చేవెళ్ల లో గులాబీ పార్టీ హ్యాట్రిక్ కొడుతుందా? బీజేపీ, కాంగ్రెస్‌ బలహీనతలు ఏంటి?

ఒకవైపు పూర్తిగా గ్రామీణ వాతావరణం, మరోవైపు అత్యంత ఆధునిక జీవనం మిళితమైందే చేవెళ్ళ పార్లమెంటరీ నియోజకవర్గం. శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయం, సాఫ్ట్‌వేర్ రంగానికి ఆయువుపట్టు హైటెక్ సిటీ కూడా చేవెళ్ళ పరిధిలోకే వస్తాయి. అధికార కాంగ్రెస్ తో పాటు బీఆర్‌ఎస్‌, బీజేపీలు నువ్వా-నేనా అన్నట్లుగా తలపడుతున్నాయి.  చేవెళ్ళలో మూడు పార్టీల పరిస్థితి ఏంటి? ముఖ్యంగా  మూడు ప్ర‌ధాన పార్టీల బ‌లాబ‌లాలు ఏమిటి? బ‌ల‌హీన‌త‌లు ఏమిటో చూద్దాం. 

చేవెళ్ల పార్ల‌మెంటు నియోజ‌క‌వ‌ర్గం నుంచి హేమాహేమీలు త‌ల‌ప‌డుతున్నారు. కాంగ్రెస్ నుంచి ప్ర‌స్తుత ఎంపీ రంజిత్ రెడ్డి, బీజేపీ నుంచి మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వ‌ర్ రెడ్డి, బీఆరెస్ నుంచి మాజీ ఎమ్మెల్సీ కాసాని జ్ఞానేశ్వ‌ర్ ముదిరాజ్‌ బరిలో ఉన్నారు. వీరిలో విశ్వేశ్వ‌ర్ రెడ్డి, జ్ఞానేశ్వ‌ర్ స్థానికులు. 

బీజేపీ అభ్య‌ర్థి కొండా విశ్వేశ్వ‌ర్ రెడ్డిః
2019 ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ అభ్య‌ర్థి కొండా విశ్వేశ్వ‌ర్ రెడ్డిపై, బీఆరెస్ అభ్య‌ర్థి రంజిత్ రెడ్డి గెలుపొందారు. 
ఓడిపోయిన  విశ్వేశ్వ‌ర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని విడిచి, బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. కేంద్రంలో న‌రేంద్ర మోదీ స్వ‌చ్ఛ‌మైన పాల‌న‌ను చూసి త‌న‌ను గెలిపించాల‌ని విశ్వేశ్వ‌ర్ రెడ్డి ఓట‌ర్ల‌ను కోరుతున్నారు.  విశ్వేశ్వరెడ్డి గెలుపుకోసం బీజేపీ అనుబంధ సంస్థలు క్షేత్రస్థాయిలోముమ్మరంగా ప్రచారం చేస్తున్నాయి. కొండా విశ్వేశ్వర్‌రెడ్డిని ముందుగానే అభ్యర్ధిగా ప్రకటించడం బీజేపీకి సానుకూలంగా మారింది. గతంలో ఆయన ఎంపీగా చేయడంతో పాటు నియోజకవర్గ వ్యాప్తంగా అన్నివర్గాల వారితో సత్ససంబంధాలు కలిగి ఉండడం ఆయనకు కలిసివస్తోంది. ప్రధాని మోదీ పేరునే ప్రధాన ప్రచారస్త్రాంగా మలుచుకుని ఓట్లు అడుగుతున్నారు.  బీజేపీ శ్రేణులతో పాటు ఆర్ ఎస్ ఎస్‌ అనుబంధ సంస్థలు చాపకింద నీరులా పనిచేస్తున్నాయి. స్థానికంగానే బసచేస్తూ క్షేత్రస్థాయిలో ముమ్మర ప్రచారం చేస్తున్నాయి.  మోదీ ఛరిష్మా కలిసి వస్తుందని కమలనాథులు లెక్కలు వేస్తున్నారు. చేవెళ్ల పార్లమెంట్ పరిధిలో రాజేంద్రనగర్, మహేశ్వరం అసెంబ్లీ స్థానాల్లో మైనార్టీ ఓట్లు చాలా కీలకంగా మారే ఛాన్స్ ఉంది. ఎంఐఎం పార్టీ ప్రత్యేకంగా అభ్యర్థిని నిలబెడితే ఇక్క‌డ బీజేపీ ఈజీగా గెలిచేది. కానీ ఎంఐఎం త‌న అభ్య‌ర్థిని నిల‌బెట్ట‌లేదు. కాబ‌ట్టి పోటీ  కాంగ్రెస్ బీఆర్ ఎస్ మ‌ధ్య ముఖాముఖి పోటీ వుంది. బీఆర్ ఎస్ పార్టీకే ఇక్క‌డ క‌లిసి వ‌చ్చే అవకాశం స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది.

