టీడీపీ అభ్యర్థికి వైసీపీ ఎంపీ సపోర్ట్
posted on Feb 12, 2021 @ 2:27PM
ఆంధ్రప్రదేశ్ లో పంచాయతీ ఎన్నికలను అధికార వైసీపీ, ప్రతిపక్ష తెలుగు దేశం పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఏకగ్రీవాల కోసం అధికార పార్టీ ప్రయత్నిస్తుండగా.. టీడీపీ అడ్డుకుంటోంది. దీంతో చాలా ప్రాంతాల్లో ఘర్షణలు జరుగుతున్నాయి. పోటీలో ఉన్న ఇతర పార్టీల తరపు అభ్యర్థులను.. వైసీపీ ప్రజా ప్రతినిధులు బెదిరించిన వీడియో, ఆడియోలు లీకై సోషల్ మీడియాలో హల్చల్ చేశాయి. బెదిరింపులకు సంబంధించి విశాఖ జిల్లా యలమంచలి వైసీపీ ఎమ్మెల్యే కన్నబాబు రాజుపై కేసు కూడా నమోదైంది.
ఏకగ్రీవ ఎన్నికల కోసం అధికార పార్టీ నేతలు బరి తెగిస్తున్నారనే ఆరోపణలు వస్తుండగా.. కర్నూల్ జిల్లాలో మాత్రం ఊహించని ఘటన జరిగింది. అధికార పార్టీకి షాక్ తగిలింది. వైసీపీ ఎంపీనే టీడీపీ సర్పంచ్ అభ్యర్థికి మద్దతు ఇచ్చి ఏకగ్రీవం చేశారు. సొంతపార్టీ అభ్యర్థిని ఏకగ్రీవం చేయాల్సిన చోట.. ప్రత్యర్థి పార్టీ మద్దతిచ్చిన వ్యక్తిని వైసీపీ ఎంపీ ఏకగ్రీవం చేయడం ఆసక్తిగా మారింది. టీడీపీ సర్పంచ్ అభ్యర్థిని ఏగ్రీవం చేసిన ఆ ఎంపీ అనంతపురం జిల్లా హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్.
ఎంపీ గోరంట్ల మాధవ్ సొంతూరు ర్నూలు జిల్లా రుద్రవరం. రుద్రవరం సర్పంచ్ అభ్యర్థిగా గోరంట్ల మాధవ్ దగ్గరి బంధువు ఎం.కే మధు టీడీపీ మద్దతుతో బరిలో దిగారు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఆయన మధుకి మద్దతివ్వాల్సి వచ్చింది. సొంత పార్టీ నేతలను ఒప్పించి మరీ టీడీపీ ఏకగ్రీవానికి పరోక్షంగా సహకరించారు గోరంట్ల మాధవ్. ఐతే మాధవ్ తీరుపై వైసీపీ శ్రేణుళ్లో తీవ్రమైన చర్చ జరుగుతోంది. సొంతపార్టీని కాదని బంధువుకు మద్దతిచ్చారంటూ స్థానిక నేతలు, కార్యకర్తలు మాధవ్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లాలని భావిస్తున్నట్లు సమాచారం.