రాహుల్ గాంధీ పై బహిష్కరణ వేటు?

పార్లమెంట్ బడ్జెట్ రెండో విడత సమావేశాలు  మొదలైన మొదటి క్షణం నుంచి వారాంతం వరకు ఒకే విధంగా నడిచాయి. సహజంగా  ప్రతిపక్ష పార్టీలు సభను స్తంభింప చేస్తాయి. అయితే ఈసారి  అధికార పార్టీ, అధికార కూటమి సభను సాగనీయలేదు. బడ్జెట్ సమావేశాలు మొదలైన మొదటి రోజు  కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ నాథ్ సింగ్  విదేశీ పర్యటనలో ఉన్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విదేశీ గడ్డపై నుంచి  దేశాన్నిఅవమానించే వ్యాఖ్యలు చేశారని  ఆరోపించారు. దేశంలో ప్రజాస్వామ్యంపై దాడి జరుగుతోందంటూ లండన్ లో దేశాన్ని పార్లమెంటును అవమానపరిచే విధంగా రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలకు, ఆయన పార్లమెంట్ కు, దెశ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని   డిమాండ్ చేశారు. కేంద్ర మంత్రి చేసిన డిమాండ్ చినికి చినికి గాలి వానగా మారింది. ఒకటి రెండు రోజులు కాదు, ఏకంగా వారం రోజుల పాటు, పార్లమెంట్ ఉభయ సభలను పైసా పనైనా చేయకుండా స్తంభింప చేసింది.  బీజేపీ  సభ్యులు సోమవారం మొదలు శుక్రవారం వరకు వారం రోజులు సభా కార్యక్రమాలను అడ్డుకున్నారు.  అఫ్కోర్స్  ప్రతిపక్ష పార్టీల సభ్యులు ఎప్పటిలానే  ఇప్పడు కూడా తమ వంతు కర్తవ్య్యాన్ని చక్కగా పోషించారు. సభా కార్యక్రమాలను అడ్డుకున్నారు. అదానీ గ్రూప్ వ్యవహారంపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ(జేపీసీ)ని ఏర్పాటు చేయాలని, కాంగ్రెస్ ఇతర ప్రతిపక్షాల సభ్యులు ఉభయసభల్లో ఆందోళన చేశారు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ  నినాదాలతో హోరెత్తించారు. అటు అధికార పక్షం,ఇటు ప్రతిపక్షాల సభ్యులు అరుపులు, నినాదాలతో వారాంతం (శుక్రవారం) వరకు కూడా ఎలాంటి కార్యకలాపాలు జరగకుండానే ఉభయ సభలు, వచ్చే సోమవారం, (మార్చి 20)కి వాయిదా పడ్డాయి.  అదలా ఉంటే, సోమవారం (మార్చి 20) పార్లమెంట్ సమావేశాలు తిరిగి ప్రారంభమైన తర్వాత, ఈ వివాదం మరో మలుపు తిరిగే అవకాశం ఉందని, జాతీయ మీడియాలో విస్తృతంగా ప్రచారం అవుతోంది.   లండన్‌లో భారత ప్రజాస్వామ్యం గురించి రాహుల్ గాంధీ చేసిన వాఖ్యలకు క్షమాపణలు చెప్పాలని కోరుతున్న అధికార పక్షం  అందుకు ఆయన అంగీకరించని పక్షంలో ఆయన్ను లోక్ సభ నుంచి బహిష్కరించాలనే ప్రతిపాదన సభ ముందుంచే అవకాశం ఉందని అంటున్నారు. అందుకు రిహార్సల్స్ గానే గత ఐదు రోజులుగా  అధికార బీజేపీ నాయకులు, మంత్రులు  రాహుల్ వ్యాఖ్యాలను తూర్పార పడుతున్నారని అంటున్నారు.  విదేశీ గడ్డపై భారత్‌ను అవమానించారని.. ఇందుకు ఆయన క్షమాపణ చెప్పాలని.. అప్పటిదాకా ఆయన్ను సభలో మాట్లాడనిచ్చేది లేదని స్పష్టం చేస్తోంది. మరో దేశానికి వెళ్లి దేశంలో ప్రజాస్వామ్యం బాగాలేదని చెప్పడానికి రాహుల్‌కు ఎంత ధైర్యం? అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆయన తన తప్పిదాన్ని చక్కదిద్దుకుంటేనే మాట్లాడేందుకు వీలు కలుగుతుందని బిజెపి తెలిపింది. కాగా, అదానీ అంశం నుంచి ప్రజల దృష్టి మరల్చడానికి బీజేపీ రాహుల్ ను సభ నుండి బహిష్కరించే ప్రయత్నం చేస్తున్నదని  కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఆరోపించారు. అంతే కాదు, రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పే ప్రశ్నే లేదని కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే స్పష్టం చేశారు.  అయితే ఇతర ప్రతిపక్ష పార్టీలు మాత్రం రాహుల్ వ్యవహారాన్ని మరో కోణంలో చూస్తున్నాయి.  కాంగ్రెస్, బీజేపీ  కలిసి ఆడుతున్న లైవ్ డ్రామా గా చూస్తున్నాయి. రాహుల్ గాంధీని  ప్రధాని నరేంద్ర మోడీకి ప్రధాన ప్రత్యర్ధిగా ప్రతిపక్ష పార్టీల ఉమ్మడి ప్రధాని అభ్యర్ధిగా చూపేందుకు కాంగ్రస్ పార్టీ ప్రయత్నిస్తుంటే, బీజేపీ, రాహుల్ గాంధీ బలహీనతలను సొమ్ము చేసుకునేందుకు  పరోక్షంగా రాహుల్ గాంధీని హీరోను చేసేందుకే, ఆయన్ని సభ నుంచి బహిష్కరించే ఆలోచన చేస్తోందని అంటున్నారు. అంటే  కాంగ్రెస్, బీజేపీలు పార్లమెంట్  వేదికగా రాహుల్ బహిష్కరణ డ్రామాను తెరమీదకు తెస్తున్నాయని అంటున్నారు.  భరత్ జోడో యాత్రతో రాహుల్ గాంధీ పొలిటికల్ స్టేచర్, రాజకీయ స్థాయి పెరిగిందని కాంగ్రెస్ భావిస్తోంది. అదే క్రమంలో రాహుల్ గాంధీని ప్రతిపక్షాల ప్రధాని అభ్యర్ధిగా చూపించే ప్రయత్న చేస్తుందనడంలో సందేహం లేదని అంటున్నారు. అలాగే,ప్రతిపక్ష్లాల మధ్య చిచ్చు పెట్టి, ఐక్యతను దెబ్బ తీసేందుకు, బీజేపీ రాహుల్ గాంధీని పావుగా వినియోగించుకున్నా వినియోగించుకుంటుంది అని కూడా అంటున్నారు,

తెలుగుదేశం గెలుపు గెలుపు కాదు.. మా ఓటమి ఓటమి కాదు.. సజ్జల నోట కొత్త భాష్యం

ఎన్నికలలో గెలుపు గెలుపే, ఓటమి ఓటమే. అది వైసేపీ అయినా మరోపార్టీ అయినా, గెలుపు ఓటములకు అనేక కారాణాలు ఉంటాయి. అయినా గెలుపు గెలుపే ఓటమి ఓటమే. అయితే గెలుపును ఎంజాయ్ చేసినంతగా ఓటమిని జీర్ణం చేసుకోవడం, సహజంగా అందరికీ సాధ్యం కాదు. అందులోనూ  వై నాట్ 175 అంటూ, రేపటి అసెంబ్లీ ఎన్నికల్లో 175కు 175 స్థానాల్లో  గెలుపు తమదే అన్న పగటి కలలు కంటున్న ఏపీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి, ఆయన, ఏదన్నా, అంతేగా .. అంతేగా అంటూ తలలూపే సలహాదారులకు, ఎమ్మెల్సీ ఎన్నికలో ఎదురైనా చేదు అనుభవం మింగుడు పడడం కష్టమే. అదీ గాక, పిచ్చోడి చేతిలో రాయి ఎవరి నెత్తిన పడుతుందో అనే భయం వల్ల కూడా కావచ్చు, సర్వ శాఖల మంత్రిగా ప్రసిద్దుడైన ప్రభుత్వ సలహాదారు  సజ్జల రామకృష్ణా రెడ్డి  పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలో టీడీపీ సృష్టించిన ప్రభంజనాన్ని తక్కువ చేసి చూపేందుకు పడరాని పాట్లు పడుతున్నారు. పట్టభద్రుల స్థానాల్లో వైసేపీ ఘోర పరాజయాన్ని హుందాగా స్వీకరించేందు బదులుగా  సజజ్ల కుంటి సాకులు వెతుక్కోవడం ఏమిటని, వైసేపీ నేతలే అంటున్నారు. నవ్వుకుంటున్నారు. అవును. చదవేస్తే ఉన్నమతి పోయింది అన్నట్లు, టీడీపీ గెలుపు  గెలుపు కాదు, వైసేపీ ఓటమి ఓటమి కాదు అనే కొత్త భాష్యాన్ని సజ్జల తెర మీదకు  తెచ్చారు.  పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వచ్చిన ఓట్లన్నీ టీడీపీవి కావని, ప్రభుత్వ సజ్జల చెప్పుకొచ్చారు. పీడీఎఫ్ ఇతర వామపక్షాలకు చెందిన ఓట్లే టీడీపీ వైపు మళ్లాయన్నారు. ఎన్నికలు జరిగిన స్థానాలు అన్నింటినీ కలిపి చూడాలని సూచించారు. ఏ రకంగానూ ఈ ఎన్నికలు ప్రభుత్వ వ్యతిరేకతను ప్రతిఫలించవన్నారు. టీడీపీ  సంబరాలు చేసుకోవడంతోనే అంతా అయిపోలేదని, ఈ ఫలితాలను తాము హెచ్చరికగా భావించడం లేదని సజ్జల స్పష్టం చేశారు. ఈ ఓటర్లు మొత్తం సమాజాన్ని ప్రతిబింబించే పరిస్థితి లేదని తెలిపారు. ఒక వర్గం ఓటర్లను రాష్ట్రం మొత్తానికి ఎలా అపాదిస్తారని ప్రశ్నించారు. అంతే కాదు, ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాల పరిధిలో పట్టభద్రుల ఓటర్లు లేరని తెలిపారు. అంటే  వైసీపే ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేస్తోంది, పేద ప్రజలను ఆదుకునేందుకో  పేదరిక నిర్మూలనకో కాదని  కేవలం ఓటు బ్యాంకును పెంచుకునేందుకే అనే నిజాన్ని సజ్జల అంగీకరించారు. నిజానికి సంక్షేమ పథకాల లబ్దిదారులంతా కట్టు బానిసల్లా మళ్ళీ  తమకే ఓటు వేస్తారనే భ్రమల్లోంచే, 175/175 భరోసా పుట్టుకొచ్చింది. కానీ, పట్టభద్రులైనా, పేద ప్రజలైనా  కేవలం సంక్షేమం మాత్రమే కోరుకోరు. అయినా సజ్జల రామకృష్ణా రెడ్డి ఈ ఫలితాలను తాము హెచ్చరిక భావించడం లేదని, ప్రభుత్వ వ్యతిరేకతగా గుర్తించడం లేదని అంటున్నారు. అంటే నిజాన్ని అగీకరించేందుకు వైసీపే నాయకత్వం సిద్దంగా లేదని, అదే ఆ పార్టీకి ఆత్మహత్యా సదృశ్యం అవుతుందని రాజకీయ పరిశీలకు విశ్లేషిస్తున్నారు.

అరెస్టా.. కాదా? సీబీఐ ఏం చేస్తుంది? అవినాష్ వ్యవహారంలో సర్వత్రా ఉత్కంఠ

వైఎస్ వివేకా హత్య కేసులో కడప ఎంపీ అవినాష్ రెడ్డి విషయంలో హైకోర్టు తెలంగాణ హైకోర్టు సీబీఐ దర్యాప్తులో జోక్యం చేసుకోబోమని తేల్చేసింది  దీంతో ఇక అవినాష్ రెడ్డి అరెస్టే తరువాయి అన్న భావనే సర్వత్రా వ్యక్తమౌతోంది. అయితే అదే రోజు సీఎం ఢిల్లీ వెళ్లి, పీఎంను కలిశారు.  దీంతో  సీబీఐ దూకుడు తగ్గిస్తుందా?  కొనసాగిస్తుందా అన్న మీమాంశ వ్యక్తమౌతోంది. సీఎం జగన్ ప్రధానిని కలిసిన తరువాత సీబీఐ నెమ్మదిస్తే అది ఆ దర్యాప్తు సంస్థ విశ్వసనీయతను దెబ్బతీస్తుంది.   కడప వైసీపీ ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డిని అరెస్టు చేయాలన్న, సీబీఐ ప్రయత్నాలకు కొద్దిరోజులు బ్రేక్‌ వేసిన తెలంగాణ హైకోర్టు, ఆ తరువాత  గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చేసింది. అవినాష్‌రెడ్డి అరెస్టులో జోక్యం చేసుకోలేం. ఈ విషయంలో సీబీఐదే తుది నిర్ణయమంటూ చేప్పేసిన తరువాత  ఇప్పుడు సీబీఐ వెనుకాడితే అది సీబీఐ ప్రతిష్టకు మచ్చ తీసుకురావడం ఖాయమన్న అభిప్రాయమే సర్వత్రా వ్యక్తమౌతోంది. అయితే.. కోర్టు అవినాష్ అరెస్టుకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ తీర్పు వెలువరించిన రోజే.. బడ్జెట్ సమావేశాలను కూడా పక్కన పెట్టేసి హడావుడిగా హస్తిన కేగి ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షాతో జగన్ భేటీ అయిన నేపథ్యంలో ఆయన పర్యటనపై పలు ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయి.  అవినాష్‌రెడ్డి, అరెస్టును అడ్డుకునేందుకే జగన్‌ ఢిల్లీ వెళ్లారని విపక్షాలు ఆరోపించాయి. అలాగే అవినాష్ తోనే వదిలేయండి ఇంకా ముందుకు వద్దు అని వేడుకోవడానికే జగన్ హస్తిన వెళ్లారన్న వాదనా వినిపించింది. అయినా అవినాష్, ఆయన తండ్రి భాస్కరరెడ్డి ఇబ్బందులలో పడిన ప్రతి సారీ జగన్ హస్తిన పర్యటన పెట్టుకోవడం వెనుక కారణమేమిటని విపక్ష తెలుగుదేశం ప్రశ్నిస్తోంది.  సీబీఐపై ఒత్తిడి తీసుకువచ్చేందుకే జగన్‌, ఢిల్లీకి వెళ్లారన్నది విపక్షాల ఆరోపణ. దీనితో  అందరి చూపు ఇప్పుడు  సీబీఐ తదుపరి చర్య ఏమిటా అన్న దానిపైనే పడింది. నిన్నటి వరకూ అవినాష్‌ అరెస్టు కోసం  పట్టుదల ప్రదర్శించిన   సీబీఐ.. ఇప్పుడు మోడీ-జగన్‌ భేటీ తర్వాత అదే వైఖరి కొనసాగిస్తుందా? అంటూ విపక్షాలు సందేహం వ్యక్తం చేస్తున్నాయి.  సీబీఐ అరెస్టు విషయంలో వెనక్కు తగ్గి, అవినాష్ రెడ్డి సుప్రీం కోర్టును ఆశ్రయించేందుకు అవకాశం సమయం ఇస్తే.. జగన్ హస్తిన వెళ్లి చేసిన ప్రయత్నాలు ఫలించాయని భావించాల్సి ఉంటుంది. అలా కాకుండా అవినాష్ రెడ్డిని సీబీఐ అరెస్టు చేస్తే జగన్ వెళ్లింది అవినాష్ రెడ్డి అరెస్టును అడ్డుకోవడానికి కాదు, రాష్ట్ర అంశాలను చర్చించేందుకేనని జనం భావించేందుకు ఆస్కారం అభిస్తుంది.   

బీజేపీ రాష్ట్ర నాయకత్వం ఆత్మ పరిశీలన చేసుకోవాలి: విష్ణుకుమార్ రాజు

ఆంధ్రప్రదేశ్ లో ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల సరళి చూసిన తరువాతైనా బీజేపీ రాష్ట్ర నాయకత్వం ఆత్మపరిశీలన చేసుకోవాలని ఆ పార్టీ నాయకుడు  విష్ణుకుమార్ రాజు అన్నారు. ఏపీలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ ఏ మాత్రం ప్రభావం చూపలేకపోవడానికి పార్టీ రాష్ట్ర నాయకత్వం తీరే కారణమని ఆయన అభిప్రాయపడ్డారు. చెల్లని ఓట్ల తో పోటీ పడే పరిస్థితి రావడానికి కారణం రాష్ట్రంలో బీజేపీ అధికార వైసీపీతో కలిసి పని చేస్తోందని ప్రజలు భావించడమే కారణమని విష్ణుకుమార్ రాజు అన్నారు.  రాష్ట్ర బీజేపీ వైసీపీతో అంటకాగుతోందన్న ముద్రను తొలగించుకోకపోతే ముందు ముందు మరింత దారుణమైన ఫలితాలను ఎదుర్కొన వలసి వస్తుందని పేర్కొన్నారు.  పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ ఎన్ని ప్రయత్నాలు చేసినా ప్రజలు ఆదరించకపోవడాన్ని గమనించాలని, ఒత్తిళ్లు, ప్రలోభాలు ఏవీ పనిచేయకపోవడం ప్రజల్లో వస్తున్న మార్పుకు సంకేతమని అన్నారు.  ఏపీలో టీడీపీ, బీజేపీ, జనసేన కలిస్తేనే మేలు జరుగుతుందని, ప్రజాస్వామ్య విలువలను కాపాడాలంటే ఈ కలయిక తప్పనిసరి అని విష్ణుకుమార్ రాజు అభిప్రాయపడ్డారు.

జాతీయ రాజకీయాలకు కేసీఆర్ ఇంట్రవెల్?

