ఆరు గజాల నిండుదనం.. భరతజాతి నిండు గౌరవం.. ! ప్రపంచ చీర దినోత్సవం 2024..
posted on Dec 21, 2024 @ 9:30AM
‘చీరలోని గొప్పతనం తెలుసుకో, చీర కట్టి ఆడతనం పెంచుకో’ అంటూ పాటలు రాసి మరీ నేటి తరానికి చీర గొప్పతనం గుర్తు చేయాల్సిన పరిస్థితి వచ్చిందేమో కానీ, అందరూ ఒకసారి వెనక్కి తిరిగి ఆలోచిస్తే మనలో ప్రతీ ఒక్కరం అమ్మ చీర కొంగు నీడలో పెరిగినవాళ్ళమే అన్న విషయం గుర్తొస్తుంది. అమ్మ చీర కొంగు చెమట పడితే మొహం తుడిచేది, ఎండకో వానకో గొడుగయ్యేది. ఇంకా చెప్పాలంటే సగటు భారతీయ కుటుంబంలో ప్రతీ శిశువు చీరతో కట్టిన ఉయ్యాలలోనే జోలపాటలు వింటూ పడుకుంది. మరి భారతీయ సమాజంలో, సంస్కృతిలో లోతుగా ఇమిడిపోయిన చీర గురించి చెప్పుకోవాల్సింది ఏముంది అనిపిస్తుందేమో.. అయితే పెద్దలు చెప్పింది పిల్లలు పాటించటం వల్లనే ఒక తరం నుంచి ఇంకో తరానికి ఆచారాలు, విలువలు కొనసాగుతాయి. అలాగే మన సంస్కృతిలో భాగమై ఉన్న చీర గొప్పతనాన్ని తెలియజేస్తూ, వెస్టర్న్ కల్చర్ వైపు ఆసక్తి చూపుతున్న నేటి తరం ఆలోచనా విధానం మార్చాలని, తర్వాత వచ్చే తరాలు చీరని మర్చిపోకుండా చేయాలనే ప్రయత్నమే ప్రపంచ చీర దినోత్సవం. ప్రపంచ వ్యాప్తంగా భారతదేశానికి గుర్తింపు తెచ్చిన వాటిలో చీర కూడా ఒకటి. ప్రతీ సంవత్సరం డిసెంబర్ 21 వ తేదీన వరల్డ్ శారీ డే జరుపుకుంటారు.
చీర ఎప్పటినుంచి ఉంది..
చీర చరిత్ర గురించి చూస్తే దీని ఆనవాళ్ళు ఒకానొకప్పుడు మన భారతదేశంలోనే గొప్ప నాగరికతగా చెప్పబడిన సింధు నాగరికత(2800-1800బిసి) కాలంలో దొరికాయి. అప్పుడిది మామూలు పొడవైన వస్త్రంలా ఉండేది. కానీ కొన్ని వందల సంవత్సరాలుగా ఇది ఒక ఆర్ట్ ఫార్మ్ గా మారుతూ వచ్చింది.. చీరలు నేసే నేతన్నలకి, చీరల్లో ఉండే ప్రత్యేక కళకీ గౌరవం తెలపడానికిగానూ 2020, డిసెంబర్21వ తేదీన ప్రపంచ చీర దినోత్సవం జరుపుకోవడం మొదలపెట్టారు. స్థానికంగా మొదలై త్వరలోనే జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది.
ఉద్యోమమే స్పూర్తి..
సోషల్ యాక్టివిస్టులైన శ్రీమతి సింధూర కవిటి, శ్రీ నిస్టులా హెబ్బార్.. ఈ ఉద్యమానికి నాంది పలికారు. అయితే ఈ ఉత్సవానికి తొలి అడుగు మాత్రం 2009లో పడింది. చీరల వారసత్వాన్ని పునరుద్ధరించాలన్న లక్ష్యంతో సోషల్ యాక్టివిస్ట్ శ్రీమతి నళిని శేఖర్ దీన్ని ప్రారంభించారు.
శారీ డేని ఎందుకు జరుపుకోవాలి..
