కాపు ఉద్యమాన్ని నీరు గార్చిన వ్యక్తి నీతులు వల్లించేనా?

టీడీపీ హయాంలో కాపు ఉద్యమం చేస్తూ.. నానా ఇబ్బంది పెట్టిన ముద్రగడ పద్మనాభం.. వైసీపీ నేతలా మాట్లాడటం మొదలెట్టారు.  అచ్చం వైసీపీ నేతలా.. పవన్ ను హెచ్చరిస్తూ లేఖ రాశారు. లేఖ ఆసాంతం.. పవన్ వ్యాఖ్యలు, వ్యవహార శైలిని తప్పుపట్టారే తప్ప.. వైసీపీ నుంచి కాపు కులానికి, నాయకులకు ఎదురైన అవమానాలు, అనుమానాలను నివృత్తి చేసే ప్రయత్నం చేయలేదు. ముద్రగడ.. రాజకీయ నాయకుడి కంటే కాపు రిజర్వేషన్ ఉద్యమ నేతగానే సుపరిచితం. అయితే ఆయన ప్రస్తుతం వైసీపీ కండువా కప్పి మాట్లాడుతున్నారు. కాపు ముసుగు తీసి.. జగన్ ను ప్రసన్నం చేసుకునేందుకు నానా తంటాలు పడుతున్నారు.   జనసేన అధినేత పవన్ పై విరుచుకుపడ్డారు. కాపుల ఈబీసీ రిజర్వేషన్లను జగన్ తీసేటప్పుడు…పవన్ పై వైసీపీ శ్రేణులు వ్యక్తిగతంగా టార్గెట్ చేసాయి. వంగవీటి మోహన్ రంగా జయంతి, వర్ధంతి కార్యక్రమాలను జగన్ విస్మరించినప్పుడు.. అదే వంగవీటి వారసుడు రాధా హత్యకు రెక్కీ నిర్వహించినప్పుడు..వైసీపీ నేత కొడాలి నాని కాపు సామాజిక వర్గంపై తనదైన శైలి  బూతుల పర్వం మొదలెట్టినప్పుడు మౌనం ఉండిపోయారు ముద్రగడ. ఇలా ఏ సందర్భంలోనూ మాట్లాడని ముద్రగడ ఇప్పుడు వారాహి యాత్రలో పవన్ వైసీపీ నేతలపై విమర్శలు చేస్తుంటే తట్టుకోలేకపోతున్నారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్..   ప్రస్తుతం గోదావరి జిల్లాల్లో వారాహి యాత్రలీ ఉన్నారు. ఈ నెల 14న ప్రారంభమైన యాత్రలో రోడ్ షోలతో పాటు భారీ బహిరంగ సభలు నిర్వహిస్తున్నారు. పవన్ ప్రత్యర్థులపై విరుచుకుపడుతున్నారు. ఈ క్రమంలో కాపు రిజర్వేషన్ ఉద్యమాలు చేసే నాయకులు కొందరి లాభం కోసమే ప్రయత్నిస్తున్నారంటూ పవన్ ఆరోపించారు. ప్రభుత్వాలు మారిపోయిన తరువాత ఉద్యమాలు మూసివేస్తున్నట్టు ఆరోపణలు చేశారు. దీనిపై ముద్రగడ రియాక్టయ్యారు. పవన్ కు ఏకంగా సుదీర్ఘ లేఖ రాశారు. అయితే ఆయన లేఖలో తానెందుకు ఉద్యమాన్ని నిలిపివేసింది రాయలేదు. కానీ అడుగడుగునా వైసీపీపై, జగన్ పై తనుకున్న అభిమానాన్ని చాటుకుంటూ లేఖ రాశారు. లేఖ మొత్తం పవన్ పై వ్యాఖ్యలు, వ్యవహార శైలిని తప్పుపట్టారే తప్ప.. వైసీపీ నుంచి కాపు కులానికి, నాయకులకు ఎదురైన అవమానాలు, అనుమానాలను నివృత్తి చేసే ప్రయత్నం చేయలేదు. ప్రధానంగా కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిపై తనకున్న అభిమానాన్ని చాటుకున్నారు. ఆ కుటుంబం కాపుల అభ్యున్నతికి పాటుపడిన విషయాన్ని ప్రస్తావించారు. కాపు రిజర్వేషన్ ఉద్యమానికి చంద్రశేఖర్ రెడ్డి తాత, తండ్రి ఎంతగానో చేయూతనందించారని చెప్పుకొచ్చారు. ద్వారంపూడి  ఒక సచ్ఛిలుడిగా చెప్పే ప్రయత్నం చేశారు. ఆయనపై విమర్శలు ముద్రగడకు బాధ కలిగించాయట. అతడు తప్పుడు మనిషి అయితే కాకినాడ ప్రజలు ఎందుకు రెండుసార్లు గెలిపించారని ముద్రగడ ప్రశ్నించారు. దమ్ముంటే చంద్రశేఖర్ రెడ్డిపై పోటీ చేసి గెలవాలని పవన్ కు ముద్రగడ సవాల్ చేశారు. అక్కడితో ఆగని ముద్రగడ పవన్ వాడుతున్న భాష, ఆహార్యంపై అభ్యంతరాలు వ్యక్తం చేశారు. 2019లో తానిచ్చిన సలహా మేరకు పోరాడి ఉండి ఉంటే బాగుండేదన్నారు. ప్రత్యేక హోదా, ప్రత్యేక రైల్వేజోన్, కడప స్టీల్ ప్లాంట్, విశాఖ స్టీల్ ప్రైవేటీకరణ వంటి అంశాలపై పోరాడాలని తాను సూచించినట్టు ముద్రగడ గుర్తుచేశారు. మొత్తానికైతే ముద్రగడ అసలు సిసలైన వైసీపీ మాదిరిగా మారిపోయారు.  అయితే.. ఇక్కడో ట్విస్ట్ .. జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ మాటల తీరును తప్పుపడుతూ లేఖ రాసిన ముద్రగడ పై కాపు సంక్షేమ సేన వ్యవస్థాపక అధ్యక్షుడు, మాజీ మంత్రి చేగొండి హరిరామజోగయ్య మండి పడ్డారు. ఇన్నాళ్లూ ముద్రగడ చాలా పెద్ద మనిషి అని, వివాద రహితుడని, కాపుల సంక్షేమం కోరే ఒకే ఒక వ్యక్తి అని, కాపులకు రాజ్యాధికారం కోరే ప్రముఖుడు అని భావించానని, కాని ఆయనపట్ల తనకున్న సదభిప్రా యానికి ఆయన పవన్ కళ్యాణ్ పై ఎక్కుపెట్టిన బాణాలతో తూట్లు పొడిచినట్లయిందంటూ బాహటంగానే హరిరామజోగయ్య విమర్శకులకు దిగారు. చిన్న చిన్న మంత్రిపదవులు ఆశించో, ఇతర ప్రలోభాలకు లొంగో అవినీతి చక్రవర్తి జగన్ కు మద్దతుగా కాపు సామాజికవర్గా న్ని తాకట్టు పెట్టారు.  ఊడిగం చేస్తున్న కొంతమంది కాపు నాయకులు లైనులో ఈయన కూడా చేరారు. ఈయన విద్య ఉద్యోగాలలో కాపులకు రిజర్వేషన్ల కోసం ఉద్యమాలు చిత్తశుద్ధితో చేసినవే అని నమ్మానని, అవి కూడ రాజకీయ లబ్ది కోరి చేసినవే అని ఆయన మండిపడుతున్నారు. కాపు రిజర్వే షన్స్ ఉద్యమాన్ని గంగలో కలిపి మధ్యలో రాజీనామా చేసి, కాపులకు అన్యాయం చేసిన వ్యక్తి .. జనసేనా అధినేతకు హితబోధ చేయడాన్ని హరిరామ జోగయ్య సహించలేకపోతున్నారు. రంగులను మార్చే ఊసరవెల్లి కన్నా..సదరు కాపు ఉద్యమనేత.. వేగంగా తన ఆశయాలను..సిద్ధాంతాలను మార్చేస్తున్నారని.. కాపు సామాజిక నేతలు చర్చించుకుంటున్నారు.

కొత్త పార్టీలు పుట్టుకొస్తున్నాయి!

ఎన్నికల సీజన్ లో పార్టీ ఫిరాయింపులు ఎంత కామనో ..కొత్త పార్టీలు పుట్టుకురావడం కూడా అంతే కామన్. ఉభయ తెలుగు రాష్ట్రాలు ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణలోనూ ఇప్పడు అదే జరుగుతోంది. ఆంధ్ర ప్రదేశ్’లో ప్రముఖ వ్యాపార వేత్త, గతంలో జనసేన తరపున ఎన్నికల్లో పోటీ చేసి..ఓడిన, రామచంద్ర యాదవ్‌’ అవినీతి రహిత సుపరిపాలన అందించడమే లక్ష్యంగా కొత్త రాజకీయ పార్టీ, ‘ప్రజా సింహగర్జన పార్టీ’ ని ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. ఈవిషయాన్ని స్వయంగా ఆయనే విజయవాడలో గత ఆదివారం మీడియా సమావేశంలో వెల్లడించారు.  జూలై 23న గుంటూరు- విజయవాడ మధ్య నాగార్జున యూనివర్సిటీ ముందు ‘ప్రజా సింహగర్జన పార్టీ’ ఆవిర్భావ సభ నిర్వహించనున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా ఆయన వైసీపీ ప్రభుత్వం పై విమర్శలు సంధించారు. రాష్ట్రంలో ప్రస్తుతం దోపిడీ పరిపాలన నడుస్తోందని రామచంద్ర యాదవ్‌ దుయ్యబట్టారు. భూములు, మైనింగ్‌, ఇసుక పేరుతో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు రూ. వేల కోట్లు దోపిడీ చేస్తున్నారని మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వం వచ్చాక సాగు నీటి ప్రాజెక్టుల్లో రూ.30 వేల కోట్ల దోపిడీ జరిగిందని ఆక్షేపించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకురావడంలో వైసీపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని దుయ్యబట్టారు. చివరికి, రాష్ట్రానికి రాజధాని కూడా కట్టలేకపోయారని.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానుల పేరు చెప్పి రాజధాని ఏదో కూడా చెప్పుకోలేని పరిస్థితి కల్పించారని రామచంద్ర యాదవ్ మండిపడ్డారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలను ఓటు బ్యాంకు రాజకీయాలకు వాడుకుంటూ అణచి వేస్తున్నారని దుయ్యబట్టారు. రాష్ట్రంలో ఒక ఫ్యాక్షన్ నాయకుడిని అధికారంలోకి తీసుకురావడం దురదృష్టకరమన్నారు. రాష్ట్రం అన్ని విధాలుగా అభివృద్ది చెందాలంటే రాజకీయ మార్పు కావాల్సిందే అని స్పష్టం చేశారు. రాబోయే కొత్త పార్టీ రాష్ట్రంలో నవశకాన్ని తీసుకొస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా,  చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గానికి చెందిన రామచంద్ర యాదవ్ గత ఎన్నికల్లో జనసేన పార్టీ తరఫున ఎన్నికల్లో పోటీ చేశారు. ఆ తర్వాత పార్టీకి దూరంగా జరిగి.. వ్యక్తిగతంగా నియోజకవర్గంలో పలు పనులు చేస్తున్నారు. వైసీపీ ముఖ్య నాయకుడు, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో ఢీ అంటే ఢీ అంటున్నారు. ఈ క్రమంలో వైసీపీ నాయకులు తనపై దాడులు చేస్తున్నారంటూ.. ఇటీవలే ఢిల్లీకి వెళ్లి తన ఇబ్బందులు చెప్పడంతో కేంద్ర ప్రభుత్వం ఆయనకు భద్రత కల్పించింది. ఈ క్రమంలో రామచంద్ర యాదవ్ కొత్త రాజకీయ పార్టీ ప్రకటించడం విశేషం. అదలా ఉంటే, ప్రజాయుద్ధనౌక గద్దర్, పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థల కోసం గజ్జెకట్టేందుకు సిద్దమయ్యారు. గత కొంత కాలంగా, ఎన్నికల రాజకీయలపై ఆసక్తి కనబరుస్తున్న ప్రజా గాయకుడు గద్దర్ చివరకు ఏదో పార్టీలో చేరడం కాకుండా తెలంగాణలో  సొంత పార్టీ పెట్టాలని నిర్ణయించుకున్నారు. కాంగ్రెస్, బీజేపీ మొదలు వైఎస్సార్ టీపీ వరకు అనేక పార్టీల వేదికల మీద కనిపించి, వినిపించిన గద్దర్ చివరకు సొంత పార్టీ వైపు మొగ్గుచూపుతున్నారు.  అంతే కాదు ఆ దిశగా ఆయన  చకచకా అడుగులు వేస్తున్నారు. కొత్త రాజకీయ పార్టీ రిజిస్ట్రేషన్‌ చేసేందుకు ఇప్పటికే ఢిల్లీ చేరుకున్న గద్దర్   బుధవారం(జూన్ 21)  గద్దర్ ప్రజా పార్టీ  పేరుతో ఢిల్లీలోని కేంద్ర ఎన్నికల సంఘానికి దరఖాస్తు చేస్తున్నట్లు తెలిపారు.  పార్టీ అధ్యక్షుడిగా గద్దర్, ప్రధాన కార్యదర్శిగా జి.నగేశ్ కలిసి దరఖాస్తును ఎన్నికల అధికారులకు సమర్పించనున్నారు. రాజకీయ పార్టీగా దరఖాస్తు చేసుకోడానికి ముందు జరగాల్సిన ప్రక్రియ, లాంఛనాలన్నీ పూర్తయినట్లు ఆయన సన్నిహితులు తెలిపారు. పార్టీ పేరును సూచిస్తూ సమర్పించే దరఖాస్తుతో పాటే నియమ-నిబంధనావళిని సైతం జతచేయనున్నారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒంటరిగానే పోటీ చేయాలన్నది గద్దర్ లక్ష్యంగా పేర్కొంటున్నారు. గత కొద్ది రోజులుగా గద్దర్ రాష్ట్ర రాజకీయాలపై తనదైన స్టైల్లో స్పందిస్తున్నారు.  అలాగే  ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరి వచ్చే పార్లమెంట్‌ ఎన్నికల్లో పెద్దపల్లి లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేస్తారని ప్రచారం కూడా  జరిగింది. మరోవంక  స్వరాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితి, నిరుద్యోగ సమస్య, కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌ పథకాల తీరు, ధరణి పోర్టల్‌ వల్ల ప్రజలు పడుతున్న బాధలను, పాటలుగా మలచి  బీఆర్‌ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను బట్టబయలు చేస్తున్నారు               ఈ క్రమంలోనే గద్దర్.. సీఎం కేసీఆర్‌పై పోటీ చేస్తారనే ప్రచారం కూడా జరిగింది. నిజానికి, గద్దర్ చాలా కాలంగా  రాజకీయ పార్టీలతో కలుస్తున్నారు. గతంలో రాహుల్ గాంధీ హైదరాబాద్ వచ్చినప్పుడు ఆయనతో సమావేశం అయ్యారు. మునుగోడు ఎన్నికలకు ముందు కేఏ పాల్ ను కూడా కలిశారు. ఆయన సమక్షంలోనే .. తన ప్రజాశాంతి పార్టీ తరపున గద్దర్ ను అభ్యర్థిగా ప్రకటించారు పాల్. తర్వాత గద్దర్ సైలెంట్ అయ్యారు. ఇటీవల కేసీఆర్‌ పై పోటీ చేస్తానని ప్రకటించారు. అలాగే  వైఎస్సార్ టీపీ వేదిక మీద కనిపించారు. ఆ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలను అభినందించారు. ఆమె కేసీఆర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సాగిస్తున్న పోరాటానికి పరోక్షంగా మద్దతు ప్రకటించారు. అలాగే  తెలంగాణ ప్రజా పార్టీ అధ్యక్షుడు కొందండ రామ్ తోనూ మంతనాలు సాగించారు. ఈ క్రమంలో సొంత పార్టీ పెట్టడంతో ఆ ప్రభావం ఎంత ఉంటుందన్నదానిపై విస్తృత చర్చ జరుగుతోంది. అదే సమయంలో  కేసీఆర్ కోసమే గద్దర్ రాజకీయ గజ్జె కడుతున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

యోగాసనాలే శ్రీరామరక్ష!

