నట సార్వభౌముడు యస్.వి.రంగారావు
ఇది సామాన్యమైన బిరుదు కాదు. దీన్ని పొందాలంటే నటనలో ఆద్యంతాలు తెలియాలి, నటనలో ఎంతో అనుభవం, ఆ అనుభవాన్ని సద్వినియోగం చేయగల సత్తా ఆ నటుడికి ఉండాలి. అయినా నటన అనేది పుట్టుకతో రావాలి. ఒక్క నటననేంటి ఏ కళ అయినా పుట్టుకతోనే రావాలి. లేకపోతే ఎవరైనా కళాకారుడిగా రాణించటం కష్టమే కాదు దాదాపు అసాధ్యం. అలాంటి వ్యక్తులు ఒకవేళ కళాకారులవ్వాలని ప్రయత్నించినా వారు ఎంత మాత్రం సఫలీకృతులు కాలేరు. ఉదాహరణకు తాళ జ్ఞానం లేని వ్యక్తికీ ఎంత పెద్ద కళాకారుడితో మృదంగం నేర్పించినా, ఎన్ని సంవత్సరాలు నేర్పించినా అతనికా విద్య ఒంటబట్టదు. స్వర, రాగ జ్ఞానంలేని వారికి ఎన్ని నాళ్ళు సంగీతం నేర్పించినా అది వారికి పట్టదు. ఇది అందరికీ తెలిసిందే. అందుకే కళ భగవద్దత్తమని పెద్దలు చెపుతుంటారు ...
ఆ నటరాజు అనుగ్రహం లేకపోతే ఏ కళలోనైనా రాణించటం కష్టం. అలాంటి కళల్లో నటన చాలా గొప్పది. దీనిలో ఎదుటి మనిషిని ఆకట్టుకునే గొప్పదనం ఉంది ... నటిస్తున్న నటుడి అన్ని భావాలనూ ప్రేక్సకుడు అనుభవిస్తాడు ... అలా అనుభవించేలా చెయ్యగలిగితే ఆ నటుడు నటనలో పరిణితి సాధించినట్లే. అలాంటి మహా నటులు తెలుగు చలన చిత్ర పరిశ్రమలో బహు కొద్దిమందే ఉన్నారు. దేశ, విదేశాల్లో తమ కీర్తి పతాకాన్ని ఎగురవేసిన ఘనుల్లో అగ్రగణ్యుల సరసన నటనా సార్వభౌమ శ్రీ యస్.వి. రంగారావు. చిత్ర రంగానికి హీరోగా వచ్చినా విలన్ గా, కేరెక్టర్ ఆర్టిస్టుగా ఆయన చేసిన నటన హిమాలయాలకంటే ఎత్తయింది. మహాసముద్రం కంటే గంభీరమైంది. వెన్నకన్నా, పూవుకన్నా, లేచిపురుకన్నా సున్నితమైంది, కరవాలం కన్నా పదునైంది, కోడెత్రాచుకన్నా చురుకైనది.
ఆయన నటన గురించీ, ఆయనలోని కళాకారుడి గురించీ ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఏ పాత్ర పోషించినా ఆ పాత్రలోకి పరకాయ ప్రవేశం చేసి, ఆ పాత్ర మాత్రమే కనపడేలా నటించటం ఆయన సొత్తు. నటుడు నీరులా ఉండాలి. ఎందుకంటే నీరు ఎలాగైతే ఏ పాత్రలో పోస్తే ఆ ఆకారాన్ని ఎలా పొందుతుందో నటుడు కూడా అలాగే ఏ పాత్ర పోషిస్తే ఆ పాత్రలో మమేకమై తానుగా కాక ఆ పాత్రగా కనిపించాలి. అప్పుడే ఆ కళాకారుడి నటనకు పరిపూర్ణత, ఆ కళకు రససిద్దీ కలుగుతాయి. ఇది ఓ నటుడిగా, శ్రీ యస్.వి.రంగారావుగారి అభిప్రాయం. ఒక మనిషి యొక్క స్థాయి అతని ఆలోచనల్లో, అభిప్రాయాల్లో ప్రతిఫలిస్తుందనటానికి ఆయనే నిలువెత్తు తార్కాణం. ఆయనకు నటనపరంగా ఇలాంటి ఉన్నతమైన అభిప్రాయాలున్నాయ కాబట్టే ఆయన నటన ప్రేక్షకులను సమ్మోహపరిచేది ...
