షర్మిళ యాత్ర అట్టర్ ఫ్లాప్ అవుతుందా?
posted on Oct 13, 2012 @ 10:14AM
తమ ఉనికిని కాపాడుకునేందుకు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆప్షనల్ నాయకురాలు, జగన్ సోదరి షర్మిల 3వేల కిలోమీటర్ల పాదయాత్ర నిర్వహిస్తున్నారు. వైకాపా అధ్యక్షుడు జగన్మోహనరెడ్డి ప్రస్తుతం చంచల్‌గూడా జైలులో ఉన్నారు. ఆయన కనుక ఈ మూడు వేల కిలోమీటర్ల పాదయాత్ర ముగిసేలోపు బయటకు వస్తే జగనే ఫైనల్‌గా యాత్ర పూర్తి చేస్తారు. లేకపోతే ప్రారంభించారు కాబట్టి పులివెందుల నుంచి ఇచ్ఛాపురం వరకూ యాత్ర షర్మిల పూర్తి చేస్తారు. అయితే ఇలా ప్రకటించిన వైకాపా గౌరవాధ్యక్షురాలు విజయలక్ష్మి తాను రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీని కలిసి జగన్ విడుదల కోసం సిబిఐపై ఒత్తిడి చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. రాష్ట్రపతి ప్రణబ్ ఇప్పటికే రాష్ట్ర పరిణామాలు తెలిసున్న వ్యక్తి కాబట్టి ఆమెకు ఆపాయింట్‌మెంట్ ఇచ్చినా పెద్దగా ఒత్తిడి చేయకపోవచ్చు. దీంతో ఆప్షన్ అనుకున్న షర్మిలే పాదయాత్ర పూర్తి చేయాల్సి వస్తుందని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. జనబలంతో ఉప ఎన్నికల్లో విజయం సాధించామనుకుంటున్న వైకాపా గుట్టు ఈసారి చంద్రబాబు యాత్ర ద్వారా వెలుగులోకి వస్తుంది. ఆయనకు వస్తున్న స్పందన చూసి వైకాపా తన కార్యకర్తలను కాపాడుకునేందుకు ఈ యాత్ర ప్రారంభించింది. అయితే చంద్రబాబు తన పాదయాత్రకు రమ్మని ఎవరినీ పిలవనక్కర్లేదు. ఎందుకంటే ఆయన సీనియార్టీ, సిఎంగా చేసిన అనుభవం అదనపు ప్లస్ అవుతున్నాయి. సొంత ఇమేజ్ కూడా ఆయనకు ఉంది. అందరితోనూ కలిసిపోయే స్వభావం ఆయన సొంతం. అందువల్ల చంద్రబాబు యాత్రకు ఆ పార్టీ నాయకులు రాకపోయినా కూడా విజయవంతమవుతుంది. కానీ, షర్మిల యాత్రకు ఆ పార్టీ నేతలు ముందస్తు ఫోన్లు చేసి నాయకులన్న వారితో ప్రచారం చేయించి జనాన్ని పోగేసేందుకు ద్వితీయస్థాయి నేతలను మెప్పించి చాలా కసరత్తులు చేయాలి. లేకపోతే షర్మిల యాత్ర అట్టర్‌ప్లాప్ అవుతుంది. ఆప్షనల్ అని ప్రకటించినప్పటికీ షర్మిలయాత్ర ముగించకతప్పదన్న అనుమానాలు ఆ పార్టీలోనూ ఉన్నాయి. అందుకని యాత్ర అనుకున్నప్పటి నుంచి పార్టీలో ఉన్న అందరినీ అప్రమత్తం చేస్తూనే ఉన్నారు. ఈసారికి ఈ పాదయాత్ర విజయవంతం చేసేందుకు సొంతఖర్చు పెట్టయినా సక్సెస్ అనిపించమని ఆ పార్టీ రాష్ట్రనేతలు కోరుతున్నారట. జగన్ బయటికి వచ్చాక దానికి తగిన ప్రతిఫలం ఇప్పిస్తామని చెబుతున్నారట.