ఇప్పుడు ప్రపంచమంతా యోగా అనే పదమే జపిస్తోంది. మనశ్శాంతి కోసం, ఒత్తిడిని తగ్గించుకోవడం కోసం, పనిలో మంచి ఫలితాల కోసం, ఆరోగ్యం కోసమంటూ రకరకాల కారణాలతో యోగాసనాలు చేస్తున్నారు. యోగకు ఎంత ఖ్యాతి వచ్చిందంటే 21 జూన్ ను అంతర్జాతీయ యోగ దినోత్సవంగా ప్రకటించేంతదాకా.  జూన్ 21నే యోగాడేను జరుపుకోవడానికి పెద్ద కారణమే ఉంది. జూన్ 21 ఉత్తరార్ధగోళంలో అత్యధిక పగటి సమయం ఉన్న రోజు.  ప్రపంచంలోని పలు ప్రాంతాల్లో ఆ రోజుకు పగలు ఎక్కువగా ఉన్న రోజుగా ప్రత్యేకత కూడా ఉంటుంది. ఆ గుర్తింపు తోనే .. అదే రోజును “అంతర్జాతీయ యోగా దినోత్సవం”గా జరుపుకోవాలని నిర్ణయించారు. యోగా అనే పదం సంస్కృత  పదం. “యుజ”  నుంచి వచ్చింది. యుజ అంటే దేన్నయినా ఏకం చేయడం.. లేదా చేరడం అని అర్థం. అంటే.. శరీరాన్ని, మనసును ఏకం చేయడం. అదే యోగా ఉద్దేశం. 2014 సెప్టెంబరు 27న భారత ప్రధాని నరేంద్రమోడి ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రతి సంవత్సరం జూన్ 21న జరుపుకొవాలన్న  ప్రతిపాదన చేశారు.ఈ తీర్మానానికి 193 ఐరాస ప్రతినిధులలో 175 మంది మద్దతు ఇచ్చారు. భద్రతా కమిషన్‌లో శాశ్వత సభ్యులుగా ఉన్న అమెరికా , ఇంగ్లాండ్ , చైనా , ఫ్రాన్స్ , రష్యా వంటి దేశాలు కూడా ఈ తీర్మానానికి సహ ప్రతినిధులు. విస్తృతమైన చర్చల తరువాత డిసెంబర్ 2014 లో  ఐరాస ఈ తీర్మానాన్ని ఆమోదించింది. 2015 జూన్ 21 న  మొదటి అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా జరుపుకున్నారు. అప్పటి నుంచి యేటా జూన్ 21ని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా  పాటిస్తున్నారు.   దాదాపు 5000 ఏళ్ల నాటి చరిత్ర ఉంది యోగాకు. యోగను శాస్త్రీయంగా క్రోడీకరించిన వారిలో ఆద్యుడు పతంజలి. అష్టాంగ యోగా, అయ్యంగార్, విన్యాస యోగా కూడా ఈ క్రమంలో రూపుదిద్దుకున్నవే. ‘అష్టాంగ యోగ’ను పతంజలి మహర్షి సిద్ధం చేశారని చెబుతారు. ఉపనిషత్తులలోనూ, భగవద్గీతలోను యోగా ప్రస్తావన ఉంది. మొండి రోగాలను సైతం నయం చేయగల మహత్తర శక్తి యోగాకే ఉందని పరిశోధనల్లో తేలింది. యోగా చేయడం వల్ల శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి.  యుగయుగాలుగా మన సనాతన భారత సంప్రదాయంలో ఇమిడి ఉండి, పూర్వికులెందరో తమ శారీరక, మానసిక ఉల్లాసం కోసం అనాదిగా ఆచరించిన సాధనం ‘యోగా’. ప్రాచీన కాలం నుండి ఎందరో మునులు, యతులు, ఋషులు, యోగులు తమ తపోనిష్టకు అనారోగ్యం అడ్డు కాకుండా కనిపెట్టిన ఆసనాలు, ఆచరించిన శ్వాస సంబంధిత  ప్రాణాయామాలు  క్రమంగా మనకు  యోగా  పాఠాలుగా మారాయి. ఆ కాలంలోనే  పతంజలి  మహర్షి మన వేదాలు, ఉపనిషత్తుల ఆధారంగా స్వయంగా  యోగ దర్శిని  అనే గ్రంథాన్ని రచించారు. ఈ తాళ పత్ర గ్రంథం ఆధారంగానే ప్రపంచ వ్యాప్తంగా, ఎందరో యోగా గురువులు తమ సాధనలను, అనుభవాలను రంగరించి వేలాది యోగా పుస్తకాలను రంచించారు. ఇంకా రచిస్తూనే ఉన్నారు. పతంజలి మహర్షి భావనలో యోగా అనేది  అష్టాంగ యోగం . అంటే ఈ యోగా అనే శాస్త్రాన్ని  యమము, నియమము, ఆసనము, ప్రాణాయామము, ప్రత్యాహారము, ధారణ, ధ్యానం, సమాధి  అనే ఎనిమిది భాగాలుగా విశ్లేషించి చెప్పారు పతంజలి మహర్షి. ఈ ప్రాచీన పద్దతులను ఆచరిస్తూ విశ్వవ్యాప్తంగా ఎందరో యోగ సాధకులుగా, యోగా గురువులుగా కొనసాగుతున్నారు. యోగాకు సంబంధించిన యోగశాస్త్రాన్ని ప్రపంచానికి పరిచయం చేసింది భారతీయులే. భారతదేశంలో పురుడుపోసుకున్న యోగా నేడు ప్రపంచమంతా పాకింది. ఐదు సహస్రాబ్దాలకు పైగా భారతీయ జీవన విధానంలో అంతర్భాగమైన యోగవిద్యను యావత్ ప్రపంచం ఎప్పటి నుంచో అనుసరిస్తుంది.   2500 ఏళ్ల క్రితం సాధువులు యోగా సాధనలు చేసేవారని యూనివర్సిటీ ఆఫ్ లండన్‌‌కు చెందిన పరిశోధకుడు, సీనియర్ అధ్యాపకుడు డాక్టర్ జిమ్ మల్లిన్‌సన్ పేర్కొన్నారు. ఆయన యోగా చరిత్ర మీద అధ్యయనం చేస్తున్నారు. అప్పట్లో స్థిరంగా ఒక భంగిమలో ఉంటూ యోగా చేసేవారని, ప్రస్తుతం యోగా శిక్షణ కేంద్రాల్లో మనం చూస్తున్న శారీరకపరమైన ఆసనాలు అప్పట్లో ఉండేవి కాదని మల్లిన్‌సన్ వివరించారు. జన్మలపరంపరకు కారణమైన చిత్తవృత్తులను నిరోధించి, జననమరణ చక్రం నుంచి ఉద్ధరించేది యోగం  అన్నారు యోగసూత్రాల్లో పతంజలి మహర్షి. మనం యోగా అంటున్నాం కానీ నిజానికి దాన్ని యోగ్ లేదా యోగం అనే అనాలి అంటారు పతంజలి. యోగం అనే సంస్కృతపదం యుజ్ అనే ధాతువు నుంచి వచ్చింది. దాని అర్దం కలియక. ఎవరి కలియక? జీవాత్మ, పరమాత్మల కలయకకు, లేక ఆ కలయకలు కారణమయ్యే ప్రక్రియకే యోగం అని పేరు. యోగ అంటే కేవలం ఆసనాలే అని అనుకుంటున్నారు. కాదు కాదు అలా చేశారు. ఒకప్పుడూ యోగ్ కేవలం భారతదేశానికి, తూర్పు ఆసియాదేశాలకు, సనాతనహిందూ ధర్మం వ్యాపించిన దేశాలకే పరిమితమైంది. దానికి కారణం కర్మసిద్ధాంతం, పునర్జన్మ సిద్ధాంతానికి యోగకు అవినాభావ సంబంధం ఉంది. యోగకు 8 అంగాలు ఉన్నాయి. 8 అంగాల్లో ఆఖరిది సమాధి అంటే భగవంతునిలో లీనమైపోవటం.. అదే మోక్షం.  ఆసనాలు 3 వ మెట్టు. ధ్యానం చేయండి అంటూ తరుచూ ప్రకటనలు, సలహాలు ఇస్తుంటారు. ధ్యానం యోగంలో 7 వ మెట్టు. యోగం అంటే కేవలం ఆసనాలు కాదు. యోగం యమనియమాలతో మొదలవుతుంది. యోగకు ఆహారనియమాలు తప్పనిసరి. కానీ ఈరోజు దాన్ని ప్రపంచంలో అనేకమంది మార్కెటింగ్ చేసి వ్యాపారం చేస్తున్న కారణంగా అసలు విషయాలు చెప్పడంలేదు. యోగం అనేది ఒక జీవనవిధానం. యోగం ద్వారా పరమాత్మను ప్రాతి పొందాలంటే అష్టాంగ యోగాన్ని అవలంబించాలి. హిందూధర్మమే జీవనవిధానం. అందులో యోగం ఒక భాగం. హిందూ ధర్మం, పునర్జన్మ సిద్ధాంతం లేని యోగం అసంపూర్ణం. యోగం హిందూ షట్ దర్శనాల్లో ఒకటి. అది భగవంతుని కనుగొనే విధానం.  యోగం మతాతీతం. అది ఒక జీవన విధానం.   ఈ ఏడాది కూడా జన్ 21 (బుధవారం) ప్రపంచ వ్యాప్తంగా అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహించుకుంటున్నాం. ప్రధాని మోడీ ఐరాస కేంద్ర కార్యాలయంలో యోగా కార్యక్రమంలో పాల్గొన్నారు. దేశ వ్యాప్తంగా ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహించారు. ప్రపంచ యోగాకు భారత్ బ్రాండ్ అంబాసిడర్ గా నిలుస్తోందనడంలో అతిశయోక్తి లేదు. 

ఇంతకీ కిడ్నాపర్ల వెనుక ఉన్నది ఎవరు ?

