పీఏసీ కోసం పెద్దిరెడ్డి నామినేషన్.. బలం లేకున్నా పోటీకి తయారు!
posted on Nov 21, 2024 @ 1:34PM
వైసీపీ అధినేత జగన్ కు స్వప్రయోజనాలు తప్ప ప్రజా క్షేమం, ప్రజా ప్రయోజనాలు ఇసుమంతైనా పట్టవని మరో మారు నిర్ద్వంద్వంగా రుజువైపోయింది. ఈ ఏడాది జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికలలో ఘోర పరాజయాన్ని మూటగట్టుకుని కనీసం ప్రతిపక్ష హోదాకు కూడా నోచుకోకుండా మిగిలింది. ఏపీ అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా దక్కాలంటూ సభ్యుల సంఖ్యను బట్టి కనీసం 18 మంది ఎమ్మెల్యేలుగా గెలివాల్సి ఉండగా జగన్ నాయకత్వంలోని వైసీపీకి కేవలం 11 మంది మాత్రమే ఉన్నారు. దీంతో జగన్ వైసీపీ అధినేతే అయినా విపక్ష నేత హోదా లేకుండా కేవలం పులివెందుల ఎమ్మెల్యేగా మాత్రమే సభలో కూర్చోవలసి ఉంటుంది. దీంతో ఆయన విపక్ష నేత హోదా ఇస్తేనే సభకు వస్తానంటూ అసెంబ్లీని బాయ్ కాట్ చేశారు. తన ఒక్కడికే ఆ బహిష్కరణను పరిమితం చేయకుండా మొత్తం వైసీపీ సభ్యులందరినీ సభకు హాజరు కాకుండా ఆపేశారు.
అయితే ఇప్పుడు పబ్లిక్ అక్కౌంట్స్ కమిటీ (పీఏసీ) చైర్మన్ ఎన్నిక ప్రక్రియ మొదలు కావడంతో వైసీపీ ఆలోచనలో మార్పు వచ్చింది. పీఏసీ చైర్మన్ కు కేబినెట్ హోదా ఉంటుంది. ఆ హోదాతో పాటు వచ్చే సౌకర్యాలూ అందుతాయి. దీంతో వైసీపీ ఆ పదవిపై కన్నేసింది. సాధారణంగా ప్రతిపక్ష ఎమ్మెల్యేను పీఏసీగా చేయడం సాంప్రదాయం. అయితే ప్రస్తుతం ఏపీ అసెంబ్లీలో ప్రతిపక్షం అనేదే లేదు. దీంతో సాంప్రదాయం ప్రకారం ప్రతిపక్ష సభ్యుడికి పీఏసీ చైర్మన్ పదవి ఇవ్వడమనే ప్రశ్నే తలెత్తదు. కానీ కేబినెట్ ర్యాంక్ కోసం తహతహలాడిపోతున్న జగన్, ఆయన పార్టీ.. ఇప్పుడీ పీఏసీ చైర్మన్ పదవి కోసం అర్రులు చాస్తోంది. ఈ పదవికి నామినేషన్ వేయడానికి రెడీ అయిపోయింది. ఆ పదవి కోసం మాజీ మంత్రి పెద్దరెడ్డి రామచంద్రారెడ్డి నామినేషన్ వేశారు. అయితే పీఏసీ సభ్యుడిగా ఎన్నిక కావాలంటే కనీసం 18 మంది ఎమ్మెల్యేల బలం ఉండాలి. కానీ వైసీపీకి ఆ బలం లేదు. బలం లేకపోయినా వైసీపీ బరిలోకి దిగడం పట్ల సర్వత్రా విస్మయం వ్యక్తం అవుతోంది.
నిబంధనల మేరకు పీఏసీలో మొత్తం 12 మంది సభ్యులలో తొమ్మండుగురు అసెంబ్లీ నుంచీ, ముగ్గురు శాసనమండలి నుంచి ఎన్నికౌతారు. అయితే పీఏసీ చైర్మన్‌ను మాత్రం ఎమ్మెల్యేల నుంచే ఎన్నుకుంటారు. గత అసెంబ్లీలో తెలుగుదేశం కు ప్రతిపక్ష హోదా ఉంది కనుక పయ్యావుల కేశవ్ కు అప్పుడు పీఏసీ చైర్మన్ పదవి దక్కింది. అయితే ఇప్పుడా పరిస్థితి లేదు. అసెంబ్లీ నుంచి పీఏసీకి వైసీపీ నుంచి ఒక్కరు కూడా ఎన్నికయ్యే అవకాశం లేదు. అయినా తగుదునమ్మా అంటూ పెద్ద రెడ్డి రామచంద్రారెడ్డి చేత నామినేషన్ వేయించడానికి వైసీపీ అధినేత జగన్ తయారైపోయారు. అయితే కేబినెట్ హోదా కోసం వేస్తున్న నామినేషన్ ఆయనే స్వయంగా వేస్తే సరిపోయేదిగా అని తెలుగుదేశం వర్గీయులు ఎగతాళి చేస్తున్నారు.