భారతీయుల మూలాలను గుర్తు చేస్తూ మన వారసత్వాన్ని గుర్తుచేసుకోవడం ఈ రోజు ఉద్దేశ్యం. చీర కేవలం ఏదో ఒంటికి చుట్టుకునే వస్త్రం మాత్రమే కాదు, తరాలుగా అందించబడుతున్న భారతీయ వారసత్వమని ప్రపంచానికి చాటి చెప్పడమే శారీ డే లో ఉన్న గొప్పతనం. చీరలు తయారు చేసే కళను కాపాడి, చేతి వృత్తుల పరిశ్రమని ప్రోత్సహించడమనే మరక ఉద్దేశ్యం కూడా ఇందులో ఉంది.
చీరలు వివిధ డిజైన్లలో అభివృద్ది చెంది, స్త్రీల వ్యక్తిత్వాన్ని, అందాన్ని, ఆత్మవిశ్వాసాన్ని నిలబెట్టట్టంలో కీలక పాత్ర పోషిస్తుంది. భారతీయ సాంస్కృతిక సంపదను ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలతో అనుసంధానం చేయటం ద్వారా మన సంస్కృతిలోని గొప్పతనాన్ని తెలియచేస్తుంది.
చీరలో వైవిధ్యం.. ఫ్యాషన్ పరిశ్రమపై చూపిస్తున్న ప్రభావం..
భారతదేశంలోని ప్రతి ప్రాంతం దాని ప్రత్యేక శైలిని చీర ద్వారా పరిచయం చేస్తుంది. ఉత్తర ప్రదేశ్ విలాసవంతమైన బనారసీ పట్టు చీర నుండి తమిళనాడులో చేతితో నేసిన కాంచీపురం చీర వరకు. రాజస్థాన్ రంగురంగుల బంధనీ చీర నుంచి తూర్పు భారతంలోని జామ్‌దాని, ఖాదీ చీరల వరకూ ఎంతో వైవిధ్యం కలిగి ఉన్నాయి.
చీర కట్టే స్టైల్లో కూడా ప్రతీ ప్రాంతానికి తమదైన ప్రత్యేకత ఉంది. మహారాష్ట్రలో నౌవారి స్టైల్, గుజరాత్‌లో ముందుకు పల్లు కట్టడం, బెంగాల్ చీర కట్టు... ఇలా చాలా వైవిధ్యం ఉంది. చరిత్రలో రాణి లక్ష్మీ బాయి లాంటి వీరనారిలు, ఇందిరా గాంధీ వంటి మహిళలు చీరలను విభిన్న శైలుల్లో ధరించారు. సాంప్రదాయ దుస్తులు కూడా శక్తికి చిహ్నంగా నిలవగలవని నిరూపించారు.
చీర ఇప్పుడు తన సాంప్రదాయ హద్దులని దాటి అంతర్జాతీయ ఫ్యాషన్ రంగంలో కూడా తన స్థానాన్ని సంపాదించుకుంది. ప్రముఖ డిజైనర్లు సబ్యసాచీ, మనీష్ మల్హోత్రా, గౌరవ్ గుప్తా వంటి మోడర్న్ డిజైనర్స్ కూడా చీరను డిఫరెంట్ స్టైల్సులో డిజైన్ చేసి ఔరా అనిపిస్తున్నారు.
చీర ఆరు నుండి తొమ్మిది గజాల అన్‌స్టిచ్డ్ వస్త్రం కాదని, భారతదేశ కళా నైపుణ్యం, సంప్రదాయానికి ప్రత్యక్ష సాక్ష్యం అని గుర్తించాలి. ఆడపిల్ల ఇంటికి వస్తే చీర పెట్టి, వారి సౌభాగ్యం కలకాలం నిలబడాలని కోరుకునే మన భారతీయ సంప్రదాయం అంతరించిపోకుండా ఉండాలన్నా, మన భారతీయ సంస్కృతి వైభవాన్ని ప్రపంచ దేశాలకి గుర్తు చేయాలనుకున్నా, ముందు మనం మన మూలాలనుంచి దూరం అవ్వకుండా ఉండాలి. భారత సంప్రదాయాన్ని, చీర వైవిధ్యాన్ని పునరుద్ధరించేందుకు ప్రతి ఒక్కరూ వరల్డ్ శారీ డే ను జపురుకోవాలి.
*రూపశ్రీ.