యనమల స్కెచ్.. కోడెల అవుట్..
posted on Jan 31, 2016 @ 1:49PM
టీడీపీ సీనియర్ నేతలు యనమల రామకృష్ణకి.. స్పీకర్ కోడెల శివప్రసాద్ కి మధ్య భేదాభిప్రాయాలు వచ్చిన సంగతి తెలిసిందే. అసెంబ్లీ సమావేశాలు ఎక్కడ జరపాలి అన్న విషయంలో ఇద్దరి మధ్య అభిప్రాయబేధాలు ఏర్పడ్డాయి. అయితే ఈ విషయంలో మాత్రం యనమల మాటే నెగ్గినట్టు కనిపిస్తోంది. రాష్ట్ర విడిపోయిన తరువాత ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఇక్కడే ఉండి పాలన సాగిస్తున్నారు. ఇలాంటి నేపథ్యంలో ఇక్కడే అసెంబ్లీ సమావేశాలు జరిగితే బావుంటుందని.. దానికి గుంటూరు జిల్లాలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నిర్వహిస్తే బాగుంటుందని సభాపతి కోడెల శివప్రసాదరావు భావించారు. అంతేకాదు దానికి అందరిని ఒప్పించి.. అసెంబ్లీ సమావేశాల ఏర్పాట్లకు గుంటూరు జిల్లాలోని హాయ్‌ల్యాండ్‌కు అధికారుల బృందాన్ని కూడా పంపించారు. అయితే యనమల మాత్రం హైదరాబాద్‌లోనే అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని పట్టుబట్టారు. అంతేకాదు మరో మంత్రి అచ్చెన్నాయుడుతో పాటు పలువురు మంత్రులతో సమావేశాలు హైదరాబాద్‌లోనే నిర్వహిస్తే మంచిదని, గతంలో ప్రైవేటు సంస్థల్లో ఏ రాష్ర్ట అసెంబ్లీ సమావేశాలు నిర్వహించలేదని, ఖర్చు కూడా ఎక్కువవుతుందని చెప్పడంతో చంద్రబాబు కూడా వాటికి అంగీకరించి హైదరాబాద్లోనే అసంబ్లీ సమావేశాలు నిర్వహిస్తామని ప్రకటించారు. దీంతో ఈ నిర్ణయంతో కోడెల తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తోంది.