రక్తమోడిన ఎయిర్ పోర్ట్... ఐదుగురు మృతి..

ఈ మధ్య తరచుగా అమెరికాలో కాల్పులు చోటుచేసుకుంటున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు తాజాగా మరోమారు కాల్పుల కలకలం రేగింది. వివరాల ప్రకారం.. ఫ్లోరిడాలో ఎయిర్‌పోర్టులో ఓ దుండ‌గుడు విచ‌క్ష‌ణా ర‌హితంగా కాల్పులు జ‌రిపాడు. ఈ కాల్పుల్లో ఐదుగురు దుండగలు ప్రాణాలు కోల్పోగా... మ‌రికొంద‌రు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. ఈ కాల్పులకు భయపడిన ప్ర‌యాణికులు భయంతో ప‌రుగులు తీశారు. ఇక సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగి దుండ‌గుడిని అదుపులోకి తీసుకున్నారు. అంతేకాదు ఇది ఉగ్రవాదుల పనే అని పోలీసులు అనుమానిస్తున్నారు. అన్ని కోణాల్లోనూ విచార‌ణ చేస్తున్నారు. అయితే ఏ ఉగ్రవాద సంస్థ నుండి ఇప్పటివరకూ ఎలాంటి ప్రకటన రాలేదు.

ఫుల్ టైం కెప్టెన్‌గా కోహ్లీ..యూవీకి మళ్లీ ఛాన్స్..!

టీ20, వన్డే కెప్టెన్సీకి ధోనీ రాజీనామా చేయడంతో విరాట్ కోహ్లీ‌ని అధికారికంగా టీమిండియా ఫుల్ టైం కెప్టెన్‌గా నియమించింది బీసీసీఐ. ఈ నెల 15 నుంచి ఇంగ్లాండ్‌తో జరగనున్న వన్డే, టీ20 సిరీస్‌ ఆడనున్న జట్టును ఎంపిక చేసేందుకు ముంబైలోని బీసీసీఐ ప్రధాన కార్యాలయంలో సెలక్షన్ కమిటీ భేటీ అయ్యింది. అనంతరం సమావేశ వివరాలను చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ మీడియాకు వివరించారు. టీమిండియాకు పూర్తి స్థాయి కెప్టెన్‌గా విరాట్ కోహ్లీని ఎంపిక చేశామని చెప్పారు..అలాగే ఇంగ్లాండ్‌తో సిరీస్ కోసం జట్టును కూడా ప్రకటించారు. జట్టు వివరాలు: * విరాట్ కోహ్లీ (కెప్టెన్) * మహేంద్ర సింగ్ ధోనీ * రాహుల్ * శిఖర్ ధావన్ * యువరాజ్ సింగ్ * మనీష్ పాండే * కేదార్ జాదవ్ * అజింక్యా రహనే * హార్దిక్ పాండ్యా * రవిచంద్రన్ అశ్విన్ * రవీంద్ర జడేజా * అమిత్ మిశ్రా * జస్ ప్రీత్ బుమ్రా * భువనేశ్వర్ కుమార్ * ఉమేశ్ యాదవ్

మహిళలు కత్తులతో వెళ్లొచ్చు

ఢిల్లీలో నడిరోడ్ల మీదే కాకుండా బస్సులు చివరకు రైళ్లలో కూడా మహిళలకు భద్రత లేకుండా పోయింది. మొన్నామధ్య మహిళల బోగీలో ప్రయాణిస్తున్న ఒక యువతిపై నలుగురు దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడటమే కాకుండా ఆమె వద్ద ఉన్న నగదు, నగలు దోచుకుని దర్జాగా వెళ్లిపోయారు..అంతేకాకుండా ఢిల్లీ మెట్రోలో ప్రయాణించే మహిళల పట్ల ఆకతాయిలు అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు. ఇవి నానాటికీ పెరిగిపోతుండటంతో ఢిల్లీ మెట్రో భద్రతను పర్యవేక్షించే సీఐఎస్ఎఫ్(సెంట్రల్ ఇండస్ట్రీయల్ సెక్యూరిటీ ఫోర్స్) ఈ సంచలన నిర్ణయం తీసుకుంది. ఢిల్లీ మెట్రోలో ప్రయాణించే మహిళలు తమవెంట చిన్న చిన్న కత్తులు, లైటర్స్, అగ్గిపెట్టె, పెప్పర్ స్ప్రే లాంటివి తీసుకెళ్లొచ్చని ప్రకటించింది. 

కోడిపందాలపై సుప్రీంలో విచారణ

ప్రతి ఏటా సంక్రాంతి పండుగను పురస్కరించుకుని నిర్వహించే కోడి పందాల నిర్వహణపై తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు నిషేధం విధించడంతో పందెం రాయుళ్లు సుప్రీంను ఆశ్రయించారు. ఇవాళ వారు వేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణ నిర్వహించింది. ఈ సందర్భంగా హైకోర్టు ఆదేశాల్లోని నాలుగో అంశంపై స్టే విధించింది. అలాగే కోళ్లను నిర్భందించి ఉంచడం అభ్యంతరకరమని...కోళ్లకు వాడే ఆయుధాలను సీజ్ చేయాలని.. కానీ కోళ్లను మాత్రం సీజ్ చేయొద్దని  పోలీసులను ఆదేశించింది. ప్రతివాదులకు నోటీసులు జారీ చేసి విచారణను నాలుగు వారాల పాటు వాయిదా వస్తున్నట్లు ప్రకటించింది.

రద్దు ఎఫెక్ట్: డిసెంబర్‌లో శ్రీవారి ఆదాయం రూ. 85 కోట్లు

దేశ ఆర్ధిక వ్యవస్థను ప్రక్షాళన చేయడంతో పాటు నల్లధనానికి అడ్డుకట్ట వేసే చర్యల్లో భాగంగా పెద్ద నోట్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు ప్రధాని నరేంద్రమోడీ..ఆ నిర్ణయం నల్లకుబేరుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించింది. కుప్పలు కుప్పలు పోగుపడిన డబ్బును ఏం చేయాలో..ఎలా మార్చుకోవాలో తెలియక తలలు పట్టుకున్నారు. ఆ గందరగోళంలో వారికి కనిపించిన మార్గం దేవుడి హుండీ..దీంతో కోట్ల రూపాయల డబ్బు హుండీల్లో జమ అయ్యింది.   కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవారి హుండీలు మామూలు రోజుల్లోనే నిండిపోతాయి..అలాంటిది పెద్ద నోట్ల రద్దుతో కోట్లకు కోట్లకు వచ్చిపడ్డాయి. తాజాగా టీటీడీ ఈవో సాంబశివరావు విడుదల చేసిన ప్రకటనలో ఒక్క డిసెంబర్ నెలలోనే రూ.85 కోట్ల ఆదాయం వచ్చిందట. ఏడాది మొత్తం హుండి ద్వారా వచ్చిన ఆదాయం 1,018 కోట్లు కాగా, శ్రీవారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 2 కోట్ల 66 లక్షలు..గత రెండు నెలల్లో హుండీల్లో పడ్డ పెద్ద నోట్లను బ్యాంకుల్లో జమ చేసుకుంటే ఆదాయం మరింత పెరిగే అవకాశం ఉందని ఈవో తెలిపారు. గడువు ముగియడంతో నోట్లను డిపాజిట్ చేసుకునే అవకాశం కల్పించాలని రిజర్వ్ బ్యాంకుకు లేఖ రాశామని..సమాధానం వచ్చిన తక్షణం పాత నోట్లను జమ చేస్తామని వెల్లడించారు.

తమిళ రాజకీయాల్లోకి కృష్ణంరాజు..?

