కేసీఆర్ పై పవన్ పగ తీర్చుకున్నాడా...?

  జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టి ఇప్పటికీ ముడేళ్లు అవుతున్నా గత సార్వత్రిక ఎన్నికల్లో మాత్రం పోటీ చేయలేదు. కానీ ఈ సారి మాత్రం ప్రత్యక్షంగా రాజకీయ బరిలోకి దిగుతున్నారు. ఇక రాజకీయాలు అన్నప్పుడు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం కామన్. అలాగే ఎప్పుడైతే పవన్ పూర్తిస్థాయి రాజకీయాల్లోకి రావాలని ఎప్పుడైతే అనుకున్నారో.. అప్పటినుండి ఇక పవన్ పై కూడా విమర్శలు మొదలుపెట్టారు. అందులో పవన్ కు ఉన్న క్రేజ్ గురించి చెప్పనక్కర్లేదు. అలాంటి పవన్ జనంలోకి వస్తే పరిస్థితి ఎలా ఉంటుంది. అందుకే ఆయనపై కాస్త ఘాటుగానే కామెంట్లు చేస్తున్నారు.   అసలు పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి పనికి రాడని... రాజకీయాలు వేస్ట్ అని.. పార్టీ పెట్టి ఇన్ని సంవత్సరాలు అవుతున్నా.. ఎలాంటి దిశా నిర్దేశం లేదు.. ఒక క్లారిటీ లేదు... అబ్బో ఇలా ఒకటా... రెండా.. ఎన్నో విమర్శలు గుప్పిస్తున్నారు. ఇక తెలంగాణలో పర్యటన కోసం వచ్చిన పవన్ ను అయితే కాంగ్రెస్ ఏకీ పారేసింది. అంతేకాదు ఒకప్పుడు పవన్ తెలంగాణ గురించి ఏం మాట్లాడారు.. ఇప్పుడు ఎలా మాట్లాడుతున్నారు.... అని తేడా చూపిస్తూ మరీ... విమర్శలు గుప్పిస్తున్నారు. అంతేనా.. కేసీఆర్ ను పొగడటంపై కూడా కాంగ్రెస్ విరుచుకుపడుతుంది.   అయితే ఇక్కడే కొంతమంది పవన్ తెలివిని గురించి మాట్లాడుకుంటున్నారు. అంతేకాదు శకుని రీతిలోపవన్, కెసిఆర్ మీద పగ తీర్చుకున్నాడని అనుకుంటున్నారు. రాష్ట్ర విభజన సమయంలో, అంతకు ముందు కెసిఆర్ , పవన్ ల మధ్య మాటల యుద్ధం ఏ స్థాయిలో జరిగిందో అందరికీ తెలుసు. దాంతో పవన్ తెలంగాణకు వ్యతిరేకి అని జనాల్లోకి తీసుకెళ్లారు. ఇక అసలే ఫుల్ ఫైర్ మీద ఉన్న తెలంగాణ వాదులు దీన్ని నమ్మారు. కానీ ఇప్పుడు ఉన్నట్టుండి పవన్ ఏపీని వదిలేసి మరీ.. తెలంగాణలో పర్యటన మొదలుపెట్టేసరికి అందరూ షాకయ్యారు. ఇక ఈ పర్యటనలో పవన్ కేసీఆర్ పై ఒక్క విమర్శ కూడా చేయలేదు. తనపాటికి తాను వచ్చి.. ఏదో సమావేశాలు పెట్టుకొని.. తన కార్యకర్తలతో ముచ్చటించి వెళ్లిపోయారు. అయితే ఇక్కడే అసలు విషయం ఉంది అంటున్నారు. ఏదో పైకి ఈ పర్యటన కెసిఆర్ కి అనుకూలంగా అనిపిస్తోంది... కానీ పవన్ మాటల వల్ల అయితేనేమి, కాంగ్రెస్ ప్రచారం వల్ల గానీ జనసేన మీద కెసిఆర్ అనుకూల ముద్ర పడింది అంటున్నారు. కానీ నిజానికి పవన్ పర్యటనతో తెలంగాణ వ్యతిరేకులకు కెసిఆర్ పెద్ద పీట వేస్తున్నారన్న అభిప్రాయం కలిగింది. నిజానికి ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో అడుగు పెట్టాల్సిన అవసరం పవన్ కు లేదు. ఈవిషయం పవన్ కు కూడా తెలుసు. అయినా పనిగట్టుకుని పర్యటన చేసి కెసిఆర్ వ్యతిరేకులకు తిరుగులేని అస్త్రం అందించారని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే పవన్ శకుని టైపు లో కెసిఆర్ మీద పగ తీర్చుకున్నాడని అంటున్నారు.  మరి ఇందులో ఎంత నిజముందో... ఆ విషయం పవన్ కే ఎరుక...

చంద్రబాబుకి గుడి.. వెండి విగ్రహం..

  సాధారణంగా సినిమా వాళ్లకి అభిమానులు గుడి కట్టడం చూశాం. మన తెలుగులో తక్కువ కానీ..తమిళనాడులో ఖుష్బూకి దేవాలయం కట్టారు. ఆ తరువాత నమిత, నయనతారకు కూడా గుడి కట్టాలని అనుకున్నారు. అయితే ఇది సినిమా పరిశ్రమ వరకే సాధ్యం. కానీ రాజకీయాల్లో ఓ వ్యక్తికి గుడి కట్టాలని అనుకోవడం చాలా గొప్ప విషయమే. ఇంతకీ ఆ వ్యక్తి ఎవరనుకుంటున్నారా..? ఎవరో కాదు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. మరి చంద్రబాబుకు గుడి కట్టేది ఎవరనుకుంటున్నారా..? వారెవరో కాదు హిజ్రాలు.. హిజ్రాలు ఏంటి.. చంద్రబాబుకు గుడి కట్టడం ఏంటనుకుంటున్నారా..? అసలు సంగతేంటంటే...   హిజ్రాలంటే ప్రజల్లో ఎలాంటి అభిప్రాయం ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సమాజంలో వారిపై అందరికీ చిన్నచూపే ఉంటుంది. అందుకే వూరికే వారి మీద చిరాకు పడుతుంటారు. ఇక వారికి ఉద్యోగాలు ఇవ్వాలన్నా ఆలోచిస్తుంటారు. అందుకే ఏం చేయలేక వారు అడుక్కునే పరిస్థితి వారిది. అలాంటి వారికోసం ఏపీ ప్రభుత్వం చేయూత నిచ్చింది. వారికోసం సంక్షేమ బోర్డును ఏర్పాటు చేసింది. వారికి రేషన్ కార్డ్, ఇళ్లు, ప్రతి నెల రూ. 1500 పింఛను, చదువుకున్న హిజ్రాలు వ్యాపారం చేసుకోవడానికి బ్యాంకు రుణాలు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది.   దీంతో చంద్రబాబుపై హిజ్రాలు ప్రశంసలు గుప్పిస్తున్నారు. ఈ సందర్భంగా సంక్షేమ సంఘం నాయకుడు విజయ్ కుమార్ మాట్లాడుతూ.. చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ఈ ప్రభుత్వం తమను మనుషులుగా గుర్తించిందని.. అందుకే ఆయనకు గుడిని నిర్మించాలనుకుంటున్నామని అన్నారు. నంద్యాల నుండి మహానంది వెళ్లే దారిలో గుడిని నిర్మించాలనుకుంటున్నామని... ఇప్పటికే స్థలం కూడా సేకరించామని.. ఆలయంలో వెండి విగ్రహం ఏర్పాటు చేయాలనుకుంటున్నామని తెలిపారు. మొత్తానికి రాజకీయ నేతలంటే తమ స్వార్ధం మాత్రమే చూసుకుంటారు అన్న పరిస్థితులు ఉన్న నేపథ్యంలో..  ఓ నేతకు గుడి కట్టడం అంటే మామూలు విషయం కాదు. మరి చంద్రబాబులాంటి వ్యక్తులు దానికి అతీతంగా ఉండటం ఆనందించాల్సిన విషయమే.

మోడీజీ.. ఈ మాత్రం అయినా చేస్తున్నారు...