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు ఇంకా ఏంతో దూరంలో లేవు... మే  వరకు గడువున్నా, రేపో మాపో ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినా రావచ్చునని అంటున్నారు. మరో వంక, బీజేపీ, కాంగ్రెస్, జనతా దళ్( ఎస్) పార్టీలు ఎన్నికల ప్రచారంలో తలమునకలై ఉన్నాయి. ఇప్పటికే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, ఇతర ముఖ్యనాయకులు అందరూ రాష్ట్రంలో సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు.  అలాగే  కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు, పార్టీ సుప్రీం లీడర్ రాహుల్ గాంధీ మరో రెండు రోజుల్లో అంటే సోమవారం ( మార్చి 20) బెల్గాంలో జరిగే యువజన్ సమ్మేళనంలో పాల్గొంటారు.   అదే రోజున కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధుల తోలి జాబితా ప్రకటించే అవకాశం ఉందని అంటున్నారు. అలాగే  హంగ్  అంచనాలతో జేడీ(ఎస్) నేత  మాజీ ముఖ్యమంత్రి కుమార స్వామి పార్టీకి మైసూర్  ప్రాంతంలో పట్టును నిలుపుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.  అయితే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల నుంచే భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) జాతీయ ప్రస్థానం మొదలవుతుందని, ప్రకటించిన కేసీఆర్  ఎందుకో ఆ రాష్ట్రం వైపు కన్నెత్తి చూడటంలేదు.కర్నాటక అసెంబ్లీ ఎన్నికలో బీఆర్ఎస్ పోటీ దిశగా ఆ పార్టీలో ఎక్కడా చలనం కనిపించడం లేదు.  ఇప్పుడు  బీఆర్ఎస్ ముఖ్యులంతా  ఢిల్లీ మద్యం కుంభకోణంలో  అనుమానితురాలుగా విచారణ ఎదుర్కుంటున్న పార్టీ ఎమ్మెల్సీ, ముఖ్యమంత్రి కేసీఆర్  కుమార్తె  కల్వకుంట్ల కవితను కాపాడుకోవడం ఎలా? టీఎస్పీఎస్సీ   పరిక్ష పత్రాల లీకేజీ కుంభకోణం నుంచి బయట పడడం ఎలా?  అనే విషయాలపైనే దృష్టిని కేద్రీకరించారని జరుగుతున్న పరిణామాలను బట్టి అందరికీ అర్థమౌతోంది.   మరోవంక  బీఆర్ఎస్ తొలి  అడుగు నుంచి కేసీఆర్ తో కలిసి నడిచిన, జేడీ (ఎస్) అధ్యక్షుడు, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమార స్వామి ఎందుకో ఏమో కానీ మెల్ల మెల్లగా కేసీఆర్ కు దూరమవుతున్నారు. నిజానికి, అప్పట్లో, బీఆర్ఎస్,  జేడీ(ఎస్) మధ్య పొత్తు ఖరారైందనే వార్తలు కూడా వచ్చాయి. హైదరాబాద్ తెలంగాణగా ప్రసిద్ధి చెందిన కర్ణాటక సరిహాద్దు ప్రాంతంలో ముఖ్యంగా తెలుగువారున్న చోట్ల బీఆర్ఎస్ పోటీ చేస్తుందని మిగతా చోట్ల జేడీఎస్‌కు బీఆర్ఎస్ మద్దతు ఇస్తుందని చెప్పుకున్నారు. అయితే  ఇప్పడు కుమారస్వామి, కేసీఆర్ మధ్య దూరంపెరిగిన నేపధ్యంలో  కుమరస్వామి హైదరాబాద్ వైపు కన్నెత్తి చూడడం లేదు. బీఆర్ఎస్ పార్టీతో పొత్తు విషయాన్ని పూర్తిగా  మరిచి పోయారు. ఇప్పటికే ఆయన తమ పార్టీ తరపున పోటీ చేసే అభ్యర్ధుల తొలి జాబితాను ప్రకటించారు. మరో వంక  బీఆర్ఎస్ నాయకత్వం కూడా కర్ణాటకలో పోటీ చేసే ఆలోచనను  పక్కన పెట్టినట్లు తెలుస్తోంది. అంతే కాకుండా  ముందు తెలంగాణ గండం గట్టెక్కితే, ఆ తర్వాత జాతీయ రాజకీయాల గురించి అలోచించ వచ్చనే నిర్ణయానికి బీఆర్ఎస్ వచ్చినట్లు తెలుస్తోంది.  అదలా ఉంటే, అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్ననేపథ్యంలో జాతీయ రాజకీయాలకు తాత్కాలిక విరామం ఇచ్చి ప ముందు రాష్ట్రంలో తిరిగి అధికారంలోకి వచ్చేదెలా, అనే విషయంపైనే దృష్టిని కేంద్రీకరించాలని పార్టీ ‘పెద్దలు’ కూడా సూచిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే, ఏదైనా అంతిమ నిర్ణయం తీసుకోవలసింది మాత్రం ముఖ్యమంత్రి కేసీఅర్, మంత్రి కేటీఆర్.  ఆ ఇద్దరి నిర్ణయం పైనే బీఆర్ఎస్ భవిష్యత్ ఆధారపడి ఉంటుందని అంటున్నారు.

జగన్ పులివెందుల కోటకు బీటలు!

వైసీపీకి పులివెందుల పెట్టని కోట. అక్కడ వైఎస్ కుటుంబం ఏం చెబితే అది.. అన్నట్లుగా సాగుతుంది. అలాంటి పులివెందులలో అనూహ్యంగా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలో తెలుగుదేశం భారీ ఆధిక్యత సాధించింది. ఇక్కడ తెలుగుదేశం పార్టీకి 4323 ఓట్లు వస్తే.. వైసీపీకి 2120 ఓట్లు వచ్చాయి. పులివెందులలో జగన్ కోటకు బీటలు వారాయని ఈ అంకలే నిర్ద్వంద్వంగా నిరూపిస్తున్నాయి. కంచుకోట లాంటి పులివెందులలో జగన్ పట్టు సడలడానికి ఆయన స్వయంకృతాపరాధమే కారణమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. వైఎస్ బతికి ఉన్నంత కాలం  ఆయన, వైఎస్ వివేకానందరెడ్డి వేరు వేరని నియోజకవర్గంలో ఎవరూ కనీసం ఊహలో కూడా అనుకుని ఉండరు. అయితే వైఎస్ మరణాననంతరం జరిగిన పరిణామాలలో జగన్ వైఎస్ వివేకాను దూరం పెడుతున్నారా అన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. అందుకు జగన్ వైసీపీ స్థాపించి కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పిన తరువాత కూడా వైఎస్ వివేకా కాంగ్రెస్ లోనే కొనసాగారు. అంతే కాదు సొంత వదినపై పోటీ కూడా చేశారు. సరే అన్నీ సర్దుకున్నాయి వైఎస్ వివేకా జగన్ పార్టీలో చేరిపోయారు. కానీ గత ఎన్నికల ముందు అంటే 2019 ఎన్నికల ముందు వైఎస్ వివేకా దారుణ హత్యకు గురయ్యారు. హత్యకు గురైన తొలి నాళ్లలో ఈ హత్య విషయంలో జగన్ ఫ్యామిలీపై ఎవరికీ ఎటువంటి అనుమానాలూ రాలేదు. కానీ ఇప్పుడు సీబీఐ దర్యాప్తు తరువాత ఒక్కటొక్కటిగా వెలుగులోకి వస్తున్న వాస్తవాల నేపథ్యంలో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి పాత్రపై సర్వత్రా అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. అలాగే అవినాష్ రెడ్డిని కాపాడేందుకు జగన్ చేస్తున్న ప్రయత్రాలు కూడా సందేహాలను ఇనుమడింప చేస్తున్నాయి. అన్నిటికీ మించి తన తండ్రి హత్య కేసులో పాత్ర ధారులు, సూత్ర ధారులు ఎవరో తెలియాల్సిందే అంటూ న్యాయపోరాటం చేస్తున్న వివేకా కుమార్తె  డాక్టర్ సునీతకు అడుగడుగునా ఎదురౌతున్న అడ్డంకులు, ఆమెపైనా, ఆమె భర్తపైనా అవినాష్ తాజాగా చేసిన ఆరోపణల నేపథ్యంలో పులివెందులలో సహజంగానే జగన్ సోదరికి అండగా నిలవక పోవడానికి కారణమేమిటన్న చర్చ మొదలైంది. అలాగే   వైఎస్ కుటుంబంలో ఏర్పడిన పరిణామాలతో జగన్, అవినాష్ రెడ్డిల తీరుపైనా పులివెందుల ప్రజల్లో వ్యతిరేకత కనిపిస్తోంది. అందుకు తార్కానమే ఇటీవల వైఎస్ వివేకా వర్ధంతి కార్యక్రమంలో వెలసిన ఫ్లెక్సీలు పోస్టర్లలో వైఎస్ కుటుంబానికి చెందిన అందరి ఫొటోలు ఉన్నాయి కానీ సీఎం జగన్, ఎంపీ అవినాష్ ల చిత్రాలకు వాటిలో చోటు లేకుండా పోయింది. ఇటీవలి కాలంలో జగన్ పై పులివెందులలో వ్యక్తమౌతున్న వ్యతిరేకత వల్లే ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి కంటే తెలుగుదేశం అభ్యర్థికే ఎక్కవ ఓట్లు పోలయ్యాయని అంటున్నారు. ఇందుకు జగన్ పై వ్యతిరేకతే కారణమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇదే ట్రెండ్ అసెంబ్లీ ఎన్నికలలో కూడా కొనసాగే అవకాశాలు ప్రస్ఫుటంగా ఉన్నాయనీ చెబుతున్నారు.  

ఎక్కడో ఏదో తేడా కొట్టింది.. అందుకే జగన్ ఢిల్లీ యాత్ర!?

