వైసీపీ గుండాలు శిలాఫలకాల్ని ధ్వంసం చేస్తున్నారు!
posted on Apr 29, 2020 @ 9:09PM
కరోనా మహమ్మారి తో ప్రజలు విలవిలాడుతుంటే అధికార వైసీపీ గుండాలు అభివృద్ధి శిలాఫలకాలును ధ్వంసం చేస్తూ వికృత చేష్టలకు పాల్పడుతున్నారని పర్చూరు శాసనసభ్యులు ఏలూరి సాంబశివరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. శిలా ఫలకాల ధ్వంసంతో తాను చేసిన అభివృద్ధిని ప్రజల హృదయాల్లో నుంచి చెరపలేరన్నారు. మార్టూరు మండలం డేగరముడి గ్రామంలో తెలుగుదేశం పార్టీ హయాంలో కోట్లాది రూపాయలతో వ్యయంతో చేపట్టిన అభివృద్ధి పనులకు అప్పటి మంత్రులు పరిటాల సునీత, సిద్ధ రాఘవరావు లు శంకుస్థాపన చేశారని ,ఆ శిలా ఫలకాలను మంగళవారం రాత్రి వైసిపి కార్యకర్తలు ధ్వంసం చేశారు.
ఈ ఘటనపై పర్చూరు శాసనసభ్యులు ఏలూరి సాంబశివరావు అసహనం వ్యక్తం చేశారు. ఒక పక్క రాష్ట్రంలో కరోనా మహమ్మారి శరవేగంగా విజృంభిస్తున్న తరుణంలో అధికార పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలు ప్రజా సేవా కార్యక్రమాలు నిర్వహించాల్సిది పోయి గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన అభివృద్ధి శిలాఫలకాలు ధ్వంసం చేయడం హేయమైన చర్యగా అభివర్ణించారు. అభివృద్ధి సంక్షేమమే ధ్యేయంగా రాజకీయాలకు అతీతంగా నియోజకవర్గం వ్యాప్తంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టానన్నారు.
శిలా పలకాలని ధ్వంసం చేస్తే తాను చేసిన అభివృద్ధిని ప్రజల హృదయాల్లో నుంచి చెరప లేరని, నియోజకవర్గంలో అభివృద్ధి పనులు ఎవరి హయాంలో జరిగాయో ప్రజలందరికీ తెలుసునన్నారు. నియోజకవర్గ సర్వతోముఖా అభివృద్ధే ధ్యేయంగా పని చేస్తున్నానన్నారు. అలాగని అభివృద్ధిని ధ్వంసం చేయాలని చూస్తే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు.
తన ప్రతి అడుగు ప్రజల కోసం ప్రగతి కోసం అని స్పష్టం చేశారు. అరాచకాలతో అభివృద్ధిని అడ్డుకోవడం సాధ్యం కాదన్నారు. అరాచకాలకు పాల్పడటం హేయమైన చర్య. తాను చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలతోనే మళ్లీ ప్రజాక్షేత్రంలో గెలిచానన్నారు. ఈ దుశ్చర్యలకు పాల్పడిన వ్యక్తులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.