  రెండు తెలుగు రాష్ట్రాలకు ప్రధాని మోడీ ఏం చేసినా.. చేయక పోయినా ఓ విషయంలో మాత్రం రెండు రాష్ట్రాలకు కాస్త ఊరట కలిగించే పని ఒకటి చేయనున్నారు. ఇంతకీ అదేంటనుకుంటున్నారా...? అదే అసెంబ్లీ సీట్ల పెంపకం. రెండు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల పెంపకంపై ఎప్పటినుండో వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ విషయంపై ఎన్నో సార్లు మోడీతో మన ఇద్దరు చంద్రులు గత కొద్దికాలంగా చర్చిస్తూనే ఉన్నారు. అయితే ఇప్పుడు తాజాగా  ఈ విషయంలో మొదటి అడుగు పడినట్టు తెలుస్తోంది.   తెలుగు రాష్ట్రాల్లో నియోజకవర్గాల పునర్‌వ్యవస్థీకరణకు సంబంధించిన ఫైలు కేంద్ర హోం శాఖ కొంత సమాచారం కోరుతూ కేంద్ర ఎన్నికల కమిషన్‌కు తాజాగా పంపినట్టు తెలుస్తోంది. నియోజకవర్గాల పునర్విభజన చేపడితే ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల అమలుపై ఈసీ తన అభిప్రాయం చెప్పాలని అందులో కోరింది. ఇక దీనిపై ఎన్నికల కమిషన్‌ తన అభిప్రాయం 3-4 రోజుల్లో చెప్పనుంది. ఆ అభిప్రాయం వచ్చాక మరో 4 శాఖలకు కూడా హోం శాఖ ఇటువంటి లేఖలు రాయాల్సి ఉంది. వారి నుండి సమాధానాలు వచ్చాక అన్నిటినీ కలిపి ఓ నిర్ణయానికి వస్తారు. వాటిని ప్రధాని ఆఫీసు ఆమోదించాక దీనిని కేంద్ర మంత్రివర్గ సమావేశం ముందు పెడతారు. ఒకసారి కేబినెట్‌ ఆమోదంతో అది పార్లమెంటు ముందుకు వెళ్తుంది. ఇక అక్కడ కూడా ఈ ప్రతిపాదనకు ఆమోదం లభిస్తే ఇద్దరు చంద్రుల కోరిక తీరినట్టే. మరి ఈ ప్రాసెస్ అంతా జరగాలంటే మరి కొంత సమయం పడుతుంది కదా. ఒకవేళ కేబినెట్ ఆమోదం లభించినా పార్లమెంట్లో ఆమోదం లభించాలి కదా..? మరి ఏం జరుగుతుందో.. వచ్చే ఎన్నికల లోపు ఈ ప్రక్రియ ముగుస్తుందో లేదో... చూద్దాం...

మోడీకి బాబు కట్టుకున్న పెళ్లాం.. జగన్ ఉంచుకున్న పెళ్లాం..

  బాబు కట్టుకున్న పెళ్లాం.. జగన్ ఉంచుకున్న పెళ్లాం.. అదెంటీ అనుకుంటున్నారా...? సీపీఐ నేత రామకృష్ణ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇందులో నిజం కూడా లేకపోలేదు. ఎందుకుంటే.. ప్రస్తుతం ఏపీలో బీజేపీ-టీడీపీ మిత్రపక్షంగా ఉన్న సంగతి తెలిసిందే కదా. అయితే రెండు పార్టీలు మిత్ర పక్షంగా ఉన్నప్పటికీ.. ఈ రెండు పార్టీల మధ్య కోల్డ్ వార్ నడుస్తూనే ఉంది. దీంతో వచ్చే ఎన్నికల్లో పొత్తుపై కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.  ఇక ఎప్పుడు టీడీపీ పక్కకు తప్పుకుంటుందా.... ఎప్పుడు మధ్యలో దూరదామా అని వైసీపీ పార్టీ చూస్తుంది.   అంతేనా ఇప్పటికే వైసీపీ-బీజేపీ మధ్య పొత్తు కుదిరే అవకాశాలు ఉన్నాయన్న వార్తలు వస్తున్నాయి. గతంలో జగన్ కు అపాయింట్ మెంట్ ఇచ్చి... చంద్రబాబుకు ఇవ్వనప్పుడే ఈ వార్తలు వచ్చాయి. ఆ తర్వాత నంద్యాల, కాకినాడ ఎన్నికల తరువాత బీజేపీకి ఉన్న పొగరు కాస్త దిగిపోయి...జగన్ తో పొత్తుకు కాస్త వెనుకడుగు వేసిందనే చెప్పొచ్చు. అయితే ప్రస్తుతానికి ఏదో బీజేపీతో సఖ్యతగానే ఉంటున్నా ఎన్నికల సమయం దగ్గరకొస్తున్న కొద్దీ ఈ స్నేహం ఎంతవరకూ ఉంటుందో తెలియని స్థితి ఉంది. దీనిపై చంద్రబాబు సడెన్ గా నిర్ణయం తీసుకునే స్థితిలో కూడా లేరు.   ఇక ప్రతిపక్ష వైసీపీ పరిస్థితి కూడా ఇంచుమించు అంతే.. కేంద్రంతో సఖ్యతగా ఉందామని ఆ పార్టీ అధినేత వైఎఎస్ జగన్ మొదటి నుంచి ప్రయత్నిస్తున్నారు. బీజేపీ నుంచి టీడీపీ వేరయితే తాను ఆ స్థానం భర్తీ చేయాలన్న ఆలోచన కూడా వైసీపీలో కనిపిస్తోంది. అందుకే రాష్ట్రపతి ఎన్నిక వంటి వాటిలో ఏమాత్రం మొహమాటం లేకుండా బీజేపీకి మద్దతిచ్చింది. దీనికి కారణం ఆయనపై ఉన్న కేసుల నుంచి బయటపడాలని చూడటమే. ఎలాగోలా బీజేపీ మెప్పు పొందాలని కేంద్రంలో ఉన్న బీజేపీని మచ్చిక చేసుకుంటే ఏమైనా ప్రయోజనం ఉంటుందేమోనన్నది ఆయన ఆలోచన.   ఈ క్రమంలో జగన్, చంద్రబాబు వైఖరిపై విపక్షాలు తప్పుబడుతున్నాయి. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీతో స్నేహం కోసం టీడీపీ, వైసీపీ ప్రయత్నిస్తూ.. రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నాయని సీపీఐ పార్టీ ఆరోపిస్తోంది. ఈ సందర్భంగా ఆ పార్టీ నేత రామకృష్ణ మాట్లాడుతూ....ప్రధాని నరేంద్ర మోడీకి చంద్రబాబు కట్టుకున్న పెళ్లాంలా వ్యవహరిస్తుంటే.. వైఎస్ జగన్ ఉంచుకున్న పెళ్లాంలా వ్యవహరిస్తున్నారని ఆయన మండిపడ్డారు. జగన్ తనపై ఉన్న కేసులను మాఫీ చేయించుకునేందుకే బీజేపీతో దోస్తీకి ప్రయత్నిస్తుంటే.. ఇక చంద్రబాబును నోటుకు ఓటు కేసు భయపెడుతోందని ఆయన అన్నారు. మరి చూద్దాం ఎన్నికల సమయానికి ఎవరు ఎవరితో దోస్తీ కడతారో..? ఎవరు సింగిల్ గా బరిలోకి దిగుతారో..?

ఎప్పుడూ అదే ఏడుపా...

  ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పట్టిసీమ ప్రాజెక్టును ఎప్పుడైతే తెరపైకి తీసుకువచ్చారో అప్పటినుండి.. ఈరోజు వరకూ దానిపై ఏడుస్తూనే ఉన్నారు వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి అండ్ కో బ్యాచ్. ఏదో ఈ ప్రాజెక్ట్ ద్వారానే కోట్లకి కోట్లు నొక్కేశారు అన్నట్టు మాట్లాడుతుంటారు ఎప్పుడు చూసినా. అసలు వాళ్లకి పట్టిసీమ ప్రాజెక్ట్ మీద కోపమా...లేక చంద్రబాబు మీద కోపమా.. లేక రైతుల మీద కోపమా...? వారికే తెలియాలి. ఎందకంటే ఈ పట్టిసీమ ప్రాజెక్టు వల్ల రైతులకు కలిగే లాభాలేంటో తెలిస్తే ఇలా మాట్లాడరు.   ఈ రోజున, కృష్ణా డెల్టా రైతులు కాని, గుంటూరు, ప్రకాశంలో కొంత లెక్క రైతులు కాని సంతోషంగా ఉన్నారు అంటే, నాలుగు ముద్దలు తింటున్నారు అంటే అది పట్టిసీం చలవే అని చెప్పొచ్చు. నాగార్జున సాగర్ నుండి ఎంత నీరు వస్తుందో... అది రైతులకు ఎలా ఉపయోగపడుతుందో కాస్త పరిజ్ఞానం ఉన్నవాళ్లకి ఎవరికైనా అర్ధమవుతుంది. అయినా ఇప్పటికీ ఇప్పటికీ పట్టిసీమ దండుగ అంటాడు జగన్. ఇప్పుడు ఆయనతో పాటు వైసీపీ నేత, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి కూడా తయారయ్యాడు. అసలు కృష్ణ, గోదావరి డెల్టా రైతుల కోసం పట్టిసీమ ద్వారా ఇంత ఖర్చు అవసరమా? అని ప్రశ్నించాడు... ఇంత ఖర్చు ఎందుకు పెడుతున్నారు... ఈ పట్టిసీమ అసలు ఎందుకు కట్టారో చెప్పండి అంటూ అర్ధంలేని ప్రశ్నలు వేశాడు.   ఇక ఈయన మాటలకు నవ్వుకోవాలో.. కోప్పడాలో కూడా తెలియటం లేదు అంటున్నారు కొంతమంది. అంతేకాదు... అయ్యా రాజేంద్ర ఆ ఖర్చు కేవలం డెల్టా రైతుల కోసమే పెట్టలేదు, దానివల్ల ఆదా అయిన నీటిని రాయలసీమ జిల్లాకే తరలించారు.... షుమారు 150 టియంసి నీరు సీమ రైతాంగంకి ఇచ్చారు అని అంటున్నారు. అంతేకాదు... మీ నాయకుడు పాదయాత్ర చేస్తున్నారు కదా. అక్కడ పచ్చని పొలాలు చూస్తుంటే కూడా అర్ధమవ్వడంలేదా..   మూడేళ్ళు అయినా, మీకు ఇప్పటికీ పట్టిసీమ అంటే ఏంటో తెలియకపోవటం దురదృష్టకరం అంటున్నారు. మెచ్చుకోకపోయినా పర్వాలేదు కానీ.. ఇలా విషయం తెలుసుకోకుండా.. ఎంతసేపు ఇంతలా రైతులని ఆదుకున్న పట్టిసీమ మీద, నిత్యం ఏడుస్తూనే ఉంటే ఏం ఉపయోగం ఉండదు.

