని ఆరోపించారు. బీఆర్ఎస్ పదేళ్లలో రెండు లక్షల 85 వేల కోట్ల అప్పు చేస్తే, రేవంత్ రెడ్డి 20 నెలల్లోనే రెండు లక్షల 20 వేల కోట్ల అప్పు చేశారని విమర్శించారు. కేసీఆర్ ఆ అప్పుతో హైదరాబాద్ లో 42 ఫ్లైఓవర్లు, అత్యాధునిక ఆసుపత్రులు, మురుగునీటి శుద్ధి కేంద్రాలు కట్టారని, కానీ రేవంత్ ఒక్క కొత్త బ్రిడ్జి కానీ, మోరీ కానీ కట్టిండా అని ప్రశ్నించారు. కేసీఆర్ 70 లక్షల మంది రైతు ఖాతాల్లో 70 వేల కోట్లు వేస్తే, రెండు లక్షల కోట్ల అప్పు చేసిన రేవంత్ ఏం చేశారని నిలదీశారు. 200 ఉన్న పెన్షన్ ను కేసీఆర్ ప్రభుత్వం 2000 చేస్తే, రేవంత్ ఏం చేసిండని అడిగారు. ప్రజల కోసం కాదు, స్వార్థం కోసమే శేరిలింగంపల్లితో పాటు పార్టీ మారిన మిగతా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు ప్రజల కోసం కాకుండా, తమ సొంత లాభం కోసమే కాంగ్రెస్ లోకి వెళ్లారని కేటీఆర్ ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం నిజంగానే ప్రజలకు మంచి చేసి ఉంటే, ఉప ఎన్నికల్లో పోటీ చేసి మళ్లీ గెలిచి చూపించాలని సవాల్ విసిరారు. ఉత్త టైంపాస్ ముచ్చట్లు చెబుతూ, ఒకరోజు కేసీఆర్ మీద, ఇంకోరోజు తన మీద కేసులంటూ రేవంత్ పిచ్చిగా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. హైదరాబాద్ మహానగరానికి రేవంత్ రెడ్డి చేసింది ఏమీ లేదని కేటీఆర్ తేల్చి చెప్పారు. నాయకులు మోసం చేసినా, కార్యకర్తలు మాత్రం గులాబీ జెండాను వదల్లేదని ఆయన ప్రశంసించారు.

సురవరం పార్థివ దేహానికి చంద్రబాబు నివాళి

  సీపీఐ జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి, మాజీ ఎంపీ సురవరం సుధాకర్‌రెడ్డి పార్థివ దేహానికి  హైదరాబాద్‌లోని మఖ్దూం భవన్‌లో ఏపీ సీఎం చంద్రబాబు  నివాళి అర్పించారు. సురవరం  కుటుంబ సభ్యులను పరామర్శించారు. చంద్రబాబు, సుధాకర్ ను చూసి భావోద్వేగానికి గురయ్యారు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు కూడా సురవరం పార్థివ దేహానికి నివాళులు అర్పించారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నమ్మిన సిద్ధాంతం కోసం నిలబడిన వ్యక్తి సురవరం అని కొనియాడారు. సురవరం లేనిలోటుపూడ్చలేనిదని, ఆయన పవిత్రాత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. చంద్రబాబు మాట్లాడుతు దేశం రాష్ట్రానికి తీరని నష్టం, ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమాల్లో కలిసి పోరాటం చేశామన్నారు.

శ్రీశైలం డ్యామ్‌పై ఆక్టోపస్ బృందం మాక్ డ్రిల్

  నంద్యాల జిల్లా శ్రీశైలం డ్యామ్ పై  ఆక్టోపస్ యాంటీ టెర్రరిస్ట్ స్వాడ్ టీమ్ అత్యాధునిక ఆయుదాలతో రాత్రుల సమయంలో విద్యుత్ సరఫరా నిలిపివేసి చిమ్మ చీకటిలో దట్టమైన కొండల నడుమ ఉన్న శ్రీశైలం డ్యామ్ పై ఆక్టోపస్ పోలీసు బలగాలు మోహరించి మాక్ డ్రిల్ నిర్వహించారు. ఆక్టోపస్ ఏపి మంగళగిరి డీఎస్పీ రంగబాబు ఆద్వర్యంలో 38  మంది ఆక్టోపస్ టీమ్ ఈ ప్రక్రియలో పాల్గొన్నారు.  శ్రీశైలం డ్యామ్ బద్రత  తీవ్రవాదుల కదలికలు గమనిస్తూ అనుకోకుండా డ్యామ్ పై చొరబడితే వారి చెర నుంచి అధికారులను వ్యక్తులను ఎలా కాపాడుకోవాలనే ఆంశంపై  తీవ్రవాదుల చర్యలను ఎలా ఎదురుకోవాలనే ప్రక్రియను రియల్ గా అత్యాదునిక ఆయుదాలతో చాకచక్యంగా ఉగ్రవాదులను ఎలా మట్టు పెట్టాలి, వారి నుంచి ఎలా బయటపడాలనే ప్రక్రియ అత్యద్భుతంగా ఉత్కంట వాతావరణంలో హైటెంక్షన్ పరిస్దితుల ప్రక్రియ మాక్ డ్రిల్ ను ఆక్టోపస్ పోలీసు బలగాలు నిర్వహించారు. శ్రీశైలం డ్యామ్ ఘాట్ రోడ్డు సమీపంలోని వ్యూపాయింట్ నుంచి కొండలు గుట్టలు దిగుచూ చీకట్లో అర్ధరాత్రి వరకు ఆక్టోపస్ పోలీసు బలగాలు మాక్ డ్రిల్ నిర్వహించగా శ్రీశైలం డ్యామ్ పరిసరాలు మొత్తం చికటి వాతావరణం నిశబ్దమైన వాతావరణంలో ఆత్మకూరు డిఎస్పి రామాంజి నాయక్, శ్రీశైలం టూటౌన్ ఎస్ఐ సుబ్బారెడ్డి  తమ పోలీసు సిబ్బందితో బందోబస్తు నిర్వహించారు.

అంతర్జాతీయ క్రికెట్‌కు చతేశ్వర్ పుజారా గుడ్‌బై

  అంతర్జాతీయ క్రికెట్‌కు చతేశ్వర్ పుజారా రిటైర్మెంట్ ప్రకటించారు. అన్ని ఫార్మాట్లలకు  గుడ్‌బై చెబుతున్నట్లు  సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు. భారత జట్టుకు ఆడాలన్న కలను నెరవేర్చుకోవడంలో తనకు సహకరించిన ప్రతీ ఒక్కరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు. భారత జెర్సీ ధరించడం, జాతీయ గీతం పాడటం, గ్రౌండ్‌లో అటుగుపెట్టిన ప్రతిసారి నా శయశక్తులా ఆడేందుకు ప్రయత్నించడటం మాటాల్లో చెప్పలేను అని పేర్కొన్నారు.  రాజ్‌ కోట్‌ పట్టణం నుంచి కుటుంబంతో కలిసి వచ్చిన ఓ కుర్రాడు.. భారత క్రికెట్‌లోకి అడుగు పెట్టాలనే కలను నెరవేర్చుకున్నాడు. ఈ ప్రయాణంలో ఎన్నో అనుభవాలు, ఎందరో సహకరించారు.. ప్రతీ ఒక్కరికీ నా ధన్యవాదాలు. బీసీసీఐ, సౌరాష్ట్ర క్రికెట్ అసోషియేషన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. 2010లో భారత జట్టులోకి అరంగేట్రం చేసిన పుజారా 103 టెస్టులు, 5 వన్డేలు ఆడిడారు. అంతర్జాతీయ క్రికెట్‌లో 19 సెంచరీలు, 35 హాఫ్ సెంచరీలు పుజారా సాధించారు.  

ఒకే ఇంట్లో నలుగురు ఆడ బిడ్డలకు ప్రభుత్వ ఉద్యోగాలు

  చదువుతో పేదరికాన్ని జయించొచ్చని  నిరూపించారు. చిత్తూరు జిల్లాకు చెందిన నలుగురు అక్క చెల్లెళ్ల ప్రభుత్వ ఉద్యోగాలు సాధించారు. వేపమాకులపల్లికి చెందిన  గౌరమ్మకు నలుగురు ఆడ బిడ్డలు పదేళ్ల కిందట భర్త చనిపోవడంతో కూలీ పనులు చేస్తూ బిడ్డలను చదివించారు.పెద్దకుమార్తె వీణాకుమారి 2014లో కానిస్టేబుల్‌గా ఉద్యోగం సాధించారు.  వాణి 2016లో ఎస్జీటీ టీచర్‌గా ఎంపికయ్యారు. నెల క్రితం వనజాక్షి కానిస్టేబుల్ జాబ్‌కి  సెలక్ట్ అయ్యారు. తాజాగా డీఎస్సీలో శిరీష ఎస్జీటీ పోస్ట్ సాధించారు. అయితే ఆ తల్లి పేరును, వంశ గౌరవాన్ని నిలిపిన నలుగురు కుమార్తెలు (దేవతలు) నిజంగా సరస్వతులే.తల్లి దినసరి కూలిగా పనిచేస్తూ పెంచి, పెద్ద చేసి ఉన్నత చదవులు చదివించింది.   ఆర్థిక వనరులు లేక కుటుంబ ఇబ్బందులతో ఇలాంటి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలంటే సాధ్యంకాని రీతిలో వీరు మనకు మన పిల్లలకు భావి భారత పౌరులకు స్పూర్తి దాయకం. వెయ్యి ఏనుగుల బలం, వారి ధృఢ సంకల్పం, ఆత్మ విశ్వాసం చూస్తే మనం నమ్మలేని నిజాలుగా ఉన్నాయి, ఒకే కుటుంబంలో ఇద్దరు పోలీస్, మరో ఇద్దరు ఉపాధ్యాయిని లు కావడమే గొప్ప. ఆ విధంగా పెంచి పోషించిన ఆ మాతృమూర్తికి శతకోటి వందనాలు అలాగే ఇంతటి అత్యున్నత స్థాయికి చేరుకున్న ముగ్గురు అక్క చెల్లెళ్లకు అభినందనలు.  

భార్యను ముక్కలుగా నరికిన కేసులో సంచలన విషయాలు

  మేడ్చల్ జిల్లా మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణమైన సంఘటన చోటుచేసుకుంది. వికారాబాద్‌కు చెందిన మహేందర్ రెడ్డి, స్వాతి అలియాస్ జ్యోతి  ప్రేమ వివాహం చేసుకున్నారు. నిందితుడు క్యాబ్ డ్రైవర్‌గా  పని చేస్తున్నాడు. గతంలో అదే ఇంట్లో సంవత్సరం ఉన్న ఈ జంట ఖాళీ చేసి వెళ్లి... మళ్లీ అదే ఇంట్లోకి  25రోజుల క్రితమే వచ్చారు. ఏం జరిగిందో తెలియదు కానీ భర్త మహేందర్ రెడ్డి తన గర్భవతైన భార్యను అతి దారుణంగా హత్య చేశాడు. అనంతరం పోలీసులకు ఏ చిన్న ఆధారం కూడా లభించకుండా ఉండేందుకు ఆమె మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా కట్ చేసి  నల్లని ప్లాస్టిక్స్ లలో చుట్టి మూసి నదిలో పడ వేశాడు. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు అమ్మాయి బావ పోలీసులకు సమాచారాన్ని అందించారు. నిందితుడిని అదుపులోకి తీసుకొని... ఇంట్లో లభించిన చాతి భాగంలో ఉన్న భాగం మాత్రమే పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కాళ్లు చేతులు తల వేరుచేసి ఎక్కడో వేసినట్లు తెలుస్తుంది. చేతులు భుజాల వరకు, కాళ్లు గజ్జల వరకు, అలాగే తల కట్ చేసినట్లు సమాచారం... మిగతా పార్ట్స్ కోసం పోలీసులు మూసీ నదిలో సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. కూతురు హత్యకు గురైనట్లు తెలియగానే స్వాతి తల్లి కన్నీరు మున్నీరుగా వినిపించింది. స్వాతి తల్లి డిగ్రీ చదువుతున్న నా కూతురికి ఇంటి పక్కనే ఉంటున్న మహేందర్ మాయమాటలు చెప్పి ప్రేమ అనే వలలో దింపాడని మృతురాలి తల్లి ఆవేదన వ్యక్తం చేసింది . నా కూతురు అతని ప్రేమ నిజమని నమ్మింది. మేము వద్దని వారించిన కూడా అతనే పెళ్లి చేసుకుంది. లవ్ మ్యారేజ్ చేసుకొని వచ్చిన తర్వాత మంచిగా ఉండమని చెప్పి బంగారం, డబ్బు లిచ్చి పంపామని తెలిపింది. కొన్ని రోజుల నుంచి నా కూతుర్ని చిత్ర హింసలు పెడుతున్నట్లుగా చెప్తుంది.  మహేందర్ తనను ఎప్పుడైనా చంపు తాడని భయం వ్యక్తం చేసిందని తనతో చెప్పిందని తల్లి వాపోయింది. మహేందర్ తన తల్లిదండ్రులతో కలిసి తన కూతుర్ని చంపేశాడని స్వాతి తల్లి ఆవేదన వ్యక్తం చేసింది. కొన్ని రోజుల నుంచి నా కూతురుతో ఫోను కూడా మాట్లాడ నివ్వలేదు..దొంగ చాటుగా నా కూతురు ఫోన్ లో మాట్లాడితే కొట్టేవాడు.నా కూతుర్ని కిరాతకంగా చంపిన మహేందర్ కి ఉరిశిక్ష వేయాలని స్వాతి తల్లి కోరింది.

