Read more!

పుస్తకం ప్రియం ప్రియం!!

రాష్ట్రాలు, దేశాలు తిరుగుతూ ప్రపంచాన్ని చూడలేకపోవచ్చు మనం. అలాగే గొప్పవాళ్లను, దీనావస్థలో ఉన్న వారి జీవితాల్ని చూడలేకపోవచ్చు. కానీ ఆ అనుభవాన్ని కలిగించే అద్బుతాలు కొన్ని ఉన్నాయి. ఈమధ్య కాలంలో ట్రావెల్ vlogs అలాంటి అసంతృప్తిని కొంతవరకు తీరుస్తున్నా వారి విశ్లేషణ సమయానికి తగ్గట్టు చాలా క్లుప్తంగా ఉండటం వల్ల ఎక్కువ విషయలు తెలియకపోవచ్చు. ఇది కేవలం ఈ ట్రావెల్ గురించి మాత్రమే కాదు. ఎన్నో  విషయాలలో ఇదే వర్తిస్తుంది. అయితే ప్రతి వస్తువు నుండి, వ్యక్తి వరకు, పరిస్థితి నుండి ప్రకృతి వరకు జీవితాల నుండి సంఘటనల వరకు అన్నిటినీ ఎంతో వివరంగా ఆవిష్కరించేవి పుస్తకాలు.


చిరిగిన చొక్కా అయినా తొడుక్కో గానీ ఓ మంచి పుస్తకం కొనుక్కో అంటారు కందుకూరి విరేశలింగం పంతులు గారు. పుస్తకం ఇచ్చే జ్ఞానం అలాంటిది అని అర్థం.


ఏ గొప్ప వ్యక్తిని కదిలించినా అలలు అలలుగా పుస్తక జ్ఞానం ప్రవాహంలా బయటకు వస్తుంది. పుస్తకాలు చదివి చెడిపోయిన వాడు ఎవరూ లేరు అనేది వాస్తవం. బహుశా ఆలోచనా పరిణితి ఎక్కువై అంతర్ముఖులుగా మారిపోయి అందరి దృష్టిలో మానసిక రోగులుగా ముద్రపడిన వాళ్ళు ఉంటారేమో కానీ వాళ్ళను సరిగా అర్థం చేసుకుని ఉండరు అనేది నిజం.


ఇక విషయానికి వస్తే పుస్తకాన్ని ఒక మంచి స్నేహితుడిగా చేసుకున్నవాళ్ళు ప్రపంచంలో చాలా అదృష్టవంతులు అని చెప్పవచ్చు. ఎందుకు పుస్తకం ఇంత గొప్పది అంటే….


జ్ఞానానికి కేంద్ర బిందువు!!


బిందువు బిందువు కలసి సింధువు అయినట్టు పుస్తకంలో పేజీ పేజీ కలసి ఒక గొప్ప జ్ఞాన తరంగం అవుతుంది. పుస్తకాలు చదివేవాళ్ళు గొప్పవాళ్ళు, పుస్తకాలను రాసేవాళ్ళు అద్బుతాలు అని చెప్పుకోవచ్చు. ఒక పుస్తకం అందులో ఉన్న విషయ సారాంశాన్ని మనిషి మెదడులోకి పాదరసంలా ప్రవహించి మనిషిని చైతన్య వంతుడిని, ఉత్తేజవంతుడిని చేస్తుంది. ఆలోచనలు రేకెత్తిస్తుంది. ఆ ఆలోచనల నుండి మనిషి పెంపొందించుకునేదే జ్ఞానం.


" జ్ఞానం అంటే పుస్తకాలు చదవడమే కాదు, పుస్తకాలలో విషయాలను తెలుసుకుని, వాటిని తరచి చూసుకుని తమని తాము సరిచేసుకోవడం. ఓ కొత్త పుస్తకంలా మళ్లీ పుట్టడం"  


మంచి అలవాటు!!


నిజానికి పది మందితో వ్యర్థమైన విషయాలు మాట్లాడటం కంటే ఒక పుస్తకాన్ని ప్రశాంతంగా చదవడం మంచిదని అనిపిస్తుంది. చిన్నతనం నుండి పిల్లలకు పుస్తకాలు చదవడం అలవాటు చేస్తే ఎడిగేకొద్ది పిల్లలకు తాము ఎలాంటి దారిలో వెళ్ళాలి అనే విషయం పెద్దలు ప్రత్యేకంగా పనిగట్టుకుని చెప్పాల్సిన అవసరమే ఉండదు. ఇంకా చెప్పాలంటే చిన్నపిల్లలకు నీతి కథలు, పద్యాలు వంటివి చిన్నప్పటి నుండి పుస్తకాలలో చదివిస్తూ  ఉంటే గొప్ప వాక్పటిమ పెంపొందుతుంది. 

నడవడిక న్యాయబద్ద జీవితం!!


వాగ్భూషణం భూషణం అన్నారు. అంటే వినసొంపైన మాటలు ఆభరణాల్లాంటివి అని అర్థం. అలా మాట్లాడే గుణం కూడా పుస్తకాలు చదవడం వల్ల వస్తుంది. నిజం చెప్పాలంటే ప్రాంతీయతను వివరించే పుస్తకాల ద్వారా ప్రజల జీవన స్థితి గతులు స్పష్టం అవుతుంటాయి.  


ఒంటరితనానికి వీడ్కోలు!!


పుస్తకం తోడు ఉంటే ఒంటరితనం అనే ఫీలింగ్ ఎప్పుడూ, ఎవరినీ వెంటాడదు. అందుకే ఎప్పుడూ ఓ మంచి పుస్తకాన్ని వెంట ఉంచుకుంటే అంతకు మించి పెద్ద ఊరట ఉండదు కూడా.


పుస్తక పఠనం తగ్గిపోతున్న ఈ కాలంలో పిల్లల నుండి పెద్దల వరకు అన్ని వయసుల వారు చక్కగా పుస్తకాలతో రిలాక్స్ అవ్వచ్చు. వ్యక్తుల అభిరుచులను బట్టి ఎన్నో వర్గాల పుస్తకాలు అందరికీ అందుబాటులో ఉంటాయి. ఆన్లైన్ ద్వారా ఆర్డర్ పెట్టుకుంటే నేరుగా ఇంటికి చేరే పుస్తకాలతో జతకట్టడమే అందరూ చెయ్యాల్సిన పని. కాబట్టి పుస్తకాలతో ప్రియం ప్రియంగా మాట్లాడండి. అవి మిమ్మల్ని మాట్లాడిస్తాయి మీరు ఎలా కావాలంటే అలా!!


                              ◆వెంకటేష్ పువ్వాడ.