అనారోగ్యమా.. వెనుకంజా? రజనీకాంత్ పార్టీకి అసలు ఏమైంది?
posted on Dec 29, 2020 @ 1:11PM
తెలుగు వన్ చెప్పిందే అక్షర సత్యమైంది. తమిళ స్టార్ రజనీకాంత్ రాజకీయ పార్టీ పురుడు పోసుకోకముందే పత్తా లేకుండా పోయింది. తెలుగు వన్ ఊహించినట్లే రాజకీయ పార్టీపై వెనక్కి తగ్గారు రజనీకాంత్. అనారోగ్య కారణాలతో రాజకీయ పార్టీ ఏర్పాటుపై తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించారు. ప్రస్తుత పరిస్థితుల్లో పార్టీ ప్రారంభించలేనంటూ మూడు పేజీల లేఖను ట్విట్టర్ వేదికగా విడుదల చేసిన భాషా.. అనారోగ్య కారణాల కారణంగా రాజకీయాల్లోకి రావడం లేదని అందులో వివరించారు. రాజకీయ పార్టీపై తానిచ్చిన మాటను వెనక్కి తీసుకోవడంపై తనను క్షమించాలంటూ అభిమానులను వేడుకున్నారు రజనీకాంత్. రజనీకాంత్ పార్టీ పెట్టబోరని అతను హాస్పిటల్ లో జాయిన్ కాకముందే కథనం ఇచ్చింది తెలుగు వన్.
రాజకీయ పార్టీ ఏర్పాటుపై రజనీకాంత్ వెనక్కి తగ్గడంపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. రజనీకాంత్ రాజకీయ పార్టీపై మొదటి నుంచి అందరికి అనుమానాలే ఉన్నాయి. సాఫ్ట్ గా ఉండే వ్యక్తిగా పేరున్న రజనీకాంత్ పార్టీని నడపలేరనే అభిప్రాయమే ఎక్కువ మంది నుంచి వినిపించింది. రాజకీయ పార్టీని ఆయన ముందుకు తీసుకెళ్లలేరని కొందరు ఓపెన్ గానే చెప్పారు. కేవలం బీజేపీ కోసమే అయిష్టంగానే ఆయన పార్టీ పెడుతున్నారన్న ప్రచారం కూడా జరిగింది. రజనీకాంత్ తో ఆరెస్సెస్, బీజేపీ నేతల సమావేశాలు కూడా ఆ వాదనకు బలం చేకూర్చాయి. బీజేపీకి మద్దతుగా రజనీకాంత్ కొన్ని ప్రకటనలు కూడా చేయడంతో.. తమిళనాడులో పుంజుకోలేకపోతున్న కమలం పార్టీ రజనీకాంత్ ద్వారా కొత్త ఎత్తులు వేస్తుందన్న విమర్శలు వచ్చాయి. యూపీఏలో బలమైన పార్టీగా ఉన్న డీఎంకే గెలవకుండా, తనకు మిత్రపక్షంగా ఉన్న అన్నాడీఎంకేకు ప్రయోజనం కలిగేలా చూసేందుకే రజనీకాంత్ ను బీజేపీ తెరపైకి తెచ్చిందన్న ఆరోపణలు పలు వర్గాల నుంచి వచ్చాయి.
