వైసీపీ ఎమ్మెల్యే ఛీప్ పబ్లిసిటీ... పండగ నాడు మద్యం, మాంసం పంపిణీ
posted on Jan 16, 2024 @ 10:41AM
పురాణాల దగ్గర నుంచి దానాలు చేయడం అనేది ఒక ఆచారంగా వస్తుంది. దానం చేయడం వల్ల పుణ్యఫలం దక్కుతుంది. మనకున్న వాటిని అవసరంలో ఉన్న ఇతరులకి దానం చేసి సహాయం చేయడం వల్ల పుణ్యం దక్కుతుందని నమ్ముతారు. అందుకే కుడి చేత్తో చేసిన దానం గురించి ఎడమ చేతికి కూడా తెలియకూడదని పెద్దలు చెబుతూ ఉంటారు. కానీ ఎపిలో వైసీపీ ఎమ్మెల్యే ఒకరు సంక్రాంతి కానుకగా ఇచ్చిన ఫుల్ బాటిల్స్, కోడి మాంసం సోషల్ మీడయా వేదికగా తెగ వైరల్ చేసుకున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి తరువాత రోజు జరుపుకునే కనుమ పండుగను ఎంతో ఘనంగా చేసుకుంటారు. పండుగ నాడు కోడి కూర, కిక్కిచ్చే చుక్క ఉంటే కొందరికి పండుగే. దసరా పండుగ నాడు యజమానులు తమ వద్ద పనిచేసే వాళ్లకు బోనస్ లు ఇస్తుంటారు. ఇక రాజకీయ నేతలైతే తమ మద్దతుదారులకు మందు, ముక్క తప్పనిసరిగా ఇస్తారు. ఇలాంటి ఘటననే విశాఖలో చోటుచేసుకుంది.
నిరుడు దసరా పండుగ నాడు విశాఖ దక్షిణ మండల వైసీపీ అధ్యక్షుడు దొడ్డి బాపు ఆనంద్ తమ మద్దతుదారులు, మరికొంత మందికి కోడి, లిక్కర్ బాటిల్ పంపిణీ చేశారు. ఈ వీడియోలు నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి. విశాఖ డాబా గార్డెన్స్‌లోని వైసీపీ ఆఫీసు వద్ద అప్పట్లో ఓ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా వైసీపీ నేత కోడి, మద్యం పంపిణీ చేశారు. గతంలో కేజీ మటన్ ఇచ్చామని, ఈ ఏడాది కోడి, క్వార్టర్ మందు ఇస్తున్నట్లు ఆయన బహిరంగంగానే చెప్పుకున్నారు.
గత ఏడాది వైసీపీ విశాఖ దక్షిణ మండల అధ్యక్షుడు చేసిన ప్రచారాన్ని వైసీపీ దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ ఓర్వ లేకపోయారు. సరిగ్గా సంవత్సరం కాపు కాశారు. సోమవారం నాడు కనుమ పండగను పురస్కరించుకుని ఒక రోజు ముందు అంటే సంక్రాంతినాడే వైసీపీ కార్యకర్తలు, నాయకులకు మద్యం పంపిణీ చేశారు. ఇది చీప్ లిక్కర్ కావడం గమనార్హం. జగన్ పాలనకు దర్పం పట్టే విధంగా వైసీపీ ఎమ్మెల్యే తన కాలేజి క్లాస్ రూమ్లలోనే చీప్ లిక్కర్ పంపిణీ చేయడం హాట్ టాపిక్ అయ్యింది. తరగతి గదిలో విద్యార్థులు కూర్చొనే బెంచీలపై వైసీపీ నేతలను కూర్చోబెట్టి పంపిణీ చేయడం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. కాలేజి ప్రాంగణంలోకి వైసీపీ శ్రేణులు భారీగా తరలి రావడం ఫుల్ బాటిల్స్, కోడి మాంసం తీసుకొని ఇంటికి వెళ్లిపోవడం చకచకా జరిగిపోయాయి. మద్యపాన నిషేధం అంటూ ప్రచారం చేసుకున్న వైసీపీ నేతలు ఇప్పుడు మద్యం బాటిల్స్ పంపిణీ చేస్తున్నారని ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి.