వైసీపీలో తిరుపతి బైపోల్ భయం!
posted on Dec 29, 2020 @ 10:30AM
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి తిరుపతి ఉప ఎన్నిక భయం పట్టుకుందా? ప్రభుత్వ వ్యతిరేకత తమ కొంప ముంచబోతోందని గ్రహించిందా? అంటే అవుననే సమాధానమే వస్తోంది. ఏపీలో అధికారంలో ఉంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ. తిరుపతి ఆ పార్టీకి సిట్టింగ్ సీటు. ఎంపీ చనిపోవడంతో సానుభూతి కూడా ఉంటుంది. ఇన్ని అనుకూల అంశాలు ఉన్నా తిరుపతి ఉపఎన్నికపై వైసీపీలో భయం కనిపిస్తోందని తెలుస్తోంది. ఇందుకు సర్కార్ చేయించుకున్న సర్వేలే కారణమని చెబుతున్నారు. తిరుపతి ఉప ఎన్నికపై ఇప్పటికే రెండు, మూడు సార్లు సర్వే చేయించారట సీఎం జగన్. అయితే అన్ని సర్వేల్లోనూ టీడీపీకి లీడ్ వచ్చిందట. మహిళలు, రైతులు, ఉద్యోగులు, యువత, దళితులు .. చివరకి మందుబాబులు కూడా వైసీపీ ప్రభుత్వంపై ఆగ్రహంగా ఉన్నారని తెలుస్తోంది. జగన్ ప్రభుత్వం వచ్చాకా సామాన్యులపై దాడులు, ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించిన వారిపై కేసులు, అధికార పార్టీ నేతల స్కాములు తప్ప.. ప్రజలకు జరిగిందేమి లేదనే భావనలో మెజార్టీ ప్రజలు ఉన్నారని సర్వే సంస్థలు స్పష్టం చేశాయంటున్నారు. అందుకే ఉప ఎన్నికపై వైసీపీలో ఆందోళన ఉందని తెలుస్తోంది.
ప్రజా వ్యతిరేకతను అధిగమించేందుకు ఏం చేయాలన్న దానిపై వైసీపీ పెద్దలు సమాలోచనలు చేస్తున్నారని చెబుతున్నారు. ఇందు కోసం తిరుపతి లోక్ సభ పరిధిలో సంక్షేమ పథకాలను మరింతగా అమలు చేయాలని అధికార పార్టీ భావిస్తుందట. అందుకే పేదలందరికి ఇండ్ల పథకాన్ని తిరుపతి లోక్ సభ పరిధిలోని శ్రీకాళహస్తి నియోజకవర్గంలోనే ప్రారంభించారని చెబుతున్నారు. డిసెంబర్ 25న ఇండ్ల పట్టాల పంపిణి ప్రారంభించింది ప్రభుత్వం. అయితే రెండు రోజుల్లోనే వెంటనే ఇండ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. అందుకు తిరుపతినే వేదికగా మార్చుకుంది. ఉప ఎన్నిక కోసమే తిరుపతి నియోజకవర్గంలో సీఎం జగన్ ఈ కార్యక్రమాన్ని పెట్టుకున్నారని వైసీపీ నేతలు కూడా అంగీకరిస్తున్నారు. పార్టీపై ప్రజల్లో వ్యతిరేకత బాగా ఉన్నందునే ఇక్కడే ఈ కార్యక్రమం పెట్టారని చెబుతున్నారు. ఇండ్ల నిర్మాణ పథకాన్ని ప్రారంభించడమే కాదు.. తిరుపతి లోక్ సభ పరిధిలో వెంటనే నిర్మాణ పనులు చేపట్టేలా జగన్ సర్కార్ చర్యలు చేపడుతుందని చెబుతున్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా 35 లక్షల భూ పట్టాల పంపిణి లక్ష్యంగా పెట్టుకుంది జగన్ ప్రభుత్వం. అంటే ఒక్కో లోక్ సభ పరిధిలో లక్ష 35 వేల వరకు వస్తాయి. కాని ఉప ఎన్నిక ఉన్న తిరుపతి పార్లమెంట్ పరిధిలో మాత్రం రెండున్నర లక్షలకు పైగా పట్టాలు ఇవ్వనున్నారట. ఇండ్ల నిర్మాణం కూడా తిరుపతి పరిధిలోనే ఎక్కువగా ఉండేలా ప్లాన్ చేస్తున్నారట. తొలి దశలో 15.60 లక్షల ఇళ్ల నిర్మాణాలు చేపడతామని లక్ష్యంగా పెట్టుకోగా... అందులో తిరుపతి ఎంపీ పరిధిలోని లక్షకు పైగా ఇండ్ల నిర్మాణానికి ప్రణాళికలు వేశారట. ఇంతే కాదు తిరుపతి లోక్ సభ పరిధిలోకి వచ్చే ఏడు నియోజకవర్గాల్లోనూ సంక్షేమ పథకాల్లో వేగం పెంచాలని నిర్ణయించారట. అంటే పెండింగులో ఉన్న రేషన్ కార్డులను వెంటనే ఇవ్వడం, కొత్త పెన్షన్లు మంజూరు చేయడం.. అమ్మ ఒడిలో కొత్త వారిని చేర్చడం.. ఇలా సంక్షేమ పథకాలను ఈ నియోజకవర్గం పరిధిలో మరింత మందికి ఇచ్చేలా స్థానిక వైసీపీ నేతలు అధికారులను పరుగులు పెట్టిస్తున్నారట.