వైఎస్ వివేకా హత్య కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి తెలంగాణ హైకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. తనపై సీబీఐ కఠిన చర్యలు తీసుకోకుండా ఆదేశించాలని కోరుతూ వేసిన రిట్ పిటిషన్‌ను తెలంగాణ హైకోర్టు కొట్టేసింది. అలాగే అవినాష్ రెడ్డి తదుపరి విచారణపై స్టే ఇవ్వలేమని తేల్చి చెప్పేసింది. దీంతో   అవినాష్‌రెడ్డికి ఉన్న ఒకే ఒక్క దారి సైతం మూసుకుపోయినట్లైంది. మరోవైపు ఇదే కేసులో  అవినాష్ రెడ్డి గురువారం సీబీఐ ఎదుట విచారణకు హాజరుకావాల్సి ఉన్నా.. ఆయన డుమ్మా కొట్టారు. ఇటువంటి పరిణామం ఏదో చోటు చేసుకొనే అవకాశం ఉందని ముందుగానే ఆయన ఊహించి డుమ్మా కొట్టేశారనే చర్చ పొలిటికల్ సర్కిల్స్ లో సాగుతోంది. ఈ నేపథ్యలోనే జగన్ హస్తిన పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. అదీ కాక మంగళవారం  (మార్చి 14 వైఎస్ వివేకా హత్య కేసులో వైయస్ అవినాష్ రెడ్డి నాలుగో సారి సీబీఐ  విచారణకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఈ కేసులో కీలక అధారాలను ముందు పెట్టి మరీ సీబీఐ అధికారులు వరుసగా ప్రశ్నలు సంధించడంతో... కడప ఎంపీ ఒకానొక సందర్భంలో మౌనంగా ఉండిపోయారనే కథనాలు   మీడియాలో వెల్లువెత్తాయి.   అంతేకాకుండా వివేకా హత్య కేసులో ముందు ముందు మరింత మందిని అంటే.. వైఎస్ కుటుంబంలోని కీలక వ్యక్తులను సైతం సీబీఐ పిలిచి విచారించే అవకాశాలు  ఉన్నాయని.... ఇటువంటి పరిస్థితుల్లో మరో గత్యంతరం లేకే సీఎం జగన్ ఆదరా బాదరాగా ఢిల్లీకి ప్రయాణం కట్టారనే టాక్ వినిపిస్తోంది. ఇంకో వైపు ఆంధ్రప్రదేశ్ శాసనసభలో బడ్జెట్ సమావేశాలు జరుగుతోన్నా కూడా సీఎం జగన్.. ఢిల్లీ వెళ్లక తప్పని పరిస్థితి ఏర్పడిందని అంటున్నారు. ఇక ప్రధాని మోడీతో పాటు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాలతో సీఎం వైయస్ జగన్ అపాయింట్‌మెంట్ కోసం ఫ్యాన్ పార్టీలో కీలక నేత, ఎంపీ విజయసాయిరెడ్డి తీవ్రంగా ప్రయత్నించి.. సఫలీకృతులయ్యారనే టాక్ సైతం నడుస్తోంది.  ఇక సీఎం జగన్ ఇంత ఆకస్మికంగా ఢిల్లీ పర్యటనపై అటు మీడియాలో.. ఇటు సోషల్ మీడియాలో విభిన్న కథనాలు వెల్లువెత్తాయి. అవేమంటే.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని వివరించడం కోసం..  అలాగే సంక్షేమ పథకాలు కోసం మరింత అప్పు కావాలని విజ్జప్తి చేయడం కోసం...  విశాఖ వేదికగా ఇటీవల జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్ల సదస్సు వివరాలు వివరించడం కోసం.. రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులు వివరించడం కోసం.. ఢిల్లీలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఏర్పాటుకు భూమి కేటాయించాలని విజ్జప్తి చేయడం కోసం.... అలాగే కోడి కత్తి కేసులో ఏప్రిల్ 10న విచారణకు హాజరు కావాలంటూ.. వైయస్ జగన్‌తోపాటు ఆయన పీఏ కేఎన్ఆర్‌కి విజయవాడలోని ఎన్ఐఏ కోర్టు ఆదేశించడం... తదితర అంశాలను మోదీ, అమిత్ షా ద్వయంతో సీఎం వైయస్ జగన్ ప్రస్తావించే అవకాశాలు ఉన్నాయంటూ సదరు కథనాలు వివరిస్తున్నాయి.  అయితే ఈ అంశాలను చర్చించాలంటే.. మరి ఇంత హడావుడిగా సీఎం   జగన్ ఢిల్లీకి వెళ్లాల్సిన అవసరం లేదని  పోలిటికల్ సర్కిల్‌లో ఓ చర్చ జరుగుతోంది. కానీ మరీ ఇంత హడావుడిగా అప్పటికప్పుడు సీఎం  జగన్ హస్తినకు,  అదీ ప్రత్యేక విమానంలో ప్రయాణం కట్టడం చూస్తుంటే ఎక్కడో... ఏదో... ఏదో తేడా కొడుతోందనే ఓ టాక్   పోలిటికల్ సర్కిల్‌లో రచ్చ రంబోలా చేసి పారేస్తోంది.

వన్ నేషన్.. వన్ ఎలక్షన్ మళ్లీ తెరమీదకు!

దేశంలో జమిలి ఎన్నికల అంశం మరోసారి తెరపైకి వచ్చింది.  అటు లోక్‌సభకూ, ఇటు రాష్ట్రాల్లోని అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు జరిపిస్తే.. ఎన్నికల నిర్వహణ ఖర్చు బాగా తగ్గుతుందని కేంద్రం చెబుతోంది.  నిన్న పార్లమెంట్‌లో దీనిపై కీలక   ప్రకటన చేసింది. జమిలికి తాము సిద్ధంగా ఉన్నామని, ఇందుకోసం రాజ్యాంగాన్ని సవరించేందుకు.. రాజకీయ పార్టీలను ఒప్పించేందుకు ప్రయత్నం జరుగుతోందనీ పేర్కొంది. కేంద్ర ప్రభుత్వం జమిలి ఎన్నికలు జరిపించే ఆలోచనలో ఉందా అన్న విపక్షాల ప్రశ్నకు కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరణ్ రిజిజు   జమిలికి పార్లమెంటరీ కమిటీ సానుకూలంగా ఉందని బదులిచ్చారు. ఈ ఎన్నికల రోడ్ మ్యాప్, ఫ్రేమ్ వర్క్ కోసం... దీన్ని న్యాయ కమిషన్‌కి సిఫార్స్ చేసినట్లు   వివరించారు. ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించడం వల్ల ఖర్చు తగ్గడమే కాకుండా.. శాంతి భద్రతల సమస్య కూడా తగ్గుతుందనీ, అలాగే  రాజకీయ పార్టీలు, అభ్యర్థుల ఎన్నికల ప్రచార ఖర్చు కూడా   తగ్గుతుందని అన్నారు. ఈ కారణంగానే జమిలి కోసం ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. దీంతో దేశంలో నెక్స్ట్ జరిగేది జమిలి ఎన్నికలేనా? కేంద్ర ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేస్తోందా? అంటే ఔననే అనాల్సి వస్తోంది. నిజానికి, ప్రధాని నరేంద్ర మోడీ సారధ్యంలో బీజేపీ, 2014లో తొలిసారి అధికారంలోకి వచ్చింది మొదలు  కేంద్ర ప్రభుత్వం  జమిలి ఎన్నికలకు సుముఖగానే వుంది. సుముఖంగా ఉండడమే కాదు, అప్పటి నుంచి ఆ దిశగా పావులు కదుపుతూనే వుంది. 2019 బీజేపీ ఎన్నికల మానిఫెస్టోలో కూడా’జమిలి’ అంశాన్ని చేర్చారు. 2019ఎన్నికల తర్వాత, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జమిలి పై చర్చకు .. అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశారు. జమిలి ఎన్నికల మంచి చెడులను చర్చించారు. కాంగ్రెస్,కమ్యూనిస్ట్ పార్టీలు, ఒకటి రెండు ప్రాతీయ పార్టీలు మినహా,  తెరాస సహా చాలా వరకు పార్టీలు  అప్పట్లో జమిలికి జై కొట్టాయి. నీతీ ఆయోగ్‌ కూడా నివేదిక సిద్ధం చేసింది. లా కమిషన్‌ రాజకీయ పార్టీల అభిప్రయాలను రికార్డు చేసింది.  మరో వంక జమిలి ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది. ఏకాభిప్రాయం వ్యక్తం అయితే రాజ్యాంగ సవరణ ద్వారా వన్‌ నేషన్..‌ వన్‌ ఎలక్షన్‌ తో ముందుకు వెళ్లే అవకాశం ఉందని ఎన్నికల సంఘం ఆ దిశగా అడుగులు వేస్తోంది. అంతేకాదు, పార్లమెంట్ ఎప్పుడు ఆమోదం తెలిపినా, నిర్దిష్ట  సమయంలో లోక్ సభ, అసెంబ్లీలలతో పాటుగా స్థానిక సంస్థలు ఒకే సారి, ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం సిద్ధంగా వుందని, అధికారులు పలు సందర్భాలలో పేర్కొన్నారు. అంతే కాదు, జమిలి ఎన్నికల అవసరాన్ని, ప్రయోజనాలను వివరిస్తూ నిర్వహించే సెమినార్లు, వర్క్ షాపులలో కేంద్ర ఎన్నికల సంఘం క్రియాశీలక భూమిక  పోషిస్తోంది. జమిలి ఎన్నికలకు సానుకూల వాతావరణం ఏర్పరిచే విషయంలో  కేంద్ర ఎన్నికల సంఘం తన వంతు పాత్రను పోషిస్తోంది.   తాజగా  కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు పార్లమెంటులో ఇదే విషయం చెప్పారు. వాస్తవానికి దేశంలో 1951, 1952, 1957, 1962, 1967లో జమిలి ఎన్నికలు జరిగాయి. 1968, 69లో పలు అసెంబ్లీలు నిర్ణీత గడువు కంటే ముందే రద్దు కావడంతో జమిలి ఎన్నికలకు అంతరాయం కలిగింది.  

జగన్ విశాఖకు రావద్దు.. ఎన్నిక ఫలితం సారాంశమిదే!

