ఏపీని ముంచెత్తిన వర్షం.. వైసీపీ చెత్త రాజకీయం!
posted on Sep 2, 2024 6:35AM
ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. గతంలో ఎప్పుడూలేని విధంగా.. పాలకులు, ప్రజలు ఊహించని రీతిలో కుండపోత వర్షం కురిసింది. రెండు రోజులుగా కురుస్తున్న కుండపోత వర్షాలకు విజయవాడ చిగురుటాకులా వణుకుతోంది. ఎక్కడికక్కడ వరదతో జనజీవనం స్తంభించింది. నగరంలోని పలు కాలనీలు నీటమునిగాయి. అపార్టుమెంట్ల సెల్లార్లను వరద ముంచెత్తింది. ఊహించని భారీ వర్షం, వరదలతో ప్రభుత్వం అలెర్ట్ అయింది. సీఎం చంద్రబాబు నాయుడు నేరుగా రంగంలోకి దిగారు. అధికారులను ఉరుకులు పరుగులు పెట్టించారు. వరద నీటిలో చిక్కుకున్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వరద బాధితులకు ఆహారం, తాగునీరు పంపిణీకి చకచకా ఏర్పాట్లు చేశారు. ప్రభుత్వం వేగంగా స్పందించడంతో విజయవాడ ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే, వరద నీరు ఊహించని విధంగా ఇళ్లను ముంచెత్తడంతో వారి బాధ వర్ణనాతీతం. దీంతో చంద్రబాబు బాధితుల్లో మేమున్నామని భరోసా నింపేందుకు బోటులో వరద నీటిలో ప్రయాణించారు. బాధితులను పరామర్శిస్తూ.. నేనున్నా.. భయపడకండి అంటూ భరోసా కల్పించారు.
ముఖ్యంగా బుడమేరు ప్రభావిత ప్రాంతాల్లో వరద నీటిలో చిక్కుకున్న ప్రజానీకాన్ని ఆదుకునేందుకు అక్కడే ఉండాలని సీఎం చంద్రబాబు నిర్ణయించుకొని.. విజయవాడ కలెక్టరేట్ లోనే మకాం వేశారు. భారీ వర్షాలకు తోడు, కృష్ణా నది పరవళ్లు తొక్కుతుండటంతో విజయవాడలో వరద ఉధృతి తగ్గేవరకు చంద్రబాబు, పలువురు మంత్రులు అక్కడే ఉంటూ మానిటరింగ్ చేస్తున్నారు ఆదివారం రాత్రంతా కలెక్టరేట్ నుంచి వరద పరిస్థితిపై ప్రజా ప్రతినిధులు, అధికారులతో చంద్రబాబు చర్చిస్తూ.. వారికి తగిన సూచనలు చేశారు. మరోవైపు విజయవాడ ప్రాంతంలో వరద ఉధృతిపై చంద్రబాబుతో కేంద్రం పెద్దలతో మాట్లాడారు. చంద్రబాబు విజ్ఞప్తితో 10ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, 40 పవర్ బోట్లు, ఆరు హెలికాప్టర్లును ఏపీకి కేంద్రం పంపించనుంది.
విజయవాడలో వరద ఉధృతి నుంచి ప్రజలకు రక్షణ కల్పించేందుకు చంద్రబాబే స్వయంగా రంగంలోకి దిగడంతోపాటు.. అధికారగణం అంతా సహాయక చర్యల్లో చురుగ్గా పాల్గొంటుంటే.. మరోపక్క వైసీపీ నేతలు తప్పుడు ప్రచారాలతో తమ నీచ బుద్దిని ప్రదర్శిస్తున్నారు. ఐదేళ్లు అధికారమిస్తే అరాచక పాలనతో రాష్ట్రాన్ని బ్రష్టుపట్టించిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఆయన బ్యాచ్.. వరద సమయంలో ప్రభుత్వానికి, ప్రజలకు అండగా నిలవకుండా ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. అంతేకాదు.. అమరావతి ప్రాంతం మొత్తం మునిగిపోయిందంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ పైశాచిక ఆనందాన్ని పొందుతున్నారు.