విశాఖపట్నం ఎంపీ, వైసీపీ నాయకుడు ఎంవీవీ సత్యనారాయణ ఫ్యామిలీ కిడ్నాప్ వ్యవహారం అనంతరం ఆయన వ్యవహరిస్తున్న తీరు పట్ల పోలిటికల్ సర్కిల్‌లో తీవ్ర విస్మయం వ్యక్తమవుతోంది. తన వ్యాపారాన్ని విశాఖపట్నం నుంచి పక్క రాష్ట్రంలోని హైదరాబాద్‌ మహానగరానికి మారుస్తానని ఆయన స్పష్టం చేయడం, ఆ తర్వాత తన సొంత పార్టీ అధినేతకు చెందిన మీడియాలో ఒకే రోజు.. కోట్ల రూపాయిల విలువైన ప్రకటనలు ఇవ్వడం.. అనంతరం తన ప్యామిలీతో కలిసి ఎంపీ  వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి  జగన్‌ని కలసి రావడం.. చూస్తుంటే.. ఈ కిడ్నాప్‌ స్కెచ్ పక్కా పకడ్బందీ ప్రణాళికతోనే జరిగిందనే ఓ చర్చ   పోలిటికల్ సర్కిల్‌లో వైరల్ అవుతోంది. మరోవైపు ఎంపీ  కంటే.. ఆయన ఫ్యామిలీని కిడ్నాప్ చేసిన కిడ్నాపర్లకు అండ దండ.. చాలా చాలా గట్టిగా ఉన్నాయనే ఓ టాక్ సైతం ఆ  సర్కిల్స్ లో తెగ హల్‌చల్ చేస్తోంది. ఈ విషయాన్ని గ్రహించిన ఆయన.. ఇకపై వ్యాపారం.. విశాఖపట్నం నుంచి కాక.. హైదరాబాద్ కేంద్రంగా చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. అదీకాక ఎంపీ ఫ్యామిలీ కిడ్నాప్ వ్యవహారం డబ్బు కోసమేనంటూ పైకి చెబుతున్నప్పటికీ.. ల్యాండ్ సెటిల్‌మెంట్లలో భాగంగా జరిగిందనే ప్రచారం సైతం వాయువేగంతో నడుస్తోంది.  అలాగే ఈ కిడ్నాప్ వ్యవహారంతో తన పరువు హుళక్కి అయిందని ఎంపీ ఎంవీవీ తనలో తానే రగిలిపోతున్నారని అంటున్నారు. అసలు అయితే రాష్ట్రంలో  వైసీపీ ఎంపీలు రెండంకెల సంఖ్యలో ఉన్నా.. ఎవరి పనుల్లో వారు బిజీ బిజీగా ఉన్నారు.   ప్రస్తుత విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ.. గత ఎన్నికల్లో జేడీ లక్ష్మీనారాయణ మీద పోటీ చేసి విజయం సాధించారు. ఆ సమయంలోనే ఆయన ఓ బిల్డర్ అనీ టాలీవుడ్ సినిమా ప్రోడ్యూసర్ అని అందరికీ తెలిసింది.   ఆ తర్వాత ఆయన్ని అంతగా ఎవరు పట్టించుకోలేదు. ఇంకా చెప్పాలంటే.. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఆపాలంటూ.. అందులో పని చేస్తున్న కార్మికులు చేపట్టిన ఆందోళన 200వ రోజుకు చేరింది. ఈ సందర్బంగా కార్మికులు మానవ హారంగా ఏర్పడి.. తమ నిరసన తెలిపారు. ఆ క్రమంలో వారిని పరామర్శించేందుకు వెళ్లిన ఎంపీ ఎంవీవీ సత్యనారాయాణను కార్మికులు ఘెరావ్ చేశారు. దీంతో ఆయన కామ్‌గా కారెక్కి అక్కడి నుంచి వెళ్లిపోవడం గమనార్హం. ఇక విశాఖ రైల్వే జోన్ అంశంలో సైతం సదరు ఎంపీ ఏ స్థాయిలో స్పందించిందీ అందరికీ తెలిసిందేననే చర్చ సైతం నేటికి కొనసాగుతోంది.   మరోవైపు గతంలో వైసీపీ ఉత్తరాంధ్ర ఇన్‌చార్జ్‌గా ఉన్న విజయసాయిరెడ్డికి విశాఖ ఎంపీకి మధ్య కొంత గ్యాప్ వచ్చిందని.. ఈ పంచాయతీ అప్పట్లో తాడేపల్లి ప్యాలెస్‌కు  చేరిందనే వార్తలు సైతం వెల్లువెత్తాయి.  ఇంకో వైపు ఎంపీ ఎంవీవీ ప్రొడ్యూసర్‌గా తెరకెక్కించిన చిత్రం గల్లీ రౌడీ. ఈ చిత్రంలో కథాంశం.. ప్రస్తుత ఎంపీ ప్యామిలీ కిడ్నాప్ వ్యవహారం కథ కమామిషు అంతా ఒకే విధంగా ఉన్నాయనే టాక్ సైతం ప్రస్తుతం హల్ చల్ చేస్తోంది.  ఈ కిడ్నాప్ వ్యవహారాన్ని సదరు ఎంపీ సత్యనారాయణ ఏ మాత్రం జీర్ణించుకోలేకపోతున్నారని... ఆ క్రమంలోనే ఎంపీగారు ఏపీలో దుకాణాన్ని బంద్ చేసి.. తెలంగాణలో తెరిచేందుకు సన్నాహాలు చేస్తున్నారనే చర్చ వాడి వేడిగా నడుస్తోంది.  అదీకాక.. రాష్ట్రంలో అధికార పార్టీ నేతలను, ప్రజా ప్రతినిధులు టచ్ చేసేందుకు పోలీసులే జంకుతున్నారని... అటువంటి పరిస్థితుల్లో  రేపో మాపో ఎగ్జిక్యూటీవ్ క్యాపిటల్‌గా అవతరించబోతున్న విశాఖపట్నానికి  లోక్‌సభ సభ్యుడిగా ప్రాతినిధ్యం వహిస్తున్న వ్యక్తి ఫ్యామిలీని ఇలా కిడ్నాప్ చేయడం అంటే అంత అషామాషీ వ్యవహారం కాదనే ఓ చర్చ సైతం పోలిటికల్ సర్కిల్‌లో వాడి వేడిగా వైరల్ అవుతోంది.

తెలుగు రాష్ట్రాల పొత్తుల రాజకీయాలు.. వచ్చే నెలలో కీలక పరిణామాలు?

తెలుగు రాష్ట్రాల రాజకీయాలు రసకందాయంగా సాగుతున్నాయి. రెండు రాష్ట్రాలలో కూడా ఏడాది లోపే ఎన్నికలు జరగనున్నాయి. ఏపీలో ఎన్నికలకు ఇంకా పదినెలల సమయముండగా.. తెలంగాణలో మాత్రం ఆరు నెలలు మాత్రమే ఉంది. దీంతో రోజులు గడిచే కొద్దీ రాజకీయం మరింత రసవత్తరంగా మారుతుంది. ఎన్నికలు దగ్గర పడుతున్నాయంటే ముందుగా గుర్తిచ్చేది పొత్తులు, సీట్ల పంపకాలు, అధికార భాగస్వామ్యం. ఇవన్నీ కుదిరితేనే పొత్తులు ఖరారై ఉమ్మడి కార్యాచరణ మొదలవుతుంది. అప్పటి నుండే అసలు సిసలైన యుద్ధం మొదలవుతుంది. అందుకే పొత్తుల అంశాలను ప్రధాన పార్టీలు కనీసం ఎన్నికలకు ఆరు నెలల ముందే నిర్ధారించుకుంటుంటారు. ఆ లెక్కన చూస్తే తెలుగు రాష్ట్రాలలో కూడా పొత్తుల చర్చలకు సమయం ఆసన్నమైంది.  ఏపీలో పొత్తులకు కాస్త సమయం ఉన్నా.. తెలంగాణలో మాత్రం వీలైనంత త్వరగా తేల్చేయాల్సి ఉంది. అయితే, ఒక రాష్ట్రంతో మరొక రాష్ట్రానికి రాజకీయ సంబంధాలు ఉండడంతో సహజంగానే ఈ పొత్తుల అంశం రెండు రాష్ట్రాలకి సంబంధించినదిగా చూడాల్సి వస్తుంది. ఈ క్రమంలోనే వచ్చే నెలలో ఈ పొత్తుల అంశంలో తెలుగు రాష్ట్రాలకి సంబంధించి కీలక పరిణామాలు చోటు చేసుకొనే ఛాన్స్ కనిపిస్తుంది. ఏపీలో ప్రతిపక్ష పార్టీలైన టీడీపీ-జనసేన ప్రజల మధ్యకి వెళ్లి ప్రభుత్వాన్ని ఎండగడుతున్నాయి. టీడీపీ నుండి లోకేష్ పాదయాత్రలో నిమగ్నమవగా.. జనసేనాని పవన్ కళ్యాణ్ వారాహీతో బస్సు యాత్ర మొదలు పెట్టారు. ఇది కాకుండా టీడీపీ మ్యానిఫెస్టోతో బస్సు యాత్రకు సన్నాహాలు చేసుకుంటోంది. మరి మ్యానిఫెస్టో అంటే పొత్తులు కూడా తేల్చాలి కదా. పొత్తులతో ఎన్నికలు అంటే మ్యానిఫెస్టో కూడా ఉమ్మడిగానే ఉంటుంది కనుక ఈ యాత్రలోగా ఈ పొత్తులను తేల్చేయాల్సి ఉంది. పైగా ఏపీలో టీడీపీతో పొత్తు అంటే ఎంతో కొంత అది తెలంగాణలో కూడా కచ్చితంగా ప్రభావం చూపుతుంది. ఆ విధంగా చూసినా వచ్చే నెలలో ఈ పొత్తుల వ్యవహారం తేల్చేయాల్సి ఉంది.  టీడీపీ-జనసేన-బీజేపీ ఎవరికి వారి ఎత్తులు పై ఎత్తులు ఉన్నా.. ఈసారి కలిసి వెళ్లడమే ఖాయంగా కనిపిస్తుంది. ఒకవైపు పవన్ బీజేపీతో పొత్తులో ఉంటూనే టీడీపీకి సిగ్నల్ ఇచ్చేశారు. మరోవైపు వైసీపీ ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఒక్కటి కూడా చీల్చేందుకు సిద్ధంగా లేనని స్పష్టత ఇచ్చేశారు. పాత స్నేహితులకు మరోసారి స్నేహ హస్తం అందించాలని బీజేపీ అధిష్టానం కూడా సంకేతాలు ఇస్తోంది. ఈ లెక్కన చూస్తే బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి ఖాయమయ్యే అవకాశమే ఎక్కువగా ఉన్నాయి. అయితే, తెలంగాణలో ఆరు నెలలే సమయం ఉండడంతో పొత్తు ఉంటుందా? ఉండదా అనేది తేల్చేయడం బీజేపీకి ఇప్పుడు చాలా అవసరం. ఈ క్రమంలోనే పొత్తులు పెట్టుకునే విషయంలో బీజేపీ ఇప్పుడు కూడా క్లారిటి ఇవ్వకపోతే తీవ్రంగా నష్టపోవటం ఖాయం. అందుకనే టీడీపీతో పొత్తు విషయంలో వచ్చే నెలలో బీజేపీ ఫైనల్ డెసిషన్ తీసుకోబోతోందని సమాచారం.  అన్నీ అనుకున్నట్లే జరిగితే వచ్చేనెలలో నరేంద్రమోడీ లేదా అమిత్ షా  మరోసారి చంద్రబాబుతో భేటీ అవుతారు. అప్పుడు పొత్తులపై క్లారిటీ వచ్చేస్తుందని భావిస్తున్నారు. ముందుగా ఢిల్లీలో భేటీ అనంతరం టీడీపీ, బీజేపీ, జనసేన సంయుక్తంగా సమావేశమై ఉమ్మడి ప్రణాళికను రెడీ చేయబోతున్నట్లు తెలుస్తుంది. అదే సమయంలో ఈ కూటమి తెలంగాణలో ఎలా పనిచేయనుంది? అసలు ఇక్కడ కలిసే పోటీ చేస్తారా? లేక ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం ప్రణాళికలు అమలు చేస్తారా అనేది చూడాల్సి ఉంది.

టీకాంగ్రెస్ పొలంలో మొలకలొస్తున్నాయ్!

ఇన్నాళ్లూ ఒక లెక్క.. ఇకపై మరోలెక్క.  ఇన్నాళ్లూ కునారిల్లుతున్న పార్టీకి టైం వచ్చేస్తుంది. చాలా కాలంగా డీలా పడిపోయిన పార్టీకి ఇప్పుడు జవసత్వాలొస్తున్నాయి. ఇన్నాళ్లూ వెళ్ళేవాళ్ళే కానీ వచ్చేవాళ్లెవరంటూ ఎదురు చూసి చూసి కళ్లు కాయలు కాసిన కాంగ్రెస్ కు ఇప్పుడా ఎదురు చూపులు ఫలితాలను ఇస్తున్నాయి. మేమొస్తున్నామంటూ  పలు పార్టీల నేతల నుంచి సంకేతాలు వెల్లువెత్తుతున్నాయి. ఇదంతా దేని గురించి చెప్తున్నామో అర్ధమయ్యే ఉంటుంది. ఔను.. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ గురించే ఇదంతా. ఇప్పుడిప్పుడే మళ్ళీ తెలంగాణ కాంగ్రెస్ పొలంలో మొలకలొస్తున్నాయి. ఇన్నాళ్లూ రండి బాబూ రండి మా పార్టీలో చేరండని అడిగినా పట్టించుకోని నేతలు ఇప్పుడు మేము వస్తే టికెట్ ఇస్తారా అంటూ రాయబారాలు పంపిస్తున్నారు. దీంతో ఈసారి ఎన్నికలలో మూడు ముక్కలాట తప్పదా అనే చర్చలు జరిగిపోతున్నాయి. రాజకీయ పార్టీలకు స్వతహాగా ఒకలక్షణం ఉంటుంది. సమర్థులైన నేతలు అనునిత్యం పోరాటం చేస్తూ ప్రజల పక్షాన నిలబడుతూ, ఎప్పటికప్పుడు అధికార పార్టీని ఇరకాటంలో పెట్టి ప్రజల ముందు దోషిగా నిలబెడితే, తనంతట తానుగా పోరాడిన పార్టీ వృద్ధిలోకి వస్తుంది. కానీ, తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో సమర్థులైన నేతలు ఉన్నా.. నిత్యం అంతర్గత కుమ్ములాటలతో ప్రజలలో పలచబడుతూ వచ్చారు. దీంతో ఇన్నాళ్లు ఆ పార్టీకి కొత్త వారు రావడమంటే సాహసంగా భావిస్తే.. ఉన్నవాళ్ళేమో ఉన్న దానిలో పదవుల పంపకం కోసం వైరాలు పెంచుకుంటూ వచ్చారు. అయినా, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి అనుకూల పవనాలు మొదలయ్యాయి. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ విజయంతో పాటు.. తెలంగాణలో అధికార బీఆర్ఎస్ లో నేతల ఓవర్ లోడింగ్ ఇప్పుడు ఆ పార్టీకి కలిసి వచ్చిన అవకాశంగా మారింది. ఎన్ని పోరాటాలు చేసినా..  ఎన్ని ఉద్యమాలు చేసినా కలిసిరాని కాలం..  ఒక టైం వచ్చి రాజకీయ అవసరం ఏర్పడితే ఊహించనివిధంగా కలిసి వస్తుంది. ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ లో అదే పరిస్థితి కనిపిస్తోంది. తెలంగాణలో రెండో ప్రత్యామ్నాయంగా బీజేపీ, కాంగ్రెస్ కి అవకాశాలు మెండుగా ఉన్నాయి. అయితే, కర్ణాటకలో బీజేపీ ఓటమి ప్రభావం ఎంతో కొంత తెలంగాణలో కూడా కనిపిస్తుంది. దీంతో కొత్తగా పార్టీ మారేవారికి కాంగ్రెస్ ఒక అప్షన్ గా కనిపిస్తోంది. పైగా తెలంగాణ ప్రసాదించిన పార్టీగా గోల్ చేసుకొనేందుకు అవకాశం కాంగ్రెస్ కు మిగిలి ఉంది. అంటే ఒక విధంగా బీఆర్ఎస్ పై ఫెనాల్టీ కార్నర్ చాన్స్ అన్న మాట.  దీంతో బీఆర్ఎస్ అసమ్మతి నేతలు, ఈసారి టికెట్ దక్కదేమో అని సందేహపడుతున్న నేతలు, గులాబీ పార్టీ అధిష్టానంతో  విభేధించే వారు  ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని తమ డెస్టినేషన్ గా ఎంచుకుంటున్నారు.  తెలంగాణలో ఇద్దరు ఎమ్మెల్సీలు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు చర్చలు జరుపుతున్నట్లు గత రెండు రోజులుగా రాజకీయ వర్గాలలో చర్చ జరుగుతుంది. ఈ ఇద్దరూ ఈసారి ఎమ్మెల్యేలుగా పోటీ చేసేందుకు సిద్ధమవుతుండగా అధికార బీఆర్ఎస్ నుండి ఎలాగూ టికెట్ దక్కదనే ఆలోచనతో కాంగ్రెస్ తో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తుంది. ఈ ఇద్దరితో పాటు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో పట్టున్న పట్నం మహేందర్ రెడ్డి కూడా కాంగ్రెస్ తో సంప్రదింపులు జరుపుతున్నాని గట్టిగా వినిపిస్తోంది. పట్నం మహేందర్ తాండూరు నుండి పోటీచేసి పైలట్ రోహిత్ రెడ్డిపై ఓడిపోయారు. ఆ ఎన్నికలలో కొడంగల్ నుండి రేవంత్ రెడ్డిపై పోటీచేసిన పట్నం మహేందర్ రెడ్డి  తమ్ముడిని గెలిపించుకునే క్రమంలో తాను పోటీ చేస్తున్న తాండూరుపై కాన్సన్ ట్రేట్ చేయకపోవడంతో అప్పుడు పరాజయం పాలయ్యారు. అయితే అక్కడ్నుంచి గెలిచిన పైలట్ రోహిత్ రెడ్డిని బీఆర్ఎస్ లో చేర్చుకున్న కేసీఆర్ ఈసారి కూడా ఆయనకే టిక్కెట్  ఇవ్వాలని నిర్ణయించారు. ధృవీకరించేశారు.  ఇప్పుడు పట్నం మహేందర్ రెడ్డి కాంగ్రెస్ కి రావాల్సిన అవసరం వచ్చింది. అయితే  అప్పుడు పనిగట్టుకొని ఓడించిన రేవంత్ రెడ్డి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షడు, దీంతో ఇప్పుడు పట్నం పరిస్థితి ఏంటన్నది ఆసక్తికరంగా మారింది. వచ్చే నెలలో రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటనకు వస్తున్నారు. కర్ణాటక ఫలితాలే ఇప్పుడు పార్టీలో జోష్ పెంచితే.. ఇక రాహుల్ రాకతో అంతకి మించి అనేలా జోష్ పెరగడం ఖాయంగా కనిపిస్తుంది. ఈలోగానే రాహుల్ సమక్షంలో భారీగా చేరికలకు ఇక్కడి నేతలు ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ చేరికల కోసం పీసీసీ అధ్యక్షుడు ఒక కమిటీని నియమించగా.. ఈ కమిటీ అసంతృప్తి నేతలకు గాలమేసే పనిలో ఉంది. పార్టీలో చేరే వారి జాబితాను ఇప్పటికే సిద్ధం చేసేసింది. అలా వచ్చి చేరేవారిలో కొందరు టికెట్ హామీతో కండువా కప్పుకునేందుకు సిద్ధమవుతుంటే.. మరికొందరు సర్ధుకుపోవడానికి కూడా సై అంటుండటం విశేషం. మరి కాంగ్రెస్ పార్టీ ఈ అవకాశాన్ని ఎలా సద్వినియోగం చేసుకుంటుందో చూడాలి.

