వై.యస్సార్.కాంగ్రేసులో కొత్త లుకలుకలు

 

 

 

ఒకనాడు వై.యస్.జగన్మోహన్ రెడ్డిని తెలంగాణాలో కాలుకూడా పెట్టనీయని తెలంగాణా ప్రజలు, ఆ తరువాత షర్మిల చేపట్టిన పాదయత్రకి తరలివచ్చేరంటే, అందుకు జగన్మోహన్ రెడ్డి లేదా అతని తండ్రి స్వర్గీయ రాజశేఖర్ రెడ్డిల ప్రభావం మాత్రం కానేకాదని చెప్పవచ్చును. రాజశేఖర్ రెడ్డి కుటుంబానికి మొదటినుండి అత్యంత విదేయురాలిగా ఉంటున్న కొండా సురేఖ, గత సంవత్సరకాలంగా చేసిన కృషికారణంగానే, తెలంగాణా ప్రజల మనసులలో వై.యస్సార్.సి. పార్టీ పార్టీ పట్ల తెరాస నాటిన వ్యతిరేకభావజాలాన్ని కొంతమేరయిన తొలగి, షర్మిల పాదయాత్రకి కొంత సానుకూల స్పందన కనబడిందని చెప్పవచ్చును. ఆ విదంగా పార్టీని తెలంగాణాలో క్రమంగా పునరుజ్జీవింపజేసిన కొండా సురేఖ తెలంగాణాలో వై.యస్సార్.సి. పార్టీకి ముఖచిత్రంగా నిలిచిందని నిసందేహంగా చెప్పవచ్చును. అందువల్లనే, ఆ పార్టీకి అన్నీ తానయి తెలంగాణాలో ఆమె చక్రం తిప్పుతోందని, ఆ పార్టీకి చెందిన కొందరు నేతలే స్వయంగా అంగీకరిస్తున్నారు. అయితే, వారి ఆ అంగీకారం వెనుక కొండా దంపతుల ఆధిపత్య ధోరణిని పట్ల, ముఖ్యంగా ఆమె భర్త కొండా మురళి వైఖరిపట్ల పార్టీ నేతల అసంతృప్తి కూడా దాగిఉంది.


 

వై.యస్సార్.సి. పార్టీలో ఎవర్ని జేరనీయలో, ఎవరిని జేరనీయకుడదో కొండా మురళి నిర్నయించుతుండటం, దానిని సురేఖ నిర్ణయంగా భావిస్తూ పార్టీ అదినాయకులు ఆమోదం తెలుపుతుండటం, తెలంగాణాలో ఆ పార్టీకి చెందిన సీనియర్ నేతలకు చాలామందికి ఇబ్బందికరంగా మారింది. నిన్న మొన్నటి వరకు కూడా వై.యస్సార్.కాంగ్రెస్ పార్టీలో జేరాలనుకొన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి హట్టాతుగా తన నిర్ణయం మార్చుకొని, కాంగ్రెసును వీడితే తెరాస జేరుతాను తప్ప వై.యస్సార్.కాంగ్రెస్ పార్టీలో జేరానని ప్రకటించడమే ఇందుకు ఒక ఉదాహరణగా చూపిస్తున్నారు ఆ పార్టీ నేతలు.  అతనే గాకుండా, కాంగ్రేసుకు చెందిన జీవన్ రెడ్డి, గోనే ప్రకాష్ రావు, బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి వంటి అనేక మంది సీనియర్లు తమ కంటే రాజకీయాలలో జూనియర్ అయిన కొండా మురళి ముందు చేతులు కట్టుకొని నిలబడటం ఇష్టంలేకనే ఆ పార్టీకి దూరంగా నిలిచిపోయినట్లు తెలంగాణాకు చెందిన కొందరు వై.యస్సార్.సి. పార్టీనేతలు అంటున్నారు. పార్టీ వ్యహారాల్లో మురళి ప్రమేయం తగ్గినపుడే, పార్టీ వైపు చూస్తున్న అనేక మంది ఇతర పార్టీలకు చెందిన సీనియర్లు, జూనియర్లూ వారి అనుచరులతో కలిసి వచ్చి పార్టీలోజేరి తెలంగాణాలో పార్టీని బలపరచగలరని భావిస్తున్నారు. అయితే, ప్రస్తుతం పార్టీలో, తెలంగాణాలో మురళి ‘హవా’ కొనసాగుతునందున, అది సాద్యం కాకపోవచ్చని, తద్వారా పార్టీ చాలా నష్టపోతోందని వై.యస్సార్.సి. పార్టీలో చాలామంది నేతలు అభిప్రాయపడుతున్నారు.