హిందూ మహిళగా భర్తకు వీర తిలకం దిద్దిన అన్నా

హిందూ సాంప్రదాయంలో భర్త ఎక్కడికైన వెళుతున్నప్పుడు భార్య మంగళహారతి ఇచ్చి.. వీరతిలకం దిద్ది.. ఎదురురావడం తరతరాలుగా వస్తోంది. పాశ్చాత్య సంస్కతి భారతీయతపై ఎంతగా ప్రభావం చూపిస్తున్పప్పటికి భారతీయులు తమ మూలాలు మరిచిపోవడం లేదు అనడానికి నిత్యం ఎన్నో సంఘటనలు జరుగుతున్నాయి. అయితే పరాయి దేశానికి చెందిన మహిళకు భారతీయ సాంప్రదాయం గురించి తేలియడం.. తెలిసినా ఆచరించడం చాలా కష్టం. అయితే ఈ విషయంలో సినీనటుడు పవన్‌కళ్యాణ్ భార్య అన్నాలెజ్‌నోవాకి మార్కులు వేయొచ్చు.   పవన్ భార్య అన్నాలెజ్‌నోవా ఉక్రెయిన్‌కు చెందిన మహిళ. ఆమెకు హిందూ సాంప్రదాయాల గురించి అవగాహన తక్కువ. అయితే మూడు రోజుల పాటు తెలంగాణలోని మూడు జిల్లాల్లో పర్యటించేందుకు పవన్ నిర్ణయించారు. ఇవాళ ఉదయం యాత్రకు బయలుదేరే ముందు భారతీయ సాంప్రదాయాల గురించి పెద్దగా అనుభవం లేకపోయిన్పటికీ.. భర్తకు మంగళ హారతీ ఇచ్చి.. వీరతిలకం దిద్దారు. అలాగే జనసేనాని ఎక్కబోతున్న కారుకు దిష్టి తీసి కొబ్బరికాయ కొట్టారు..   అయితే కొబ్బరి కాయను కారు చుట్టూ ఎలా తిప్పాలి..? ఎలా కొట్టాలన్న దానిపై పవన్ ఆమెకు సైగలు చేశారు. అన్నా కొబ్బరికాయ తిప్పుతుంటే  పవన్.. ముసి ముసి నవ్వులతో చూస్తూ నిలబడ్డారు. దిష్టి తీసిన తర్వాత ఆమె కొబ్బరికాయను నేలకేసి కొట్టగా.. అది పగల్లేదు.  దీంతో నవ్వుకున్న పవర్‌స్టార్ మరోసారి కొట్టమని సూచించారు. ఈసారి ఆమె గట్టిగా కొట్టడంతో అది పగిలింది.. ఈ తతంగమంతా మీడియాకు చిక్కడంతో.. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

తెలంగాణలో పవన్ యాత్ర.. షెడ్యూల్ ప్రకటించిన జనసేనాని

2019 ఎన్నికలు దగ్గరపడుతుండటతో తెలుగు రాష్ట్రాల్లో పొలిటికల్ పార్టీలు కసరత్తులు ప్రారంభించాయి. అభ్యర్థుల ఎంపికలు, ప్రచారాస్త్రాలు సిద్దం చేసుకుంటున్నాయి. ఈ లోగా జనం దృష్టిని తమ వైపు మరల్చుకోవడానికి పార్టీల అధినేతలు పావులు కదుపుతున్నారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఇప్పటికే పాదయాత్ర చేస్తుండగా.. ఇప్పుడు ఆ లిస్ట్‌లోకి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేరారు. రేపటి నుంచి మూడు రోజుల పాటు తెలంగాణలోని మూడు జిల్లాల్లో తాను పర్యటిస్తున్నట్లు ఆయన తెలిపారు.   రేపు కొండగట్టు ఆంజనేయస్వామిని దర్శించుకుని.. అనంతరం యాత్ర మొదలు పెట్టనున్నట్లు పవన్ చెప్పారు. ఆ తర్వాత తమ కార్యకర్తలతో చర్చలు జరిపి తెలంగాణలో ఎక్కడెక్కడ ఎలా పర్యటన చేయాలన్నది మళ్లీ కొండగట్టు వచ్చి పూర్తి యాత్ర వివరాలను వెల్లడిస్తానన్నారు.   కేవలం ప్రజా సమస్యల అధ్యయనం కోసమే యాత్ర చేస్తున్నానని.. పాదయాత్రలో ఎక్కువ మందిని కలిసే అవకాశం ఉండదని అన్నారు. పాదయాత్ర, బస్సుయాత్ర, రోడ్‌షో ఇలా వీలున్న మార్గంలో ప్రజలను కలుస్తానని జనసేనాని స్పష్టం చేశారు. 2009 ఎన్నికల ప్రచార సమయంలో జరిగిన ప్రమాదంలో తాను బయటపడటానికి కొండగట్టు ఆంజనేయస్వామే కారణమన్నారు. తమ ఇలవేల్పు ఆంజనేయస్వామి కావడం వల్లే యాత్రను కొండగట్టు నుంచి ప్రారంభించనున్నట్లు తెలిపారు.

రిపబ్లిక్ సర్వేలు...ఇంత కామెడీనా...!

  ఇప్పటికీ ఇప్పుడు ఏపీలో ఎన్నికలు జరిగితే ఎక్కువ మెజార్టీ సీట్లు వైసీపీకి వస్తాయని చెప్పి జగన్ సీఎం కలను నిజం చేశారు. ఇంతకీ ఈ సర్వే చేసింది ఎవరో కూడా తెలియదు. సాధారణంగా ఇక్కడ పీకే జగన్ పార్టీ పరిస్థితి ఏంటీ.. ప్రజలకు పార్టీపైన ఎలాంటి అభిప్రాయం ఉంది అని ఎప్పటికి ఎప్పుడు సర్వేలు చేస్తూ చెబుతుంటారు. ఇక ఇప్పటివరకూ చేసిన సర్వేల్లో ఎప్పుడూ.. జగన్ కు పాజిటివ్ టాక్ మాత్రం రాలేదు. కానీ ఇక్కడ కాదు ఎక్కడో రిపబ్లిక్ టీవీ చేసిన సర్వేలో మాత్రం  ఏకంగా జగన్ ను సీఎం చేసేశారు. ఇప్పుడు తాజాగా తమిళనాడు రాజకీయాలపై కూడా సర్వేచేసి పలు ఆసక్తికర విషయాలు బయటపెట్టారు.   అర్నబ్ సొంతంగా పెట్టిన ఛానల్ రిపబ్లిక్ టీవి. ఆయనకు ఏమైందో మరి... ఉత్తరాది వదిలేసి దక్షిణాదిన సర్వేలు మొదలుపెట్టారు. ఏపీలో జగన్ కు ఎక్కువ స్థానాలు వస్తాయి అని చెప్పిన రిపబ్లికి టీవి.. ఇప్పుడు తమిళనాడులో కనుక ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే రజనికి తమిళనాట 23 లోక్ సభ స్థానాలు వస్తాయని తేల్చింది.  డీఎంకే 14 , అన్నాడీఎంకే రెండు చోట్ల గెలుస్తారట.  మొత్తం ఓట్లలో 33 శాతానికి పైగా రజనికి మద్దతు ఇస్తారని కూడా రిపబ్లిక్ , సి ఓటరు సర్వే లో వెల్లడి అయ్యింది. దీంతో ఒకపక్క రజనీ ఆభిమానులు ఆనంద పడుతున్నా.. రజని పార్టీ కూడా అనౌన్స్ చేయకముందే ఇప్పటికిపుడు ఎన్నికలు వస్తే ఆయన పార్టీ మెజారిటీ సీట్లలో గెలుస్తుందని చెప్పడాన్ని తమిళ నేతలు ప్రశ్నిస్తున్నారు. అంతేకాదు రిపబ్లిక్ టీవీ మీద ఉన్న మోడీ అనుకూల ముద్ర కూడా ఈ సందేహాలకు ప్రధాన కారణం.   ఇదిలా ఉండగా ఇక్కడ లోకల్ ఛానళ్లు కూడా అంతలా పట్టింకోని విషయాన్ని.. ఎక్కడో ఉన్న రిపబ్లికి టీవి ఛానల్ అంత స్పెషల్ గా దక్షిణాది రాష్ట్రాలపై సర్వే చేయడం చాలా ఆశ్చర్యకరంగా ఉంది. ఎలాగూ వచ్చే సంవత్సరం ఏపీ లో సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నాయి. ఇక తమిళనాడులో ఎన్నికలు అయిపోయినా.. ఆ తరువాత జయలలిత మరణించడం...ఆతరువాత రాష్ట్రంలో రాజకీయ సంక్షోభం ఏర్పడటం...ఎన్నో ట్విస్టులు తరువాత ప్రభుత్వం ఏర్పడటం జరిగింది. మళ్లీ అటూ ఇటూ ఏమైనా జరిగినా... మొదటికే మోసం వస్తుంది. అంతేకాదు కొద్ది రోజుల్లో మూడు దక్షిణాది రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి. మరి ఈ రాష్ట్రాల్లో కూడా రిపబ్లిక్ టీవి సర్వేలు నిర్వహిస్తుందేమో. ఎందుకంటే.. ఉత్తరాదితో పోల్చుకుంటే దక్షిణాదిన బీజేపీకి అంత సీన్ లేదన్న సంగతి వారికి కూడా తెలుసు. అందుకే.. ఇలాంటి సర్వేలు చేసి కాస్త హడావుడి చేస్తున్నారని.. ఈ సర్వేల వెనుక మోడీ హస్తం ఉందన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. మరీ కామెడీ కాకపోతే ఏంటీ ఈ సర్వేలు...