తండ్రి బ్రాండ్ కొడుకుదా.. కూతురిదా?

ఉరుము ఉరిమి మంగళం మీద పడ్డట్టు  కాంగ్రెస్  రాజకీయాలు జగన్ పరువు తీస్తున్నాయి. ఇప్పటికే రెండుగా చీలిన వైఎస్ రాజశేఖరరెడ్డి కుటుంబం తాజా పరిణామాలతో మరింత ఇరకాటంలో పడింది. తెలంగాణలో వైఎస్ఆర్  పేరుతో వేరు కుంపటి పెట్టుకున్న షర్మిల ఇప్పుడు భారత జాతీయ కాంగ్రెస్ వైపు అడుగులు వేస్తుండటంతో  జగన్ కు కొత్త చిక్కులు వచ్చి పడ్డాయి. తల్లి, చెల్లెళ్లను విజయవంతంగా ఆంధ్ర ప్రదేశ్ నుంచి తెలంగాణ రాజకీయాల వైపు నెట్టేసి , తనకు తిరుగులేదని ఊపిరి పీల్చుకుంటున్న జగన్  తాజా పరిణామాలతో  అవాక్కయ్యారు.   కాంగ్రెస్ మూలాల నుండి వచ్చిన  రాజశేఖర రెడ్డి  కుటుంబాన్ని తిరిగి కాంగ్రెస్ నీడన చేర్చేందుకు ఢిల్లీ కాంగ్రెస్ పెద్దలు పావులు కదుపుతున్నారు.  జులై 8న వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతిని పురస్కరించుకుని ఇడుపుల పాయలోని ఆయన సమాధిని సందర్శించాలని  కాంగ్రెస్ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీలు నిర్ణయించుకున్నారు. వైఎస్ షర్మిల తెలంగాణలో ప్రారంభించిన రాజకీయ పార్టీ వైఎస్ఆర్ టీపీ కాంగ్రెస్ లో విలీనం అవుతుందన్న ఊహాగానాలు గత కొన్ని రోజులుగా వినిపిస్తున్న  నేపథ్యంలో జులై 8న ఇడుపుల పాయ కార్యక్రమం ప్రాధాన్యతను సంతరించుకుంది. అసలు వైఎస్ షర్మిల తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసేలా అంగీకరింపచేయడంలో వెనుక ఉండి కథ నడిపింది.. వైఎస్సార్ ఆత్మ అని చెప్పుకునే కేవీపీ రామచంద్రారెడ్డి తన వంతు ప్రయత్నం చేశారు. ఆయన తెలంగాణ కాంగ్రెస్ నేతల వద్ద తన పలుకుబడిని ఉపయోంగించి వారి నుంచి అభ్యంతరాలు రాకుండా మంతనాలు, మంత్రాంగం నెరిపారు. ఆ తరువాత కర్నాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ద్వారా షర్మిలకు కాంగ్రెస్ ద్వారాలు తెరిచేలా చేశారు. అన్నిటికీ మించి తాను టీపీసీసీ చీఫ్ గా ఉన్నంత కాలం తెలంగాణ కాంగ్రెస్ లో షర్మిల రాజకీయాలు చేయలేరని ప్రకటించిన రేవంత్ రెడ్డిని కూడా ఒప్పించారు. తద్వారా వైఎస్ రాజశేఖర రెడ్డి తమ బ్రాండ్ అని నమ్ముతున్న  కాంగ్రెస్ ఈ అంశాన్ని రానున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో సమర్ధవంతంగా ప్రచారంలో పెట్టాలని భావిస్తోంది. వైఎస్ఆర్ బ్రాండ్ తనదే అంటూ ప్రతీ పథకానికి  ఆయన పేరు తగిలించి ప్రచారం చేసుకుంటున్న ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రికి ఇది ఎంతమాత్రం మింగుడు పడని విషయం. కర్నాటక ఎన్నికల తర్వాత కాంగ్రెస్ మంచి జోష్ లో ఉండడం,   కర్నాటక  మోడల్ ను తెలంగాణలో అనుసరించేందుకు వ్యూహాలు రచించడం ఒక ఎత్తు అయితే పదేళ్ల కెసీఆర్ పాలనపై నాయకులలో ప్రజల్లో ఉన్న అసహనాన్నిఓట్లుగా మార్చుకునేందుకు కాంగ్రెస్ సిద్దమవుతోంది.  వైఎస్ షర్మిల వంటి నాయకురాలిని కాంగ్రెస్ లోకి ఆహ్వానించి తెలంగాణలో బలమైన రెడ్డి సామాజిక వర్గాన్ని ఒక్క తాటిపై తెచ్చేందుకు  కాంగ్రెస్  అధిష్టానం చేస్తున్న విలీన ప్రయత్నం ఎలాంటి ఫలితాలను ఇస్తుందో వేచి చూడాల్సిందే.  మరో వైపు నాయకులు ఎక్కువగా ఉండే  కాంగ్రెస్ లో పదవుల పంపకం రేపు పెద్ద సమస్య కాక మానదు. షర్మిల పార్టీని విలీనం చేసుకుని బిఆర్ఎస్ కు బిజెపికి గట్టి సవాల్ విసిరాలని  కాంగ్రెస్ భావిస్తోంది. దీంతో పాటు మరిన్ని పార్టీలు తమ మద్దతును  కాంగ్రెస్ కు ఇచ్చేందుకు సిద్దంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా కాంగ్రెస్ లో వైఎస్ఆర్ టిపి విలీనం ఇటు తెలంగాణ రాజకీయాలనే కాక ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలను  కూడా ప్రభావితం చేస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

ఆదిపురుష్ ని పూర్తిగా బ్యాన్ చేయండి.. ప్రధానికి లేఖ!

ఆదిపురుష్ ని వరుస వివాదాలు వెంటాడుతున్నాయి. సినిమా విడుదలకు ముందే పలు పాత్రల వేషధారణపై వ్యతిరేకత వ్యక్తమైంది. ఇంక సినిమా విడుదల తర్వాత దర్శక నిర్మాతలపై తీవ్ర స్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రావణుడి పాత్రని చూపించిన తీరు, హనుమంతుడి డైలాగ్ లపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. శ్రీరాముడిని అడ్డుపెట్టుకొని ఇలాంటి సినిమా తీస్తారా?  ఈ తరం పిల్లలు ఇదే నిజమైన రామాయణం అనుకుంటే ఎలా?  అంటూ పలువురు మండిపడ్డారు. ఈ విమర్శల దెబ్బకి  ఆదిపురుష్ టీమ్ మాట మార్చింది.  విడుదలకు ముందు రామాయణం,  జై శ్రీరామ్, జై హనుమాన్ అంటూ ప్రచారం చేసుకొని.. విడుదల తర్వాత మాత్రం ఆ చిత్ర రచయిత మనోజ్ మాట మార్చి ఇది రామాయణం కాదు, దాని స్ఫూర్తితో చేసిన సినిమా మాత్రమే అంటూ కొత్త పల్లవి అందుకున్నారు. దాంతో  ఆదిపురుష్ విమర్శలు మరింత పెరిగాయి. ఇక తాజాగా ఆల్‌ ఇండియన్‌ సినీ వర్కర్స్‌ అసోసియేషన్‌ అయితే ఈ సినిమాని బ్యాన్ చేయాలంటూ ఏకంగా ప్రధాని మోడీకి లేఖ రాసింది. ఆదిపురుష్ సినిమా స్క్రీన్‌ప్లే,  డైలాగ్‌లు శ్రీరాముడిని, హనుమంతుడిని కించపరిచేలా ఉన్నాయి. ఈ సినిమా హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ఉంది. మతాలతో సంబంధం లేకుండా భారతీయులందరికీ శ్రీరాముడు దేవుడు. రాముడు, రావణుడి పాత్రలు వీడియో గేమ్‌ ని తలపిస్తున్నాయి. సంభాషణలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులందరినీ బాధపెట్టేలా ఉన్నాయి. ఈ సినిమా ప్రదర్శనను నిలిపివేయవలసిందిగా మేము గౌరవ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని అభ్యర్థిస్తున్నాము. వెంటనే థియేటర్ల నుంచి తొలగించడమే కాకుండా, భవిష్యత్తులో ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లలో కూడా స్క్రీనింగ్‌ జరగకుండా నిషేధించాలని కోరుతున్నాము. అలాగే ఈ చిత్ర రచయిత, దర్శకుడు, నిర్మాతలపై కేసు నమోదు చేయాలి" అని కోరుతూ ఆల్‌ ఇండియన్‌ సినీ వర్కర్స్‌ అసోసియేషన్‌ లేఖ రాసింది. మరి ఈ లేఖపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి.

బీజేపీ.. తెలంగాణ స్ట్రాటజీ ఏపీలో!

ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీ.. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ మధ్య ఉన్న సంబంధం ఏంటని అడిగితే దోస్త్ మేరా దోస్త్ అని కాస్త రాజకీయంపై అవగాహనా ఉన్న ఎవరైనా విడమర్చి చెప్పేస్తారు. పబ్లిక్ గా కాకపోయినా ప్రైవేట్ గానైనా ఈ సంబంధం అంతా ఓపెనే. ఈ నాలుగేళ్లుగా బీజేపీతో వైసీపీ చెట్టాపట్టాలు వేసుకుని తిరిగింది. కేంద్రం హామీలని పక్కన పెట్టినా వైసీపీ నోరు మెదపలేదు. కేంద్రం ప్రవేశపెట్టిన బిల్లులన్నింటికీ  వైసీపీ జీ హుజూర్ అంటూ మొప్పుపొందేందుకు చేయగలిగినంతా ఇంకా స్పష్టంగా చెప్పాలంటే  అంత కంటే ఎక్కువే చేసింది. అడిగింది కాదనకా.. అడిగేదేందుకు నేను ఉండగా అన్నట్లు ఒకరికి ఒకరు ఇచ్చి పుచ్చుకున్నారు. ఇంకా చెప్పాలంటే కేంద్రం ఇబ్బందుల్లో ఉన్నప్పుడు బీజేపీ అడగకపోయినా తానున్నానంటూ ఏపీ సీఎం జగన్ ముందు నిలబడ్డారు. అందుకు ప్రతిఫలంగా బీజేపీ కూడా వైసీపీ అడిగినవన్నీ చేస్తూ వస్తోంది. ఆ రెండు పార్టీల మధ్య పొత్తు లేకపోయినా అంతకు మించిన బంధం కొనసాగుతోందనీ.. ఈ బంధాన్ని తెంచుకోవడానికి రెండు పార్టీలకీ ఇసుమంతైనా ఇష్టం లేదని కూడా చెప్పుకున్నారు. కానీ, ఈ మధ్య బీజేపీ అగ్రనాయకత్వం ఒక్కసారిగా వైసీపీ సర్కార్ పై తీవ్ర విమర్శలు గుప్పిస్తోంది. శ్రీకాళహస్తి, విశాఖపట్నంలలో ఏర్పాటు చేసిన సభలలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, హోంమంత్రి అమిత్ షా.. జగన్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. జగన్ ప్రభుత్వం పూర్తిగా అవినీతిలో కూరుకుపోయిందని, ఇక్కడ చట్టం అమలు కావట్లేదని ఆరోపించారు. స్కాంలు తప్ప ఇక్కడేమీ జరగట్లేదని దుయ్యబట్టారు. కేంద్ర నిధులను పక్కదారి పట్టించారని విమర్శించారు. దీంతో ఒక్కసారిగా వచ్చిన ఈ మార్పు వెనక కారణాలు ఏంటనే దానిపై  రకరకాల ప్రచారం జరిగింది. బీజేపీ తెలుగుదేశంతో దోస్తీకి సిద్ధమైందనే ప్రచారం అందులో ప్రధానంగా వినిపించింది.  బీజేపీ చేసిన విమర్శలకు వైసీపీ కూడా అదే స్థాయిలో విమర్శల వాన.. వాన ఏంటి  విమర్శల సునామీనే సృష్టించింది.   అయితే అదే సమయంలో తెలుగుదేశం నేతలు కూడా బీజేపీపై విమర్శలు మొదలు పెట్టారు. జగన్ సర్కార్ అవినీతిపై ఆరోపణలు చేసిన బీజేపీ ఎందుకు చర్యలు తీసుకోదు?  రాష్ట్రంలో అసలు చట్టమే అమలు కావట్లేదని చెప్పిన హోంమంత్రి జగన్ ప్రభుత్వంపై చర్యలు తీసుకుని తమ చిత్తశుద్ధి నిరూపించుకోవాలంటూ తెలుగుదేశం పార్టీ బీజేపీని నిలదీసింది. దీంతో అసలు ఈ రాజకీయం ఏంటో.. ఎవరు ఎవరికి స్నేహితులో.. ఎవరు ఎవరికి శత్రువులుగా మారబోతున్నారో అర్ధం కాక ప్రజలు రకరకాల చర్చలు సాగిస్తున్నారు. అయితే  దీని వెనక బీజేపీ భారీ స్కెచ్ ఒకటి ఉండొచ్చనే అనుమానాలు కూడా బలపడుతున్నాయి. ఒక్కసారి తెలంగాణ రాజకీయాలలోకి తొంగిచూస్తే ఈ స్కెచ్ ఏంటన్నది తేటతెల్లం అవుతుంది. ఇప్పుడు తెలంగాణ రాజకీయాలలో బీఆర్ఎస్, బీజేపీ మధ్య వార్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. తెలంగాణలో అసలు ఉనికి ఉందా లేదా అన్నట్లున్న బీజేపీ ఈ స్థాయికి ఎదగడం వెనకున్న కారణం అప్పటి టీఆర్ఎస్ కు తామే ప్రత్యామ్నాయం అనేలా రెచ్చిపోవడం. నువ్వా నేనా అన్నట్లున్న టీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య బీజేపీ చేరి టీఆర్ఎస్ ను టార్గెట్ చేసి కాంగ్రెస్ ను సైడ్ చేసింది. నేతల చేరికలతో పాటు ప్రభుత్వ లోపాలపై ఫోకస్ పెట్టిన బీజేపీ అంచెలంచెలుగా ఎదిగే ప్రయత్నం చేసింది, చేస్తోంది. ఇందులో కొంతవరకు తెలంగాణలో సక్సెస్ అయ్యింది కూడా. ఒక్క తెలంగాణలో మాత్రమే కాదు చాలా రాష్ట్రాలలో బీజేపీ ఎదుగుదల ఇలాగే జరిగింది. ఆ క్రమంలో మిత్రులను కూడా సైడ్ చేసి ఒక్కోమెట్టు ఎక్కింది. ఇప్పుడు అదే ఫార్ములాను ఏపీలో కూడా బీజేపీ ప్రయోగించాలనే ఆలోచన చేస్తుందా అనే అనుమానాలు రేకెత్తుతున్నాయి. అయితే, బీజేపీ ఫార్ములా ఏపీలో సక్సెస్ అవుతుందా అంటే అనుమానమే. అప్పటి తెలంగాణలో బీజేపీ పరిస్థితితో పోలిస్తే ఇప్పుడు ఏపీలో బీజేపీ పరిస్థితి మరింత దారుణం. పైగా తెలంగాణలో దెబ్బకొట్టిన కాంగ్రెస్ జాతీయ పార్టీ కాగా.. ఏపీలో టీడీపీ మూలాల వరకు చొచ్చుకుపోయిన రాష్ట్ర పార్టీ. ఇక  ఏపీలో బీజేపీకి ఇలాంటి ఫార్ములాలను అమలు చేయగల సమర్ధ నేతలు కూడా లేరు. దీంతో అగ్రనేతలొచ్చి కాస్త కీ ఇచ్చినా.. ఇక్కడ లోకల్ గా దానిని అమలు చేసే సత్తా రాష్ట్ర బీజేపీ నాయకులలో కనిపించడం లేదు. దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని బీజేపీ ఇలాంటి ఎన్నో ప్రయోగాలు చేసి సక్సెస్ అవుతున్నా.. ప్రస్తుతానికి ఏపీలో అందుకు విభిన్న పరిస్థితులే కనిపిస్తున్నాయి. 

క్లారిటీ లేని పొత్తులా? ప్రత్యర్థులని ముప్పుతిప్పలు పెట్టడమా?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ది క్లారిటీ లేని రాజకీయమా?, క్లారిటీ లేకనే ఒక్కోసారి ఒక్కోలా మాట్లాడుతుంటారా?, ఆ క్లారిటీ లేకనే మొన్నటి వరకు సీఎం అయ్యేందుకు రాజకీయాల్లోకి రాలేదని.. ఇప్పుడు తానే సీఎం అభ్యర్థిని అనేలా మాట్లాడుతున్నారా? అంటే ఆయన రాజకీయ ప్రత్యర్ధులు అవుననే అంటారు. మరి నిజంగానే ఆయన క్లారిటీ లేకనే ఇప్పుడు తానే సీఎం అభ్యర్థిని అనేలా మాట్లాడుతున్నారా?  అంటే ముమ్మాటికీ కాదని చెప్పాలి.  ఇంకా చెప్పాలంటే పవన్ ఇప్పుడు దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని రాజకీయాలు మొదలు పెట్టారు. అందుకు తగ్గట్లే ఒక్కోసారి ఒక్కోలా స్టేట్మెంట్లు ఇచ్చేస్తున్నారు. ఇది అర్ధం చేసుకోవాలంటే కాస్త లోతుగా వెళ్లి విశ్లేషణ చేసుకోవాలి. పవన్ జనసేన పార్టీ పెట్టిన తొలిసారి ఎన్నికలలో ఆయన పోటీ చేయనే లేదు. టీడీపీ-బీజేపీ కూటమికి సహకరించి వారి విజయానికి అంతో ఇంతో సహకరించారు. అయితే ఆ తర్వాత రాష్ట్రంలో రాజకీయ పరిణామాల నేపథ్యంలో గత 2019 ఎన్నికలలో ఆయన సింగిల్ గా పోటీ చేసి పరాజయం పాలయ్యాడు. ఓటమి మాత్రమే కాదు.. రాజకీయంగా ఆయన లెక్కలు కూడా తప్పేనని ఈ ఎన్నికలలో తెలిసొచ్చింది. దీంతో దీర్ఘకాలిక రాజకీయాల మీద ఫోకస్ పెట్టిన పవన్ జాతీయస్థాయిలో అధికారంలో ఉన్న బీజేపీతో పొత్తుకి సిద్దమై.. 1+1=2 ఫార్ములాతో బలం పెంచుకున్నారు. ఇక ఎన్నికలకు రెండేళ్ల ముందు నుండే ఈ సారి తప్పు చేయబోనని, వైసీపీకి అధికార దక్కనివ్వమని, అందుకోసం తాను ఒక మెట్టు దిగేందుకు కూడా సిద్ధమని ప్రకటించారు. ఇప్పటికీ అదే మాట చెప్తున్నారు. అయితే, ప్రస్తుతం తన వారాహీ వాహనంతో పర్యటన సాగిస్తున్న పవన్  కాకినాడలో మాట్లాడుతూ.. మీరు ఆశీర్వదిస్తే సీఎం అవుతానని.. మీరు కోరుకుంటే తానే సీఎం అభ్యర్థిని అవుతా అంటూ మాట్లాడారు. దీంతో మెయిన్ స్ట్రీమ్ మీడియా నుండి సోషల్ మీడియా వరకూ ఎవరికి వారు పొత్తుపై పవన్ పునరాలోచన చేస్తున్నారని, పొత్తు వ్యవహారం చెడిందని  విశ్లేషణలు మొదలు పెట్టారు. కానీ, ఇక్కడ అర్ధం చేసుకోవాల్సింది.. పవన్ మాటలకు అర్ధాలే వేరులే అని. ఆ అర్ధం ఏంటో కాదు.. టీడీపీతో  కలిసి నడిచేది గ్యారంటీ అని ఎప్పుడో విడమర్చి చెప్పేశారు. కానీ, లెక్కలు.. సీట్లు.. పదవుల బేరం ఇంకా ఏదీ తేలలేదు. అవి తేల్చాల్సిన సమయం దగ్గర పడుతుంది. అందుకే పవన్ మార్క్ స్ట్రాటజీగా దీన్ని చూడాలి. ఎవరు ఎన్ని అనుకున్నా.. రాజకీయం రాజకీయమే కదా. ఎంత పొత్తు అయినా.. నాలుగు సీట్లు ఎక్కువగా దక్కించుకోవాలనుకోవడం రాజకీయ పార్టీ ధర్మం. అదే ఇప్పుడు పవన్ చేస్తున్నది. దీనికి తోడు జనసైనికులు పవన్ కళ్యాణ్ ను ఎప్పుడూ రాజకీయ నేతగా చూడరు. వెండితెర మీద ఆయన్ని హీరోగా చూసిన అభిమానులు రాజకీయాలలో కూడా ఆయన్ను హీరోగా (సీఎం) చూడాలని ఆశపడుతుంటారు. ఒక్కో సందర్భంలో అభిమానుల నినాదాలు శృతి మించిన సమయంలో పవన్ కూడా తనకి కూడా సీఎం కావాలనే ఉందంటూ అభిమానులను ఉత్సాహపరుస్తుంటారు. అలా తానే సీఎం అనే టాక్ ఎంత పబ్లిక్ లోకి వెళ్తే రేపు పొత్తులలో జనసేనకి అంత డిమాండ్ పెరుగుతుంది. ఆ కారణంగానే పవన్ ఇప్పుడు సీఎం నినాదాన్ని ఎత్తుకున్నట్లు అర్ధం చేసుకోవచ్చు. పైగా, ఈ మధ్య కాలంలో అధికార వైసీపీ టీడీపీ, జనసేనలను కలిపే మాట్లాడుతోంది. పవన్ కళ్యాణ్ మీద ఒంటి కాలిపై విమర్శలకు దిగుతున్న వైసీపీ నేతలు, టీడీపీని గెలిపించేందుకు మాత్రమే  పవన్ రాజకీయం పరిమితమైందని విమర్శలు  చేస్తున్నారు. ఇంకా ఎన్నికలకు చాలా సమయం ఉంది కనుక ఈలోగా ఇలా తానే సీఎం అనే  మాట ద్వారా ప్రత్యర్థుల విమర్శలకు బ్రేక్ వేసినట్లౌతుంది. ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి కనుకే పవన్ అప్పుడప్పుడూ ఇలా ప్రత్యర్థులకు నోటి నిండా మాట్లాడుకోవడానికి స్టఫ్ ఇస్తుంటారు. దాన్నే నమ్ముకొని ప్రత్యర్ధులు పండగ చేసుకుంటుంటారు. కానీ, నిజానికి పవన్ టార్గెట్ 2029 మాత్రమే. ఇప్పటికే వేలసార్లు ఈ మాట చెప్పినా.. అప్పుడప్పుడు ఇలా చిన్నా చితకా ప్రచారాలకు విపక్షాలు పండగ చేసుకోవడమే ఆసక్తి  కలిగించే అంశం.

లిటిల్ మెగా ప్రిన్సెస్ రాకతో మెగా ఇంట సందడి!

మెగా ఇంట పండుగ వాతావరణం నెలకొంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతులు తల్లిదండ్రులయ్యారు. మంగళవారం తెల్లవారుజామున హైదరాబాద్ లోని అపోలో ఆసుపత్రిలో ఉపాసన పండండి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. తల్లి, బిడ్డ ఆరోగ్యంగా ఉన్నారని తెలుపుతూ ఆసుపత్రి వర్గాలు ప్రకటన విడుదల చేశాయి. మెగా వారసురాలు రాకతో మెగా కుటుంబంలో, మెగా అభిమానుల్లో సందడి వాతావరణం నెలకొంది. సన్నిహితులు, సినీ ప్రముఖులు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా మెగా జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. "లిటిల్ మెగా ప్రిన్సెస్ కు స్వాగతం" అంటూ మనవరాలు పుట్టిన సందర్భంగా తన సంతోషాన్ని పంచుకున్నారు మెగాస్టార్ చిరంజీవి. నీ రాకతో మెగా కుటుంబంలో సంతోషం నెలకొందంటూ ట్వీట్ చేశారు. ఇక రామ్ చరణ్ తో 'ఆర్ఆర్ఆర్' స్క్రీన్ ని పంచుకున్న యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కూడా చరణ్-ఉపాసన దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు. ఆడబిడ్డతో గడిపిన ప్రతి క్షణం జీవితాంతం మరచిపోలేని జ్ఞాపకంగా మిగిలిపోతుంది అంటూ ఎన్టీఆర్ ట్వీట్ చేశారు.

ఏపీ నుంచి పారిపోయేలా జగన్ పాలన!

