తాడేపల్లిగూడెం సభతో వైసీపీ గుండెల్లో భూకంపం!.. ఓటమి ఖాయమన్న నిర్వేదం!
posted on Feb 29, 2024 9:01AM
తెలుగుదేశం పార్టీ, జనసేన కూటమిగా ఏర్పడ్డాయి. సీట్ల సర్దుబాటు కూడా చేసేసుకున్న తరువాత జనసేన పేరుతో వైసీపీ వాయిస్ పెంచింది. జనసైనికులం అని చెప్పుకుంటున్న కొందరిని తీసుకొచ్చి పవన్ కల్యాణ్ పై విమర్శలు చేయిస్తోంది. పొత్తులో భాగంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ 24 సీట్లు చాలు అన్న ప్రకటనకు వక్రభాష్యాలు చెబుతూ, ఆయన జనసేనను అమ్మేశారంటూ వారు ఓ రేంజ్ లో గొంతు చించుకుంటున్నారు. సహజంగానే అలా మాట్లాడే వాళ్లకు వైసీపీ సోషల్ మీడియా ఎనలేని ప్రాధాన్యత ఇస్తోంది.
ఇక జగన్ మీడియా కూడా అటువంటి వారితో ఇంటర్వ్యూలను రిపీట్ ల మీద రిపీట్ లు చేస్తున్నది. ఇక హరిరామ జోగయ్య వంటి స్వయం ప్రకటిత కాపు మేధావులు అయితే.. బాగు కోరి చెప్పినా పట్టించుకోవడం లేదు ఇక వారి ఖర్మ అంటూ ప్రకటనలు గుప్పిస్తున్నారు. ఇంతకీ వారిదంతా ఎందుకు చేస్తున్నారంటే.. పొత్తులో భాగంగా ఇరు పార్టీల మధ్యా ఓటు ట్రాన్స్ ఫర్ జరగదు అన్న భావనను వ్యాప్తి చేయడానికే. అయితే తాడేపల్లిగూడెంలో జరిగిన జెండా బహిరంగ సభలో తన స్ఫూర్తిదాయక ప్రసంగంతో జనసేన అధినేత పవన్ కల్యాణ్ వీటన్నిటికీ స్పష్టమైన సమాధానం ఇచ్చారు. తాడేపల్లిగూడెం సభలో పవన్, చంద్రబాబు… తమ మధ్య ఎలాంటి సమన్వయం, అవగాహన ఉందో ప్రత్యక్షంగా చూపించారు. ఎక్కడా అనుమానాలు… సందేహాలకు చోటు లేదని స్పష్టం చేశారు. ఎలాంటి త్యాగాలకైనా సిద్ధమని కూడా చెప్పారు.
. సహజంగా ఆ సభలో ముఖ్య నేత చివరిలో మాట్లాడతారు. ఆయన మాట్లాడితే సభ ముగిస్తుంది. వచ్చిన వాళ్లు వెళ్లిపోతారు. కానీ తాడేపల్లిగూడెం సభలో చంద్రబాబు పవన్ కంటే ముందు మాట్లాడారు. ఉమ్మడి సభ అయినా .. చంద్రబాబు సభలో చివరిగా మాట్లాడే గౌరవాన్ని పవన్ కల్యాణ్‌కే ఇచ్చారు. పొత్తులో పొరపొచ్చాలు లేవని ఇది విస్పష్టంగా చాటింది. పవన్ కల్యాణ్‌కు చంద్రబాబు గౌరవం ఇస్తారన్న స్పష్టత వచ్చింది. చంద్రబాబు తన ప్రసంగంలో పవన్ కల్యాణ్ ను ప్రశంసించారు. రాష్ట్రం కోసం, రాష్ట్ర భవిష్యత్ కోసం తాము అరమరికలు లేకుండా పని చేయాలన్న కృత నిశ్చయంతో ఉన్నామని విస్పష్టంగా చెప్పారు.
అలాగే పవన్ కల్యాణ్ కూడా తన ప్రసంగంలో చంద్రబాబును రాజకీయ దురంధరుడిగా అభివర్ణించారు. అలాగే జనసేన పార్టీకి సంస్థాగత బలం లేదని ఎలాంటి శషబిషలకూ తావివ్వకుండా చెప్పారు. తెలుగుదేశం బలం ఇదీ అని జనసైనికులకు అర్ధమయ్యేలా చెప్పారు. రాష్ట్రం కోసం, రాష్ట్ర భవిష్యత్ కోసం, యువత భవిష్యత్ కోసం కలిసి పోరాడాల్సిన అవశ్యకతను కళ్లకు కట్టారు. చంద్రబాబు సమర్థతను.. సీనియారిటీని వివరించారు. మొత్తంగా ఓ అద్భుతమైన సమన్వయం తమ మధ్య ఉందన్న సందేశాన్ని ఈ సభ ద్వారా ఇరువురు నేతలూ తమ తమ పార్టీల క్యాడర్ కే కాదు.. పొత్తుపై ఏ మూలో ఇంకా సందేహం ఉన్న వారందరి సందేహాలనూ పటాపంచలు చేశారు. ఓటు బదిలీ జరగదంటూ వైసీపీ కుట్రపూరితంగా చేస్తున్న ప్రచారానికి చెక్ పెట్టారు. పొత్తులో భాగంగా జనసేన ఓట్లు తెలుగుదేశంకు, తెలుగుదేశం ఓట్లు జనసేనకు బదిలీ అయితే.. ఏకపక్ష విజయాలు వస్తాయి, అది జరగకుంటే.. తేడా వస్తుంది. ఆ తేడా రాకుండా, ఓట్ల బదలీ సజావుగా సాగేందుకు ఇరువురు నేతలూ చక్కటి వ్యూహంతో ఈ సభ ద్వారా పొత్తులో ఎలాంటి పొరపొచ్చాలూ లేవని విస్పష్టంగా చాటారు.
మొత్తంగా తాడేపల్లి గూడెం సభ ద్వారా అధికార పక్షం కుట్రలను ఇరువురు నేతలూ బహిర్గతం చేశారు. వాటిని విచ్ఛిన్నం చేయాలన్న భావనను రెండు పార్టీల నేతలూ, క్యాడర్ లో కలిగించారు. మొత్తంగా సభకు వచ్చిన జనస్పందన, బాబు, పవన్ కల్యాణ్ ప్రసంగాలు ఇరు పార్టీల క్యాడర్ లోనే కాదు, ప్రజలలో కూడా ఇరువురి కలయికతో రాష్ట్రం ఉజ్వల భవిష్యత్ దిశగా పరుగులు తీస్తుందన్న నమ్మకం కలిగించారు. అదే సమయంలో అధికార వైసీపీలో ఇప్పటికే ఉన్న భయం ద్విగుణీకృతమై, ఓటమి ఖాయమన్న భావన కలిగేలా చేశారు.