తెలంగాణలో ఇంటర్ రిజల్ట్స్ ఎప్పుడంటే?

  తెలంగాణ ఇంటర్ ఫలితాలను ఏప్రిల్ 22న విడుదల చేయనున్నట్లు ఇంటర్మీడియట్ బోర్డు ప్రకటించింది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఈ ఫలితాలను విడుదల చేయనున్నారు. మార్చి 5 నుంచి 25 వరకు ఇంటర్ పరీక్షలు నిర్వహించారు. ఏపీ ఇంటర్ ఫలితాలు ఇప్పటికే ఏప్రిల్ 12న విడుదలైన సంగతి తెలిసిందే. 22వ తేదీ ఉదయం నాంపల్లిలోని ఇంటర్మీడియట్ బోర్డు కార్యాలయంలో డిప్యూటీ సీఎం ఫలితాలను విడుదల చేస్తారని ఇంటర్ బోర్డు ప్రకటించింది.  ఇంటర్ ఫలితాలు బోర్డు అధికారిక వెబ్ సైట్ tsbie.cgg.gov.in లేదా results.cgg.gov.in లో అందుబాటులో ఉంటాయి. ఇంటర్ పరీక్షల్లో 9,96,971 మంది విద్యార్థులు ఇంటర్ పరీక్షలకు హాజరయ్యారు. ఫలితాలను విడుదల చేసిన తర్వాత నెల రోజుల్లో సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించేలా ఏర్పాట్లు చేయనున్నారు. 

మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డికి తృటిలో తప్పిన ప్రమాదం

    తెలంగాణ రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డికి తృటిలో పెను ప్రమాదం తప్పింది. నాగర్‌ కర్నూల్‌లో భూభారతి రెవెన్యూ సదస్సులో పాల్గొనేందుకు హెలికాప్టర్‌లో మంత్రి పొంగులేటి, ఎంపీ మల్లు రవి, సంపత్‌కుమార్ హెలికాప్టర్‌లో వెళ్లారు.కలెక్టరేట్ ప్రాంగణం‌లో ల్యాండింగ్ చేస్తున్న క్రమంలో సిగ్నల్ కోసం బుల్లెట్ ఫైర్ చేయడంతో కింద ఉన్న గడ్డిపై పడి అగ్నిప్రమాదం సంభవించింది. పోలీసులు, ఫైర్ సిబ్బంది అప్రమత్తమై మంటలను ఆర్పివేశారు. హెలికాప్టర్ ల్యాండ్ అయిన సమయంలో చిన్న నిప్పు రాజుకుని, హెలికాప్టర్ గాలికి చెలరేగిన మంటలు. దీంతో మంత్రి పొంగులేటికి, కాంగ్రెస్ నేతలకు పెను ప్రమాదం తప్పింది. లేకపోతే పెనుప్రమాదం సంభవించి ఉండేది. ప్రమాదం తప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.  

నన్ను ఒక్కదాన్నే టార్గెట్ చేస్తున్నారా.. స్మితా సబర్వాల్ రియాక్షన్

  హెచ్సీయూ కంచ గచ్చిబౌలి 400 ఎకరాల భూమిపై రీట్వీట్ చేసిన కేసులో విచారణకు  సీనియర్ ఐఏఎస్ పర్యాటక శాఖ ముఖ్య కార్యదర్శి స్మితా సబర్వాల్ హాజరయ్యారు. ఈ పోస్ట్‌ను 2000 మంది కూడా  రీట్వీట్ చేశారని మరి వారి మీద కూడా చర్యలు ఉంటాయా లేదా నన్ను ఒక్కదాన్నే టార్గెట్ చేస్తున్నారా అని అడిగారు. చట్టం అందరికీ సమానంగా వర్తిస్తుందా లేక ఈ విషయంలో కొందరిని మాత్రమే ఎంపిక చేసి వారినే టార్గెట్ చేస్తున్నారా అని పోలీసులను నిలదీశారు. తనకు పంపినట్లే మిగతా 2 వేలమందికి కూడా నోటీసులు పంపించారా..? అని నిలదీశారు. వారందరిపైనా ఇలాంటి చర్యలే తీసుకున్నారా అని అడిగారు. కాగా, కంచ గచ్చిబౌలి భూములకు సంబంధించి ఫేక్ ప్రచారంపై రేవంత్ సర్కార్ సీరియస్ గా చర్యలు చేపట్టింది. మార్ఫ్ డ్ ఏఐ ఫొటోలను పోస్టు చేసిన వారిపై కేసులు నమోదు చేస్తోంది. ఈ నోటీసులపై ఆమె తాజాగా ఎక్స్‌ వేదికగా స్పందించారు. పోలీసులకు పూర్తిగా సహకరించినట్లు చెబుతూ.. చట్టాన్ని గౌరవించే వ్యక్తిగా పోలీసులు అడిగిన ప్రశ్నలకు వివరణ ఇచ్చినట్లు వెల్లడించారు.  తాను రీపోస్టు చేసినట్లే రెండు వేల మంది చేశారని.. వాళ్లందరిపైనా ఇలాంటి చర్య తీసుకుంటున్నారా..? అని ప్రశ్నించినట్లు తెలిపారు. చట్టం అందరికీ సమానమా.. ? ఎంపిక చేసిన వారినే టార్గెట్‌ చేస్తున్నారా..? అని స్మితా సభర్వాల్‌ నిలదీశారు. హాయ్ హైదారాబాద్’ అనే ట్విట్టర్ యూజర్ ఓ ఏఐ ఫొటోను ట్వీట్ చేయగా.. ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ రీట్వీట్ చేశారు. ఈ వ్యవహారంపై గచ్చిబౌలి పోలీసులు ఆమెకు నోటీసులు పంపించి విచారణకు పిలిచారు. తొలుత ఈ నోటీసులకు స్పందించని స్మితా సబర్వాల్.. ఆ తర్వాత ప్రభుత్వానికి వ్యతిరేకంగా మరిన్ని ట్వీట్లు చేశారు. తాజాగా శనివారం ఈ వివాదంపై స్మితా సబర్వాల్ స్పందించారు. గచ్చిబౌలి పోలీసులు పంపిన నోటీసులకు తాను జవాబిచ్చినట్లు తెలిపారు. చట్టాన్ని గౌరవించే వ్యక్తిగా పోలీసులు అడిగిన ప్రశ్నలకు వివరణ ఇచ్చినట్లు పేర్కొన్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సహా పలువురు తమ ట్వీట్లను తొలగించారు. అయితే, స్మితా సబర్వాల్ మాత్రం వెనక్కి తగ్గకపోగా కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మరిన్ని పోస్టులు చేస్తున్నారు. పోలీసుల నోటీసులు అందుకున్నా ఆమె దూకుడు తగ్గించుకోలేదు. సుప్రీంకోర్టు తీర్పులకు సంబంధించిన వార్తా కథనాలను వరుసగా ట్వీట్ చేశారు. 

