ఒక్క మాట.. జగన్ ను ఇరకాటంలో పడేసిందా?
posted on Oct 8, 2015 @ 5:41PM
అప్పుడప్పుడు ఆవేశంతో మాట్లాడే కొన్ని మాటలు వల్ల ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇప్పుడు అలాంటి పరిస్థితే వైకాపా అధ్యక్షుడు జగన్ కు ఎదురైంది. ప్రస్తుతం జగన్ ఏపీకి ప్రత్యేక హోదా డిమాండ్ చేస్తూ గుంటూరు దీక్ష చేస్తు బిజీగా ఉన్నారు. అయితే ఈ దీక్షలో ఒక ఆసక్తికర వ్యాఖ్య చేశారు అదేంటంటే తాను ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల కోసం పాటుపడుతున్నానని చెప్పారు. ఇప్పుడు ఈ ఒక్క పాయింట్ జగన్ కు ఇబ్బందికరంగా మారనుందా అంటే అవుననే అనుకుంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
దీనిలో భాగంగానే ఇప్పుడు అందరి సందేహం ఒక్కటే. అది జగన్ అమరావతి శంకుస్థాపనకు వస్తాడా?రాడా? అని. ఎందుకంటే దసరా రోజు అక్టోబర్ 22న ఏపీ రాజధాని అమరావతి శంకుస్థాపన కార్యక్రమం జరగనుంది. దీనికి చంద్రబాబు ఎంతో మంది అతిధులను ఆహ్వానించారు. వారితో పాటే ప్రతిపక్షనేత అయిన జగన్ కు కూడా ఆహ్వానం అందింది. అయితే ముందునుండి జగన్ ఏపీ రాజధాని కోసం ప్రభుత్వం చేపట్టిన భూసేకరణను తీవ్రస్థాయిలో విమర్శించారు. అంతేకాదు రైతుల భూములను అన్యాయంగా లాక్కుంటున్నారంటూ.. తాను కనుక పదవిలోకి వస్తే వారి భూములను వారికి ఇచ్చేస్తా అని కూడా అన్నారు. మరి అలాంటి ప్రగల్భాలు పలికిన జగన్ ఇప్పుడు ఈ అమరావతి శంకస్థాపన కార్యక్రమానికి వస్తారా? రారా అని సందేహం.
మరి ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల కోసం తాను పాటుపడుతున్నానని చెప్పిన జగన్ ఈ శంకుస్థాపన కార్యక్రమానికి వెళ్లకపోతే ప్రజలలో వ్యతిరేక భావం వస్తుంది. అందులో ఏపీ భవిష్యత్తు అయిన..రాజధాని నిర్మాణానికి దూరంగా ఉండటం వల్ల తాను ఏపీ రాజధానికి వ్యతిరేకం అనే రాంగ్ సిగ్నల్స్ పంపించినట్టు ఉంటుంది. అందులోనూ ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్రమోడీ తోపాటు దేశ విదేశాల నుండి ప్రముఖులు వస్తున్న నేపథ్యంలో జగన్ వారికి దూరంగా ఉండటం కూడా నష్టమే. మరి జగన్ ఇన్ని సమస్యల మధ్య అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి వెళ్తారో లేదో చూడాలి.