ప్రయోజనం లేని పర్యటనలెందుకు జగన్ సార్!
posted on Aug 1, 2022 @ 11:17AM
అవసరం అడిగిస్తుంది అంటారు. అవసరం.. మరీ అవసరాలు ఉన్నాగాని ఏపీ సీఎం జగన్ కేంద్రాన్ని ఏమీ అడుగుతున్న దాఖలాలు లేవని ప్రచారం. ఆయన ఢిల్లీ ప్రయాణమైన ప్రతీసారి అనేక ప్రశ్నలు, అభ్యర్ధనలతోనే వెళుతున్నారని, రాష్ట్ర ప్రయోజనాల దృష్టిలో పెట్టుకుని కేంద్రాన్ని నిలదీయడానికే నేరుగా తేల్చుకోవడానికి వెళుతున్నారని ప్రజలను భ్రమల్లో ముంచేందుకు తప్ప మరో ప్రయోజనం లేదని విశ్లేషకుల మాట.
కేవలం పలకరింపుకోసం వెళ్లినట్టు ఫోటోలు దిగి పూల గుచ్ఛాలు ఇవ్వడానికి అంత ఖర్చుచేసి వెళ్ల డం దేనికన్న విమర్శలు రాష్ట్రమంతటా వినపడుతున్నాయి. కారణం ఆయన రాష్ట్ర హోదా గాని, రైల్వేజోన్ గురించి గాని కేంద్రాన్ని నిలదీ యలేని స్థితిలో జగన్ ఉన్నారన్నది స్పష్టం. రాష్ట్రానికి ప్రతిష్టాత్మకంగా నిలవగల మంగళగిరి ఎయిమ్స్ సంగతి వదిలేశారనే విమర్శలు ఉన్నాయి. ఇప్ప టికీ అది కేవలం ఔట్ పేషెంట్స్ సేవలకే పరిమితమయింది.
ఇంతవరకూ ఆ ఆస్పత్రికి అవసర మైన వైద్య నిపుణులను కేటాయించడంలో, మౌలిక సదుపాయాల కల్పనలోనూ జగన్ ప్రభుత్వం ఏ మాత్రం ఆసక్తి ప్రదర్శించడంలేదన్నది ప్రజల మాట. దీన్ని గురించి కూడా కేంద్రంతో గట్టిగా అడగలేక పోతున్నారు. కారణం జగన్ పిలక కేంద్రం చేతిలో ఉండడమన్నది విశ్లేషకుల మాట. కేంద్రాన్ని నిలదీ యలేని స్థితిలో ఉండడంవల్లనే వారి మాటకు తందానా అనడం తప్ప మరేమీ జరగడం లేదు.
అందు వల్లనే ప్రయాణ వివరాలు తెలియనీయడం లేదన్న ప్రచారం ఉండనే ఉంది. తెలంగాణా సీఎంకి ఇవ్వ నన్ని సమావేశ అవకాశాలు దక్కుతున్నప్పటికీ రాష్ట్రానికి ఒక్క ప్రయోజనం చేకూరే పనిని సాధించు రాలేకపోవడం రాష్ట్రప్రజల దురదృష్టంగా విపక్షాలు దుమ్మెత్తిపోస్తున్నాయి.