షర్మిల పార్టీ వెనుక ఎవరున్నారో తెలిస్తే షాకే
posted on Feb 9, 2021 @ 3:36PM
తెలంగాణలో కొత్త పార్టీ పెట్టబోతున్నారన్న ప్రచారంపై క్లారిటీ ఇచ్చారు వైఎస్ షర్మిల. లోటస్ పాండ్ లో వైఎస్సాఆర్ అభిమానులతో ఆత్మీయ సమావేశం నిర్వహించిన షర్మిల.. త్వరలోనే జనంలోకి వస్తానని చెప్పారు. తెలంగాణలో ప్రతి ఇంటికి వస్తానన్నారు. రాజన్న రాజ్యం కోసం ప్రయత్నం చేస్తానని తెలిపారు. వైఎస్ షర్మిల తాజా ప్రకటనతో తెలంగాణలో ఆమె కొత్త పార్టీ పెట్టడం ఖాయమని తెలుస్తోంది. జిల్లాలవారీగా నాయకులతో సమావేశాలు నిర్వహించాకా.. మార్చిలో షర్మిల పార్టీ పేరు ప్రకటిస్తారని తెలుస్తోంది.
వైఎస్ షర్మిల కొత్త పార్టీ అంశం ఇప్పుడు తెలంగాణలో హాట్ హాట్ గా మారింది. రాష్ట్రమంతా ఎక్కడ చూసినా దీనిపైనే చర్చ జరుగుతోంది. ఏపీ ముఖ్యమంత్రి జగన్ సోదరి తెలంగాణాలో పార్టీ పెట్టడమేంటనేది ఎవరికి అర్ధం కావడం లేదు. కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతున్నట్లు అన్న జగన్ తో విభేదాలు వస్తే .. తన పార్టీని ఏపీలో స్టార్ట్ చేయాలి కానీ తెలంగాణాలో ఎందుకు లాంచ్ చేస్టున్నారు అనే డౌట్స్ ఎక్కువగా వస్తున్నాయి. ఆదివారం జరిగిన టిఆర్ఎస్ సర్వ సభ్య సమావేశంలో కేసీఆర్ మాట్లాడుతూ ఇప్పటి వరకు తెలంగాణాలో ఎన్ని కొత్త పార్టీలు వచ్చి పోలేదు.. ఇది కూడా అంతే.. కొత్త పార్టీ పెట్టి నెగ్గుకు రావడం అంత ఈజీ కాదు అంటూ కామెంట్ చేసారు. దీంతో షర్మిల పెట్టబోతున్న కొత్త పార్టీ వెనుక కేసిఆర్ హస్తం లేదని స్పష్టమౌతోంది. షర్మిల తరుఫున తెలంగాణలోని వైసిపి సీనియర్ నేత, వైఎస్ కుటుంబ సభ్యుడే టచ్ లో ఉన్నారని వార్తలు వస్తున్నాయి. దీంతో తెలంగాణలో పెట్టబోయే పార్టీకి వైఎస్ఆర్ ఫ్యామిలీ సపోర్ట్ ఉన్నట్లు తెలుస్తోంది.
షర్మిల పెట్టబోయే కొత్త పార్టీ స్థాపన వెనుక ఎవరు ఉన్నారు అనే అంశంపై రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఏపీ సీఎం జగన్ ఆశీస్సులతోనే షర్మిల కొత్త పార్టీ వస్తోందని తెలుస్తోంది. మరో ముఖ్య విషయమేంటంటే ఈ మొత్తం వ్యవహారం వెనుక బీజేపీ హైకమాండ్ ఉన్నట్లుగా సమాచారం. బీజేపీ వత్తిడితోనే జగన్ సపోర్ట్ తో షర్మిల తెలంగాణాలో రాజకీయ రంగ ప్రవేశం చేస్తున్నట్లుగా గుసగుసలు వినిపిస్తున్నాయి. దీనికి గల ముఖ్య కారణాలు ఏంటంటే.. మొన్న జరిగిన జిహెచ్ఎంసీ ఎన్నికలలో బీజేపీ ఎంత తీవ్రంగా ప్రయత్నించినా ఇక్కడ ఉన్న సెటిలర్లు, క్రిస్టియన్లు , ఎంఐఎం పోటీ లేని ప్రాంతాల్లో ముస్లింలు, వైఎస్ అభిమానుల ఓట్లలో అధిక శాతం టిఆర్ఎస్ కు వెళ్లాయి. ఇది గ్రహించిన బీజేపీ పెద్దలు షర్మిలను రంగంలోకి దింపారంటున్నారు. షర్మిల పార్టీతో టీఆర్ఎస్ కు మద్దతుగా ఉన్న ముస్లిం, క్రిస్టియన్ ఓట్లకు గండి కొట్టడమే కమలనాధుల వ్యూహంగా ఉంది.
రెండు రాష్ట్రాలు విడిపోయినా తెలంగాణలోని వైఎస్ కు భారీగా అభిమానులున్నారు. అంతేకాదు తెలంగాణలోని రెడ్డి సామజిక వర్గం బీజేపీ పై అంత ఆసక్తి చూపకపోగా.. వీరంతా కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి వెంట నడుస్తుండడంతో కాంగ్రెస్ బలపడే అవకాశం ఉంది. దీంతో షర్మిలను రంగంలోకి దింపడం ద్వారా ఒక దెబ్బకు రెండు పిట్టలు అన్నట్లుగా అటు కేసీఆర్, ఇటు రేవంత్ రెడ్డి ఇద్దరినీ దెబ్బ కొట్టవచ్చు. ఇప్పటికే తెలంగాణాలో పుంజుకుంటున్న బీజేపీకి వచ్చే ఎన్నికలలో ఎదురు లేకుండా చేయడం కోసం షర్మిలతో కొత్త పార్టీ పెట్టించారని చెబుతున్నారు. కేసీఆర్ కు వెళ్లే ఓట్లు చీల్చడం.. అటు రేవంత్ వెనుక రెడ్డి సామాజిక వర్గం చేరకుండా చేయడం ప్రధాన లక్ష్యంగా కనిపిస్తోందని రాజకీయ విశ్లేషకులు చెపుతున్నారు. ఏది ఏమైనా వైఎస్ షర్మిల పెట్టేబోయే కొత్త పార్టీ ఏ పార్టీని దెబ్బ తీస్తుంది.. ఎవరిని అందలం ఎక్కించడానికి ఉపయోగపడుతుంది అనే అంశంలో ముందు ముందు స్పష్టత రానుంది.