తమిళనాడు గవర్నర్‌గా కొణిజేటి రోశయ్య పదవీ కాలం ముగిసిన తర్వాత..కొత్త గవర్నర్ ఎవరు..? అంటూ రకరకాల ఊహాగానాలు వినిపించాయి..ఈ పదవి కోసం గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి ఆనందీబెన్ పటేల్, టీడీపీ నేత మోత్కుపల్లి నర్సింహులుతో పాటు పలువురి పేర్లు తెరమీదకు వచ్చాయి. అయితే మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్‌ రావుకు ఇంచార్జి బాధ్యతలు అప్పగించారు. తాజాగా ప్రముఖ నటుడు, మాజీ కేంద్రమంత్రి కృష్ణంరాజు పేరు తెరమీదకు వచ్చింది. ఆయనను కేంద్రం తమిళనాడు గవర్నర్‌గా నియమించబోతున్నట్లు మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. కానీ ఇంత వరకు అధికారికంగా ఎలాంటి ప్రకటన వెలువడలేదు. ప్రస్తుతం రెబల్‌స్టార్ రాజకీయాలు, సినిమాలకు దూరంగా ఉంటున్నారు.

ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో తప్పిన మరో పెను ప్రమాదం

ఢిల్లీ ఎయిర్‌పోర్టులో కొద్ది రోజుల క్రితం రెండు విమానాలు ఎదురెదురుగా వచ్చి ఢీకొట్టినంత పనిచేసి అధికారులను పరుగులు పెట్టించిన సంఘటన మరచిపోకముందే తాజాగా ఇవాళ మరో పెను ప్రమాదం తప్పింది.  బెంగళూరు నుంచి ఢిల్లీకి బయల్దేరిన స్పైస్ జెట్ విమానానికి హైడ్రాలిక్ ఫెయిల్యూర్ కారణంగా ల్యాండింగ్ సమస్య తలెత్తింది. అయితే పైలట్ అత్యంత చాకచక్యంగా విమానాన్ని ల్యాండ్ చేయడంతో ప్రమాదం తప్పింది. దీంతో ప్రయాణికులంతా క్షేమంగా బయటపడ్డారు. ప్రస్తుతం ప్రయాణికులు, సిబ్బంది క్షేమంగా ఉన్నట్లు స్పైస్ జెట్ ఓ ప్రకటనలో తెలిపింది.

శశికళకు ఓట్లు వేయం: ఆర్కేనగర్ ప్రజలు

దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత తర్వాత ఆమె స్థానాన్ని భర్తీ చేసేందుకు చాకచక్యంగా పావులు కదుపుతున్నారు అమ్మ స్నేహితురాలు శశికళా నటరాజన్. ప్రస్తుతానికి అన్నాడీఎంకే అధినేత్రిగా పగ్గాలు చేపట్టి..నెక్ట్స్ ఫోకస్‌ సీఎం కుర్చీపై పెట్టారు శశి. ఈ నేపథ్యంలో జయలలిత మరణంతో ఖాళీ అయిన ఆర్కేనగర్ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని శశికళ భావిస్తున్నారు. అమ్మపై ఉన్న సానుభూతి తనకు కలిసివస్తుందని భావిస్తున్న శశికళకు ఆర్కేనగర్ వాసులు షాకిచ్చారు. వివరాల్లోకి వెళితే జయలలిత మరణించి 30 రోజులు పూర్తి అయిన సందర్భంగా ఆర్కేనగర్ అన్నాడీఎంకే నేత, న్యాయవాది పీ వెట్రివేల్ ఆధ్వర్యంలో మౌన ప్రదర్శన జరిగింది. ఈ క్రమంలో కొంతమంది ప్రజలు శశికళపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మేము అమ్మకు మాత్రమే విధేయులం..చిన్నమ్మకు చెప్పండి..ఆమె వస్తే మేము ఓట్లు వేయం అని మొహం మీదే చెప్పారు..జయ ఆసుపత్రిలో 77 రోజులు ఉంటే ఒక్కసారి కూడా ఆమెను మాకు చూపని శశికళకు మద్దతిచ్చేది లేదన్నారు.  

పెద్ద నోట్ల రద్దుపై రాష్ట్రపతి.... ఆ ప్రమాదం ఉంది...