కాంగ్రెస్ అభ్య‌ర్థి రంజిత్ రెడ్డిః
చేవెళ్ళ సిట్టింగ్ ఎంపి. కాంగ్రెస్ అధికారంలోకి రావ‌డంతో రంజిత్ రెడ్డి కాంగ్రెస్‌లో చేరారు. రెండోసారి విజ‌యం సాధించి త‌న అదృష్టాన్ని ప‌రిశీలించుకోవాల‌ని రంజిత్ రెడ్డి ఉన్నారు. త‌న‌కు ఉన్న వ్య‌క్తిగ‌త ప‌రిచ‌యాల‌తో ఆయ‌న నియోజ‌క‌వ‌ర్గంలో ప్ర‌చారం ప్రారంభించారు.  ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి రంజిత్ రెడ్డి గెలుపుకోసం వ్యూహ‌ర‌చ‌న చేశారనే అభిప్రాయాలు ఉన్నాయి.  చేవెళ్ల పార్లమెంట్‌ ఇన్‌చార్జ్‌గా ఉన్న సీఎం రేవంత్‌రెడ్డి ఈ నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టిసారించారు. అయితే క్షేత్రస్థాయిలో కాంగ్రెస్‌ ఎదురీదుతోంది. బీజేపీ, బీఆర్‌ఎస్‌ నుంచి గట్టిపోటీ ఎదుర్కొంటోంది. టీఆర్‌ఎస్‌ నుంచి వచ్చిన సిట్టింగ్‌ ఎంపీ రంజిత్‌రెడ్డి తో పాటు పెద్ద ఎత్తున బీఆర్‌ఎస్‌ నేతలు కూడా తరలివస్తారని కాంగ్రెస్‌ నాయకత్వం భావించింది. కానీ ఇప్పటి వరకు ఆ స్థాయిలో చేరికలు జరడంగలేదు. దీంతో కాంగ్రెస్‌ ఆశించిన స్థాయిలో బలం పుంజుకోవడంలేదు. రాజేంద్రనగర్‌ ఎమ్మెల్యే ప్ర‌కాష్ గౌడ్‌ కాంగ్రెస్‌లో చేరతానని ప్రకటించినా తరువాత ఆయన వెనక్కి తగ్గారు. సీఎం రేవంత్‌రెడ్డిని కలిసిన మరుసటి రోజే ఆయన వెనక్కి తగ్గి బీఆర్ ఎస్ లో కొనసాగుతానని ప్రకటించారు. దీంతో కాంగ్రెస్‌ నాయకత్వం అభాసుపాలైంది. పైగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల విష‌యంలోనూ ఓట‌ర్ల‌లో అస‌హ‌నం వ్య‌క్తం అవుతుంది. కాబ‌ట్టి కాంగ్రెస్ పార్టీతో పోల్చుకుంటే బీఆర్ ఎస్ అభ్య‌ర్థి వైపే ఓట‌ర్లు మొగ్గు చూపుతున్నారు.
 
