హుజురాబాద్‌లో కొట్లాడుతారా? కాడి దించేస్తారా? రేవంత్ దారేది?
posted on Jul 27, 2021 @ 6:32PM
గెలిస్తే నిలుస్తాం. లేదంటే రాజకీయ సమాధే. హుజురాబాద్ ఉప ఎన్నిక చావో రేవో మాదిరి. ఈటలకు అగ్నిపరీక్ష.. కేసీఆర్‌కు ఇజ్జత్ కా సవాల్. వారిద్దరిలో ఎలాగైనా గెలిచి తీరాలనే పంతం, పట్టుదల. గెలిస్తే రాజకీయంగా ఊపిరి పీల్చుకోవచ్చు. ఓడితే ఇక కోలుకోవడం కష్టం. మరి, టీఆర్ఎస్, బీజేపీ సంగతి ఓకేగానీ.. కాంగ్రెస్ పరిస్థితి ఏంటి? 40 ఏళ్లుగా గెలుపు రుచి చూడని కాంగ్రెస్.. ఈసారైనా హుజురాబాద్‌లో ప్రభావం చూపిస్తుందా? గెలచే విషయం తర్వాత.. కనీసం పోటీ అయినా చేస్తుందా? ఆ పార్టీకి బలమైన కేండిడేట్ దొరికేనా? హుజురాబాద్ సంగ్రామంలో రేవంత్‌రెడ్డి జోక్యం చేసుకుంటారా? వీటిపైనే ఇప్పుడు తెలంగాణలో జోరుగా చర్చ నడుస్తోంది. సమాధానాలు కాస్త క్లిష్టంగానే ఉన్నాయి.
పాడి కౌశిక్‌రెడ్డి. కాంగ్రెస్‌కు స్ట్రాంగ్ కేండిడేట్. టీఆర్ఎస్ చేపట్టిన ఆపరేషన్ ఆకర్ష్‌కు ఇట్టే అట్రాక్ట్ అయిపోయారు. పోతూపోతూ రేవంత్‌పై విమర్శలు గుప్పిస్తూ.. దమ్ముంటే హుజురాబాద్‌లో డిపాజిట్ తెచ్చుకోండి చూస్తానంటూ సవాల్ చేసి మరీ పోయారు. కౌశిక్‌రెడ్డి రూపంలో కాంగ్రెస్‌కు ఉన్న ఆ ఒక్క అనుకూల అంశమూ లేకుండా పోయింది. ఇప్పుడు వాట్ నెక్ట్స్? అనేది హస్తం పార్టీని వేధిస్తున్న ప్రశ్న. హుజురాబాద్ కోసం దామోదర రాజనర్సింహ ఆధ్వర్యంలో ప్రత్యేక కమిటీనైతే వేశారు కానీ, బైపోల్‌కు ఎలా ముందుకు పోవాలో కాంగ్రెస్‌కు ఓ పట్టాన అంతుచిక్కడం లేదంటున్నారు. బలమైన అభ్యర్థి వేటలో ఉన్నారని.. మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌ను పోటీ చేయిస్తారని మొదట్లో ప్రచారం జరిగింది. ఇప్పుడు ఆయన పేరు కూడా వినిపించడం లేదు. ఓవైపు టీఆర్ఎస్, బీజేపీ హోరాహోరీ ప్రచారం చేస్తుండగా.. ఇప్పటి వరకూ హుజురాబాద్‌లో కాంగ్రెస్ ఊసే లేకుండా పోయింది. మరి, కొత్త పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి మదిలో ఎలాంటి ఆలోచన ఉందో ఇంకా బయటకు రాలేదు.
ఆ మధ్య ఓ మీడియా ఇంటర్వ్యూలో రేవంత్‌రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 40 ఏళ్లుగా హుజురాబాద్‌లో కాంగ్రెస్ గెలవలేదని.. అక్కడి గెలుపు-ఓటమిలు తన పనితీరుకు కొలమానం కాదంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. అంటే, కాంగ్రెస్ పార్టీ హుజురాబాద్‌లో కాడి ఎత్తేసినట్టేనా? బరిలో దిగి దారుణంగా ఓడిపోవడం కంటే.. ప్రజలకు ఉపయోగం లేని ఎన్నికలంటూ పోటీ నుంచి వైదొలిగి.. పరువు నిలుపుకోవడమే బెటర్ ఆప్షన్ అని భావిస్తున్నారా? అంటే అవుననే అంటున్నాయి కాంగ్రెస్ వర్గాలు. హుజురాబాద్‌లో నేరుగా పోటీ చేయకుండా వేరే అభ్యర్థికి మద్దతిస్తే ఎలా ఉంటుందనే దిశగా ఆలోచన చేస్తోందట. ఈటల గెలవాలని బలంగా కోరుకుంటున్నా.. కాంగ్రెస్‌కు బద్ద విరోదైన బీజేపీని గెలిపించేంత సాహసం మాత్రం చేయబోదని చెబుతున్నారు.
అందుకే, వారు వారు తన్నుకునేలా కాస్త వీక్ కేండిడేట్‌ను పెట్టాలా? లేక, ఉద్యమ నాయకుడినో, తటస్తుడితోనో పోటీ చేయించి.. ఆ అభ్యర్థికి ప్రత్యక్షంగానో, పరోక్షంగానో మద్దతు ఇస్తే ఎలా ఉంటుందనే దిశగానూ హస్తం పార్టీ అడుగులు వేస్తోందని తెలుస్తోంది. ఇలా ఎలా చూసినా.. తమది కాని చోట.. తమకు అంతగా బలం లేనిచోట.. కేసీఆర్-ఈటల జీవన్మరణ పోరాటం చేస్తున్న చోట.. అనవసరంగా పెద్దగా హడావుడి చేసే కంటే.. సైలెంట్‌గా ఉండి తమాషా చూసేందుకే కాంగ్రెస్ పార్టీ ఇంట్రెస్టింగ్‌గా ఉందని అంటున్నారు. మరి, హుజురాబాద్‌లో కనీసం పోటీ అయినా చేస్తుందా? బలహీన అభ్యర్థిని పెడుతుందా? ఎవరో ఒకరికి మద్దతు ఇస్తుందా? ఈ మూడింట్లో ఏది జరుగుతుందో చూడాలి...