కోర్టు దగ్గరే నిలదీసిన రాధా...తడబడ్డ జగన్...

గత కొద్దిరోజులుగా విజయవాడ రాజకీయాల్లో వంగవీటి రాధా పార్టీ మార్పుపై హాట్ టాపిక్ నడుస్తున్న సంగతి తెలిసిందే. రాధా టీడీపీలో చేరేందుకు సిద్దంగా ఉన్నారని.. టీడీపీ పెద్దలతో ఇప్పటికే చర్చలు కూడా జరిగాయని.. ఇంక డేట్ ఫిక్స్ చేయడమే తరువాయి అన్నట్టు వార్తలు వచ్చాయి. ఇక ఈ మాటలకు స్పందించిన రాధా.. ఈ మాటలను అయితే ఖండించలేదు కానీ.. కర్ర విరగలేదు.. పాము చావలేదు అన్నట్టు సామెతలాగ మాట్లాడారు. దేనికైనా సమయం రావాలని...” నా పని నేను చేసుకుని వెళ్తున్నా.. పార్టీ మారాలని భావిస్తే పక్కా ప్రణాళికతోనే వెళ్తా. నా రాజకీయ భవిష్యత్ గురించి నాకు తెలుసు. పార్టీ మారాలని భావిస్తే కంగారు పడకుండా ఆలోచించి నిర్ణయం తీసుకుంటా ” అని ఆయన చెప్పారు. తనకు టీడీపీ నేతల్లో బంధువులు, స్నేహితులు ఉన్నారని, వారితో కలుస్తుంటానని... ప్రతి సంబంధాన్నీ రాజకీయాలతో ముడిపెట్టరాదన్నారు. చిన్న చిన్న పదవులు ఆశించి పార్టీ మారబోనని, ఎమ్మెల్యేగా పని చేసిన తనకు ఎమ్మెల్సీ ఎందుకని ఆయన ప్రశ్నించారు.   అసలు ఈ వార్తలు రావడానికి కారణం ఆయన వైసీపీ పై ఇప్పటికే అసంతృప్తితో ఉండటం.. తగిన ప్రాధాన్యత ఇవ్వకపోవడం.. జగన్ తీరే కారణాలు. దానికి తోడు ఇప్పుడు  విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం టికెట్‌ను మల్లాది విష్ణుకు ఇచ్చేందుకు జగన్ సిద్ధపడడంతో రాధా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీని కారణంగానే రాధా టీడీపీలో చేరుతున్నట్టు వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ కోర్టుకు వచ్చిన అధినేత జగన్ తో వంగవీటి రాధా భేటీ అయ్యారు. కోర్టు దగ్గరే రాధా జగన్ ను గట్టిగా అడిగినట్టు తెలుస్తోంది. ఆది నుంచి పార్టీని నమ్ముకున్న తనని కాదని కొత్తగా పార్టీలోకి వచ్చిన వారికి ప్రాధాన్యం ఇవ్వడం ఎంతవరకు సమంజసం అని రాధా నేరుగా అధినేతని అడిగారంట. అంతేకాదు.. తనకు హామీ ఇవ్వాలని రాధా గట్టిగా కోరినట్టు తెలుస్తోంది. ఏకంగా కోర్టు దగ్గరే రాధా గట్టిగా నిలదీయడంతో.. దానికి జవాబు ఏం ఇవ్వాలో కూడా తెలియక జగన్ ఇబ్బందిపడ్డాడట. అంతేకాదు... రాధా అడిగినట్టు సెంట్రల్ మీద జగన్ స్పష్టమైన హామీ ఇవ్వకుండానే భేటీ ముగియడంతో... రాధా మరింత అసంతృప్తికి గురయ్యారట. దీంతో రాధా టీడీపీ లో చేరేందుకు వెనుకాడరన్న టాక్స్ కూడా వినిపిస్తున్నాయి. మరి జగన్ రాధాని బుజ్జగిస్తారా..?లేక పోతే పోని వదిలేస్తారా.. ?చూద్దాం ఏం జరుగుతుందో..

హైదరాబాద్ నిల్.. ఏపీ ఖజానా ఫుల్..

  సరదాకి అన్నారో.. లేక  సీరియస్ గా అన్నారో తెలియదు కానీ నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు రాజీవ్ కుమార్ బలే మాట అన్నారు. ఇంతకీ ఆ మాట ఏంటనుకుంటున్నారా..? హైదరాబాద్ ఉన్న వారంతా ఏపీకి తిరిగివస్తే రాష్ట్రానికి ఎలాంటి ఆర్ధిక సమస్యలూ ఉండవని. ఇంతకీ ఆయన ఆ మాట ఎందుకన్నారంటే.. సంక్రాంతి పండుగ రోజు హైదరాబాద్ ఎలా ఉంటుందో అందరికీ తెలుసు. రోడ్లన్నీ ఖాళీగా, ఎక్కడా జనాలు లేక, హోటళ్లు అన్నీ ఖాళీగానే ఉంటాయి. ఎందుకంటే హైదరాబాద్ లో 40శాతం మంది ఆంధ్రావారే ఉంటారు కాబట్టి. ఇక ఆంధ్రావారికి సంక్రాంతి పెద్ద పండుగ కాబట్టి హైదరాబాద్ లో ఉన్న వారందరూ ఏపీకి వెళతారు. దాదాపు అందరూ తమ సొంత ఊళ్లకు వెళతారు కాబట్టి.. హైదరాబాద్ మొత్తం ఖాళీ అయిపోతుంది.   ఇక దీనిపైనే రాజీవ్ కుమార్ స్పందించి హైదరాబాద్ లో 40 శాతం మంది ఏపీ వాళ్లే ఉన్నారు. పన్ను చెల్లించేవాళ్లలో 40శాతం మంది ఆంధ్రావాళ్లే ఉన్నారు. వాళ్లంతా తిరిగి ఏపీకి వస్తే ఖజానాకు ఎలాంటి కష్టాలు ఉండవు. అంతేకాదు మీరే మిగిలిన వారికి సహకరించే పరిస్థితికి ఎదుగుతారు అని అన్నారు. సంక్రాంతిని తెలంగాణలో పెద్దగా చేసుకోరు. అధికంగా చేసుకునేది ఆంధ్రాలోనే... అందుకే హైదరాబాద్ మొత్తం ఖాళీ అయిపోతుంది. సినిమావాళ్లు, జాబ్స్ చేసేవాళ్లు, బిజినెస్ చేసేవాళ్లు, కాంట్రాక్టర్లు అందరూ ఆంధ్రావారే. ఈరోజు హైదరాబాద్ మిగులు బడ్జెట్ రాష్ట్రంగా ఉందంటే దానికి కారణం ఏపీ వారే అని చెప్పడంలో ఎలాంటి సందేహం అవసరం లేదు. మరి అలాంటి వారిని తెలంగాణ ప్రభుత్వం ఏపీ వాళ్లు అని చూడకుండా కాస్త గౌరవంగా చూసుకుంటే బావుంటుందని అభిప్రాయపడుతున్నారు. మరి కేవలం ఒక్క పండుగ రోజే హైదరాబాద్ పరిస్థితి ఇలా ఉంటే..ఇంక ఏపీ వాళ్లు మొత్తానికే ఖాళీ చేసి వెళిపోతే పరిస్థితి ఇంకేలా ఉంటుందో. ఇప్పుడు మిగులు బడ్జెట్ అని సంకలు గుద్దుకుంటున్న తెలంగాణ పరిస్థితి ఎలా ఉంటుందో..?