బీ ఆర్ ఎస్ అభ్య‌ర్థి కాసాని జ్ఞానేశ్వ‌ర్ః
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత.. జరిగిన రెండు పార్లమెంట్‌ ఎన్నికల్లో బీఆర్ఎస్‌ అభ్యర్థులే విజయం సాధించారు. 2014లో కొండా విశ్వేశ్వర్ రెడ్డి, 2019 ఎన్నికల్లో గ‌డ్డం రంజిత్ రెడ్డి గెలుపొందారు. గత రెండు ఎన్నికల్లోనూ రాజ‌కీయంగా అనుభ‌వం లేని నేత‌ల‌ను రంగంలోకి దింపి గెలిపించుకున్నారు గులాబీబాస్‌. ప్ర‌స్తుత బీఆరెస్ అభ్య‌ర్థి కాసాని జ్ఞానేశ్వ‌ర్ స్థానికుడు. గ‌తంలో ఉమ్మ‌డి రంగారెడ్డి జిల్లా ప‌రిష‌త్ చైర్మన్‌గా జిల్లాలో మౌలిక స‌దుపాయాల క‌ల్ప‌న‌కు పెద్ద‌పీట వేశారు.  ఎమ్మెల్సీగా జిల్లాకు సేవ చేశారు. బీసీ సామాజిక వ‌ర్గంలో మంచి ప‌ట్టు వుంది. ఈ నియోజ‌క‌వ‌ర్గంలో బీసీ జ‌నాభా కూడా 50 శాతానికి మించి వుంది. ఇవ‌న్ని ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుంటే కాసాని గెలిచిన‌ట్లేన‌ని స్థానిక ఓట‌ర్లు  చెప్పుకుంటున్నారు.  ఇక్క‌డ బీఆర్ఎస్‌కు బ‌ల‌మైన క్యాడ‌ర్ వుంది కాబ‌ట్టి ముచ్చ‌ట‌గా మూడ‌వ సారి బీఆర్ ఎస్ చేవెళ్ళ‌లో హ్యాట్రిక్ కొట్ట‌డం ఖాయ‌మ‌ని గులాబీ శ్రేణుల్లో ధీమా క‌నిపిస్తోంది.  స్థానికుడ‌నైన త‌న‌ను గెలిపించాల‌ని కాసాని కోరుతున్నారు. పైగా బీసీలంతా కాసానికే అండ‌గా వున్నారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితులను బీఆర్‌ఎస్‌ పార్టీ తనకు అనుకూలంగా మలుచుకుంటోంది. బీఆర్‌ఎస్ అభ్యర్ధి కాసాని జ్ఞానేశ్వర్‌ ప్రణాళిక బద్ధంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఆయనకు గెలుపుకోసం బీఆర్ ఎస్‌ అనుబంధ సంస్థలు, బీసీ కుల‌సంఘాలు క్షేత్రస్థాయిలోముమ్మరంగా ప్రచారం చేస్తున్నాయి. కాసాని జ్ఞానేశ్వర్‌  అభ్యర్ధి గా వుండ‌టం బీఆర్ ఎస్‌కు సానుకూలంగా మారింది. గతంలో ఆయన జ‌డ్పీ ఛైర్మ‌న్‌గా, ఎమ్మెల్సీగా చేయడంతో పాటు నియోజకవర్గ వ్యాప్తంగా అన్నివర్గాల వారితో సత్ససంబంధాలు కలిగి ఉండడం ఆయనకు కలిసివస్తోంది. కేసీఆర్ పాల‌నే  ప్రచారస్త్రాంగా మలుచుకుని ఓట్లు అడుగుతున్నారు. మరో వైపు  బీఆర్ ఎస్ సోషల్‌ మీడియా వింగ్‌ కూడా తెర వెనుక విస్తృత ప్రచారం నిర్వహిస్తోంది. బీఆర్ ఎస్‌ ఇంటింటి ప్రచారాన్ని ముమ్మరం చేసింది.   క్షేత్రస్థాయిలో ముమ్మర ప్రచారం చేస్తూ కాసాని ప్రచారంలో ముందంజలో ఉన్నారు.  గత అసెంబ్లీ ఎన్నికల్లో పార్లమెంట్‌ పరిధిలో అత్యధిక ఓట్లు సాధించిన బీఆర్‌ఎస్‌ లోక్‌సభ ఎన్నికల్లో కూడా పట్టునిలుపుకునేయత్నం చేస్తోంది.  బీసీ కార్డును ప్రయోగిస్తోంది. మాజీ మంత్రులు కేటీఆర్‌, సబితా ఇంద్రారెడ్డి రోజు వారీ నియోజకవర్గంపై సమీక్షలు నిర్వహిస్తున్నారు. నియోజకవర్గంలో ఎన్నికల ప్రచార బాధ్యత సబితారెడ్డి తీసుకున్నారు.