విశాఖపట్నం లోక్‌సభ సభ్యుడు, వైయస్ఆర్ సీపీ నాయకుడు ఎంవీవీ సత్యనారాయణ ఫ్యామిలీ కిడ్నాప్ వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనం సృష్టించింది.  సరే ఆ కిడ్నాప్ సుఖాంతమైందనుకోండి. అదలా ఉంచితే ఈ కిడ్నాప్ ఉదంతం రాష్ట్రంలో అందునా జగన్ కలల రాజధాని అయిన విశాఖ పట్నంలో శాంతి భద్రతలు ఎంత సుందరముదనష్టంగా వెలిగిపోతున్నాయో తేటతెల్లం చేసింది. అంతే కాదు ఏపీ వ్యాప్తంగా గత రెండు వారాలుగా జరిగిన వరుస హింసాత్మక సంఘటనలు ( దళితుడి హత్య, బాలుడి దహనం, దళిత మహిళపై అత్యాచారం వంటివి) రాష్ట్రంలో పరిస్థితికి అద్దం పట్టాయి. ఈ నేపథ్యంలోనే సాక్షాత్తే అధికార వైసీపీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ రాష్ట్రంలో వ్యాపారాలు చేయలేనని ప్రకటించి తన వ్యాపారాలన్నిటినీ హైదరాబాద్ కు మార్చేస్తున్నానని ప్రకటించారు. ఆయన తన వ్యాపారాలను విశాఖపట్నం నుంచి తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ తరలించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు ఆయన చేసిన ప్రకటన  అటు  మీడియాలో ఇటు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.  ఏపీలో వ్యాపారం చేయలేని పరిస్థితులున్నాయని సాక్షాత్తూ అధికార పార్టీ ఎంపీయే రాష్ట్రం నుంచి బిచాణా ఎత్తేయడానికి సిద్ధపడటంతో  జనం, నెటిజనం సైతం అడెడ్డె అంటూ ముక్కున వేలేసుకుంటున్నారు.  రాష్ట్రంలో సొంత పార్టీ అధికారంలో ఉన్నా.. ఆ పార్టీ ప్రజా ప్రతినిధులకే కాదు.. వారి కుటుంబాలకు సైతం రక్షణ లేకుండా పోయిందని అందుకే విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ తన వ్యాపారాన్ని హైదరాబాద్ కు తరలించేందుకు నిర్ణయం తీసుకున్నారని జనం అంటున్నారు. మరోవైపు ఎంపీ కుటుంబాన్ని కిడ్నాప్ చేయడం మామూలు వ్యవహారం కాదని.. ఈ కిడ్నాప్ స్కెచ్‌లో పెద్ద తలకాయలే ఉన్నాయనే ఆరోపణలు సైతం వెల్లువెత్తాయి. ఈ వాస్తవం ఉందనడానికి  ఎంపీ తన వ్యాపారాలను పక్క రాష్ట్రానికి తరలించేయాలని నిర్ణయం తీసుకోవడమే తార్కానమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇప్పటికే  తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్  ఈ కిడ్నాప్ వ్యవహారం వెనుక సీఎం జగన్ ఉన్నారంటూ చేసిన ఆరోపణను గుర్తు చేస్తున్నారు. అలాగే  తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు  సొంత పార్టీ ఎంపీ ఫ్యామిలీ కిడ్నాప్ ఉదంతం రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితికి అద్దం పడుతోందని విమర్శించారు. అయినా ప్రతిపక్షాలు అంటే అడిపోసుకోంటాయంటారు కానీ, జగన్ ప్రభుత్వం గద్దెనెక్కిన తర్వాత మొన్న చిత్తూరు జిల్లా నుంచి అమర్‌రాజా బ్యాటరీస్  తెలంగాణ రాజదాని హైదరాబాద్ వెళ్లిపోయింది.  నిన్న విశాఖ జిల్లా నుంచి లూలూ గ్రూప్ సంస్థ.. తమిళనాడులోని కోయంబత్తురుకు తరలి పోయింది. రాష్ట్రం నుంచి పరిశ్రమలు తరలిపోవడానికి, వ్యాపారాలు చేయడానికి ఎవరూ ముందుకు రాకపోవడానికి జగన్ ప్రభుత్వ తీరే కారణమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. రాష్ట్రం నుంచి తరలిపోతున్న సంస్థల  జాబితాలో ఇప్పుడు ఏకంగా విశాఖపట్నం ఎంపీ ఎంవీవీ సత్యనారాయణకు చెందిన వ్యాపార సంస్థలు   చేరిపోయాయని పేర్కొంటున్నారు.   అయితే తెలంగాణలోని  హైదరాబాద్‌కు వెళ్లిపోయిన అమరరాజా బ్యాటరీస్ అంటే తెలుగుదేశం నాయకుడు, గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ కు సంబంధించింది.  విశాఖపట్నం వేదికగా వ్యాపారం చేసుకోనేందుకు లూలూ గ్రూప్... గత చంద్రబాబు ప్రభుత్వ హయాంలో ఒప్పందం కుదుర్చుకొంది. అయితే జగన్ ప్రభుత్వం గద్దెనెక్కిన తర్వాత గత ప్రభుత్వం ఇచ్చిన అనుమతులను  రద్దు చేయడంతో.. లూలూ గ్రూప్ తమిళనాడు సీఎం స్టాలిన్ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకొని.. తన వ్యాపారాన్ని ఆ రాష్ట్రంలో విస్తరించుకొనే పనిలో నిమగ్నమై పోయింది.   మరి రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ లోక్‌సభ సభ్యుడు ఈ విధంగా తన వ్యాపారాలను హైదరాబాద్‌కు తరలించేస్తున్నాన్నంటూ స్వయంగా ప్రకటించడం చూస్తుంటే.. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రజలకు ఈ జగన్ ప్రభుత్వం ఎటువంటి సందేశం ఇస్తున్నట్లు అని నెటిజన్లు  ప్రశ్నిస్తున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం చోటు చేసుకొంటున్న వరుస పరిణామాల నేపథ్యంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయనే భావన ప్రజల్లో సైతం వ్యక్తమవుతోందని  స్పష్టం చేస్తున్నారు.   విశాఖపట్నం ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ, ఆయన భార్య జ్యోతి, వారి కుమారుడు శరత్,  ఎంపీ స్నేహితుడు కమ్ ఆడిటర్ జి.వెంకటేశ్వరరావులు ఇటీవల  కిడ్నాప్ కు గురయ్యారు. ఆ క్రమంలో వారిపై కిడ్నాపర్లు తీవ్రంగా దాడి చేసి గాయపరిచారు. అయితే ఈ కిడ్నాప్‌పై పోలీసులకు ఎంపీ ఫిర్యాదు చేసే సమయానికి ఈ దాడి జరిగిపోవడం గమనార్హం. ఆ తర్వాత పోలీసులు రంగంలోకి దిగి.. కిడ్నాపర్లను అరెస్ట్ చేశారు. కానీ ఎంపీ ఫ్యామిలీ కిడ్నాప్ వ్యవహారం పట్ల సర్వత్ర విస్మయం వ్యక్తమవుతోంది.  ఇలా పలు వ్యాపార సంస్థలు.. రాష్ట్రం విడిచి వెళ్లిపోతే.. ఉపాధి లేక..యవత పెడ మార్గం పడుతోంది. ఇప్పటికే రాష్ట్రంలో యువత గంజాయి, డ్రగ్స్ కు బానిసలై తమ బంగారు భవిష్యత్తును చేజేతులా కాలరాసుకొంటుందని చెబుతున్నారు. ఇటువంటి పరిణామాలకు... ఇలాంటి పరిస్థితులకు బాధ్యులు ఎవరు? ఓటు వేసి గెలిపించిన ఓటర్లా? ఓట్ల దండుకొనే క్రమంలో నోట్లు విసిరిన జిత్తుల మారి నాయకులా? అనేది మనస్సు పెట్టి ప్రతీ ఒక్కరు ఆలోచించాలని సూచిస్తున్నారు. లేకుంటే యవత భవితకే కాదు.. నవ్యంధ్రాకు సైతం కారు చీకట్లు కమ్ముకోవడం ఖాయమని ప్రజాస్వామిక వాదులు తీవ్ర ఆవేదనతో స్పష్టం చేస్తున్నారు.

కాంగ్రెస్ కిటకిట..బీఆర్ఎస్ వెలవెల

ఇన్నాళ్లూ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ వలసలతో వెలవెలబోతే.. చేరికలతో బీఆర్ఎస్ కిటకిటలాడింది. ఇప్పుడు పరిస్థితి పూర్తిగా రివర్స్ అయ్యింది. ఎన్నాళ్లకెన్నాళ్లకు ఎన్నెళ్లు తిరిగొచ్చే మా ఇళ్లకు అన్న పాట చందంగా తయారైంది తెలంగాణ కాంగ్రెస్ పరిస్థితి. గత ఎనిమిదేళ్లుగా ఎగ్జిట్ తప్ప ఎంట్రీ అన్నదే తెలియని ఆ పార్టీకి ఇప్పుడు కుప్పతెప్పలుగా  చేరికలు ఉంటున్నాయి. గత ఎనిమిదేళ్లుకు పైగా పార్టీ నుంచి వెళ్లిపోయేవారే తప్ప పార్టీలోకి వస్తామంటూ తలుపుతట్టిన వారే లేదు. దానికి తోడు వరుస ఎన్నికలలో డిపాజిట్లు సైతం కోల్పోయి డీలా పడిన కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు కోత్త జోష్ కనిపిస్తోంది. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన పార్టీ తమదే నంటూ చెప్పుకోవడానికి కూడా ముఖం చెల్లనంతగా డీలా పడిన కాంగ్రెస్ కు ఇప్పుడు రాష్ట్రంలో డిమాండ్ పెరిగింది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తరువాత తొలి సారిగా ఆ పార్టీలో గెలుపు ధీమా కనిపిస్తోంది. ఇప్పటి వరకూ బాబ్బాబు రండి అంటూ ప్రత్యర్థి పార్టీలలోని అసమ్మతి నేతలను కాంగ్రెస్ బతిమలాడుకునే పరిస్థితి ఉండేది. అయితే ఇప్పుడు అది రివర్స్ అయ్యింది. పెద్ద సంఖ్యలో ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్ గూటికి చేరేందుకు క్యూ కడుతున్నారు. ఇప్పుడు చేరికలకు షరతులు పెట్టే స్థితిలో కాంగ్రెస్ ఉంది. కాంగ్రెస్ ఏ షరతులు పెట్టినా సర్దుకు పోయేందుకు ఇతర పార్టీల నుంచి వస్తున్న వారు అంగీకరంచేందుకు రెడీగా ఉన్నారు. ఇప్పటికే ఇద్దరు ఎమ్మెల్సీలు కాంగ్రెస్ లో చేరడానికి సిద్ధమయ్యారు. బీఆర్ఎస్ లో టికెట్ల లొల్లి కూడా ఆ పార్టీ నుంచి పెద్ద ఎత్తున వలసలకు కారణమౌతోంది. పట్నం మహేందర్ రెడ్డి విషయమే తీసుకుంటే.. ఆయన గత ఎన్నికలలో రేవంత్ రెడ్డిని ఓడించడానికి కొడంగల్ పై పూర్తి కాన్సన్ ట్రేట్ చేశారు. రేవంత్ రెడ్డిపై తన తమ్ముడిని గెలిపించుకున్నారు. కానీ తన సొంత నియోజకవర్గంలో మాత్రం పరాజయం పాలయ్యారు. అక్కడ నుంచి విజయం సాధించిన పైలట్ రోహిత్ రెడ్డి ఆ తరువాతి పరిణామాలలో బీఆర్ఎస్ (అప్పుడు టీఆర్ఎస్) గూటికి చేరారు.   ఇప్పుడు కేసీఆర్ పైలట్ రోహిత్ రెడ్డికే వచ్చే ఎన్నికలలో టికెట్ కన్ ఫర్మ్  చేశారు. దీంతో పట్నం మహేందర్ రెడ్డి తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.   ఆయనలాగే బీఆర్ఎస్ లో  చాలా మంది బలమైన నేతలకు టికెట్ దక్కే అవకాశాలు లేవు. సిట్టింగులకే టికెట్లు అంటూ ప్రకటించిన కేసీఆర్ ఆ తరువాత పని చేసే వారికే అంటూ చిన్న సవరణ చేసినా.. ఆపరేషన్ ఆకర్ష్ తో ఇతర పార్టీల నుంచి బీఆర్ఎస్ లోకి వచ్చి చేరిన సిట్టింగులు ధీమాగా ఉంటే.. పార్టీ కోసం కష్టపడి మాజీలుగా ఉన్న వారంతా అసంతృప్తితో రగిలిపోతున్నారు. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ లో కి వచ్చే వారిలో టీఆర్ఎస్ అసంతృప్త నేతలే అధికంగా ఉంటారని అంటున్నారు. కాగా ఈ చేరికలు వచ్చే నెలలో  కాంగ్రెస్ అగ్రనేత  రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటనలో ఆయన సమక్షంలో ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.  మల్లు  రవి నేతృత్వంలో రేవంత్ నియమించిన కమిటీ ఇప్పటికే కాంగ్రెస్ లో వచ్చి చేరే వారి జాబితాను సిద్ధం చేసే పనిలో ఉంది.  

జగన్ బీసీ కార్డ్ సెల్ఫ్ గోలేనా?