పేదలు, బహుజనుల కోసం పోరాడిన నేత సురవరం : సీఎం రేవంత్

  హైదరాబాద్‌ మఖ్దూం భవన్‌లో సీపీఐ జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి భౌతికకాయానికి సీఎం రేవంత్‌రెడ్డి నివాళులు అర్పించారు. అనంతరం ముఖ్యమంత్రి సురవరం కుటుంబ సభ్యులను పరామర్శించారు. నేతలు, అభిమానులు సందర్శనార్థం మధ్యాహ్నం 3 గంటల వరకు సుధాకర్‌రెడ్డి పార్థివ దేహాన్ని మఖ్దూం భవన్‌లో ఉంచనున్నారు. అధికారిక లాంఛనాలు పూర్తయిన తర్వాత ఆయన పార్థివ దేహాన్ని గాంధీ ఆస్పత్రికి అప్పగించనున్నారు.  అనంతరం సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ సురవరం సుధాకర్‌రెడ్డి రాజీపడని సిద్దాంతలతో రాజకీయాల్లో ఎదిగానని సీఎం రేవంత్ తెలిపారు.విద్యార్థి నేత నుంచి జాతీయ స్థాయి నేతగా ఆయన ఎదిగిన తీరును ఈ సందర్భంగా ఆయన గుర్తు చేసుకున్నారు. పాలమూరు జిల్లా బిడ్డ జాతీయ నేతగా ఎదగడం గర్వకారణమన్నారు. అధికారంలో ఉన్నా లేకున్నా సిద్ధాంతాలను ఎప్పుడూ వీడలేదని గుర్తుచేశారు. సుధాకర్‌రెడ్డిని ప్రజలు గుర్తుంచుకునేలా అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన పేరు ఉండేలా మంత్రివర్గంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.  సధాకర్ రెడ్డి లేఖ పేరకే తెలుగు వర్సిటీకి సురవరం ప్రతాపరెడ్డి పేరు పెట్టినట్లు తెలిపారు. సురవరం భౌతిక కాయానికి రాజకీయ ప్రముఖులు నివాళులు అర్పిస్తున్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ .. ఆయనకు నివాళులు అర్పించారు. ఆయన మృతి తనను తీవ్రంగా కలచివేసిందన్నారు. సురవరం మరణం ప్రజా ఉద్యమాలకు తీరని లోటని, ఆయన పవిత్రాత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించినట్లు కేటీఆర్ తెలిపారు.   

నిండు గర్భిణీ భార్యను ముక్కలుగా... నరికి చంపిన కసాయి భర్త

  ఓ భర్త గర్భిణీతో ఉన్న భార్యను అతి దారుణంగా హత్య చేయడమే కాకుండా ఆమె మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా కట్ చేసి కవర్లో వేసి ఎక్కడెక్కడో పడేసి... పోలీసులు చేతికి చిక్కకుండా తప్పించుకోవాలని ప్రయత్నించాడు... ఈ ఘటన రాచ కొండ కమిషనరేట్ మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. వికారాబాద్ జిల్లా కామారెడ్డి గూడ కి చెందిన స్వాతి(22 అలియాస్ జ్యోతి) అనే యువతి...అదే గ్రామానికి చెందిన సామల మహేందర్ రెడ్డిని ప్రేమించి పెళ్లి చేసుకున్నది. ఈ ప్రేమ జంట జీవనోపాధి కొరకు గత 25 రోజుల క్రితం హైదరాబాద్ నగరానికి వచ్చి బోడుప్పల్ లోని బాలాజీ నగర్ లో అద్దెకు ఉంటు న్నారు.మహేందర్ రెడ్డి రాపిడో నడుపు తున్నాడు. ఈ ఇద్దరీ మధ్య ఏం జరుగు తోంది తెలియదు కానీ భర్త మహేందర్ తన భార్య స్వాతిని హత్య చేయడమే కాకుండా ముక్కలు ముక్కలుగా కట్ చేసి... కవర్లో వేసుకుని ఎక్కడెక్కడో పడేశాడు. అయితే ఇతని కదలికలపై అనుమానం వచ్చి... స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారాన్ని అందించారు. గతంలో ఈ జంట  ఇదే ప్రాంతంలోని ఇదే ఇంట్లో ఓ పది నెలలు ఉండి వెళ్ళి నట్లు స్థానికులు పోలీసులకు చెప్పారు. మళ్ళీ ఈ ప్రేమ జంట 25రోజుల క్రితమే ఇక్కడికి వచ్చి ఉంటున్నారని స్థానికులు చెబు తున్నారు. వీరు ప్రేమ వివాహం ఎప్పుడూ చేసుకు న్నారనేది పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. కాళ్ళు, చేతులు, తల వేరు చేసి ఎక్కడో వేసినట్లు తెలుస్తుంది. అవి ఇంకా పోలీసులకు దొరకనట్లు తెలుస్తుంది. ఛాతీ భాగం మాత్రమే లభ్య మైంది. చేతులు భుజాల వరకు, కాళ్ళు గజ్జల వరకు, అలాగే తల కట్ చేసినట్లు సమాచారం... లభ్యమైన  భాగాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ హాస్పిటల్ కి తరలించిన... పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తులో భాగం గా మిగతావిడి భాగాల కొరకు మహేందర్ రెడ్డిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

శుభమా అని శుభలేక ఓపెన్ చేస్తే

వెడ్డింగ్ కార్డ్ వాట్సప్ లో వచ్చింది కదాని ఓపెన్ చేస్తే మీ అకౌంట్లో డబ్బు ఖాళీ అవుతుందని మీకు తెలుసా? పిచ్చి పలు రకాలు అన్నట్టు మోసం కూడా అంతే. ఇందుకోసం రకరకాల ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నారు సైబర్ నేరగాళ్లు. ఇందుకు మహారాష్ట్ర హింగోలీకి చెందిన ఒక గవర్నమెంట్ ఎంప్లాయి అడ్డంగా బుక్ అయిపోయారు. ఆగస్టు 30న పెళ్లి.. ఉందంటూ వాట్సప్ లో ఒక ఇన్విటేషన్ వచ్చిది. పెళ్లికి రండి. ఆనందం గేట్లు తెరవడానికి తాళం ప్రేమ అంటూ కవిత్వం అందంగా కనిపించడంతో ఆ వ్యక్తి దాన్ని ఓపెన్ చేశారు. అదొక ఆండ్రాయిడ్ అప్లికేషన్ ప్యాకేజీ. అంటే ఏపీకే. దాన్ని క్లిక్ చేయగానే అతడి డేటా మొత్తం పొందారు సైబర్ మోసగాళ్లు. ఇక అక్కడి నుంచి అతడి ఖాతా నుంచి ఏకంగా లక్షా 90 వేల రూపాయల వరకూ ఖాళీ చేశారు. తర్వాత అసలు విషయం తెలుసుకున్న బాధితుడు వెంటనే పోలీస్టేషన్లో కంప్లయింట్ చేశారు.  శుభమాని శుభలేఖ చూస్తే ఈ అశుభం ఏంటో అర్ధం కావడం లేదని వాపోవడం పలువురు బాధితుల వంతు అవుతోంది. కొత్త కొత్త దారుల్లో జనాల్ని బురిడీ కొట్టించి ఇదిగో ఇలా ఖాతాలను ఖాళీ చేస్తున్నారు. అందుకే గుర్తు తెలియని నెంబర్ల నుంచి వాట్సప్, ఫేస్ బుక్, ఇన్ స్టా గ్రామ్ వంటి ఆహ్వాన పత్రికులు, డాక్యుమెంట్లు, వీడియోలు, లింకులు, ఫైళ్లు వస్తుంటాయి. వీటి జోలికి పోతే ఇక అంతే సంగతులు. ఒక్కసారి ఇలాంటి ఇన్విటేషన్ వంటివి డౌన్ లోడ్ చేసుకుంటే ఖేల్ ఖతం. ఫోన్ మొత్తం హ్యాక్ అవుతుంది. డబ్బులొకటే కాదు.. మన సమాచారం మొత్తం వారి పరమై పోతుంది. తద్వారా మన డాటా మొత్తం వారి కంట్రోల్ లోకి వెళ్లి పోతుంది. తర్వాత వాటిని అడ్డు పెట్టుకుని.. బ్లాక్ మెయిల్ చేస్తారు. కాబట్టి తస్మార్ట్ జాగ్రత్త! రీసెంట్ గా ఎస్బీఐకి చెందిన ఒక రివార్డ్ లింకు కూడా సరిగ్గా ఇలాగే సర్క్యులేట్ అవుతోంది. దాన్ని గానీ తెలిసీ తెలియక ఓపెన్ చేస్తే ఇక అంతే సంగతులు. ఇలాంటివి వచ్చినపుడు ఎలాంటి జాగ్రత్తలు తీస్కోవాలని చూస్తే.. ఫర్ సపోజ్ ఇన్విటేషన్ వస్తే.. దానికి అది ఏ రకమో చివరి అక్షరాలు తెలియజేస్తాయి. ఉదాహరణకు వెడ్డింగ్‌ ఇన్విటేషన్‌ పేరుతో పీడీఎఫ్‌ ఫైల్‌ పంపిస్తే వెడ్డింగ్‌ ఇన్విటేషన్‌. పీడీఎఫ్‌ అని, ఏపీకే ఫైల్‌ అయితే వెడ్డింగ్‌ ఇన్విటేషన్‌. ఏపీకే ఆండ్రాయిడ్ అప్లికేషన్ ప్యాకేజ్ అని ఇంగ్లీష్ లో ఉంటుంది. ఏపీకే అని ఉంటే డౌన్‌లోడ్‌ చేయవద్దని సూచిస్తారు నిపుణులు. ఒక వేళ    తెలిసిన వారి నుంచి వచ్చిన మెసేజ్ అయినా సరే.. ఒకసారి పరిశీలించాకే దాన్ని తెరవాలంటున్నారు టెకీ ఎక్స్ పర్ట్స్.

తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ

  తిరుమలలో శ్రీవారి భక్తుల రద్దీ తగ్గింది. నిన్నశనివారం  దర్శనానికి 24 గంటల సమయం పడితే.. నేడు శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం భక్తులు కంపార్ట్‌మెంట్లలో వేచి ఉండాల్సిన అవసరం లేదు. నేరుగా శ్రీవారి దర్శనం చేసుకోవచ్చు. నిన్న శ్రీవారిని 83,858 మంది భక్తులు దర్శించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.93 కోట్లు వచ్చిందని టీటీడీఅధికారులు తెలిపారు.  నవంబర్ నెలకు సంబంధించి శ్రీవారి ప్రత్యేక దర్మనం టికెట్లు ఆగస్టు 25 ఉదయం 10 గంటలకు విడుదల కానున్నాయి. రేపు మధ్యాహ్నం అదే నెల సంబంధించి వసతి బుకింగ్ కూడా ఓపెన్ కానుంది. నిన్న వృద్ధులు , దివ్యాంగుల కోటా టికెట్లను టీటీడీ విడుదల చేసిన సంగతి తెలిసిందే. భక్తులు దళారులను నమ్మవద్దని వైబ్‌సైట్ లేదా యాప్‌లోనే బుక్ చేసుకోవాలని టీటీడీ అధికారులు తెలిపారు.

టీడీపీ పార్లమెంట్‌ కమిటీలపై పార్టీ నేతలతో చంద్రబాబు సమావేశం

  తెలుగుదేశం పార్టీ కమిటీల ఏర్పాటుపై సీఎం చంద్రబాబు ఉండవల్లి క్యాంప్ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు.  పార్లమెంట్‌ కమిటీల ఏర్పాటు కోసం ఇప్పటికే ముగ్గురు సభ్యులతో కమిటీ ఏర్పాటు చేశారు. ఒక్కో పార్లమెంట్ కమిటీలో 34 మంది సభ్యులు అనుబంధ విభాగల్లో 28 మందితో పార్లమెంట్ స్థాయిలో అనుబంధ విభాగాల కమిటీలపైనా అభిప్రాయాల సేకరణ చేయనున్నారు. అధ్యక్షుడితో పాటు ఉపాధ్యక్షులు, అధికార ప్రతినిధులు, కార్యనిర్వాహక కార్యదర్శులు, కార్యదర్శులు..కార్యాలయ కార్యదర్శి, సోషల్ మీడియా, మీడియా కార్యదర్శులకూ ఇందులో స్థానం కల్పించారు. వివిధ సామాజిక వర్గాలకు సంబంధించి పార్లమెంట్ స్థాయిలో 54 సాధికార సమితిలు ఏర్పాటు కానున్నాయి.  పార్లమెంట్ పరిధిలోని పొలిట్ బ్యూరో సభ్యులు, కేంద్ర, రాష్ట్ర పార్టీ కార్యవర్గ సభ్యులు, అనుబంధ విభాగాల ప్రతినిధులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు, నీటి సంఘాల అధ్యక్షులు, కార్పొరేటర్లు, మార్కెట్ యార్డు చైర్మన్లు, జడ్పీటీసీలు, ఎంపీటీసీల అభిప్రాయాలను త్రిసభ్య కమిటీ తీసుకోనుంది. ఈ సందర్భంగా చంద్రబాబు  పార్లమెంట్ పార్టీ కమిటీలపై సమీక్షించారు. ఈ సమావేశానికి టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, సీనియర్ నేత వర్ల రామయ్యతోపాటు టీడీపీ నేతలు హాజరయ్యారు. 

తెలివి మీరిన ఎర్ర చందనం దొంగలు...ఎందుకంటే?

  రకరకాల మార్గాల్లో అటవీ, టాస్క్ ఫోర్స్ పోలీసుల కన్నుగప్పి ఎర్రచందనాన్ని కొల్లగొట్టే ఎర్ర దొంగలు మరీ తెలివి మీరు పోతున్నారు .ఎర్రచందనం అక్రమ రవాణా చేసేందుకు ఒక దారిలో వెళుతూ మరో దారిలో ఎర్రచందనం తరలిపోతుందని వీరే పోలీసులకు, అటవీ శాఖ అధికారులకు ఫోన్ చేసి వారిని డైవర్ట్ చేయడం, ఎర్రచందనాన్ని వివిధ రకాల సరుకులు,కూరగాయలు, ఇతర వస్తువుల మాటున పెట్టుకొని తరలించడం లాంటివి చూస్తుంటాం. అంతేకాదు వాహనాల నెంబర్లు మార్చి కూడా అక్రమ రవాణాకు  పాల్పడుతుంటారు. ఇటీవల కొందరు మరీ తెలివి మీరిన పోయారు. సెల్ఫ్ డ్రైవింగ్ కోసం వాహనాన్ని తీసుకొని ఆవాహంనంలో ఎర్రచందనాన్ని  తరలించే ప్రయత్నం లో పట్టుబడ్డ ఉదంతం టాస్క్ఫోర్స్ పోలీసులను విస్మయానికి గురిచేసింది.సొంత వాహనాలు అయితే పట్టుపడితే కేసులు ఎదుర్కోవాలి ,బాడుగ వాహనాలు తెలిసి ఎవరు వారికి వచ్చేందుకు సాహసించరు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ కొత్త ఐడియా తట్టిందేమో సెల్ఫ్ డ్రైవింగ్ పేరుతో వాహనాన్ని బాడుగకు తీసుకుని ఎర్రచందనం తరలించేందుకు సిద్ధమైన ఎర్రచందనం దుంగల వైనం ఒకటి వెలుగు చూసింది. కడప ఫారెస్ట్ డివిజన్ సీకే దిన్నే మండలం పరిధిలోని అటవీప్రాంతంలో ముగ్గురు ఎర్రచందనం స్మగ్లర్లను టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్టు చేసి వారి నుంచి 26 ఎర్రచందనం దుంగలు, ఒక కారును స్వాధీనం చేసుకున్నారు. ఈ కారును సెల్ఫ్ డ్రైవింగ్ కోసం బాడుగకు తీసుకుని అందులో ఎర్రచందనం అక్రమ రవాణా చేయడం జరిగిందని టాస్క్ ఫోర్స్ పోలీసులు తెలిపారు. టాస్క్ ఫోర్స్ హెడ్ ఎల్. సుబ్బారాయుడు  ప్రత్యేక కార్యాచరణ లో భాగంగా టాస్క్ ఫోర్స్ ఎస్పీ  పీ. శ్రీనివాస్  ఆధ్వర్యంలో డిఎస్పీ ఎండీ షరీఫ్ నేతృత్వంలో  కడప సబ్ కంట్రోల్ ఆర్ఎస్ఐ ఎం. మురళీధర్ రెడ్డి టీమ్   సీకే దిన్నే మండలం లోని మద్దిమడుగు ఫారెస్ట్ సెక్షన్ లో స్థానిక అటవీ సిబ్బంది షకీల్ అహ్మద్, నారాయణరెడ్డి తో కూంబింగ్ చేపట్టారు.  కొలుములపల్లి సమీపంలో కొంతమంది వ్యక్తులు ఒక కారు వద్ద కనిపించారు. వారిని చుట్టుముట్టేందుకు ప్రయత్నించగా  పారిపోసాగారు. అయితే టాస్క్ ఫోర్స్ సిబ్బంది వారిని వెంబడించి ముగ్గురిని పట్టుకో గలిగారు. ఆ పరిసర ప్రాంతాల్లో వెతకగా 26 ఎర్రచందనం దుంగలు లభించాయి. పట్టుబడిన వారిని అన్నమయ్య జిల్లాకు చెందిన వారిగా గుర్తించారు. వారిని ఎర్రచందనం దుంగలు, కారుతో సహా తిరుపతి టాస్క్ ఫోర్స్ పోలీసు స్టేషన్ కు తరలించారు. డిఎస్పీ వీ. శ్రీనివాస రెడ్డి, ఏసీఎఫ్ జె. శ్రీనివాస్ వారిని విచారించగా ఆ కారును సెల్ఫ్ డ్రైవింగ్ కోసం బాడుగకు తీసుకుని వచ్చి అందులో ఎర్రచందనం స్మగ్లింగ్ చేయడానికి ప్రయత్నించినట్లు తెలిసింది. ఈ కేసును ఎస్ ఐ రఫీ నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కార్లు బాడుగకు ఇచ్చేముందు విచారించారు కోవాలి కార్లు కిరాయికి ఇచ్చేముందు వారి పూర్తి వివరాలు తెలుసుకుని ఇవ్వాలని టాస్క్ ఫోర్స్ ఎస్పీ  శ్రీనివాస్ సూచించారు. ఆ కార్లను ఎర్రచందనం అక్రమ రవాణాకు ఉపయోగించే పక్షంలో కారు యజమాని కూడా భాధ్యుడు అవుతారని, వారిపై కూడా కేసు నమోదు అవుతుందని హెచ్చరించారు.