ప్రశాంత వాతావరణము కోరుకునే విశాఖ ప్రజలు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ద్వారా రాజధాని వద్దని తేల్చి చెప్పేశారు. ఉత్తరాంధ్ర గ్రాడ్యుయేట్ నియోజకవర్గ ఫలాతాలు తేల్చేసిన వాస్తవం ఇదే.  అత్యంత ప్రశాంతంగా ఉండే విశాఖ జగన్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదవీ పగ్గాలు చేపట్టిన నటి నుంచి అశాంతికి నిలయంగా మారిపోయింది. ఆ విషయాన్ని ఉత్తరాంధ్రప్రజలు గుర్తించారు.   ఆస్తులకు రక్షణ లేకుండా పోయింది, శాంతి భద్రతల పరిస్థితి అధ్వానంగా మారిపోయింది. స్థానికులు భద్రతా లేమితో బాధపడుతున్నారు.  ఏదైనా స్థలంపై అధికార పార్టీ నేతల కన్ను పడితే ఇక ఆ స్థల యజమాని దానిపై ఆశలు వదిలేసుకోవలసిందే అన్న పరిస్థితి ఏర్పడింది. ఇంత కాలం పంటి బిగువున బాధను, ఆగ్రహాన్ని అణచుకున్న జనాగ్రహాన్ని  పట్టభద్రులు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటుతో వెళ్లగక్కడారు. ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎన్నికలో తెలుగుదేశం అభ్యర్థి చిరంజీవిని భారీ మెజారిటీతో గెలిపించి వైసీపీకి గ్రాడ్యుయేట్లు తమ సత్తా చూపారు. రేపు అసెంబ్లీ ఎన్నికలలోనూ జనం ఇదే రీతిక స్పందిస్తారని, ఇది ట్రయల్ మాత్రమేనని ఉత్తరాంధ్ర వాసులు అంటున్నారు.  ప్లీజ్ డోంట్ కమ్ టు విశాఖ అని ముఖ్యమంత్రి జగన్ కు పట్టభద్రులు తమ ఓటు ద్వారా విస్పష్టంగా తేల్చి చెప్పేశారు. అదే విధమైన పోస్టర్లను జనం విశాఖ అంతటా ప్రదర్శించారు.  గత రెండేళ్లుగా విశాఖకు వస్తానని ముఖ్యమంత్రి చెబుతున్నారు. వద్దు బాబోయ్ అని గ్రాడ్యుయేట్లు ఒక దణ్ణం పెట్టేశారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో వైసీపీ అభ్యర్థిని ఓడించి తమ అభిమతమేమిటో చెప్పేశారు. ఇక విశాఖ రాజధాని కాదు..విశాఖలో ఓ క్యాంపు కార్యాలయం పెట్టుకుని ముఖ్యమంత్రి ఇక్కడ కూర్చున్నంత మాత్రాన విశాఖ రాజధాని కాదు, కాలేదు, కాబోదు. ఈ విషయంలో స్పష్టతతో ఉన్న ఉత్తరాంధ్ర ప్రజలు  వచ్చే ఎన్నికలలో పట్టభద్రులు చూపిన బాటలోనే నడుస్తామంటూ చిరంజీవి విజయాన్ని పురస్కరించుకుని చేసుకుంటున్న సంబరాల ద్వారా చాటుతున్నారు.   ఏదో సినిమా డైలాగులా  జీతాలు ఎప్పుడు ఇచ్చామన్నది కాదు… ఇచ్చామా లేదా అన్నదే ముఖ్యమని అహంకారంతో చెప్పిన మంత్రి బొత్స సత్యనారాయణ చెంపపెట్టులాంటి ఈ తీర్పుపై ఏమని స్పందిస్తారో చూడాలి.  ఇక గ్యాడ్యుయేట్ ఎమ్మెల్సీ మూడు స్థానాలకు జరిగిన ఎన్నికలలో రెండింట్లో ఓడి.. మూడో స్థానంలో ఓటమి అంచుల్లో ఉంది. ఈ పరిస్థితే  వైసీపీ పట్ల జనంలో ఉన్న వ్యతిరేకతకు అద్దం పడుతోంది. వైనాట్ 175 అంటున్న అధినేత ఇప్పుడు ఏమంటారో చూడాలి. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగిన రెండు స్థానాలలోనూ గెలిచాం అన్న ఆనందం కూడా వైసీపీకి దక్కలేదు. ఎందుకంటే ఆ రెండు స్థానాలలోనూ కూడా వైసీపీ వ్యతిరేక ఓటు చీలిక కారణంగానే విజయం సాధించగలిగింది. అయితే వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలే అవకాశం లేదని ఇప్పటికే జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పష్టత ఇచ్చేశారు. దాంతో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలను చూసి సంబరపడే అవకాశం లేకుండా పోయింది వైసీపీకి.    

స్వీయ సంరక్షణార్థమే హస్తిన యానమా?

వైఎస్ వివేకా హత్య కేసులో అవినాష్ ను కాపాడగలనన్న నమ్మకాన్ని జగన్  కోల్పోయారా? ఇక అవినాష్ సంగతి వదిలేసి.. హత్య ఆరోపణలు తన ఇంటి మీదకు రాకుండా ఉండేందుకు అవసరమైన ప్రయత్నాలు చేసుకుంటున్నారా? అంటే పరిశీలకులు ఔననే అంటున్నారు. అవినాష్ కోసం ప్రయత్నిస్తే మొదటికే మోసం వస్తుందని జగన్ భావిస్తున్నారని అంటున్నారు. గుండె పోటు నుంచి మొదలు పెట్టి గొడ్డలి పోటు వరకూ వచ్చి... నారాసుర రక్త చరిత్ర అంటూ ఆరోపణలు గుప్పించిన వైఎస్ జగన్ అసెంబ్లీ వేదికగా ఒక కన్ను రెండో కన్నును ఎందుకు పొడుచుకుంటుంది అంటూ సెంటిమెంట్ కూడా పండించారు. ఇప్పుడు చివరికి బాబాయ్ ని హత్య చేసింది ఆయన కుమార్తె, అల్లుడే అంటూ కొత్త వాదనను తెరమీదకు తెచ్చారు. అదే వాదనను కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి సీబీఐ ఎదుట, కోర్టులోనూ వినిపించారు. అయితే అవేమీ ఫలించలేదు. వివేకా హత్య కేసులో ఇక అవినాష్ అరెస్టే తరువాయి. ఏ క్షణంలోనైనా ఆయనా, ఆయన తండ్రి వైఎస్ భాస్కరరెడ్డిల అరెస్టు తథ్యం అని గట్టిగా వినిపిస్తున్న వేళ.. జగన్ హుటా హుటిన సిరికిం జెప్పడు అన్నట్లుగా హస్తిన ఫ్లైట్ ఎక్కేశారు. హడావుడిగా ప్రధాని అప్పాయింట్ మెంట్ సైతం సంపాదించేశారు. బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న వేళ.. ఆ సమావేశాలకు డుమ్మా కొట్టి మరీ ఆయన ఒక రోజు ఢిల్లీ పర్యటన ఎందుకన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నే. అయితే ఆ ప్రశ్నకు తెలుగుదేశం నాయకుల నుంచి సోదరుడు వైఎస్ అవినాష్ రెడ్డిని కాపాడుకోవడానికే నని సమాధానం వస్తుంటే.. పరిశీలకులు మాత్రం స్వీయ సంరక్షణార్థం అంటున్నారు.  మొత్తం మీద వివేకా హత్య కేసులో సూత్రధారులు, పాత్రధారుల పాత్ర బయటకు వచ్చే సమయానికి దర్యాప్తు పురోగతిని అడ్డుకోవడానికి వైఎస్ అవినాష్ రెడ్డి చేసిన అన్ని ప్రయత్నాలూ విఫలమయ్యాయి. సీబీఐ తనను విచారించకుండా ఆదేశాలివ్వాలి, అరెస్టు చేయకుండా ఆదేశాలివ్వడం అంటూ కోర్టును ఆశ్రయించినా ఫలితం లేకపోయింది. నాలుగో సారి విచారణలో అవినాష్ రెడ్డి పలు ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా మౌనం వహించినట్లు తెలుస్తోంది. అన్నిటికీ మించి వివేకా హత్య జరిగిన వెంటనే సాక్ష్యాధారాలను నాశనం చేయడం దగ్గర నుంచి, ఆయన చేసిన ఫోన్ల వరకూ ప్రతి విషయంలోనూ ఆయనను సీబీఐ తన ప్రశ్నల ద్వారా కార్నర్ చేసిందని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే  కేసు తుది తీర్పువెలువరించే వరకూ అవినాష్ రెడ్డిని అరెస్టు చేయవద్దని సీబీఐని ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే  సీబీఐ అవినాష్ ను విచారించి పంపించేస్తుంది. కోర్టు ఆదేశాల కారణంగా అరెస్టు చేసే అవకాశం లేదు. అయితే విచారణ సుదీర్ఘంగా సాగే అవకాశం ఉందని అంతా భావించారు. అయితే అవినాష్ పిటిషన్లను తెలంగాణ హైకోర్టు శుక్రవారం తోసి పుచ్చింది. సీబీఐ విచారణలో జోక్యం చేసుకోబోమని స్పష్టం చేసింది. దీంతో కడప ఎంపీ అవినాష్ రెడ్డికి అన్ని దార్లూ మూసుకుపోయాయి. దీంతో అవినాష్ తరువాత సీబీఐ ఎవరికి నోటీసులు ఇచ్చి విచారణకు పిలుస్తుంది? ఈ కేసులో ఇంకా ఎవరెవరు అరెస్టు అయ్యే అవకాశం ఉంది? అన్న చర్చ సర్వత్రా సాగుతోంది. హత్య జరిగిన వెంటనే అవినాష్ ఎవరికి ఫోన్లు చేశారు. అవతల ఫోన్ లో మాట్లాడిన వారెవరు ఇత్యాది అంశాలపై సీబీఐ దృష్టి సారించి అందుకు అనుగుణంగా దర్యాప్తును ముందుకు తీసుకు వెళుతుందని న్యాయనిపుణులు అంటున్నారు. ఆ రకంగా చూస్తే ఈ కేసు ముఖ్యమంత్రి నివాసం తాడెపల్లి ప్యాలెస్ దిశగా సాగే అవకాశాలే ఉన్నాయని కూడా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇక తన ‘సోదరుడి’ కోసం కాకుండా తన గురించే ఆలోచించాల్సిన అనివార్య పరిస్థితిని జగన్ వచ్చారని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే జగన్ హఠాత్ హస్తిన యానం అని విశ్లేషిస్తున్నారు.  ఏది ఏమైనా వైఎస్ వివేకా హత్య కేసులో జగన్ తాను చిక్కుల్లో పడకుండా ఉండేందుకే ఇక ప్రాధన్యత ఇస్తారనీ, అవినాష్ అరెస్టు ఖాయమనీ, ఆయన కోసం ఇక ఎలాంటి ప్రయత్నాలూ చేసే అవకాశాలు లేవనీ విశ్లేషకులు అంటున్నారు. 