  పెద్ద నోట్ల రద్దుపై రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తొలిసారి స్పందించారు. నోట్ల రద్దుపై ఆయన మాట్లాడుతూ.. పెద్దనోట్ల రద్దు వల్ల ఆర్థిక వ్యవస్థ తాత్కాలికంగా మందగించే ప్రమాదం ఉందని..నల్లధనాన్ని అరికట్టి, అవినీతిపై పోరాటం కోసం ఉద్దేశించిన పెద్దనోట్ల రద్దు వల్ల తాత్కాలికంగా కొన్ని ఇబ్బందులు తలెత్తవచ్చని..దీర్ఘకాలంలో అంచనావేస్తున్న ఫలితాలు రావాలంటే తాత్కాలికంగా ఈ ఇబ్బందులు తప్పవని కూడా ఆయన తెలిపారు.  అయితే.. ఈ నిర్ణయం వల్ల పేదలు ఇబ్బందుల పాలు కాకుండా చూసేందుకు మనమంతా మరింత జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉందని సూచించారు.

సీఎం ఆదేశాలనే రద్దు చేసిన కిరణ్ బేడి...

  పుదుచ్చేరి లెఫ్టినెంట్‌ గవర్నర్‌గా కిరణ్‌ బేడి మరోసారి తన ధైర్య సాహసాలు ప్రదర్శించారు. ఏకంగా ముఖ్యమంత్రి గారి ఆదేశాలనే ఆమె రద్దు చేశారు. ఇటీవల వాట్స్ యాప్ అశ్లీల వీడియో వివాదంలో కిరణ్ బేడీ సహకార సంఘాల రిజిస్ట్రార్ శివకుమార్ పై తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఆమె గ్రూప్ కు అశ్లీల దృశ్యాలు పంపినందుకుగాను ఆయనపై కఠినమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీనిపై స్పందించిన  సీఎం నారాయణస్వామి సైతం వాట్స్ యాప్ వంటి సోషల్ మీడియా గ్రూపుల ద్వారా పాలనా వ్యవహారాలను నిర్వహించడం ఏంటని ప్రశ్నించారు. అంతేకాకుండా... అధికారిక కార్యకలాపాల కోసం సామాజిక మాధ్య‌మాల‌ను వినియోగించకుండా నిషేధం విధిస్తూ ఆదేశాలు జారీచేశారు. అయితే ఆ ఆదేశాలు చెల్లవని కిరణ్‌ బేడీ తేల్చి చెప్పేశారు. పుదుచ్చేరి ముఖ్య‌మంత్రి తీసుకున్న నిర్ణ‌యం టెక్నాల‌జీ అందుబాటులో లేని రోజుల్లోకి మ‌న‌ల్ని తీసుకెళ్లేలా ఉంద‌ని, అందుకే ఆయ‌న ఇచ్చిన ఆదేశాల‌ను ర‌ద్దు చేశాన‌ని చెప్పారు. మరి దీనిపై ముఖ్యమంత్రి గారు ఎలా స్పందిస్తారో చూడాలి.  

ధోని రాజీనామాపై నెటిజన్ల స్పందన...

  ఏ విషయమైనా సోషల్ మీడియాలో రావడానికి క్షణాల్లో పని. వచ్చిన విషయాన్ని చూసి వదిలేయకుండా దానిపై కామెంట్లు చేయండంలో కూడా మన నెటిజన్లు మంచి పండితులు. ఈరోజు నెటిజన్లకు దొరికిన న్యూస్ ఏంటంటే...టీ మిండియా కూల్ కెప్టెన్ ధోని రాజీనామా ప్రకటన. టీ20 వన్డే కెప్టెన్సీ నుండి ధోని తప్పుకుంటున్నట్టు తన రాజీనామాను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక దీనిపై స్పందించిన నెటిజన్లు ఏ రకంగా కామెంట్లు విసిరారో చూద్దాం.  * కెప్టెన్‌ గా ధోని రిటైరయ్యాడు. దేశంలో డీమానిటైజేషన్‌ తర్వాత ‘డీమహిటైజేషన్’‌ మొదలైంది. * ఇదే తమిళనాడులో అయితే కోహ్లితో సహా టీమిండియా ఆటగాళ్లు అందరూ ధోని భార్య సాక్షిని కెప్టెన్‌ పగ్గాలు చేపట్టమని బతిమాలేవారు. * జట్టు ప్రయోజనాల కోసం ధోని కెప్టెన్సీని వదులుకున్నాడు. పార్టీ కోసం ములాయం సింగ్‌ యాదవ్‌ తప్పు కోవడం లేదు! * ధోని కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు. ఇదే సమయంలో బీసీసీఐ కొత్త అధ్యక్షుడి కోసం వెతుకుతోంది. కోహ్లి కెప్టెన్సీలో ఆడాలన్న సంగతి మర్చిపోండి. అతడికి ధోని బిగ్‌ బాస్‌ కావొచ్చు! * కెప్టెన్సీ నుంచి ధోని నిర్ణయించుకున్నాడు. రోహిత్‌ శర్మ కూడా తప్పుకోవాల్సిన సమయం ఆసన్నమైంది.