- ఎం.కె.ఫ‌జ‌ల్‌

పేదలపై కక్షతోనే ఉపాధిహామీ పథకం నిర్వీర్యం.. మోడీ సర్కార్ పై రేవంత్ ధ్వజం

కేంద్రంలోని మోడీ సర్కార్ పై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. గాంధీ భవన్ లో గురువారం (జనవరి 8) జరిగిన విస్తృతస్థాయి సమావేశంలో ప్రసంగించిన ఆయన 2024 సార్వత్రిక ఎన్నికలలో బీజేపీ 400 స్థానాలలో విజయం సాధించి ఉంటే రాజ్యాంగాన్ని సమూలంగా మార్చేసి ఉండేదన్న ఆయన కాంగ్రెస్ ప్రజలను అప్రమత్తం చేయడం వల్లనే ఆ పార్టీకి పూర్తి మెజారిటీని జనం ఇవ్వలేదని అన్నారు. మెజారిటీ ఉందికదా అని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తామంటే అంగీకరించేది లేదన్నారు.   మోడీ సర్కార్ పేదల పట్ల కక్ష సాధింపుధోరణితో వ్యవహరిస్తోందనీ, అందుకే  మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని నీరుగారుస్తోందనీ విమర్శించారు. నిబంధనల మార్పు పేరుతో ఆ పథకాన్ని శాశ్వతంగా నిలిపివేయడానికి కేంద్రంలోని మోడీ సర్కార్ కుట్రపన్ననుతోందని విమర్శించారు. అధికారం ఉందన్న అహంకారంతో చట్టసభలను వినియోగించి పేదలను అణిచివేస్తామంటే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసే కుట్రను అడ్డుకోవాలని పిలుపునిచ్చారు.  

గోబెల్స్ ను మించి జగన్ అసత్య ప్రచారం!

క్రిస్మస్ సెలబ్రేషన్స్ ను పులివెందులలో జరుపుకున్న తరువాత బెంగళూరుకు వెళ్లిపోయిన జగన్ ఆ తరువాత తొలిసారిగా ఆంధ్రప్రదేశ్ కు వచ్చి ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తూ మీడియా సమావేశం అనే లాంఛనం పూర్తి చేసి తిరిగి బెంగళూరు వెళ్లిపోయారు. ఆంధ్రప్రదేశ్ లో అధికారం కోల్పోయిన తరువాత జగన్ రాష్ట్రానికి చుట్టపు చూపుగా మాత్రమే వస్తున్న సంగతి తెలిసిందే. అలా వచ్చిన ప్రతి సారీ మీడియా సమావేశం పెట్టి ఏదో ఒక అంశంపై ప్రభుత్వంపై విమర్శలు గుప్పించడం ఆనవాయితీగా మార్చుకున్నారు. తాజాగా కూడా ఆయన అదే పని చేశారు. తాడేపల్లి ప్యాలెస్ లో గురువారం (జనవరి 8) మీడియా సమావేశంలో జగన్  సీమ లిఫ్ట్ పై ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబునాయుడు, తెలుగుదేశం కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.   సీమకు చంద్రబాబు వెన్నుపోటు పొడిచారనీ, తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా రేవంత్ రెడ్డి  సీమ లిఫ్ట్ పై చేసిన వ్యాఖ్యల ఆధారంగా చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు. అయితే వాస్తవానికి ఈ ప్రాజెక్టు పనులను ప్రారంభించి, నిలిపివేయడం జరిగింది  జగన్ హయాంలోనే. ప్రాజెక్టును ప్రారంభించిన ఆరు నెలలలోనూ ఆ  ప్రాజెక్టు చేపట్టిన ఆరునెలలలోగానే అప్పటి మంత్రి పెద్దిరెడ్డి కంపెనీకి భారీ చెల్లింపులు చేసి, పనులు నిలిపివేసింది జగన్ హయాంలోనే. అయితే ఆ తరువాత ఈ ప్రాజెక్టుకు అనుమతుల కోసం మూడేళ్ల పాటు ఎలాంటి ప్రయత్నాలు చేయకుండా, ఇప్పుడా ప్రాజెక్టును నిలిపివేసింది చంద్రబాబే అని విమర్శలు గుప్పించడం పట్ల పరిశీలకులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.   తన హయాంలో నిలిచిపోయిన సీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులకు చంద్రబాబును బాధ్యుడిని చేస్తున్న జగన్.. చంద్రబాబు ఆలోచనతో ఆంకురార్పణ జరిగి, ఆయన హయాంలోనే పూర్తి అయిన భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం క్రెడిట్ మాత్రం తన ఖాతాలో వేసుకోవడానికి తహతహ లాడుతున్నారంటూ నెటిజనులు తెగ ట్రోల్ చేస్తున్నారు.  జగన్ తన వైఫల్యాలను చంద్రబాబు ఖాతాలోనూ, చంద్రబాబు విజయాలను తన ఖాతాలోనూ వేసుకోవడానికి తాపత్రేయపడుతున్నారంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. క్రెడిట్ కోసం జగన్ అవాస్తవాలు వల్లెవేస్తూ గోబెల్స్ ను మించిపోతున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  

