బ్రెజిల్‌లో దోమలకు అయిదు రోజుల పండగ!
posted on Feb 5, 2016 @ 3:37PM
ప్రపంచమంతా జికా వైరస్‌తో వణికిపోతోంది. అన్ని దేశాలలోకెల్లా దక్షిణ అమెరికా ఖండంలోని బ్రెజిల్ దేశానికి ఈ వైరస్ వల్ల తీవ్ర నష్టం జరిగింది. ఇప్పటివరకూ జికా వైరస్ సోకి బ్రెజిల్‌లో వందలాది మంది పిల్లలు మెదడుకి సంబంధించిన లోపాలతో పుట్టారు. అయినా బ్రెజిల్ వాసులు జికా వైరస్‌కు పెద్దగా భయపడుతున్నట్లు లేదు. బ్రెజిల్ దేశంలో రెండో అతిపెద్ద నగరం అయిన ‘రియో డి జెనెరో’లో ఇవాల్టి నుంచి అయిదు రోజుల పాటు పెద్ద ఎత్తున కార్నివాల్ (జాతర) జరగబోతోంది. ఈ కార్నివాల్‌కి దేశం నలుమూలల నుంచే కాకుండా చుట్టుపక్కల దేశాల నుంచీ కూడా లక్షలాది మంది జనం తరలి వస్తారని అంచనా. ఇన్ని లక్షల మంది ఒక చోటకి చేరడం వల్ల జికాను వ్యాప్తి చేసే ఈడిస్ దోమలు విజృంభిస్తాయని ఆరోగ్య శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. కార్నివాల్ తరువాత రియో నుంచి తిరిగి వెళ్లేవారు తమతో పాటు జికా వైరస్‌ను ప్రపంచం నలుమూలలకీ తీసుకువెళ్లే ప్రమాదం లేకపోలేదు. అయినా ఈ హెచ్చరికలను ఎవరూ పట్టించుకోవడం లేదు సరికదా… ‘అవన్నీ పట్టించుకుంటే జీవితాన్ని సరదాగా గడిపేది ఎలా?’ అంటూ ఎదురు సమాధానం చెబుతున్నారట. మరో పక్క కార్నివాల్‌కు వచ్చేవారి నుంచి డబ్బులు దండుకోవడం కోసం స్థానిక హోటళ్లన్నీ ఎదురుచూస్తున్నాయి. కొందరికి సరదా కావాలి! మరి కొందరికి డబ్బు కావాలి! ఇంతకీ దీని వల్ల ప్రపంచానికి ఏం జరుగుతుందో ఎవరికి కావాలి?