వరల్డ్ కప్ ఫైనల్.. ఆసీస్ విజయ లక్ష్యం 241 పరుగులు
posted on Nov 19, 2023 @ 5:36PM
అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా వరల్డ్ కప్ ఫైనల్ లో టీమ్ ఇండియా ఆస్ట్రేలియాకు 241 పరుగుల విజయలక్ష్యాన్ని నిర్దేశించింది. వాస్తవానికి వరల్డ్ కప్ టోర్నీలో ఇంతకు ముందు జరిగిన తొమ్మది మ్యాచ్ లలోనూ సాధికార విజయాలను సాధించిన టీమ్ ఇండియా.. ఫైనల్ మ్యాచ్ లో మాత్రం తడబడింది. స్వల్ప స్కోరుకే ఆలౌట్ అయ్యింది. సరిగ్గా 50 ఓవర్లు పూర్తయ్యే సరికి 240 పరుగులకు ఆలౌట్ అయ్యింది. రోహిత్ శర్మ (47), కోహ్లీ, రాహుల్ లు హాప్ సెంచరీలు మినహా మిగిలిన బ్యాటర్లంతా ఆసీస్ పదునైన బౌలింగ్ అటాక్ ను ఎదుర్కోలేక చేతులెత్తేశారు.
ఆసీస్ బౌలర్లు లైన్ అండ్ లెంగ్త్ కు కట్టుబడి వికెట్ టు వికెట్ బంతులు వేయడంతో టీమ్ ఇండియా ప్రతి పరుగుకూ చెమటోడ్చాల్సి వచ్చింది. ఇక ఆసీస్ ఫీల్డింగ్ అయితే వేరే లెవెల్ లో ఉంది. కనీసం పాతిక బౌండరీలను ఆసీస్ ఫీల్డర్లు నిలువరించగలిగారంటే వారెంత ప్రాణం పెట్టి ఫీల్డింగ్ చేశారో అర్ధమౌతుంది. ఇక పిచ్ కూడా స్లోగా ఉండి బ్యాటింగ్ కు కష్టంగా ఉండటం కూడా టీమ్ ఇండియా స్వల్ప స్కోరుకే ఆలౌట్ అవ్వడానికి కారణంగా చెప్పుకోవాల్సి ఉంటుంది. భారత బ్యాటర్లలో కేఎల్ రాహుల్ (66), విరాట్ కోహ్లీ (54) అర్థశతకాలు, కెప్టెన్ రోహిత్ శర్మ 47 పరుగుల మెరుపు ఇన్నింగ్స్ మినహాయిస్తు మిగిలిన వారెవరూ రాణించలేదు.
వరల్డ్ కప్ ఫైనల్ లో భారత ప్రదర్శన భారత అభిమానులందరినీ నిరాశపరిచింది. వికెట్ పడిన ప్రతి సారీ.. లక్షా ముఫ్ఫై వేల మందికి పైగా ఉన్న ఆహ్మదాబాద్ నరేంద్రమోడీ స్టేడియం గుండుసూది పడితే వినిపించేంత నిశ్శబ్దంగా మారిపోయింది. ఇక ఛేదనలో ఆసీస్ ను కట్టిడి చేయడం అనేది బౌలర్ల పదర్శనపై ఆధారపడి ఉంది.