S.V. Ranga Rao acted movies
పాతాళ భైరవి
నేపాళ మాంత్రికుడు
మాయా బజార్
ఘటోత్కచుడు
భక్త ప్రహ్లాద
హిరణ్య కశిపుడు
గుండమ్మ కథ
బాధ్యతా తెలిసిన పెద్దమనిషి
పాపకోసం
గ్రుడ్డివాడు
పండంటి కాపురం
పెద్దన్న
పాండవ వనవాసం
సుయోధన చక్రవర్తి
భూ కైలాస్
మైరావణ
దీపావళి
నరకాసురుడు
సంపూర్ణ రామాయణం
రావన్ బ్రహ్మ
యశోద కృష్ణ
కంసుడు
దసరా బుల్లోడు
గయ్యాళి భార్యకు భయపడే భర్త
సతీ సక్కుబాయి
అమాయక భర్త
సారంగధర
సారంగాధరుడి తండ్రి
బాల భారతం
భీష్ముడు
బాల నాగమ్మ
మాయల ఫకీరు
మిస్సమ్మ
మతిమరుపు మనిషి
అందరూ దొంగలే
దొంగ, అమ్మాయిల పిచ్చోడు
దేవుడు చేసిన మనుషులు
కొడుకుని పోగొట్టుకున్న తండ్రి
బంగారు బాబు
పేద తండ్రి
ఇలా ఒకటా ...? రెండా ...? ఎన్ని పాత్రల గురించి చెప్పగలం ...? ఆయన నటించిన ప్రతి పాత్రకూ ఓ గుర్తింపు లభించేది ... దానికి కారణం ఆయన వాటిని మలచిన తీరే.
“పాతాళ భైరవి’’ చిత్రంలో ఆయన పోషించిన నేపాళ మాంత్రికుడు పాత్రను విశ్లేషిస్తే ఎన్నో విషయాలు మనం గమనించవచ్చు. ఆ పాత్ర ఆహార్యం, భాష, మేనరిజమ్స్, ఇలా అన్నీ కూడా చాలా ప్రత్యేకంగా ఉంటాయి. మామూలుగా రంగారావుగారు మంచి కండపుష్టి ఉన్న ఆరడుగుల ఆజానుబాహుడు. కానీ ఈ చిత్రంలో ఆయన ముఖంలో ఒకరరమైన మార్పుని తెచ్చారు. దానివల్ల ఆయన కొంచెం దవళ్ళు లోపలికి పోయినట్టుగా, ముఖం పీక్కుపోయినట్టుగా కనిపించే విధంగా మేకప్ చేశారు. గెడ్డం కూడా కొంచెం వెరైటీగా పెట్టారు. జుట్టు పొడవుగా మెడ మీద పడే విధంగా సహజంగా కనిపించే విగ్ పెట్టారు. ఇక కాస్ట్యూమ్స్ కొస్తే ఓ నల్లటి పొడవాటి లూజ్ గౌన్. ఇలాంటి ఆహార్యంతో ఆయన నిజమైన నేపాళ మాంత్రికుడిగా కనిపించారు.