అందువల్లనే, ఆ పార్టీకి చెందిన వై.వి.సుబ్బారెడ్డి వంటి సీనియర్లు జగన్ కుటుంబముతో వారికున్న సన్నిహిత సంబందాల కారణంగా, కొండా దంపతులకు బద్ద వ్యతిరేఖిగా ముద్రఉన్న ఎర్రబెల్లి ప్రదీప్ రావును (తెలుగుదేశం పార్టీ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు సోదరుడు) నేరుగా పార్టీ అధిష్టానం వద్దకే తీసుకువెళ్ళి పార్టీలో సభ్యత్వం ఇప్పించారని తెలుస్తోంది. అంతే గాకుండా, క్రమంగా కొండా దంపతుల ఆదిపత్య ధోరణి కట్టడి చేయాలనే ఆలోచనతోనే, వై.వి.సుబ్బారెడ్డి వంటి కొందరు నేతలు, పార్టీ అదినేతలను కలిసి, మొన్న జరిగిన అఖిలపక్షసమవేశానికి కొండా సురేఖ పేరును ఆఖరి నిమిషంలో  తొలగింపజేసి, ఆమెకు బదులుగా మహేష్ రెడ్డిని పంపించినట్లు సమాచారం.



అయితే, కొండా దంపతులను వ్యతిరేఖిస్తున్నవారు కూడా కొండా సురేఖ చిత్తశుద్దిని శంకించకపోయినప్పటికీ, ఆమె భర్త కొండా మురళి ఆధిపత్య ధోరణిని మాత్రం భరించలేక పోతున్నారని తెలుస్తోంది. ఈ విభేదాలు క్రమంగా ముదిరి పాకాన్న పడినట్లయితే, అప్పుడు వై.యస్సార్.కాంగ్రెస్ పార్టీ తెలంగాణాలో తన ఉనికిని కాపాడుకోవడం కన్నా ముందు పార్టీ అంతర్గత కుమ్ములాటలలో కుప్పకూలిపోకుండా కాపాడుకోవలసి ఉంటుంది. ఏది ఏమయినా, ప్రస్తుతం, వై.యస్సార్.కాంగ్రెస్ పార్టీకి సరయిన దశానిర్దేశం చేయగల నాయకుడు లేకపోవడంవల్లనే, ఇటువంటి చిన్న సమస్యలు కూడా పెనుసమస్యలుగా మారేందుకు దోహదపడుతున్నాయని చెప్పవచ్చును. ఇటీవల తెలుగుదేశం పార్టీలో ముగ్గురు రాజ్యసభ సభ్యులు యఫ్.డి.ఐ. బిల్లు విషయంలో వోటింగులో పాల్గోననప్పుడు ఆ పార్టీలో చెలరేగిన ఇంతకంటే పెద్ద దుమారాన్ని ఆ పార్టీనేత చంద్రబాబు పాదయాత్రలో ఉన్నపటికీ ఎంతో సమర్దవంతంగా అదుపుచేయడం చూసినట్లయితే, పార్టీకి పటిష్టమయిన నాయకత్వం ఎంత అవసరమో తెలియజేస్తోంది. గానీ, దురదృష్టవశాత్తు వై.యస్సార్.కాంగ్రెస్ పార్టీకి ప్రస్తుతం నాయకత్వ లోపమే పెను సమస్యగా మారింది.