రాణి ఎలిజబెత్ ను కాల్చబోయిన గార్డ్....

  బ్రిటన్‌ రాణి ఎలిజబెత్‌-2 కే తుపాకీ గురిపెట్టి కాల్చబోయాడు ఆమె గార్డ్. మరి అంతటి దుస్సాహసానికి పాల్పడిన గార్డ్ ని బ్రతికి ఉంచారా అంటే ఉంచారు. ఇంతకీ ఆ గార్డ్ ఎవరు.. ఆ కథ ఏంటో ఓ సారి చూద్దాం. రాణి ఎలిజబెత్ ఓ రోజు రాత్రి బాగా పొద్దుపోయాక తన భవనంలో వాకింగ్‌కి వెళ్లారట. చాలా సేపు వాకింగ్ చేసిన ఆమె దాదాపు తెల్లవారుజామున 3 గంటల సమయంలో తిరిగి రాజ భవనంలోకి ప్రవేశిస్తుండగా.. ఇంతలో అక్కడ ఉన్న గార్డ్ ఎవరో అగంతకులు భవనంలోకి ప్రవేశిస్తున్నారు అనుకొని ఎవరది అని గట్టిగా ప్రశ్నిస్తూ తుపాకీ గురిపెట్టాడట. అయితే అక్కడ ఉన్నది రాణి గారు అని తెలుసుకొని షాకయ్యి.. ‘మీరా.. థాంక్‌ గాడ్‌. ఎవరో అనుకుని కాల్చబోయాను’ కాస్త గట్టిగా.. కోపంగానే అన్నాడట. అయితే దానికి రాణి గారు మాత్రం చిన్న చిరునవ్వు నవ్వి... ‘నాకు నిద్రపట్టకపోతే అలా నడవడం అలవాటు. ఏం పర్వాలేదు. నువ్వు మరోసారి ఇలా పొరపాటు పడకుండా వాకింగ్‌కి వెళ్లే ముందు నీకు చెప్పే వెళ్తాలే’ అని సమాధానమిచ్చారట. అయితే ఇది ఇప్పుడు జరిగిన ఘటన కాదులెండి. ఈ విషయం ఆ గార్డ్ స్వయంగా చెప్పడంతో వెలుగులోకి వచ్చింది.

చెత్తతో ఉచిత వైఫై..

