Read more!

చలికాలం వస్తే గుండెపోటు తప్పదా!

 

నవంబరు నెల రావడంతోనే మనకు చలిగాలుల ఉధృతి మొదలైపోతుంది. ఇక రోజులు గడిచేకొద్దీ పడిపోయే ఉష్ణోగ్రతల వల్ల రకరకాల ఆరోగ్య సమస్యలు మొదలవుతుంటాయి. జలుబు దగ్గర్నుంచీ కీళ్లనొప్పుల వరకూ ఏదో ఒక ఉపద్రవం లేకుండా చలికాలాన్ని దాటడం కష్టం. ఇవన్నీ ఒక ఎత్తయితే చలికాలంలో గుండెకు సంబంధించిన సమస్యలు ఒకోసారి ప్రాణాంతకంగా పరిణమించే ప్రమాదం లేకపోలేదు.
ఇవీ కారణాలు

 

- చలి వాతావరణం వల్ల రక్తపోటు పెరిగే అవకాశం ఉంటుంది. దీంతోపాటుగా రక్తనాళాలను అడ్డుపరిచేలా కొన్ని హానికారక ప్రొటీన్లు కూడా తయారవుతాయని తేలింది.

 

- బయట చలి ఎక్కువగా ఉన్నప్పుడు శరీరంలో ఉష్ణోగ్రతలు సాధారణ స్థితిలో ఉండేందుకు గుండె ఎక్కువగా కష్టపడాల్సి ఉంటుంది. దీని వలన గుండె ధమనులు కుంచించుకుపోతాయట. ఫలితంగా గుండెకు రక్తం, ఆక్సిజన్‌ సరఫరాలో లోపం ఏర్పడుతుంది.

 

- మందపాటి దుస్తులను ధరించకుండా చలిగాలుల్లో తిరగడం వల్ల శరీరంలోని ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పడిపోతాయి. దీనిని హైపోధర్మియా అంటారు. ఈ హైపోధర్మియా కూడా గుండెపోటుకి దారితీస్తుంది.

 

- చలికాలంలో మనకు తగినంత విటమిన్ డి లభించదు. దీని వలన మన గుండె ఆరోగ్యం తప్పకుండా ప్రభావితం అవుతుందని తాజా పరిశోధనలు రుజువుచేస్తున్నాయి.

 

- చలికాలంలో శరీరాన్ని తగినంత వేడిగా ఉంచేందుకు ‘Brown Fat’ అనే కొవ్వు పదార్థం ఉత్పత్తి అవుతుందట. ఇది మన ధమనులలో పేరుకుపోవడం వల్ల కూడా గుండెపోటు వచ్చే అవకాశం ఉందని తేలింది.
నివారించేందుకు మార్గాలు

 

- చలికాలం ఎంతగా పనిచేసినా కూడా చెమట పట్టదు, అలసట తెలియదు. కాబట్టి ఒకోసారి అలవాటు లేని బరువైన పనులు కూడా అలవోకగా చేసేందుకు ప్రయత్నిస్తుంటారు. దీని వలన గుండె మీద ఒకోసారి ఎక్కువ భారం పడే ప్రమాదం ఉంటుంది. కాబట్టి రక్తపోటు, గుండెసంబంధ సమస్యలు ఉన్నవారు చలికాలంలో మోతాదుని మించిన శ్రమకి దూరంగా ఉండాల్సిందే!

 

- గుండెజబ్బులు ఉన్నవారు ఉదయం వేళ ఇంకా చలి తగ్గని సమయాలలో జాగింగ్‌ చేయడంకంటే, సాయంవేళ వాహ్యాళికి బయల్దేరడం ఉత్తమం.

 

- వాతావరణం చలచల్లగా ఉందికదా అని మద్యపానం, సిగిరెట్లని విచ్చలవిడిగా సేవించేస్తుంటారు. ఒళ్లు వేడెక్కడం మాటేమో కానీ వీటి వల్ల ఇటు మెదడు మీదా, అటు రక్తప్రసారం మీదా విపరీతంగా ఒత్తిడి పెరిగిపోతుంది.

 

- చలికాలం తగినంత సూర్యరశ్మి లేకపోవడం వల్ల మనలోని జీవగడియారం అదుపు తప్పుతుంది. ఫలితంగా తగినంత గాఢనిద్ర ఉండదు. ఇటు జీర్ణశక్తి కూడా సవ్యంగా ఉండదు. అందుకనే శరీరానికి తగినంత నిద్ర, ఆహారం ఉండేట్లు గమనించుకోవాలి.

 

- గుండెపోటు వచ్చే ముందు మన శరీరానికి చాలా సూచనలు అందుతాయి. ఎడమ చేయి లాగుతూ ఉండటం, గుండె దగ్గర కండరాలు బిగువుగా తోచడం, పంటి చిగుళ్ల నుంచి రక్తం కారడం, ఆయాసం... లాంటి చిహ్నాలు కనిపిస్తాయి. ఇలాంటప్పుడు ఏమాత్రం అశ్రద్ధ చేయకుండా వైద్యుని సంప్రదించాలి.

 

తగినంత వ్యాయామం చేయడం, వేళ తప్పకుండా నిద్ర, వేళ దాటిపోకుండా ఆహారం, అశ్రద్ధ చేయకుండా మందులు వేసుకోవడం, డి విటమిన్‌ కోసం శరీరానికి తగినంత సూర్యరశ్మి అందేలా గమనించుకోవడం, రక్తపోటు స్థాయి ఎప్పటికప్పుడు అదుపులో ఉందో లేదో చూసుకోవడం... ఇవన్నీ పాటిస్తే నూరు చలికాలాల పాటు నిబ్బరరంగా ఉండే ఆరోగ్యం మన సొంతమవుతుంది.

 

 

- నిర్జర..