ఏపీ బీజేపీ.. వైసీపీ ‘బీ’ టీం ముద్ర నుంచి బయటపడేనా?
posted on Mar 1, 2023 8:47AM
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీ ఎందుకు ఎదగడం లేదు? ఆ పార్టీ పరిస్థితి రోజు రోజుకూ ఎందుకు దిగజారిపోతొంది. రాష్ట్రంలో కమలం కాలు ఎందుకు కదలడం లేదు. అడుగు ఎందుకు ముందుకు పడడం లేదు? ఎందుకు ఏ వర్గం ప్రజలనూ కమలం పార్టీ ఆకట్టుకోలేక పోతోంది? దేశమంతా మోడీ .. మోడీ అంటున్నా ఏపీలో మాత్రం, ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా, పార్టీ ఎందుకు పడకేసింది? ఎందుకు పార్టీలో ఏ ఇద్దరు నాయకుల మధ్య ఏకాభిప్రాయం లేకుండా పోయింది? రాష్ట్ర అధ్యక్షునిగా .. మీ సంజాయిషీ సమాధానం ఏమిటి? అంటే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఇచ్చిన సమాధానం, ఆడ లేక మద్దెల ఓడు’ అన్న సామెతను గుర్తుకు తెస్తోంది. ఎందుకంటే, ఏపీలో బీజేపీ ఎదగక పోవడానికి, ఎదగలేక పోవడానికి తాను ఏమాత్రం కారణం కాదని వీర్రాజు పార్టీ కేంద్ర నాయకత్వానికి పొడుగాటి లేఖ రాశారు. ఆ లేఖలో ఆయన తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తమను ఎదగ నీయడం లేదని, అడుగడుగునా అడ్డు పడుతున్నారని వాపోయినట్లు తెలుస్తోంది. నిజానికి ఏపీలో బీజేపీ ఎందుకు ఎదగలేదనే ప్రశ్నకు, సమాధానం చెప్పడం అంత సులువు కాదు. కర్ణుడి చావుకు ఉన్నన్ని కారణాలున్నాయి. అయితే సోము బీజీపీ ఎదగక పోవదానికి తెలుగు దేశం అధ్యక్షుడు, చంద్రబాబు నాయుడు కారణమని లేఖలో పేర్కొనడమే చిత్రంగా ఉందని బీజేపీ నాయకులే విస్తుపోతున్నారు . ముక్కున వేలేసుకుంటున్నారు. నిజానికి, సోము వీర్రాజు ఆయన అనుచరగణం అధికార వైసీపీతో అంటకాగుతూ తెలుగు దేశం పార్టీని చంద్రబాబు నాయుడిని దూరం చేసుకోవడం వల్లనే బీజేపీకి ఈ దుర్గతి పట్టిందని ఆ వాస్తవాన్ని కప్పిపుచ్చుకునేందుకే ఆయన విచిత్రంగా వ్యవహరిస్తున్నారని, బీజేపీ నాయకులే సైటైర్లు వేస్తున్నారు.