విశాఖలో విప్రో ఎండీపై కేసు

క్వాష్ చేయాలంటూ హైకోర్టుకు ఈనెల 21వ తేదీన విచారణ  ఐటీ  దిగ్గజ కంపెనీ విప్రో  ఎండీ సహా ఆ సంస్థకు చెందిన కొందరు ప్రతినిధులపై విశాఖలో కేసు నమోదైంది. ప్రభుత్వం నుంచి ఎలాంటి లీజ్ అనుమతులు లేకుండా మరో ఐటీ కంపెనీకి భవనాన్ని లీజుకు ఇచ్చారంటూ వచ్చిన ఫిర్యాదు పై విశాఖలోని ద్వారక నగర్ పోలీస్ స్టేషన్లో ఈ కేసు నమోదైంది.  విశాఖ  నడిబొడ్డున రేసపువాని పాలెం వద్ద విప్రో కంపెనీ 6 అంతస్తుల భవనంలో కార్యకలాపాలు కొనసాగిస్తున్నది.  ఈ దశలో ప్రభుత్వ  సూచన మేరకు ఉద్యోగ కల్పన చేయకపోవడంతో ఆ భూమిని ప్రభుత్వం రిజిస్ట్రేషన్ చేయలేదు.  కానీ కంపెనీ కార్యకలాపాలు కొనసాగిస్తుంది.  ఈ దశలో విప్రో సంస్థ ఒమిక్స్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో కొనసాగుతున్న పల్సస్ సంస్థకు భవనంలోని మూడు అంతస్తులు లీజుకు ఇచ్చారు.  విప్రో సంస్థకు సంబంధించిన భవనంలోని సెకండ్ ఫ్లోర్ లో ఎస్ ఎఫ్ టి 37 రూపాయలు చొప్పున 37 75 చదరపు అడుగుల స్థలాన్ని 2019లో, అలాగే 2022 లో  ఐదు, ఆరు అంతస్తులో చదరపు అడుగు 58 రూపాయలకు చొప్పున 35872 అడుగుల స్థలాన్ని,   చదరపు గజం 38.85 రూపాయలకు 4877 చదరపు అడుగుల స్థలాన్ని లీజుకి ఇచ్చారు ఈ మేరకు చెల్లింపులు కూడా జరుగుతున్నాయి. దీనిపై రిలీజ్ అగ్రిమెంట్ కోసం ఇటీవల విశాఖపట్నం సబ్ రిజిస్టర్ ను పల్సస్  సంస్థ ఆశ్రయించగా,  అసలే ప్రభుత్వ నుంచి లీజు అగ్రిమెంట్ లేని సంస్థ మరో సంస్థకు లీజుకు ఇచ్చే అవకాశం లేదని తేల్చి చెప్పారు. దీనిపై పల్సస్ సంస్థ తమను  విప్రో సంస్థ మోసగించిందంటూ విప్రో ఎండి తో పాటు మరికొందరు ప్రతినిధులపై ఫిర్యాదు చేశారు.  ఈ మేరకు ద్వారక నగర్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయింది. కాగా ఈ విషయంపై విప్రో సంస్థ ఎండితో పాటు, ఇతరులు ఆ ఎఫ్ఐఆర్ ను రద్దు చేయాలంటూ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. విప్రో ప్రతినిథుల పిటిషన్ ను హైకోర్టు ఈ నెల 21న విచారించనుంది.  

రాజ్యసభకు మాజీ క్రికెటర్లు రాహుల్ ద్రావిడ్, అనిల్ కుంబ్లే!?

సెలబ్రిటీలను పార్టీలో చేర్చుకుని లబ్ధి పొందే విషయంలో కాంగ్రెస్, బీజేపీలు పోటీలు పడుతున్నట్లు కనిపిస్తోంది. రాజ్యసభకు సెలబ్రిటీలను పంపించడం ద్వారా వారి గ్లామర్ ను, కరిష్మాను పార్టీ బలోపేతనికి వినియోగించుకునే విషయంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు రెండు పెద్ద ఎత్తున కసరత్తు చేస్తున్నాయి. ఈ కసరత్తులో భాగంగానే.. కర్నాటక నుంచి ఖాళీకానున్న నాలుగు రాజ్యసభ స్థానాలకూ జరిగే ఎన్నికలలో పార్టీ తరఫున రంగంలోకి దించేందుకు సెలబ్రిటీల వేటలో పడ్డాయి.  క్రమంలో కాంగ్రెస్ తరఫున టీమిండియా మాజీ క్రికెటర్ అనిల్ కుంబ్లేను రంగంలోకి దింపాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తుంటే.. బీజేపీ టీమ్ ఇండియా మాజీ క్రికెటర్ రాహుల్ ద్రావిడ్ ను రంగంలోకి దింపనుంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అనిల్ కుంబ్లేతోనూ, బీజేపీ రాహుల్ ద్రావిడ్ తోనూ చర్చలు జరిపినట్లు సమాచారం.  టీమ్ ఇండియా మాజీ క్రికెటర్ అనిల్ కుంబ్లే అయితే ఇప్పటికే కర్నాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ తో భేటీ అయ్యారు. ఈ విషయాన్ని డీకే శివకుమార్ స్వయంగా సామాజిక మాధ్యమం ఎక్స్ వేదిక ద్వారా సామాజిక మాధ్యమంలో పోస్టు చేశారు. క్రికెటర్ గా దేశానికి, కర్నాటకకూ కుంబ్లే చేసిన సేవలను ప్రస్తుతించారు. అలాగే డీకేను తాను కలిసిన విషయాన్ని కుంబ్లే కూడా ధృవీకరించారు.  ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ తరఫున కుంబ్లే రాజ్యసభకు పోటీ చేయడం ఖాయమన్న చర్చ జోరుగా సాగుతోంది.  ఇక బీజేపీ విషయానికి వస్తే.. ఆ పార్టీ కూడా మాజీ క్రికెటర్ రాహుల్ ద్రావిడ్ ను రాజ్యసభకు పంపేందుకు దాదాపుగా ఒక నిర్ణయానికి వచ్చేసినట్లు చెబుతున్నారు. ఇందుకు రాహుల్ ద్రావిడ్ కూడా సుముఖత వ్యక్తం చేసినట్లు చెబుతున్నారు. 

ఒకే ఒక్కడు.. రాజాసింగ్!

