వైసీపీకి ఉక్కు పాతరే..నా?
posted on Feb 12, 2021 @ 1:12PM
వైసీపీలో విశాఖ టెన్షన్. ప్రజల ఉక్కు పిడికిలిలో పార్టీ పిండిపిండి అవుతుందేమోననే అనుమానం. స్టీల్ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ అంశం అధికార పార్టీలో అలజడి రేపుతోంది. విశాఖ ఉక్కు, ఆంధ్రుల హక్కు అంటూ ప్రతిపక్షాలు ఉద్యమాలతో హోరెత్తిస్తున్నాయి. తూర్పు తీరంలో సునామీలా ఎగుస్తున్న పోరాటంలో ఫ్యాను రెక్కలు విరిగిపోవడం ఖాయంగా కనిపిస్తోంది. ప్రస్తుతం జరుగుతున్న పంచాయతీ ఎన్నికలు ముగియగానే.. గ్రేటర్ విశాఖపట్నం మునిసిపల్ కార్పొరేషన్-జీవీఎంసీ ఎన్నికలు జరుగుతాయని సమాచారం. ఎలక్షన్ అనగానే వైసీపీ అభ్యర్థుల్లో తెలియని ఆందోళన. కేవలం డివిజన్ అభ్యర్థులే కాదు.. వైసీపీ ఉత్తరాంధ్ర ఇంచార్జి విజయసాయిరెడ్డికి సైతం విశాఖ పేరెత్తితే ముచ్చెమటలు పడుతున్నాయని అంటున్నారు.
పంచాయతీ ఎన్నికల్లో తెలుగుదేశం అనూహ్యంగా పుంజుకుంది. ప్రస్తుత పరిస్థితుల్లో జీవీఎంసీ ఎలక్షన్స్ జరిగితే వైసీపీకి పరాభవం తప్పకపోవచ్చమో. ఈ విషయం ముందే పసిగట్టిన విజయసాయిరెడ్డి కొంత కాలంగా వైజాగ్ లోనే మకాం వేసి.. వార్డు అభ్యర్థులు, పార్టీ నేతలు, బూత్ కమిటీ సభ్యులతో విసృతంగా సమావేశాలు జరుపుతున్నారు. ఆయనలో భయం ఏ రేంజ్ లో ఉందంటే.. లేటెస్ట్ గా మద్దిలపాలెంలో మీటింగ్ జరుగుతుండగా.. ఆ మేటర్ ఎక్కడ లీక్ అవుతుందోననే ఆందోళనతో పార్టీ కార్యాలయం షట్టర్ మూసి వేయించారు. డివిజన్ స్థాయి లీడర్లతో సమావేశానికే విజయసాయి అంత టెన్షన్ ఫడటం చూసి పార్టీ శ్రేణులు సైతం కంగారు పడుతున్నారు. విజయసాయిరెడ్డి చేస్తున్న వరుస సమీక్షలపై వారంతా విసుక్కుంటున్నారు. ఆయన హైరానా చూస్తుంటే.. విశాఖ కార్పొరేషన్ ఎన్నికల్లో వైసీపీ ఓడిపోవడం కన్ఫామే అన్నట్టుగా ఉందని పార్టీ వర్గాలే అంటున్నాయి.
జీవీఎంసీ ఎన్నికలపై ఒకప్పుడు వైసీపీ అధిక ఆసక్తి కనబరిచింది. వైజాగ్ ను ఎగ్జిక్యూటివ్ కేపిటల్ గా ప్రకటించిన తొలినాళ్లలో వైసీపీ యమా జోరుమీదుంది. రాజధాని నిర్ణయంతో విశాఖతో పాటు ఉత్తరాంధ్రపై తమదే గుత్తాధిపత్యం అని గొప్పలకు పోయింది. ఎప్పుడెప్పుడు ఎలక్షన్లు వస్తాయా అని ఆరాటపడింది. అయితే విశాఖ ఉక్కు కర్మాగారాన్ని వంద శాతం ప్రైవేటు పరం చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకోవడం.. అందుకు తెరవెనుక వైసీపీ పెద్దల మంత్రాంగం ఉన్నట్టు తెలుస్తుండటంతో విశాఖవాసులు ఒక్కసారిగా భగ్గుమన్నారు. ఉద్యమంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ఉక్కు పిడికిలి బిగించారు. ఇప్పుడు సీన్ మొత్తం రివర్స్. ఇప్పట్లో ఎన్నికలు జరగకుండా ఉంటే బాగుండునని కోరుకుంటోంది వైసీపీ. అయితే.. ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ దూకుడు మామూలుగా లేదు. ఏ క్షణంలో జీవీఎంసీ నగారా మోగినా ఆశ్చర్యం లేదు. అందుకే సమయం లేదు అభ్యర్థుల్లారా అంటూ కాలికి బలపం కట్టుకుని తిరుగుతూ విశాఖపట్నంలో తెగ హడావుడి చేస్తున్నారు విజయసాయిరెడ్డి.
ప్రజల నుంచి ఇంత వ్యతిరేకత వస్తుందని ఊహించని వైసీపీ.. చేతులు కాలాక నష్ట నివారణ చర్యలు చేపట్టింది. ప్రైవేటీకరణ పాపం తమది కాదని.. ఒడిశాదంటూ కుంటి సాకులు చెబుతోంది. ఒడిశాకు చెందిన కేంద్ర ఉక్కు మంత్రి ధర్మేంధ్ర ప్రధాన్ ను దోషిగా చూపించే ప్రయత్నం చేశారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. విశాఖ ఉక్కు పాపాన్ని ఎంతగా కడిగేసుకోవాలని చూస్తున్నా.. అది అంత ఈజీగా వదిలే వ్యవహారం కాదు. పోస్కో ప్రతినిధులు గతేడాదే సీఎం జగన్ ను కలిసి చర్చించడం అందరికీ తెలిసిందే. పైకి ఎంత కాదంటున్నా.. ఆ డీల్ వెనుకు వైసీపీ పెద్దల పాత్ర ఎంతో ఉందని కార్మికులు, ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈ విషయంలో అధికార పార్టీపై ప్రజల నుంచి తీవ్ర స్థాయిలో ఆగ్రహజ్వాల ఎగిసిపడుతోంది. ఈ సమయంలో జీవీఎంసీ ఎన్నికలు జరిగితే.. ఓటర్లు వైస్సార్ సీపీకి తగిన బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని క్షేత్రస్థాయిలో పరిస్థితులు చూస్తుంటే అర్థమవుతోంది.
అందుకే.. ఉత్తరాంధ్ర వైసీపీ ఇంచార్జి విజయసాయిరెడ్డిలో అంతటి ఆందోళన. జీవీఎంసీ ఎన్నికలు ఇప్పుడు జరగొద్దని బలంగా కోరుకుంటున్నారు. అయితే.. నిమ్మగడ్డ జోరు చూసి తన కోరిక నెరవేరేలా లేదని అర్థమయ్యే.. వరుస సమీక్షలతో వైసీపీ అభ్యర్థులను సమీక్షలతో ఎన్నికలకు సమాయత్తం చేస్తున్నారని తెలుస్తోంది. మరి, త్వరలోనే ఎలక్షన్ జరిగితే..? వైసీపీకి మూడినట్టేనా?