స్థానిక సంస్థల ఎన్నికలపై సీఎం రేవంత్‌ కీలక నిర్ణయం

    బీసీ రిజర్వేషన్ బిల్లు రాష్ట్రపతి వద్ద పెండింగ్‌లో ఉన్న నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీ పరంగా 42% రిజర్వేషన్ అమలు చేస్తూ స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని పీసీసీ కోర్‌ కమిటీ సభ్యులు నిర్ణయించారు. జూబ్లీహిల్స్‌లోని ముఖ్యమంత్రి నివాసంలో జరిగిన సమావేశంలో పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌ గౌడ్‌, కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి మీనాక్షి నటరాజన్‌, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి, శ్రీధర్‌బాబు పాల్గొని పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.  సెప్టెంబరు 30వ తేదీ లోపు స్థానిక సంస్ధల ఎన్నికల నిర్వహణ పూర్తి చేయాలని పార్టీ రాష్ట్ర నాయకత్వం భావించింది. అయితే 42శాతం బీసీలకు రిజర్వేషన్‌ అమలు ఎలా అనే అంశంపై సమావేశంలో చర్చించారు. జూబ్లీహిల్స్ బైపోల్ ఉప ఎన్నికను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న హస్తం పార్టీ.. ఏ విధంగా ముందుకు వెళ్లాలనే అంశంపై కూడా సుదీర్ఘంగా చర్చించారు. ముగ్గురు మంత్రులకు ఆ నియోజకవర్గ ఉప ఎన్నిక వ్యవహారాన్నీ అప్పగించినందున పార్టీ పరంగా బలోపేతమయ్యేందుకు ముమ్మరంగా కసరత్తు కొనసాగుతున్నట్లు సభ్యుల దృష్టికి పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌ గౌడ్‌ తీసుకొచ్చారు.  

సల్వాజుడం పే చర్చా

  ఇండియా కూటమి అభ్యర్ధి సుదర్శన్ రెడ్డికి ఓటు వేయడం అంటే, నక్సలైట్లకు ఓటు వేయడంతో సమానమని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు.  ఈ విషయంపై భారీ ఎత్తున చర్చ నడుస్తోంది. ఇదే అంశంపై   నాగర్ కర్నూల్ కాంగ్రెస్ ఎంపీ  మల్లు రవి ఖండించారు. అమిత్ షా ఆ తీర్పు చదువుకోవల్సిన అవసరం ఉందని అన్నారాయన. అంతే కాదు.. నక్సలైట్లు విదేశీయులు కారు. మన దేశంలోని వారే. వారంటే అంత వ్యతిరేకత ఎందుకని నిలదీశాను మల్లురవి. ఇదిలా ఉంటే, ఉపరాష్ట్రపతి ఎన్నికకు విప్ ఏదీ లేదు. కాబట్టి ఎవరి ఆత్మసాక్షి ప్రబోధాన్నిబట్టీ వారు ఓటు వేయొచ్చు. దీన్నిబట్టీ చూస్తే ఎంపీలు పెద్ద ఎత్తున సుదర్శన్ రెడ్డికి ఓటు వేయాలని సూచించారు. అయితే  సల్వా జుడుం తీర్పుపై అమిత్‌ షా చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ అది తాను ఇచ్చినది కాదని, సుప్రీం కోర్టు తీర్పు అని ఇండి కూటమి ఉప రాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్‌ బి.సుదర్శన్‌రెడ్డి అన్నారు. గిరిజనులను గిరిజనుల చేతే చంపించవద్దని మాత్రమే తాను అన్నానని చెప్పారాయన. 40 పేజీల ఆ తీర్పును అమిత్‌ షా చదవాలని ఆశిస్తున్నానని అన్నారు. ఒకవేళ దీన్ని చదివి ఉంటే హోం మంత్రి  ఆ వ్యాఖ్యలు చేసి ఉండేవారు కాదని చెప్పుకొచ్చారు. ఇదే తాను చెప్పదలచుకున్నానని అన్నారు. ఇక్కడితో ఈ చర్చను ఆపేద్దామని జస్టిస్‌ బి.సుదర్శన్‌రెడ్డి క్లారిటీ ఇచ్చారు. ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా విపక్షాలు ఏకగ్రీవంగా ఎంపికచేయడం గౌరవంగా భావిస్తున్నానని సుదర్శన్ రెడ్డి అన్నారు. ఇది 64శాతం ప్రజల ప్రాతినిధ్యాన్ని సూచిస్తోందని వ్యాఖ్యానించారు. ఉపరాష్ట్రపతి ఎన్నిక అనేది ఇద్దరి అభ్యర్థుల మధ్య పోటీ కాదు, రెండు భావజాలాల మధ్య పోటీ. ప్రజాస్వామ్యం అంటే పరస్పర చర్చ మాత్రమే. వ్యక్తులు, వారి ఆలోచనల మధ్య సంఘర్షణ కాదు. జాతీయ అంశాలపై గతంలో అధికార, విపక్ష పార్టీలు సమన్వయం చేసుకునేవి. దురదృష్టవశాత్తు ఇప్పుడది కనిపించడం లేదని అన్నారు జస్టిస్ బి. సుదర్శన్ రెడ్డి.

