వంశీ ఎపిసోడ్‌లో వైసీపీ రియాక్షనేంటి? యార్లగడ్డపై జగన్‌కు సానుభూతి ఉందా?

వల్లభనేని వంశీ అసలు వైఎస్సార్ కాంగ్రెస్ లో చేరతారో లేదో తెలియదు కానీ... గన్నవరం నియోజకవర్గ వైసీపీలో మాత్రం కాకరేపుతోంది. వంశీ వైసీపీలోకి వస్తున్నాడన్న ప్రచారంతో గన్నవరం ఇన్ ఛార్జ్ యార్లగడ్డ వెంకట్రావు రగిలిపోతున్నాడు. ఇక యార్లగడ్డ అనుచరుల నుంచైతే తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. మొన్నటి ఎన్నికల్లో వంశీ, యార్లగడ్డ మధ్య పెద్ద యుద్ధమే జరిగింది. వ్యక్తిగతంగా ఇద్దరూ తలపడ్డారు. అయితే, కేవలం 800 ఓట్ల స్వల్ప తేడాతో వంశీ చేతిలో యార్లగడ్డ ఓటమి పాలయ్యారు. కానీ, ఒకానొక టైమ్ లో గెలుపుపై వంశీ ఆశలు వదిలేసుకున్నారు. అందుకే, ఫలితాలకు ముందే యార్లగడ్డకు ఫోన్లు చేయడం, ఇంటికి అనుచరులను పంపడంలాంటి పనుల ద్వారా వంశీ బెదిరింపులకు సైతం పాల్పడ్డారనే ఆరోపణలు వచ్చాయి. అయితే ఫలితాల తర్వాత వైసీపీ అధికారంలోకి రావడం, గన్నవరం మాత్రం అనూహ్యంగా వంశీ గెలవడంతో... ఇక్కడ రాజకీయం రసవత్తరంగా మారింది.

అయితే, స్వల్ప తేడాతో ఓడిపోయిన యార్లగడ్డపై జగన్ కు మంచి అభిప్రాయం ఉందని అంటారు. ఎందుకంటే జగన్ ఆదేశాలతోనే గన్నవరం నుంచి బరిలోకి దిగిన యార్లగడ్డ... అతితక్కువ టైమ్ లోనే వల్లభనేని వంశీకి గట్టిపోటీ ఇవ్వడమే కాకుండా ముచ్చెమటలు పట్టించాడు. దాదాపు గెలుపు అంచులదాకా వచ్చి... స్వల్ప తేడాతో ఓడిపోయారు. అందుకే, యార్లగడ్డను ఇబ్బంది పెట్టడం జగన్ కు ఇష్టం లేదనే మాట వినిపిస్తోంది. ఇదే ఇప్పుడు వంశీ రాకకు ఇబ్బందికరంగా మారిందని అంటున్నారు. మొన్న జగన్ ను కలిసిన వంశీ... తాను వైసీపీలో చేరితే... గన్నవరంలో యార్లగడ్డ ఉండొద్దని ప్రతిపాదన పెట్టారట. అయితే, వంశీ కండీషన్ కు జగన్ ఒప్పుకోలేదని, వంశీ ఇష్యూ హోల్డ్ లోకి వెళ్లిందని అంటున్నారు. అయితే, వంశీపై జగన్‌కు సాఫ్ట్‌ కార్నర్‌ ఉందంటున్నారు. 2014 ఎన్నికల సమయంలో బెజవాడ నడిబొడ్డున జగన్ ను వంశీ ఆలింగనం చేసుకోవడం అప్పట్లో పెద్ద చర్చనీయాంశమైంది. వీళ్లిద్దరి మధ్య సత్సంబంధాలు ఉన్నాయనే మాట కూడా వినిపించింది.

అయితే, వల్లభనేని వంశీ... తన లేఖలో వైసీపీ మీద కూడా విమర్శలు చేయడం... ప్రభుత్వం వేధింపులకు పాల్పడుతోందని... అలాగే తన అనుచరులపై దాడులు పెరిగిపోయాయని... స్థానిక వైసీపీ ఇన్‌ఛార్జి కక్షసాధింపు చర్యలకు దిగుతున్నారని ఆరోపించడం చూస్తుంటే... వైసీపీలోకి వెళ్లే ఉద్దేశం లేదనే మాట కూడా వినిపిస్తోంది. ఎందుకంటే, వైసీపీలోకి వెళ్లాలనుకుంటే, అదే పార్టీ మీద ఎందుకు విమర్శలు చేస్తారని కొందరు ప్రశ్నిస్తున్నారు. అయితే, అదంతా వంశీ వ్యూహమనే వాళ్లూ ఉన్నారు. మరి వంశీ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి.