వైఎస్ షర్మిల అరెస్ట్
posted on Feb 19, 2023 9:15AM
వైఎస్సార్టీపీ అధినేత్రి షర్మిల మళ్లీ అరెస్ట్ అయ్యారు. మహబూబాబాద్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నాయకుడు శంకర్ నాయక్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ షర్మిలపై నమోదు అయింది. దీంతో మహబూబాబాద్‌లో షర్మిల పాదయాత్రను పోలీసులు అడ్డుకుని, ఆమెను అరెస్ట్ చేసి హైదరాబాద్‌కు తరలించారు.
షర్మిల పాదయాత్రలో భాగంగా.. శనివారం సాయంత్రం మహబూబాబాద్‌లో జరిగిన భారీ బహిరంగ సభలో స్థానిక ఎమ్మెల్యే శంకర్ నాయక్ అవినీతి, అక్రమాలు, భూ కబ్జాలు, దందాలకు పాల్పడుతున్నారంటూ షర్మిల విమర్శించడమే కాకుండా పరుష పదజాలంతో దూషించారంటూ బీఆర్ఎస్ స్థానిక నేత పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు మేరకు షర్మిలపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి పోలీసులు షర్మిలను అరెస్ట్ చేశారు.
గతేడాది నవంబర్‌లో వైయస్ షర్మిల.. తన పాదయాత్రలో భాగంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలోని నర్సంపేట ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నాయకుడు పెద్ది సుదర్శన్‌రెడ్డిపై తీవ్ర అనివీతి ఆరోపణలు గుప్పించారు. దీంతో ఆగ్రహించిన ఎమ్మెల్యే అనుచరులు ఆప్పట్లో వైయస్ షర్మిల రాత్రి బస చేసే బస్సును దగ్ధం చేసే ప్రయత్నం చేయడమే కాకుండా, అక్కడ ఆ పార్టీకి చెందిన కార్లను సైతం చేశారు. దీంతో తమపై జరిగిన దాడిని షర్మిల ఖండించి.. నిరసన చేపట్టారు. ఇది శాంతి భద్రతల సమస్యకు దారి తీసే పరిస్థితి ఉందని భావించిన పోలీసులు అప్పట్లో ఆ ఆమెను అరెస్ట్ చేసి హైదరాబాద్ తరలించే క్రమంలో షర్మిల గాయపడ్డారు. దీనికి నిరసనగా అప్పట్లో షర్మిల తనకు భద్రత కావాలని కోరుతూ.. బీఆర్‌ఎస్ శ్రేణులు దాడి చేసి ధ్వంసం చేసిన కారులోనే ప్రగతి భవన్‌కు పయనమయ్యారు.
ఆ సందర్భంగా పోలీసులు క్రేన్ సహయాంతో షర్మిల ప్రయాణిస్తున్న కారును, ఆమె కారులో ఉండగానే ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్‌కు తరలించి అరెస్టు చేశారు. దాంతో అప్పట్లో షర్మిల పాదయాత్ర నిలిచిపోయింది. అనంతరం ఆమె కోర్టు అనుమతితో పాదయాత్రను పున: ప్రారంభించారు. పాదయాత్ర పున: ప్రారంభించిన రోజుల వ్యవధిలోనే షర్మిలను మళ్లీ అరెస్ట్ చేసి హైదరాబాద్ తరలించారు.