ఇక నమ్మలేం.. నమ్మం కూడా.. జగన్ సర్కార్ కు తేల్చేసిన ఉద్యోగులు
posted on Mar 11, 2023 @ 10:25AM
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వోద్యోగులు జగన్ సర్కార్ ను ఇక నమ్మేదేలే.. అంటూ బాహాటంగా చెప్పేస్తున్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాలలోనూ ఉద్యోగులు తీవ్ర ఆందోళనతో ఉన్నారు. ప్రభుత్వంపై ఆగ్రహంతో మండిపడుతున్నారు. నిరసనలతో హోరెత్తించడానికి రెడీ అయిపోయారు. ప్రభుత్వంతో చర్యలంటున్న తమ సంఘాల నేతలపైనే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగులు ఆగ్రహాగ్ని తట్టుకోలేకే అనివార్యంగా ఉద్యోగ సంఘాల నాయకులు ఆందోళనా కార్యక్రమాలకు కార్యాచరణ ప్రకటించారు. ఔను ఉద్యమ కార్యాచరణ తప్ప మరో మార్గం లేని పరిస్థితిని నేతలను ఉద్యోగులే తీసుకువచ్చారు.
ఉద్యోగులు ఇంకెంత మాత్రం ప్రభుత్వాన్ని నమ్మడానికి సిద్ధంగా లేరని నేతలే చెప్పేపరిస్థితికి వచ్చారు. ఏపీ ఐకాస అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు ప్రభుత్వం ఇచ్చే హామీలను ఉద్యోగులు ఎంత మాత్రం నమ్మే పరిస్థితి లేదని కుండబద్దలు కొట్టేశారు. ప్రభుత్వం చర్చలంటూ పిలిచి ఓవో నోటి మాటలతో హామీలు ఇచ్చినంత మాత్రాన సరిపోదనీ...తాము ఉద్యమ కార్యాచరణ మేరకే ముందుకు వెడతామని స్పష్టం చేశారు. రాష్ట్ర నాయకత్వం నచ్చచెప్పినా ఉద్యోగులు వినే పరిస్థితి అయితే కనిపించడం లేదని తేల్చేశారు. వాస్తవం కూడా అదే. చరిత్రలో ఎక్కడా లేని విధంగా ఐఆర్ కంటే తక్కువ పీఆర్సీకి ఉద్యోగ సంఘాల నేతలు తలలూపినప్పుడే వారు ఉద్యోగుల నమ్మకాన్ని కోల్పోయారు. అది కూడా ఆచరణలోనికి రాకపోయే సరికి ఉద్యోగులే నేతలను ఉద్యమ కార్యాచరణ దిశగా నడిపించారు.
ఇప్పుడు ఆ వాస్తవం నెమ్మదిగా నేతలకూ అర్ధం అవుతోంది. అందుకే ప్రభుత్వ హామీలను నేతలు కూడా నమ్మడం లేదు. తక్షణం బకాయిలు చెల్లించాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం ప్రభుత్వం జీతాలే చెల్లించడం లేదనీ, ఇటువంటి పరిస్థితుల్లో తాము తగ్గితే ఇక బకాయిలకు నీళ్లొదిలేసుకోవాల్సిందేనని వారు అంటున్నారు. ఆందోళనను కొనసాగించాల్సిందేననీ, అవసరమైతే మరింత ఉధృతం చేయడానికైనా వెనుకాడవద్దనీ ఉద్యోగులు నాయకులపై ఒత్తిడి తెస్తున్నారు. ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు ఈ విషయాన్నే విలేకరుల సమావేశంలో చెప్పారు. తమ కార్యవర్గ సమావేశంలో ఇదే అభిప్రాయం చాలా చాలా బలంగా వ్యక్తమైందని చెప్పారు. ఈ నెలాఖరులోగా చట్టబద్ధంగా తమకు రావాల్సిన బకాయిలను చెల్లించాలని డిమాండ్ చేశారు. లేకుంటే ఆందోళనను మరింత ఉధృతం చేయడం ఖాయమని చెప్పారు.
అసలు ప్రభుత్వం పిలిస్తే చర్చలకు వెళ్లడంపైనే తన నేతలపై ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేశారు. చర్చలు అనగానే ఎందుకు ఎగిరి గంతేసి మరీ వెళుతున్నారని నిలదీస్తున్నారు. సీఎం జగన్ సర్కార్ ఉద్యోగ సంఘాల నాయకులను తమ గుప్పిట్లో పెట్టుకుందనీ ఆరోపిస్తున్నారు. పీఆర్సీ వివాదం తలెత్తిన సమయంలో ప్రభుత్వం ఇదే విధంగా ఉహ్యోగ సంఘాల నేతలతో చర్చలు జరిపి ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా పూర్తిగా నెరవేరలేదని వారు ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. అసలు ఉద్యోగుల సొమ్ములు వారికి తెలియకుండా తీసుకోవడం తప్పు. కాదు నేరం. నిజానికి నేరం చేసిన సర్కార్ ను ఉద్యోగ సంఘాలు నిలదీయాలి. కానీ ఉద్యోగ సంఘాల నాయకులు మాత్రం అందుకు భిన్నంగా మంత్రి వర్గ ఉప సంఘంతో చర్చలు జరపడాన్ని ఉద్యోగులు తప్పుపడుతున్నారు.
మార్చి నెలాఖరులోపు మూడు వేల కోట్లు చెల్లిస్తామని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి చెబుతున్నారు. కానీ ప్రభుత్వం ఇస్తుందన్న నమ్మకం అయితే ఉద్యోగులలో కలగడం లేదు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్టభద్రులు, టీచర్లు ఓట్లు కావాలి కనుకనే చర్చల పేరు ఉద్యోగులను మరో సారి మోసం చేసేందుకు సర్కార్ ప్రయత్నిస్తోందని ఉద్యోగులు గట్టిగా చెబుతున్నారు.