బీఆర్ఎస్ వ్యూహం బెడిసి కొడుతోందా?

ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఢిల్లీ మాజీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా మొదలు వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాస రెడ్డి కుమారుడు  రాఘవ రెడ్డి వరకు ఇప్పటికే  12 మంది అరెస్ట్ అయ్యారు. అరెస్ట్ కు ముందు సీబీఐ, ఈడీ ప్రతి ఒక్కరినీ అనేక మార్లు విచారించాయి. అవసరం అనుకున్న సందర్భాలో  వారు సాక్షులు  అయినా అనుమానితులు అయినా, చార్జి షీట్లో పేరున్నా లేకున్నా విచారణ తేదీలను మార్చి వారికి అనుకూలమైన తేదీలలో విచారణ జరిపారు. అయినా, సిసోడియా సహా ఎవరు కూడా ఈడీ సమన్లను ధిక్కరించలేదు. విచారణ సంస్థలకు వ్యతిరేకంగా వీధి పోరాటాలు చేయలేదు.  కానీ ఇదే కేసులో అనుమనితురాలిగా విచారణ ఎదుర్కుంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, కల్వకుట్ల కవిత విషయంలో బీఆర్ఎస్ నాయకత్వం భిన్నంగా వ్యవహరిస్తోంది. ఎవరి సూచనలు, సలహా మేరకు బీఆర్ఎస్  నాయకత్వం ఈ  దోరణి  ఎంచుకుందో కానీ ఇది ఒక విధంగా చిక్కులు కొని తెచ్చుకోవడమే అవుతుందని చట్టాల లోతులు తెలిసిన న్యాయ కోవిదులు, మాజీ పోలీసు,సివిల్ అధికారులు హెచ్చరిస్తున్నారు.మరో వంక కవితను బలి పశువును చేసి రాజకీయ లబ్ధి పొందే కుట్ర జరుగుతోందనే అనుమానాలు పార్టీ వర్గాల్లోనే వ్యక్తమవుతున్నాయి.  ఇదే కుంభకోణం కేసులో ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి (ప్రస్తుత మాజీ) మనీష్ సిసోడియాను సీబీఐ ఫిబ్రవరి 27న అరెస్ట్ చేసింది. సీబీఐ అరెస్టు చేసిన తర్వాత బెయిల్ మంజూరు కాకముందే మనీ లాండరింగ్‌ కేసులో ఈడీ కూడా ఆయన్ని అరెస్టు చేసింది. తీహార్ జైలులో ఉన్న సిసోడియాను జైల్లోనే అరెస్టు చేశారు. ఆ తర్వాత సీబీఐ కేసులో బెయిల్ వచ్చినా ఈడీ కేసులో రౌస్ అవెన్యూ కోర్టు మార్చి 4 తేదీ వరకు ఈడీ కస్టడీకి అప్పగించింది. ఆ తర్వాత ఈడీ అభ్యర్ధన మేరకు సీబీఐ కోర్టు ఆయన కస్టడీని పొడిగిస్తూ వస్తోంది. తాజాగా శుక్రవారం (మార్చి 17) ఆయన కస్టడీని మరో ఐదు రోజులపాటు పొడిగించింది. సిసోడియా అరెస్ట్కు ముందు నెలల తరబడి సీబీఐ, ఈడీ ఇతర కేంద్ర దర్యాప్తు సంస్థలు ఆయన్ని అనేక మార్లు  విచారించాయి. ఒక దశలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ కేసును ఎందుకు సాగదీస్తున్నారు. ఈ నాటకాలు ఎందుకు  ఇటో అటో తెల్చేయండి, తప్పు చేస్తే, సిసోడియాను, నన్నూ జైలుకు పంపడని, ఏజెన్సీలను డిమాండ్ చేశారు. అలాగే, అరెస్ట్ కు ముందు సిసోడియా,  నేను ఈ రోజు సీబీఐ విచారణకు ఇంకోసారి వెళ్తున్నాను. విచారణకు పూర్తిగా సహకరిస్తాను. అయితే.. ఈ విచారణ తర్వతా కొన్ని నెలలు జైలులో ఉండాల్సి వచ్చినా.. రావచ్చును. లెక్కచేయను. నేను  భగత్‌సింగ్‌   ఆశయాలను అనుసరించే వ్యక్తిని  అంటూ ట్విటర్‌లో పేర్కొన్నారు.  నిజానికి ఒక్క సిసోడియానే కాదు ఈ కేసులో మొత్తం 12 మంది అరెస్టయ్యారు. అందులో రాజకీయ నాయకులున్నారు. ఇతర రంగాల ప్రముఖులున్నారు. వైసీపీ ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాస రెడ్డి కుమారుడు రాఘవ రెడ్డి ఉన్నారు.  శ్రీనివాస రెడ్డికి కూడా శనివారం (మార్చి 18) వ్యక్తిగతంగా తమ ముందు హాజరు కావాలని ఈడీ సమన్లు జారీ చేసింది. ఎవరి  దాకానో ఎందుకు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్  కుడా ఈడీ పిలిస్తే, విచారణకు హాజరయ్యేందుకు సిద్ధంగా ఉన్నానని స్పష్టమైన సంకేతాలే ఇస్తున్నారు.  అలాగని  వీరంతా నేరాన్ని అంగీకరిస్తున్నారా? అంటే లేదు. ఇదే కేసులో అనుమానితురాలుగా ఆరోపణలు ఎదుర్కుంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ  కల్వకుట్ల కవిత చేస్తున్న వాదననే వారు చేస్తున్నారు. ఈ కేసును రాజకీయ కుట్రగానే ఆరోపిస్తున్నారు.  రాజకీయంగానే ఎదుర్కుంటామని అంటున్నారు.  కానీ  కవిత, ఆమె తరపున రంగంలోకి దిగిన రాష్ట్ర మంత్రులు, ఇతర పెద్దలు అందుకు  విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వాన్ని  బీజేపీని  రాజకీయంగా విమర్శిస్తున్నారు. అంతవరకూ ఓకే కానీ, చట్టాన్ని రాజ్యాంగ  సంస్థ ( ఈడీ)ని ధిక్కరించే సాహసం చేస్తున్నారు.  నిజానికి మార్చి 11న ఈడీ కవితను ప్రశ్నించింది. అయితే తిరిగి మార్చి 16 మరోమారు విచారణకు హాజరు కావాలని ఈడీ సమన్లు జారీ చేసింది. అయినా కవిత మర్చి 16న విచారణకు హాజరు కాలేదు. గైర్హాజరయ్యారు. దీంతో మార్చి 20వ తేదీన హాజరుకావాలంటూ తాజా సమన్లను ఈడీ జారీ చేసింది. తాను మహిళను అయినందున నిబంధనల ప్రకారం ఈడీ కార్యాలయంలో ప్రశ్నించేందుకు సమన్లు పంపరాదని తన నివాసంలో విచారణ జరవచ్చునని ఆమె పేర్కొంటూ తక్షణం దీనిపై విచారణ జరపాలని సుప్రీంకోర్టును కవిత ఆశ్రయించారు. ఆ కేసు మార్చి 24 న విచారణకు వస్తుంది. అంతవరకు, ఈడీ విచారణ జరపరాదని  అవసరం అనుకుంటే తమ న్యాయవాదిని లేదా తనను ఈ మెయిల్ ద్వారా  సంప్రదించ వచ్చని తమ న్యాయవాది ద్వారా ఈడీకి లేఖను పంపారు. దీంతో మార్చి 20వ తేదీన ఈడీ విచారణకు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హాజరవడంపై ఉత్కంఠ కొనసాగుతోంది.  అయితే  ఈ మొత్తం వ్యవహారంలో కవిత వ్యహరిస్తున్నతీరు పలు అనుమానాలకు దారి తీస్తోందని అంటున్నారు. ఆమె అనవసరంగా చిక్కులు కొని తెచ్చుకుంటున్నారు అనే అనుమానాలు వ్యక్త మవుతున్నాయి. అలాగే, ఈడీ విచారణ విషయంలో బీఆర్ఎస్ వ్యూహకర్తలు తీసుకుంటున్న నిర్ణయాలు కవిత మెడకు చుట్టుకునే ప్రమాదముందని అంటున్నారు. నిజానికి సీబీఐ విచారణ సమయంలో  చివరకు ఈడీ సమన్లు అందుకుని ఆమె ఢిల్లీ చేరే వరకు కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ మొదలు బీఆర్ఎస్ మంత్రులు  పార్టీ ముఖ్యనాయకులు ఎవరూ కేసు విషయంలో ప్రత్యక్ష జోక్యం చేసుకోలేదు. ఆమె ఢిల్లీ వెళ్ళిన తర్వాత, ముందు కేటీఆర్ ఆయన వెంట హరీష్ రావు ఇతర మంత్రులు, నాయకులు  ఢిల్లీ చేరారు. మార్చి 11 న ఆమె విచారణ సమయంలో ఢిల్లీలో ఒక విధంగా హల్ చల్ సృష్టించారు.  అలాగే మళ్ళీ మార్చి 16 న కేటీఆర్, హరీష్ సహా అరడజను మందికి పైగా మంత్రులు ఇతర నేతలు ఢిల్లీ వెళ్ళారు. మళ్ళీ రేపు మార్చి 20 న కూడా అదే, సీన్  రిపీట్ అయ్యే అవకాసం లేక పోలేదని  బీఆర్ఎస్ వర్గాలు అంటున్నాయి. అయితే  బీఆర్ఎస్ వ్యూహం మారడం వెనక ‘ఎదో’ ఉందని అంటున్నారు. అలాగే, కవితను బాలి పశువును చేసి, సానుభూతి రాజకీయం చేసే కుట్ర జరుగుతోందా అనే సందేహాలు కూడా వినవస్తున్నాయి.ఒక విధంగా కవిత కేసు, పిల్లికి చెలగాటం, ఎలుకకు ప్రాణ సంకటం అన్నట్లుగా మారిందని అంటున్నారు.

