బావ బావమరిదిని టార్గెట్ చేసిన వైసిపి..
posted on Feb 22, 2021 @ 11:13AM
ఏపీలో పంచాయతీ ఎన్నికల సమరం నిన్నటితో ముగిసింది. రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసిపి పై ప్రజలలో తీవ్ర వ్యతిరేకత ఉందని ప్రతిపక్షాలు భావించినప్పటికీ.. ఇటు ఏకగ్రీవాల రూపంలో కొన్ని.. సంక్షేమ కార్యక్రమాలను కట్ చేస్తామని బెదిరింపులతో మరి కొన్ని చోట్ల వైసిపి బలపరచిన అభ్యర్థులు విజయ సాధించారు. మరోపక్క 2019 అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే పలు చోట్ల టీడీపీ పుంజుకుంది.
అయితే టీడీపీ అధినేత చంద్రబాబు, అయన బావమరిది బాలకృష్ణ ప్రాతినిధ్యం వహిస్తున్న అసెంబీ స్థానాలలో మాత్రం వైసిపి ఎక్కువ స్థానాలను గెలుచుకుంది. కుప్పంలోని 87 పంచాయతీలకు గాను 73 వైసిపి బలపరచిన అభ్యర్థులు గెలుపొందారు. మరోపక్క బాలకృష్ణ ప్రాతినిధ్యం వహిస్తున్న హిందూపురం నియోజకవర్గంలోని 38 స్థానాలకు గాను 30 చోట్ల వైసిపి మద్దతుదారులు విజయం సాధించారు. దీంతో బావ బావమరుదులను అధికార వైసిపి గట్టిగా టార్గెట్ చేసినట్లుగా విశ్లేషకులు భావిస్తున్నారు.
2019 లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో రాయలసీమ ప్రాంతం నుండి టీడీపీ మూడు చోట్ల మాత్రమే విజయం సాధించింది. అందులో రెండు కుప్పం, హిందుపూర్ కాగా మూడోదైన ఉరవకొండలో పయ్యావుల కేశవ్ విజయం సాధించారు. దీంతో ఏపీలో టీడీపీ ని ఎప్పుడు ఫినిష్ చేద్దామా అని చూస్తున్న వైసిపి తాజాగా జరిగిన పంచాయతీ ఎన్నికలలో బావ బావమరుదులను గట్టిగా టార్గెట్ చేసింది. కరోనా నేపథ్యంలో టీడీపీ నాయకులు ప్రజలకు అందుబాటులో లేకుండా పోయారు.
మరోపక్క కింది స్థాయి టీడీపీ నేతలను ప్రలోభాలు, బెదిరింపుల ద్వారా వైసిపి లోబరుచుకుంది. ఇక్కడ ముందుగా ఏకగ్రీవాల కోసం ప్రయత్నించిన వైసిపి, టీడీపీ సానుభూతిపరులను నామినేషన్లు వేయకుండా తీవ్రంగా అడ్డుకునే ప్రయత్నాలు చేసింది. అది వర్కౌట్ కాకపోవడంతో.. వైసిపి ఓడితే సంక్షేమ పథకాలు కట్ చేస్తామంటూ ఓటర్లను కూడా భయపెట్టి మరీ ఈ రెండు నియోజకవర్గాలలో గెలిచారు. దీంతో పార్టీ అధినేత బాబు, అయన బావ మరిది బాలకృష్ణ సొంత స్థానాలలోనే తమకు తిరుగులేదని.. ఇక టీడీపీ పని అయిపోయిందని వైసిపి సోషల్ మీడియాలో హోరెత్తిస్తోంది. అయితే వైసిపి చేస్తున్న ఈ దాడిని టీడీపీ ఏ వ్యూహం ద్వారా తిప్పి కొడుతుందో వేచి చూడాలి.