విడదల రజని మంత్రి పదవి మూన్నాళ్ల ముచ్చటేనా?
posted on Feb 22, 2023 @ 4:32PM
వైసీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి జగన్.. తాజాగా ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికలో సామాజిక న్యాయం అంటూ పక్కాగా క్యాస్ట్ ఈక్వేషన్స్‌తో తన మార్క్ రాజకీయాన్ని ప్రదర్శించారని ఆ పార్టీ శ్రేణుల్లో జోరుగా హుషారుగా చర్చ సాగుతోంది. అదే సమయంలో జగన్ తన కేబినెట్‌ను మరోసారి పున్వ్యవస్థీకరిస్తారనే చర్చ కూడా తెరమీదకు వచ్చింది.
ఈ సారి పునర్వ్యవస్థీకరణలో భాగంగా తన కేబినెట్‌లో కొత్తగా ఎమ్మెల్సీలుగా ఎన్నిక అయ్యే వారికీ చోటు కల్పిస్తారని పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. అలా చోటు దక్కే వారిలో చిలకలూరిపేటకు చెందిన మర్రి రాజశేఖర్ కచ్చితంగా ఉంటారని చిలకలూరి పేటలో పార్టీ శ్రేణులు బల్లగుద్ది మరీ చెబుతున్నారు. మర్రి రాజశేఖర్ పార్టీ కోసం, జగన్ అధికారంలోకి రావడం కోసం ఎంత కష్టపడాలో అంతా కష్టపడ్డారని అంటున్నారు. ఈ విషయంలో ఆయన వర్గీయులే కాదు, ఆయన ప్రత్యర్థి వర్గం అయిన మంత్రి విడదల రజినీ వర్గంలో కూడా అదే అభిప్రాయం వ్యక్తం అవుతోందని చెబుతున్నారు.
మరో వైపు జగన్ కేబినెట్‌లో మర్రి రాజశేఖర్ సామాజిక వర్గానికి చెందిన వారు ఎవరూ లేరన్న సంగతి అందరికీ తెలిసిందే. గతంలో అంటే జగన్ తొలి కెబినెట్‌లో కొడాలి నాని మంత్రిగా ఉన్నారు. కానీ ఆ తర్వాత.. జగన్ తన కెబినెట్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా కొడాలి నానిని పక్కన పెట్టడంతో.. ఆ సామాజిక వర్గం వారికి కేబినెట్ లో స్థానం లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో జగన్ కెబినెట్‌లోకి మర్రి రాజశేఖర్‌ను తీసుకునే అవకాశం ఉందని అంటున్నారు.
అదీకాక.. 2019 ఎన్నికల ప్రచారంలో చిలకలూరిపేట నియోజకవర్గం నుంచి విడదల రజినీని ఎమ్మెల్యేగా గెలిపిస్తే..మర్రి రాజశేఖర్‌ను ఎమ్మెల్సీగా శాసన మండలికి పంపి.. ఆయనను తన కేబినెట్‌లోకి తీసుకుంటానని విపక్ష నేతగా జగన్ వివిధ సభా వేదికలపై నుంచి ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ ఎన్నికల్లో విడదల రజినీ గెలవడం.. ఆ తర్వాత జగన్ కేబినెట్‌లో వైద్యారోగ్య శాఖ మంత్రిగా కీలక బాధ్యతలు చేపట్టడం కూడా జరిగిపోయింది. మరి ఒకే నియోజకవర్గానికి చెందిన ఈ ఇద్దరినీ కెబినెట్‌లోకి తీసుకుంటే... తప్పుడు సంకేతాలు వెళ్లే అవకాశం ఉందనే ఓ చర్చ పార్టీలోనే నడుస్తోంది. అలాగని విడదల రజినీని మంత్రి పదవి నుంచి తప్పించి.. మర్రి రాజశేఖర్‌ను కేబినెట్‌లోకి తీసుకుంటారా? అంటే పార్టీ శ్రేణుల నుంచి ఔనని కానీ కాదని కానీ బదులు రావడం లేదు. మర్రి రాజశేఖర్.. చాలా సాప్ట్‌గా ఉంటారని.. ప్రతిపక్ష పార్టీపైనే కాదు.. సొంత పార్టీలోని ప్రత్యర్థి వర్గంపై కూడా ఆయన ఆరోపణలు.. ప్రత్యారోపణలు.. కానీ విమర్శలు కానీ చేసిన దాఖలాలు అయితే లేవని ఆయన వర్గమే క్లియర్ కట్‌గా స్పష్టం చేస్తోంది. అలాంటి వేళ.. మర్రి రాజశేఖర్‌కు కెబినెట్ బర్త్ గ్యారంటీనా అంటే అనుమానమే,
ఎందుకంటే.. ముఖ్యమంత్రి జగన్ తన కేబినెట్ మంత్రులుగా ప్రత్యర్థి పార్టీల నేతలపై వాడి వేడిగా చేయాలని ఆశిస్తారనీ, అలా ఘాటు విమర్శలు చేయగలిగిన వారినే మంత్రివర్గంలోకి తీసుకుంటారని పార్టీ శ్రేణులే చెబుతున్నాయి. ఆ క్రమంలోనే తొలి కేబినెట్‌లో కొడాలి నాని, పేర్ని నాని, అనిల్ కుమార్ యాదవ్, వెల్లంపల్లి శ్రీనివాసరావు, కురసాల కన్నబాబులను తీసుకున్నారని.. పునర్వ్యవస్థీకరణలో అంబటి రాంబాబు, జోగి రమేష్, ఆర్కే రోజా, విడుదల రజినీలకు చోటు కల్పించారని పార్టీ శ్రేణులు గుర్తు చేసుకుంటున్నాయి. మరి అలాంటి వేళ.. కామ్ గోయింగ్ పర్సన్ అయిన.. మర్రి రాజశేఖర్‌ను కేబినెట్‌లోకి తీసుకుంటారా? అదీ పైర్‌బ్రాండ్ విడదల రజినీని తప్పించి అంటే సందేహమే అంటున్నారు. అదే సమయంలో పలు వేదికలపై మర్రి రాజశేఖర్ ను మంత్రిని చేస్తానని జగన్ స్వయంగా ప్రకటించి మాట తప్పుతారా అన్న అనుమానం కూడా వ్యక్తం అవుతోంది. ఒక వేళ మర్రి రాజవేఖర్ కు ఇచ్చిన మాట నిలుపుకోవాలని జగన్ భావిస్తే విడదల రజని మంత్రి పదవి మూన్నాళ్ల ముచ్చటగానే మిగిలిపోక తప్పదని పార్టీ శ్రేణులు అంటున్నాయి.