చెత్త నుంచి సంపద సృష్టించొచ్చు : సీఎం చంద్రబాబు

  పేదలపై పన్ను భారం తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం యోచిస్తోందని సీఎం చంద్రబాబు అన్నారు. కాకినాడ జిల్లా, పెద్దాపురంలో స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్రలో భాగంగా స్వచ్ఛతా ర్యాలీలో ముఖ్యమంత్రి  పాల్గొన్నారు. సీఎంతో పాటు ర్యాలీలో ప్రజాప్రతినిధులు, మెడికల్ విద్యార్థులు, స్థానికులు పాల్గొన్నారు. ర్యాలీ అనంతరం అక్కడి మ్యాజిక్ డ్రెయిన్లను చంద్రబాబు పరిశీలించారు. వాటి నిర్మాణం, ఉపయోగం గురించి పారిశుధ్య సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. వీటి ద్వారా భూగర్భ జలాల పెరుగుదలతో పాటు పారిశుధ్య నిర్వహణ భారం కూడా తగ్గుతుందని కార్మికుల వివరించారు.   గత వైసీపీ ప్రభుత్వం ప్రజారోగ్యాన్ని పూర్తిగా విస్మరించిందని, కలుషిత నీటితో ప్రజలు రోగాల బారిన పడ్డారని ఆయన అన్నారు. స్వచ్చమైన నీరు, పరిశుభ్రమైన వాతవరణం కల్పించి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడటమే తమ ప్రభుత్వ లక్ష్యమని చంద్రబాబు హామీ ఇచ్చారు. గత ప్రభుత్వం తీసుకొచ్చిన చెత్తపన్ను విధానంపై కీలక వ్యాఖ్యలు. జగన్ హయాంలో చెత్తకు పన్ను వేశారని, కానీ తీయలేదని ఎద్దేవా చేశారు అన్ని మున్సిపాలిటీల్లోని చెత్తా చెదారాన్ని అక్టోబర్ 2 నాటికి తొలగిస్తామని సీఎం  స్పష్టం చేశారు.  ప్రపంచంలో ఏదీ వేస్ట్ కాదని, చెత్తతో కూడా సంపద సృష్టించొచ్చని చెప్పారు. ప్రజల ఆలోచనా విధానం మారాలని అప్పుడే స్వర్ణాంధ్ర సాధ్యమవుతుందని ముఖ్యమంత్రి తెలిపారు. సంపద సృష్టించడం.. ఆదాయాన్ని పెంచడం మాకు తెలుసు. అప్పులతో సంక్షేమ కార్యక్రమాలు చేస్తే దీర్ఘకాలం కొనసాగదు. నేను సూపర్‌ సిక్స్‌ అంటే సాధ్యం కాదన్నారు.. చేసి చూపించామని సీఎం చంద్రబాబు తెలిపారు.  సూపర్‌ సిక్స్‌ సూపర్‌ హిట్‌ అయ్యింది. అన్నదాత సుఖీభవ కింద రైతులకు ఎప్పటికప్పుడు వారి ఖాతాల్లో నగదు జమచేస్తున్నామని పేర్కొన్నారు.పెద్దాపురంలో 100 పడకల ఆసుపత్రి ఏర్పాటు చేస్తాం’’ అని చంద్రబాబు హామీ ఇచ్చారు. అమరావతి మునిగిపోయిందని వైసీపీ దుష్ప్రచారం చేస్తోంది. అమరావతికి నిధులు ఇవ్వొద్దని అందరికీ లేఖలు రాశారు. ప్రపంచంలోనే గొప్ప నగరంగా అమరావతిని తయారు చేస్తామన్నారు. అమరావతి, విశాఖ, తిరుపతిని మహానగరాలుగా మారుస్తాం. పెట్టుబడులు పెట్టేందుకు వస్తే ఎవరైనా ఆహ్వానిస్తామని ముఖ్యమంత్రి తెలిపారు.