ఐప్యాక్ కార్యాలయంపై ఈడీ రెయిడ్స్.. మమత ఫైర్

పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు ఈ ఏడాది జరగనున్నాయి. హ్యాట్రిక్ విజయాలతో వరుసగా మూడు సార్లు రాష్ట్రంలో అధికార పగ్గాలు చేపట్టిన తృణమూల్ కాంగ్రెస్ నాలుగోసారి విజయం సాధించి అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తున్నది. అదే సమయంలో బీజేపీ కూడా రాష్ట్రంలో అధికార పగ్గాలు చేపట్టాలన్న పట్టుదలతో ఉంది. ఈ నేపథ్యంలోనే పశ్చిమ బెంగాల్‌లో రాజకీయ వేడి రగులు కుం టోంది.  తాజాగా  రాష్ట్రంలోని ఇండియా పొలిటికల్ యాక్షన్ కమిటీ (ఐ-ప్యాక్) ప్రధాన కార్యాలయాంపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాడులు నిర్వహించడం కలకలం రేపింది. కాగా ఈడీ దాడులపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి  మమతా బెనర్జీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.   కేంద్రం కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని దుయ్యబట్టారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా కుట్రపూరితంగా ఎన్నికల లబ్ధి కోసం దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారంటూ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.    కోల్‌కతాలోని సాల్ట్ లేక్‌లో ఉన్న ఐ-ప్యాక్ ప్రధాన కార్యాలయంతో పాటు, సంస్థ సహ వ్యవస్థాపకుడు ప్రతీక్ జైన్ నివాసంలోనూ గురువారం (జనవరి 8) ఉదయంఈడీ అధికారులు ఏకకాలంలో సోదాలు చేపట్టారు.  కేంద్ర సాయుధ బలగాల   భద్రత నడుమ జరుగుతున్న దాడుల నేపథ్యంలో  మమతా బెనర్జీ, కోల్‌కతా పోలీస్ కమిషనర్ మనోజ్ కుమార్ వర్మతో కలిసి నేరుగా ప్రతీక్ జైన్ నివాసానికి చేరుకున్నారు. ఇంట్లోకి వెళ్లి ఈడీ అధికారులతో మాట్లాడి, కొద్దిసేపటి తర్వాత బయటకు వచ్చిన ఆమె, మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా కేంద్రంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.    తృణమూల్ కాంగ్రెస్‌కు సంబంధించిన పత్రాలను ఈడీ అధికారులు స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నించారనీ, అయితే.. తాను వాటిని తిరిగి తీసుకువచ్చానని చెప్పిన మమతా బెనర్జీ,  హోంమంత్రి దేశాన్ని రక్షించలేరు, కానీ ఈడీ ద్వారా  తృణమూల్ ను ఇబ్బందులు పెట్టడానికి చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.  అక్కడ నుంచి  సాల్ట్ లేక్‌లోని ఐ-ప్యాక్ కార్యాలయానికి కూడా  ఆమె వెళ్లారు.  2021 అసెంబ్లీ ఎన్నికలకు ముందు, అంటే 2020 నుంచి ఐ-ప్యాక్ సంస్థ తృణమూల్ కాంగ్రెస్‌కు ఎన్నికల వ్యూహకర్తగా పనిచేస్తున్న విషయం తెలిసిందే. మమత చర్యలపై పశ్చిమ బెంగాల్ శాసనసభలో ప్రతిపక్ష నేత సువేందు అధికారి తీవ్రంగా స్పందించారు. రాజ్యాంగబద్ధమైన సంస్థ విధుల్లో మమతా బెనర్జీ నేరుగా జోక్యం చేసుకుంటున్నారని విమర్శించారు.   గతంలో కోల్‌కతా మాజీ పోలీస్ కమిషనర్ రాజీవ్ కుమార్ ఇంటికి సీబీఐ అధికారులు వెళ్లినప్పుడు కూడా ఆమె ఇదే విధంగా అడ్డుకున్నారని గుర్తు చేశారు. ముఖ్యమంత్రిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఒక ప్రైవేట్ కార్పొరేట్ సంస్థ కార్యాలయంపై ఈడీ దాడి చేస్తే సీఎం మమతా బెనర్జీకి ఎందుకంత ఆందోళన అని ప్రశ్నించారు.    మొత్తం మీద పశ్చిమ బెంగాల్ లో ఎన్నికల హీట్ పీక్ స్టేజికి చేరిందని ఈ పరిణామాలు తేటతెల్లం చేస్తున్నాయి. 