ఆయన తెలుగు ఎంత స్పష్టంగా ఉంటుందంటే ఎంత పెద్ద డైలాగ్ అయినా సరే, ఎంత వేగంగా చెప్పినా సరే దాన్లోని ప్రతి అక్షరం క్రిస్టల్ క్లియర్ అంత స్పష్టంగా వినపడేది. వాచకం విషయంలో ఆయన చాలా మందికి ఆదర్శంగా నిలిచారు. ఆయన డైలాగ్ చెప్పే విధానం చాలా ప్రత్యేకంగా ఉండేది ... డైలాగుల్లో హెచ్చు తగ్గులు, విరుపులు వాటితో పాటు చక్కని భావప్రకటన అంటే ఆ పాత్ర స్వభావం ఆ డైలాగ్ చెప్పే విధానంలో కనపడేది. దానికి తోడు ఆయనది ధవళ గాత్రం. చాలా గంభీరంగా ఉంటుంది. ఆ పాత్రకు ఓ ప్రత్యేకమైన యాస వాడారు ... “సాహసం సాయరా డింభకా’’. “జనం సెప్పేది మనం సాయవలెనా మనం సేసేది జనం సూడవలెనా ...?’’, “జాయ్ పాతాళ భైరవీ’’ వంటి డైలాగులను గమనిస్తే ఆ యాసను ఆయన్ను ఆయన ఎలా వాడారో మనకర్థమౌతుంది. ఆ యాస ఎంత ప్రత్యేకమైనదంటే ఆ తర్వాత తెలుగు చలన చిత్రాల్లోని ప్రతి మాంత్రికుడు అదే యాసను వాడారు. అలా డైలాగుల్లో తన శైలిని ఆ పాత్రలో చూపించారు.
ఇక నటన విషయానికొస్తే ముఖంలో కాఠిన్యం, నాయవంచనం దుర్మార్గం, వెల్లివిరిసే క్రోధం లాంటి భావాలు చాలా చక్కగా వ్యక్తపరిచారు. తోట రాముడు అగ్నిగుండంలో దూకటానికి తటపటాయిస్తుంటే అతన్ని రెచ్చగొట్టి అందులోకి దూకించినప్పుడు. ఆ లోపలి తానూ తాడు సాయంతో దిగగానే అక్కడి పొగాకు తట్టుకోలేక చేయి అడ్డుపెట్టేటప్పుడు హావభావాలు అనితర సాధ్యం. ఇలా చెప్పుకుంటూ పొతే ఒక్క “పాతాళ భైరవి’’ చిత్రం గురించే ఎంతైనా చెప్పవచ్చు.
ఇక “భక్తప్రహ్లాద’’ చిత్రంలో ఆయన నటన పరాకాష్టకు చేరింది. తన కొడుకే తన శత్రువుని పూజించటం నచ్చక, ఆ కొడుకుని వదులుకోలేక, కొడుకుని చంపినా, ఆ పిల్లవాడు చావకపోవటం అర్టంకాక ఆ హిరణ్యకశిపుడు పడే మానసిక సంఘర్షణ చాలా అద్భుతంగా చూపించారు రంగారావు గారు. ఆ చిత్రం మొదట్లో దేవతలా మీది వైరంతో యుద్ధానికి బయలుదేరబోతూ, శుక్రాచార్యుడు చెప్పిన మాట ప్రకారం తపస్సుకెళ్ళినప్పుడూ, తిరిగివచ్చిన తర్వాత దేవతలను గెల్చి వారిని గెలిచేతప్పుడు చూపిన నటన చలనచిత్ర చరిత్రలో నభూతో నభవిష్యతి. చివరి సీన్లో నరసింహస్వామి ప్రత్యక్షం కాగానే ఆయన చెప్పే డైలాగులూ, చూపిన నటన గురించి ఎంతని చెప్పగలం, ఏమని చెప్పగలం. ఇలాంటి పాత్ర పోషణలో ఆయనది అందెవేసిన చెయ్యి. ఆయన బాడీ లాంగ్వేజీ కూడా చాలా విభిన్నంగా ఉంటుంది. నడకలో, మాటలో, ముఖంలో ఓ విధమైన నిర్లక్ష్యం, అహంకారం, ఓ రకమైన ధీమా మనల్ని ఆ పాత్ర ఇలాగే ఉంటుంది అనిపించేలా సమ్మోహనపరిచేవి.