కర్నాటకలో బీజేపీ ఓటమి తర్వాత  ఆ పార్టీ పట్ల ఏపీ సీఎం జగన్ రెడ్డి వైఖరి మారుతోందా?  బీజేపీ దూకుడుకు బ్రేకులు వేసేందుకు పావులు కదుపుతున్నారా? ఇందు కోసం వ్యూహాత్మకంగా బీసీ కార్డును తెరపైకి తెచ్చారా ?అంటే అందుకే బీసీ కార్డుతో బీజేపీ దూకుడుకు బ్రేకులు వేసే వ్యూహానికి తెరలేపారా? అంటే పరిఇశీలకులు ఔననే అంటున్నారు. అయితే నాలుగేళ్ల పాటు బీజేపీ మాటే వేదం అన్నట్లుగా వ్యవహరించిన జగన్ ఇప్పుడు బీజేపీకి చెక్ పెట్టేందుకు చేస్తున్న వ్యూహరచన ఫలిస్తుందా అంటే అనుమానమే అని అంటున్నారు. ఏమైతేనేం.. కేసుల భయమో, మరోటో కానీ అధికారంలో  ఉన్న ఈ నాలుగేళ్ల కాలంలోనూ బీజేపీ అడుగులకు మడుగులొత్తుతూ.. స్వామి కార్యం, స్వ కార్యం నెరవేర్చుకున్న జగన్ ఇప్పుడు ఎన్నికల సంవత్సరంలో ఆ పార్టీకి చెక్ పెట్టేందుకు పన్నుతున్న వ్యూహాలు బూమరాంగ్ అయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయంటున్నారు. ఇంతకీ బీజేపీ దూకుడుకు చెక్ పెట్టేందుకు  బీసీ రిజర్వేషన్ బిల్లును తెరపైకి తీసుకువచ్చారని పరిశీలకులు అంటున్నారు. బీజేపీకి బీసీలను దూరం చేయాలన్న వ్యూహాన్ని జగన్ తలకెత్తుకున్నారనీ,  కేంద్రంలో ఉన్న 27 మంది బీసీ మంత్రులూ పనికిరాని వాళ్లంటూ బీసీ నేత   కృష్ణయ్య విమర్శ వెనుక ఉన్న ఎత్తుగడ ఇదేననీ విశ్లేషిస్తున్నారు.   కేంద్రంలోని మోడీ సర్కారు బీసీలకు అన్యాయం చేస్తోందని వైసీపీ ఎంపీ ఆర్ కృష్ణయ్య విమర్శించడం మామూలు విషయం కాదని అంటున్నారు.  పేరుకు మాత్రమే బీసీ అయిన మోడీ   క్యాబినెట్‌లో ఉన్న 27 మంది బీసీ మంత్రులు పనికిమాలిన వాళ్లేనని కృష్ణయ్య విమర్శించారు. దేశంలోని 75 కోట్ల బీసీలకు బీజేపీ ప్రభుత్వం చేసిందేమిటని నిలదీశారు. వచ్చే పార్లమెంటు సమావేశాల్లో బీసీలకు రెండు లక్షల కోట్ల బడ్జెట్  ఇవ్వకపోతే  ధర్నా చేస్తామని హెచ్చరించారు. అంతే కాకుండా అన్ని రాష్ట్రాల్లో పర్యటించి బీసీలను ఏకం చేస్తామన్నారు. బీసీల రిజర్వేషన్ల కోసం కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే కూడా మద్దతునిచ్చారని కృష్ణయ్య చెప్పారు.  నాలుగేళ్లుగా కేంద్రంలోని మోడీ సర్కార్  ఆశీస్సులతో ఔను కేంద్ర ప్రభుత్వం ఆశీస్సులతోనే ఏపీలో బండి లాగించేస్తున్న జగన్ పార్టికి చెందిన ఎంపీ కృష్ణయ్య కేంద్రానికి అల్టిమేటమ్ ఇచ్చారంటే.. కేంద్రంతో జగన్ సర్కార్ కు ఉన్న సత్సంబంధాల్లో ఏదో తేడా కొట్టినట్టేనని పరిశీలకలు అంటున్నారు.   ఎందుకంటే  వైసీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు ఎవరూ కూడా జగన్ అనుమతి లేకుండా నోరు మెదపడానికి సాహసించరు. అలా సాహసించిన వారు పార్టీలో ఉండరు.  మరి బీసీ రిజర్వేషన్లకు సంబంధించి కేంద్రంలోని బీజేపీ సర్కారు వైఫల్యాలనూ, చేతగాని తనాన్నీ వైసీపీ రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య చెరిగేయడం వెనుక జగన్ అనుమతి ఉందనే అంటున్నారు.  ఎందుకంటే కృష్ణయ్య బీసీ రిజర్వేషన్ల గురించి చేసిన వ్యాఖ్యలు, కేంద్రానికి ఇచ్చిన అల్టిమేటమ్ వ్యక్తిగత స్థాయిలో ఇచ్చిందే అనుకున్నా.. ఆయన నోటి వెంట కేంద్రంలోని మోడీ సర్కార్ పై విమర్శలు వచ్చిన వెంటనే వైసీపీ అధికారికంగా వాటిని ఖండించి ఉండాలి. అది పార్టీ అభిప్రాయం కాదనీ, కృష్ణయ్య వ్యక్తిగత హోదాలో చేసిన వ్యాఖ్యలనీ స్పష్టత ఇచ్చి ఉండాలి. కానీ ఇప్పటి వరకూ అటువంటిదేమీ జరగలేదు.  అంటే జగన్ అనుమతితోనే కృష్ణయ్య మోడీ సర్కార్ కు వ్యతిరేకంగా గళమెత్తారని భావించాల్సి వస్తోంది.  ఇదే విషయం బీజేపీలో హాట్ టాపిక్ గా మారింది. అమిత్ షా, నడ్డాలు ఏపీ వచ్చి మరీ జగన్ పార్టీపై నిప్పులు చెరిగి వెళ్లిన తరువాత ఇరు పార్టీల మధ్యా అగాధం ఏర్పడిందనడానికి కృష్ణయ్య వ్యాఖ్యలు కూడా ఒక నిదర్శనంగా పరిశీలకులు చెబుతున్నారు. ఇక కృష్ణయ్య బీసీ అయిన మోడీని నామ్ కేవాస్తేగా ప్రధానిని చేశారంటూ వ్యాఖ్యానించడంపై పార్టీ అగ్రనాయకత్వం చాలా చాలా సీరియస్ గా ఉంది.  వైసీపీ ఎంపీ ఆర్.కృష్ణయ్య వ్యాఖ్యల వెనుక, ఏపీ సీఎం  జగన్మోహన్‌రెడ్డి ఆదేశాలున్నాయన్న చర్చ బీజేపీలో జరుగుతోంది. తనకు కేంద్రంలోని బీజేపీ సర్కార్ మద్దతు అవసరం లేదని ఇటీవల జగన్ వ్యాఖ్యానించడాన్ని వారీ సందర్భంగా గుర్తు చేస్తున్నారు.  తన సర్కార్ పై అవినీతి ముద్ర వేసి విమర్శించిన షా, నడ్డాలకు బీసీ బాణం సంధించిన జగన్  ఇందుకు కాంగ్రెస్ మద్దతు కూడా ఉందని చెప్పడం భవిష్యత్ లో తాను తీసుకోబోయే టర్న్ కు చిహ్నంగా బీజేపీ భావిస్తోంది.   బీసీ బీజేపీ సీనియర్ నేత వ్యాఖ్యానించారు.    బీజేపీ టీడీపీ లు దగ్గరౌతున్న సంకేతాలు వస్తున్న ఈ సమయంలో బీసీలకు బీజేపీ అన్యాయం చేస్తోందన్న విమర్శలు  రాజకీయంగా పూడ్చుకోలేని నష్టం చేకూర్చే అవకాశాలున్నాయని వైసీపీ వర్గాలు అంటున్నాయి.  ఒక విధంగా జగన్ బీసీ కార్డ్ ప్రయోగించి బీజేపీని ఇరుకున పెడదామన్న వ్యూహం సెల్ఫ్ గోల్ వంటిదేనని పార్టీ శ్రేణుల్లోనే ఓ స్థాయిలో చర్చ జరుగుతోంది.

క్లైమాక్స్‌కు చేరిన కడపస్టోరీ.. జగన్‌ను దెబ్బకొట్టేది తమ్ముడు అవినాషే?!

 ఏపీలో ఎన్నికలకు ఇంకా ఇంకా తొమ్మిది నెలల సమయం ఉంది. ఇప్పటి రాజకీయాలను బట్టి చూస్తే ఇది చాలా తక్కువ సమయం. అందుకే అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం రోజు రోజూకీ పెరిగిపోతోంది. ఈ విమర్శల దాడిలో మనకి ఎప్పటికప్పుడూ వినిపించే మాట వివేకా హత్య కేసు. మాజీ సీఎం వైఎస్ఆర్ కు స్వయానా తమ్ముడు, ఇప్పటి సీఎం జగన్ మోహన్ రెడ్డికి చిన్నాన్న అయిన వైఎస్ వివేకానంద రెడ్డి గత టీడీపీ ప్రభుత్వ హయంలో హత్య కాబడిన సంగతి తెలిసిందే. హత్యకు గురైన వివేకా ఇంట్లోనే ఇప్పుడు అధికారం ఉండడం.. హత్య టీడీపీ హయంలో జరగడం.. అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ నేతలు.. ఆ హత్యను టీడీపీ కుట్రగా ఫోకస్ చేయడంతో ఇప్పుడు అదే కేసు విచారణకు వచ్చేసరికి ఎవరికి వారికి అస్త్రాలు దొరికినట్లయింది. ఇప్పటికే ఎన్నో మలుపులు, అంతకి మించి కుదుపులు చోటు చేసుకున్న వివేకా హత్యకేసు క్లైమాక్స్ కి చేరింది. క్లైమాక్స్ కి చేరిందనే మాట చాలా కాలంగా వినిపిస్తున్నా.. గడువులు విధించి కేసు దర్యాప్తు పూర్తి చేయాలనీ న్యాయస్థానాలు ఆదేశాలిచ్చినా.. ఈ కేసు ఇంకా ఇంకా సాగుతూనే వచ్చింది. ఇంకా చెప్పాలంటే ఈ కేసు సాగదీత కోసం ఓ వర్గం సర్వశక్తులూ ఒడ్డింది. ఆ విషయాన్ని రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు కూడా చూస్తూనే ఉన్నారు. అయితే  ఈసారి క్లైమాక్స్ కు చేరింది అంటే చేరింది అంతే. దాని వెనక కారణాలు కూడా లేకపోలేదు. నిన్న మొన్నటి వరకు ఈ కేసు సాగదీతలో కేంద్రం అంతో ఇంతో సాయపడుతోందని ఢిల్లీ నుండి గల్లీ వరకూ కోడై కూసింది. విశ్లేషకుల నుండి అతి సామాన్య ప్రజల వరకూ అందరి నోటా ఈ మాటే వినిపించింది. అయితే, ఇప్పుడు కేంద్రంలో పరిస్థితులు మారాల్సిన సమయం వచ్చేసింది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి ఇప్పుడు పాత మిత్రుల అవసరం వచ్చింది పడింది.  కర్ణాటక ఎన్నికల ఫలితాల పుణ్యమా అని దేశవ్యాప్తంగా బీజేపీ పాత మిత్రుల వైపు చూస్తోంది. తమతో కలిసి వచ్చే స్నేహితులకు చేయి అందించాలని బీజేపీ పెద్దలే రాష్ట్ర నాయకత్వాలకు సూచనలు, సలహాలు ఇచ్చేశారు. ఇప్పటికే జనసేనతో దోస్తీకి ఫిక్సయిపోయిన తెలుగుదేశం తాజాగా చంద్రబాబు అమిత్ షా భేటీ తర్వాత ఆల్ మోస్ట్ ఇక పాత అలియన్స్ కి రాజమార్గం పడ్డట్లేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఈక్రమంలో ఇకపై వివేకా కేసులో కేంద్రం నుండి సాయం అంటే ఎడారిలో నీటి ఊటే అవుతుంది.  అదే జరిగితే సరిగ్గా ఎన్నికలకు ముందు వైసీపీకి తప్పించుకోలేని జంజాటమే అవుతుంది. సరిగ్గా గత ఎన్నికల సమయంలో వైసీపీకి, జగన్ మోహన్ రెడ్డికి కలిసి వచ్చిన అంశాలలో వివేకా హత్యకేసు ప్రధానమైనది  అనే దానిలో ఎలాంటి సందేహం లేదు. రాజకోట లాంటి ఇంట్లో అతి కిరాతకంగా జరిగిన ఈ హత్యను వారికి తగ్గట్లుగా మలుచుకోవడంతో ఆ ఎన్నికలలో వైఎస్ కుటుంబం, వైసీపీ పార్టీ బంపర్ మెజార్టీ సాధించింది. అయితే  సరిగ్గా ఇప్పుడు మళ్ళీ ఎన్నికల సమయానికి అదే కేసు వైసీపీ మెడకి చుట్టుకోనుందా అంటే నిస్సందేహంగా ఔనని చెప్పవచ్చు. అప్పుడు వైసీపీకి ఈ కేసు  ఏ స్థాయిలో ఎన్నికల సమరంలో సానుభూతిని ఏరులై పారించిందో.. ఇప్పుడు టీడీపీ జగన్ మోహన్ రెడ్డిని నేరస్తుడిగా ముద్ర వేయడంలో అదే స్థాయిలో సర్వశక్తులు ఒడ్డుతోంది. ఒక్క మాటలో చెప్పాలంటే 2014 ఎన్నికలలో జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేసేందుకు టీడీపీ రూ.వెయ్యి కోట్ల ప్రచారాన్ని ఏ విధంగా హైలెట్ చేసిందో.. ఈసారి జగన్ నేరస్థుడు అనేలా హైలెట్ చేయడం తధ్యం. నిజానికి ఈ హత్య ఎవరు చేశారు.. ఎవరు చేయించారు అనేది కోర్టులు, శిక్షలకే పరిమితం. కానీ  రాజకీయాలలో చేసే ఆరోపణలలో బలం ఎటువైపు ఉంటే అటే ప్రజలు అదే నమ్మే ఛాన్స్ ఉంటుంది. ఆ లెక్కన ఈ కేసులో దాదాపు ఐదేళ్ల విచారణ, అప్పటి నుండి జరిగిన పరిణామాలు అన్నీ కూడా టీడీపీకి అనుకూలంగా, వైసీపీకి వ్యతిరేకంగానే ఉన్నాయి. అందులో ప్రధానంగా సీఎం జగన్ కు మరో చిన్నాన్న కొడుకైన ఎంపీ అవినాష్ ఈ కేసులో కీలక సూత్రధారిగా దర్యాప్తు సంస్థ సీబీఐ ఇప్పటికే తేల్చి చెప్పడం సీఎం జగన్ ను   దెబ్బకొట్టడం ఖాయంగా కనిపిస్తోంది. అంతేకాదు, ఈ కేసులో అవినాష్ తప్పించుకునేందుకు అప్పటి నుండి వేసిన ఎత్తులు కూడా వైసీపీకి తీరని నష్టమే అవుతున్నాయి. ఇంకా చెప్పాలంటే తమ్ముడిని కాపాడేందుకు స్వయంగా సీఎంనే  అధికారాన్ని అడ్డం పెట్టుకుని చే యాల్సిందంతా చేస్తున్నారనే  ప్రచారం ప్రజలలోకి బలంగా వెళ్లిపోయింది. దీనిని బట్టి చూస్తే రానున్న ఎన్నికలలో వైసీపీకి వ్యతిరేక పవనాలు వీస్తే కనుక అందులో అవినాష్ వాటాయే సింహభాగంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. జూన్ నెలాఖరునే ఈ కేసు దర్యాప్తు ముగించాలని సుప్రీంకోర్టు ఆదేశాలిచ్చిన నేపథ్యంలో.. సిబిఐ అనుమానించిందే నిజమైతే.. ఆ తర్వాత ఏం జరిగినా అది జగన్ కు గ్రహపాటే!

ఆత్మే అంతా చేసిందా?