తిరుపతి ఉప ఎన్నికకు ఇప్పటికే అభ్యర్థిని ప్రకటించింది టీడీపీ. గతంలో పోటీ చేసిన పనబాక లక్ష్మినే బరిలోకి దింపి ప్రచారం కూడా చేసేస్తోంది. జగన్ సర్కార్ పై ఉన్న వ్యతిరేకతను క్యాష్ చేసుకునేందుకు ప్రయత్నిస్తోంది. టీడీపీ బాగా పుంజుకోవడంతో అభ్యర్థి ఎంపికపై వైసీపీ తీవ్ర తర్జనభర్జనలు పడుతుందని చెబుతున్నారు. మొదట దివంగత ఎంపీ కుటుంబ సభ్యులకే టికెట్ ఇస్తారనే ప్రచారం జరిగింది. తర్వాత జగన్ వ్యక్తిగత ఫిజియో థెరపిస్ట్ గురుమూర్తి ఖరారయ్యారని చెప్పారు. కాని అధికారికంగా మాత్రం ప్రకటించలేదు. మొదట తిరుపతి తమకు ఈజీగానే ఉంటుందని భావించిన వైసీపీ.. సర్వే ఫలితాలతో బెంబెలెత్తి అభ్యర్థి ఎంపికకై ఆచితూచి వ్యవహరిస్తోందని తెలుస్తోంది. జిల్లా ఇంచార్జ్ గా ఉన్న వైవీ సుబ్బారెడ్డి... తిరుపతి లోక్ సభ పరిధిలోని పార్టీ నేతలతో మూడు, నాలుగు సార్లు చర్చలు జరిపినా.. క్యాండిడేట్ పై క్లారిటీ రాలేదంటే... వైసీపీకి ఎంతగా భయపడుతుందో అర్ధం చేసుకోవచ్చు.
తిరుపతి లోక్ సభ నియోజకవర్గానికి ఇప్పటివరకు 16 సార్లు ఎన్నికలు జరగగా 11 సార్లు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులే విజయం సాధించారు. 1984, 1998 ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసిన చింతా మోహన్ ఎంపీగా గెలిచారు. 2014, 2019లో వైసీపీ విజయం సాధించింది. 1999లో టీడీపీ మద్దతుతో పోటీ చేసిన బీజేపీ అభ్యర్థి నందిపాకు వెంకట స్వామి తిరుపతి నుంచి లోక్ సభకు ఎన్నికయ్యారు. 2019 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి బల్లి దుర్గాప్రసాద రావు 2 లక్షల 40 వేల పై చిలుకు ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ఇక్కడ అనూహ్యంగా నోటా మూడో స్థానంలో నిలిచింది. కాంగ్రెస్ నాలుగు, బీఎస్పీ ఐదో స్థానం దక్కించుకోగా.. కేవలం 1.2 శాతం ఓట్లు మాత్రమే సాధించి బీజేపీ ఆరో స్థానానికి పడిపోయింది. టీడీపీ కంటే వైసీపీకి దాదాపు 17 శాతం ఓట్లు ఎక్కువగా పోలయ్యాయి.