  ఇప్పట్లో స్మార్ట్ ఫోన్లు లేని వారు చాలా తక్కువ మందే ఉన్నారు. స్మార్ట్ ఫోన్లు ఉన్న వారికి వైఫై గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ మధ్య రాజకీయ నేతలు కూడా ప్రజలను ఆకర్షించేందుకు ఉచిత వైఫై సర్వీసులు కూడా అందిస్తున్నారు. అయితే చెత్త ద్వారా ఫ్రీ వైఫై ఇస్తున్నారు..ముంబైకి చెందిన  ఓ స్టార్టప్ కంపెనీ అధికారులు. వినడానికి అశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. అసలు సంగతేంటంటే.. ముంబైకి చెందిన ఓ స్టార్టప్ వినూత్న ప్రయోగంతో ముందుకు వచ్చింది. అదేమిటంటే... ఆ నగరానికి చెందిన థింక్ స్క్రీమ్ (THINK SCREAM) అనే ఓ స్టార్టప్ కంపెనీ కొత్తగా వైఫై ట్రాష్ బిన్‌లను తయారు చేసింది. వీటిలో చెత్త వేస్తే చాలు. యూజర్లు 15 నిమిషాల పాటు వైఫైని ఉచితంగా వాడుకోవచ్చు. ఈ వైఫై ట్రాష్ బిన్ సాధారణ చెత్త కుండీలను పోలి ఉంటుంది. ఎత్తు నాలుగున్నర అడుగులు ఉంటుంది. దీని కింది భాగంలో ఓ ఇన్‌ఫ్రారెడ్ సెన్సార్ ఉంటుంది. అది యూజర్లు వేసిన చెత్తను గుర్తించి పై భాగంలో అమర్చిన ఎల్‌ఈడీ స్క్రీన్‌కు మెసేజ్ పంపుతుంది. దీంతో ఆ మెసేజ్‌ను రిసీవ్ చేసుకున్న ఎల్‌ఈడీ స్క్రీన్‌పై ఓ పాస్‌వర్డ్ దర్శనమిస్తుంది. దాన్ని ఉపయోగించి ట్రాష్ క్యాన్‌లో అమర్చిన వైఫై రూటర్‌కు యూజర్లు కనెక్ట్ అవచ్చు. ఈ క్రమంలో అలా చెత్త వేశాక ఓసారి వైఫైకు కనెక్ట్ అయితే దాన్ని 15 నిమిషాల వరకు ఉచితంగా వినియోగించుకోవచ్చు. మొత్తానికి చెత్తతో వైఫై ఇవ్వడం నిజంగా వినూత్న ప్రయత్నమే.

వాటికి నేను వివరణ ఇస్తాను...

  న్యూ ఇయర్ వేడుకల్లో భాగంగా కొంతమంది యువకులు, యువతులపై తమ పైశాచికాన్ని ప్రదర్శించిన సంగతి తెలిసిందే. ఇక దీనిపై హోమంత్రి జీ పరమేశ్వరన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి కూడా విదితమే. యువతులు ప్రాశ్చాత్య దుస్తులు వేసుకున్నారని... ఇలాంటి సందర్భాల్లో అలాంటివి జరుగుతుంటాయని సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆయనపై విమర్శలు తలెత్తాయి. ఇక తనపై వస్తున్న నేపథ్యంలో స్పందించిన ఆయన తాను అన్న మాటలను సందర్భోచితంగా తీసుకోలేదని... 'నేను దేనిని ఉద్దేశించి అన్నానో అలా నా మాటలు తీసుకోలేదని అన్నారు. ఆ రోజు జరిగింది ఓ దురుదృష్టకర సంఘటన... నాకు జాతీయ మహిళా కమిషన్‌ సమన్లు పంపించింది... వాటికి నేను వివరణ ఇస్తాను. అలాగే, గవర్నర్‌ కూడా ఈ ఘటనకు సంబంధించి నా నుంచి వివరణ కోరారు.. దానికి కూడా నేను సమాధానం ఇస్తాను' అని తెలిపారు.

మోదీకి వ్య‌తిరేకంగా టీఎంసీ నేతల నిరసన...

రోజ్ వ్యాలీ చిట్ ఫండ్ కుంభకోణంలో టీఎంసీ పార్టీ ఎంపీ సుదీప్ బందోపాధ్యాయను సీబీఐ అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తమ పార్టీ ఎంపీను అరెస్ట్ చేసినందుకు గాను పార్టీ నేత‌లు ఈ రోజు న్యూఢిల్లీలోని పీఎంవో ఎదుట‌ ఆందోళ‌న‌కు దిగారు. ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ త‌మ‌పై క‌క్ష సాధింపు చ‌ర్య‌ల‌కు దిగుతున్నార‌ని... మోదీకి వ్య‌తిరేకంగా నినాదాలు చేస్తూ నిర‌స‌న తెలిపారు. వారిని పోలీసులు అడ్డుకునే ప్ర‌య‌త్నం చేశారు. అయినా తృణ‌మూల్ నేత‌లు ఆందోళ‌న‌ను విర‌మించ‌క‌పోవ‌డంతో వారిని పోలీసులు అదుపులోకి తీసుకొని పోలీస్‌స్టేష‌న్‌కి త‌ర‌లించారు.