అదలా ఉంటే ఇటీవల రాష్ట్ర బీజేపీలో చోటు చేసుకుంటున్న పరిణామాలు ముఖ్యంగా పార్టీ రాష్ట్ర శాఖ మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణ పార్టీకి రాజీనామాచేసి తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్న నేపధ్యంలో, బీజేపీ జాతీయ నాయకత్వం కొంత అలర్ట్ అయింది. నిజానికి,కన్నాతో మొదలైన వలసల వరదలో పార్టీ పూర్తిగా కొట్టుకుపోయే ప్రమాద సంకేతాలు స్పష్టమైన నేపథ్యంలోనే పార్టీ అధిష్టానం అసమ్మతి నేతలను ఢిల్లీకి పిలిపించుకుని మంతనాలు సాగించింది. ఈ సందర్భంగా సోము వ్యతిరేక బీజేపీ నేతలు బీజేపీ రాష్ట్ర వ్యవహారాలు ఇంచార్జి మురళీధరన్ ను కలిశారు. రాష్ట్రంలో పార్టీ పరిస్థితిని, సోము వీర్రాజు వైఖరిని పూర్తిగా వివరించారు. వీరితో సమావేశం ముగిసిన తర్వాత మురళీధరన్ ఏపీకి వచ్చారు. రాజమండ్రిలో సమావేశం ఏర్పాటు చేశారు. పరిస్థితిని స్వయంగా తెలుసుకున్నారు. సోమును కేంద్ర నాయకత్వం వివరణ కోరిందో లేక ఆయనే స్వయంగా సంజాయిషీ ఇచ్చుకున్నారో తెలియదు కానీ కేంద్ర నాయకత్వానికి ఓ పెద్ద లేఖ రాసినట్లు తెలుస్తోంది. దీనిపై రాష్ట్ర బీజేపీలో ఆసక్తికర చర్చ నడుస్తోంది.
రాష్ట్రంలో ఇటీవల చోటుచేసుకున్న పరిణామాలు, రాష్ట్రంలో పరిస్థితిని పూర్తిగా తెలియజేస్తూ ఆయన ఈ లేఖ రాశారు. ముఖ్యంగా చంద్రబాబునాయుడి వల్లే రాష్ట్రంలో పార్టీ ఎదగడంలేదని ఆ లేఖలో పేర్కొన్నారు. పార్టీని సమర్థవంతంగా నడిపిస్తున్నానని ఈ విషయంలో గతంలో కూడా వివరాలు తెలియజేస్తూ నివేదికలు ఇచ్చానని కానీ చంద్రబాబునాయుడు బీజేపీని బతకనివ్వడంలేదని ఎక్కడికక్కడ కీలక నాయకులను పార్టీలోకి తీసుకుంటున్నారని పదవులు ఆశ చూపుతున్నారని ఇలా అయితే పార్టీ బతకడం కష్టం అని సోము తేల్చిచెప్పినట్లు తెలుస్తోంది.
నిజానికి బీజేపీ అధిష్టానానికి ఏపీ మీద పెద్దగా ఆశలు లేవు. రెండు బలమైన ప్రాతీయ పార్టీల నడుమ ఒక జాతీయ పార్టీ ఎదిగే అవకాశాలు అంతగా లేవనే విషయం బీజేపీ పెద్దలకు తెలియందేమీ కాదు. గత ఎన్నికల్లో బీజేపీకి నోటా కంటే తక్కువ ఓట్లు వచ్చాయి. అయినా బీజేపీ ఢిల్లీ పెద్దలు జాతీయ రాజకీయాలు, జాతీయ అవసరాలను దృష్టిలో ఉంచుకుని అప్పుడప్పుడు నాయకులను అలెర్ట్ చేయడం, ఆ తర్వాత కథ కంచికి చేరిపోవడం రివాజుగా వస్తోంది.
ఈ పరిస్థితి చూసి, ఇక బీజేపీ మారదనే నిర్ణయానికి వచ్చిన కన్నా లక్ష్మీనారాయణ, ఆయన అనుచరులు రాష్ట్రానికి ప్రధాన శత్రువుగా మారిన వైసీపీను ఎదుర్కునే సత్తా ఉన్న ఏకైక పార్టీ తెలుగుదేశం అన్న భావనతో ఆ పార్టీలో చేరారు. అలాగే, ఇంకొందరు కూడా అదే బాటలో ఉన్నారు. సో .. ఈసారి ఏమి జరుగుతుంది .. ఇప్పటికైనా సోము వీర్రాజుకు ఉద్వాసన పలుకుతారా ..పలికితే ప్రయోజనం ఉంటుందా ? ఏపీ బీజేపీ వైసీపీ ‘బీ’ టీం అనే ముదనుంచి బయట పడతుందా ? ఇవన్నీ ప్రస్తుతానికి సమాధానం లేని భేతాళ ప్రశ్నలు.