జగన్ ను సీఎం చేసిన అర్నబ్...

  ఏపీలో ప్రతిపక్ష నేతగా ఉన్న వైసీపీ జగన్ మోహన్ రెడ్డి ప్రస్తుతం ప్రజా సంకల్పం పేరుతో పాదయాత్ర చేస్తూ బిజీబిజీగా ఉన్నసంగతి తెలిసిందే కదా. అయితే ఆ విషయం ఆ పార్టీ నేతలకు.. ఆయన ఛానల్ కు తప్పా ఇంకెవరికీ తెలియని పరిస్థితి ఏర్పడింది. ఒకపక్క ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను పోగొట్టుకోవడానికి.. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా అధికారం చేపట్టి సీఎం అవ్వాలని కలలు కంటున్నారు. ఇక ఆయన కలల్లో ఆయన ఉండగా.. ఆ కలల్లో పీకే తన సర్వేల ద్వారా అప్పుడప్పుడు నీళ్లు పోస్తూనే ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో జగన్ అనుకున్న రీతిలో సీట్లు రావని... ముఖ్యంగా తాము కంచుకోటగా భావించిన రాయలసీమలో కూడా జగన్ కు షాక్ తగలక తప్పదు అని ఆయన సర్వేల్లో తేలిన విషయాలే. దీనికి ఏం చేయాలా అని జగన్ అండ్ కో బ్యాచ్ తిప్పలు పడుతుంటే... ఇప్పుడు మరో సర్వే జగన్ కు షాక్ ఇచ్చింది.   అయితే ఈసారి మంచి షాకే తగిలింది. కానీ సర్వే చేసింది పీకే కాదు. ఏకంగా ఓ జాతీయ ఛానలే ఏకంగా సర్వే చేసింది. రిపబ్లిక్ ఛానల్ సర్వే చేసింది. రిపబ్లిక్ ఛానల్ అధినేత పాపం జగన్ బాధ చూసి తట్టుకోలేక, జగన్ ను కనీసం తన ఛానల్ లో అయినా సియం చెయ్యాలి అని అనుకున్నారేమో..  నిన్న ఒక సర్వే అంటూ హడావిడి చేశాడు. ఇక ఈ సర్వేలో కొన్ని భయంకరమైన విషయాలే చెప్పారు అర్నబ్ గారు. మనరాష్ట్రంలో కనుక ఇప్పటికి ఇప్పుడు ఎన్నికలు జరిగితే... 25 ఎంపీ సీట్లలో, జగన్ పార్టీకి 13 సీట్లు వస్తాయి అని చెప్పాడు. అంతేకాదు... అసెంబ్లీ స్థానాల్లో ఖచ్చితంగా మెజార్టీ మార్కు దాటుతుందని అర్నబ్ గారు చెప్పారు.   ఇది నిజంగా జగన్ కు షాక్ తగలడం ఏమో కానీ.. మిగిలిన వారికి మాత్రం పెద్ద షాకే తగిలింది. ఎందుకంటే ఇక్కడ జగన్ పరిస్థితి ఏంటో అందరికీ తెలుసు.  అసలు జగన్ అనే వాడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఉన్నాడని జనం మర్చిపోయి చాలా రోజులు అయ్యింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో కడప పార్లమెంట్ తప్ప, ఎక్కడా కన్ఫర్మ్ సీట్ లేదు... అటు తిప్పి, ఇటు తిప్పి చూసినా, మహా అయితే 3 నుంచి 5 సీట్లు వస్తాయి అనేది ఇక్కడ ఉన్న వారి అంచనా... అలాంటిది ఏ ప్రాతిపదికన 13 వస్తాయి అంటున్నాడో అర్నబ్ కే తెలియాలి అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.   ఇవన్నీ ఇలా ఉంటే ఇప్పుడు మరో ఆసక్తికరమైన అంశం బయటకొచ్చింది. రిపబ్లిక్ టీవీని మోడీ సపోర్ట్ ఛానల్ గా అంటుంటారు. అన్ని రాష్ట్రాల్లో NDAకి అనుకూలంగా సర్వే చెప్పిన అర్నబ్, మన రాష్ట్రంలో మాత్రం జగన్ కు అనుకూలంగా చెప్పాడు... దీంతో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీని వెనుక బీజేపీ పెద్దల ఆలోచన ఎమన్నా ఉందా ? అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు. దానికి తోడు అసలు ఇదొక సర్వే.. దీనికి జగన్ హ్యాపీగా పీలవడం చాలా కామెడీగా ఉందని అన్నారు.

చాలా సైలెంట్ గా బీజేపీకి షాకిచ్చారుగా..

  గత కొద్దిరోజులుగా తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ విషయంలో పెద్ద దుమారం రేగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ విషయంలో బీజేపీ చేస్తున్న హంగామాకి చంద్రబాబు చెక్ పెట్టినట్టు తెలుస్తోంది. అది కూడా చాలా సైలెంట్ గా ఈ వ్యవహారానికి ఫుల్ స్టాప్ పెట్టినట్టు తెలుస్తోంది. న‌ర‌సింహ‌న్ తీరు స‌రిగా లేద‌నీ, తెలంగాణ ప‌క్ష‌పాతిగా వ్య‌వ‌హ‌రిస్తూ.. తెలంగాణ రాష్ట్రానికి వత్తాసు పలుకుతూ.. ఏపీ పట్ల సవతి తల్లి ప్రేమ చూపుతున్నారంటూ నరసింహన్ మీద బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ మండిపడ్డారు. ఇక ఎంపీ హరిబాబు ఒక అడుగు ముందుకేసి ఏకంగా కేంద్రానికే లేఖ రాశారు. దీంతో ఈ లేఖను కేంద్రం సీరియస్ గా తీసుకుందని.. దీనిపై కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తుందని... నరసింహన్ కి బరువు తగ్గించే యోచనలో వున్న కేంద్ర ప్రభుత్వం.. ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోందని.. ఆంధ్రప్రదేశ్ కి కొత్త గవర్నర్ ఎంపిక దాదాపు పూర్తయినట్లేనని, వారంపది రోజుల్లో ప్రకటన వెలువడవచ్చని వార్తలు హల్ చల్ చేసిన సంగతి తెలిసిందే కదా.   దీంతో బీజేపీ చేసిన హంగామాకు.. వచ్చిన వార్తలను బట్టి నిజంగానే ఏపీకి ప్రత్యేకంగా కొత్త గవర్నర్ వస్తాడేమో అని భావించారు. బడ్జెట్ సమావేశాల లోపు ఈ విషయంలో కేంద్రం నిర్ణయం తీసుకుంటుందనే ఊహాగానాలు కూడా వినిపించాయి. ఇక్కడి వరకూ ఒకటైతే... అసలు ఈ గవర్నర్ వివాదంలో ఇప్పటివరకూ చంద్రబాబు స్పందించలేదు. అసలు మొదటి నుంచి ఈ వ్యవహారాన్ని అంతగా పట్టించుకోలేదు చంద్రబాబు. కొందరు నాయకులు ఈ ప్రస్తావన తీసుకొచ్చినప్పుడు కూడా ఆయన దీనిపై పెద్దగా స్పందించలేదు. ఇది అనవసరమైన విషయం అంటూ పక్కనపెట్టారు. దీంతో తమ అధినేతే  ఈ విషయం గురించి మాట్లాడనప్పుడు.. మాకెందుకని లైట్ తీసుకున్నారు. అయితే ఎలాగూ మిత్రపక్షం కాబట్టి కేంద్రం చెప్పినట్టు చంద్రబాబు వింటారని భావించిన బీజేపీ... ఈవిషయంలో కూడా చంద్రబాబు ప్రత్యేక గవర్నర్ కు అనుకూలమే అని అనుకున్నారు.   కానీ అయితే ఈ విషయంలో చంద్రబాబు భిన్నంగా స్పందించడంతో బీజేపీ నేతలు ఖంగుతిన్నారు. ఢిల్లీ వెళ్లిన చంద్రబాబును ఈ విషయంపై అడగగా.. ఇది బీజేపీ పార్టీ వ్యవహారంగా ఆయన మాట్లాడటంతో బీజేపీ నేతల ఫ్యూజులు ఒక్కసారిగా ఎగిరిపోయాయట. చంద్రబాబు కూడా ఈ విషయంలో సానుకూలంగా స్పందిస్తారని భావించామని... కానీ చంద్రబాబు ఇలా అంటారని ఊహించలేదని బీజేపీ నేతలు అభిప్రాయపడుతున్నారట. అంతేకాదు.. ఈ విషయంలో చంద్రబాబు సానుకూలంగా లేకపోతే… కేంద్రం కూడా దీనిపై ఎలాంటి సానుకూల నిర్ణయం తీసుకునే అవకాశం లేదని పలువురు బీజేపీ నేతలు చెబుతున్నారు. మొత్తానికి ఎలాంటి హంగామా లేకుండా... చాలా సైలెంట్ గా చంద్రబాబు.. బీజేపీకి సమాధానం చెప్పారు. చంద్రబాబు సానుకూలంగా లేకపోతే… కేంద్రం కూడా నిర్ణయం తీసుకోలేదు అని బీజేపీ నేతలకు అర్ధమైందంటే... చంద్రబాబు స్టామినా ఏంటో అర్ధమైనట్టే....