సైకిల్ కావాలంటే ఫ్రూవ్ చేసుకోండి... ములాయం, అఖిలేశ్ కు ఈసీ డెడ్ లైన్..

  ఉత్తరప్రదేశ్ సమాజ్ వాదీ పార్టీలో చీలకలు ఏర్పడిన నేపథ్యంలో పార్టీ గుర్తుపై పార్టీ అధ్యక్షుడు ములాయం సింగ్ యాదవ్, కొడుకు అఖిలేశ్ యాదవ్ పోటీ పడుతున్న సంగతి తెలిసిందే. పార్టీ గుర్తు మాదే అంటూ.. మాదే అని ఇరు వర్గాల నేతలు ఆందోళన చేస్తున్నారు. ఈ గుర్తు నేపథ్యంలో ములాయం, అఖిలేశ్ పై ఈసీకి ఫిర్యాదు చేయడానికి ఏకంగా ఢిల్లీ కూడా వెళ్లారు. అయితే ఇప్పుడు పార్టీ గుర్తుపై ఈసీ తండ్ర్రీ, కొడుకులకు డెడ్‌లైన్ విధించింది. సైకిల్ కావాలంటే మీ మెజారిటీ నిరూపించుకోండి అంటూ  వచ్చే సోమవారం వ‌ర‌కు గడువునిచ్చింది. దీంతో  మెజార్టీ నిరూపించుకోవాల‌ని ఈసీ ఆదేశించ‌డంతో ఆ ప‌నిలో ప‌డ్డాయి ములాయం, అఖిలేష్ వ‌ర్గాలు. దీనిలో భాగంగా ఇప్పటికే  అఖిలేశ్ త‌న‌కు మద్ద‌తుగా నిలుస్తున్న ఎమ్మెల్యేలు, పార్టీ ప‌ద‌వుల్లో ఉన్న‌వారిని ఈరోజు స‌మావేశానికి ఆహ్వానించారు‌. ఆ స‌మావేశంలోని వారి సంత‌కాలు తీసుకొని వాటిని ఎన్నిక‌ల సంఘానికి స‌మ‌ర్పించ‌నున్నారు. దీనికి తోడు ఎన్నికల షెడ్యూల్ కూడా విడుదలవ్వడంతో గుర్తు కోసం పోరు ఉద్ధృత‌మైంది. మరి ఎవరికి ఎక్కువ మెజార్టీ దక్కుతుందో... ఎవరు సైకిల్ గుర్తు సొంతం చేసుకుంటారో తెలియాలంటే వెయిట్ చేయాల్సిందే.  

బెంగుళూర్ యువతిపై వేధింపులు.... న‌లుగురు అరెస్ట్..

  బెంగుళూర్లో  ఓ యువ‌తిని ఇద్దరు వ్యక్తులు వేధిస్తున్నట్టు వీడియో బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ కేసులో నలుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల ప్రకారం.. డిసెంబర్ 31న బెంగుళూర్లోని క‌మ్మ‌న‌హ‌ల్లి ప్రాంతంలో రాత్రి  ఓ అమ్మాయి నడుచుకుంటూ వెళుతుండగా బైక్‌పై వ‌చ్చిన ఇద్ద‌రు అబ్బాయిలు ఆమెపై లైంగికంగా దాడి చేశారు. ఈ వ్యవహారమంతా అక్క‌డ ఒక ఇంట్లో ఉన్న సీసీటీవీకి చిక్కడంతో విషయం బయటకు వచ్చింది. ఇక దీనిపై దర్యాప్తు చేసిన పోలీసులు ఇవాళ న‌లుగుర్ని అరెస్టు చేశారు. ప్ర‌ధాన నిందితులు లీనో, అయ్య‌ప్ప‌ల‌తో పాటు... మ‌రో ఇద్ద‌రు నిందితులు రాజు, చిన్నూల‌ను కూడా అదుపులోకి తీసుకున్నారు. ఈ న‌లుగురూ క‌మ్మ‌న్‌హ‌ల్లిలోని ఫ్రేజ‌ర్ టౌన్‌లో నివాసం ఉంటున్నారు.