ఓటేయలేదని వైసీపీ నేతల దాడి!కృష్ణా జిల్లాలో అరాచకం
posted on Mar 21, 2021 @ 11:09AM
ఆంధ్రప్రదేశ్ లో అధికార పార్టీ ఆగడాలు కొనసాగుతున్నాయి. పంచాయతీ, మున్సిపల్ ఎన్నికలు ముగిసినా.. ఎన్నికల వేడి మాత్రం చల్లారడం లేదు. ఎన్నికలకు తమకు వ్యతిరేకంగా పని చేసిన వారిపై దాడులకు పాల్పడుతున్నారు అధికార పార్టీ నేతలు. టీడీపీ మద్దతుదారులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. కృష్ణా మచిలీపట్నంలో అధికార పార్టీ నేతల ఆగడాలు తారాస్థాయికి చేరాయి.
టీడీపీ సానుభూతిపరుల ఇళ్లపై వైసీపీ నాయకులు దాడులకు తెగబడుతున్నారు. ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థికి మద్దతుగా నిలిచినందుకు టీడీపీ వర్గీయుల ఇంటిపై దాడి చేస్తున్నారు. వైసీపీ కార్పొరేటర్ భర్త చీలి చక్రపాణి, అనుచరులు విచక్షణ రహితంగా దాడికి పాల్పడ్డారు. టీడీపీ వర్గీయులపై వైసీపీ నేతలు అసభ్యకరమైన పదజాలంతో దూషణలకు దిగారు. వైసీపీ నేతల దాడులతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
వైసీపీ కార్యకర్తల దాడుల్లో ధ్వంసమైన ఇండ్ల పరిసరాలను మాజీ మంత్రి కొల్లురవీంద్ర పరిశీలించారు. ఘటనను కొల్లు రవీంద్ర పోలీస్ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అధికార పార్టీ నేతల దాడుల నుంచి టీడీపీ కార్యకర్తలకు రక్షణ కల్పించాలని కోరారు.