సునీత రాజకీయ ప్రవేశం... వైసీపీ కొత్త డ్రామా?
posted on Apr 25, 2023 @ 2:15PM
వివేకా హత్య కేసు విషయంలో అన్నిదారులూ మూసుకుపోయి.. అవినాష్ రెడ్డి అరెస్టు అనివార్యమని తేలిపోయిన తరువాత.. ఈ కేసు విషయంలో తార్కిక ముగింపు కోసం సాహసోపేత న్యాయపోరాటం చేసిన సునీతను బదనాం చేయడమే లక్ష్యంగా వైసీపీ శ్రేణులు అడుగులు వేస్తున్నాయి. వివేకా హత్య కేసును గుండెపోటు నుంచి అల్లుడు, కూతురే హంతకులు అంటూ చేసిన ఆరోపణలన్నీ సందేహాలకు అతీతంగా కోర్టుల్లో వీగిపోయిన నేపథ్యంలో వివేకా కుమార్తె సునీతను బదనాం చేయడమే లక్ష్యంగా ఆమె తెలుగుదేశం పార్టీతో కుమ్మక్కయ్యారంటూ వైసీపీ శ్రేణులుపోస్టర్ల పర్వానికి తెరతీశాయి.
వివేకా రెండో భార్య, ఆస్తుల గొడవ అంటూ మరణించిన వివేకా వ్యక్తిత్వ హననానికి కూడా వెనుకాడని అవినాష్ రెడ్డి, వైసీపీ శ్రేణులు ఇప్పుడు తాజాగా వైఎస్ సునీత రాజకీయ ప్రవేశం అంటూ పోస్టర్ల పర్వానికి తెరతీశారు. కడప జిల్లా తాడిపత్రిలో ఈ మేరకు పోస్టర్లు వెలిశాయి. ఈ పోస్టర్లను ఎవరు ఏర్పాటు చేశారన్నదానిపై స్పష్టత లేకపోయినా.. వీటి వెనుక ఉన్నది వైసీపీయే అన్న అనుమానాలు బలంగా వ్యక్తమౌతున్నాయి. ఎందుకంటే.. వైఎస్ వివేకా హత్య కేసులో వైఎస్ అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి వైఎస్ భాస్కరరెడ్డి నిందితులు అంటూ ఈ కేసు దర్యాప్తు చేస్తున్న సీబీఐ.. టెక్నికల్ ఎవిడెన్స్ సహా సుప్రీం కు నివేదించింది. ఈ కేసులో ఇప్పటికే భాస్కరరెడ్డిని అరెస్ట్ చేసిన సీబీఐ అవినాష్ రెడ్డినీ అరెస్టు చేయనుంది. అరెస్టును తప్పించుకునేందుకు అవినాష్ రెడ్డి చేసిన ఏ ప్రయత్నమూ ఫలించలేదు. తెలంగాణ అవినాష్ కు ముందస్తు బెయిలు ఇస్తూ ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను సుప్రీం కొట్టివేసింది.
ఈ నేపథ్యంలోనే కడప జిల్లా వాసులంతా ఆజాత శత్రువు భావించి అభిమానించే వైఎస్ వివేకానందరెడ్డి వ్యక్తిత్వ హననానికి పాల్పడిన అవినాష్ రెడ్డి, భాస్కరరెడ్డిలపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోందని వైసీపీ శ్రేణులే అంటున్నాయి. వివేకా.. రెండో వివాహం.. అక్రమ సంబంధాలు, దందాలు.. ల్యాండ్ సెటిల్‌మెంట్లు తదితర అంశాలను వీరిద్దరూ తమ నేరం నుంచి తప్పించేందుకు పుట్టించిన కట్టుకథలుగా పలువురు భావిస్తున్నారు. పైగా వివేకా బంధువులే ఆయన వ్యక్తిత్వ హననానికి పాల్పడటం పట్ల మొత్తంగా వైఎస్ కుటుంబం పట్ల కడప జిల్లా వాసులకు ఒకింత గౌరవం తగ్గిందని కూడా వైసీపీ శ్రేణులు చెబుతున్నాయి.
ఈ నేపథ్యంలో సునీత తెలుగుదేశంతో కుమ్మక్కయ్యారంటూ వైసీపీ నుంచి వస్తున్న విమర్శలను ఎవరూ పట్టించుకోకపోవడంతో నే పోస్టర్ల పర్వానికి తెరతీశారన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. తెలుగుదేశం అధినేత చంద్రబాబు, ఆ పార్టీ ముఖ్యుల ఫొటోలతో సునీత రాజకీయ ప్రవేశానికి స్వాగతం అంటూ వెలసిన పోస్టర్ల వెనుక ఉన్నది వైసీపీయేనని పరిశీలకులు సైతం విశ్లేషిస్తున్నారు. సునీత తెలుగుదేశంతో కుమ్మక్కయ్యారంటూ వైసీపీ సీనియర్ నేతలు చేస్తున్న ఆరోపణలను వారు ఇందుకు ఉదాహరణగా చూపుతున్నారు. వైఎస్ వివేకా హత్య కేసులో సూత్రధారులు, పాత్రధారులూ ఎవరో తెలియాల్సిందేనంటూ సునీత చేసిన న్యాయపోరాటాన్ని ఒక్క వైసీపీ వినా అన్నిరాజకీయ పార్టీలూ, ప్రజలూ కూడా స్వాగతించారు. అలాగే తెలుగుదేశం పార్టీ కూడా పలు సందర్భాలలో సునీత పోరాటాన్నిస్వాగతిస్తూ, ఆమెకు సంపూర్ణ మద్దతు కూడా ప్రకటించింది.
అయితే రాజకీయంగా ఆమె తెలుగుదేశం వైపు అడుగులు వేస్తున్నట్లుగా, సునీత ఎక్కడా ఎప్పుడూ చెప్పలేదు. ఆమె ఓ కూతురిగా తండ్రి హంతకులకు శిక్షపడాలంటూ చేసిన ఒంటరి పోరు చేశారు. ఆ పోరాటంలో ఆమె విజయానికి చేరువయ్యారు. దీంతో ఆమెను బదనాం చేయాలనీ, బురద జల్లాలన్న ఉద్దేశంతోనే రాజకీయ ప్రవేశం అంటూ పోస్టర్లు వెలిశాయని రాజకీయ వర్గాలు అంటున్నాయి.