గ్రేటర్ హైదరాబాద్ నగర పాలక సంస్థ  పరిధిలో మొత్తం 20 పైగా అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. అయితే,అందులో బీజేపీ జెండా ఎగిరిన ఒకే ఒక్క నియోజక వర్గం గోషామహల్. ఈ నియోజక వర్గం నుంచి   ఎమ్మెల్యే రాజా సింగ్ ఒకసారి కాదు.. వరసగా మూడు సార్లు గెలిచారు. కేంద్ర హోం శాఖ సహయమంత్రి బండి సంజయ్ కుమార్ అన్నట్లుగా  రాజా సింగ్ కరుడు కట్టిన హిందుత్వవాది. అందులో సందేహం లేదు. అయితే, అది రాజా సింగ్’అనే నాణేనికి  ఒక పార్శ్వం మాత్రమే. ఆయనలో మరో పార్శ్వం కూడా వుంది.  అవును.. అనేక విషయాల్లో ఆయన పార్టీతో విభేదిస్తారు. అసంతృప్తిని బహిరంగంగా వ్యక్తం చేస్తారు. కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కిషన్ రెడ్డి వ్యవహార సరళి ఆయనకు నచ్చదు. ఒక్క కిషన్ రెడ్డి అనే కాదు, పార్టీలో పాతుకు పోయిన నాయకులు ఆయనకు నచ్చరు. అయినా.. ఆయన బీజేపీని వదలరు. బీజేపీ ఆయన్ని వదలదు. అవును.. గతంలో మునావర్‌ ఫారుఖీ షో’ ను వ్యతిరేకిస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదంగా మారాయి. బీఆర్ఎస్ ప్రభుత్వం ఆయన్ని అరెస్ట్ చేసింది. జైలుకు పంపింది. మరోవంక బీజేపీ జాతీయ నాయకత్వం ఆయన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేసింది.  అయినా సస్పెన్షన్  ను ఎత్తేసి గోషామహల్ నుంచి పోటీకు ఆయనకే పార్టీ టికెట్ ఇచ్చింది. గెలిచి మూడవ సారి ఎమ్మెల్యే అయ్యారు. నగరంలో బీజేపీకున్న ఏక్  అఖేలా ఎమ్మెల్యే ఆయనే. అయినా.. శుక్రవారం ( ఏప్రిల్ 18) రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో హైదరాబాద్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికపై జరిగిన సమావేశానికి రాజాసింగ్ రాలేదు. నగరంలోని బీజేపీకి ఉన్న ఏకైక ఎమ్మెల్యే రాజాసింగ్ రాకపోవడంపై పార్టీలో చర్చ జరుగుతోంది.  నిజానికి   కొద్ది రోజులుగా కిషన్‌ రెడ్డి, రాజాసింగ్ మధ్య తీవ్ర స్థాయిలో విభేదాలు నడుస్తున్న విషయం తెలిసిందే.  అయితే..  ఆయనలో ఎంత అసంతృప్తి ఉన్నా, ఆయనకు పార్టీ అంతగా సహకరించక పోయినా, 2018లో 2023లో వరసగా రెండు సార్లు నగరంలో బీజేపీ  జెండా ఎగరేసిన ఒకే ఒక్కడుగా  రాజా సింగ్.. నిలిచారు.    అదలా ఉంటే.. హైదరాబాద్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక సన్నాహక సమావేశంలో జరిగిన సమావేశంలో, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు, ఎంఐఎంకు, ఒవైసీ సోదరులకు దాసోహం అంటున్నాయని అన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల మద్దతుతోనే ఎంఐఎం రాష్ట్రంలో చాప కింద నీరులా విస్తరిస్తోందని, ప్రమాదకరంగా రజాకర్ల సంస్కృతిని విస్తరిస్తోందని అన్నారు.  హైదరాబాద్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎందుకు పోటీ చేయడం లేదని కిషన్ రెడ్డి, కాంగ్రెస్,బీఆర్ఎస్ నేతలను నిలదీశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం ఒక్కటే.. బీజేపీ ఎదగకుండా చేయడమే ఆ మూడు పార్టీల లక్ష్యమని అన్నారు.  కాగా, ఈ నెల  23న పోలింగ్ జరిగే  హైదరాబాద్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎంఐఎం అభ్యర్ధి మీర్జా రియాజ్ ఉల్ హసన్  గెలుపు లాంఛనమే అంటున్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ పోటీ చేయడం లేదు. బీజేపీ మాత్రం,ఎంఐఎం ఏకగ్రీవ ఎన్నికను అడ్డుకునేందుకు.. పార్టీ హైదరాబాద్ జిల్లా మాజీ అధ్యక్షుడు గౌతంరావును బరిలో దించింది.  అయితే.. గెలుపు ఎవరిదో ముందే తెలిసి పోయినా..  కమల దళం మాత్రం ఇంకా ఆశలు వదులుకున్నట్లు లేదు. అందుకే,  శుక్రవారం(ఏప్రిల్ 18) రోజంతా జరిగిన  హైదరాబాద్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక సన్నాహక సమావేశంలో, ఒకే ఒక్కడు, ఒక్క రాజా సింగ్’ తప్ప  రాష్ట్ర, నగర ముఖ్య నేతలంతా పాల్గొన్నారు. ఎందుకో?

దక్షిణాదిన బలోపేతానికి బీజేపీ వ్యూహం!