హస్తం పార్టీకి స్నేహ హస్తం అందించేందుకు వైయస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల సమాయత్తమయ్యారా..  ఆ క్రమంలోనే ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీకి ట్విట్టర్ వేదికగా  సోమవారం (జూన్ 19)  జన్మదిన శుభాకాంక్షలు తెలిపారా?  వైయస్ఆర్ టీపీని హస్తం పార్టీలో కలిపేందుకు తెరచాటు మంత్రాగాన్ని వైయస్ షర్మిల తండ్రి, దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ఆత్మ కేవీపీ రామచంద్రరావు నెరిపారా? అనే   చర్చ ఉభయ తెలుగు రాష్ట్రాల్లో జోరుగా సాగుతోంది. అంతేకాదు  షర్మిల రాజకీయం చేసుకుంటే ఆంధ్రప్రదేశ్‌‌లో చేసుకోవాలి కానీ తెలంగాణలో కాదంటూ మీడియా ఎదుట క్లియర్ కట్‌గా క్లాస్ పీకిన టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి సైతం వైయస్ షర్మిల రాకను ఆమోదించారా?  అనే సందేహం   తెలంగాణ సమాజంలో వ్యక్తమవుతోంది. అయితే వైఎస్ షర్మిల.. తాను స్థాపించిన వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ జెండా పీకేసి.. తన తండ్రికి రాజకీయంగా ఉన్నత స్థానాలను అధిరోహించేందుకు అవకాశాలు కల్పించిన  కాంగ్రెస్ పార్టీతో కలిసి అడుగులో అడుగు వేయడం కోసం వైఎస్ఆర్ ఆత్మ కేవీపీ రామచంద్రరావు కర్త కర్మ క్రియ అన్నీ తానే అయి వ్యవహరించి.. రాష్ట్రం కానీ రాష్ట్రంలో రాజన్న బిడ్డను సేఫ్ సైడ్ చేశారని ఓ చర్చ   తెలంగాణ రాష్ట్రంలో హల్‌చల్ చేస్తోంది.  వైఎస్ షర్మిల కోసం వైఎస్ఆర్ ఆత్మ కేవీపీ రామచంద్రరావు .. తెలంగాణలో పీపుల్స్ మార్చి చేస్తున్న టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టివిక్రమార్కను వెళ్లి కలవడంతోపాటు కర్ణాటక పీసీసీ చీఫ్ కమ్ డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌తో సైతం  మంతనాలు జరపడం, దాంతో  డీకే శివకుమార్‌ నేరుగా టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డితో వైఎస్ షర్మిల అంశంపై సుదీర్ఘంగా మాట్లాడి..  ఆయన ఓకే అనేలా కన్విన్స్ చేశారన్న   టాక్  గట్టిగా వినిపిస్తోంది.   కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయఢంకా మోగించడంతో ఆ పార్టీలో నయా జోష్ కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. ఆ క్రమంలో ఆ పక్కనే ఉన్న తెలంగాణలో సైతం పాగా వేయాలని హస్తం పార్టీ అధిష్టానం భావిస్తోంది. అందులోభాగంగా కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దె దిప్పేందుకు.. కమలనాథులకు కర్ణాటకలోనే కాదు.. తెలంగణలో సైతం ఝలక్ ఇచ్చేందుకు హస్తం పార్టీ అధిష్టానం పక్కా వ్యూహంతో  ప్రణాళికి బద్దంగా అడుగులు వేస్తూ.. ముందుకు సాగుతోంది.  ఆ క్రమంలో తెలంగాణలోని పలు రాజకీయ పార్టీల్లో ఉన్న అసంతృప్త జీవులపై కన్నేసి.. వారికి స్నేహ హస్తం అందించి పార్టీలోకి తీసుకు వచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన జూపల్లి కృష్ణారావుతో మంతనాలు నెరిపి వారిని కాంగ్రెస్ గూటికి చేరేలా ఒప్పించిందని చెబుతున్నారు.  అలాగే అధికార బీఆర్ఎస్ పార్టీలోని పలువురిని హస్తం పార్టీలోకి తీసుకు రావడం.. వివిధ రాజకీయ పార్టీల్లోని కీలక నేతలకే కాదు.. కేడర్‌ను సైతం పార్టీలోకి తీసుకు వచ్చేందుకు హస్తం పార్టీ  చాపకింద నీరులా వ్యవహారాన్ని చక్కబెట్టుకొంటూ వస్తోందంటున్నారు.   మరోవైపు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిందీ కేసీఆరే అయినా.. అన్నింటికి సిద్దపడి తెగించి  ఇచ్చింది మాత్రం కాంగ్రెస్ పార్టీనే అని తెలంగాణ సమాజానికి  తాజాగా గుర్తు చేయడం కోసం..  అలాగే మోదీ, అమిత్ షా ద్వయం పాలనలో గత తొమ్మిదేళ్లుగా దేశంలో జరిగిన ప్రజాస్వామిక విధ్వంసాన్ని ప్రజలకు సోదాహరణగా వివరించడం కోసం... బంగారు తెలంగాణ అని ప్రచారం చేసుకొంటూ.. కేసీఆర్ ఫ్యామిలీ ప్రజా వ్యతిరేక విధానాలు, ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల మధ్యే ఎండకట్టేందుకు కాంగ్రెస్ పార్టీ నేతలు.. సమాయత్తమవుతోన్నారు. అలాగే ఇంకోవైపు ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి, వైఎస్ షర్మిలతోపాటు.. పార్టీలోని సీనియర్లు, జూనియర్లు అంత కలిసికట్టుగా చేతిలో చెయ్యి వేసి నడిస్తే.. రాష్ట్రంలో గెలిచి  గద్దెనెక్కేది హస్తం పార్టీనే అనే అభిప్రాయం పరిశీలకులతో పాటు, సామాన్య జనంలో కూడా వ్యక్తం అవుతోంది.

షర్మిల ఎఫెక్ట్.. కాంగ్రెస్ లో కుదుపు!

తెలంగాణ కాంగ్రెస్ లో ఆల్ ఈజ్ వెల్ అనుకున్నంత సేపు పట్టలేదు  వైఎస్సార్టీపీ అధినేత్రి షర్మిల రూపంలో తుపాను రేగడానికి.  కర్నాటకలో కాంగ్రెస్ అద్భుత విజయం ఆ పార్టీ తెలంగాణ శాఖలో ఉత్తేజాన్ని ఎంతగా నింపిందో.. అయోమయాన్ని, గాభరాను కూడా అంతే స్థాయిలో నింపింది. కర్నాటక స్ఫూర్తితో విభేదాలు విస్మరించి ఐక్యంగా పని చేసేందుకు కాంగ్రెస్ శ్రేణులన్నీ సమాయత్తమౌతున్న వేళ కర్నాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ను రంగంలోకి దింపి పార్టీలో ప్రకంపనలకు స్వయంగా కాంగ్రెస్ అధిష్ఠానమే కారణమైంది. తెలంగాణ కాంగ్రెస్ గత ఎనిమిదేళ్లుగా ఎదుర్కొన్న ఆటుపోట్లన్నీ తట్టుకుని బలం పుంజుకుంటున్న వేళ.. కాయకల్ప చికిత్స పేరిట కాంగ్రెస్ హై కమాండ్ అవసరం లేని చికిత్సకు ఉపక్రమించిందని పరిశీలకులు అంటున్నారు. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ గా రేవంత్ రెడ్డి పగ్గాలు చేపట్టినప్పటి నుంచీ ఆయన పట్ల పార్టీలోని సీనియర్లు ఎంత వ్యతిరేకత వ్యక్తం చేసినా  పార్టీని క్షేత్ర స్థాయిలో బలోపేతం చేయడంలోనూ.. పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందన్న నమ్మకాన్ని క్యాడర్ లో కల్పించడంలోనూ రేవంత్ రెడ్డి సక్సెస్ అయ్యారు. రేవంత్ రాష్ట్ర కాంగ్రెస్ పగ్గాలు చేపట్టిన తరువాత జరిగిన మునుగోడు ఉప ఎన్నికలో పార్టీ పరాజయాన్ని ఆయన ఖాతాలో వేసి నైతికంగా బలహీన పరుద్దామని భావించిన సీనియర్ల ఎత్తుగడలు, వ్యూహాలూ ఫలించ లేదు. ఆ సమయంలో పార్టీ హై కమాండ్ రేవంత్ కు మద్దతుగా  గట్టిగా  నిలబడింది. స్వయంగా పార్టీ కీలక నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు తెలంగాణపై ప్రత్యేక దృష్టి సారించడంతో రేవంత్ కు వ్యతిరేకంగా పార్టీలోని సీనియర్లు పన్నిన వ్యూహాలు పని చేయలేదు. కాంగ్రెస్ తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జ్ మార్పు ద్వారా సీనియర్ల అసంతృప్తిని కొంత చల్లార్చిన కాంగ్రెస్ హై కమాండ్ ఆ తరువాత సీనియర్లను దారిలోకి తెచ్చింది. రేవంత్ నాయకత్వంలో ఐక్యంగా పని చేయక తప్పదని ఖరాఖండీగా చెప్పి ఒప్పించింది.  పార్టీలో అసంతృప్తి వాదిగా పేరుపడ్డ కోమటిరెడ్డి వెంకటరెడ్డి పార్టీ విజయమే లక్ష్యం అని ప్రకటించి.. తనలో ఎటువంటి అసంతృప్తీ లేదనీ, రాష్ట్ర పార్టీ మొత్తం ఐక్యంగా ఉందనీ చెప్పడమే ఇందుకు తార్కానం. సరే ఇదంతా అలా ఉంటే.. డీకే శివకుమార్ ప్రవేశంతో సీనియర్లలో మళ్లీ రేవంత్ కు వ్యతిరేకంగా గళం సవరించుకునే అవకాశం లభించిందన్నది పరిశీలకుల వాదన. అయితే గతంలోలా సీనియర్లు, జూనియర్లు అన్నట్లుగా కాకుండా.. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ కుమార్తె షర్మిల ను  ఆహ్వానించి పార్టీ పగ్గాలు అప్పగిస్తే తిరుగుండదన్న కోణంలో  రేవంత్ వ్యతిరేకులు పావులు కదిపారు. ఇందుకు డీకే శివకుమార్ కు వైఎస్ తో ఉన్న అనుబంధం కూడా దోహదపడింది. ఈ నేపథ్యంలోనే కర్నాటకలో కాంగ్రెస్ విజయం తరువాత స్వల్ప వ్యవధిలో షర్మిల రెండు సార్లు బెంగళూరు వెళ్లి మరీ డీకే శివకుమార్ తో బేటీ అయ్యారు. ఈ భేటీల వెనుక రాజకీయం లేదని ఇరువురూ చెప్పినప్పటికీ ఎవరూ నమ్మలేదు. ఆ భేటీల నేపథ్యంలోనే టీపీసీసీ చీఫ్ రేవంత్, వైఎస్సార్టీపీ అధినేత్రి షర్మిల మధ్య మాటల యుద్ధం కూడా సాగింది. అదలా ఉంచితే.. షర్మిల కాంగ్రెస్ ప్రవేశాన్ని వేగిరం చేయడానికి దివంగత వైఎస్ ఆత్మగా చెప్పుకునే కేవీపీ కూడా రంగంలోకి దిగారు. వైఎస్ కుటుంబంతో ఉన్న అనుబంధంతో కేవీసీ షర్మిలను కాంగ్రెస్ లో  చేరేలా ఒప్పించగలిగారు. అలా ఇలా కాదు ఏకంగా షర్మిల తన వైఎస్సార్టీపీని కాంగ్రెస్ లో విలీనం చేసేలా. ఇందుకు ఆమె విధించిన ఏకైక షరతు తనకు పాలేరు టికెట్ ఇవ్వాలని, అందుకు కాంగ్రెస్ కూడా సుముఖత వ్యక్తం చేసిందనీ తెలంగాణ కాంగ్రెస్ శ్రేణుల్లో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. అదే సమయంలో ఆమె తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసి ఏపీలో రాజకీయాలు చేసుకోవాలంటూ వ్యాఖ్యలు చేసిన రేవంత్ రెడ్డి మాత్రం ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలపై నోరు మెదపడం లేదు. అంతకు ముందు షర్మిల డీకేతో భేటీ అయిన సందర్భంలో మాత్రం తాను టీపీసీసీ చీఫ్ గా ఉన్నంత వరకూ షర్మిల తెలంగాణ కాంగ్రెస్ రాజకీయాలలో వేలు పెట్టనీయను అని చెప్పారు. అయితే ఇప్పుడు అంటే షర్మిల తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయడం దాదాపు ఖాయమని తేలిపోయింది. ఇందుకు ఆమె కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీకి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ చేసిన ట్వీటే తార్కానం.  దీంతో ఇప్పటి వరకూ షర్మిల పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేస్తారా? లేదా అన్న చర్చకు ఫుల్ స్టాప్ పడిపోయింది. ఇప్పుడు షర్మిల  పార్టీ కాంగ్రెస్ లో వినీలం అయిపోతే రేవంత్ పరిస్థితి ఏమిటన్న చర్చ మొదలైంది. మొత్తంగా రేవంత్ కు చెక్ పెట్టేందుకే కాంగ్రెస్ శ్రేణులు వదిలిన బ్రహ్మాస్త్రం షర్మిల అంటూ విశ్లేషణలు వెల్లువెత్తుతున్నాయి. షర్మిల చేరిక వల్ల కాంగ్రెస్ బలోపేతం అవుతుందని కాంగ్రెస్ సీనియర్లు గట్టిగా చెబుతున్నారు. బీజేపీ, కాంగ్రెస్ ల కంటే గట్టిగా, తీవ్రంగా కేసీఆర్ సర్కార్ పై షర్మిల విమర్శలు గుప్పించిన విషయాన్ని వారీ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. అదే సమయంలో షర్మిల కాంగ్రెస్ ప్రవేశంతో రేవంత్ దూరమైతే పార్టీకి మరింత నష్టం తథ్యమని రేవంత్ వర్గీయులు అంటున్నారు. రెండూ నిజాలే అయిన నేపథ్యంలో ఈ సమస్యను కాంగ్రెస్ అధిష్టానం ఎలా పరిష్కరిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. మొత్తం మీద కాంగ్రెస్ లో మరో సారి బయటపడిన విభేదాలు ఆ పార్టీకి ఉన్న సానుకూల వాతావరణాన్ని పాడు చేస్తున్నాయన్నది మాత్రం వాస్తవం.