పనిభారం వల్ల అలసిపోతున్నారా...ఈ సింపుల్ టిప్స్ పాటిస్తే సరి!

 

పనులు మనిషి జీవనశైలిలో భాగం. ఇంటి వద్ద అయినా, బయటకు వెళ్లి అయినా,  వృత్తిలో భాగంగా అయినా ప్రతి ఒక్కరూ పనులు చేసుకుంటారు. ఈ రోజుల్లో విద్య,  ఉద్యోగం,  ఇంటి పనులు, వ్యాపారం.. ఇలా ప్రతి ఒక విషయంలోనూ ఒత్తిడి అనేది సర్వ సాధారణం అయిపోయింది.  ఈ ఒత్తిడి కారణంగా చాలామంది డిప్రెషన్, యాంగ్జిటీ వంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు.  పని భారం తగ్గితే ఆటోమేటిక్ గా ఒత్తిడి కూడా తగ్గుతుంది.  ఇది మానసిక సమస్యల నుండి బయట పడటంలో సహాయపడుతుంది.  కొన్ని సింపుల్ టిప్స్ తో పనిభారాన్ని ఈజీగా తగ్గించుకోవచ్చు.

పనిని సమయానికి పూర్తీ చేస్తే..

పనిని సమయానికి పూర్తీ చేస్తే ఎలాంటి భారం ఉండదు. అదే పనిని వాయిదా వేసినా ఆలస్యంగా చేసినా పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఇది ఇతర కార్యకలాపాల మీద కూడా ప్రభావం చూపిస్తుంది.  ఇవన్నీ కలసి రోజును చాలా గందరగోళం చేస్తాయి. అందుకే ఏ పనిని అయినా ఒక నిర్ణీత సమయంలో పూర్తీ చేసేలా ప్లాన్ చేసుకోవాలి.  


టైం టేబుల్ ఉండాలి..


ప్రతి రోజూ ఉదయాన్నే ఆ రోజు చేయవలసిన పనులేంటో మననం చేసుకోవాలి.  దానికి తగ్గట్టు సమయాన్ని, సమయ ప్రణాళికను,  పనుల విభజనను చేసుకోవాలి. ఇది పనులు పూర్తీ  చేయడాన్ని  సులభతరం చేస్తుంది.  ఒక పని నుండి మరొక పనికి మారడానికి కష్టం ఉండదు. తరువాత ఏం చేద్దాం అని ఆలోచించాల్సిన అవసరం అలలే ఉండదు.  ఒకదాని తరువాత ఒకటి ఒక ప్లో లో పూర్తీ చేయవచ్చు. అయితే మీ పనుల మీద ఇతరుల ప్రభావం, మీ సమయం పట్ల ఇతరుల ఆధిపత్యం లేకుండా చూసుకోవాలి.


మార్నింగ్ రొటీస్..


చాలామంది మాకు సమయం సరిపోవడం లేదు అంటూ ఉంటారు.  దీనికి పెద్ద కారణం ఉదయాన్నే నిద్ర లేవకపోవడం.  ఒకసారి ఉదయాన్నే కనీసం 5 నుండి 6 గంటల లోపు నిద్రలేచి పనులు మొదలు పెట్టి చూడండి.  చాలా పనులు సమయానికి అయిపోతాయి.  ఆఫీసుకు కూడా వేళకు వెళ్లవచ్చు. మొదట్లో ఉదయాన్నే లేవడం వల్ల రోజులో ఏదో ఒక సమయంలో నిద్ర వచ్చినట్టు ఉంటుంది. కానీ ఓ వారం రోజులు అలవాటు అయితే ఉదయాన్నే లేవడం వల్ల  రోజంతా ఉత్సాహంగా కూడా ఉంటారు.


మానసిక ఆరోగ్యం..

చాలామంది పని ఒత్తిడిలో పడి ఆరోగ్యాన్ని పట్టించుకోరు. శారీరక, మానసిక ఆరోగ్యం కూడా చాలా ముఖ్యం.  ఎక్కువ సేపు పని మీద ధ్యాస ఉంటే మెదడు, కళ్లు,  మనకు కూడా భారంగా ఫీల్ అవుతుంది. అందుకే ఎక్కువ సేపు పనులు చేసేవారు చిన్న చిన్న విరామాలు తీసుకుంటూ ఉండాలి.


 ఆహారం..


శరీరం అలసిపోకుండా ఉండాలంటే ఆహారం కూడా ముఖ్యం.  పనిలో పడి ఆహారాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. సమయానికి తినాలి. పోషకాలు కలిగిన సమతుల ఆహారం తీసుకోవాలి.  అదే విధంగా రోజుకు 7 నుంి 8 గంటల నిద్ర కూడా ఉండేలా చూసుకోవాలి.  


లక్ష్యాలు..


పెద్ద లక్ష్యాలు సాధించాలని అందరూ అనుకుంటారు. తద్వారా గొప్ప పేరు తెచ్చుకోవాలని అనుకుంటారు.  అయితే చిన్న చిన్న లక్ష్యాలు నిర్థేశించుకుంటూ వాటిని పెద్ద లక్ష్యాలకు దారిగా చేసుకోవాలి.   ఇది ఒత్తిడిని తగ్గిస్తుంది.  విజయాన్ని ఒళ్లో వాలేలా చేస్తుంది.


సహాయం..


పనులు చేసేటప్పుడు ఎవరి సహాయం అయినా అవసరం అయితే ఎలాంటి మొహమాటం,  మరింకే భయం లేకుండా సహాయం అడగాలి.  తెలియని విషయాన్ని అడిగి తెలుసుకోవాలి.  తెలియని పనిని తప్పించుకోవాలని ఎప్పుడూ అనుకోకూడదు. అది నేర్చుకునే దశను నాశనం చేస్తుంది.


మానసిక ఆరోగ్యం బాగుండాలంటే శారీరక ఆరోగ్యం కూడా బాగుండాలి.  దీనికోసం వ్యాయామం, యోగా ఫాలో అవ్వాలి.  అలాగే మానసిక  ఆరోగ్యం దెబ్బతినకుండా ధ్యానం,  ప్రాణాయామం వంటివి చేయాలి.  ఒక వేళ ఒత్తిడి సమస్యతో ఎక్కువగా బాధపడుతున్నట్టైతే కౌన్సిలింగ్ అయినా తీసుకోవాలి.


                                               *రూపశ్రీ.