డేంజర్ జగన్నాథం.. దొంగలే దోస్తులు.. క్రిమినల్సే కావాల్సినోళ్లు

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్ నేర చరిత్ర,  చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడేవారిని ప్రోత్సహిస్తారన్న గుర్తింపు ఉంది.  గత ఏడాది డిసెంబర్ లో జగన్ పుట్టిన రోజు సందర్భంగా  రాష్ట్రంలోని పలు ప్రాంతాలలో జంతు బలి నిర్వహించి, ఆ రక్తంతో జగన్ ఫ్లెక్సీలకు అభిషేకం చేసిన సంఘటనలను ఆయన ఖండించకపోవడం, పైగా ఆయన పార్టీ నేతలు దానికి మద్దతుగా మాట్లాడటంతోనే ఇది రుజువైంది.  కాగా ఆయన పుట్టిన రోజు సందర్భంగా బహిరంగంగా జంతువులను వధించినందుకు రాష్ట్ర వ్యాప్తంగా  పలువురు వైసీపీ కార్యకర్తలపై  జంతు హింస చట్టం కింద కేసులు నమోదైన సంగతి విదితమే.   ఇప్పుడు జగన్ తాజాగా  ఈ  కేసులు ఎదుర్కొంటున్న తన పార్టీ మద్దతుదారులకు పార్టీ లీగల్ సెల్ అన్ని విధాలుగా అండగా నిలుస్తుందని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.   ఇలా జగన్ నుంచి హామీ పొందిన వారిలో అత్యధికులు గోపాలపురం నియోజకవర్గ వైసీపీ ఇన్ చార్జ్ తానేటి వనిత మద్దతుదారులని తెలుస్తోంది.   అయితే ఆయన ఇలా హామీ ఇవ్వడం పెద్దగా ఆశ్చర్యం కలిగించదు.  ఎందుకంటే ఇప్పటికే చట్టాన్నిచేతుల్లోకి తీసుకునే పార్టీ మద్దతుదారులను జగన్ ప్రోత్సహించడం తెలిసిందే. గంజాయి కేసుల్లో ఇరుక్కుని అరెస్టైన వారిని పరామర్శించడం వంటి చర్యలతో ప్రజలలో ఇప్పటికే జగన్ ప్రతిష్ఠ, పార్టీ ప్రతిష్ఠ ప్రజలలో బాగా దిగజారింది. ఇప్పుడు తాజాగా జంతుబలుల వ్యవహారంలో కేసుల్లో ఇరుక్కున్న వారికి పార్టీ మద్దతు అంటూ ప్రకటించడం ఆయన ప్రతిష్టను మరింత దిగజారుస్తుందని అంటున్నారు. 

ఒకే విడతలో తెలంగాణ మునిసిపోల్స్!

తెలంగాణలో మునిసిపోల్స్ కు రాష్ట్ర ఎన్నికల సంఘం సమాయత్తమౌతోంది. రాష్ట్రంలో మునిసిపల్ ఎన్నికలను ఒకే విడతలో నిర్వహించాలని భావిస్తోంది. ఈ నెలలోనే నోటిఫికేషన్ విడుదల చేసే దిశగా అడుగులు వేస్తున్నది. ఇప్పటికే ఇప్పటికే ఓటర్ల ముసాయిదా జాబితా ప్రకటించిన ఎన్నికల సంఘం, ఈ నెల 12న తుదిజాబితా ప్రకటించనుందని తెలుస్తోంది.   ఈ నేపథ్యంలోనే బుధవారం (జనవరి 7) జిల్లా కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన రాష్ట్ర ఎన్నికల కమిషనర్  రాణికుముదిని వారికి దిశా నిర్దేశం చేశారు.  ఈ నెల 16న పోలింగ్‌ స్టేషన్ల వివరాలతోపాటు ఫొటోతో కూడిన ఓటర్ల తుది జాబితాను ఆయా వార్డుల్లోని పోలింగ్‌ స్టేషన్ల వారీగా ప్రచురించాలని ఆదేశాలు జారీ చేశారు. అలాగే జనాభా ప్రాతిపదికన వార్డులు, డివిజన్లు, ఆయా మున్సిపాల్టీలు, కార్పొరేషన్ల రిజర్వేషన్లను ఖరారు చేయనున్నట్లు తెలిపారు. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం మేరకు ఈ నెల 20న మునిసిపోల్స్ కు ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల అ య్యే అవకాశాలు ఉన్నాయి.  

దమ్ముంటే ఖమ్మంలో పోటీ చేయ్...కేటీఆర్‌కు పొంగులేటి సవాల్

  తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‍కు సవాల్ విసిరారు. ఆయనకు దమ్ముంటే ఖమ్మం జిల్లాలో వచ్చి పోటీ చేయాలని చాలెంజ్ విసిరారు. నిన్న ఖమ్మం వచ్చిన కేటీఆర్ ఏదేదో మాట్లాడారని ముందు తన ఇంట్లో వ్యవహారం చక్కబెట్టుకోవాలని పొంగులేటి హితవు పలికారు. కాంగ్రెస్ పార్టీ జోలికి వస్తే సత్తా చూపిస్తామని హెచ్చరించారు. కేటీఆర్ అక్రమాలపై ప్రభుత్వం చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టిన  ఆరు నెలలకే ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు ప్రయత్నించారని మంత్రి సంచలన ఆరోపణలు చేశారు.  కేటీఆర్ మతి భ్రమించి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై, గాంధీ కుటుంబంపై మాట్లాడుతున్నారని, సూర్యూడి పైకి ఉమ్మితే అది తిరిగి తన ముఖం మీదే పడుతుందనే విషయాన్ని కేటీఆర్ మర్చిపోతున్నారన్నారు. అవినీతి, అక్రమాలు, దోపిడీలకు పేటెంట్‍గా ఉన్న కల్వకుంట్ల ఫ్యామిలీ గాంధీ కుటుంబం గురించా మాట్లాడేది అని మండిపడ్డారు. జాతీయ నాయకుడిని విమర్శిస్తే తాను జాతీయ నాయకుడిని అవుతానని తాపత్రయపడటం తప్పులేదు కానీ ఆశకు కూడా హద్దు ఉండాలన్నారు. జూబ్లీహిల్స్, గ్రామపంచాయతీ ఎన్నికల్లో ప్రజలు తీర్పు ఇచ్చారు. ఇప్పుడు రాబోయే మున్సిపల్ ఎన్నికలను సెమీ ఫైనల్స్ అంటున్నారు. దేనికి సెమి ఫైనల్? అని మంత్రి  పొంగులేటి ప్రశ్నించారు  

కాకినాడ జిల్లాలో పవన్ పర్యటన.. పిఠాపురంలో సంక్రాంతి సంబరాలు

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కాకినాడ జిల్లాలో పర్యటించనున్నారు. గురువారం (జనవరి 8) నుంచి మూడు రోజుల పాటు ఆయన జిల్లాలో పర్యటిస్తారు. ఈ సందర్భంగా ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయ నున్నారు.  అలాగే  ప్రజాసమస్యలపై  అధికారులతో చర్చిస్తారు.  క్షేత్ర స్థాయిలో పరిశీలన కూడా చేస్తారు. ఆయన సొంత నియోజకవర్గమైన పిఠాపురంలో  శుక్రవారం జరగనున్న  సంక్రాంతి సంబరాల్లో  పవన్ కల్యాణ్ స్థానికులతో కలిసి పాల్గొంటారు.   అనంతరం  నియోజకవర్గంలో చేపడుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాలను పవన్ కల్యాణ్ ప్రారంభిస్తారు. పిఠాపురం ముంపు ప్రాంతాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి, బాధితుల సమస్యలను నేరుగా తెలుసుకుంటారు.  ఈ పర్యటనలో భాగంగా పవన్ కల్యాణ్ జిల్లా పోలీసు అధికారులతో సమీక్ష, రంగరాయ మెడికల్ కాలేజీలో పలు శంకుస్థాపనల కార్యక్రమంలో  కూడా పాల్గొంటారు. 

కేంద్ర కేబినెట్ లోకి మరో తెలుగు మంత్రి.. ఎవరంటే?

