జల దిగ్బంధంలో ఎల్గూర్ రంగంపేట
posted on Aug 13, 2025 @ 2:35PM
భారీ వర్షాలతో ఉమ్మడి వరంగల్ జిల్లా అతలాకుతలమైపోతోంది. రహదారులు జలమయమై ఎక్కడికక్కడ వాహనాల రాకపోకలు స్తంభించిపోయాయి. కొన్ని ప్రాంతాలకైతే బాహ్యప్రపంచంతో సంబం ధాలే తెగిపోయాయి.
వరంగల్ ఎల్గూర్ రంగంపేట పూర్తిగా జలదిగ్బంధంలో చిక్కుకుంది. ఓవైపు ఆండర్ బైపాస్ రోడ్డు ముని పోవడం, మరోవైపు ఎల్గుర్ రంగంపేట చెరువు గట్టు తెగి ప్రవహించడంతో ఎల్గూర్ రంగంపేటకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ఈ స్థితిలో గ్రామంలో పరశురాములు అనే వ్యక్తి తీవ్ర అనారోగ్యానికి గురికావడంతో అతడిని ఆస్పత్రికి తరలించడానికి కుటుంబ సభ్యులు నానా అగచాట్లూ పడ్డారు.
కుటుంబ సభ్యులు అంబులెన్స్ ద్వారా ఆసుపత్రికి తరలించేందుకు యత్నించినా అండర్ బైపాస్ వర్షపు నీటితో పూర్తిగా నిండిపోవడంతో గ్రామంలోకి అంబులెన్స్ వచ్చే అవకాశం లేకుండా పోయింది. దీంతో అతడిని గ్రామస్తుల సహాయంతో మంచంపై పడుకోబెట్టి రైల్వే ట్రాక్ మీదుగా మోసుకుంటూ ఆసుపత్రికి తరలించారు.