జయలలిత కూతురు భవితవ్యం...హైదరాబాద్ లో తేలనుందా..!

  తాను జయలలిత కూతురునని.. కావాలంటే డీఎన్ఏ టెస్ట్ కూడా చేసుకోమని అమృత అనే మహిళ సుప్రీంకోర్టునే కోరిన సంగతి తెలిసిందే కదా. అంతేకాదు అమృత వ్యవహారం తమిళనాడులో పెద్ద చర్చలకు దారి తీసిన సంగతి కూడా విదితమే. అయితే గత కొద్దిరోజల క్రితం సంచలనం రేపిన ఈ వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది. అయితే ఇప్పుడు ఇది తమిళాడును దాటి హైదరాబాద్ కు చేరింది. అదేంటీ అనుకుంటున్నారా..? అసలు సంగతేంటంటే.. తాను జయలలిత కూతురునని... నిరూపించుకునే అవకాశం ఇవ్వాలని.. అవసరమైతే డీఎన్ఏ టెస్ట్ చేసుకోవచ్చని కూడా సుప్రీంను కోరారు. అయితే సుప్రీం ఈ వ్యవహారాన్ని మద్రాస్ హైకోర్టు లో తేల్చుకోవాలని సూచించిన నేపథ్యంలో ఆమె మద్రాస్ హైకోర్టుకు వెళ్లారు. ఈ నేపథ్యంలో వచ్చే నెల 2న కేసు విచారణకు రానుంది. ఈ కేసులో అత్యంత కీలకమైనది, బలమైనది డీఎన్ఏ ఒక్కటే కాబట్టి అమృత హైదరాబాద్‌ లోని సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సీసీఎంబీ)ని సంప్రదించినట్టు తెలుస్తోంది.   అయితే ఈ విషయంలో తమకు ఇప్పటి వరకు ఎటువంటి నమూనాలు అందలేదని...నిజానికి సీసీఎంబీ ప్రైవేటు వ్యక్తుల నుంచి డీఎన్ఏ సేకరించదు... కోర్టు ఆదేశాలపై మాత్రమే ఈ పరీక్షలు నిర్వహిస్తుందని.. సీసీఎంబీ అధికార ప్రతినిధి తెలిపారు. ఇక అమృత కేసు విషయానికి వస్తే ఆమె చెబుతున్న తల్లి, తండ్రి ఇద్దరూ లేరు కాబట్టి ఆమె బంధువుల నుంచి రక్తపు నమూనాలు సేకరించి పరీక్షలు చేయాల్సి ఉంటుంది. ఇక జయలలిత మరణించారు కాబట్టి ఆమె రక్త నమూనాలు సేకరించే అవకాశం లేదు.. ఆమె అస్థికల డీఎన్ఏను సేకరించే వీలు లేకపోతే ఆమె తోడబుట్టిన వారి నుంచి రక్తనమూనాలు సేకరించి డీఎన్ఏ పరీక్షలు నిర్వహించాల్సి ఉంటుందని శాస్త్రవేత్త ఒకరు తెలిపారు. ఈ కేసును శాస్త్రరీత్యా నిరూపించడం అంత కష్టమైన పనేమీ కాదని అన్నారు.   మరి గతంలో కూడా కృష్ణమూర్తి అనే వ్యక్తి తాను జయలలిత కొడుకు అని ఏవో నఖిలీ పత్రాలు సృష్టించి కోర్టు చేత మొట్టికాయలు తిన్న సంగతి తెలిసిందే కదా. అంతేకాదు జైలు శిక్ష కూడా పడింది. మరి ఇప్పుడు అమృత అనే మహిళ తెరపైకి వచ్చింది. కాకపోతే ఈమె డీఎన్ఏ టెస్ట్ కు కూడా రెడీ అవ్వడంతో అందరి దృష్టి ఆమెపై పడింది. మరి మద్రాస్ కోర్టు ఏం నిర్ణయం తీసుకుంటుంది... డీఎన్ఏ టెస్ట్ కు అనుమతిస్తుందా.. లేదా అన్నది తెలియాలంటే వెయిట్ చేయాల్సిందే.

పద్మావత్‌కు సుప్రీం గ్రీన్‌సిగ్నల్

ఎన్నో నెలలుగా సాగుతున్న ఉత్కంఠకు.. మరికొందరు చేస్తోన్న నిరసనలకు చెక్ పడింది. ఓపెనింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎన్నో వివాదాల్లో చిక్కుకున్న బాలీవుడ్ సినిమా పద్మావత్‌కు సర్వోన్నత న్యాయస్థానం ఊరటనిచ్చింది. సెన్సార్ బోర్డు సర్టిఫికేట్ ఇచ్చినప్పటికీ.. శాంతిభద్రతల దృష్ట్యా రాజస్ధాన్, మధ్యప్రదేశ్, గుజరాత్, హర్యానా, ఉత్తరాఖండ్, హిమాచల్‌ప్రదేశ్ ముఖ్యమంత్రులు తమ రాష్ట్రాల్లో పద్మావత్‌ను నిషేధించారు. దీంతో చిత్రనిర్మాతలు సుప్రీంను ఆశ్రయించారు.   పొడ్యూసర్స్ వాదనతో ఏకీభవించిన సుప్రీంకోర్టు నిషేధాన్ని ఎత్తివేస్తూ తీర్పునిచ్చింది. దాంతో భారతదేశంలోని అన్ని రాష్ట్రాల్లో పద్మావత్ ఈ నెల 25న విడుదల కాబోతోంది. మధ్యయుగం నాటి రాణి పద్మావతి కథ ఆధారంగా విలక్షణ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన పద్మావతి సెట్స్ మీదకు వెళ్లడానికి ముందే వివాదంలో ఇరుక్కుంది.   తమ రాణి కథను వక్రీకరిస్తూ తెరకెక్కుతున్న ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారంటూ రాజ్‌పుత్ కర్ణీసేన కార్యకర్తలు తీత్ర అభ్యంతరం తెలిపారు. పలు సందర్భాల్లో షూటింగ్‌కు సైతం ఆటంకం కలిగించడంతో పాటు భన్సాలీపై దాడికి పాల్పడ్డారు కూడా. సినిమా విడుదలైతే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించడంతో సినిమా విడుదల వాయిదా పడింది. చివరికి చరిత్రకారులతో సలహా మేరకు కొన్ని మార్పులు చేసి పద్మావతిని పద్మావత్‌గా మార్చి సెన్సార్ బోర్డు రిలీజ్‌కు అనుమతినిచ్చింది. అయినప్పటికీ శాంతిభద్రతల దృష్ట్యా పలువురు ముఖ్యమంత్రులు విడుదలను నిషేధించారు. ఇప్పుడు తాజాగా సుప్రీంకోర్టు తీర్పుతో పద్మావత్‌ విడుదలకు ఆటంకాలన్నీ తొలగిపోయాయి.  

జనసేనపై అజ్ఞాతవాసి ఎఫెక్ట్?

  పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన అజ్ఞావాసి సినిమా ఏకగ్రీవంగా అట్టర్ ఫ్లాప్ అయింది. పవన్ కళ్యాణ్ ఫుల్ టైమ్ పొలిటికల్ లీడర్‌గా పనిచేయడానికి సమాయత్తం అవుతున్న సందర్భమిది.  ఆమధ్య ఓసారి అజ్ఞాతవాసి సినిమానే తన చివరి చిత్రమని, ఈ సినిమా తర్వాత పూర్తి సమయాన్ని రాజకీయాలకే కేటాయిస్తానని పవన్ కళ్యాణ్ ప్రకటించారు. ఇప్పటి వరకు వున్న పరిస్థితిని బట్టి చూస్తే మాత్రం అజ్ఞాతవాసి పవన్ కళ్యాణ్ చివరి సినిమా. వాస్తవ పరిస్థితిని గమనిస్తే జనసేన పార్టీని పటిష్టం చేయాలనుకుంటే మాత్రం పవన్ కళ్యాణ్ ఇంకా సినిమాల్లో నటిస్తూ కూర్చుంటే కుదరదు. ఎన్నికలకు ఇంకా కేవలం సంవత్సరంన్నర మాత్రమే వ్యవధి వుంది. అందువల్ల అజ్ఞాతవాసి సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ మరో సినిమా ఒప్పుకునే అవకాశాలు కనిపించడం లేదు. అయితే అజ్ఞాతవాసి సినిమా మీద పవన్ కళ్యాణ్ మాత్రమే కాదు.. ఆయన అభిమానులు కూడా ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఈ సినిమా ఘన విజయం సాధిస్తుందని, సినిమా రంగానికి ఒక విజేతగా వీడ్కోలు పలికి, సగర్వంగా పొలిటికల్ లీడర్‌గా ప్రస్థానం కొనసాగించాలన్నది పవన్ కళ్యాణ్, ఆయన అభిమానుల ఆలోచన అయితే పరిస్థితి మాత్రం ఇప్పుడు రివర్స్ అయింది. పవన్ కళ్యాణ్ చివరి చిత్రంగా భావిస్తున్న సినిమా అట్టర్ ఫ్లాప్ అయింది.   రాజకీయాల్లోకి వచ్చే ముందు నటించిన సినిమాల ప్రభావం రాజకీయ రంగం మీద కూడా వుండి తీరుతుందనేది  చరిత్ర చెబుతున్న సత్యం. తెలుగుదేశం పార్టీని స్థాపించి, తొమ్మిది నెలల్లోనే అధికారంలోకి వచ్చిన నందమూరి తారక రామారావు రాజకీయ రంగ ప్రవేశం మీద ఆయన చివర్లో నటించిన చిత్రాల ప్రభావం వుంది. ఎన్టీఆర్ నటించిన  నాదేశం, మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర సినిమాలు ఆయనకు రాజకీయంగా ఎంతో ఉపయోగపడ్డాయి. ఆ సినిమాలు సాధించిన ప్రజాదరణ రాజకీయంగా కూడా ఎన్టీఆర్‌కి ఉపయోగపడింది. సినిమాల్లో సక్సెస్‌ఫుల్‌గా వుంటూనే సినిమాల్లోకి ప్రవేశించిన ఘనత ఆయన సొంతమైంది. అయితేపవన్ కళ్యాణ్ మాత్రం సినిమా రంగానికి ఘోరమైన ఫ్లాపుల తర్వాత విడిచిపెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. ఆయన నటించిన సర్దార్ గబ్బర్ సింగ్, కాటమరాయుడు, అజ్ఞాతవాసి ఒకదాన్ని మించిన ఫ్లాప్ మరొకటి అయ్యాయి. చివరి చిత్రమైతే మరీ దారుణం. రేపటిరోజున ఆయన రాజకీయ ప్రత్యర్థులు పవన్ కళ్యాణ్ సినిమాల్లో రాణించలేక రాజకీయాల్లోకి వచ్చాడని అంటే ఎదురు సమాధానం చెప్పే అవకాశం జనసేన వర్గాలకు లేకుండా పోయింది.   అజ్ఞాతవాసి సినిమా పుణ్యమా అని పవన్ కళ్యాణ్ క్రేజ్ మీద ఎఫెక్ట్ పడింది. ఆయన ఫ్యాన్స్ నిరాశపడిపోయారు. ఒక హిట్ సినిమా తర్వాత రాజకీయాల్లోకి వచ్చే ప్రజల్లో వుండే గౌరవం ఇప్పుడు పవన్ కళ్యాణ్ మీద వుండే అవకాశం లేదు. అజ్ఞాతవాసి ఫ్లాప్ అయిన నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఒక మంచి హిట్ సినిమాలో నటించాలని, హిట్టు కొట్టే సినిమా రంగానికి గుడ్ బై కొట్టాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు. అయితే అది అసాధ్యమనే చెప్పాలి. ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ మరో సినిమాలో నటించడం అంటే అంతకంతే ఘోర తప్పిదం మరొకటి వుండబోదు.  అంచేత తప్పో ఒప్పో రాజకీయాల్లోకి పూర్తి స్థాయిలో వచ్చేయడమే కరెక్టన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

పవన్ కళ్యాణ్‌కి దారులన్నీ మూసుకుపోయిన వేళ...

సినిమాల్లో స్టార్లు గా ఎదిగి... ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చి రాణించిన వారు చాలా తక్కువ మంది ఉన్నారు. కరెక్ట్ గా చెప్పాలి అంటే, తెలుగులో ఎన్టీఆర్ తప్ప మిగతా ఎవరూ పాలిటిక్స్ లో తమ ప్రాభవం చూపించలేకపోయారు. మెగాస్టార్ గా టాలీవుడ్ ని శాసించిన చిరంజీవికి సైతం రాజకీయంలో ఉన్న కిటుకులు అర్ధం కాక ప్రజా రాజ్యం పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసి, తిరిగి సినిమాల్లో తన సత్తా చాటడానికి సెకండ్ ఇన్నింగ్స్ మొదలెట్టాడు.   గత కొన్నేళ్లుగా టాలీవుడ్ లో ఖాళీగా ఉన్న నెంబర్ వన్ స్థానాన్ని భర్తీ చేస్తాడు అనుకున్న సమయంలో, సినిమాలకి గుడ్ బై చెప్పి పూర్తి స్థాయి రాజకీయాల్లో అడుగు పెడతానని అనౌన్స్ చేసాడు పవన్ కళ్యాణ్. జన సేన పార్టీ పెట్టిన మొదట్లో యువతని తన వైపు తిప్పుకొని 2014 ఎలక్షన్స్ లో టీడీపీ గెలుపులో కీలక పాత్ర పోషించాడు. ఆ తర్వాత నయానో భయానో ప్రభుత్వం కొన్ని విషయాల్లో తన నిర్ణయాల్ని అమలు చేసే విషయంలో గెలుపు సాధించాడు. కానీ, గత సంవత్సర కాలం నుండి పవన్ కళ్యాణ్ కన్ఫ్యుజింగ్ స్టేట్మెంట్స్ తో సొంత జన సేన పార్టీ కార్యకర్తల్ని సైతం అయోమయంలోకి నెట్టాడు.   ఇవన్నీ ఒక ఎత్తయితే, అజ్ఞాతవాసి ఫ్లాప్ రిజల్ట్ మరొక ఎత్తు. త్రివిక్రమ్ శ్రీనివాస్ పై గంపెడు ఆశలు పెట్టుకున్న పవన్ కళ్యాణ్ కి ఇది మింగుడుపడని వ్యవహారంగా మిగిలింది. ఒక సంవత్సరంలో అటు ఇటుగా ఎలక్షన్స్ ఎప్పుడయినా జరిగే అవకాశం ఉంది. ఇప్పుడు సినిమాలు చేస్తూ వెళ్తే జనాలకి దూరం అవుతాడు... అలా అని చెప్పేసి ఒక ప్లాప్ ఇచ్చిన తర్వాత జనాల్ని పేస్ చెయ్యలేని పరిస్థితి. కంటెంట్ లేకపోవడంతో, అజ్ఞాతవాసి పై సొంత అభిమానులు కూడా పెదవి విరిచారు.   ఒక వైపు టీడీపీ మళ్ళీ గెలిచే ప్రయత్నంలో శాయశక్తులా కృషి చేస్తుంది. వైయస్ జగన్ కూడా పాదయాత్ర తో వార్తల్లో నిలుస్తున్నాడు. ఎటొచ్చి పవన్ కల్యాణే ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేని సందిగ్ధ పరిస్థితుల్లో ఉన్నాడు.   అజ్ఞాతవాసి ప్రమోషన్స్ లో కూడా పాల్గొనని పవన్, గత కొన్ని రోజులుగా అందరికీ దూరంగా ఉంటున్నాడు. తనకు అత్యంత సన్నిహితుల సలహాలు తీసుకొని ఏం చేయాలి అనే విషయంలో తర్జన భర్జన పడుతున్నాడని సమాచారం. ఇప్పుడు ఏ డెసిషన్ తీసుకున్నా, అది తన రాజకీయ భవితవ్యం పై తీవ్రమయిన ప్రభావం చూపిస్తుంది కాబట్టి... తొందరపడటం కన్నా కూడా కొన్నాళ్ళు అజ్ఞాతంలోనే ఉండి, గట్టి ప్రణాళికతో ముందుకు రావాలని అనుకుంటున్నాడట.   ఇప్పటికే దారులన్నీ మూసుకుపోయాయి, మరి పవన్ కళ్యాణ్ ఎలాంటి ప్రణాళికలతో ముందుకు వస్తాడో చూడాలి!

జగన్ బ్యాచ్ ఆనందం ఆవిరి చేసిన సూర్య...