“పాండవ వనవాసం’’ చిత్రంలో దుర్యోధనుడుగా ఆయన నటన నాకు స్ఫూర్తిగా నిలిచిందని మహా నటుడు కీర్తి శేషులు, స్వర్గీయ నందమూరి తారకరామారావు గారు అన్నారంటే ఆ పాత్రలో రంగారావు గారు ఎంత బాగా నటించారో చెప్పక్కర్లేదు. ఆ చిత్రంలో జూదం సీన్లో పాండవులు తమ సర్వస్వం కోల్పోగా రారాజు ద్రౌపదికి తన ఊరువును చరుస్తూ సైగ చేసే సీన్లో యన్.టీ.ఆర్. తో డీ అంటే డీ అని నటించారు రంగారావు గారు. “ఛీ ... బానిస ... బానిసలకింత అహంభావమా ...?’’ ఈ ఒక్క డైలాగ్ తో రామారావు గారిని ఆ సీన్లో ఆయన డామినేట్ చేశారు .... ఈ విషయం ఆ చిత్రం చూసిన వారెవరికైనా గుర్తుండే వుంటుంది. ఆ సిను ఇద్దరు మహానటులతో 11 టేక్ లు, అదీ పౌరాణికాల మీద మంచి పట్టున్న దర్శకులు కీర్తి శేషులు శ్రీ కమలాకర కామేశ్వర రావుగారు తీశారంటే మనం అర్థంచేసుకోవచ్చు.
ఆ సీన్ పవర్ ఏంటో ... ఇద్దరూ కూడా సింగిల్ టేక్ ఆర్టిస్టులే మరి. రంగారావు గారి నటనకు మరో ఎస్సెట్ మాధవపెద్ది వారి గాత్రం. ఆయన రంగారావు గారికి పాడటానికే పుట్టారా అన్నంత సహజంగా రంగారావు గారికి సరిపోయేది ... రంగారావుగారి నటనకు మాధవపెద్ది పద్యం తోడైతే ఇక చెప్పేదేముంది. బంగారానికి తావి అబ్బినట్లే .... అదో అమోఘమైన కాంబినేషన్. పౌరాణిక చిత్రాల్లో రంగారావు గారి నటనకూ, జానపద చిత్రాల్లో, సాంఘిక, చారిత్రాత్మక చిత్రాల్లోని ఆయన నటనకూ తేడా కొట్టొచ్చినట్టు కనపడుతుంది. అసలు ఒక పాత్రకూ మరో పాత్రకూ ఏ మాత్రం పోలిక లేకుండా ఏ పాత్రకాపాత్రే ప్రత్యేకంగా కనపడేలా నటించటం ఆయన ప్రత్యేకత.
“జగత్ కిలాడీలు’’ చిత్రంలో ఆయన చెప్పిన డైలాగులు ఆ రోజుల్లో జనం నోళ్ళలో పలికాయంటే ఆయన ఆ డైలాగుల్ని చెప్పిన స్టైల్ అలాంటిది. “పులి అడవిలో ఉన్నా బోనులో ఉన్నా పులి పులేరా ఘూట్లే’’, “డోంగ్రే’’ ఇలాంటి డైలాగులు జనబాహుళ్యంలో చాలా రోజులు ప్రచారంలో ఉన్నాయి. ఆ పదాల ప్రయోగం ఓ విచిత్రం ఐతే వాటిని రంగారావు గారు చెప్పిన శైలి ఇంకా ప్రత్యేకంగా ఉండటం వల్లే వాటికంత ప్రజాదరణ లభించింది. ఒక్క డైలాగ్ మాడ్యులేషన్ మాత్రమె కాదు, ఆ మాటలకు తగ్గ బాడీ లాంగ్వేజ్, హావభావా ప్రకటన ఇవన్నీ కూడా ఆ పాత్రలను ప్రభావితం చేశాయనటంలో సందేహం లేదు.