పవన్ కు కేబినెట్ బెర్త్? తెలుగుదేశంకు గవర్నర్ తాయిలం? దక్షిణాది రాష్ట్రాల్లో పార్టీ బలోపేతంపై బీజేపీ దృష్టి సారించింది. ఉత్తరాదిన పాగా వేసిన బీజేపీకి దక్షిణాది కొరుకుడు పడటం లేదు. ఒక్క కర్నాటక వినా మరే దక్షిణాది రాష్ట్రంలోనూ ఆ పార్టీ ప్రజాదరణ పొందలేదు. దీంతో దక్షిణాదిలో పార్టీ పటిష్ఠతే లక్ష్యంగా కొత్త కొత్త వ్యూహాలు, ప్రణాళికలూ రచిస్తోంది. ఒక వైపు దక్షిణాది రాష్ట్రాలలో ప్రాంతీయ పార్టీలతో పొత్తులో కొనసాగుతూనే సొంతంగా బలోపేతం కావడానికి ప్రయత్నాలు సాగిస్తున్నది. దక్షిణాది రాష్ట్రాలలో బీజేపీ బలోపేతానికి జనసేన అధినేత పవన్ కల్యాణ్ చరిష్మాపై ఆధారపడటం అవసరమన్న నిర్ణయానికి వచ్చిన బీజేపీ అందుకు అనుగుణంగా అడుగులు వేస్తున్నది. వ్యూహరచన చేస్తున్నది.  ఇందు కోసం ఆంధ్రప్రదేశ్ ను సెంట్రిక్ గా చేసుకుని తమిళనాడులో పాగా వేయాలన్నది ఆ పార్టీ వ్యూహంగా కనిపిస్తోంది. ఏపీలో తెలుగుదేశం కూటమిలో భాగస్వామ్య పార్టీగా కొనసాగుతూనే పవన్ కల్యాణ్ తోడ్పాటుతో సొంత బలం పెంచుకోవాలని భావిస్తున్నది.  భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ను దగ్గర చేసుకోవడానికి ఇప్పటికే ప్రయత్నాలు ప్రారంభించింది. ఇప్పటికే ఏపీలో హిందుత్వకు బ్రాండ్ అంబాసిడర్ గా పవన్ కల్యాణ్ తనను తాను ఫోకస్ చేసుకుంటున్నారు. అదే సమయంలో బీజేపీ కూడా పవన్ కు అత్యంత ప్రాధాన్యత ఇస్తోంది.  అంతే కాకుండా కేంద్ర కేబినెట్ విస్తరణకు కసరత్తు చేస్తున్న మోడీ, తన కేబినెట్ లో జనసేన అధినేత పవన్ కు బెర్త్ ఆఫర్ చేసినట్లు బీజేపీ సన్నిహిత వర్గాల సమాచారం. పవన్ అందుకు అంగీకరించి.. కేంద్ర కేబినెట్ లోకి వెడితే.. ఏపీలో ఆయన సోదరుడు నాగబాబుకు కీలక కేబినెట్ బెర్త్ దక్కేలా తన ఇన్ ఫ్లుయెన్స్ ను ఉపయోగించాలన్నది బీజేపీ ఎత్తుగడగా కనిపిస్తోంది.  అలా కాకుండా పవన్ ఏపీ కేబినెట్ లో నంబర్ 2గా, అంటే ఉప ముఖ్యమంత్రిగా కొనసాగడానికే మొగ్గు చూపితే.. ఆయన సేవలను తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి విస్తృతంగా వినియోగించుకోవాలని యోచిస్తోంది. ఆంధ్రప్రదేశ్ లో కంటే తమిళనాట.. సినీ గ్లామర్ ప్రభావం రాజకీయాలపై అధికంగా ఉంటుందన్న సంగతి తెలిసిందే.  అందుకే ఇప్పటికే పవన్  బీజేపీ కోరిక మేరకు తమిళనాడుకు సంబంధించినంత వరకూ వ్యూహాత్మకంగా అక్కడ అధికారంలో ఉన్న డీఎంకేకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నారని చెబుతున్నారు.    ఇక తెలుగుదేశం పార్టీకి కూడా బీజేపీ తాయిలాలు ఇచ్చి.. కేంద్రంలో మోడీ సర్కార్ కు ఎటువంటి ఇబ్బందులూ తలెత్తకుండా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటోంది. సాధ్యమైనంత త్వరలో పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం చేయాలన్న ఉద్దేశంతో ఉన్న బీజేపీ.. తెలుగుదేశం పార్టీ నుంచి ఒకరిద్దరికి  గవర్నర్ పదవి ఇవ్వాలని నిర్ణయించింది. ఈ మేరకు ఇప్పటికే చంద్రబాబుకు సమాచారం ఇచ్చినట్లు చెబుతున్నారు.  పార్టీ నుంచి ఎవరిని ఎంపిక చేయాలన్న విషయంలో చంద్రబాబు ఇప్పటికే కసరత్తు మొదలెట్టారని కూడా తెలుస్తోంది. మొత్తం మీద దక్షిణాదిలో బలపడటం కోసం బీజేపీ పూర్తిగా ఆంధ్రప్రదేశ్ పైనే ఆధారపడి ఉందన్న చర్చ జోరుగా సాగుతోంది. జనసేన, తెలుగుదేశం పార్టీలతో సఖ్యత కొనసాగిస్తూనే ఆ రెండు పార్టీల తోడ్పాటుతో తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాలలో పాగా వేయాలన్నది బీజేపీ వ్యూహంగా చెబుతున్నారు. 

రాజ్ కసిరెడ్డి ఇంటెలిజెంట్ క్రిమినల్.. విజయసాయి

విజయసాయిరెడ్డి రాజీనామా ప్రకటన వెంటనే పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఆయన రాజీనామా ప్రకటన ఒక విధంగా చెప్పాలంటు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలోనే పెను సంచలనం సృష్టించింది. అదీ జగన్ విదేశీ పర్యటనలో ఉన్న సమయంలో ఆయన వైసీపీ ద్వారా వచ్చిన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఆ తరువాత పెద్దగా సమయం తీసుకోకుండానే పార్టీకీ రాజీనామా చేఃసి రాజకీయ సన్యాసం ప్రకటించేశారు. రాజకీయం కాదు ఇక నుంచి వ్యవసాయమే తన వ్యాపకం అని ప్రకటించేశారు. అలా ప్రకటించడమే కాదు.. రైతుగా కొత్త అవతారమెత్తానంటూ  సాగు మొదలెట్టేశారు.  తాను వ్యవసాయం చేస్తున్న ఫొటోలు సమాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా పంచుకున్నారు.  వ్యవసాయ వ్యాపకంతో ఎంతో సంతోషంగా ఉన్నానంటూ ఆ పోస్టులో పేర్కొన్నారు. అయితే నాలుగు దశాబ్దాలకు పైగా వైఎస్ కుటుంబంతో అనుబంధం ఉన్న విజయసాయిరెడ్డి ఉన్న ఫలంగా జగన్ కు జెల్ల కొట్టి రాజకీయాలకు దూరం కావడమేంటి? అన్న అనుమానాలు అప్పట్లో వ్యక్తమయ్యాయి. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డికి కేవీపీ రామచంద్రరావు ఎలాగో.. జగన్ కు విజయసాయి అలాగ అనడానికి ఆయన రాజీనామా ప్రకటనకు ముందు వరకూ ఎవరిలోనూ సందేహం లేదు. అందుకే ఆయన రాజీనామా వెనుక కూడా ఏదైనా డ్రామా ఉందా? అన్న అనుమానాలు అప్పట్లో గట్టిగా వ్యక్తమయ్యాయి. అప్పట్లో అంటే విజయసాయి రాజీనామా ప్రకటన చేసిన సమయంలో అదంతా జగన్ వ్యూహంలో భాగమేనంటూ పరిశీలకులు విశ్లేషణలు చేశారు. ఒక విధంగా చెప్పాలంటే విజయసాయి రాజీనామా జగన్ మోడీ, బీజేపీకి పంపిన ప్రేమ సందేశంగా కూడా అనుమానాలు వ్యక్తం అయ్యాయి. అందుకు తగ్గట్టే విజయసాయి తన రాజీనామా ప్రకటన సమయంలో జగన్ పట్ల విశ్వానాన్నే వ్యక్తం చేశారు. జగన్ మళ్లీ ముఖ్యమంత్రి కావాలనీ, ఆయన రాజకీయంగా పుంజుకోవాలనీ తాను ఆకాంక్షిస్తున్నట్లు పేర్కొన్నారు. దీంతో విజయసాయి రాజీనామా జగన్ ఆదేశం మేరకే జరిగిందని అప్పట్లో అంతా భావించారు.  కానీ ఆ తరువాత వరుసగా జరిగిన జరుగుతున్న పరిణామాలను గమనిస్తే జగన్, విజయసాయి మధ్య పూడ్చలేని, పూడ్చడానికి వీలుకాని అగాధమేదో ఏర్పడిందని అంతా భావిస్తున్నారు. తన రాజీనామా ప్రకటన తరువాత ఆయన జగన్ సోదరి షర్మిలతో హైదరాబాద్ లోని ఆమె నివాసంలో భేటీ అయ్యారు. గంటల పాటు జరిగిన ఆ భేటీలో షర్మిల విషయంలో తాను చేసిన వ్యాఖ్యలు, విమర్శలూ అన్నీ జగన్ రాసిచ్చిన స్క్రిప్టేనని వివరణ ఇచ్చుకున్నారు. ఆ తరువాత కాకినాడ పోర్టు భూముల వ్యవహారంలో గత నెలలో సీఐడీ విచారణకు హాజరైన విజయసాయిరెడ్డి ఆ విచారణ అనంతరం మీడియాతో మాట్లాడుతూ సంచలన విషయాలు వెల్లడించారు. ఆయన ఆ సందర్భంగా మాట్లాడిన మాటలన్నీ పరోక్షంగా జగన్ నే టార్గెట్ చేశాయి. ఆ సందర్భంగానే అసందర్భంగా విజయసాయిరెడ్డి ఆంధ్రప్రదేశ్ లిక్కర్ కుంభకోణం గురించి ప్రస్తావించారు. అప్పటి వరకూ ఏపీలో లిక్కర్ కుంభకోణమే జరగలేదని చెబుతూ వచ్చిన వైసీపీకి విజయసాయి రివీల్ చేసిన విషయం మింగుడుపడలేదు. అప్పుడే విజయఃసాయి ఆంధ్రప్రదేశ్ లో జరిగిన లిక్కర్ కుంభకోణానికి కర్త, కర్మ, క్రియ అన్ని రాజ్ కసిరెడ్డి అలియాస్ కసిరెడ్డి రాజశేఖరరెడ్డే అని చెప్పారు. అందుకు సంబంధించిన విషయాలు, వివరాలు సమయం వచ్చినప్పుడు బయటపెడతానన్నారు. ఈ నేపథ్యంలోనే విజయసాయిరెడ్డి మద్యం కుంభకోణం కేసులో శుక్రవారం (ఏప్రిల్ 18) ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) విచారణకు హాజరయ్యారు. విచారణ అనంతరం మీడియాతో మాట్లాడారు. ఆ సందర్భంగా రాజ్ కసిరెడ్డి గురించి సంచలన విషయాలు చెప్పారు.  రాజ్ కసిరెడ్డి ఇంటెలిజెంట్ క్రిమినల్ అన్న విజయసాయిరెడ్డి అటువంటి నేరపూరిత మనస్తత్వం ఉన్న వ్యక్తిని తాను ఎన్నడూ చూడలేదన్నారు. వైసీపీలోని కొందరు నేతల ద్వారా రాజ్ కసిరెడ్డితో పరిచయం అయ్యిందనీ. అతడి గురించి తెలియని తాను పార్టీలో అతడి ఎదుగుదలకు దోహదపడ్డాననీ చెప్పుకొచ్చారు. భారీ మద్యం కుంభకోణానికి పాల్పడిన రాజ్ కసిరెడ్డి తనను మోసం చేశాడనీ, అయితే ఆ మోసం వల్ల తనకు వచ్చిన నష్టం ఏమీ లేదనీ అన్న విజయసాయిరెడ్డి, వైసీపీ హయాంలో 2019 చివరిలో నూతన మద్యం విధాన రూపకల్పనకు తన హైదరాబాద్, విజయవాడ నివాసాలలో రెండు సమావేశాలు జరిగాయని చెప్పారు.  ఈ సమావేశాల్లో రాజ్ కసిరెడ్డి, మిథున్ రెడ్డి, సత్య ప్రసాద్, తాను ఉన్నామన్నారు ఈ సమావేశాల తరువాతే తాను రాజ్ కసిరెడ్డి, మిథున్ రెడ్డిలు అడగడంతో  అరబిందో శరత్ చంద్రారెడ్డి చేత వంద కోట్ల రూపాయలు రుణం ఇప్పించానని తెలిపారు.  అది వినా ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం గురించి తనకేమీ తెలియదని విజయసాయిరెడ్డి చెప్పుకొచ్చారు. సిట్ విచారణలో కూడా ఇదే చెప్పానని, మద్యం విధానం రూపొందిన తొలి నాళ్లలోనే తాను పార్టీలో క్రియాశీలంగా ఉన్నాననీ, ఆ తరువాత ఆ కుంభకోణం గురించి తనకేమీ తెలియదనీ చెప్పుకున్నారు.  మద్యం కుంభకోణంలో   ముడుపులు చేతులు మారాయా? ఎంతమేర అక్రమాలు జరిగాయి?  అయితే విజయసాయి మీడియాతో మాట్లాడిన మాటలన్నీ మద్యం కుంభకోణంలో కసిరెడ్డి, మిధున్ రెడ్డిల పాత్రే కీలకమన్న విషయాన్ని పరోక్షంగా నిర్ధారించినట్లేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇక విజయసాయి రెడ్డి ఈ సందర్భంగా జగన్ సొంత మీడియాపై కూడా విమర్శలు గుప్పించారు. ఇది కూడా ఆయన జగన్ తో ఢీ అనడానికి రెఢీగా ఉన్నారన్న విషయాన్ని ఎత్తి చూపుతోందని అంటున్నారు.  

బెట్టింగ్ యాప్‌లపై రియాక్ట్ అయిన లోకేష్

బెట్టింగ్ యాప్‌లపై ఏపీ మంత్రి నారా లోకేష్ స్పందించారు. బెట్టింగ్ యాప్‌ల వలన జీవితాలు నాశనం అవుతున్నాయని తనకు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు ఎక్స్‌లో పెట్టిన ఒక పోస్టుపై లోకేష్ తీవ్రంగా రియాక్టయ్యారు. బెట్టింగ్ యాప్‌లపై రాష్ట్రంలో ఉక్కుపాదం మోపుతామన్న లోకేష్.. ఏపీలో బెట్టింగు యాప్‌ల నిషేధానికి సమగ్ర విధానాన్ని తీసుకువస్తామని తెలిపారు. ఈ విధారం దేశానికే ఆదర్శంగా ఉండేలా ఉంటుందని చెప్పారు. న్యాయపరమైన అన్ని అవకాశాలను ఉపయోగించుకుని బెట్టింగ్ సంస్కృతిని ఆపేందుకు ప్రయత్నం చేస్తున్నామని, బెట్టింగ్ యాప్‌ల వలన జీవితాలు నాశనం అవుతున్నాయని పేర్కొన్నారు. అనేక మంది బెట్టింగ్ యాప్‌లకు ఆకర్షితులై ఆర్దికంగా దెబ్బతింటున్నారని, ఇటువంటి పరిస్థితి నుంచి వారిని కాపాడేందుకు అవగాహన కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. బెట్టింగ్ యాప్‌లలో జూదం ఆడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.మొత్తం దేశానికే ఒక ఉదాహరణగా నిలిచే సమగ్ర బెట్టింగ్ వ్యతిరేక విధానంపై కృషి చేస్తున్నామని, ఈ ముప్పును అంతం చేయడానికి అన్ని చట్టపరమైన మార్గాలను అన్వేషిస్తామని ట్వీట్ చేశారు.