  పాపం వైసీపీ బ్యాచ్ ఆనందాన్ని కనీసం 24 గంటలు కూడా ఉంచలేదు తమిళనాడు సూపర్ హీరో సూర్య. సూర్య ఏంటీ..? వైసీపీ ఆనందాన్ని పోగొట్టడం ఏంటీ అనుకుంటున్నారా...? అసలు సంగతేంటంటే.. సూర్యా ఇటీవల నటించిన గ్యాంగ్ సినిమా సంక్రాంతి పండుగకు ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే కదా. ఇక ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా ఆయన పలు టీవీ ఛానళ్లలో ఇంటర్వ్యూల్లో పాల్గొన్నారు. ఈ క్రమంలోనే ఆయన సాక్షి ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఇక ఇంటర్వ్యూల్లో భాగంగా సినిమా గురించి.. సినిమా విశేషాల గురించి యాంకర్ ఎలాగూ అడుగుతుంది కాబట్టి సూర్య కూడా సమాధానాలు చెప్పారు. అయితే సాక్షి ఛానల్ కాబట్టి.. దాని స్థాపకుడు జగన్ కాబట్టి ఎలాగూ ఆయన గురించి అడుగుతారు. అలాగే యాంకర్ కూడా జగన్ గురించి అడిగింది. మరి ఛానల్ వాళ్లది అయినప్పుడు సూర్య మంచి మాటలు చెబుతారు కానీ.. ఆయన అవినీతిపరుడనో.. లేక జైలుకు వెళ్లి, బెయిల్ పై బయట తిరుగుతున్నావ్ అని అనరు కదా. అలాగే జగన్ గురించి సూర్య నాలుగు మంచి మాటలు చెప్పాడు.   "ప్రజలకు ఏదో చేయాలన్న తపన, గొప్ప ఆలోచన,  ఆశయాలతో వైఎస్‌ఆర్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పాదయాత్ర చేపట్టారు" అని ఆయన అన్నాడు. తాను కాలేజీలో చదువుకుంటున్నప్పటి నుంచే వైఎస్ కుటుంబంతో పరిచయం ఉందని చెప్పిన ఆయన, తాననుకున్నది సాధించే క్రమంలో కష్టపడేతత్వం వైఎస్‌ జగన్‌ కు ఉందని అన్నారు. ఇంకేముంది.. దీన్ని పట్టుకుని సాక్షి టీవీ ఊదరగొట్టింది...  మా జగనన్నకు సినిమా హీరోలు కూడా ఫాన్స్ ఉన్నారు అని చెప్తూ జగన్ బ్యాచ్ సోషల్ మీడియాలో ఒకటే రచ్చ చేశారు. అయితే ఈ అల్పసంతోషుల ఆనందం, సూర్య 24 గంటలు కూడా ఉంచలేదు... తన సినిమా గ్యాంగ్ ప్రమోషన్ లో భాగంగా, రాజమండ్రి, ఏలూరు, విజయవాడలో పర్యటించారు.... ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సూర్య మాట్లాడుతూ...అవినీతి అంతమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం 1100 ద్వారా ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరిస్తూ, పరిష్కారం చూపటం చాలా మంచి విషయం అని..ముఖ్యమంత్రి చంద్రబాబును అభినందిస్తూ, ఆయన చేస్తున్న కృషిని కొనియాడారు... చంద్రబాబు ఇక్కడ చేస్తున్న అన్ని మంచి పనులను స్వాగతిస్తున్నామని సూర్య అన్నారు... మొత్తానికి పాపం సూర్యని అడ్డుపెట్టుకుని, చంద్రబాబు మీద బురద జల్లుదాము అనుకున్న జగన్ బ్యాచ్ ఆనందం 24 గంటలు కూడా లేకుండా పోయింది..

సారీ చెప్పిన బాబు.. షాక్ తిన్న కామన్ మ్యాన్..

  ఏపీ ముఖ్యమంత్రి సీఎం చంద్రబాబు నాయుడు సంక్రాంతి పండుగకు ఆయన సొంతవూరు నారావారిపల్లె వెళ్లిన సంగతి తెలిసిందే కదా. అక్కడే కుటుంబసమేతంగా ఆయన పండుగను చేసుకుంటున్నారు. దీంతో అక్కడి చుట్టుపక్కల గ్రామాల నుండి చంద్రబాబు బంధువులు పెద్ద ఎత్తున తరలివస్తుండటంతో..ఊరంతా రద్దీగా మారింది. ఇక ఈసమస్యను ముందుగానే ఊహించిన పోలీసులు అక్కడ కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసినప్పటికీ కొన్ని ఇబ్బందులు తలెత్తుతూనే ఉన్నాయి. దీనిలో భాగంగానే ఓ ఆసక్తికరమైన విషయం చోటుచేసుకుంది.   పోలీసులు నారావారిపల్లెకు వచ్చే, వెళ్లే దారుల్లో ట్రాఫిక్ ని డైవర్ట్ చేశారు. ఈ ట్రాఫిక్ డైవెర్షన్ వల్ల స్థానికులకు కొద్దిగా ఇబ్బంది తలెత్తింది. దీనిలో భాగంగా...నవీన్ అనే అతను కుటుంబ సభ్యులతో పాటుగా ఊరికి బయలుదేరాడు. ట్రాఫిక్ డైవర్షన్ తో ఆయనకు చికాకు వచ్చింది. ప్రయాణం ఆలస్యం అవుతుందన్న కోపంలో అతను చంద్రబాబు రక్షణ సిబ్బందిని నిలదీసాడు. తాము ఎందుకు ఇబ్బంది పడాలని వారితో వాగ్వాదానికి దిగాడు. ఇక ఈ విషయం ఆఖరికి చంద్రబాబుకు చేరింది. దాంతో ఆయన నవీన్ ని పిలిపించి...కలిగిన ఇబ్బందికి సారీ చెప్పారట. అంతే ఏదో ఊహించుకొని అక్కడికి వెళ్లిన నవీన్... చంద్రబాబు సారీ చెప్పడంతో తిన్నాడట. సీఎం గారు కదా.. ఏమన్నా అంటారేమో... సీఎం అన్న అధికారం చూపిస్తారేమో అని అనుకుంటే ఇలా సారీ చెప్పేసరికి నవీన్ ఖంగుతిన్నాడట. అంతేకాదు తన తొందరపాటుకు తిరిగి సారీ చెప్పడమే కాకుండా తానే సర్దుకుపోయి ఉంటే బాగుండేది అన్నాడంట. మొత్తానికి సమస్య సామరస్యంగా పరిష్కారం అయ్యింది. చంద్రబాబు ఏ మాత్రం భేషజానికి పోకుండా సారీ చెప్పడం చూసి నారావారిపల్లె వాసులు అందుకే మా వూరి నాయకుడు గొప్పవాడని చెప్పుకుని మురిసిపోతున్నారు. మరి ఒక సీఎం అన్నఅధికారం ఎక్కడా చూపించకుండా.. ఇలా తన వల్ల కలిగిన ఇబ్బందికి సారీ చెప్పడం గొప్ప విషయమే.

సీమలో జగన్ కు షాక్.. కష్టమే..

  ఒకపక్క జగన్ పాదయాత్రలు చేస్తూ బిజీగా గడుపుతుంటే.. మరోపక్క పార్టీ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ మాత్రం సర్వేలు చేస్తూ బిజీగా గడుపుతున్నారు. ఇప్పటికే ఎన్నో సర్వేలు చేసిన.. ఆయన తాజాగా మరో సర్వే చేశాడు. ఎప్పటిలాగానే ఈ సర్వేలో కూడా ఆయనకు షాకింగ్ విషయాలే బయటపడ్డాయి. డిసెంబర్ నెల మూడోవారంలో రాయలసీమలో నిర్వహించిన సర్వేలో వైసీపీకి మింగుడుపడని వాస్తవాలు వెలుగులోకి వచ్చాయని తెలుస్తోంది. అదేంటంటే.. వచ్చే ఎన్నికల్లో రాయలసీమలో కూడా జగన్ కు అనుకున్న ఫలితాలు రావంట.   అసలు జగన్ కు రాయలసీమనే పెద్ద బలం. గత సార్వత్రిక ఎన్నికల్లో జగన్ ఎక్కువ స్థానాల్లో గెలిచింది కూడా ఇక్కడినుండే. వైసీపీ సాధించిన మెజార్టీ స్థానాలు ఇక్కడివే. ఇక్కడి గెలిచిన స్థానాల కారణంగానే వైసీపీ స్కోరు 65 దాటింది. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. జగన్ పై పెరుగుతున్న వ్యతిరేకత ముఖ్యంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కరువుకు బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్న రాయసీమకు నీరు అందించడం ముఖ్య కారణాలుగా నిలవడంతో... ఈసారి పదిస్థానాల కంటే ఎక్కువ రావని పీకే సర్వేలో తేలిందట. దీంతో జగన్ ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్నట్టు తెలుస్తోంది. ఎప్పటికప్పుడు రాయలసీమలోని నియోజకవర్గాల సమన్వయకర్తలతో చర్చలు జరుపుతున్నారని టాక్ వినిపిస్తోంది. కొన్ని నియోజకవర్గాల సమన్వయకర్తలను మార్చేందుకు కూడా జగన్ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.   ఇదిలా ఉండగా ఈ సర్వేలోనే మరికొన్ని ఆసక్తికర విషయాలు బయటపడ్డాయట. వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలుగా ఉన్న శ్రీకాంత్ రెడ్డి, రోజా వంటి వారికి కూడా గడ్డు పరిస్థితులే ఉన్నాయని తేలినట్టు సమాచారం. పార్టీ రాయలసీమ విభాగంలో సమూలమైన మార్పులు తీసుకొస్తే తప్ప ఈ పరిస్థితుల్లో మార్పులు వచ్చే అవకాశం లేదని ఆ పార్టీ సీనియర్ నేతలు జగన్ కు సలహా ఇచ్చినట్టు తెలుస్తోంది. మరి చూద్దాం...ఎన్నికల సమయానికి సర్వేలు ఇలానే ఉంటాయో..అప్పటికీ పరిస్థితి ఇలాగే ఉంటుందో.. లేదో..?