తమిళనాడులో రజనీకాంత్ రాజకీయ పార్టీపై మొదటి నుంచి గందరగోళమే కనిపించింది. 2017 డిసెంబర్ 31న రాజకీయ పార్టీపై ప్రకటన చేశారు రజనీకాంత్. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తామని ప్రకటించారు. అయితే పార్టీ పెడతానని ప్రకటించి మూడేళ్లు అయినా... పార్టీ ఏర్పాటుపై పురోగతి కన్పించలేదు. రజనీ మక్కల్ మండ్రం ఏర్పాటు, కార్యవర్గం నియామకం, సభ్యత్వ నమోదుతో సరిపెట్టారు రజనీకాంత్. రాజకీయ పార్టీపై మూడేండ్లు నాన్చడం, మరో ఐదు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు ఉండటంతో ఆయన పార్టీ ఉండదనే దాదాపుగా అంతా భావించారు. ఇంతలోనే సడెన్ గా మేల్కొన్న రజనీకాంత్.. గత నవంబర్ 30న రజనీ మక్కల్ మండ్రం సభ్యులతో చర్చించి కొత్త పార్టీపై మరోసారి ప్రకటన చేశారు. డిసెంబర్ 31 పార్టీ పేరు ప్రకటిస్తానని చెప్పారు. పార్టీ పేరు రిజిస్ట్రేషన్ ప్రక్రియను అయన అనుచరులు కేంద్ర ఎన్నికల సంఘం పూర్తి చేశారు. ఇంతలోనే సినిమా షూటింగ్ లో ఒక్కసారిగా అనారోగ్యానికి హైదరాబాద్ అపోలో హాస్పిటల్ లో చేరారు. దీంతో రాజకీయ పార్టీ ప్రకటన వాయిదా వేయడానికే రజనీకాంత్ హాస్పిటల్ లో జాయిన్ అయ్యారనే విమర్శలు వచ్చాయి.
గతంలోనూ కొందరు రాజకీయ నేతల కొత్త పార్టీ ఏర్పాటు, పార్టీ మార్పు సందర్భాల్లో ఇలాంటి ఘటనలే జరిగాయి. ఏపీ కాంగ్రెస్ నేతగా ఉన్నప్పుడు వైసీపీలో చేరడానికి రంగం సిద్దం చేసుకున్నారు కన్నా లక్ష్మినారాయణ . తెల్లారితే కన్నా జగన్ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకోవాల్సి ఉండగా.. బీజేపీ పెద్దలు ఎంట్రీ అయ్యారు. కన్నాను తమ పార్టీలోకి ఆహ్వానించారు. ఇంతలోనే వైసీపీలో చేరడానికి అన్ని సిద్దం చేసుకున్న కన్నా లక్ష్మినారాయణ.. అర్ధరాత్రి పూట సడెన్ గా అనారోగ్యానికి గురై హాస్పిటల్ లో అడ్మిట్ అయ్యారు. మరికొన్ని గంటల్లో వైసీపీలో చేరాల్సి ఉన్న కన్నా.. అది తప్పించుకోవడానికే హాస్పిటల్ లో చేరారనే ప్రచారం జరిగింది. ఇప్పుడు రజనీకాంత్ విషయంలోనూ అచ్చం అలానే జరిగిందనే చర్చ జరుగుతోంది.
రాజకీయ పార్టీపై రజనీకాంత్ వెనక్కి తగ్గారని గతంలోనూ సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. అనారోగ్య కారణాలతో రజనీకాంత్ రాజకీయ పార్టీ పెట్టడం లేదన్నది ఆ ప్రచార సారాంశం. వైద్యుల సలహా మేరకు రాజకీయాల నుంచి రజనీకాంత్ తప్పుకుంటున్నారని అందులో ఉంది. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై స్పందించిన రజనీకాంత్.. అది తన ప్రకటన కాదంటూనే అందులో పేర్కొన్న ఆరోగ్యపరమైన సమస్యలను పరోక్షంగానే అంగీకరించారు. తనకు అనారోగ్యం ఉందని గతంలో అంగీకరించిన రజనీకాంత్.. పార్టీ ఏర్పాటుకు మళ్లీ ఎందుకు ముందుకు వచ్చారన్నది ఇప్పుడు ప్రశ్నార్దకంగా మారింది. వైద్యులు చెప్పినట్లు చేయకుండా డిసెంబర్ 31న పార్టీ పేరు ప్రకటిస్తానని ఎందుకు చెప్పారన్నది ఎవరికి అర్ధం కావడం లేదు. బీజేపీ కోసం ఏదో చేయాలని తలంచినా... ఆరోగ్యం సహకరించకపోవడంతో ఇప్పుడు వెనక్కి తగ్గారని కొందరు చెబుతున్నారు. మొత్తానికి రాజకీయ పార్టీపై వెనక్కి తగ్గడంతో ఆయన అభిమానులు మాత్రం తీవ్ర నిరాశలో మునిగిపోయారు.