ఖమ్మం సభతో కేసీఆర్ కు జాతీయ నాయకుడిగా గుర్తింపు వచ్చేసినట్లేనా?
posted on Jan 17, 2023 @ 9:40AM
తెరాసను బీఆర్ఎస్ గా మార్చేసి జాతీయ పార్టీ అని ప్రకటించేసి.. తనకు తానుగా జాతీయ నాయకుడినని భావిస్తున్న కేసీఆర్ కు నిజంగా ఆ గుర్తింపు వచ్చిందా? ఓ ముగ్గురు, నలుగురు ఇతర పార్టీల కు చెందిన నాయకులు ఆయనను కలిసినంత మాత్రాన బీఆర్ఎస్ జాతీయ పార్టీ అయిపోతుందా? ఆయనకు జాతీయ నేతగా గుర్తింపు వచ్చేసిందా? ఆయనను కలిసిన వారంతా తమ నాయకుడిగా కేసీఆర్ ను అంగీకరించేసినట్లేనా? ప్రస్తుతం రాజకీయ వర్గాలలో జోరుగా జరుగుతున్న చర్చ ఇది. ఎందుకంటే.. కేసీఆర్ జాతీయ పార్టీ ప్రకటనకు ముందు తనను తాను జాతీయ నాయకుడిగా ఆవిష్కరించుకోవడానికీ, గుర్తింపు కోసమూ చేయని ప్రయత్నం లేదు. ఎక్కని గడప లేదు. ఆ ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి.
ఇక వేరు దారి లేక సొంతంగానే పార్టీని ఏర్పాటు చేసి జాతీయ రాజకీయాలలోకి దూకేశారు. అంతకు ముందు దాదాపు నాలుగుళ్లు ఆయన జాతీయ రాజకీయాలలో ప్రవేశం కోసం అన్ని రకాలుగా ప్రయత్నించారు. సఫలీకృతులు కాలేకపోయారు. చివరాఖరకు ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ ను ఎంగేజ్’ చేసుకున్నా లాభం లేక పోయింది. ప్రాతీయ పార్టీల జాతీయ కూటమి అంటూ దేశం పట్టుకు తిరిగారు. శరద్ పవార్ మొదలు అరవింద్ కేజ్రీవాల్ వరకు, నితీష్ మొదలు అఖిలేష్ వరకు, మమత మొదలు స్టాలిన్ వరకు ఎక్కని గడప లేదన్నట్లుగా బీజేపీ వ్యతిరేక నేతలందరినీ కలిశారు. అయినా జేడీయు నేత, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమార స్వామి మినహా మరెవ్వరు, కేసీఆర్ తో కలిసేందుకు సుముఖత వ్యక్తం చేయలేదు. అప్పడు ఇక చేసేదేం లేక తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) పేరును భారత రాష్ట్ర సమితి ( భారాస)గా మార్చి, జాతీయ రాజకీయాల్లోకి దూకేశారు.
అయితే, భారాస జాతీయ పార్టీ అని కేసీఆర్ ఆయన పరివారం ప్రచారం చసుకున్నంత మాత్రన భారాస జాతీయ పార్టీ కాదు. ఔను నిజమే భారాస ప్రాంతీయ పార్టీ కాదు. కేంద్ర ఎన్నికల సంఘం, తెరాస పేరు మార్పును అంగీకరించిందే కానీ, జాతీయ పార్టీగా గుర్తించలేదు. నిజానికి అది కేంద్ర ఎన్నికల సంఘం చేతిలో పని కూడా కాదు.
దేశంలో తెరాస/ భారాస వంటి ప్రాంతీయ పార్టీలు చాలానే ఉన్నాయి. అలాగే, రిజిస్టర్ అయిన పార్టీలు.. కాని పార్టీలు చాలానే ఉన్నాయి. అయితే జాతీయ పార్టీలుగా గుర్తింపు పొందిన పార్టీల సంఖ్య రెండంకెలు కూడా దాటలేదు. గుజరాత్, అసెంబ్లీ ఎన్నికల్లో 13 శాతం వరకు ఓట్లు సాధించి, ఐదు అసెంబ్లీ స్థానాలు గెలుచుకుని జాతీయ పార్టీగా గుర్తింపు పొందిన ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)తో కలిపి, మొత్తం తొమ్మిది పార్టీలు మాత్రమే జాతీయ పార్టీలుగా గుర్తింపు పొందాయి. గతంలో కాంగ్రెస్, భాజపా, సీపీఐ, సీపీఎం, బీఎస్సీ, ఎన్సీపీ, తృణమూల్ కాంగ్రెస్ పార్టీలకు మాత్రమే జాతీయ పార్టీ హోదా ఉండగా.. 2019లో అరుణాచల్‌ప్రదేశ్‌లో జరిగిన ఎన్నికల్లో పోటీచేసి అవసరమైన ఓట్లు, సీట్లు సాధించడం ద్వారా నేషనల్ పీపుల్స్ పార్టీ(ఎన్‌పీపీ) జాతీయ పార్టీ హోదాను పొందింది. ఈ పార్టీకి అంతకముందు మణిపూర్, మేఘాలయా, నాగాలాండ్‌లలో గుర్తింపు ఉండగా.. 2019లో అరుణాచల్‌ప్రదేశ్‌లోనూ రాష్ట్ర పార్టీగా గుర్తింపు సాధించడం ద్వారా 2019 జూన్‌లో కేంద్ర ఎన్నికల సంఘం ఎన్‌పీపీకి జాతీయ హోదాను కల్పించింది. దీంతో దేశంలో ఇప్పటివరకు జాతీయ పార్టీల సంఖ్య ఎనిమిదికి చేరింది. ఇక తాజగా ఈ జాబితాలో తొమ్మిదో పార్టీగా ఆప్ అర్హత సాధించింది.