అంతటా ఉన్నదే.. ప్రశ్న పత్రాల లీకేజీ పై కేటీఆర్..

నిజమే  పోటీ పరీక్షల ప్రశ్న పత్రాల లీకేజి ఒక్క తెలంగాణలోనే కాదు. దేశం అంతటా ఉన్నదే... ఏదో ఒక సందర్భంలో అన్ని రాష్ట్రాలలో జరుగుతున్నదే. అయితే, అంత మాత్రం చేత  ఇక్కడ తెలంగాణలో జరిగిన తప్పు తప్పు కాకుండా పోతుందా?  ఔను పోతుందనే అంటున్నారు, తెలంగాణ మంత్రి, బీఆర్ఎస్ ‘ముఖ్య’ నేత కల్వకుట్ల తారక రామారావు.  అంతే కాదు, లక్షల మంది నిరుద్యోగ యువత రాజకీయ పార్టీల కుట్రల్లో భాగం కావద్దని,  ఉద్యోగాల సాధనపైనే యువత దృష్టి పెట్టాలని హితబోధ చేశారు.   అంతే కాదు  ప్రధాని నరేంద్ర మోడీ స్వరాష్ట్రం గుజరాత్‌లో 13 సార్లు ప్రశ్నాపత్రాలు లీక్ అయ్యాయి కాబట్టి  ప్రధాని మోడీ రాజీనామా చేయాలని, అడిగే దమ్ము బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కు ఉందా అని ప్రశ్నించారు. టీఎస్పీఎస్సీ   పరీక్షా పత్రాల లీకేజీ వ్యవహారంపై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. బండి సంజయ్ రాజకీయ అజ్ఙాని అని తేల్చేశారు.  ప్రభుత్వ వ్యవస్థల పనితీరుపై అవగాహన లేని వ్యక్తి బండి సంజయ్ అని ఆరోపించారు. టీఎస్‌పీఎస్‌సీ ప్రభుత్వ శాఖ కాదని..  స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సంస్థ అని అన్నారు. దీనిపై బండి సంజయ్‌‌కు కనీస అవగాహన లేదని విమర్శించారు. ఓ వ్యక్తి చేసిన నేరాన్ని వ్యవస్థకు ఆపాదించి గందరగోళం సృష్టిస్తున్నారని వ్యాఖ్యానించారు. నిరుద్యోగులను రెచ్చగొట్టి బండి సంజయ్ రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. బీజేపీ ప్రభుత్వ రాష్ట్రాల్లో ఇప్పటికే వంద సార్లకు పైగా ప్రశ్నాపత్రాలు లీక్ అయ్యాయని ఆరోపించారు.  గుజరాత్‌లో 13 సార్లు ప్రశ్నాపత్రాలు లీక్ అయ్యాయని అన్నారు. ప్రధాని మోదీని రాజీనామా అడిగే దమ్ము బండి సంజయ్‌కు ఉందా అని ప్రశ్నించారు. అంతకుముందు ఈ వ్యవహారానికి ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని బండి సంజయ్ ఆరోపించారు. కేసీఆర్ కుటుంబ డబ్బు పిచ్చి కారణంగా లక్షలాది మంది అభ్యర్థుల జీవితాలు ఆగమయ్యాయని విమర్శించారు. పేపర్ లీక్ కేసును సిట్టింగ్ జడ్జితో విచారించడంతో పాటు కేటీఆర్‌ను బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. సికింద్రాబాద్ కార్ఖాన పోలీస్ స్టేషన్ నుండి విడుదలైన బండి సంజయ్.. విద్యార్థుల జీవితాల గురించి ఆలోచించకుండా లిక్కర్ స్కామ్ లో కవితను కాపాడుకోవడానికి మంత్రివర్గం మొత్తం ఢిల్లీకి వెళ్లిందని విమర్శించారు. కేటీఆర్‌ను భర్తరఫ్ చేసి విద్యార్థులకు న్యాయం చేసే వరకు వదిలిపెట్టే ప్రసక్తే లేదని బండి సంజయ్ అన్నారు. పేపర్ లీక్ లో పార్టీ కార్యకర్తలను కాపాడుకోవడానికి లక్షల మంది విద్యార్థుల జీవితాలను బలి చేశారని ఆరోపించారు. పేపర్ లీక్‌పై ఆందోళన చేసిన విద్యార్థులను, కార్యకర్తలను అరెస్ట్ చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఇక నుంచి కేసీఆర్ కు చుక్కలు చూపెడ్తామని హెచ్చరించారు బండి సంజయ్. అంతకుముందు పేపర్ లీక్ ఘటనను సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలంటూ మార్చి 17న ఉదయం గన్ పార్క్ దగ్గర దీక్ష దిగిన బండి సంజయ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.

ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ చెల్లని కమలం !

ఆంధ్రప్రదేశ్లో బీజేపీ అద్వాన స్థితి ఏమిటో మరో సారి రుజువైంది. సాధారణ ఎన్నికలలో బీజేపీ బలమెంతో ఎప్పటి కప్పుడు తేలి పోతూనే వుంది.  2019 ఎన్నికల్లో ఒంటిగా పోటీ  చేసిన కమల దళం నిండా ఒక శాతం ఓటు కూడా తెచ్చుకోలేక పోయింది. బీజేపీ కంటే ‘నోటా’ కే ఎక్కువ ఓట్లు వచ్చాయి.  అయినా, బీజేపీ రాష్ట్ర నాయకులు, అసెంబ్లీ ఎన్నికలు ఎప్పడు వచ్చినా అధికారం తమదే అంటారు.  అదేమంటే, ఈశాన్య రాష్ట్రాలలో వెలిగి పోవడం లేదా  అంటారు.   సాధారణ ఎన్నికలను పక్కన పెడితే ఒకప్పుడు మండలి ఎన్నికల్లో, ముఖ్యంగా పట్ట భద్రులు, ఉపాధ్యాయ నియోజక వర్గాల్లో బీజేపీకి కొంత బలం ఉన్నమాట వాస్తవం.  వి.రామా రావు,  పీవీ చలపతి రావు,  జూపూడి యజ్ఞ నారాయణ, మన్నవ గిరిధర రావు,  డీఎస్పీ రెడ్డి  ఇలా బీజేపీ నేతలు పెద్దల సభకు ఎన్నికయ్యారు. అలాగే టీడీపీతో పొత్తులో ప్రస్త్తుత బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు,  పీవీ మాధవ్  ఎమ్మెల్సీ అనిపించుకున్నారు. పొత్తు వద్దనుకుని మాజీలుగా మిగిలారు.  అవును తాజాగా జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ ఉత్తరాంధ్ర సిట్టింగ్ సీటు సహా పోటీ చేసిన అన్ని స్థానాల్లో  చెల్లని ఓట్లతో పోటీ పడి చిత్తుగా ఓడి పోయింది.  ఉత్తరాంధ్ర పట్టభద్రుల నియోజక వర్గానికి ఆరేళ్ళ క్రితం జరిగిన ఎన్నికల్లో, బీజేపీ, టీడీపీ, ఉమ్మడి అభ్యర్ధిగా తాజా మాజీ ఎమ్మెల్సీ పీవీ మాధవ్ గెలిచారు. నిజానికి  ఆయన గెలవలేదు.  మిత్ర ధర్మానికి కట్టుబడి టీడీపీ ఆయన్ని గెలిపించింది. ఈ సారి టీడీపీతో పొత్తు లేకపోవడం వలన  ఆయన ఓడి పోయారు. ఓడిపోవడం అంటే అలా ఇలా కాదు.. చెల్లని ఓట్ల మందం ఓట్లు కూడా తెచ్చుకోలేనంత ఘోరంగా పరాజయం పాలయ్యారు. పోలైన ఓట్లలో పన్నెండు వేలకుపైగా చెల్లని ఓట్లు ఉంటే.. మాధవ్ కు పదకొండు వేల ఓట్లు కూడా రాలేదు.  అంటే  ఒకప్పుడు  ఉత్తరాంధ్ర పట్ట భద్రులలో ఉన్న కొద్దిపాటి పట్టు కూడా కమల దళం కోల్పోయిందని మండలి తాజా ఎన్నికల ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి. నిజానికి  ఇదే నియోజక్ వర్గం నుంచి గతంలో, పార్టీ సీనియర్ నాయకుడు, ఇటీవల కన్ను మూసిన పీవీ చలపతి రావు ( తాజా మాజీ ఎమ్మెల్సీ మాధవ్ తండ్రి)మూడు పర్యాయాలు ఎమ్మెల్సీగా విజయం సాధించారు. మాధవ్  ఆ వారసత్వాన్ని నిలుపుకోలేక పోయారు. రాయలసీమ జిల్లాల్లోనూ అదే పరిస్థితి. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే   మరింత అధ్వాన స్థితి.  తూర్పు రాయలసీమలో పదిహేడు వేల వరకూ చెల్లని ఓట్లు వచ్చాయి. బీజేపీకి వచ్చిన ఓట్ల సంఖ్య ఆరు వేల కంటే తక్కువే.  పశ్చిమ రాయలసీమలోనూ అంతే. అక్కడ బీజేపీకి ఐదు వేల ఓట్లకు మించి రాలేదు.  కానీ చెల్లని ఓట్లు పన్నెండు వేలకుపైగానే ఉన్నాయి. అంటే  రాయల సీమలోనూ బీజేపీ చెల్లని  నో(ఓ)టు గానే మిగిలి పోయింది.  అయినా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, సోము వీర్రాజు రోజుకోసారి లేస్తే మనిషిని కాదని అంటారని, బీజేపీ కార్యకర్తలు, అభిమానులు వాపోతున్నారు. చివరికి మిత్రపక్షంగా ఉన్నప్పటికీ ఎన్నికల్లో పోటీ చేయని జనసేన మద్దతును కూడా బీజేపీ అడగలేదు. పవన్ తో ఓ ప్రకటన కూడా చేయించుకోలేకపోయారని అంటున్నారు.  బీజీపే రాష్ట్ర నాయకత్వం ఆత్మహత్యా సదృశ్య పోకడలు పోతోందని అంటున్నారు. వైసీపీ అరాచక పాలనను అంతమొందించేందుకు టీడీపీ, జనసేన కూటమితో కలిసి రావాలని, జనం కోరుతున్నా, ఫ్యాన్ నీడన సేద తీర్తున్న బీజేపీ రాష్ట్ర నాయకులు ససేమిరా అంటున్నారు . అడ్డుపుల్ల వేస్తున్నారు. అయితే  టీడీపీ, జనసేనతో  కలిసి రాక పోవడం వలన నష్ట పోయేది ఎవరో  ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు తేల్చి చెప్పాయి.  బీజేపే కలిసోచ్చినా రాకున్నా, ప్రజలు టీడీపీ, జనసేన కూటమి వైపు ఉన్నారనేది ఎమ్మెల్సీ ఫలితాలు తేల్చి చెప్పాయి.