కేంద్ర మంత్రివర్గ విస్తరణకు ప్రధాని మోడీ సమాయత్తమౌతున్నారన్న వార్తలు వినవస్తున్న వేళ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ కావడం ప్రాథాన్యత సంతరించుకుంది. ఈ భేటీలో చంద్రబాబు  అమరావతి చట్టబద్దత, పోలవరం, బడ్జెట్ కేటాయింపులు, ఉపాధి హామీ పథకంలో వెసలుబాటు వంటి  పలు అంశాలను ప్రస్తావించారు. వాటితో బాటుగా  కేంద్ర మంత్రి వర్గ విస్తరణలో టీడీపీకి ఒక బెర్తు సైతం డిమాండ్ చేశారు.  ఇప్పటికే టీడీపీ నుంచి ఇద్దరు, బీజేపీ నుంచి ఒకరు చొప్పున ఆంధ్రప్రదేశ్ నుంచి కేంద్ర మంత్రులుగా ఉన్నారు. అయితే మరో పదవి కూడా వచ్చే అవకాశం కనిపిస్తోంది. అయితే ఈ బెర్త్ టీడీపీకి దక్కే ఛాన్సు లభిస్తుండటంతో.. ఆ అదృష్టవంతుడు ఎవరన్న కోణంలో  ఇప్పుడు రాజకీయవర్గాలలో చర్చ నడుస్తోంది. కొన్ని కొన్ని ఈక్వేషన్ల ప్రకారం  రెడ్డి సామాజిక వర్గానికి ఈ బెర్త్ కేటాయించాలన్న డిమాండ్  బలంగా వినిపిస్తోంది. అందులో భాగంగా  నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో పాటు ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డిలు రేసులో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. అదలా ఉంటే.. ప్రస్తుతం కేంద్ర కేబినెట్ లో  టీడీపీకి చెందిన వారు ఇద్దరు, బీజేపీ ఎంపీ ఒకరు ఉండగా, జనసేన మాకేం తక్కువ అంటూ కేంద్ర కేబినెట్ బెర్త్ కోసం డిమాండ్ చేస్తున్నదంటున్నారు.  జనసేన ఎంపీలిద్దరిలో  మచిలీపట్నం ఎంపీ బాలశౌరి సీనియర్ కాబట్టి ఆయనను కేంద్ర కేబినెట్ లోకి తీసుకోవాలని జనసేనాని పవన్ కళ్యాణ్‌  కోరుతున్నట్లు చెబుతున్నారు. చూడాలి మరి కేంద్ర కేబినెట్ బెర్త్ ఎవరికి లభిస్తుందో? 

జవాబుదారీతనం ఎవరికి ఉండాలి?

సమాజహితమే లక్ష్యంగా దశాబ్దాలుగా తమ రంగంలో కృషి చేస్తున్న తెలుగువన్, జమీన్ రైతు పత్రిక సంయుక్తంగా నిర్వహిస్తున్న ‘వాస్తవ వేదిక’.. నాయకులను ప్రశ్నిస్తూ, ప్రజలను మేల్కొలుపుతూ చరిత్రలో నిలిచిపోయే ప్రస్థానానికి నాంది పలికింది. తెలుగువన్ ఎండి రవిశంకర్, జమీన్ రైతు సంపాదకుడు డోలేంద్ర ప్రసాద్ లు తాజాగా వ్యవస్థల పతనం, అందుకు కారణాలపై తమ ఆవేదనను సూటిగా ఎలాంటి శషబిషలూ లేకుండా వ్యక్త పరిచారు.  జవాబుదారీ తనం ఎవరికి ఉండాలి? ప్రజలకా? పాలకులకా? అధికారులకా? ఎగ్జిక్యుటివ్ వ్యవస్థలు ఏం చేస్తున్నాయి? తమ మేధాశక్తిని ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు  ఎలా వాడుతున్నారు? పాలకుల తప్పులు కప్పడానికా; ప్రజల బాగు కోసమా? ప్రజాధనం దుర్వినియోగానికి బాధ్యులు ఎవరు?  ఇత్యాది సూటి ప్రశ్నలను సంధించారు. ప్రజా చైతన్యమే లక్ష్యంగా సాగుతున్నవాస్తవ వేదిక గురువారం (జనవరి 8) రాత్రి 7 గంటలకు తెలుగువన్  యూట్యూబ్ చానల్ లో తప్పక వీక్షించండి. https://www.youtube.com/watch?v=dD8qZdp3WHU

ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు విద్యార్థులు మృతి

రంగారెడ్డి జిల్లా  మీర్జాగూడ  సమీపంలో చోటు చేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు మరణించారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు.  మోకిల నుంచి హైదరాబాద్‌ వైపు వెళ్తున్న ఓ కారు మీర్జాగూడ వద్ద అదుపు తప్పి తొలుత డివైడర్ ను ఆ తరువాత  చెట్టును ఢీ కొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మృతులు, క్షతగాత్రులు అందరూ విద్యార్థులే.  మృతి చెందిన  విద్యార్థులను సూర్యతేజ, సుమిత్, శ్రీనిఖిల్, రోహిత్‌లుగా పోలీసులు గుర్తించారు. కోకాపేట్‌లో బర్త్‌డే పార్టీలో పాల్గొని, తిరిగి వెడుతున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది.   కారులో మొత్తం ఐదుగురు ఐసీఎఫ్ ఏఐ యూనివర్సిటీకి చెందిన ఐదుగురు విద్యార్థులు ఉన్నారు. వీరిలో నలుగురు మరణించగా, తీవ్రంగా గాయపడిన విద్యార్థిని నక్షత్ర తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.  అతి వేగమే ప్రమాదానికి కారణంగా పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు.