నైరాశ్యంలో వైసీపీ ఎమ్మెల్యేలు
posted on Aug 3, 2022 @ 10:36AM
ఇదో విచిత్ర కాలం.. ఏ పార్టీలో ఎవరు ఎంత కాలం ఉంటారన్నది చెప్పడమూ కష్టమైపోతోంది. ప్రతీవారు ఏదో సాధించగలనని పార్టీలో చేరడం, తాము ఆశించిన పదవి రాకపోతే మరో పార్టీతో చెలిమి చేసి అందు లోకి మారిపోవడం అనాదిగా జరుగుతోంది.
ఇప్పుడు మరీ నాయకత్వాన్ని గౌరవించే స్థితి కూడా పోయింది. నాయకుని నుంచి మద్దతు, అనుకూల సంకేతాలు లేకుంటే నాయకుడిని కూడా తీవ్రంగా వ్యతిరేకించి మరీ వెళిపోతున్నారు. ఇందుకు ఏ పార్టీవారూ మినహాయింపు కాదు. తాజాగా ఆంధ్రప్రదేశ్ అధికార పార్టీ వైసీపీలో అధినేత పట్ల వ్యతిరేకత.. ఎమ్మెల్యేలలో నైరాశ్యం పెంచుతోంది. అధికారంలోకి వచ్చి మూడేళ్లు దాటినా ప్రజల ప్రజా వ్యతిరేకతే తప్ప ప్రజాభిమానాన్ని చూరగొనని పార్టీ తీరుతో ఎమ్మెల్యేలు రగిలిపోతున్నారు. పార్టీ వ్యవహారాలు, పథకాల అమలు విషయంలో ప్రజల నుంచి తీవ్ర స్థాయిలో నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఏ ప్రాంతంలోనూ ఎమ్మెల్యేలు ధైర్యంగా ప్రజల్ని కలిసే పరిస్థితి లేదు. ఈమధ్య గడప గడపకూ అనే కార్యక్రమం ఆరం భించి ప్రజల చెంతకు వెళ్లి పార్టీ ప్రజలకు చేసిన మేలు చెప్పుకుందామనుకున్న పార్టీ ఎమ్మెల్యేలకు ప్రభుత్వం ప్రజలకు చేసిన మేలేమీ లేదని ప్రజా నిరసనలతో అర్ధమౌతోంది.
ఈ పరిస్థితుల్లో పార్టీ నేతలు, ఎమ్మెల్యేలలో తమ రాజకీయ భవిష్యత్ పై ఆందోళన పెరిగింది. వారిలో నైరాశ్యం గూడుకట్టుకుంది. అందుకు తాజాగా ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు వ్యాఖ్యలే నిదర్శనం. పార్టీలేదు గాడిద గుడ్డూ లేదు.. ఎవరు ఏ పార్టీలో ఉంటారో ఎవరకి తెలుసు? అన్న ఆయన వ్యాఖ్యలు వైసీపీలో కలకలం రేపాయి.
తాను వైసీపీలోనే ఉంటానన్న నమ్మకం లేదని చిట్టిబాబు కుండ బద్దలు కొట్టేశారు. పార్టీపరంగా, ప్రభుత్వం పరంగానూ ప్రజల నుంచి, అభిమానుల నుంచి ఉన్న అభిమానం ఆవిరైపోవడమే ఇందుకు కారణమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ప్రభుత్వం అన్ని రంగాల్లోనూ వైఫల్యాలు తప్ప సాధించిందేమీ లేకపోవడమే ఇందుకు కారణమని వివరిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో పార్టీని పట్టుకుని అంటకాగితే వచ్చే ఎన్నికల్లో విజయం అసాధ్యమని మెజారిటీ ఎమ్మెల్యేలు భావిస్తున్నారని అంటున్నారు.