గన్నవరం వైసీపీలో వంశీ కథ ముగిసినట్టేనా...!
posted on Sep 12, 2020 @ 12:37PM
2019 లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో గన్నవరం నుండి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచిన వల్లభనేని వంశీ ఇటు తెలంగాణలో తన ఆస్తులను కాపాడుకోవడంతో పాటు తనపై పెట్టిన కేసుల నుండి తప్పించుకోవడానికి సీఎం జగన్ ను కలిసారని అప్పట్లో టాక్ నడిచింది. ఆ తరువాత చంద్రబాబుకు ప్రతిపక్షనాయకుడి హోదా తప్పించే రాజకీయ క్రీడలో భాగంగా సీఎం జగన్ సారధ్యంలోని వైసిపికి జై కొట్టిన సంగతి కూడా తెలిసిందే. దీంతో అప్పటికే రెండు గ్రూపులు ఉన్న గన్నవరం వైసిపిలో ఆయన చేరిక మరిన్ని ఘర్షణలకు దారి తీస్తోంది. అంతేకాకుండా అయన చేరికను ఈ రెండు గ్రూపులు ఎంత మాత్రం జీర్ణించుకోలేకపోయాయి. దీనికి గల ముఖ్య కారణం ఎన్నికల ప్రచార సమయంలో జగన్ సారధ్యంలోని వైసిపి పై అయన చేసిన కామెంట్సేనట. "బుద్ది ఉన్నవాడెవడు వైసిపిలో చేరడు" అని ఆరోజుల్లో వంశీ చేసిన సంచలన కామెంట్స్ ఇప్పటికి వైసిపి శ్రేణులను ముల్లులా గుచ్చుతూనే ఉన్నాయి. అంతేకాకుండా టీడీపీ ఎమ్మెల్యే గా ఉన్నపుడు జగన్ సతీమణి ని కూడా జైలుకు పంపుతాము అని కామెంట్ చేయడంతోపాటు, సాక్షాత్తు జగన్ పై అయన చేసిన కామెంట్లను పార్టీ కేడర్ అసలు మర్చిపోలేకపోతున్నారని.. దీంతో వైసిపి కేడర్ ఆయనతో కలిసి నడవడం కష్టమేనని తెలుస్తోంది.
ఇదిలా ఉండగా తాజాగా నియోజకవర్గంలో అటు ఎమ్మెల్యేను, ఇటు వైసిపి ఇంచార్జ్ కూడా తానేనని వంశీ ప్రకటించుకున్న నేపథ్యంలో ఆయనకు పార్టీ కేడర్ కు మధ్య గ్యాప్ మరింత పెరిగింది. ఇప్పటికే నియోజకవర్గంలో పార్టీకి పెద్దదిక్కుగా ఉన్న దుట్టా రామచంద్రరావు వర్గం, మొన్నటి ఎన్నికలలో పోటీ చేసి ఓడిపోయిన యార్లగడ్డ వెంకట్రావు వర్గం వంశీ పోకడ పై గుర్రుగా ఉన్నాయి. అంతేకాకుండా నియోజకవర్గంలోని కొన్ని ప్రాంతాల్లో ఈ రెండు వర్గాల పై వంశీ వర్గీయులు దాడులు చేస్తుండడంతో ఈ వ్యవహారం పార్టీ అధిష్టానం దృష్టికి కూడా చేరినట్లు సమాచారం. దీంతో గన్నవరం నియోజకవర్గంలో ఏం జరుగుతోందని పార్టీ హైకమాండ్ ఆరా తీసి అక్కడి పరిస్థితుల పై రిపోర్ట్ కూడా తెప్పించుకున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఈ రిపోర్ట్ ను పరిశీలించిన హైకమాండ్ పార్టీలోని కేడర్ తో అడ్జస్ట్ కాలేని నాయకులు పార్టీకి అవసరం లేదని డిసైడ్ అయిందని దీంతో ఇక వంశీని పక్కన పెట్టేసినట్లేనని జిల్లాలోని ముఖ్య నాయకులు గుసగుసలాడుకుంటున్నారు. దీంతో వైసిపిలో వంశీ కథ ముగిసినట్లేనని లేటెస్ట్ గా టాక్ వినిపిస్తోంది. దీంతో అటు టికెట్ ఇచ్చిన పార్టీ, ఇటు అధికార పార్టీ లు రెండు పక్కన పెడితే వంశీ పరిస్థితి రెంటికి చెడ్డ రేవడిలా అవుతుందేమోనని అయన అనుచరుల ఆందోళన.