రాష్ట్రంలో ఏ ప్రాంతంలోనైనా వరదలు సంభవిస్తే ప్రభుత్వంతో పాటు విపక్ష పార్టీల నేతలు కూడా సహాయక చర్యల్లో నిమగ్నమవుతారు. వరదల్లో చిక్కుకుపోయిన ప్రజలకు సహాయం అందించేలా పార్టీ శ్రేణులను అధిష్టానాలు ఆదేశిస్తాయి. కానీ, వైసీపీ రూటే సపరేటు.. ఏపీలో మాదే ప్రధాన ప్రతిపక్షం అని చెప్పుకుంటున్న వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డికి ప్రజలకు ఏం జరిగినా పట్టదు. దీనికితోడు ప్రజలకు అండగా నిలుస్తున్న ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తూ ప్రజలను మరింత భయభ్రాంతులకు గురిచేస్తూ వైసీపీ బ్యాచ్ పైశాచిక ఆనందాన్ని పొందుతున్నారు. అమరావతి రాజధాని ప్రాంతం కృష్ణా నది వరదల్లో మునిగిపోయిందని, చంద్రబాబు ఇల్లు మునిగిపోయిదంటూ ఫేక్ ప్రచారంతో ప్రజలను భయబ్రాంతులకు గురిచేసేలా సోషల్ మీడియాలో వైసీపీ బ్యాచ్ పోస్టులు పెడుతున్నారు. పొల్లాల్లో నిలిచిన నీళ్లు చూపించి అమరావతి మునిగిపోయిదంటూ ఫొటోలు, వీడియోలు వైరల్ చేస్తున్నారు.
వైసీపీ తప్పుడ ప్రచారంపై సీఎం చంద్రబాబు నాయుడు సీరియస్ అయ్యారు. కొంత మంది తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. అమరావతి మునిగిపోయింది.. ఇక్కడెలా రాజధాని కడతారని అంటున్నారు. బుద్ది, జ్ఞానం ఉన్నవాళ్లు ఎవరూ అలాంటి వ్యాఖ్యలు చేయరు. వరదల్లో చిక్కుకున్న వారికి సహాయం చేయండి.. అలాకాకుండా తప్పుడు ప్రచారం చేసే వారిపట్ల కఠినంగా వ్యవహరిస్తామని చంద్రబాబు హెచ్చరించారు. నేరస్తుల పార్టీ రాష్ట్రంలో ఉంది. వారిపని ఫేక్ న్యూస్ తో ప్రజలను మభ్యపెడుతూ, ఆ ఫేక్ న్యూస్ ను దేశవ్యాప్తంగా ప్రచారం చేస్తున్నారు. వాస్తవాలు కాకుండా తప్పుడు వార్తలు రాసే వారిపట్ల కఠినంగా వ్యవహరిస్తాం.. వదిలిపెట్టమని చంద్రబాబు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు.
ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత సీఎం చంద్రబాబు ఆధ్వర్యంలో అమరావతి రాజధానిలో వేగంగా అభివృద్ధి చేసేలా చర్యలు చేపట్టింది. ఆ ప్రాంతంలో ముళ్లకంపను తొలగించే పనులు వేగంగా జరుగుతున్నాయి. మరోవైపు అమరావతిలో పెట్టుబడులు పెట్టేందుకు ప్రముఖ కంపెనీలు ముందుకొస్తున్నాయి. ఈ పరిణామాలనుచూసి వైసీపీ అధినేత జగన్, ఆ పార్టీ నేతలు తట్టుకోలేక పోతున్నారు. దీంతో ఏదోరకంగా అమరావతిపై తప్పుడు ప్రచారం చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదే సమయంలో విజయవాడలో భారీ వర్షం కారణంగా వరదలు ముంచెత్తడంతో వైసీపీ బ్యాచ్ సంబురాలు చేసుకుంటున్నారు. ఇతర ప్రాంతాల్లో వరదనీటి వీడియోలు, ఫోటోలను తమ సోషల్ మీడియా ఖాతాల్లో పోస్టు చేస్తూ.. ఒక్క రాత్రి వర్షానికే అమరావతి ప్రాంతం మునిగిపోయిందంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఈ వార్తలను వైసీపీ అనుకూల మీడియా జాతీయ స్థాయిలో ప్రచారం చేయడం ప్రారంభించింది. తద్వారా అమరావతిలో పెట్టబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్న పారిశ్రామిక వేత్తల్లో భయాందోళన రేపేలా వైసీపీ బ్యాచ్ కుట్ర చేస్తుంది. ఒకపక్క వర్షాలతో విజయవాడ, తదితర ప్రాంతాల ప్రజలు ఇబ్బందులు పడుతుంటే.. వారికి అండగా నిలవాల్సిందిపోయి.. వైసీపీ నేతలు అమరావతిపై తప్పుడు ప్రచారం చేయడం, తప్పుడు వార్తలతో ప్రజలను భయాందోళనకు గురిచేయడం వంటి కార్యక్రమాలకు ప్రాధాన్యతనిస్తున్నారు. దీంతో వైసీపీ అధినేత జగన్, వైసీపీ నేతలపై ఏపీ ప్రజల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.