కొయ్యా గుర్రం ఎగరావచ్చు!
posted on Jan 19, 2023 @ 1:56PM
మూడు పార్టీలకు చెందిన నలుగురు ముఖ్యమంత్రులు, ఒక మాజీ ముఖ్యమంత్రి, మరో జాతీయ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ... ఖమ్మంలో నిర్వహించిన బీఆర్ఎస్ ఆవిర్బావ సభ వేదిక నుంచి ప్రసంగించిన నేతలు ఈ ఐదుగురు. సరే, ఐదుగురు నేతలు ప్రధానమంత్రి నరేంద్ర మోడీని, మోడీ ప్రభుత్వ విధానాలను విమర్శించారు. దేశం ఏమైపోతోందనే ఆవేదన, ఆగ్రహం వ్యక్తపరిచారు. తెలంగాణ ముఖ్యమంత్రి, కేసేఆర్ అయితే, 2024 ఎన్నికల తర్వాత ప్రధాని మోడీ ఇంటికి ...మేము ఢిల్లీకీ అని, చాలా విశ్వాసంగా ప్రకటించారు.
అయితే, ఈ ‘మేము’ లో ఉన్నది ఎవరు? వేదిక మీద ఐదు ముఖాలు కనిపించినా, ఉన్నది బీఆర్ఎస్ సహా నాలుగే పార్టీలు.. అందులో లోక్ సభలో సింగిల్ సీటున్న పార్టీ ఒకటి (ఆప్), రెండే సీట్లున్న పార్టీ ( సిపిఐ) ఇంకొకటి, ఐదు సీట్లున్న పార్టీ (ఎస్పీ), మూడు సీట్లకు పరిమితం అయిన సిపిఎం మరొకటి. ఇక బీఆర్ఎస్ సంగతి చెప్పనే అక్కరలేదు. కారు సారు పదహారు ..కాస్తా తొమ్మిదికి చేరింది. అంటే 545 సంఖ్యా బలమున్న లోక్ సభలో బీఆర్ఎస్ వేదికను అలంకరించిన జాతీయ నేతల టోటల్ స్ట్రెంక్త్ 20కి లోపే. పోనీ ఈ నాలుగు పార్టీల ఐదుగురు నేతలు ఒకే మాట మీదున్నారా? అంటే అదీ లేదు. ఎవరి అవసరాలకు తగ్గట్టుగా నలుగురూ నాలుగు పక్కలకూ లాగుతున్నారు. ముఖ్యంగా ఎంత చెడ్డా లోక్ సభలో అధికారికంగా ప్రతిపక్ష హోదా ఉన్నా లేకున్నా, జాతీయ స్థాయిలో బీజేపీకి ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీనే ..అయినా కాంగ్రెస్ పొత్తు విషయంలో ఏ రెండు పార్టీల మధ్య ఏకాభిప్రాయం లేదు. ఏ రెండు పార్టీలు కాదు, ఏ ఇద్దరు నాయకుల మధ్య కూడా ఏకాభిప్రాయం లేదు.
కేసీఆర్ బీజేపీతో పాటుగా కాంగ్రెస్ పార్టీని కూడా శత్రు పక్షంగా చూస్తున్నారు. ఆ రెండు పార్టీల నిర్వాకం వల్లనే దేశం ఈ దౌర్భాగ్య స్థితి చేరిందని ఆయన అంటున్నారు. మరో వంక సిపిఐ నేత డి.రాజా కాంగ్రెస్ సహా లౌకికవాద ప్రతిపక్ష పార్టీలు అన్నీ ఒక్కటైతేనే కానీ, మోడీ పీఠాన్ని కదల్చలేమని అంటున్నారు. ఆప్ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ సగం అటు సగం ఇటుగా ఉన్నారు. అదే పార్టీకి చెందిన పంజాబ్ ముఖ్యమంత్రి మాన్ బీజేపీ కంటే కాంగ్రెస్ పార్టీనే టార్గెట్ చేశారు. అలాగే సిపిఐ జాతీయ నేత రాజా, కాంగ్రెస్ తో కలిసి నడవాలని అంటే, కేరళ ముఖ్యమంత్రి (సిపిఎం) హస్తం పార్టీతో చేయి కలిపేది లేదని అంటున్నారు. అఫ్కోర్స్, సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి కూడా కాంగ్రెస్ కలిసిపోదామని అన్నా, గత ఏప్రిల్లో జరిగిన సిపిఎం కాంగ్రెస్ ఏచూరి ప్రతిపాదనను తోసి పుచ్చింది. జాతీయ స్థాయిలో ఏ పార్టీ, కూటమితో పొత్తు ఉండదని, సిపిఎం కాంగ్రెస్ ఆమోదించిన రాజకీయ తీర్మానంలో స్పష్టం చేసింది.
నిజానికి, ఈ నాలుగు పార్టీలు ఐదుగురు నాయకులే కాదు, ఓ వంక నుంచి మమతా బెనర్జీ, మరో వంక నుంచి నితీష్ కుమార్, ఎవరికి వారు 2024 ఎన్నికలలో మోడీని ఇంటికి పపంపాలని శక్తి వంచన లేకుండా ప్రయత్నిస్తూనే ఉన్నారు. అయితే, అది అయ్యే పనేనా? అందులోనూ... కాంగ్రెస్ ను పక్కన పెట్టి, అంటే ..ఏమో కొయ్యా గుర్రం ఎగరావచ్చు .. అంటున్నారు.