ఆ దేశంలో తొలి ఏటిఎం ప్రారంభించారు!

ఏటీఎం లేని దేశం ఉంటుందంటే నమ్ముతారా? కానీ ఇంతకాలం ఏటీఎం లేని ఆ దేశంలో మొట్టమొదటి ఏటీఎం ఇప్పుడే ప్రారంభించారు. మన దేశంలో ఏటీఎం ప్రారంభించాలంటే ఏ బ్రాంచి మేనేజరో, ఇతర అధికారో వెళ్తారు. కానీ, పసిఫిక్‌ సముద్రంలోని ఓ ద్వీప దేశంలో దీని  ప్రారంభోత్సవానికి..  ఏకంగా ప్రధానే హాజరయ్యారు. పెద్ద కేక్‌ కోసి సంబరాలు చేసుకున్నారు. ఎందుకంటే ఆ దేశంలో అదే తొలి ఏటీఎం మరి. అదే తువాలు దేశం. ఇది ఆస్ట్రేలియా-హవాయి మధ్య తొమ్మిది ద్వీపాలతో కలిసి ఏర్పడింది. దాదాపు 11,200 మంది జనాభాతో 10 చదరపు మైళ్ల విస్తీర్ణంలో ఈ దేశం ఉంది. ఇక్కడ ఏప్రిల్‌ 15న తొలి ఏటీఎం ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ప్రధాని ఫెలెటి టెయో స్వయంగా హాజరయ్యారు. దేశ చరిత్రలో ఇది చెప్పుకోదగ్గ మైలురాయిగా అభివర్ణించారు. ఇది దేశానికి గొప్ప విజయమని.. మార్పునకు అవసరమైన కీలక స్విచ్‌ అని వక్తలు అభివర్ణించారు. పసిఫిక్‌ టెక్నాలజీ లిమిటెడ్‌ సంస్థ దీని తయారీకి నేషనల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ తువాలుకు సాయం చేసింది. ఇటీవల కాలంలో సముద్ర మట్టాలు పెరిగి తమ భూభాగం కనుమరుగు అవుతుండటంతో తువాలు రెండేళ్ల క్రితం కీలక నిర్ణయం తీసుకుంది. భావి తరాలకు సంస్కృతి, సంప్రదాయాలను తెలియజేసేలా డిజిటల్‌ దేశంగా మారేందుకు ఏర్పాట్లు చేసుకుంది. ఈ దీవి రాజధాని ప్రాంతం ఇప్పటికే 40 శాతం సముద్రంలో కలిసిపోయింది. ఇదిలాగే కొనసాగితే ఈ దశాబ్దం చివరికి పూర్తిగా కనుమరుగు కావడమే కాకుండా, ప్రపంచంలో గ్లోబల్‌ వార్మింగ్‌కు బలయ్యే తొలి ద్వీపం ఇదే కానుందని పర్యావరణ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. రాబోయే రోజుల్లో తువాలు కనుమరుగైనా.. మెటావర్స్‌ సాంకేతికత ద్వారా తమ దేశ ప్రకృతి అందాలు, ప్రజల జీవనశైలిని పర్యాటకులు చూసేలా ఏర్పాట్లు చేసుకుంది.

ఏపీలో పాస్టర్లకు వేతనలు ప్రకటించటంతో..జగన్ వ్యూహానికి చెక్

  గుడ్ ఫ్రైడే సందర్భంగా క్రైస్తవ పాస్టర్లకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. పాస్టర్లకు నెలకు రూ. 5 వేలు చొప్పున గౌరవ వేతనం ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించారు. ప్రభుత్వం  గౌరవ వేతనం చెల్లించడానికి రూ.30 కోట్లు విడుదల చేసింది. పాస్టర్లకు ఏడు నెలల పాటు మే 2024 నుండి నవంబర్ 2024 వరకు నెలవారీ గౌరవ వేతనం చెల్లించాలని మైనారిటీల సంక్షేమ శాఖ ప్రభుత్వ ఉత్తర్వు  జారీ చేసింది. ఈ ఏడు నెలల కాలానికిగాను రూ. 30 కోట్లు కూటమి ప్రభుత్వం విడుదల చేసింది. ఈ ఏడు నెలలకు ఒకొక్క పాస్టర్‌కు రూ. 35 వేల చొప్పున లబ్ది చేకూరనుంది. 2023 జనవరిలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పేరిట పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా పాస్టర్లతో ఆయన ఆత్మీయ సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ అధికారంలోకి వస్తే.. గౌరవ వేతనం అందిస్తామని పాస్టర్లకు ఆయన హామీ ఇచ్చారు.  ఆ క్రమంలో అధికారంలోకి వచ్చాక ఇచ్చిన మాట ప్రకారం ప్రభుత్వం హామీని అమలు చేసింది. రాష్ట్రంలో ఉన్న చర్చి పాస్టర్లకి ప్రతి నెలా గౌరవ వేతనం కోసం నిధులు విడుదల చేయాలని.. లేకపోతే కలెక్టర్‌ కార్యాలయాల వద్ద ధర్నాలు చేస్తామని వైసీపీ అధినేత జగన్ తెలిపిన సంగతి తెలిసిందే. పాస్టర్లకు  గౌరవ వేతనం సీఎం చంద్రబాబు ప్రకటించటంతో ఆ క్రెడిట్ కూటమి ప్రభుత్వం కొట్టేసిందని చెప్పుకోవచ్చు. గత కొంతకాలం రాష్ట్రంలో క్రిస్టియన్స్ కూటమి ప్రభుత్వం పట్ల కొంత అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. పాస్టర్ ప్రవీణ్ పగడాల రోడ్డు ప్రమాదన్ని హత్యగా చిత్రకరించి వైసీపీ రాజకీయంగా లబ్ధి పొందాలని చూసింది వారి ఆశలు అడియాశలయ్యాయి. ఏపీలో ఉన్న చర్చి పాస్టర్లకి ప్రభుత్వం ప్రతి నెలా గౌరవ వేతనం ప్రకటించడంతో కూటమి ప్రభుత్వన్నికి క్రైస్తవుల్లో సానుభూతి వచ్చినట్లు తెలుస్తోంది. చంద్రబాబు  ఒకే దెబ్బకు రెండు పిట్టలను కొట్టినట్లు వైఎస్ జగన్ వ్యూహానికి చెక్ పెట్టారు.

యూపీఐ చెల్లింపులపై జీఎస్టీ..కేంద్రం క్లారిటీ

దేశంలో ఇకనుంచి రూ.2 వేలకు పైగా చేసే అన్ని రకాల యూపీఐ పేమెంట్స్ మీద కేంద్ర ప్రభుత్వం 18% జీఎస్టీ విధించనున్నట్టు వస్తున్న వార్తలపై కేంద్ర ఆర్థిక శాఖ క్లారిటీ ఇచ్చింది. అన్ని నిరాధార, తప్పుడు దోవ పట్టించే వార్తలని కొట్టిపారేసింది. ప్రస్తుతానికి అలాంటి ఆలోచనమే లేవని ఆర్థికశాఖ స్పష్టం చేసింది.  శుక్రవారం కొన్ని జాతీయ మీడియా సంస్థలు ఈ కథనాలను ప్రసారం చేయగా ఆర్థిక శాఖ స్పందించింది. ప్రస్తుతానికి అలాంటి ఆలోచనలు ఏవీ లేవని, చిన్న చిన్న చెల్లింపులపై ఎటువంటి టాక్స్ లు విధించబోమని ఆర్థికశాఖ స్పష్టం చేసింది. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది. దేశంలో యూపీఐ పేమెంట్స్‌ ప్రోత్సహించేందుకు ఎన్డీయే సర్కార్ కట్టుబడి ఉందని ప్రకటించింది. అందర్నీ ప్రోత్సహించేందదుకు చర్యలు తీసుకుంటామని వెల్లడించింది. ఇప్పుడున్న రూల్స్ ప్రకారం యూపీఐ లావాదేవీలపై నేరుగా జీఎస్టీ వేయడానికి వీలు లేదు. యూపీఐ అనేది ఒక మాధ్యమం అని పేర్కొంది

హైదరాబాద్‌లో దంచి కొట్టిన వర్షం..పలు చోట్ల ట్రాఫిక్ జామ్

హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. ఈదురుగాలులతో  ఉరుములు, మెరుపులతో వాన దంచి కొట్టింది.పలు చోట్ల చెట్లు కూలిపోయాయి. వివిధ ప్రాంతాలకు విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. సహాయకచర్యల్లో తీవ్ర జాప్యం నెలకొనడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అబిడ్స్, నాంపల్లి, బంజారాహిల్స్‌, మాదాపూర్‌, చైతన్యపురి, దిల్‌సుఖ్‌నగర్‌, వనస్థలిపురం, గాంధీభవన్‌, కార్వాన్, కుత్బుల్లాపూర్, మియాపూర్‌, గచ్చిబౌలి, నానక్‌రామ్‌గూడ, సికింద్రాబాద్‌, గాంధీ ఆసుపత్రి, మెట్టుగూడ తదితర ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదైంది. రోడ్లపై మోకాళ్ల లోతు నీరు నిలవడంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.  లోతట్టు ప్రాంతలు నీట మునిగాయి. తెలుగు తల్లి ప్లైఓవర్, బషీర్‌బాగ్ పీజీ లా కాలేజీ రోడ్డులో చెట్లు కూలాయి.కూలిన చెట్లను వెంటనే తొలగించాలని డీఆర్‌ఎఫ్‌ సిబ్బందిని ఆదేశించారు. ట్రాఫిక్‌ ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. మరోసారి భారీ వర్షం పడే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో రోడ్లపై నీరు నిలిస్తే వెంటనే తొలగించాలని పొన్నం సూచించారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని మంత్రి కోరారు.

హైదరాబాద్‌లో రూ.10,500 కోట్లతో భారీ పెట్టుబడి

జపాన్ పర్యటనలోని ఉన్న సీఎం రేవంత్‌రెడ్డి టోక్యోలోని హోటల్ ఇంపీరియల్‌లో జరిగిన ఇండియా-జపాన్ ఎకానమిక్ పార్ట్‌నర్ షిప్ రోడ్డు షో‌లో పాల్గోన్నారు. తెలంగాణలొ పెట్టుబడులు పెట్టి  అభివృద్ధి చెందాలని వ్యాపారవేత్తలకు సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానం పలికారు. ముఖ్యమంత్రి బృందం హైదరాబాద్‌లో భారీ పెట్టుబడులను సాధించింది. రూ. 10,500 కోట్లతో ఏఐ డేటా సెంటర్‌ క్లస్టర్‌ ఏర్పాటుకు ఒప్పందం కుదుర్చుకుంది. ఎన్‌టీటీ డేటా, నెయిసా సంస్థలు సంయుక్తంగా ఈ డేటా సెంటర్‌ క్లస్టర్‌ను ఏర్పాటు చేయనున్నాయి. టోక్యోలో సీఎం  సమక్షంలో త్రైపాక్షిక ఒప్పందాలపై ప్రభుత్వ అధికారులు, సంస్థల ప్రతినిధులు సంతకాలు చేశారు. మరోవైపు రుద్రారంలో రూ.562 కోట్లతో మరో పరిశ్రమ ఏర్పాటుకు తోషిబా ఒప్పందం చేసుకుంది.ముఖ్యమంత్రి సమక్షంలోనే తోషిబా అనుబంధ సంస్థ టీటీడీఐ ప్రతినిధులు ఎంవోయూపై సంతకాలు చేశారు.  విద్యుత్‌ సరఫరా, పంపిణీ రంగంలో పెట్టుబడులు, ఆవిష్కరణలకు ఈ ఒప్పందం జరిగింది. రుద్రారంలో ఇప్పటికే ఈ సంస్థ రెండు ఫ్యాక్టరీలను నిర్వహిస్తోంది. ఈ భారీ పెట్టుబడులపై సీఎం రేవంత్‌ హర్షం వ్యక్తం చేశారు. దేశంలోనే కొత్త రాష్ట్రం.. అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న తెలంగాణ మీకు హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతోంది. జపాన్ ని ఉదయించే సూర్యుడి దేశం అని పిలుస్తారు. మా ప్రభుత్వ నినాదం తెలంగాణ రైజింగ్.. ఈరోజు తెలంగాణ జపాన్ లో ఉదయిస్తోందని సీఎం రేవంత్ పేర్కొన్నారు. 

మోదీ పర్యటన ఏర్పాట్ల పర్యవేక్షణకు మంత్రుల కమిటీ

ప్రధాని నరేంద్రమోడీ పర్యటన ఏర్పాట్ల పర్యవేక్షణకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మంత్రల కమిటీని నియమించింది. ప్రధాని నరేంద్రమోడడీ  మే 2న అమరావతికి రానున్న సంగతి తెలిసిందే. రాజధాని అమరావతి పనున పున: ప్రారంభానికి ఆయన శంకుస్థాపన చేయనున్నారు. ఈ పర్యటనను విజయవంతం చేయాలన్న కృత నిశ్చయంతో ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇందుకు భారీ ఏర్పాట్లు చేస్తున్నది. దాదాపు ఐదు లక్షల మంది వస్తారన్న అంచనాతో ఏర్పాట్లు చేస్తున్నది.   నారాలోకేష్, పయ్యావుల కేశవ్, నాదెండ్ల మనోహర్, నారాయణ, సత్యకుమార్, కొల్లు రవీంద్రలతో  ప్రధాని పర్యటన ఏర్పాట్ల పర్యవేక్షణకు మంత్రుల కమిటీని ఏర్పాటు చేసింది. అలాగే  అందులో లోకేశ్, పయ్యావుల, నారాయణ, సత్య కుమార్, నాదెండ్ల, రవీంద్ర ఉన్నారు. అలాగే ఐఏఎస్ అధికారిని వీరపాండ్యన్ నునోడల్ అధికారిగా నియమించింది. 

లిక్కర్ స్కాంలో అతనిదే ప్రధాన పాత్ర.. సాయిరెడ్డి సంచలన విషయాలు

  వైసీపీ హయాంలో జరిగిన లిక్కర్ కేసులో  మాజీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి సిట్ విచారణకు హాజరయ్యారు. మద్యం కుంభకోణంలో కీలక సూత్రధారి రాజ్ కసిరెడ్డి అని విచారణలో వెల్లడించినట్టు తెలుస్తోంది. ఈ స్కాంలో సాక్షిగా హాజరు కావాలని సిట్ అధికారులు ఆయనకు నోటీసులు జారీ చేయగా.. నేడు సిట్ ముందుకు వచ్చారు. శుక్రవారం విజయవాడ సిట్ ఆఫీసులో ఈ విచారణ జరుగుతోంది. ఈ కుంభకోణంలో మెయిన్ రోల్ కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డిదే అని విజయసాయి పేర్కొనగా.. అదే ఆఫీసులో వేరేచోట విచారణ జరుపుతున్న కసిరెడ్డి తండ్రిని విజయసాయి సమాధానాలను బేస్ చేసుకొని ప్రశ్నలు ఆడుగుతున్నట్టు సమాచారం.కాగా విచారణ సాయంత్రం వరకు కొనసాగే అవకాశం ఉందని తెలుస్తోంది. నిన్న విచారణకు హాజరవుతానని సిట్ అధికారులకు సమాచారం పంపిన ఆయన... కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల హాజరు కాలేకపోయారు. ఈరోజు విజయవాడలోని సిట్ కార్యాలయానికి ఆయన వచ్చారు. ప్రస్తుతం సిట్ కార్యాలయంలో విచారణ కొనసాగుతోంది.   

సాయం మాటల్లో కాదు చేతల్లో.. గిరిజనానికి పాదరక్షలు అందించిన పవన్ కల్యాణ్

సహాయం అన్నది మాటల్లో కాదు చేతల్లో ఉండాలి అన్న విషయాన్ని పవన్ కల్యాణ్ నిరూపించారు. అడవి తల్లి బాట కార్యక్రమంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఈ నెల అల్లూరి సీతారామరాజు జిల్లాలో పర్యటించారు.  ఆ పర్యటనలో భాగంగా ఆదివాస గ్రామం డుంబ్రిగుడలో ఆయన గిరిజనులతో మమేకమయ్యారు.  ఆ సందర్భంగా గ్రామంలో దాదాపు ఎవరూ పాదరక్షలు లేకుండా ఒట్టి కాళ్లతోనే ఉండటాన్ని గమనించారు. సరైన రహదారుల లేని గిరిజన గ్రామాలలో గిరిజనం చెప్పులు కూడా లేకుండా నడవాల్సిన పరిస్థితికి చలించిపోయారు. అడవితల్లి బాట కార్యక్రమంలో భాగంగా ఆయన గిరిజన గ్రామాలకు రహదారులు వంటి ఎన్నో హామీలు ఇచ్చారు. వాటిని త్వరలోనే ఆరంభిస్తానని నమ్మబలికారు. అయితే ఆ వాగ్దానాలతో సంబంధం లేకుండా పవన్ కల్యాణ్ వారికి ఓ అనూహ్య బహుమానం ఇచ్చారు. చెప్పుకోవడానికి అది చాలా చిన్న విషయంగా కనిపించవచ్చు. కానీ అందరి హృదయాలనూ హత్తుకునే ఉదాత్త చర్య అనడంలో మాత్రం సందేహం లేదు. ఇంతకీ పవన్ కల్యాణ్ చేసింది ఏమిటంటే డుంబ్రిగుంట గ్రామ గిరిజనులకు ఆయన పాదరక్షలు పంపించారు. తన టీమ్ ద్వారా మొత్తం గ్రామ ప్రజలందరికీ పాదరక్షలు అందించారు. గ్రామంలో ఎంద మంది ఉన్నారు, వారికి ఏ సైజు పాదరక్షలు అవసరం తదితర వివరాలన్నిటినీ సర్వే చేయించారు. గురువారం (ఏప్రిల్ 17)న డుంబ్రిగుంట గ్రామస్తులకు పాదరక్షలు అందజేయించారు. డుబ్రిగుంట గ్రామంలో ఉన్న 345 మందికి పాదరక్షలు అందచేయించారు. ఉప ముఖ్యమంత్రి కార్యాలయ సిబ్బంది గ్రామంలోని ప్రతి ఇంటికీ వెళ్లి పాదరక్షలు అందజేశారు.   కోరకుండానే కష్టం తెలుసుకుని, అవసరాన్ని గుర్తించి తమకు పాదరక్షలు అందించిన  ప‌వ‌న్‌కు గిరిజనం కృతజ్ణతలు తెలిపారు.  

ఎంఎంటీఎస్‌ యువతి రేప్ కేసులో..బిగ్ ట్విస్ట్

హైదరాబాద్‌లోని ఎంఎంటీఎస్‌లో యువతిపై అత్యాచారయత్నం ఘటనపై బిగ్ ట్విస్ట్ చోటుచేసుకుంది. అసలు సదరు యువతిపై లైంగిక దాడి జరగలేదని పోలీసు ఎంక్వైరీలో తేలింది. రైలులో వెళ్తూ ఇన్‌స్టా రీల్స్ చేసిన ఆమె ప్రమాదవశాత్తు కింద పడిపోయింది. ఈ విషయాన్ని ఇంట్లో చెబితే తిడతారని  అత్యాచారం జరిగింది అంటూ ఆ యువతి కట్టుకథ అల్లింది. ఆమె చెప్పిన వివరాల ఆధారంగా దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు 100 మంది అనుమానితులను విచారించారు. వారు చెప్పిన విషయాలతో కంగుతిన్న అధికారులు 250 సీసీటీవీ ఫుటేజీని పరిశీలించి యువతిని విచారించగా ఆమె చెప్పిన సమాధానాలతో పోలీసులకు అనుమానం మొదలైంది.  ఇక వారు తమ స్టైల్లో విచారణ జరపగా ఆ యువతి అసలు విషయం చెప్పుకొచ్చింది. సోషల్ మీడియాలో రీల్స్ చేస్తుండగా కింద పడ్డానని.. తనపై అత్యాచారం జరగలేదని.. చెప్పడంతో నిజానిజాలు నిర్ధారించిన పోలీసులు ఈ కేసు క్లోజ్ చేశారు.అసలు ఆమెపై అత్యాచారమే జరగలేదని పోలీసుల దర్యాప్తులో తేలింది. యువతి అధికారులకు అబద్ధం చెప్పినట్లు తెలిసింది. ఈ కేసులో రైల్వే పోలీసులు చేపట్టిన లోతైన దర్యాప్తులో సంచలన  విషయం వెలుగులోకి వచ్చింది.