“పండంటి కాపురం’’ చిత్రంలో ఆయన తమ్ముళ్ళ కోసం తపన పడే ఓ అన్నగా ఆయన చేసిన నటన ప్రక్షకుల్లో చెరగని ముద్రవేసిందంటే అతిశయోక్తి కాదు. ఆ చిత్రంలో ముఖ్యంగా తమ్ముడి కొడుకు చనిపోయినప్పుడు ఆ పిల్లవాడిని మట్టిచేస్తూ ఆయన చెప్పిన డైలాగులు చూసిన ప్రతి ప్రేక్షకుడినీ కంటినీరు పెట్టించాయి.
“మిస్సమ్మ’’ చిత్రంలోని ఆయన పాత్ర మతిమరుపు పెద్దమనిషి. ఉత్తరీయం భుజం మీదే ఉన్నా దానికోసం వెతికే పాత్ర. ఆయనకు జోడీగా ఋష్యేంద్రమణి నటించారు. వీరి మధ్య నడిచే హాస్యం ఎంత హృద్యంగా ఉంటుందో ఆ చిత్రాన్ని చూసిన ప్రతి ఒక్కరికీ గుర్తుండే ఉంటుంది. అసలు ఆ చిత్రంలో నటించిన వారంతా మహానటులూ, మహానటీమణులు ... సాంఘిక చిత్రాల్లో అదొక మైలురాయిగా నిలిచిపోతుంది. ఏ.యన్.ఆర్. , యన్.టి.ఆర్.. యస్.వి.ఆర్., సావిత్రి, జమున, రేలంగి, అల్లురామలింగయ్య, రమణారెడ్డి, ఇలా ఆ చిత్రంలో హేమాహేమీలంతా పోటీపడి హాస్యాన్ని పండించారు. ఆ చిత్ర దర్శకులు కీర్తిశేషులు శ్రీ అక్కినేని, లక్ష్మీ వర ప్రసాదు (యల్.వి.ప్రసాద్) గారిని ఈ సందర్భంగా గుర్తుచేసుకోవటం మా కనీస ధర్మం.
ఇక మరో చక్కని చిత్రం “గుండమ్మ కథ’’. దీన్లో రంగారావుగారి నటన చాలా హుందాగా సాగుతుంది. యన్.టి.ఆర్., ఏ.యన్.ఆర్. ఇద్దరూ ఆయనకు కొడుకులుగా ఈ చిత్రంలో నటించారు. “దసరా బుల్లోడు’’ ఈ చిత్రం ఆ రోజుల్లో ఓ సంచలనమే సృష్టించింది. దీన్లో రంగారావుగారు తన గయ్యాళి భార్య నోటికి భయపడే భర్త పాత్రను పోషించారు. ఈ చిత్రంలో ఆయన పాత్ర పడే మానసిక సంఘర్షణ మనల్ని ఆకట్టుకుంటుంది.
ఇవన్నీ ఒక ఎత్తయితే “మాయాబజార్’’ చిత్రంలోని ఘటోత్కచుని పాత్ర ఒక ఎత్తు. ఆ పాత్ర పోషణ ఎవరికైనా కత్తిమీద సామే కావచ్చు. కానీ రంగారావు గారి లాంటి మహా నటునికి ఇది నల్లేరు మీద నడకే. పింగళి నాగేంద్రం గారిలాంటి మహాకవి రాసిన డైలాగుల్ని అంతకంటే అద్భుతంగా చెప్పి మెప్పించిన ఘనత మాత్రం యస్.వి.ఆర్. కె చెందుతుంది. ఆ పాత్ర ఓ రాక్షసుడి పాత్ర. దానిని పాజిటివ్ గా మలచి ఇంచుమించు ఆ చిత్రానికి ఆ పాత్రే హీరో అనిపించేలా ఆ పాత్రలో నటించారాయన. ఆ చిత్రంలోని “వివాహ భోజనంబు వింతైన వంటకంబు’’ పాట లేకుండా ఆ రోజుల్లో దాదాపు ఏ పెళ్ళీ జరిగేది కాదంటే అతిశయోక్తి కాదు. ఆ పాట సీన్లో ఆప్టికల్ వర్క్ తోనే అద్భుతాలు చేశారు. ఆయన శరీరం పెంచి పీటమీద కూర్చోగానే లడ్దూలన్నీ వాటంతట అవే ఆయన నోట్లోకి వెళ్ళటం, ఒక్క లడ్డూలేమిటి అన్ని ఆహార పదార్ధాలూ అలానే ఆయన నోట్లోకి వెళ్ళటం, ఇవన్నీ ఏ గ్రాఫిక్స్ లేకపోయినా, సాంకేతికంగా ఇప్పుడున్నంత అభివృద్ధి లేకపోయినా ఏంటో సహజంగా వాటిని చిత్రీకరించిన తీరు శతధా ప్రశంసనీయం.
