ఎమ్మెల్యే చెంప ఛెళ్లుమనిపించిన ఓటరు!
posted on May 13, 2024 @ 11:38AM
వైసీపీ మూకలు చెలరేగిపోతున్నాయి. ఎన్నికల వేళ దాడులకు తెగబడుతూ భయానక వాతావరణాన్ని సృష్ఠించాలని యత్నిస్తున్నాయి. అన్నమయ్య జిల్లా పాపక్కగారి పల్లెలో తెలుగుదేశం ఏజెంట్ సుభాష్ పై దాడికి తెగబడ్డారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన సుభాష్ కు కుడి కన్ను పోయింది.
ఇక పల్నాడులో పోలింగ్ ప్రారంభానికి ముందే వైసీపీ హింసాకాండకు తెరలేపింది. దీంతో విషయాన్ని సీరియస్ గా తీసుకున్న ఎన్నికల సంఘం హుటాహుటిన పల్నాడుకు ఎన్నికల స్పెషల్ అబ్జర్వర్ రామ్మోహన్ మిశ్రాను అక్కడకు పంపింది. అవసరాన్ని బట్టి అదనపు బలగాలను పంపాలని ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల రోజు వైసీపీ ప్రలోభాల పర్వం కొనసాగుతోంది. ఇందుకు నిష్పాక్షికంగా వ్యవహరించాల్సిన సీఎస్ జవహర్ రెడ్డి తన వంతు ఇతోధిక సాయం అందజేస్తున్నారు. సరిగ్గా పోలింగ్ రోజు తెల్లవారు జామునే ఉద్యోగులు పెన్షనర్లకు డీఏ బకాయిలను వారి అక్కౌంట్లలో జమ చేశారు.
పోలింగ్ కు రెండు రోజుల మందు ఎప్పుడో నొక్కిన బటన్ల తాలూకా సొమ్మును లబ్ధి దారుల ఖాతాలలో జమ చేయడానికి తన కున్న సర్వ అధికారాలనూ ఉపయోగించి విఫలమైన సీఎస్ జవహర్ రెడ్డి ఇప్పుడు చడీ చప్పుడూ లేకుండా ఉద్యోగులు, పెన్షనర్ల ఖాతాలలో డీఏ అరియర్స్ ను జమ చేశారు. ఈ విషయంపై ఎన్నికల సంఘం స్పందించాలని, సీఎస్ పై చర్యలు తీసుకోవాలని తెలుగుదేశం డిమాండ్ చేస్తున్నది. ఎన్నికలలో దాడులు, దౌర్జన్యాలు, అసత్య, అబద్ధ ప్రచారాలు, ప్రలోభాలను నమ్ముకుని బరి తెగిస్తున్న వైసీపీకి ఓటర్లు వాటిని వేటినీ లెక్క చేయకపోవడంతో ఫ్రస్ట్రేషన్ లో హద్దులు లేకుండా చెలరేగుతున్నారు. ఓటింగ్ కు పెద్ద ఎత్తున జనం తరలిరావడం, ప్రలోభాలకు గురి చేద్దామని ప్రయత్నించిన వైసీపీ నాయకులపై తిరగబడుతుండటంతో అధికార పార్టీలో ఆందోళన పెరిగిపోతున్నది. పంచిన చీరలను వైసీపీ నేతల ఇళ్ల ముందు విసిరివేయడం, పోలింగ్ బూత్ వద్ద తనపై చేయి చేసుకున్న వైసీపీ అభ్యర్థిపై ఆ ఓటరు తిరగబడి చెంప ఛెళ్లుమనిపించడం వంటి సంఘటనలు ఏపీ ప్రజల మూడ్ ను తెలియజేస్తున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఔను తెనాలి వైసీపీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివ కుమార్ పోలింగ్ బూత్ వద్ద ఓ ఓటర్ పై చేయి చేసుకున్నారు. దీంతో ఆ ఓటరు తిరగబడి చెంప ఛెళ్లు మనిపించారు. దీంతో ఎమ్మెల్యే పరువు గంగలో కలిసినట్లైంది. ధైర్యంగా ఎమ్మెల్యే దౌర్జన్యానికి దీటుగా బదులు చెప్పిన ఆ ఓటర్ పై సర్వత్రా ప్రశంసల జల్లు కురుస్తోంది.
అలాగే మైలవరం నియోజకవర్గం లో వైసీపీ అభ్యర్థి దౌర్జన్యానికి తెగబడ్డారు. 150 మందితో గుంపుగా మైలవరం వేములూరి వెంకటరత్నం కళాశాల పోలింగ్ బూత్ లో జొరబడి హల్ చల్ చేశారు. ఎమ్మార్వో చేష్టలుడిగి నిలబడిపోయారు. విషయం తెలిసి భారీగా తెలుగుదేశం శ్రేణులు చేరుకోవడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది.
ఇవన్నీ ఒకెత్తైతే విజయవాడ తూర్పు నియోజకవర్గంలోని బూత్ నంబర్ 55లో ఈవీఎంలో ఒక గుర్తుకు ఓటు వేస్తే మరొక గుర్తుకు పడుతోందంటూ ఓటర్లు ఆందోళనకు దిగారు.