కేసీఆర్ పై హత్యా నేరం కింద కేసు నమోదు చేయాలి.. రేవంత్

తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ రాక్షస పాలనకు మరో యువకుడు బలయ్యాడని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ  అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. సిరిసిల్లకు చెందిన నవీన్ అనే యువకుడు గత కొంత కాలంగా గ్రూప్స్‌కు ప్రిపేర్ అవుతున్నాడు. కాగా ఇటీవల TSPSC పేపర్ లీక్ కారణంగా పలు పరీక్షలను వాయిదా వేసిన విషయం తెలిసిందే. అలాగే గ్రూప్-1 పరీక్షను రద్దు చేశారు. దీంతో మనస్థాపానికి గురైన నవీన్ ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. యువకుడి ఆత్మహత్యకు తెలంగాణ ప్రభుత్వమే కారణమని రేవంత్ తన ఇన్స్టా లో  పేర్కొన్నారు. కేసీఆర్‌పై హత్యా నేరం కింద కేసు పెట్టాలని డిమాండ్ చేశారు. నవీన్ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలన్నారు. రూ.కోటి పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగ యువత ఆత్మస్థైర్యం కోల్పోవద్దని   కాంగ్రెస్ అండగా ఉంటుందని రేవంత్ భరోసా ఇచ్చారు. కేసీఆర్ ప్రభుత్వంపై పోరాటం చేద్దామని ఇన్‌స్టాగ్రామ్ వేదికగా రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.

భారీ బడ్జెట్ సరే మున్సిపల్ కార్మికుల వేతనాల పెంపు సంగతేంటి?!

భారీ బడ్జెట్ ప్రవేశపెట్టామంటూ మురిసి పోతున్న ఏపీ సీఎం జగన్ మునిసిపల్ ఉద్యోగాల వేతనాల పెంపు గురించి ఎందుకు పట్టించుకోరని కార్మికులు నిలదీస్తున్నారు.  విజయవాడలో సీఐటీయూ ఆధ్వర్యంలో మునిసిపల్ కర్యాలయం వద్ద జరిగిన ధర్నా కార్యక్రమంలో  సీఐటీయూ నేతలు జగన్ సర్కార్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.  కాంట్రాక్ట్ కార్మికుల  రెగ్యులరైజేషన్ పై ముఖ్యమంత్రి మాట తప్పి మడమ తిప్పారని ఆరోపించారు. అలాగే కాంట్రాక్ట్ కార్మికులకు సంక్షేమ పథకాలు తొలగించారని విమర్శించారు.   భారీ అంకెలతో బడ్జెట్ ప్రవేశ పెట్టి మునిసిపల్ కార్మికుల వేతనాల పెంపునకు సొమ్ము లేదనడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. సమానపనికి సమాన వేతనం అంటూ కోర్టు తీర్పులు ఇచ్చినా కాంట్రాక్ట్ కార్మికుల చేత వెట్టి చాకిరీ చేయించుకుంటూ నామమాత్రపు వేతనాలిస్తున్నారని ఆరోపించారు.   ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే కార్మికుల రెగ్యులరైజేషన్ పై స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.  

ముగిసిన జగన్ ఢిల్లీ పర్యటన.. మోడీ, అమిదత్ షాలతో భేటీ

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ హస్తిన పర్యటన ముగిసింది. ఆయన అక్కడ నుంచి తిరుగుప్రయాణమయ్యారు. తన ఒక రోజు ఢిల్లీ పర్యటనలో జగన్ ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలతో భేటీ అయ్యారు.  వీరిరువురితో రాష్ట్రానికి సంబంధించి అంశాలపై చర్చించారని చెబుతున్నారు.  విభజన చట్టంలోని అంశాలు, పెండింగ్ వ్యవహారాలపై ప్రధానికి, హోంమంత్రికి వినతి పత్రాలు సమర్పించారు.  కాగా ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న సమయంలో జగన్ హడావుడిగా హస్తిన వెళ్లి ప్రధాని, హోంమంత్రులతో భేటీ కావడానికి కారణాలేమిటన్న దానిపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. వివేకా హత్య కేసు దర్యాప్తులో చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో జగన్ హస్తిన పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది.

మనీష్ సిసోడియా ఈడీ కస్టడీ పొడగింపు

ఢిల్లీ మద్యం కుంభకోణంలో అరెస్టయిన ఢిల్లీ మాజీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా కస్టడీని కోర్టు మరో ఐదు రోజుల పాటు పొడిగించింది. మనీష్ సిసోడియా ఈడీ కస్టడీ శుక్రవారంతో ముగియనుండగా ఈడీ ఆయనను కోర్టులో హాజరు పరిచింది. కస్టడీ పొడిగించాల్సిందిగా కోరింది. కోర్టు ఆయనను మరో ఐదు రోజుల పాటు ఈడీ కస్టడీకి అప్పగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 22న కోర్టు కోర్టులో హాజరు పరచాల్సిందిగా ఈడీని ఆదేశించింది. మద్యం కుంభకోణంలో సిసోడియాను ఈడీ ఈ నెల 9న ఈడీ అరెస్టు చేసిన సంగతి విదితమే. కాగా ఇదే కేసులో సీబీఐ మనీష్ సిసోడియాను గత నెల 26న అరెస్టు చేసింది.  అప్పటి నుంచి ఆయన తీహార్ జైల్లో ఉన్నారు. మార్చి 6 వరకు ఆయన సీబీఐ కస్టడీలో ఉండగా, ఆ తర్వాత ఆయనకు జ్యుడిషియల్ కస్టడీ విధించారు.  ఇటీవల ఈడీ అరెస్ట్ నేపథ్యంలో, మార్చి 10న ఈడీ కస్టడీకి అప్పగిస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.  

బండి సంజయ్ దీక్ష భగ్నం

టీఎస్ పీఎస్సీ ప్రశ్నా పత్రాల లీకేజి వ్యవహారంలో సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ హైదరాబాద్ గన్ పార్క్ వద్ద చేపట్టిన నిరసనను పోలీసులు భగ్నం చేశారు.  టీఎస్ పీఎస్సీ కార్యాలయానికి ర్యాలీగా బయల్దేరుతున్న సంజయ్ ని అరెస్ట్ చేశారు. ఆయనతో పాటు  బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సంజయ్ అరెస్ట్ సందర్భంగా పోలీసులకు, బీజేపీ కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగింది. దీంతో అక్కడి పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. అలాగే అసెంబ్లీ ఎదుట బీజేపీ కార్యకర్తలు బైఠాయింపు కార్యక్రమం కూడా ఉద్రిక్తతకు దారితీసింది. కార్యకర్లను అక్కడ నుంచి తొలగించే సందర్భంగా జరిగిన తోపులాటలో ఓ వ్యక్తి సృహతప్పి పడిపోయాడు.