అందుకే ఇప్పటికీ కేసీఆర్ అంటే ఆయన నాయకత్వం వహిస్తున్న పార్టీ పేరులో భారత్ ఉన్నా జాతీయ మీడియా, జాతీయ నాయకులు ఇప్పటికీ ప్రాంతీయ పార్టీ నాయకుడిగానే గుర్తిస్తున్నారు. అందుకే ఆయన తన బీఆర్ఎస్ తొలి బహిరంగ సభను ఘనంగా నిర్వహించి.. జాతీయ రాజకీయాలో ప్రవేశాన్ని చాటుకోవాలని భావిస్తున్నారు. ఇందు కోసం ఆయన తొలుత ఢిల్లీలో భారీ బహిరంగ సభ నిర్వహించాలని భావించారు. అదే బీఆర్ఎస్ తొలి బహిరంగ సభ కావాలని.. తద్వారా దేశ రాజధానిలో తన తొలి అడుగు ఘనంగా పడేలా ఉండాలని భావించారు.
అయితే తానొకటి తలిస్తే.. అన్నట్లుగా అన్ని ఆప్షన్లనూ కాదనుకుని బీఆర్ఎస్ తొలి బహిరంగ సభకు ఖమ్మం వేదిక చేశారు. ఈ సభకు ఢిల్లీ, కేరళ, పంజాబ్ రాష్ట్రాల ముఖ్యమంత్రులను, యూపీ మాజీ సీఎంను ఆహ్వానించారు. కేసీఆర్ ఆహ్వానాన్ని మన్నించి వారంతా ఖమ్మం సభకు తరలి వస్తున్నారు. అలా వచ్చిన వారికి ఆయన తాను పునర్నిర్మించిన యాదగిరి గుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని చూపించనున్నారు. ఖమ్మం సభకు వామపక్షాల జాతీయ నేతలు సైతం వస్తున్నారు. ఎంత లేదనకుండా దాదాపు వంద మంది ప్రముఖులు వస్తున్నట్లు సమాచారం. వీరందరికీ కేసీఆరే ప్రత్యేక విమానాలు ఏర్పాటు చేశారనీ చెబుతున్నారు. దీంతో అనివార్యంగా బీఆర్ఎస్ ఖమ్మం సభకు జాతీయ మీడియా కూడా ప్రాధాన్యత ఇస్తుందని అంటున్నారు. అయితే కొన్ని పార్టీల అధినేతలు, కొన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరైనంత మాత్రాన కేసీఆర్ కు జాతీయ నాయకుడిగా గుర్తింపు వచ్చేస్తుందా? బీజేపీ వ్యతిరేక పోరాటంతో తమ నేతగా ఆయా నాయకులు కేసీఆర్ కు పట్టం కట్టేసినట్లేనా అంటే పరిశీలకులు కాదనే చెబుతున్నారు.
ఆమ్ ఆద్మీ పార్టీ ఇప్పటికే తెలుగు రాష్ట్రాలలో తన ఉనికిని చాటుకునే ప్రయత్నం చేస్తోంది. ఖమ్మం సభను కేజ్రీవాల్ అందుక ఒక అవకాశంగా మార్చుకునే అవకాశం ఉంది. హస్తినలో బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయం ప్రారంభోత్సవానికి హాజరు కాకపోవడమే కాకుండా, నిబంధనలకు వ్యతిరేకంగా ఉన్నాయంటూ బీఆర్ఎస్ ఫ్లెక్సీలను తొలగించిన ఆప్ సర్కార్.. కేసీఆర్ ను జాతీయ స్థాయిలో నాయకుడిగా అంగీకరించి వెనుక ర్యాలీ అవుతుందా? అన్న అనుమానాలు వ్యక్తమౌతున్నాయి.