ఆ చిత్రంలోనే కృష్ణుణ్ణి కలవటానికి వచ్చిన ఘటోత్కచుడు కొంచెం అహంకరించి, కృష్ణుని చేతిలో భంగాపడే సీన్లో కూడా ఆయన నటన ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక్కడ ఆయనతో పాటు పోటా పోటీగా నటించిన ఒక మహానటీమణి గురించి కూడా మనం గుర్తుచేసుకోవాలి. ఎందుకంటే ఘటోత్కచుడు అప్పుడప్పుడూ శశిరేఖగానూ, శశిరేఖ ఘటోత్కచునిగానూ కనపడతారు. ఈ సన్నివేశాల్లో మహానటి సావిత్రి, యస్.వి.ఆర్.ల మధ్య నటన పరంగా ఉన్న అవగాహన ఎంత గొప్పగా ఉంటుందో మనం ఆ పాత్రలను చూసి ఆనందించాలే తప్ప వాటి గురించి వివరించటం అంత సులభం కాదు. చివరి సీన్లో కౌరవులనందర్నీ ఏడిపించేటప్పుడు ఆయన నటన చాలా గొప్పగా ఉంటుంది.
క్రియేటివ్ డైరెక్టర్ దిగ్రేట్ “బాపు’’ గారి దర్శకత్వంలో వచ్చిన అద్భుత పౌరాణిక చిత్రం “సంపూర్ణ రామాయణం’’ లో రంగారావు గారు తన నట విశ్వరూపాన్ని చూపారు. ఇందులో రామ, రావణ యుద్ధ సమయంలో తన వారంతా ఒక్కొక్కరుగా మరణిస్తుంటే రావణుడు పడే మానసిక వేదన, మానసిక సంఘర్షణ అమోఘం. ఒక రావణాసురునిలో నుండి పదిమంది రావణాసురులు ఒకరి తర్వాత మరొకరు బయటికి రావటం, ఆ వచ్చిన వారిలో సగంమంది మంచి చెప్పటం, సగంమంది రావణుడిలోని చెడుని, దుర్మార్గాన్ని రెచ్చగొట్టటం, వర్ణించేందుకు ఏ భాషకూ మాటలు చాలవు. ఆ శీను ఓ పదినిమిషాలసేపు ఉంటుంది .... ఒక్క రంగారావుగారు పదిమందిగా కనపడినా, మొత్తం స్క్రీన్ అంతా ఆయనే నిండి ఉన్నా ఎంత మాత్రం బోరు కొట్టకుండా, పైపెచ్చు ఎంతో ఆసక్తికరంగా ఉంటుందా శీను. ఆ సీన్లో ఆయన నటనకు ప్రేక్షకులు జేజేలు పలికారు.
ఆయన నట జీవితంలో మరో కలికితురాయి “నర్తన శాల’’ చిత్రంలోని కీచకుని పాత్ర. ఆ చిత్రంలో ఆయన కనిపించే పావుగంట సేపూ నిప్పులు చెరిగారు. ఈ చిత్రంలోని ఆయన నటనకు గాను జెకార్తా ఫిలిం ఫెస్టివల్ లో ఉత్తమ నటుడిగా అంతర్జాతీయ అవార్డుతో పాటు విమర్శకుల ప్రశంసలు సైతం అందుకున్న తోలి తెలుగునటులు శ్రీ యస్.వి.రంగారావు. ఈ చిత్రంలోని తన బృహన్నల పాత్రకోసం శ్రీ రామారావు గారు భరతనాట్యం నేర్చుకుని మరీ నటించారు. ఇక్కడో విషయం మనం గుర్తు చేసుకోవాలి. అప్పుడు శ్రీ రామారావు గారికి హీరోగా మంచి ఇమేజ్ ఉంది. ఆయన శ్రేయోభిలాషులంతా బృహన్నల పాత్ర వేయొద్దని హితువు చెప్పినా, తను నమ్మిన దాని కోసం ఆయన పంతంపట్టి మరీ ఆ పాత్రను పోషించి మెప్పించిన తీరు తెలుగు చలన చిత్ర చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుంది. ఒకరిని మించి మరొకరు నటించి జనంలో తమకంటూ ఓ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్న మహానటులు వారంతా. అందుకే వారు ధన్యజీవులు ....
అసలు రంగారావు గారు సీన్లో ఉండగా మరో పాత్ర కనపడదు. దానికి ఆయన నటన, పర్సనాలిటీ, డైలాగ్ డెలివరీ, హావ, భావ ప్రకటన అవతలి నటుని నటనకు తన రియాక్షన్ ఇలా అనేకానేక విషయాలు కారణాలుగా కనిపిస్తాయి. పాత్ర పోషణ కోసం ఆనాటి నటులు తపన పడేవారు. అందుకు ఎంతగానో కృషి చేసేవారు. అందుకే వారి కీర్తి తెలుగు చలనచిత్ర చరిత్రలో అజరామరంగా నిలిచిపోతుంది. ఆయన నటించిన “తాత మనవడు’’ చిత్రం గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులోకి ఎక్కినా దర్శకరత్న శ్రీ దాసరి నారాయణ రావు గారి తొలిచిత్రం కావటం విశేషం. ఈ చిత్రంలో ఆయన తాతగా, మనసున్న మంచి మనిషి కీర్తి శేషులు శ్రీ రాజబాబు గారు మావడుగా నటించారు. “అనుబంధం ఆత్మీయత అంటా ఒక బూటకం’’ పాటలో రంగారావుగారి నటన హృదయాలను కదిలిస్తుంది. ప్రేక్షకుల్ని కంట తడి పెట్టిస్తుంది.
రంగారావు గారు పోషించిన మరో అత్యద్భుతమైన పాత్ర “కంసుడు’’. “యశోద కృష్ణ’’ చిత్రంలో ఆయన కంసుడిగా చేసిన నటన గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇందులో బాల కృష్ణుడిగా నేటి నటీమణి శ్రీదేవి చాలా చక్కగా నటించింది. ఈ చిత్రం ఆయన నటించిన చివరి పౌరాణిక చిత్రం. చలన చిత్ర చరిత్రలో తెలుగు వారి కీర్తిని పదికాలాల పాటు కాపాడిన నవరస నటనా సార్వభౌమ శ్రీ యస్.వి.రంగారావు ధన్య జీవి. అంతటి మహా నటుడికి నట వారసులు లేకపోవటానికి కారణం ఆయనకు అందరూ ఆడపిల్లలు కావటమే. మళ్ళీ ఆయనే పుట్టి తన పాత్రలను మళ్ళీ మరొకోణంలో చూపించాలే తప్ప మరొకరు ఆ స్థానాన్ని భర్తీ చేయటం అసంభవం. ఆయన ఏ లోకంలో ఉన్నా ఆయన ఆత్మకు శాంతి కలగాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ .... D.M.K.