నిందితుడిని కఠినంగా శిక్షించాలని...సహస్ర పేరెంట్స్ డిమాండ్

  కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్ ఎదుట సహస్ర తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. పోలీసులు కేసును తప్పుదోవ పట్టిస్తున్నారని ఆమె పేరెంట్స్ ఆరోపించారు. నిందితుడు మైనర్‌ అని చెప్పి కఠిన శిక్ష నుంచి తప్పించే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. క్రికెట్‌ బ్యాట్‌ కోసం వచ్చి హత్య చేశాడని సరికాదన్నారు. ఈ క్రమంలోనే బంధువులు, స్థానికులతో కలిసి కూకట్‌పల్లి పోలీస్‌స్టేషన్‌ ముందు జాతీయ రహదారిపై బాలిక తల్లిదండ్రులు ఆందోళన చేపట్టారు. ఈ క్రమంలో కూకట్‌పల్లి పోలీస్‌స్టేషన్‌ దగ్గర తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. రోడ్డుపై భారీగా ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడింది. కూకట్‌పల్లి నుంచి ఎర్రగడ్డ వరకు భారీగా ట్రాఫిక్‌ నిలిచిపోయింది. మరోవైపు సహస్ర తండ్రి కృష్ణ సంచలన ఆరోపణలు చేశారు. సహస్ర హత్య వెనుక బాలుడి తల్లిదండ్రుల ప్రమేయం ఉంది. న్యాయం జరగకపోతే పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరించారు. పోలీసులు మరోసారి దర్యాప్తు చేయాలి' అని సహస్ర తండ్రి కృష్ణ డిమాండ్ చేశారు. మరోవైపు ఒక్క బ్యాట్ కోస‌మే ఆ బాలిక‌ను హత్య చేసినట్లు నిందితుడు పోలీసుల విచార‌ణ‌లో అంగీక‌రించిన‌ట్లు సైబ‌రాబాద్ సీపీ అవినాష్ మ‌హంతి తెలిపారు. అయితే స‌హ‌స్ర హ‌త్య‌కు కార‌ణ‌మైన బ్యాట్‌ను పోలీసులు మీడియా ముందు ప్ర‌ద‌ర్శించారు. ఇక ఆ బ్యాట్‌పై రెడ్ క‌ల‌ర్ గుర్తులో ఎంఆర్ఎఫ్ అని రాసి ఉంచారు. స‌హ‌స్ర త‌మ్ముడు రెగ్యుల‌ర్‌గా ఈ బ్యాట్‌తో క్రికెట్ ఆడేవాడ‌ని, దాన్ని చోరీ చేయాల‌నే ఉద్దేశంతోనే స‌హ‌స్ర ఇంటికి దొంగతానికి వెళ్లిన‌ట్లు పోలీసుల విచార‌ణ‌లో తేలింద‌ని  సీపీ పేర్కొన్నారు.  కిచెన్‌లో ఉన్న బ్యాట్‌ను చోరీ చేసే క్ర‌మంలో శబ్ధం రావడంతో.. స‌హ‌స్ర అప్ర‌మ‌త్త‌మై ఎదురించింది. దీంతో ఆమెను బెడ్‌రూంలోకి తోసేసి క‌త్తితో 18 సార్లు పొడిచి మర్డర్ చేసినట్లు నిందితుడు ఒప్పుకున్నాడని. అయితే ఈ నేరాన్ని అంగీక‌రించేందుకు ముద్దాయి.. ర‌క‌ర‌కాల క‌ట్టుక‌థ‌లు సృష్టించిన‌ట్లు పోలీసులు తెలిపారు. చివ‌ర‌కు అత‌ని ఇంట్లో ఉన్న ర‌క్త‌పు మ‌ర‌క‌ల‌తో కూడిన బ‌ట్ట‌లు, క‌త్తి అత‌న్ని ప‌ట్టించాయిని సీపీ అవినాష్ తెలిపారు.

యూరియా కొరత...రంగంలోకి మంత్రి తుమ్మల

  తెలంగాణలో యూరియా కొరత నేపథ్యంలో వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్వయంగా రంగంలోకి దిగారు.. యూరియాను ఎప్పటికప్పుడు సరఫరా కేంద్రాలకు తరలించేలా అధికారులను  మంత్రి ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నారు. కొన్ని జిల్లాల్లో లారీ అసోసియేషన్స్ మధ్య ఏర్పడిన పోటీతో యూరియా రవాణా నిలిచిపోవడంతో.. ట్రాన్స్‌పోర్ట్ సమస్యను స్వయంగా మాట్లాడి పరిష్కరిస్తున్నారు మంత్రి తుమ్మల. రామగుండం యూరియా ఫ్యాక్టరీతోనూ మంత్రి నిరంతర సంప్రదింపులు జరుపుతున్నారు.   రామగుండం ఫ్యాక్టరీ ఎండీతో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సంప్రదింపులు జరిపారు. కాగా, సాంకేతిక సమస్య కారణంగా రామగుండం ఫ్యాక్టరీలో యూరియా ఉత్పత్తి నిలిచిపోయిన సంగతి తెలిసిందే. ఉత్పత్తి ప్రారంభం అయితే యూరియా సమస్య కొంతైనా తీరే అవకాశం ఉందని ప్రభుత్వం భావిస్తోంది. మరోవైపు యూరియా కోసం అన్నదాత తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వ్యవసాయ కేంద్రాల దగ్గర పడిగాపులు కాస్తున్నారు. ఈ క్రమంలో ఓ రైతు పీఏసీఎస్ సెంటర్ మీద రాళ్లతో దాడి చేశారు. వనపర్తి జిల్లా అమరచింత మండల కేంద్రంలోని పీఏసీఎస్  వద్ద ఘటన చోటుచేసుకుంది.   తెలంగాణలో రైతులు ఎదుర్కొంటున్న యూరియా సమస్య పరిష్కారం కోసం కాంగ్రెస్ ఎంపీలు లోక్ సభలో గళమెత్తారు. యూరియా సమస్యను పరిష్కరించాలంటూ.. రాష్ట్ర కాంగ్రెస్ ఎంపీలు పార్లమెంట్‌ ఆవరణలో నిరసనకు దిగారు. కాంగ్రెస్ అగ్ర నేత్రి ప్రియాంక గాంధీ కూడా ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. అలానే బీఆర్ఎస్ ఎంపీలు కూడా యూరియా సమస్యను పరిష్కరించాలంటూ కేంద్రాన్ని కోరారు. ఈ క్రమంలో రాజ్యసభ సభ్యులు కేఆర్‌ సురేశ్‌రెడ్డి, వద్దిరాజు రవిచంద్ర ఢిల్లీలో కేంద్ర ఎరువులు రసాయనాల మంత్రి జేపీనడ్డాను కలిసి.. తెలంగాణలో  యూరియా సమస్యను పరిష్కరించాలని కొరారు.